Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 8

మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఫరో దగ్గరకు వెళ్లి, ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు, అని యెహోవా చెబుతున్నాడని అతనితో చెప్పు. వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను ఈజిప్టును కప్పలతో నింపేస్తాను నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నదిలోనుంచి వచ్చి మీ ఇళ్లలో దూరుతాయి. అవి మీ పడక గదుల్లో పడకల మీద వుంటాయి. మీ అధికారుల ఇళ్లలో, మీ వంట పాత్రల్లో, నీళ్ల బానల్లో కప్పలే ఉంటాయి. నీవు, నీ ప్రజలు, నీ అధికారులు అందరి మీదికీ కప్పలు వచ్చేస్తాయి.’”

అప్పుడు మోషేతో యెహోవా, “కాలువలు, నదులు, చెరువులు, అన్నింటి మీదికీ తన చేతి కర్రను ఎత్తమని అహరోనుతో చెప్పు. కప్పలు బయటకు వచ్చి ఈజిప్టు అంతటా నిండుతాయి” అని చెప్పాడు.

కనుక ఈజిప్టు జలాలపై అహరోను తన చేయి ఎత్తగా నీళ్లలో నుండి కప్పలు బయటకు వచ్చి, ఈజిప్టు దేశమంతా నిండిపోవటం మొదలయింది.

మాయలు చేసే ఈజిప్టు మాంత్రికులు కూడా అలాగే చేసారు, కనుక ఈజిప్టు మీదికి ఇంకా ఎక్కువ కప్పలు వచ్చాయి.

మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు, “నా దగ్గర్నుండి, నా ప్రజల దగ్గర్నుండి కప్పలను తీసివేయుమని యెహోవాను అడగండి. యెహోవాకు బలులు అర్పించేందుకు ప్రజల్ని నేను వెళ్లనిస్తాను” అన్నాడు ఫరో.

ఫరోతో మోషే ఇలాగు చెప్పాడు, “కప్పలు ఎప్పుడు పోవాలనుకుంటున్నావో నాతో చెప్పు, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ అధికారుల కోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్లను విడిచిపెట్టి నదిలోనే ఉండిపోతాయి. (కప్పలు ఎప్పుడు నిన్ను వదిలి పోవాలనుకొంటున్నావు?)”

10 “రేపే” అన్నాడు ఫరో.

మోషే అన్నాడు: “నీవు చెప్పినట్టే జరుగుతుంది. మా దేవుడైన, యెహోవాలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరని నీవు తెలుసుకొంటావు. 11 నిన్ను, నీ ఇంటిని, నీ అధికారుల్ని, నీ ప్రజల్ను కప్పలు విడిచిపోతాయి. ఆ కప్పలు నదిలోనే ఉండిపోతాయి.”

12 మోషే, అహరోను ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయారు. ఫరో మీదికి ఆయన పంపిన కప్పల్నిగూర్చి మోషే యెహోవాకు మొరపెట్టాడు. 13 మోషే అడిగిన ప్రకారం దేవుడు చేసాడు. ఇళ్లలో, వాకిళ్లలో, పొలాల్లో కప్పలు చచ్చాయి. 14 అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది. 15 కప్పల బాధ వదలిపోవడం చూచి ఫరో మళ్లీ మొండికెత్తాడు. అతను ఏమి చెయ్యాలని మోషే అహరోనులు అడిగారో, అలా చేయలేదు. ఇదంతా సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.

పేలు

16 యెహోవా మోషేతో ఇలా అన్నాడు “నీ కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టు ఈజిప్టుదేశ వ్యాప్తంగా దుమ్ము పేలు అవుతాయి. అని అహరోనుతో చెప్పు.”

17 వారు అలా చేసారు. అహరోను తన చేతి కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టాడు. ఈజిప్టు అంతటా దుమ్ము పేలు అయింది. మనుష్యుల మీద జంతువుల మీద పేలు ఎక్కేసాయి.

18 ఈజిప్టు మాంత్రికులు వారి మాయల్ని ప్రయోగించి వారు కూడ అలా చేయాలని ప్రయత్నం చేసారు. కానీ దుమ్ము నుండి పేలు వచ్చేటట్టు చేయలేక పోయారు. జంతువుల మీద, మనుష్యుల మీద పేలు అలాగే ఉండిపోయాయి.

19 కనుక ఇది యెహోవా శక్తివల్లే జరిగిందని మాంత్రికులు ఫరోతో చెప్పారు. కాని ఫరో వారు చెప్పింది ఒప్పుకోలేదు. ఇదీ సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.

ఈగలు

20 యెహోవా మోషేతో ఇలా అన్నాడు, “ఉదయాన్నే లేచి ఫరో దగ్గరకు వెళ్లు. ఫరో నదికి వెళ్తాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్లనివ్వు’ అని యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు. 21 ‘నీవు నా ప్రజల్ని వెళ్లనివ్వక పోతే, నీ ఇండ్లలోకి ఈగలు వచ్చేస్తాయి, నీ మీద, నీ అధికారుల మీద ఈగలు పట్టేస్తాయి. ఈజిప్టు గృహాలన్నీ ఈగలతో నిండిపోతాయి. ఈజిప్టు దేశమంతా ఈగలతో నిండిపోతుంది.’ 22 అయితే ఈజిప్టు ప్రజలను చూచినట్టు మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూడను. నా ప్రజలు నివసిస్తున్న గోషెనులో మాత్రం ఈగలు ఉండవు. ఈ విధంగా నేను అంటే యెహోవాను ఈ భూమి మీద ఉన్నానని నీవు తెలుసుకొంటావు. 23 కనుక రేపు నా ప్రజల్ని నీ ప్రజల కంటే వేరుగా చూస్తాను. అదే నా రుజువు.”

24 అందుచేత యెహోవా అలాగే చేసాడు. ఈజిప్టు మీదికి విస్తారంగా ఈగలు వచ్చేసాయి. ఫరో ఇంట్లోను, అతని అధికారుల ఇండ్లన్నింటిలోను ఈగలు ఉన్నాయి. ఈజిప్టు అంతటా ఈగలు ముసురుకొన్నాయి. ఈగలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. 25 కనుక మోషే అహరోనుల్ని ఫరో పిలిపించాడు. “ఈ దేశంలోనే ఇక్కడే మీ దేవునికి బలులు అర్పించండి” అని ఫరో వాళ్లతో చెప్పాడు.

26 కానీ మోషే అన్నాడు, “అలా చేయటం సరికాదు. మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించటం చాలా భయంకర విషయం అని ఈజిప్టు వాళ్లు అనుకొంటారు. ఈజిప్టు వాళ్లకు కనబడేటట్టు మేము గనుక ఇలా చేస్తే, ఈజిప్టు వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. 27 మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోకి వెళ్లనిచ్చి, అక్కడ మా యెహోవా దేవునికి బలులు అర్పించనివ్వు. యెహోవా మమ్మల్ని ఇలాగే చేయమన్నాడు.”

28 అందుకు ఫరో, “మీరు వెళ్లి అరణ్యంలో మీ యెహోవా దేవునికి బలులు అర్పించనిస్తాను. కానీ మీరు మాత్రం మూడు రోజుల ప్రయాణమంత దూరంకంటే ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇక పోయి నాకోసం ప్రార్థించు.” అని మోషేతో అన్నాడు.

29 “సరే రేపు నీ నుండి, నీ ప్రజలనుండి, నీ అధికారుల దగ్గర్నుండి ఈగలను తొలిగించమని నేను పోయి యెహోవాను వేడుకొంటాను. కాని, ప్రజలు బలులు అర్పించకుండా నీవు మాత్రం ఆపు చేయకూడదు” అన్నాడు మోషే.

30 కనుక మోషే ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయి యెహోవాకు ప్రార్థన చేసాడు. 31 మోషే కోరినట్టు యెహోవా చేసాడు. ఫరోనుండి, అతని ప్రజలనుండి అధికారుల నుండి ఈగలను యెహోవా తొలగించాడు. ఈగలు ఒక్కటి కూడా మిగుల లేదు. 32 అయితే ఫరో మళ్లీ మొండికెత్తి ప్రజలను వెళ్ల నివ్వలేదు.

లూకా 11

యేసు ప్రార్థన గురించి బోధించటం

(మత్తయి 6:9-15)

11 ఒక రోజు యేసు ఒక చోట ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థించటం ముగించాక ఆయన శిష్యుల్లో ఒకడు, “ప్రభూ! యోహాను తన శిష్యులకు ప్రార్థించటం నేర్పించినట్లు మాక్కూడా ప్రార్థించటం నేర్పండి” అని అడిగాడు.

ఆయన వాళ్ళతో, “మీరు ఈ విధంగా ప్రార్థించాలి:

‘తండ్రీ! నీ పేరు పవిత్రంగానే ఉండాలి!
నీ రాజ్యం రావాలి!
మాకు ప్రతి రోజు ఆహారం యివ్వు!
మా పట్ల పాపం చేసిన వాళ్ళను మేము క్షమించినట్లు
    మా పాపాలు క్షమించు.
మమ్మల్ని శోధనలో పడనివ్వవద్దు!’”

నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము

(మత్తయి 7:7-11)

5-6 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “ఒక వేళ మీలో ఒకడు అర్ధరాత్రివేళ తన స్నేహితుని యింటికి వెళ్ళి, ‘నా స్నేహితుడు ఒకడు అకస్మాత్తుగా మా యింటికొచ్చాడు. మా యింట్లో తినటానికి ఏమి లేదు. మూడు రొట్టెలుంటే యిస్తావా?’ అని అడిగాడనుకొండి. ఆ స్నేహితుడు యింటి నుండి బయటకు రాకుండా, ‘నేను, నా పిల్లలు పడుకున్నాం. తలుపులు కూడా తాళం వేసాం. అనవసరంగా బాధ పెట్టొద్దు. అయినా యిప్పుడు లేచి నేను రొట్టెలివ్వలేను’ అని అన్నాడనుకోండి. నేను చెప్పేదేమిటంటే, అతడు తన స్నేహితుడైనందుకు రొట్టెలు యివ్వకపోయినా మొండిగా అడగటం వల్ల తప్పక లేచి అతడడిగిన రొట్టెలు యిస్తాడు. కనుక, నేను మీకు చెప్పేదేమంటే; అడగండి, మీకు లభిస్తుంది. వెతకండి దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకోసం తెరుచుకుంటుంది. 10 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన వానికి దొరుకుతుంది. తలుపు తడితే అది అతని కోసం తెరుచుకుంటుంది. 11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు? 12 లేక గ్రుడ్డునడిగితే తేలునిస్తాడు? 13 మీరు చెడ్డవాళ్లైనా మీ కుమారులకు మంచి బహుమతులు ఎట్లా యివ్వాలో మీకు తెలుసు. కనుక పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగినవాళ్ళకు పవిత్రాత్మను తప్పక యిస్తాడని గ్రహించండి” అని చెప్పాడు.

యేసుని శక్తి దేవునినుండి వచ్చినది

(మత్తయి 12:22-30; మార్కు 3:20-27)

14 ఒక రోజు యేసు ఒక మూగ దయ్యాన్ని పారద్రోలుతూ ఉన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోగానే అది పట్టిన మనిషి మాట్లాడటం మొదలు పెట్టాడు. అది చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. 15 కొందరు, “బయెల్జెబూలు అనే దయ్యాలరాజు ద్వారా అతడు దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.

16 మరి కొందరు యేసును పరీక్షించుచూ ఒక అద్భుతం పరలోకం నుండి చూపుమని అడిగారు. 17 యేసుకు వాళ్ళ అభిప్రాయం తెలిసిపోయింది. అందువల్ల వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “చీలికలు కలిగిన యిల్లు పడిపోతుంది. 18 సైతానురాజ్యంలో చీలికలు కలిగితే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఇలా ఎందుకు అంటున్నానంటే బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాల్ని వదిలిస్తున్నానని మీరు అంటున్నారు. 19 నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాల్ని వదిలిస్తున్నట్లైతే, మీ వాళ్ళు దేని సహయంతో దయ్యాల్ని వదిలిస్తున్నారు? అందువల్ల మీ వాదన తప్పని మీ వాళ్ళే రుజువు చేస్తున్నారు. 20 కాని నేను దైవశక్తితో దయ్యాల్ని వదిలిస్తున్నాను కనుక, దేవుని రాజ్యం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తొంది.

21 “ఒక బలవంతుడు ఆయుధాల్ని ధరించి తన యింటిని కాపలా కాస్తే అతని యింట్లోని వస్తువులు భధ్రంగా ఉంటాయి. 22 కాని అతని కన్నా బలవంతుడు వచ్చి మీదపడి అతన్ని ఓడిస్తే అతడిన్నాళ్ళు నమ్ముకున్న ఆయుధాలన్నీ ఇంటివానియొద్ద నుండి తీసుకొని, ఆదోచుకొన్న వస్తువుల్ని అందరికి పంచి పెడ్తాడు.

23 “నాతో ఉండని వాడు నాకు వ్యతిరేకంగా ఉన్న వానితో సమానము. నాతో కలిసి గొఱ్ఱెల్ని ప్రోగుచేయటానికి సహాయం చెయ్యనివాడు వాటిని చెదరగొట్టిన వానితో సమానము.

శూన్యమై ఉండుట అపాయము

(మత్తయి 12:43-45)

24 “దయ్యము ఒక మనిషి నుండి వెలుపలికి వచ్చాక విశ్రాంతి కోసం నీరులేని స్థలాల్లో వెతుకుతుంది. కాని దానికి విశ్రాంతి లభించదు. అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన యింటికి వెళ్తాను’ అని అనుకుంటుంది. 25 అక్కడికి వెళ్ళాక ఆ యిల్లు ఊడ్చబడి వుండటం ఎక్కడి వస్తువులక్కడ సక్రమంగా వుండటం చూస్తుంది. 26 అది మళ్ళీ బయటికి వెళ్ళి తనకన్నా దుర్మార్గులైన ఏడు దయ్యాలను తనవెంట తీసుకువస్తుంది. ఆ దయ్యాలన్నీ కలిసి ఆ యింట్లో నివసించటానికి వెళ్తాయి. అప్పుడు ఆ మనిషి స్థితి మొదటిస్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది.”

దేవుడు దీవించు జనులు

27 యేసు ఈ విషయాలు చెబుతుండగా ప్రజల్లో ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను కని, పెంచిన ఆ తల్లి ధన్యురాలు” అని అన్నది.

28 ఆయన, “అవునుగాని, దైవసందేశం విని దాన్ని పాటించే వాళ్ళు ఇంకా ధన్యులు” అని సమాధానం చెప్పాడు.

కొందరు యేసు అధికారాన్ని సందేహించటం

(మత్తయి 12:38-42; మార్కు 8:12)

29 ప్రజల గుంపు పెరుగుతూ పోయింది. యేసు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఈ కాలం వాళ్ళు చెడ్డవాళ్ళు, గనుక అద్భుతాలు అడుగుతారు. దేవుడు యోనాను పంపి యిచ్చిన రుజువు తప్ప, మరే రుజువు మీకు యివ్వబడదు. 30 ఎందుకంటే, నీనెవె ప్రజలకు యోనా ఏ విధంగా ఒక రుజువో అదే విధంగా మనుష్యకుమారుడు ఈ తరం వాళ్ళకు ఒక రుజువు.

31 “దక్షిణ దేశపు రాణి సొలొమోను రాజు బోధిస్తున్న జ్ఞానాన్ని వినటానికి చాలా దురం నుండి వచ్చింది. కాని యిప్పుడు సొలోమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. ఈనాటి ప్రజలు ఆయన మాటలు వినటం లేదు. కనుక తీర్పు చెప్పబడే రోజు ఆ రాణి వీళ్ళతో సహా నిలబడి వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తుంది.

32 “నీనెవె ప్రజలు యోనా బోధనలు విని మారుమానస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజున వాళ్ళు ఈనాటి ప్రజలతో సహా నిలుచొని వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తారు. కాని యిప్పుడు యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు.

దేహం యొక్క వెలుగు

(మత్తయి 5:15; 6:22-23)

33 “దీపాన్ని వెలిగించి, యింటికి వచ్చే పోయే వాళ్ళకు కనిపించేలా ఒక ఎత్తైన బల్ల మీద పెడ్తాము కాని, గంప క్రింద దాచి ఉంచము. 34 మీ కళ్ళు దేహానికి దీపం లాంటివి. మీ కళ్ళు బాగుంటే మీ దేహమంతా కాంతితో వెలుగుతుంది. కాని, అవి చెడిపోతే, మీ దేహమంతా చీకటైపోతుంది. 35 అందువలన మీలో ఉన్న వెలుగు చీకటైపోకుండా చూసుకొండి. 36 మీ దేహమంతా కొంచెం కూడా చీకటిలో లేకుండా వెలుగుతూ ఉంటే అది సంపూర్ణంగా వెలుగుతూ ఉంటుంది. ఆ దేహం దీపపు వెలుగు ప్రకాశించినట్లు ప్రకాశిస్తుంది.”

యేసు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని విమర్శించటం

(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 20:45-47)

37 యేసు మాట్లాడటం ముగించాడు. ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి ఆహ్వానించాడు. యేసు అతని యింటికి వెళ్ళి భోజనానికి కూర్చుని ఉన్నాడు. 38 యేసు భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవటం గమనించి పరిసయ్యునికి ఆశ్చర్యం వేసింది. 39 అప్పుడు ప్రభువు అతనితో, “మీ పరిసయ్యులు గిన్నెల్ని, పళ్ళేల్ని వెలుపలి భాగం శుభ్రం చేస్తారు. కాని లోపల దురాశ, దుష్టత్వము నిండివుంటాయి. 40 మూర్ఖులారా! వెలుపలి భాగం సృష్టించిన వాడే లోపలి భాగం సృష్టించలేదా? 41 మీరు దాచుకున్న వాటిని పేదవాళ్ళకు దానం చెయ్యండి. అప్పుడు మీరు పూర్తిగా శుభ్రమౌతారు.

42 “మీరు మీ తోటలో పండిన పుదీనా, సదాప మొదలగు కూరగాయల యొక్క పదవవంతు దేవునికి యిస్తారు. కాని న్యాయాన్ని, దేవుని ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక మీకు శ్రమ. పదవవంతు ఇవ్వటం మానుకోకుండా న్యాయాన్ని, దేవుని ప్రేమను కూడా అలవరచుకోవలసింది.

43 “మీరు సమాజ మందిరాల్లో ఉన్నత స్థలాల్లో కూర్చోవటానికోసం ప్రాకులాడుతారు. దారి మీద వెళ్తూవుంటే ప్రజలు గౌరవమివ్వాలని ఆశిస్తారు. కనుక మీకు శ్రమ తప్పదు. 44 ప్రజలు తమకు తెలియకుండా త్రొక్కుతూ నడిచే సమాధుల్లాంటి వాళ్ళు మీరు. మీకు శ్రమ తప్పదు” అని అన్నాడు.

45 ధర్మశాస్త్రంలో పాండిత్యం ఉన్న ఒకడు లేచి, “బోధకుడా! మీరీ విధంగా మాట్లాడి మమ్మల్ని కూడా అవమానిస్తున్నారు” అని అన్నాడు.

46 యేసు, “ధర్మశాస్త్ర పండితులారా! మీరు ప్రజలపై వాళ్ళు మోయలేని భారం వేస్తున్నారు. కాని వాటిని లేపటానికి మీరు ఒక్క వ్రేలు కూడా కదల్చరు. కనుక మీకు శ్రమ తప్పదు. 47 మీరు ప్రవక్తల కోసం సమాధులు కట్టిస్తారు. కాని మీ పూర్వికులు వాళ్ళను చంపారు. కనుక మీకు శిక్ష తప్పదు. 48 అంటే పూర్వికులు చేసిన దాన్ని అంగీకరిస్తున్నట్లు నిరూపించుకొంటున్నారన్న మాట. వాళ్ళు ప్రవక్తల్ని చంపారు. మీరు సమాధులు కట్టించారు. 49 అందువల్లే దేవుడు దివ్యజ్ఞానంతో ఈ విధంగా చెప్పాడు: ‘నేను వాళ్ళకోసం ప్రవక్తల్ని, అపొస్తలులను పంపుతాను. కొందర్ని వాళ్ళు చంపుతారు. మిగతా వాళ్ళను హింసిస్తారు.’

50 “అందువలన ప్రపంచం పుట్టిన నాటినుండి ప్రవక్తలు కార్చిన రక్తానికి ఈ తరం వాళ్ళు బాధ్యులు. 51 హేబెలు హత్య మొదలుకొని ధూప వేదికకు, మందిరానికి మధ్య చంపబడిన జెకర్యా హత్యదాకా వీళ్ళు బాధ్యులు. ఔను. ఈ కాలం వాళ్ళు వీటికి బాధ్యులని నేను చెబుతున్నాను.

52 “ధర్మశాస్త్ర పండితులారా! జ్ఞానం యొక్క తాళం చెవి మీరు తీసుకున్నారు. దాని తలుపులు తెరిచి మీరు లోనికి వెళ్ళలేరు. పైగా వెళ్తున్న వాళ్ళను అడ్డగిస్తారు. మీకు శిక్ష తప్పదు” అని చెప్పాడు.

53 యేసు అక్కడినుండి వెళ్ళిన తర్వాత పరిసయ్యులును, శాస్త్రులును ఆయనను ఇంకా ఎక్కువగా వ్యతిరేకించారు. ప్రశ్నలతో ఆయన్ని వేధించారు. 54 ఆయనను మాటలలో చిక్కించాలని ప్రయత్నించారు.

యోబు 25-26

యోబుకు బిల్దదు జవాబు

25 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు:

“దేవుడే పాలకుడు.
    ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి.
    దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు.
దేవుని దూతలను ఏ మనిషీ లెక్కించలేడు.
    దేవుని సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు.
కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి వాడుగా ఉండలేడు.
    స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా పరిశుద్ధంగా ఉండలేడు.
దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు.
    దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు.
మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు.
    పనికి మాలిన పురుగులాంటివాడు!”

బిల్దదుకు యోబు జవాబు

26 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:

“బిల్దదూ, జోఫరూ, ఎలీఫజూ మీరు బలహీనులైన మనుష్యులకు నిజంగా సహాయం చేయగలరు.
    అవును, మీరు నన్ను ప్రోత్సహించారు. బలహీనమైన నా చేతులను మీరు తిరిగి బలం గలవిగా చేసారు.
అవును, జ్ఞానంలేని మనిషికి మీరు అద్భుతమైన సలహా ఇచ్చారు.
    మీరు చాలా జ్ఞానం ప్రదర్శించారు.
ఈ సంగతులు చెప్పటానికి మీకు ఎవరు సహాయం చేశారు.
    ఎవరి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది?

“మరణించిన వారి ఆత్మలు
    భూమి కింద నీళ్లలో విలవిల్లాడుతున్నాయి.
మరణ స్థలం దేవుని దృష్టికి బాహాటం.
    దేవునికి మరణం మరుగు కాదు.
ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు విస్తరింపజేశాడు.
    దేవుడు భూమిని శూన్యంలో వేలాడతీశాడు.
మేఘాలను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు.
    కానీ నీటి భారం మూలంగా మేఘాలు బద్దలు కాకుండా దేవుడు చూస్తాడు.
పున్నమి చంద్రుని దేవుడు కప్పివేస్తాడు.
    దేవుడు తన మేఘాలను చంద్రుని మీద విస్తరింపచేసి, దానిని కప్పుతాడు
10 మహా సముద్రం మీది ఆకాశపు అంచులను
    చీకటి వెలుగులకు మధ్య సరిహద్దుగా దేవుడు చేస్తాడు.
11 ఆకాశాలను ఎత్తిపట్టు పునాదులను
    దేవుడు బెదిరించగా అవి భయంతో వణకుతాయి.
12 దేవుని శక్తి సముద్రాన్ని నిశ్శబ్దం చేస్తుంది.
    దేవుని జ్ఞానము రాహాబు సహాయకులను నాశనం చేసింది.
13 దేవుని శ్వాస ఆకాశాలను తేటపరుస్తుంది.
    తప్పించుకోవాలని ప్రయత్నించిన సర్పాన్ని దేవుని హస్తం నాశనం చేస్తుంది.
14 దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే.
    దేవుని నుండి ఒక చిన్న స్వరం మాత్రమే మనం వింటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, శక్తిగలవాడో ఏ మనిషి నిజంగా అర్థం చేసుకోలేడు.”

1 కొరింథీయులకు 12

పవిత్రాత్మ వరాలు

12 సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము. మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు.

దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు.

దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు. 10 ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు. 11 ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్ఛానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.

ఒకే శరీరం, అనేక అవయవాలు

12 శరీరంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే. 13 అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదులమైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు.

14 మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు. 15 ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 16 అదే విధంగా ఒకవేళ చెవి, “నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 17 శరీరమంతా కన్నైపోతే దేనితో వింటాం? శరీరమంతా చెవియైతే దేనితో వాసన చూస్తాం? 18 కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు. 19 అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు. 20 నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే.

21 కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదే విధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు. 22 సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. 23 ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగపరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము. 24 బహిరంగపరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు. 25 శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం. 26 ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది.

27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. 28 దేవుడు సంఘంలో ఉన్నవాళ్ళందర్నీ తమతమ స్థానాల్లో ఉంచాడు. మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తల్ని, మూడవ స్థానంలో బోధించే వాళ్ళను, ఆ తర్వాత మహత్కార్యాలను చేసేవాళ్ళను, వాళ్ళ తర్వాత వ్యాధులు నయం చేసే శక్తి గలవాళ్ళను, ఇతరులకు సహాయం చేసేవాళ్ళను, పరిపాలించేవాళ్ళను, తమకు తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి గలవాళ్ళను ఉంచాడు. 29 వీళ్ళలో అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధించేవాళ్ళు కారు, అందరూ అద్భుతాలు చేసేవాళ్ళు కారు. 30 వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు. 31 కనుక మీ హృదయాలను ముఖ్యమైన వరాల వైపుకు మళ్ళించండి. ఏది ఏమైనా అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం చూపిస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International