M’Cheyne Bible Reading Plan
మిడతలు
10 యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు. నేనే అతణ్ణి అతని అధికారులని మొండిగా చేస్తాను. నా మహత్తర అద్భుతాలను నేను వాళ్లకు చూపించాలని నేనే ఇలా చేసాను. 2 అలాగే ఈజిప్టులో నేను చేసిన అద్భుతాలు, ఇతర మహత్యాల విషయం మీరుకూడ మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు చెప్పవచ్చని వీటిని చేసాను. అప్పుడు నేనే యెహోవానని మీరంతా తెల్సుకొంటారు” అని చెప్పాడు.
3 మోషే, అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లారు. “‘ఎంత కాలం నీవు నాకు లోబడకుండా తిరస్కరిస్తావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల యెహోవా దేవుడు అంటున్నాడు అని వారు అతనితో చెప్పారు. 4 నీవు నా ప్రజలను వెళ్లనివ్వకపోతే, రేపు నీ దేశంలోకి మిడతలను తీసుకొస్తాను. 5 నేల అంతా మిడతలతో నిండి పోతుంది. నీకు నేల కనబడనంత విస్తారంగా మిడతలు ఉంటాయి. వడగళ్ల వానలో మిగిలింది యింకేమైనా ఉంటే, దాన్ని కాస్తా మిడతలు తినేస్తాయి. పొలాల్లో చెట్ల ఆకులన్నిటినీ మిడతలు తినేస్తాయి. 6 మీ ఇండ్లు మీ అధికారుల ఇండ్లు, ఈజిప్టులో ఉన్న మొత్తం ఇండ్లన్నీ మిడతలతో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు, తాతలు ఎన్నడైనా చూచిన వాటికంటే ఎక్కువ మిడతలు ఉంటాయి. ఈజిప్టులో మనుష్యులు నివాసం మొదలు పెట్టినప్పటినుండి ఎన్నడైనా ఉన్న మిడతల కంటె ఎక్కువ మిడతలు ఉంటాయి.’” తరువాత మోషే ఫరోను విడిచి, వెనుదిరిగాడు.
7 “ఇంకెన్నాళ్లు ఈ మనుష్యులు మనల్ని చిక్కుల్లో పెడతారు. మగవాళ్లందర్నీ వారి యెహోవా దేవుడ్ని ఆరాధించుకొనేందుకు వెళ్లనివ్వు. నీవు వాళ్లను వెళ్లనియ్యకపోతే, నీవు గుర్తించక ముందే, ఈజిప్టు నాశనం అయిపోతుంది” అని ఫరో అధికారులు అతనితో చెప్పారు.
8 కనుక మోషే అహరోనులను తన దగ్గరకు మళ్లీ తీసుకురమ్మని ఫరో తన అధికారులతో చెప్పాడు. “మీరు వెళ్లి మీ యెహోవా దేవుడ్ని ఆరాధించండి, అయితే ఎవరెవరు వెళ్లుచున్నది నాకు సరిగ్గా చెప్పండి?” అన్నాడు ఫరో.
9 “మా ప్రజలలో పడుచువాళ్లు, వృద్ధులు వెళ్తారు! మాతోబాటు మా కుమారులు మా కుమార్తెలను, మా గొర్రెల్ని మా పశువుల్ని కూడ తీసుకుపోతాం. ఇది మా యెహోవా పండుగ గనుక మేమంతా వెళ్తాము” అని జవాబిచ్చాడు మోషే.
10 ఫరో వాళ్లతో, “నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని వెళ్లనిచ్చే ముందు యెహోవా నిజంగా మీతో ఉండి తీరాలి. చూస్తోంటే, 11 మీరేదో దుర్మార్గం తలపెట్టి నట్లుంది. మగాళ్లు వెళ్లి యెహోవాను ఆరాధించవచ్చు. అసలు మీరడిగింది అదే. అంతేగాని మీరంతా మొత్తం వెళ్లి పోయేందుకు వీల్లేదు” అని చెప్పి మోషే, అహరోనులను ఫరో పంపించి వేసాడు.
12 యెహోవా మోషేతో “ఈజిప్టు మీద నీ చేయి ఎత్తు, మిడతలు వచ్చేస్తాయి. ఈజిప్టు మొత్తం నేలమీద మిడతలు ఆవరించేస్తాయి. వడగళ్లు నాశనం చేయకుండా మిగిలిన పంట అంతటినీ ఆ మిడతలు తినేస్తాయి” అని చెప్పాడు.
13 కనుక మోషే ఈజిప్టు దేశం మీద తన కర్ర ఎత్తగా తూర్పు నుండి బలంగా గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ రోజంతా, ఆ రాత్రి అంతా గాలి వీచింది. తెల్లవారేటప్పటికి ఈజిప్టు అంతటా మిడతల్ని తెచ్చి పడేసింది ఆ గాలి.
14 మిడతలు ఈజిప్టు దేశంలోకి ఎగిరివచ్చి నేలమీదంతటా కమ్మాయి. ఈజిప్టులో ఇది వరకు ఎన్నడూ లేనన్ని మిడతలు వచ్చేసాయి. పూర్వం ఎన్నడూ అన్ని మిడతలు ఉండలేదు. 15 నేల అంతా మిడతలు కమ్మేశాయి. దేశం అంతా చీకటి అయిపోయింది. వడగళ్లు నాశనం చేయకుండా మిగిల్చిన చెట్లలో ప్రతి ఫలాన్ని, నేలమీద ఉన్న ప్రతి మొక్కనూ మిడతలు తినేసాయి. మొత్తం ఈజిప్టులో ఎక్కడేగాని ఏ చెట్లకూ మొక్కలకూ ఒక్క ఆకు గూడ మిగల్లేదు.
16 వెంటనే మోషే అహరోనులను పిలిపించాడు ఫరో, “మీకు, మీ యెహోవా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసాను. 17 ఈ సారికి నా పాపాలు క్షమించండి. నా దగ్గర్నుండి ఈ మృత్యువును (మిడతలను) తీసివేయమని యెహోవాను అడగండి” అని చెప్పాడు ఫరో.
18 మోషే ఫరో దగ్గరనుండి వెళ్లిపోయి యెహోవాను ప్రార్థించాడు. 19 కనుక యెహోవా ఆ గాలిని మార్చేసాడు. పడమటినుండి గాలి బలంగా వీచేటట్టు చేసాడు. ఆ గాలి మిడతలన్నింటినీ ఎర్ర సముద్రంలోకి కొట్టేసింది. ఈజిప్టులో ఒక్క మిడతకూడ మిగల్లేదు. 20 అయితే యెహోవా ఫరోను మాత్రం ఇంకా మొండిగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో వెళ్లనివ్వలేదు.
అంధకారం
21 అప్పుడు యెహోవా, “నీ చెయ్యి పైకెత్తు, ఈజిప్టు చీకటిమయం అవుతుంది. చీకటిలో తడవులాడేటంత కటిక చీకటి కమ్ముతుంది” అని మోషేతో చెప్పాడు.
22 కనుక మోషే తన చేతిని పైకి ఎత్తగానే ఒక చీకటి మేఘం ఈజిప్టును ఆవరించేసింది. ఈజిప్టులో మూడు రోజుల పాటు ఆ చీకటి ఉండిపోయింది. 23 ఎవ్వరూ ఎవ్వర్నీ చూడలేక పోయారు. మూడు రోజుల వరకు ఎవ్వరూ వాళ్ల స్థానాలు విడిచి పెట్టలేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రదేశాలన్నింటిలో వెలుగు ఉంది.
24 ఫరో మళ్లీ మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు మీ పిల్లల్ని మీతో కూడా తీసుకొని వెళ్లొచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి” అన్నాడు.
25 “మా గొర్రెల్ని, పశువుల్ని మాతో కూడ తీసుకొని వెళ్లడమేకాదు, మేము వెళ్లేటప్పుడు మీరు కూడ కానుకలు, బలి అర్పణలు మాకు యివ్వాలి. మా యెహోవా దేవుడ్ని ఆరాధించడానికి ఈ బలులను మేము వాడుకొంటాము. 26 యెహోవాను ఆరాధించేందుకు మా జంతువుల్ని కూడ మేము తీసుకొని వెళ్తాము. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి పెట్టబడదు. యెహోవాను ఆరాధించేందుకు ఏమేమి కావాలో సరిగ్గా మాకూ ఇంకా తెలియదు. మేము వెళ్తున్న చోటికి చేరిన తర్వాతే అది మాకు తెలుస్తుంది. అందుచేత యివన్నీ మేము తీసుకెళ్లాల్సిందే” అని మోషే అన్నాడు.
27 యెహోవా ఫరోను ఇంకా మొండిగా చేసాడు. అందుచేత ఫరో ప్రజలను వెళ్లనివ్వలేదు. 28 అప్పుడు ఫరో మోషేతో, “పో, నా దగ్గర్నుండి వెళ్లిపో! నీవు మళ్లీ ఇక్కడకు రాకూడదు. నన్ను కలుసుకోవాలని మరోసారి వస్తే, నీవు చస్తావు” అన్నాడు.
29 “మోషే ఫరోతో, నీవు చెప్పింది నిజమే. నిన్ను చూడ్డానికి నేను మళ్లీ రాను” అని చెప్పాడు.
పాపాలు చెయ్యటం మానుకోండి
13 ఆ సమయంలో అక్కడున్న వాళ్ళలో కొందరు యేసుతో, “పిలాతు గలిలయ ప్రజల రక్తాన్ని బలి యిచ్చిన జంతువుల రక్తంతో కలిపాడని” చెప్పారు. 2 యేసు వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ విధంగా చనిపోయినందుకు వీళ్ళు యితర గలిలయ ప్రజలకంటే ఎక్కువ పాపం చేసారని మీ అభిప్రాయమా? 3 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి. 4 గోపురం మీదపడి సిలోయములో చనిపోయిన ఆ పద్దెనిమిది మంది సంగతేమిటి? యెరూషలేములో నివసించే ఇతర ప్రజలకు కాకుండా వీళ్ళకు ఈ గతి పట్టటం సమంజసమని మీ అభిప్రాయమా? 5 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి.”
పండ్లుకాయని అంజూరపు చెట్టు యొక్క ఉపమానం
6 ఆ తర్వాత యేసు ఈ ఉపమానం చెప్పాడు: “ఒకడు తన ద్రాక్షాతోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. పండ్లు కోసం ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళి అతడు తరచు చూస్తూవుండేవాడు. కాని అతనికి పండ్లు కనిపించలేదు. 7 అతడు తోటమాలితో, ‘ఈ చెట్టుకు పండ్లు కాస్తాయేమోనని మూడేళ్ళు చూసాను. కాని దానికి పండ్లు కాయలేదు. దాన్ని కొట్టేయి. అది అనవసరంగా భూమి సారాన్ని గుంజి వేస్తోంది’ అని అన్నాడు. 8 ఆ తోట మాలి, ‘అయ్యా! దీన్ని యింకొక సంవత్సరం వదిలెయ్యండి. నేను చుట్టూ పాదు త్రవ్వి ఎరువు వేస్తాను. 9 వచ్చే సంవత్సరం పంట కాస్తే, మంచిదే. కాయకపోతే అప్పుడు కొట్టి వేయవచ్చు’ అని అన్నాడు.”
యేసు విశ్రాంతిరోజున ఒక స్త్రీని నయం చేయటం
10 ఒక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. 11 దయ్యం పట్టటంవల్ల పద్దెనిమిది ఏళ్ళనుండి రోగంతో బాధపడ్తున్న స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగి ఉంది. ఆమె చక్కగా నిలువలేకపోయేది. 12 యేసు ఆమెను చూసి దగ్గరకు రమ్మని పిలిచి ఆమెతో, “అమ్మా! నీ రోగం నుండి నీకు విముక్తి కలిగించాను.” 13 అని అంటూ ఆమె మీద తన చేతుల్ని ఉంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టింది.
14 విశ్రాంతి తీసుకోవలసిన రోజున ఆమెకు నయం చేసినందుకు ఆ సమాజమందిరపు అధికారికి కోపం వచ్చింది. అతడు ప్రజలతో, “ఆరు రోజులు పని చెయ్యటానికి ఉన్నాయి. ఆ రోజుల్లో వచ్చి నయం చేయించుకోండి. విశ్రాంతి తీసుకోవలసిన రోజున కాదు” అని అన్నాడు.
15 యేసు, “మీరు కపటులు. విశ్రాంతి రోజు మీ ఎద్దును, గాడిదను కొట్టం నుండి విప్పుకొని వెళ్ళి నీళ్ళు త్రాగించరా? 16 ఈమె అభ్రాహాము కుమార్తె. పద్దెనిమిది సంవత్సరాలు సైతాను ఈమెను తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. మరి ఈమెకు విశ్రాంతి రోజు ఆ బంధంనుండి విముక్తి కలిగించనవసరం లేదంటారా?” అని అడిగాడు. 17 ఈ మాటలు, ఆయన విరోధులు సిగ్గుపడేటట్లు చేశాయి. కాని ఆయన చేసిన మహత్కార్యాల్ని చూసి ప్రజలు చాలా ఆనందించారు.
దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?
(మత్తయి 13:31-33; మార్కు 4:30-32)
18 ఆ తర్వాత యేసు, “దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి? 19 అది ఒక ఆవగింజ లాంటిది. దాన్ని ఒకడు తన తోటలో నాటాడు. అది పెరిగి చెట్టయింది. ఆకాశంలో ఎగిరే పక్షులు దాని కొమ్మల మీద వ్రాలాయి” అని అన్నాడు.
20 యేసు మళ్ళీ, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి?” అని అడిగి, 21 “అది పిండిలో కలిపే పులుపు లాంటిది. ఒక స్త్రీ ఆ పులుపును మూడు కుంచాల పిండిలో ఆ పిండంతా పులిసేదాకా కలిపింది” అని సమాధానం చెప్పాడు.
ఇరుకు ద్వారం
(మత్తయి 7:13-14, 21-23)
22 యేసు పట్టణాల్లో, పల్లెల్లో బోధిస్తూ యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. 23 ఒకడు, “ప్రభూ! కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు.
ఆయన వాళ్ళతో, 24 “దేవుని రాజ్యానికి ఉన్న ద్వారం యిరుకైనది. ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి గట్టి ప్రయత్నం చేయండి అనేకులు ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారు. కాని ప్రవేశించలేరు. 25 ఇంటి యజమాని లేచి తలుపులకు తాళం వేస్తాడు. మీరు బయట నిలబడి తలుపు తడుతూ ‘అయ్యా! మాకోసం తలుపు తెరవండి!’ అని వేడుకొంటారు. కాని ఆయన ‘మీరెవరో, ఏ ఊరినుండి వచ్చారో నాకు తెలియదు’ అని సమాధానం చెబుతాడు. 26 అప్పుడు మీరు, ‘మీతో కలిసి తిన్నాము. మీరు మా వీధుల్లో బోధించారు’ అని అంటారు. 27 కాని ఆయన, ‘మీరెవరో నాకు తెలియదు. ఎక్కడినుండి వచ్చారో తెలియదు. ఇక్కడినుండి వెళ్ళండి, మీరంతా దుర్మార్గులు’ అని అంటాడు.
28 “మీరు అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును ఇతర ప్రవక్తలను దేవుని రాజ్యంలో చూస్తారు. మిమ్మల్ని బయట పారవేసినందుకు మీరు దుఃఖిస్తారు. బాధననుభవిస్తారు. 29 ప్రజలు ఉత్తర దక్షిణాల నుండి, తూర్పు పడమరల నుండి దేవుని రాజ్యంలో జరుగుతున్న విందుకు వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. 30 ఇప్పుడు చివరి స్థానాల్లో కూర్చున్నవాళ్ళు అక్కడ ముందు స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు మొదటి స్థానాల్లో ఉన్న వాళ్ళు అక్కడ చివరి స్థానాల్లో కూర్చుంటారు” అని అన్నాడు.
యేసు యెరూషలేము విషయంలో దుఃఖించటం
(మత్తయి 23:37-39)
31 అప్పుడు కొందరు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, “ఈ ప్రాంతం వదిలి యింకెక్కడికైనా వెళ్ళు. హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు” అని అన్నారు.
32 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ రోజు, రేపు ప్రజలకు నయం చేస్తాను. దయ్యాల్ని వదిలిస్తాను. మూడవరోజు నేను చేయవలసిన కార్యం ముగిస్తుంది. వెళ్ళి ఈ విషయం ఆ గుంట నక్కతో చెప్పండి. 33 ప్రవక్త అయినవాడు యెరూషలేమునకు బయట మరణించకూడదు కదా. కనుక ఏది ఏమైనా ఈ రోజు, రేపు, ఎల్లుండి నా ప్రయాణం సాగిస్తూ ఉండవలసిందే.
34 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తలను చంపుతున్నావు. దేవుడు పంపిన ప్రచారకుల్ని రాళ్ళతో కొడుతున్నావు. కోడి తన పిల్లల్ని రక్షించటానికి రెక్కల క్రిందికి చేర్చుకొన్నట్లే నీ ప్రజలను నాదగ్గరకు చేర్చుకోవాలని ఎన్నో సార్లు అనిపించింది! కాని నీవు దానికి అంగీకరించలేదు! 35 నీ ఇల్లు పాడుబడుతుంది. ‘ప్రభువు పేరిట వచ్చినవాడు ధన్యుడు’ అని నీవనేవరకు నీవు నన్ను చూడవు.”
28 “మనుష్యులకు వెండి లభించే గనులు ఉన్నాయి.
మనుష్యులు బంగారాన్ని కరిగించి, దానిని శుభ్రం చేసే స్థలాలు ఉన్నాయి.
2 మనుష్యులు భూమినుండి ఇనుమును తవ్వుతారు.
బండల నుండి రాగి కరిగించబడుతుంది.
3 పనివాళ్లు గుహల్లోకి దీపం తీసుకొని వస్తారు.
ఆ గుహల్లో లోపలికి వారు వెదుకుతారు. లోపలి చీకటిలో బండల కోసం వారు వెదుకుతారు.
4 మనుష్యులు నివసించే చోటికి దూరంగా పనివాళ్లు గోతులు తవ్వుతారు.
మరి ఏ మనిషీ కూడ గోతులను ఎన్నడూ తాకలేదు.
పనివాడు లోతైన ఆ గోతుల్లోనికి తాళ్లతో దిగేటప్పుడు అతడు యితరులకు చాలా దూరంలో ఉంటాడు.
5 భూమిపై నుండి ఆహారం వస్తుంది.
కానీ భూమి క్రింద, వస్తువులను మంట మార్చివేసినట్టు,
అది మార్చివేయబడుతుంది.
6 నేలక్రింద బండలలో నీల రత్నాలు లభ్యమవుతాయి.
నేల కింద మట్టిలో బంగారం ఉంది.
7 ఆహారం కోసం జంతువులను తినే పక్షులకు భూమికింద మార్గాలు తెలియవు.
డేగ కూడా ఈ మార్గం చూడదు.
8 క్రూర మృగాలు ఈ మార్గంలో నడవలేదు.
సింహాలు ఈ మార్గంలో పయనించలేదు.
9 పనివాళ్లు కఠిన శిలలను తవ్వుతారు.
ఆ పనివాళ్లు పర్వతాలను తవ్వి, వాటిని ఖాళీ చేస్తారు.
10 పనివాళ్లు బండల్లోనుంచి సొరంగాలు తవ్వుతారు.
బండల్లోని ఐశ్వర్యాలు అన్నింటినీ వాళ్లు చూస్తారు.
11 నీళ్లు ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్లు ఆన కట్టలు కడతారు.
దాగి ఉన్న వాటిని వారు వెలుగు లోనికి తీసికొని వస్తారు.
12 “అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?
గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
13 జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు.
భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు.
14 ‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది.
‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది.
15 అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము.
జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు.
16 ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని,
నీలంతో గాని, అది కొనబడేది కాదు.
17 బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది.
బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు.
18 జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది.
జ్ఞానం కెంపులకంటె ఖరీదైనది.
19 ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు.
మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు.
20 “అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి?
అవగాహన చేసికోవటం నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
21 భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది.
ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు.
22 ‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’
అని మరణం, నాశనం చెబుతాయి.
23 “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు.
జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు.
24 భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు.
ఆకాశాల క్రింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు.
25 గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు,
మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు,
26 వర్షాన్ని ఎక్కడ కురిపించాలి,
ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు
27 అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు
దానిని పరీక్షించిన సమయం అవుతుంది.
జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు.
28 ‘యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది.
చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది’”
అని దేవుడు ప్రజలతో చెప్పాడు.
వరాలు, వాటి ప్రాముఖ్యత
14 కనుక ప్రేమ మార్గాన్ని అనుసరించండి. ఆత్మీయ శక్తి లభించాలని, ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం లభించాలని ఆశించండి. 2 తనకు తెలియని భాషలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. మానవులతో కాదు. అతని మాటలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు పవిత్రాత్మ శక్తితో రహస్యాలను చెబుతూ ఉంటాడు. 3 కాని దైవసందేశం చెప్పేవాడు విశ్వాసాన్ని బలపరచాలని ప్రజల్లో ఉత్సాహము, శాంతి కలిగించాలని దైవసందేశం చెపుతాడు. 4 తనకు తెలియని భాషలో మాట్లాడేవాడు తనకు మాత్రమే మేలు కలిగించుకొంటాడు. కాని దైవసందేశం చెప్పేవాడు సంఘానికి మేలు కలిగిస్తాడు.
5 మీలో ప్రతి ఒక్కడూ తెలియని భాషల్లో మాట్లాడితే నాకు యిష్టమే. కాని మీరు దైవసందేశం చెప్పటం నాకు ఇంకా ఎక్కువ యిష్టం. తెలియని భాషల్లో మాట్లాడేవాని మాటలకు అర్థం విడమర్చి చెప్పేవాడు ఉంటే సంఘానికి లాభం కలుగుతుంది. అది సంభవించకపోతే తెలియని భాషల్లో మాట్లాడేవానికన్నా దైవసందేశం చెప్పేవాడే గొప్ప.
6 సోదరులారా! నేను అక్కడికి వచ్చి తెలియని భాషలో మాట్లాడితే మీకు ఏం లాభం కలుగుతుంది? నా ద్వారా మీకు దేవుడు ఒక క్రొత్త విషయం తెలియచెయ్యాలి. లేక నా ద్వారా మీకు జ్ఞానం కలగాలి. లేక మీకు నా ద్వారా దైవసందేశం తెలియాలి. లేక నేను మీకు ఒక క్రొత్త విషయం బోధించగలగాలి. అలా జరగనట్లయితే లాభం ఏమిటి? 7 పిల్లన గ్రోవి, వీణ వంటి ప్రాణం లేని వస్తువులు కూడా శబ్దం చేస్తాయి. వాటి స్వరాల్లో భేదం లేకుంటే ఏ వాయిద్యం వాయిస్తున్నారో ఎట్లా తెలుస్తుంది? 8 బాకా సక్రమంగా ఊది పిలవకుంటే యుద్ధానికి ఎవరు సిద్ధమౌతారు?
9 అదే విధంగా మీ నాలుకతో అర్థం అయ్యే పదాలు మాట్లాడితే తప్ప మీరేం మాట్లాడుతున్నారో యితరులకు ఎట్లా అర్థం అవుతుంది? మీరు గాలిలో మాట్లాడినట్లు ఉంటుంది. 10 ప్రపంచంలో చాలా రకాల భాషలు ఉన్నాయి. సందేహం లేదు. కాని అర్థం లేని భాష ఏదీ లేదు. 11 ఒకడు మాట్లాడే విషయం నేను అర్థం చేసుకోలేకపోతే, నేను అతనికి పరదేశీయునిగా, అతడు నాకు పరదేశీయునిగా ఉంటాము. 12 మీకు ఆత్మీయ శక్తి లభించాలని ఆసక్తి ఉంది. కనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను అమితంగా కోరుకొండి.
13 కనుక తనకు తెలియని భాషల్లో మాట్లాడేవాడు తాను మాట్లాడిన వాటికి అర్థం చెప్పగలిగే శక్తినివ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి. 14 ఎందుకంటే నేను నాకు తెలియని భాషల్లో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది కాని నా బుద్ధి అందులో పాల్గొనదు. 15 మరి నేను ఏం చెయ్యాలి? నేను నా ఆత్మతో మాత్రమే కాక, నా బుద్ధితో కూడా ప్రార్థిస్తాను. నా ఆత్మతోను నా మనస్సుతోను కూడా పాడుతాను. 16 మీరు దేవుణ్ణి ఆత్మతో స్తుతిస్తున్నారనుకోండి. మీ సమావేశంలో సభ్యుడు కానివాడుంటే, అతనికి మీరు ఏమంటున్నారో తెలియదు. కనుక, మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎప్పుడు, “ఆమేన్” అని అనాలో అతనికి ఎట్లా తెలిస్తుంది? 17 మీరు సక్రమంగా స్తుతించినా ఆ వ్యక్తికి దాని వల్ల మేలు కలుగదు.
18 మీ అందరికంటే ఎక్కువగా యితర భాషల్లో మాట్లాడగలందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. 19 నేను సంఘంలో మాట్లాడినప్పుడు తెలియని భాషల్లో పదివేల పదాలు మాట్లాడటం కన్నా నాకు తెలిసిన భాషల్లో ఐదు పదాలు ఉపయోగించి బోధించటం ఉత్తమమని నా అభిప్రాయము.
20 సోదరులారా! చిన్నపిల్లలవలె ఆలోచించకండి. చెడు విషయంలో చిన్నపిల్లల్లా ఉండండి. కాని ఆలోచించేటప్పుడు పెద్దవాళ్ళలా ఆలోచించండి. 21 లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:
“ఇతర భాషలు మాట్లాడేవాళ్ళ ద్వారా,
విదేశీయుల పెదాల ద్వారా
వీళ్ళతో నేను మాట్లాడుతాను.
అయినా వాళ్ళు నా మాటలు వినరు.”(A)
22 తెలియని భాషల్లో మాట్లాడగల శక్తివుంటే, అది విశ్వాసం లేనివాళ్ళకు రుజువుగా ఉంటుంది. కాని ఆ రుజువు విశ్వాసం ఉన్నవాళ్ళకు అవసరం లేదు. అయినా దైవసందేశం విశ్వాసం ఉన్నవాళ్ళకే గాని, విశ్వాసం లేనివాళ్ళకు కాదు. 23 సంఘంలో ఉన్నవాళ్ళందరూ ఒకేచోట సమావేశమై, తమకు తెలియని భాషల్లో మాట్లాడటం మొదలు పెడతారనుకోండి. అప్పుడు సభ్యులు కానివాళ్ళు లేక విశ్వాసం లేనివాళ్ళు ఆ సమావేశంలో ఉంటే మీకు పిచ్చి ఎక్కిందని అనుకోరా? 24 దానికి మారుగా మీరంతా దైవసందేశాన్ని చెపుతున్నారనుకోండి. అప్పుడు విశ్వాసం లేనివాడో లేక సభ్యుడు కానివాడో సమావేశంలో ఉంటే మీరు చెపుతున్నది విని తప్పు తెలుసుకుంటాడు. అంటే దైవసందేశం అతనిపై తీర్పు చెప్పిందన్నమాట. 25 అతని మనస్సులో ఉన్న ఆలోచనలు బయట పడతాయి. అతడు మోకరిల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా యిక్కడ మీతో ఉన్నాడు” అని అంగీకరిస్తాడు.
నియమాలు
26 సోదరులారా! యిక మేము ఏమని చెప్పాలి? మీరంతా సమావేశమైనప్పుడు ఒకడు స్తుతిగీతం పాడుతాడు. మరొకడు ఒక మంచి విషయాన్ని బోధిస్తాడు. ఇంకొకడు దేవుడు తనకు తెలియచేసిన విషయాన్ని చెపుతాడు. ఒకడు తనకు తెలియని భాషలో మాట్లాడుతాడు. మరొకడు దాని అర్థం విడమరచి చెపుతాడు. ఇవన్నీ సంఘాన్ని బలపరచటానికి జరుగుతున్నాయి. 27 తెలియని భాషల్లో మాట్లాడగలిగేవాళ్ళు ఉంటే, ఇద్దరు లేక ముగ్గురి కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఒకని తర్వాత ఒకడు మాట్లాడాలి. దాని అర్థం విడమర్చి చెప్పగలవాడు ఉండాలి. 28 అర్థం చెప్పేవాడు లేకపోయినట్లయితే తెలియని భాషలో మాట్లాడేవాడు మాట్లాడటం మానెయ్యాలి. అతడు తనలో తాను మాట్లాడుకోవచ్చు. లేదా దేవునితో మాట్లాడవచ్చు.
29 దైవసందేశాన్ని యిద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చు. మిగతావాళ్ళు చెప్పినదాన్ని జాగ్రత్తగా గమనించాలి. 30 ఒకవేళ అక్కడ కూర్చున్నవాళ్ళకు దేవుడు తన సందేశాన్ని చెప్పమంటే, మాట్లాడుతున్నవాడు మాట్లాడటం ఆపివెయ్యాలి. 31 అలా చేస్తే ఒకరి తర్వాత ఒకరు దైవసందేశం చెప్పవచ్చు. అలా చెయ్యటం వల్ల అందరూ నేర్చుకొంటారు. ప్రతీ ఒక్కరికి ప్రోత్సాహం కలుగుతుంది. 32 దైవసందేశం చెప్పేవాళ్ళు తమ ప్రేరణను అదుపులో పెట్టుకోవచ్చు. 33 దేవుడు శాంతి కలుగ చేస్తాడు. అశాంతిని కాదు.
34 ఇతర సంఘాలలో జరుగుతున్నట్లు స్త్రీలు సమావేశాలలో మౌనం వహించాలి. మాట్లాడటానికి వాళ్ళకు అధికారం లేదు. ధర్మశాస్త్రంలో, “స్త్రీలు అణకువతో ఉండాలి” అని వ్రాయబడి ఉంది. 35 స్త్రీలు సంఘంలో మాట్లాడటం అవమానకరం. కనుక ఒకవేళ స్త్రీ ఒక విషయాన్ని గురించి తెలుసుకోదలిస్తే, తమ ఇండ్లలో తమ భర్తల్ని అడిగి తెలుసుకోవాలి.
36 దైవసందేశం మీ నుండి ప్రారంభం కాలేదు. అది మీకు మాత్రమే లభించలేదు. 37 దేవుడు తన ద్వారా సందేశం పంపాడన్నవాడు, లేక తనలో ఆత్మీయ శక్తి ఉందని అనుకొన్నవాడు నేను మీకు వ్రాసినది ప్రభువు ఆజ్ఞ అని గుర్తించాలి. 38 అతడు యిది గుర్తించకపోతే దేవుడు అతణ్ణి గుర్తించడు.[a]
39 సోదరులారా! దైవసందేశం చెప్పాలని ఆశించండి. తెలియని భాషలో మాట్లాడేవాళ్ళను ఆపకండి. 40 కాని అన్నిటినీ చక్కగా, సక్రమమైన పద్ధతిలో జరపండి.
© 1997 Bible League International