M’Cheyne Bible Reading Plan
13 అప్పుడు యెహోవా మోషేతో యిలా అన్నాడు. 2 “ఇశ్రాయేలులో పెద్దకుమారుడు ప్రతి ఒక్కడూ నాకు చెందుతాడు. ప్రతి స్త్రీకి పుట్టిన పెద్దకుమారుడూ నావాడు. మీ జంతువుల్లో మొదట పుట్టే ప్రతి మగదాన్నీ మీరు నాకు అర్పించాలి.”
3 మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ రోజును జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారు. అయితే ఈనాడు యెహోవా తన మహా శక్తిని ప్రయోగించి మిమ్మల్ని విడుదల చేసాడు. మీరు మాత్రం పులిసిన పదార్థంతో రొట్టెలు తినకూడదు. 4 అబీబు[a] మాసంలో ఈనాడు మీరు ఈజిప్టును విడిచి వెళ్తున్నారు. 5 మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసిస్తున్న దేశాన్ని మీకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. యెహోవా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహిస్తున్న ఆ సుందర దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు కూడా మీరు ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆరాధన రోజుగా మీకు ఉండాలి.
6 “ఏడు రోజులపాటు పులియని రొట్టెలే మీరు తినాలి. ఏడోనాడు ఒక గొప్ప విందు ఉంటుంది. ఈ విందు యెహోవా ఘనతను సూచిస్తుంది. 7 కనుక ఏడు రోజులు పులిసిన పదార్థంతో చేయబడ్డ రొట్టెలు ఏవీ మీరు తినకూడదు. మీ దేశం మొత్తంలో ఎక్కడా పులిసిన పదార్థంతో తయారైన రొట్టెలు ఉండకూడదు. 8 ‘యెహోవా ఈజిప్టునుండి మమ్మల్ని బయటకు రప్పించాడు. కనుక మనం ఈ పండుగ చేసుకొంటున్నాము’ అని ఈ రోజు నాడు మీరు మీ పిల్లలతో చెప్పాలి.”
9 “మీరు జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు తోడ్పడుతుంది. అది మీ ముంజేతి మీద కట్టుకొన్న దారం పోగులా ఉంటుంది. అది మీ కళ్లముందు కనబడే ఒక జ్ఞాపికలా ఉంటుంది. యెహోవా ప్రబోధాలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు సహాయ పడుతుంది. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయ పడుతుంది. 10 కనుక ప్రతి సంవత్సరం సరైన సమయంలో ఈ పండుగను జ్ఞాపకం చేసుకోండి.
11 “మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి యెహోవా మిమ్మల్ని నడిపిస్తాడు. కనానీయులు ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈ దేశాన్ని మీకు ఇస్తానని మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత 12 ప్రతి పెద్ద కుమారుణ్ణి ఆయనకు ఇవ్వాలని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే జంతువుల్లో ప్రథమంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ యెహోవాకు అర్పించాలి. 13 తొలి పిల్లగా పుట్టిన ప్రతి గాడిదనూ యెహోవా దగ్గర్నుండి మళ్లీ కొనుక్కోవచ్చు. మీరు ఆ గాడిదకు బదులుగా ఒక గొర్రెపిల్లను ఇచ్చి, గాడిదను విడిపించుకోవచ్చును. యెహోవా దగ్గర్నుండి ఆ గాడిదను కొని విడిపించుకోనట్లయితే, దాన్ని చంపేయాలి. మీరు దాని మెడ విరుగగొట్టాలి. అది బలి అర్పణ అవుతుంది. ప్రతి పెద్ద సంతానాన్నీ యెహోవా దగ్గరనుండి మళ్లీ కొనుక్కోవాలి.
14 “మీరెందుకు ఇలా చేస్తున్నారని భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. ‘దీనంతటికీ భావం ఏమిటి?’ అని వారు అంటారు. దానికి మీరు యిలా జవాబిస్తారు. ‘ఈజిప్టు నుండి మనల్ని రక్షించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడు. అక్కడ మనం బానిసలంగా ఉంటిమి. అయితే యెహోవా మనల్ని అక్కడ నుండి బయటకు నడిపించి ఇక్కడకు తీసుకొచ్చాడు. 15 ఈజిప్టులో ఫరో మొండికెత్తాడు. మనల్ని వెళ్లనిచ్చేందుకు అతడు నిరాకరించాడు. కనుక ఆ దేశంలో ప్రతి జ్యేష్ఠ సంతానాన్నీ యెహోవా చంపేసాడు. (పెద్ద కుమారుల్ని, తొలి చూలు జంతువుల్ని యెహోవా చంపేసాడు) ఆ కారణంచేత జంతువుల్లో మొదటి సంతానంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ[b] నేను యెహోవాకు అర్పిస్తున్నాను. ఆ కారణంచేతనే నా పెద్ద కుమారుల్లో ప్రతి ఒక్కరినీ నేను యెహోవా దగ్గర్నుండి కొంటున్నాను.’ 16 ఇది మీ ముంజేతికి కట్టబడ్డ దారం పోగులాంటిది. అది నీ కంటికి ఒక బాసికంలాంటిది.[c] యెహోవా తన మహత్తర శక్తిచేత మనల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయకరంగా ఉంటుంది.”
ఈజిప్టు నుండి బయటకు ప్రయాణం
17 ఫరో ఈజిప్టును విడిచి వెళ్లనిచ్చాడు. సముద్రం వెంబడి పోయే మార్గంలో ఆ ప్రజలను యెహోవా వెళ్లనీయలేదు. ఈ మార్గం పాలస్తీనాకు దగ్గర దారి. కాని “ప్రజలు ఆ దారిన వెళ్తే యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్లు మనసు మార్చుకొని మళ్లీ ఈజిప్టుకు వెళ్లిపోవచ్చు.” 18 కనుక వారిని ఇంకో మార్గాన యెహోవా నడిపించాడు. ఎర్ర సముద్రం పక్కగా ఉండే అరణ్యంలోనుంచి ఆయన వారిని నడిపించాడు. అయితే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి పెట్టినప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించి బయల్దేరారు.
యోసేపు ఎముకలు స్వదేశానికి తీసుకొని వెళ్లడం
19 మోషే తనతో బాటు యోసేపు ఎముకలను తీసుకొని వెళ్లాడు. ఇలా చేయాలనిచెప్పి యోసేపు తాను చనిపోక ముందే ఇశ్రాయేలి కుమారులతో ప్రమాణం చేయించుకొన్నాడు. “దేవుడు మిమ్మల్ని రక్షించినప్పుడు ఈజిప్టులోనుంచి నా ఎముకల్ని మీతో తీసుకు వెళ్లాలని జ్ఞాపకం ఉంచుకోండి” అని తాను చనిపోక ముందు యోసేపు చెప్పాడు.
యెహోవా తన ప్రజలను నడిపించాడు
20 ఇశ్రాయేలు ప్రజలు సుక్కోతు విడిచి ఏతాములో బసచేసారు. ఏతాము ఎడారికి సమీపంగా ఉంది. 21 యెహోవా ముందు దారితీశాడు. పగటి వేళ ప్రజలను నడిపించేందుకు ఒక ఎత్తయిన మేఘ స్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు, మరియు రాత్రివేళ మార్గం చూపించడానికి ఒక ఎత్తయిన అగ్నిస్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు. వాళ్లు రాత్రి సమయంలో కూడ ప్రయాణం చేయగలిగేటట్టు ఆ అగ్ని వారికి వెలుతురు నిచ్చింది. 22 పగటి వేళంతా ఆ ఎత్తయిన మేఘమూ, రాత్రి వేళంతా అగ్ని స్తంభమూ వాళ్లతోటే ఉన్నాయి.
అవినీతి గుమాస్తా యొక్క ఉపమానం
16 యేసు తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఒక ధనవంతుని దగ్గర ఒక గుమాస్తా పని చేస్తూ ఉండేవాడు. కొందరు, గుమాస్తా ఆ ధనవంతుని ధనం వ్యర్థం చేస్తున్నాడని అతనిపై ఆ ధనవంతునితో ఫిర్యాదు చేశారు. 2 ఆ కారణంగా ఆ ధనవంతుడు తన గుమాస్తాను పిలిచి, ‘నేను నిన్ను గురించి వింటున్నదేమిటి? జమాఖర్చుల లెక్కలు నాకు చూపు. నీవిక నా గుమాస్తాగా ఉండటానికి వీల్లేదు’ అని అన్నాడు.
3 “ఆ గుమాస్తా, ‘నేనేం చెయ్యాలి? నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసివేస్తున్నాడు. పొలం దున్ని జీవించాలంటే శక్తి లేదు. భిక్ష మెత్తుకోవాలంటే సిగ్గేస్తుంది. 4 ఆ! నా ఉద్యోగం పోయినప్పుడు ప్రజలు నన్ను తమ ఇండ్లలోనికి ఆహ్వానించేటట్లు ఏమి చెయ్యాలో తెలిసింది’ అని అనుకున్నాడు.
5 “వెంటనే అతడు తన యజమానికి అప్పున్న వాళ్ళను ఒక్కొక్కరిని పిలిచాడు. మొదటివానితో, ‘నా యజమానికి ఎంత అప్పున్నావు?’ అని అడిగాడు. 6 ‘వందలీటరులు ఒలీవ నూనె’ అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమాస్తా, ‘ఈ రసీదు తీసుకొని అక్కడ కూర్చొని దాన్ని వెంటనే యాభై లీటర్లు చెయ్యి’ అని అతనితో అన్నాడు.
7 “ఆ తర్వాత రెండవ వానితో, ‘నీవెంత అప్పున్నావు?’ అని అడిగాడు. ‘వంద గోధుమ సంచులు’ అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమాస్తా, ‘ఈ రసీదు తీసుకొని దాన్ని ఎనభై సంచులు చెయ్యి’ అని అతనితో అన్నాడు.
8 “ఆ యజమాని, ఆ అవినీతి గుమాస్తాను తెలివిగా ప్రవర్తించినందుకు అభినందించాడు. దైవ చింతన కలవాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చూపుతున్న తెలివి కన్నా, ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్ళు తమ పరిస్థితుల్ని ఎక్కువ తెలివిగా ఎదుర్కొంటారు.
9 “నేను చెప్పేదేమిటంటే, మీ ఐహిక సంపదను ఉపయోగించి ఈ లోకపు స్నేహితులను సంపాదించండి. మీ ధనం తరిగిపోయిన తర్వాత వారు మీకు సహాయం అవుతారు. 10 చిన్న విషయాల్లో నమ్మగలిగిన వాణ్ణి పెద్ద విషయాల్లో కూడా నమ్మవచ్చు. చిన్న విషయాల్లో అవినీతిగా ఉన్నవాడు పెద్ద విషయాల్లో కూడా అవినీతిగా ఉంటాడు. 11 ఐహిక సంపద విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు నిజమైన సంపద విషయంలో మిమ్మల్నెవరు నమ్ముతారు? 12 ఇతరుల ఆస్థి విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు మీకు మీ స్వంత ఆస్థిని ఎవరిస్తారు?
13 “ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలాచేస్తే అతడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఒకని పట్ల విశ్వాసం చూపి యింకొకని పట్ల నీచంగా ప్రవర్తిస్తాడు. దేవుణ్ణి, ధనాన్ని సమంగా కొలువలేము.”
ధర్మశాస్త్రము, దేవుని రాజ్యము
(మత్తయి 11:12-13)
14 పరిసయ్యులు ధనాన్ని ప్రేమించేవాళ్ళు కనుక వాళ్ళు ఇది విని యేసును హేళన చేశారు. 15 యేసు వాళ్ళతో, “మీరు ప్రజల ముందు నీతిమంతులుగా ప్రవర్తిస్తారు. కాని మీ హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు. మానవులు వేటికి అత్యధికమైన విలువనిస్తారో వాటిని దేవుడు తిరస్కరిస్తాడు.
16 “యోహాను కాలాందాకా ధర్మశాస్త్రము, ప్రవక్తలు వ్రాసిన విషయాలు ఆచరణలో ఉన్నాయి. యోహాను కాలం నుండి దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటింపబడుతోంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలోకి వెళ్ళాలని తమ శక్త్యానుసారం కష్టపడుతున్నారు. 17 భూమి, ఆకాశము నశించిపోవచ్చు, కాని ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు.
విడాకులు మరియు పునర్వివాహము
18 “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్న ప్రతివాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడాకులివ్వబడిన స్త్రీని వివాహం చేసుకొన్నవాడు కూడా వ్యభిచారిగా పరిగణింపబడతాడు” అని అన్నాడు.
ధనవంతుడు, లాజరు
19 “ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు మంచి విలువైన దుస్తులు వేసుకొని ప్రతిరోజు భోగాలనుభవిస్తూ జీవించేవాడు. 20 అతని గడప ముందు లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కులు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. 21 అతడాధనికుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు.
22 “ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత ఆ ధనికుడు కూడా చనిపొయ్యాడు. అతడు సమాధి చెయ్యబడ్డాడు. 23 నరకంలో ఆ ధనికుడు హింసలు అనుభవిస్తూవుండేవాడు. తలెత్తి చూడగా లాజరును తన ప్రక్కన కూర్చోబెట్టుకున్న అబ్రాహాము కనిపించాడు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. 24 అందువల్ల అబ్రాహామును పిలిచి, ‘తండ్రి అబ్రాహామా! నామీద దయ చూపు. నేను ఈ మంటల్లో తీవ్రంగా బాధపడ్తున్నాను. లాజరుతో ఇక్కడకు వచ్చి తన వేలుముంచి నా నాలుక తడపమని చెప్పండి’ అని అన్నాడు.
25 “కాని అబ్రాహాము, ‘కుమారుడా! జ్ఞాపకం తెచ్చుకో! నీవు బ్రతికిన రోజుల్లో సుఖాలనుభవించావు. లాజరు కష్టాలనుభవించాడు. కాని అతడిక్కడ ఆనందంగా ఉన్నాడు. నీవు బాధలను అనుభవిస్తున్నావు. 26 ఇక్కడి వాళ్ళు అక్కడకు రాకూడదని, అక్కడివాళ్ళు యిక్కడికి రాకూడదని మన మధ్య పెద్ద అఘాతం ఉంది’ అని అన్నాడు.
27 “ఆ ధనికుడు అలాగైతే ‘తండ్రి! లాజరును మా తండ్రి ఇంటికి పంపు. 28 అక్కడ నా ఐదుగురు సోదరులున్నారు. వాళ్ళు యిక్కడకు వచ్చి హింసలు అనుభవించకుండా ఉండేటట్లు వాళ్ళకు బోధించుమని చెప్పు’ అని అన్నాడు.
29 “అబ్రాహాము ఈ విధంగా సమాధానం చెప్పాడు: ‘మోషే, ప్రవక్తలు ఉన్నారు కదా! వాళ్ళు చెప్పినట్లు చెయ్యనీ!’
30 “‘తండ్రీ అబ్రాహామా! చనిపోయిన వాళ్ళనుండి ఎవరైనా వెళ్తే వాళ్ళు విని మారుమనస్సు పొందుతారు’ అని ఆ ధనికుడు అన్నాడు.
31 “అబ్రాహాము, ‘వాళ్ళు మోషే, ప్రవక్తలు చెప్పినట్లు విననట్లైతే చనిపోయినవాడు బ్రతికి వచ్చినా వాళ్ళు వినరు’ అని అన్నాడు.”
31 “ఒక యువతిని కామవాంఛతో చూడకూడదని
నా కళ్లతో నేను ఒప్పందం చేసుకొన్నాను.
2 సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తున్నాడు?
దేవుడు ఉన్నతమైన తన పరలోక గృహంలో ఉండి ప్రజలకు తిరిగి ఎలా ప్రతిఫలం ఇస్తున్నాడు?
3 దుర్మార్గులకు దేవుడు కష్టాన్ని, నాశనాన్ని పంపిస్తాడు.
తప్పు చేసేవారికి సర్వనాశనం కలిగిస్తాడు.
4 నేను చేసేది ప్రతిదీ దేవునికి తెలుసు.
నేను వేసే ప్రతి అడుగూ ఆయన చూస్తున్నాడు.
5 “నేను అబద్ధాల జీవితం జీవించి ఉంటే,
లేక ప్రజలకు అబద్దాలు చెప్పి, మోసం చేసేందుకు నేను పరుగులెత్తి ఉంటే.
6 అప్పుడు నన్ను తూచేందుకు దేవుడు న్యాయపు త్రాసు వాడవచ్చును.
అప్పుడు నేను నిర్దోషినని దేవునికే తెలుస్తుంది.
7 నేను సరియైన మార్గం నుండి తొలగిపోతే
నా కళ్లు నా హృదయాన్ని దుష్టత్వానికి నడిపించి ఉంటే
లేదా నా చేతులు పాపంతో మైలగా ఉంటే,
8 అప్పుడు నేను నాటిన పంటలను ఇతరులు తిని వేయుదురు గాక,
నా పంటలు పెరికి వేయబడును గాక.
9 “నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉంటే, లేదా
నేను నా పొరుగువాని భార్యతో వ్యభిచార పాపం చేయటానికి అతని ద్వారం దగ్గర వేచి ఉంటే,
10 అప్పుడు నా భార్య మరొకనికి వంట చేయునుగాక.
ఇతర వురుషులు ఆమెతో పండుకొందురు గాక.
11 ఎందుకంటే లైంగిక పాపం అవమానకరం.
అది శిక్షించబడాల్సిన పాపం.
12 లైంగికపాపం కాల్చివేసి, నాశనంచేసే అగ్నిలాంటిది.
లైంగిక పాపం నాకు గల సర్వాన్నీ నాశనం చేస్తుంది.
13 “నా మగ సేవకులు, ఆడ సేవకులు నాకు విరోధంగా ఆరోపణ చేసినప్పుడు,
ఒక వేళ నేను వారికి న్యాయం చేకూర్చేందుకు నిరాకరిస్తే,
14 నేను దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను ఏమి చేస్తాను?
నేను చేసినదాని గూర్చి వివరించుమని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబిస్తాను?
15 దేవుడు నన్ను నా తల్లి గర్భంలోనే చేశాడు. నా సేవకులను కూడా దేవుడే చేసాడు.
మమ్మల్ని ఇద్దరినీ మా తల్లి గర్భంలో దేవుడే రూపొందించాడు.
16 “పేద ప్రజలకు సహాయం చేసేందుకు నేను ఎన్నడూ నిరాకరించలేదు.
విధవలను దిక్కుమాలిన వారిగా నేను ఎన్నడూ ఉండనియ్యలేదు.
17 నా భోజనం విషయంలో నేను ఎన్నడూ స్వార్థంతో ఉండలేదు.
అనాధ పిల్లలను నేను ఎన్నడూ ఆకలితో ఉండనీయలేదు.
18 నా జీవిత కాలం అంతా తండ్రిలేని పిల్లలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను.
నా జీవిత కాలం అంతా విధవల పట్ల నేను శ్రద్ధ చూపాను.
19 ఎవరో ఒకరు బట్టలు లేక శ్రమపడటం నేను చూచినప్పుడు,
లేక పేదవాడు చొక్కా లేకుండా ఉన్నప్పుడు,
20 నేను ఎల్లప్పుడూ వారికి బట్టలు ఇచ్చాను.
వారికి వెచ్చదనం కోసం నా గొర్రెల స్వంతబొచ్చు నేను ఉపయోగించాను.
అప్పుడు వారు హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించారు.
21 న్యాయస్థానంలో నేను గెలుస్తానని తెలిసికూడ
ఒక అనాధ బిడ్డను నేను మోసం చేస్తే,
22 నేను ఒకవేళ అలాచేస్తే నా భుజం నుండి నా చేయి ఊడి పడిపోవును గాక.
నా చేయి దాని కీలు నుండి పడిపోవును గాక.
23 కాని ఆ చెడ్డ పనులు ఏవీ నేను చేయలేదు.
ఎందుకంటే, దేవుని శిక్షకు నేను భయపడ్డాను.
ఆయన మహాత్మ్యము నన్ను బెదరగొట్టెను.
24 “నా ఐశ్వర్యాలను నేను ఎన్నడూ నమ్ముకొనలేదు.
‘నీవే నా ఆశ అని’ స్వచ్ఛమైన బంగారంతో నేను ఎన్నడూ చెప్పలేదు.
25 నేను ధనికుడను అని ఎన్నడు గర్వంతో నిండిపోలేదు.
లేక నేను సంపాదించిన ఐశ్వర్యాలతో మురిసిపోలేదు.
26 నేను ఎన్నడూ ప్రకాశమైన సూర్యుణ్ణి
లేక అందమైన చంద్రుణ్ణి ఆరాధించలేదు.
27 సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు
నేను ఎన్నడూ మోసగించబడలేదు.
28 అలాంటివి ఏవైనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే.
ఎందుచేతనంటే ఆ చెడు కార్యాలు చేయటం మూలంగా సర్వశక్తిమంతుడైన దేవునికి నేను అపనమ్మకమైనవాడి నవుతాను.
29 “నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు
నేను ఎన్నడూ సంతోషించలేదు.
నా శత్రువులకు కష్టాలు కలిగినప్పుడు
నేను ఎన్నడూ నవ్వలేదు.
30 నా శత్రువులను శపించటం ద్వారానూ, వారు చావాలని కోరుకోవటం ద్వారానూ,
నేను ఎన్నడూ నా నోటితో పాపం చేయలేదు.
31 పరాయి వాళ్లకు నేను ఎల్లప్పుడూ భోజనం పెట్టినట్లు
నా ఇంట్లోని వాళ్లందరకూ తెలుసు.
32 పరాయి వాళ్లు రాత్రి పూట వీధుల్లో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా
నేను అలాంటి వారిని ఎల్లప్పుడూ నా ఇంటికి ఆహ్వానించేవాడను.
33 ఇతరులు తమ పాపాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు.
కాని నేను నా దోషాన్ని దాచిపెట్టలేదు.
34 ఎందుకంటే, ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఎన్నడూ భయపడలేదు.
నేను ఎన్నడూ మౌనంగా ఉండలేదు.
బయటకు వెళ్లకుండా ఉండలేదు. ఎందుకంటే, ప్రజలు నన్ను ద్వేషిస్తారనే భయం నాకు లేదు గనుక.
35 “ఆహా, ఎవరైనా నా మాటలు వినేవారు ఉంటే బాగుండును.
ఇప్పుడు నేను నా వాదం చెబుతాను.
సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు జవాబిచ్చును గాక.
నన్ను నిందించే ఆయన, నేను చేశానని నిందించబడుతున్న సంగతులను వ్రాసి పెట్టును గాక.
36 నిశ్చయంగా ఆ వ్రాతను నేను నా భుజం మీద ధరిస్తాను.
నేను దానిని కిరీటంలా ధరిస్తాను.
37 నేను చేసినది సమస్తం దేవునికి నేను వివరిస్తాను.
నేను ఒక అధికారిలా నా తలపైకి ఎత్తుకొని దేవుని దగ్గరకు వస్తాను.
38 “నేను సాగుచేస్తున్న భూమిని దాని స్వంతదారుని దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే,
ఆ భూమి దాని స్వంత కన్నీళ్లతో తడిసి ఉంటే,
39 ఆ భూమి పండించిన వాటిని రైతులకు విలువ చెల్లించకుండానే
నేను దొంగిలించి ఉంటే,
40 అవును, ఈ చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే
పొలాల్లో గోధుమకు బదులు ముండ్లు, యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక!”
యోబు మాటలు సమాప్తం.
1 దైవేచ్ఛ వల్ల యేసు క్రీస్తు అపొస్తులునిగా ఉన్న పౌలు నుండి, మన సోదరుడైన తిమోతి నుండి కొరింథులో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ ప్రాంతంలోని పవిత్రులకు.
2 మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించాలని కోరుతున్నాను.
దేవునికి వందనాలు చెల్లించుట
3 మన యేసు క్రీస్తు ప్రభువును, తండ్రియైన దేవుణ్ణి స్తుతిద్దాము. దేవుడు దయామయుడు. మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. 4 ఆయన మన కష్టాలు తొలగిపోవటానికి సహాయం చేస్తాడు. ఆయనలాగే మనము కూడా యితరుల కష్టాలు తొలగించటానికి సహాయం చెయ్యాలని ఆయన ఉద్దేశం. 5 క్రీస్తు కష్టాల్ని మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకొందాము. 6 మీకు సహాయం చెయ్యాలని, రక్షణ కలగాలని మేము కష్టాలు అనుభవిస్తున్నాము. మీకు సహాయం చెయ్యటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం వల్ల మేము అనుభవించిన కష్టాలు మీరు కూడా అనుభవించేటట్లు మీలో సహనం కలుగుతుంది. 7 నాకు మీ పట్ల గట్టి నమ్మకం ఉంది. మీరు మా కష్టాలు పంచుకొన్నట్లుగానే, మాకు కలిగే సహాయాన్ని కూడా పంచుకొంటారని మాకు తెలుసు.
8 మేము ఆసియ ప్రాంతంలో అనుభవించిన కష్టాలు మీకు చెప్పకుండా ఉండలేము. మాకు అక్కడ తీవ్రమైన కష్టాలు కలిగాయి. అవి మేము మోయలేనంతగా ఉండినవి. జీవిస్తామనే ఆశ కూడా పోయింది. 9 మా మనస్సులకు మరణదండన పొందినట్లు అనిపించింది. మమ్మల్ని మేము నమ్ముకోరాదని, చనిపోయినవాళ్ళను బ్రతికించే దేవుణ్ణి నమ్మాలని ఇలా జరిగింది. 10 దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదకరమైన చావునుండి రక్షించాడు. ఇక ముందు కూడా రక్షిస్తాడు. మాకు ఆయన పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. 11 మీరు ప్రార్థించి మాకు సహాయం చెయ్యాలి. ఎంతమంది ప్రార్థిస్తే దేవుడు మాకు అంత సహాయం చేస్తాడు. దేవుడు మాకు ఆ సహాయం చేసాక, అందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం కలుగుతుంది.
పౌలు ఉద్దేశం మారుట
12 మేము ఈ ప్రపంచంలో నిజాయితీగా, సదుద్దేశాలతో జీవిస్తున్నాము. ముఖ్యంగా మీకోసం చేసినవి సదుద్దేశంతో చేసాము. మేము చేసినవన్నీ దేవుని దయవల్ల సంభవించాయి. ఇది మానవ ప్రయత్నంవల్ల సంభవించ లేదు. ఇది నిజమని మా అంతరాత్మలు చెపుతున్నాయి. ఇది మేము గర్వించదగ్గ విషయం. 13 మేము మీరు చదవ కలిగింది, అర్థం చేసుకోగలిగింది మాత్రమే వ్రాస్తున్నాము. 14 మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకొన్నారు. మున్ముందు పూర్తిగా అర్థం చేసుకొంటారని ఆశిస్తున్నాను. యేసు ప్రభువు వచ్చిన రోజు, మీ కారణంగా మేము గర్విస్తున్నట్లే, మా కారణంగా మీరు గర్వించ కలుగుతారు.
15 నాకు ఈ విషయంలో నమ్మకం ఉంది. కనుకనే మీకు రెండుసార్లు లాభం కలగాలని నేను మొదట మిమ్మల్ని దర్శించాలని అనుకొన్నాను. 16 మాసిదోనియకు వెళ్ళే ముందు, తిరిగి వచ్చేముందు మీ దగ్గరకు రావాలనుకొన్నాను. అక్కడి నుండి నేను యూదయకు వెళ్ళేటప్పుడు మీ నుండి సహాయం లభిస్తుందని ఆశిస్తున్నాను. 17 నేను ఈ ఏర్పాట్లు ఆలోచించకుండా చేసానని అనుకొంటున్నారా? నేను అందరిలా ఒకసారి “ఔను” అని, ఒకసారి “కాదు” అని అనను.
18 దేవుని సాక్షిగా చెపుతున్నాను. మీకు బోధించిన విషయంలో “ఔను”, “కాదు” అనే ప్రశ్నే లేదు. 19 నేను, సిల్వాను, తిమోతి మీకు బోధించిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు “ఔను”, “కాదు” అని అనలేదు. ఆయన అన్నివేళలా “ఔను” అని అన్నాడు. 20 దేవుడు క్రీస్తునందు చేసిన ఎన్ని వాగ్దానాలైనను “ఔను” అని అన్నట్లుగానే ఉన్నవి. అందువల్ల యేసు క్రీస్తు ద్వారా మనము “ఆమేన్” అని అంటున్నాము. ఇలా అని దేవునికి మహిమ కలిగిస్తున్నాము. 21 దేవుడు మనకు, అంటే మీకు, మాకు క్రీస్తు పట్ల ధృఢవిశ్వాసము ఉండేటట్లు చేస్తున్నాడు. మనకు అభిషేకమిచ్చినవాడు దేవుడు. 22 దేవుడు మనము తనవాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు. తన ఆత్మను రానున్నదానికి హామీగా మన గుండెల్లో ఉంచాడు.
23 నేను దైవసాక్షిగా చెపుతున్నాను. మిమ్మల్ని నొప్పించరాదని నా ఉద్దేశ్యం. కనుక నేను కొరింథుకు తిరిగి రాలేదు. 24 మీ విశ్వాసము ద్వారా ధృఢం కాగలరు. కనుక మీరు ఏ విధంగా విశ్వసించాలో మేము చెప్పటంలేదు. మీ ఆనందం కోసం మీతో కలిసి పని చెయ్యాలని మా ఉద్దేశ్యము.
© 1997 Bible League International