Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 12:22-51

22 హిస్సోపు కొమ్మలు తీసుకొని రక్తంతో నింపిన పాత్రల్లో వాటిని ముంచండి. ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద ఆ రక్తాన్ని పూయండి. తెల్లారేవరకు ఎవరూ తమ ఇండ్లు విడిచి వెళ్ల కూడదు. 23 ఈజిప్టులో జ్యేష్ఠ సంతానాన్ని చంపడానికి యెహోవా సంచరించే సమయంలో, ద్వారబంధాల నిలువు కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని ఆయన చూస్తాడు. అప్పుడు యెహోవా ఆ ఇంటిని కాపాడుతాడు[a] నాశనకారుడ్ని యెహోవా మీ ఇంట్లోకి రానివ్వడు. మిమ్మల్ని బాధింపనియ్యడు. 24 ఈ ఆజ్ఞ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చట్టం మీకు, మీ సంతానానికి శాశ్వతంగా ఉంటుంది. 25 యెహోవా మీకు ఇచ్చే దేశానికి వెళ్లిన తర్వాత కూడ మీరు దీన్ని చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలి. 26 ‘ఈ ఆచారం మనం ఎందుకు పాటిస్తున్నాము?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు 27 ‘యెహోవాను ఘనపర్చడం కోసమే ఈ పస్కా పండుగ. ఎందుచేతనంటే, మనం ఈజిప్టులో ఉన్నప్పుడు యెహోవా ఇశ్రాయేలు గృహాలను దాటిపోయాడు[b] యెహోవా ఈజిప్టు వాళ్లను చంపేసాడు. కానీ మన ఇళ్లల్లో వారిని ఆయన రక్షించాడు. అందుచేత ఇప్పుడు ప్రజలు సాష్టాంగపడి యెహోవాను ఆరాధిస్తున్నారు’ అని మీరు చెప్పాలి.” అని అన్నాడు.

28 మోషే అహరోనులకు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అందుచేత యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు చేసారు.

29 అర్ధరాత్రి వేళ ఫరో (ఈజిప్టు రాజ్యపాలకుడు) ఇంట పెద్ద కుమారుడు మొదలుకొని చెరసాలలో కూర్చొన్న ఖైదీ పెద్ద కుమారుని వరకు ఈజిప్టులో పెద్ద కుమారులందర్నీ యెహోవా చంపేసాడు. అలాగే జంతువుల్లో మొదటి సంతానం అన్నీ చచ్చాయి. 30 ఆ రాత్రి ఈజిప్టులో ప్రతీ ఇంటా ఎవరో ఒకరు చనిపోయారు. ఫరో, అతని అధికారులు, ఈజిప్టులోని ప్రజలంతా ఘోల్లున ఏడ్వడం మొదలు పెట్టారు.

ఇశ్రాయేలీయులు ఈజిప్టు విడిచి వెళ్లడం

31 కనుక ఆ రాత్రి మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు. “మీరు వెంటనే నా ప్రజల్ని విడిచి వెళ్లండి. మీరు చెప్పినట్టే మీరూ, మీ ప్రజలూ చెయ్యండి. వెళ్లి యెహోవాను ఆరాధించండి. 32 మీరు చెప్పినట్టే మీ గొర్రెలను, పశువులను, అన్నింటినీ మీతోబాటు తీసుకొనిపోవచ్చు. వెళ్లండి. నన్నుకూడ ఆశీర్వదించండి.” అని వారితో ఫరో అన్నాడు. 33 వాళ్లను త్వరగా విడిచిపొమ్మని ఈజిప్టు ప్రజలు కూడ వారిని అడిగారు ఎందుకంటే, “మీరు వెళ్లకపోతే మేమందరం చస్తాము” అని వాళ్లు చెప్పారు.

34 తమ రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనేంత సమయం ఇశ్రాయేలు ప్రజలకు లేదు. పిండి ముద్దలున్న పాత్రలను బట్టలో కట్టుకొని వారు వారి భుజాన వేసుకొని మోసుకుపోయారు. 35 అప్పుడు మోషే వారిని ఏమి చేయమని చెప్పాడో అలాగే ఇశ్రాయేలు ప్రజలు చేసారు. వారు వారి పక్క ఇండ్ల వారి దగ్గరకు వెళ్లి బట్టలు, వెండి, బంగారు వస్తువులు ఇమ్మని అడిగారు. 36 ఈజిప్టువారు ఇశ్రాయేలు ప్రజల మీద దయ చూపించేటట్టు యెహోవా చేసాడు. అందుచేత ఈజిప్టు వాళ్లు వారి ఐశ్వర్యాలను ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చారు.

37 ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కట్టి రామసేసునుండి సుక్కోతుకి వెళ్లారు. వారు పురుషులే సుమారు 6,00,000 మంది. ఇందులో పిల్లల సంఖ్యలేదు. 38 గొర్రెలు, పశువులు, ఇతర సామగ్రి చాల విస్తారంగా ఉన్నాయి. వారితో బాటు చాల మంది రకరకాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. వీళ్లు ఇశ్రాయేలీయులు కారు, గాని వారితో కలిసి వెళ్లారు. 39 అయితే ప్రజలకు మాత్రం వారి రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనే సమయం లేదు. వారు తమ ప్రయాణం కోసం ప్రత్యేకమైన భోజనం ఏదీ సిద్ధం చేసుకోలేదు. కనుక పులవని పిండితోనే వారు రొట్టెలు చేసుకోవాల్సి వచ్చింది.

40 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో[c] 430 సంవత్సరాలు జీవించారు. 41 నాలుగువందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆరోజే మొత్తం యెహోవా సైన్యాలన్నీ[d] ఈజిప్టు దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి. 42 కనుక యెహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. అది చాల ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరాలవరకు జ్ఞాపకం చేసుకొంటారు. ఇశ్రాయేలు ప్రజలంతా ఆ రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటారు.

43 మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు. 44 ఒకడు బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్యవచ్చు. 45 అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)”

46 “ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తినకూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను విరువకూడదు. 47 ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండుగను ఆచరించాలి. 48 ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు. 49 అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే, విదేశీయుడైనా సరే యివే నియమాలు వర్తిస్తాయి.”

50 మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు. 51 కనుక అదే రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి యెహోవా బయటకు నడిపించాడు. ప్రజలు గుంపులుగా బయల్దేరారు.

లూకా 15

తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానం

(మత్తయి 18:12-14)

15 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు. కాని పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి తింటాడు” అని గొణిగారు.

అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి ఆ తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా? అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, ‘తప్పిపోయిన నా గొఱ్ఱె దొరికింది. మనమంతా ఆనందించుదాం’ అని అంటాడు. నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు పొందనవసరం లేని తొంభైతొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగె ఆనందంకన్నా పాపం చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు.

“ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి యిల్లంతా వూడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా? దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది. 10 నేను చెప్పేదేమిటంటే అదే విధంగా ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు” అని అన్నాడు.

తప్పిపోయిన కుమారుని ఉపమానం

11 యేసు ఇంకా ఇలా చెబుతూ పోయాడు: “ఒకనికి యిద్దరు కుమారులు ఉన్నారు. 12 చిన్నవాడు తండ్రితో, ‘నాన్నా! నా భాగం ఆస్తి నాకు ఇచ్చేయి’ అని అడిగాడు. తండ్రి సరేనని తన ఆస్తిని ఇరువురి మధ్య పంచిపెట్టాడు.

13 “కొద్ది రోజుల్లో చిన్నవాడు తనపాలు భాగం తీసుకొని దూర దేశాలకు వెళ్ళి పొయ్యాడు. ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు పెట్టాడు. 14 అంతా ఖర్చయి పోయింది. ఇంతలో అతడున్న దేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అతని దగ్గర ఏమీ మిగల్లేదు. కనుక ఆ దేశంలో ఉన్న ఒక ఆసామి దగ్గర ఉద్యోగంలో చేరాడు. 15 ఆ ఆసామి అతణ్ణి పందులు కాయటానికి నియమించాడు. 16 ఆ పందులు తీనే ఆహారంతో తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. ఆయినా ఎవ్వరూ అతనికి ఏదీ ఇవ్వలేదు.

17 “అతనికి బుద్ధి వచ్చింది. అతడు ‘నా తండ్రి పనివాళ్ళ దగ్గర కూడా కావలసినంత తిండి ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. 18 నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తాను. వెళ్లి అతనితో నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల కూడా పాపం చేశాను. 19 నేను నీ కుమారుడనని చెప్పుకొంటానికి కూడా తగను. నన్ను కూడా నీ దగ్గర పని చేసేవాళ్ళతో ఉండనీ!’ అని చెప్పాలని మనస్సులో అనుకున్నాడు. 20 వెంటనే అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు.

చిన్న కుమారుడు తిరిగి రావటం

“ఇంటికి కొంత దూరంలో ఉండగానే అతని తండ్రికి తనకుమారుణ్ణి చూసి చాలా కనికరం కలిగింది. అతడు పరుగెత్తుకొంటూ తన కుమారుని దగ్గరకు వెళ్ళి అతణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. 21 అతడు తండ్రితో, ‘నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల పాపం చేసాను. నేను నీ కుమారుణ్ణని చెప్పుకోవటానికి కూడా తగను’ అని అన్నాడు.

22 “అతని తండ్రి పని వాళ్ళతో, ‘వెంటనే వెళ్ళి మంచి దుస్తులు, వేలికి ఉంగరము, కాళ్లకు జోళ్ళు తెచ్చి యితనికి తొడిగించండి. 23 బాగా బలిసిన దూడను తీసుకు వచ్చి కొయ్యండి. పండుగ చేసుకొందాం. 24 చనిపోయిన నా కుమారుడు బ్రతికి వచ్చాడు. తప్పి పోయినవాడు తిరిగి దొరికాడు’ అని అన్నాడు. వాళ్ళు వెంటనే పండుగ చేసుకోవడం మొదలు పెట్టారు.

పెద్ద కుమారుడు దోషారోపణ చేయటం

25 “ఇంతలో పెద్దవాడు పొలంనుండి ఇంటికి వస్తూవున్నాడు. ఆతనికి ఇంటినుండి సంగీతము, నాట్యము జరుగుతున్న ధ్వనులు వినిపించాయి. 26 అతడు పని వాళ్ళలో ఒకణ్ణి పిలిచి, ‘ఏమి జరుగుతోంది?’ అని అడిగాడు. 27 ఆ పనివాడు ‘మీ తమ్ముడు వచ్చాడు. మీ నాన్న అతడు క్షేమంగా తిరిగి వచ్చాడని బాగా బలిసిన దూడను కోసి విందు చేస్తున్నాడు’ అని చెప్పాడు.

28 “ఇది విని అతనికి కోపం వచ్చింది. కనుక ఇంట్లొకి అడుగు పెట్టనని అన్నాడు. అందువల్ల అతని తండ్రి వెలుపలికి వచ్చి బ్రతిమిలాడాడు. 29 అతడు తండ్రితో, ‘యిదిగో నాన్నా! ఎన్నో ఏండ్లనుండి నేను బానిసలాగా పనిచేసాను. నీ ఆజ్ఞ జవదాట లేదు. ఆయినా నేను నా స్నేహితులతో విందు చేసుకోవటానికి నీవు ఒక్క చిన్న గొఱ్ఱెను కూడా ఇవ్వలేదు. 30 కాని, నీ ఈ కుమారుడు ఆస్థినంతా వేశ్యలకు తగలెట్టి ఇల్లు చేరుకొంటే వానికోసం బలిసిన దూడను కోస్తున్నావు!’ అని అన్నాడు.

31 “కాని తండ్రి అతనితో, ‘నా బాబూ! నీవెప్పుడూ నా దగ్గరే ఉంటున్నావు. కనుక నా దగ్గర ఉన్నవన్నీ నీవి. 32 కాని నీ ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. తప్పిపోయిన వాడు దొరికాడు. కనుక మనం ఆనందంగా పండుగ చేసుకోవాలి’ అని అన్నాడు.”

యోబు 30

30 కాని యిప్పుడు నన్ను హేళన చేసే వారు నాకంటే చిన్నవారు.
    ఆ యువకులకు పనికిమాలిన తండ్రులు ఉన్నారు. వారి తండ్రులను నా గొర్రెలను కాపలా కాసే కుక్కలతో కూడా నేను ఉండనివ్వను.
నాకు సహాయం చేసేందుకు వాళ్లకు బలం లేదు.
    వారు అలసిపోయిన వృద్ధులు.
ఆ మనుష్యులు చచ్చిన వాళ్లతో సమానం.
    ఎందుకంటే వారికి ఏమీ లేక ఆకలితో ఉన్నారు. ఎండి పోయిన ఖాళీ నేలను కూడా వారు తినటానికి ప్రయత్నిస్తున్నారు.
ఆ మనుష్యులు వారి ఎడారిలోని తుత్తి చెట్లను పెరికి వేస్తారు.
    తంగేడు చెట్టు వేర్లను వారు తింటారు.
ఆ మనుష్యులు ఇతర మనుష్యుల దగ్గర నుండి బలవంతంగా వెళ్లగొట్టబడతారు.
    మనుష్యులు దొంగల మీద అరచినట్టుగా వారి మీద అరుస్తారు.
ఎండిపోయిన నదులలోను, బండలలోను,
    కొండగుహలలోను, నేలలోని గుంటలలోను నివసించేందుకు వారి వృద్ధులు బలాత్కారం చేయబడతారు.
వారు పొదలలో అరుస్తారు.
    ముళ్ల కంపల్లో వారంతా ఒక్కచోట చేరుతారు.
వాళ్లు పనికిమాలిన అనామకుల గుంపు.
    వాళ్లు వారి దేశం నుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన వాళ్లు.

“ఇప్పుడు ఆ మనుష్యుల కొడుకులు నన్ను హేళన చేసేందుకు నన్ను గూర్చి పాటలు పాడుతారు.
    వాళ్లకు నా పేరు చెడ్డ మాట అయింది.
10 ఆ యువకులు నన్ను ద్వేషిస్తారు, వారు నాకు దూరంగా నిలుస్తారు, వారు నాకంటే మంచివాళ్లము అనుకొంటారు.
    చివరికి వాళ్లు నా ముఖం మీద ఉమ్మి కూడా వేస్తారు.
11 నా వింటి నారిని దేవుడు తీసుకొని నన్ను బలహీనుణ్ణి చేశాడు.
    ఆ యువకులు తమని తాము వారించుకొనక నిండు కోపంతో నాకు విరోధంగా తిరుగుతారు.
12 నా కుడి ప్రక్క ఆ యువకులు నామీద పడుతున్నారు.
    నేను పడిపోయేలా వాళ్లు చేస్తున్నారు.
    వారు నామీద దాడి చేసి, నన్ను నాశనం చేసేందుకు నా చుట్టూరా పట్టణానికి ముట్టడి దిబ్బ వేసినట్లు వేస్తున్నారు.
13 నేను పారిపోయే మార్గాన్ని ఆ యువకులు కాపలా కాస్తున్నారు.
    నన్ను నాశనం చేయటంలో వారు విజయం పొందుతున్నారు. వారు నన్ను నాశనం చేయటానికి వారికి ఎవరి సహాయం అవసరం లేదు.
14 గోడలోని కన్నంగుండా వెళ్లిపోయినట్టు వారు నామీద దాడి చేస్తున్నారు.
    వారు దూకేసి నా మీదకు విరగబడుతున్నారు.
15 భయాలు నన్ను ఆవరించేస్తున్నాయి.
    వస్తువులను గాలి చెదరగొట్టినట్లు ఆ యువకులు నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు.
    నా భద్రత మబ్బులా మాయమవుతోంది.

16 “ఇప్పుడు నా జీవితం దాదాపు అయిపోయింది.
    నేను త్వరలోనే మరణిస్తాను. శ్రమదినాలు నన్ను పట్టివేశాయి.
17 రాత్రివేళ నా ఎముకలు అన్నీ నొప్పెడతాయి.
    బాధ నన్ను నమిలివేయటం ఎన్నడూ ఆగిపోలేదు.
18 దేవుడు మహాబలంగా నా చొక్కా పట్టి లాగుతున్నాడు.
    ఆయన నా బట్టలను నలిపి వేస్తున్నాడు.
19 దేవుడు నన్ను బురదలో పడదోస్తున్నాడు.
    నేను మట్టిలా, బూడిదలా అయిపోతున్నాను.

20 “దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెడుతున్నాను.
    కానీ నీవు జవాబు ఇవ్వవు.
నేను నిలబడి ప్రార్థన చెస్తాను.
    కానీ నీవు నాకు జవాబు ఇవ్వవు.
21 దేవా, నీవు నా ఎడల అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు.
    నన్ను బాధపెట్టేందుకు నీవు నీ శక్తిని ప్రయోగిస్తున్నావు.
22 దేవా, బలమైన గాలి నన్ను కొట్టుకొని పోయేటట్టు నీవు చేస్తున్నావు.
    నీవు నన్ను తుఫానులో పడదోస్తున్నావు.
23 నీవు నన్ను నా మరణానికి తీసుకొని పోతున్నావని నాకు తెలుసు.
    మరణం ప్రతి మనిషికి ఏర్పాటు చేయబడిందే.

24 “కానీ అప్పటికే నాశనమయి, సహాయంకోసం అలమటించేవాణ్ణి
    నిశ్చయంగా ఎవ్వరూ బాధించరు.
25 దేవా, కష్టాల్లో ఉన్న ప్రజల పక్షంగా నేను మొర్ర పెట్టానని నీకు తెలుసు.
    పేద ప్రజల కోసం నా హృదయం ఎంతో విచారించిందని నీకు తెలుసు.
26 కానీ నేను మంచివాటి కోసం ఎదురు చూస్తే వాటికి బదులు చెడ్డవి జరిగాయి.
    వెలుగుకోసం నేను చూస్తే చీకటి వచ్చింది.
27 అంతరంగంలో నేను చీల్చివేయబడ్డాను.
    శ్రమలు ఎన్నటికీ ఆగిపోవు. శ్రమకాలాలు నా యెదుట ఉన్నాయి.
28 నేను ఎల్లప్పుడూ ఎంతో విచారంగా ఉంటానుగాని,
    నాకు ఆదరణ లభ్యం కాదు. నేను సమాజంలో నిలబడి సహాయం కోసం కేకలు వేస్తాను.
29     నేను అడవి కుక్కలకు సోదరుడినయ్యాను. నిప్పుకోళ్లు నాకు జతగాళ్లు.
30 నా చర్మం చాలా నల్లబడిపోయింది.
    నా శరీరం జ్వరంతో వేడిగా ఉంది.
31 దుఃఖమయ గీతాలు వాయించేందుకు నా స్వర మండలమును శృతి చేయబడింది.
    విచారంగా ఏడుస్తున్న శబ్దాలు నా పిల్లనగ్రోవి చేస్తుంది.

1 కొరింథీయులకు 16

పరిశుద్ధుల కోసం చందా

16 పరిశుద్ధుల కోసం సేకరించవలసిన చందాల విషయంలో ఏం చెయ్యాలో, గలతీయలో ఉన్న సంఘాలకు చెప్పాను. మీరు కూడా అదే విధంగా చెయ్యండి. తన సంపాదనను బట్టి ప్రతి ఒక్కడూ కొంత డబ్బు ఆదివారం రోజు దాచాలి. అలా చేస్తే నేను వచ్చిన రోజెల్లా చందానెత్తనవసరం ఉండదు. నేను వచ్చాక మీరెన్నుకొన్నవాళ్ళకు పరిచయ పత్రాలు వ్రాసి వాళ్ళతో మీరు సేకరించిన డబ్బును యెరూషలేము పంపుతాను. నేను కూడా వెళ్ళటం ఉచితమని అనిపిస్తే అంతా కలిసి వెళ్తాం.

పౌలు ప్రణాళికలు

నేను మాసిదోనియ ద్వారా వెళ్ళాలి కనుక అక్కడికి వెళ్ళి, మీ దగ్గరకు వస్తాను. అలా చేస్తే నేను మీతో కొంతకాలం గడపవచ్చు. బహుశా చలికాలమంతా అక్కడే ఉంటానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు. అందుకే ప్రస్తుతం మీ దగ్గరకు రావాలని లేదు. అలా చేస్తే, నేను వెళ్తూ మిమ్మల్ని చూసినట్లు మాత్రమే ఔతుంది. అలా కాక, ప్రభువు చిత్తమైతే మీతో కొంతకాలం గడపాలని ఉంది. నేను ఎఫెసులో పెంతుకొస్తు పండుగ దాకా ఉంటాను. అక్కడ ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక గొప్ప అవకాశం కలిగింది. కాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

10 తిమోతి మీ దగ్గరకు వస్తే అతనికి ధైర్యం చెప్పండి. ఎందుకంటే, నాలాగే అతడు కూడా ప్రభువు కార్యాన్ని చేస్తున్నాడు. 11 ఎవ్వరూ అతణ్ణి నిరాకరించకండి. అతని ప్రయాణం శాంతంగా సాగేటట్లు చూడండి. అతడు యితర సోదరులతో కలిసి నా దగ్గరకు రానున్నాడు. అతని కోసం నేను ఎదురు చూస్తున్నాను.

12 ఇక మన సోదరుడైన అపొల్లోను గురించి: నేను మిగతా సోదరులతో కలిసి మీ దగ్గరకు వెళ్ళమని చాలా వేడుకొన్నాను. అతనికి ప్రస్తుతం వెళ్ళటానికి కొంచెం కూడా యిష్టం లేదు. కాని తనకు మనస్సున్నప్పుడు అతడు వస్తాడు.

పౌలు తన ఉత్తరాన్ని ముగించటం

13 మెలకువగా ఉండండి. సంపూర్ణంగా విశ్వసించండి. ధైర్యంగా ఉండండి. శక్తిని వదులుకోకండి. 14 చేసే కార్యాలు ప్రేమతో చెయ్యండి.

15 అకయ ప్రాంతంలో విశ్వాసులుగా మారినవాళ్ళలో స్తెఫను కుటుంబం మొదటిది. ఇది మీకు తెలుసు. వాళ్ళు తమ జీవితాన్ని విశ్వాసుల సేవకు అంకితం చేసారు. 16 వాళ్ళను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. వాళ్ళనే కాక వాళ్ళతో కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్కణ్ణీ మీరు అనుసరించాలి.

17 స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు వచ్చి మీరు తీర్చలేని కొరత తీర్చారు. వాళ్ళు రావటం వల్ల నాకు ఆనందం కలిగింది. 18 వాళ్ళు మీ ఆత్మలకు, నా ఆత్మకు ఆనందం కలిగించారు. వాళ్ళను గౌరవించటం సమంజసం.

19 ఆసియ ప్రాంతంలోని సంఘాలు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. అకుల, ప్రిస్కిల్ల మరియు వాళ్ళింట్లో సమావేశమయ్యే సంఘము మీకు ప్రభువు పేరిట తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 20 ఇక్కడున్న సోదరులందరు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోదరుల ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకోండి. పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పండి.

21 నేను పౌలును. ఈ శుభాకాంక్షలు నా స్వహస్తాలతో వ్రాస్తున్నాను.

22 ప్రభువును ప్రేమించనివాడు శాపగ్రస్థుడు అవుతాడు!

ప్రభువా రమ్ము![a]

23 యేసు ప్రభువు యొక్క అనుగ్రహము మీకందరికి లభించుగాక.

24 యేసు క్రీస్తు పేరిట నా ప్రేమ మీకందరికీ తెలుపుతున్నాను. ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International