Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 7

మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “నేను నీకు తోడుగా ఉంటాను. ఫరోకు నీవు ఒక మహారాజులా[a] ఉంటావు. అహరోను నీ పక్షంగా మాట్లాడే మాటకారిగా[b] ఉంటాడు. నీకు నేను ఆజ్ఞాపించేదంతా అహరోనుతో చెప్పు. నేను చెప్పే విషయాలన్నీ అతను రాజుతో చెబుతాడు. ఇక ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఈ దేశాన్ని వదిలిపోనిస్తాడు. అయితే నేను ఫరోను మొండిగా చేస్తాను. (మీరు అతనితో చెప్పే సంగతులను అతడు లెక్క చేయడు) అప్పుడు నేను ఈజిప్టులో అనేక అద్భుతాలు చేస్తాను. అయినా అతను వినేందుకు నిరాకరిస్తాడు. అందుచేత ఈజిప్టును నేను ఘోరంగా శిక్షిస్తాను. తర్వాత నా ప్రజలను ఆ దేశం నుండి నేను బయటకు నడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని ఈజిప్టు ప్రజలు తెలుసుకుంటారు. నేను వాళ్లకు వ్యతిరేకంగా ఉంటాను. నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. అప్పుడు నేనే నా ప్రజలను ఆ దేశంనుండి బయటకు నడిపిస్తాను.”

మోషే, అహరోనులు యెహోవా తమతో చెప్పిన ఈ మాటలకు విధేయులయ్యారు. అప్పటికి మోషే వయస్సు 80 సంవత్సరాలు అహరోను వయస్సు 83 సంవత్సరాలు.

మోషే కర్ర పాము అవుతుంది

మోషే, అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు: “మీ శక్తి రుజువు చేయమని ఫరో మిమ్మల్ని అడుగుతాడు. ఒక అద్భుతం చేయమని మిమ్మల్ని అడుగుతాడు. అతని కర్ర నేలమీద పడవేయమని అహరోనుతో చెప్పు. ఫరో చూస్తూ ఉండగానే ఆ కర్ర పావు అవుతుంది.”

10 కనుక మోషే, అహరోను ఫరో దగ్గరకు వెళ్లి యెహోవా చెప్పినట్టు చేసారు. అహరోను తన చేతి కర్రను కింద పడవేసాడు. ఫరో తన అధికారులతో కలసి చూస్తూ ఉండగానే ఆ కర్ర పాముగా అయింది.

11 కనుక రాజు తన విద్వాంసులను, మంత్రగాళ్లను పిలిపించాడు. వాళ్లు మంత్రాలు వేసి, అహరోను చేసినట్లే చేయగల్గారు. 12 వాళ్లు కూడా వారి కర్రలను నేల మీద పడవేసారు. ఆ కర్రలు పాములయ్యాయి, కాని అహరోను కర్ర వాళ్ల కర్రలను మింగేసింది. 13 అయినా సరే ప్రజలను వెళ్లనిచ్చేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఏమి జరుగుతుందని యెహోవా చెప్పాడో అలాగే ఇది జరిగింది. మోషే, అహరోనుల మాట వినేందుకు రాజు ఒప్పుకోలేదు.

నీళ్లు రక్తంగా మారటం

14 అప్పుడు మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “ఫరో మొండికెత్తాడు. ప్రజల్ని పోనిచ్చేందుకు ఫరో నిరాకరిస్తున్నాడు. 15 ఉదయాన్నే ఫరో నైలు నదికి వెళ్తాడు. నది ఒడ్డున అతని దగ్గరకు వెళ్లు. పాముగా మారిన ఆ కర్రను నీ వెంట తీసుకొనివెళ్లు. 16 అతనికి ఇలా చెప్పు: ‘హీబ్రూ ప్రజల దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరకు పంపించాడు. అరణ్యంలో నన్ను ఆరాధించటానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని నీతో చెప్పమని యెహోవా నాతో చెప్పాడు. ఇప్పటివరకు నీవేమో యెహోవా మాట వినలేదు. 17 కనుక యెహోవా చెబుతున్నాడు, నేనే యెహోవానని చెప్పి నీవు ఇలా తెల్సుకొంటావు నా చేతిలో ఉన్న ఈ కర్రతో నైలు నది నీళ్లను నేను కొడతాను. నైలునది రక్తంగా మారిపోతుంది. 18 దానితో నదిలో చేపలన్నీ చస్తాయి, నది కుళ్లు కంపు కొడుతుంది. అంతటితో ఈజిప్టు వాళ్లు నదిలోని నీళ్లు తాగలేక పోతారు.’”

19 యెహోవా మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “వారి నదులు, కాలువలు, చెరువుల మీద, వారు నీరు నిల్వ చేసే ప్రతి స్థలం మీద తన చేతి కర్ర చాపాలని అహరోనుకు చెప్పు. అతను ఇలా చెయ్యగానే నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. చెక్క పాత్రలు, రాతి పాత్రల్లో ఉన్న నీళ్లతో సహా మొత్తం నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి.”

20 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే, అహరోనులు చేసారు. అతను కర్ర పైకెత్తి నైలునది నీళ్లమీద కొట్టాడు. ఫరో, అతని అధికారులు అందరి ముందు అతడు ఇలా చేసాడు. నదిలో నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి. 21 నదిలో చేపలు చచ్చాయి. నది కుళ్లు కంపు కొట్టడం మొదలయింది. అందుచేత ఈజిప్టు వాళ్లు ఆ నదిలో నీళ్లు తాగలేక పోయారు. ఈజిప్టు అంతా రక్తమయం అయిపోయింది.

22 మాంత్రికులు కూడ మాయలు చేసి అలాగే చేసారు. కనుక మోషే, అహరోనుల మాటను ఫరో లెక్కచేయలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది. 23 ఫరో ముఖం తిప్పుకొని తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. మోషే, అహరోనులు చేసిన దాన్ని ఫరో అలక్ష్యం చేసాడు.

24 ఈజిప్టు వాళ్లు నదిలో నీళ్లు త్రాగలేక పోయారు. అందుచేత తాగే నీళ్ల కోసం వాళ్లు ఆ నది చుట్టూ బావులు తవ్వారు.

కప్పలు

25 నైలు నది నీళ్లను యెహోవా మార్చేసిన తర్వాత ఏడు రోజులు గడిచాయి.

లూకా 10

యేసు తన డెబ్బది రెండు మంది శిష్యులను పంపటం

10 ఆ తర్వాత యేసు మరొక డెబ్బది రెండు[a] మంది శిష్యులను నియమించాడు. వాళ్ళను జతలు జతలుగా తాను వెళ్ళబోయే ప్రతి గ్రామానికి, పల్లెకు తన కంటే ముందు పంపుతూ, “పంటబాగా పండింది. కాని పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువల్ల పంటనిచ్చిన ఆ ప్రభువును పని వాళ్ళను తన పొలాలకు పంపమని ప్రార్థించండి.

“వెళ్ళండి! తోడేళ్ళ మందలోకి గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. మీ వెంటడబ్బు దాచుకొనే సంచి కాని, జోలి కాని, చెప్పులు కాని, తీసుకు వెళ్ళకండి. దారి మీద ఎవ్వరితో మాట్లాడకండి. ఒకరి యింట్లోకి వెళ్ళేముందు, మొదట సమాధానం కలుగుగాక అని చెప్పండి. ఆ యింటిలో శాంతి పొందనర్హుడైన వ్యక్తి ఉంటే మీ ఆశీస్సు అతనికి తోడౌతుంది. లేని పక్షంలో మీ ఆశీస్సు మీకు తిరిగివస్తుంది. ఉన్న యింట్లోనే ఉండండి. ఇచ్చిన దాన్ని భుజించండి. పని చేసినవానికి కూలి దొరకాలి కదా! ఇల్లిల్లు తిరగకండి.

“ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగతమిచ్చి ఏది మీ ముందు పెడితే అది భుజించండి. గ్రామంలో ఉన్న రోగులకు నయం చెయ్యండి. వాళ్ళతో, ‘దేవుని రాజ్యం మీ దగ్గరకు వస్తోంది’ అని చెప్పండి.

10 “మీరొక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగత మివ్వకుంటే 11 వీధిలోకి వెళ్ళి మీరు చేస్తున్నది తప్పని సూచించటానికి, ‘మా కాలికంటిన మీ ఊరి ధూళి కూడా దులిపి వేస్తున్నాము. కాని యిది మాత్రం నిజం. దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది. తెలిసికోండి’ అని అనండి. 12 తీర్పు చెప్పబోయేరోజున, ఆ ఊరి ప్రజల్ని దేవుడు సొదొమ ప్రజలకన్నా ఎక్కువగా శిక్షిస్తాడని నేను చెబుతున్నాను.

యేసు విశ్వసించనివారిని హెచ్చరించటం

(మత్తయి 11:20-24)

13 “అయ్యో కొరాజీనా! అయ్యో బేత్సయిదా! మీకోసం చేసిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాలలో చేసివుంటే వాళ్ళు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకొని బూడిద తలపై వేసుకొని పశ్చాత్తాపం చెంది, మారుమనస్సు పొందివుండే వాళ్ళు. 14 కాని తీర్పు చెప్పబడే రోజున తూరు, సీదోను ప్రజలకన్నా మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాడు. 15 ఇక, ఓ కపెర్నహూమా! ఆకాశ మంత ఎత్తుగా హెచ్చించుకొందువా? పాతాళానికి త్రోసి వేయబడతావు.

16 “మీ బోధనలు వింటే నా బోధనలు విన్నట్టే. మిమ్మల్ని నిరాకరిస్తే నన్నును నిరాకరించినట్టే. నన్ను నిరాకరిస్తే నన్ను పంపినవానిని నిరాకరించినట్లే” అని వాళ్ళతో అన్నాడు.

సాతాను పడిపోవటం

17 ఆ డెబ్బది రెండు మంది శిష్యులు ఆనందంతో తిరిగి వచ్చి, “ప్రభూ! మీ పేరు చెప్పగానే దయ్యాలు కూడా మా మాటలకు లోబడ్డాయి” అని అన్నారు.

18 యేసు, “సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడిపోవటం నేను చూశాను. 19 పాముల మీద నడవటానికి మీకు అధికారము యిచ్చాను. శత్రువును జయించే అధికారం యిచ్చాను. ఏది మీకు హాని చెయ్యలేదు. 20 దయ్యాలు మీ మాట వింటున్నంత మాత్రాన ఆనందించకండి. మీ పేరు పరలోకంలో వ్రాయబడినందుకు ఆనందించండి” అని అన్నాడు.

యేసు తండ్రిని ప్రార్థించటం

(మత్తయి 11:25-27; 13:16-17)

21 ఆయన పవిత్రాత్మలో సంతోషిస్తూ, “ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి ఓ తండ్రి! నీకు స్తుతులు! నీవీ విషయాలు చదువుకున్న వాళ్ళనుండి, విజ్ఞానుల నుండి దాచి, అమాయకులకు తెలియ చేసావు. ఔను, తండ్రీ! ఇదే నీచిత్తము.

22 “నా తండ్రి నాకు అన్నీ యిచ్చాడు. తండ్రికి తప్ప కుమారుడెవరో ఇతర్లకు తెలియదు. కుమారుడు చెప్పదలచిన వాళ్లకు తప్ప తండ్రి ఎవరో యితర్లకు తెలియదు” అని అన్నాడు.

23 ఆ తర్వాత తన శిష్యుల వైపు తిరిగి, “మీరు చూస్తున్నవి చూసే కన్నులు ధన్యమైనవి. 24 నేను చెప్పేదేమిటంటే మీరు చూస్తున్నవి చూడాలని చాలా మంది ప్రవక్తలు, రాజులు ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని వాళ్ళాశించారు. కాని వినలేక పోయారు” అని రహస్యంగా వారితో అన్నాడు.

మంచి సమరయుని ఉపమానం

25 ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించాలనుకొని లేచి, “బోధకుడా! నేను నిత్యజీవం[b] పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.

26 దానికి యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసారు? నీవు ఏమిచదివావు?” అని అడిగాడు.

27 అతడు, “‘నీ ప్రభువైనటువంటి దేవుణ్ణి సంపూర్ణమైన మనస్సుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితోనూ, శక్తితోనూ ప్రేమించు.’ అంతేకాక, ‘నిన్ను ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాళ్ళను ప్రేమించు’ అని వ్రాయబడివుంది” అని చెప్పాడు.

28 యేసు ఈ విధంగా అన్నాడు: “నీవు సరియైన సమాధానం చెప్పావు. ఆ విధంగా నడుచుకో, అనంత జీవితం పొందుతావు.”

29 ఆ పండితుడు తాను నీతిమంతుడనని రుజువు చేయటానికి యేసుతో, “మరి నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు.

30 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ దార్లో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతణ్ణి నిలువు దోపిడి చేసి బాగాకొట్టి వదిలి వేసారు. అతడు కొన ప్రాణంతో ఉన్నాడు.

31 “అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిన రావటం తటస్థించింది. అతణ్ణి చూసి కూడా ఆ యాజకుడు ప్రక్కకు తొలిగి వెళ్ళిపొయ్యాడు. 32 అదే విధంగా ఒక లేవీయుడు కూడా వచ్చి అతణ్ణి చూసి ప్రక్కకు తొలిగి వెళ్ళి పొయ్యాడు.

33 “ఒక సమరయ ప్రాంతపువాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది. 34 అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాలమీద ద్రాక్షారసం పోసి, నూనె రాచి, కట్లుకట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతణ్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. 35 మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.”

36 ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు.

37 ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” అని సమాధానం చెప్పాడు.

దానికి యేసు, “నీవు కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు.

యేసు మార్త యింటికి వెళ్ళటం

38 యేసు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో మార్త అనే స్త్రీ ఆయన్ని తన యింటికి ఆహ్వానించింది. 39 ఆమెకు మరియ అనే ఒక సోదరి ఉంది. మరియ యేసు ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పిన విషయాలు వింటూ ఉంది. 40 కాని మార్తకు పని ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కలిగింది. ఆమె యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరి యింటి పనులంతా నామీద వదిలి వేయటం మీకు న్యాయమనిపిస్తుందా? వచ్చి నాకు సహాయం చెయ్యమని ఆమెతో చెప్పండి” అని అన్నది.

41 ప్రభువు, “మార్తా! మార్తా! పనులు ఎక్కువగా ఉండటంవల్ల నీకు చింత, చిరాకు కలుగుతున్నాయి. 42 నిజంగా చెయ్యవలసింది ఒక్కటే పని. మరియ ఏది ఉత్తమమో దాన్ని ఎన్నుకొంది. దాన్ని ఆమెనుండి ఎవ్వరూ తీసుకోలేరు” అని అన్నాడు.

యోబు 24

24 “సర్వశక్తిమంతుడైన దేవుడు న్యాయవిచారణ కోసం ఒక సమయాన్ని ఎందుకు నిర్ణయించడు?
    దేవునికి విధేయులయ్యే మనుష్యులు ఆ న్యాయవిచారణ సమయం కోసం అనవసరంగా ఎందుకు వేచి ఉండాలి?”

“మనుష్యులు తమ పొరుగు వారి భూమిని ఆక్రమించేందుకు సరిహద్దు రాళ్లను జరిపివేస్తారు.
    మనుష్యులు మందలను దొంగిలించి ఇతర పచ్చిక బయళ్లకు వాటిని తోలుకొని పోతారు.
అనాధల గాడిదను వారు దొంగిలిస్తారు.
    ఒక విధవ వారి బాకీ తీర్చేంత వరకు ఆమె యొక్క ఆవును వారు తోలుకొని పొతారు.
ఇల్లు లేకుండా ఒక చోటు నుండి మరో చోటికి సంచారం చేసేటట్టు ప్రజలను వారు బలవంతం చేస్తారు.
    పేద ప్రజలంతా ఈ దుర్మార్గుల బారినుండి దాగుకొనేలా బలవంతం చేయబడతారు.

“అరణ్యంలో ఆహారం కోసం వెదకులాడే అడవి గాడిదలా ఉన్నారు ఈ పేద ప్రజలు.
    పేద ప్రజలకూ వారి పిల్లలకూ ఎడారి ఆహారమును ఇస్తుంది.
పేద ప్రజలు ఇంకెంత వరకు వారి స్వంతం కాని పొలాలలో గడ్డి, గడ్డిపరకలు కూర్చుకోవాలి?
    దుర్మార్గుల ద్రాక్షాతోటల నుండి వారు పండ్లు ఏరుకొంటారు.
పేద ప్రజలు బట్టలు లేకుండానే రాత్రిపూట వెళ్లబుచ్చాలి.
    చలిలో వారు కప్పుకొనేందుకు వారికి ఏమీ లేదు.
కొండల్లోని వర్షానికి వారు తడిసిపోయారు.
    వాతా వరణంనుండి వారిని వారు కాపాడుకొనేందుకు వారికి ఏమీ లేదు కనుక వారు పెద్ద బండలకు దగ్గరలో ఉండాలి.
దుర్మార్గులు తండ్రిలేని బిడ్డను తల్లి దగ్గర నుండి లాగివేసుకొంటారు.
    పేద మనిషియొక్క బిడ్డను వారు తీసివేసుకొంటారు. పేద మనిషి బాకీపడి ఉన్న దానిని చెల్లించటం కోసం దుర్మార్గులు ఆ చిన్న బిడ్డను బానిసగా చేస్తారు.
10 పేద ప్రజలకు బట్టలు లేవు, కనుక వారు దిగంబరులుగా పని చేస్తారు.
    దుర్మార్గుల కోసం వారు పనలు మోస్తారు. కానీ పేద ప్రజలు ఇంకా ఆకలితోనే ఉంటారు.
11 పేద ప్రజలు ఒలీవ నూనె పిండుతారు.
    వారు ద్రాక్షాగానుగను తిప్పుతారు. కానీ వారు ఇంకా దాహంతోనే ఉంటారు.
12 మరణిస్తున్న మనుష్యులు చేస్తున్న విచారకరమైన శబ్దాలు పట్టణంలో వినిపిస్తున్నాయి.
    బాధించబడిన మనుష్యులు సహాయం కోసం అరుస్తున్నారు. కానీ దేవుడు వినటం లేదు.

13 “వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుష్యులు ఉన్నారు.
    వారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవటం వారికి ఇష్టం లేదు.
    వారు దేవుని మార్గంలో నడవరు.
14 నరహంతకుడు ఉదయాన్నే లేచి పేద ప్రజలను, అక్కరలో ఉన్న ప్రజలను చంపుతాడు.
    రాత్రివేళ అతడు దొంగగా మారిపోతాడు.
15 వ్యభిచారం చేసేవాడు రాత్రి కోసం వేచి ఉంటాడు.
    ‘నన్ను ఎవ్వరూ చూడడం లేదు’ అని అతడు అనుకొంటాడు. కనుక అతడు తన ముఖం కప్పు కొంటాడు.
16 రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దుర్మార్గులు ఇళ్లలో చొరబడతారు.
    కానీ పగటివేళ వారు వారి స్వంత ఇళ్లలో దాగుకొంటారు. వెలుగును వారు తప్పించుకొంటారు.
17 ఆ దుర్మార్గులకు చీకటి ఉదయంలా ఉంటుంది.
    చీకటి దారుణాలకు వారు స్నేహితులు.

18 “కాని వరద నీటిపైనున్న నురగవలె దుర్మార్గులు తీసుకొనిపోబడతారు.
    వారి స్వంత భూమి శపించబడింది. కనుక ద్రాక్షా తోటలలో ద్రాక్షాపండ్లు కోసే పనికి వారు వెళ్లరు.
19 వేడిగా, పొడిగా ఉండే గాలి శీతాకాలపు మంచు నీళ్లను తొలగించి వేస్తుంది.
    అదే విధంగా దుర్మార్గులు కూడా తీసుకొనిపోబడతారు.
20 దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని స్వంత తల్లి సహితం వానిని మరిచిపోతుంది.
    దుర్మార్గుని శరీరాన్ని పురుగులు తినివేస్తాయి.
అతడు ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోబడడు.
    దుర్మార్గులు పడిపోయిన ఒక చెట్టులా నాశనం చేయబడతారు.
21 దుర్మార్గులు గొడ్రాలికి అక్రమాలు చేస్తారు. పిల్లలు లేని స్త్రీని వారు బాధిస్తారు.
    వారు విధవరాలికి దయ చూపెట్టరు.
22 కానీ బలంగల మనుష్యులను నాశనం చేసేందుకు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు.
    బలంగల మనుష్యులు శక్తిమంతులవుతారు. కాని వారి స్వంత జీవితాలను గూర్చిన నమ్మకం వారికి లేదు.
23 ఒకవేళ దేవుడు శక్తిగల మనుష్యులను కొద్ది కాలం వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో
    కాని దేవుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు.
24 కొద్ది కాలం పాటు దుర్మార్గులు విజయం సాధిస్తారు. ఆ తరువాత వారు అంతమై పోతారు.
    మనుష్యులందరిలాగే వారూ ఒక చోట చేర్చబడతారు. తర్వాత వారు కోసివేయబడిన ధాన్యపు గింజల్లా మరణిస్తారు.

25 “ఈ విషయాలు సత్యం కాకపోతే,
    నేను అబద్ధం చెప్పానని ఎవరు రుజువు చేయగలరు?
    నా మాటలు వట్టివి అని ఎవరు చెప్పగలరు?”

1 కొరింథీయులకు 11

11 నేను క్రీస్తును అనుసరించిన విధంగా, మీరు నన్ను అనుసరించండి.

ఆరాధనా, పవిత్రత—తలపై ముసుగు

నన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొంటూ, నేను చెప్పిన బోధల్ని పాటిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. క్రీస్తుకు ప్రతీ మనిషిపై అధికారం ఉంది. ప్రతీ పురుషునికి తన భార్యపై అధికారం ఉంది. దేవునికి క్రీస్తుపై అధికారం ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలని నా కోరిక.

కనుక తన తల కప్పుకొని బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించేవాడు లేక దైవసందేశాన్ని ప్రకటించేవాడు తన తలను అవమానపరచినవానితో సమానము. తల మీద ముసుగు వేసుకోకుండా బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించే స్త్రీ, లేక దైవసందేశాన్ని బోధించే స్త్రీ తన తలను అవమానపరచినట్లు అవుతుంది. ఆమె తలగొరిగించుకొన్నదానితో సమానము. స్త్రీ తన తల మీద ముసుగు వేసుకోకపోతే ఆమె తన తలవెంట్రుకలు కత్తిరించుకోవటం మంచిది. తలవెంట్రుకలు కత్తిరించుకోవటంకాని, లేక తల గొరిగించుకోవటం కాని అవమానంగా అనిపిస్తే ఆమె తన తలపై ముసుగు వేసుకోవాలి.

పురుషుడు దేవుని ప్రతిరూపం. దేవునికి కీర్తి కలిగించేవాడు పురుషుడు. కనుక అతడు తన తల కప్పుకొనకూడదు. కాని స్త్రీ వల్ల పురుషునికి కీర్తి కలుగుతుంది. ఎందుకంటే పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడింది. అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది. 10 ఈ కారణంగా మరియు దేవదూతల కారణంగా స్త్రీ తనపై ఒకరికి అధికారముందని చూపటానికి తన తలపై ముసుగు వేసుకోవాలి.

11 కాని ప్రభువు దృష్టిలో పురుషుడు లేకుండా స్త్రీ, స్త్రీ లేకుండా పురుషుడు జీవించలేరు. 12 ఎందుకంటే, స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడినట్లే, పురుషుడు కూడా స్త్రీ నుండి సృష్టింపబడ్డాడు. కాని అన్నిటినీ దేవుడే సృష్టించాడు.

13 తలపై ముసుగు వేసుకోకుండా స్త్రీ దేవుణ్ణి ప్రార్థించటం సరియేనా? మీరే నిర్ణయించండి. 14 పురుషునికి పొడుగాటి వెంట్రుకలు ఉండటం వలన అతనికి అవమానమని ప్రకృతే మీకు తెలియచెయ్యటం లేదా? 15 స్త్రీకి తన తలవెంట్రుకలు ముసుగుగా ఉండటానికి పొడుగాటి వెంట్రుకలు ఇవ్వబడ్డాయి. దాని వల్ల ఆమెకు గౌరవం లభిస్తుంది. 16 దీన్ని గురించి ఎవరైనా వాదించాలనుకొంటే మా సమాధానం యిదే తప్ప వేరొకటి లేదు. దేవుని సంఘం కూడా దీన్నే అనుసరిస్తుంది.

ప్రభువు భోజనం

17 మీ సంఘ సమావేశాలు మంచికన్నా చెడును ఎక్కువగా చేస్తున్నాయి. కనుక ఈ క్రింది ఆజ్ఞలు మిమ్మల్ని పొగుడుతూ వ్రాయటం లేదు. 18 మీరు సమావేశమైనప్పుడు మీలో విభాగాలు కలుగుతున్నట్లు నేను విన్నాను. ఇందులో నిజముండవచ్చు. 19 సక్రమ మార్గాల్లో నడుచుకొనేవాళ్ళు రుజువు కావాలంటే మీలో విభేదాలు ఉండటం అవసరం.

20 మీరు సమావేశమైనప్పుడు నిజమైన “ప్రభు రాత్రి భోజనం” చెయ్యటం లేదు. 21 ఎందుకంటే మీరు తినేటప్పుడు ఎవరికోసం కాచుకోకుండా తింటారు. బాగా త్రాగుతారు. కాని కొందరు ఆకలితో ఉండిపోతారు. 22 తినటానికి, త్రాగటానికి మీకు ఇళ్ళు లేవా? మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. అంటే, మీరు దేవుని సంఘాన్ని లెక్క చెయ్యనట్లే కదా! మీరు ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో మిమ్మల్ని పొగడను.

23 నేను ప్రభువు నుండి పొందిన సందేశాన్ని మీకు చెప్పాను. యేసు ప్రభువు అప్పగింపబడిన రాత్రి రొట్టె చేత పట్టుకొని 24 దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని విరిచి, “ఇది మీ కొరకైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయుడి” అని అన్నాడు. 25 అదే విధముగా వారు భోజనమయిన తర్వాత ద్రాక్షారసం ఉన్న పాత్రను తీసుకొని, “ఈ పాత్ర నా రక్తంవలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనండి” అని అన్నాడు. 26 కనుక మీరు ఈ రొట్టెను తిని, ద్రాక్షారసమును త్రాగినప్పుడెల్ల ఆయన మరణాన్ని ఆయన వచ్చేదాకా ప్రకటిస్తారు.

27 కనుక ప్రభువు పట్ల అయోగ్యముగా ఎవరు ఆయన రొట్టె తింటారో, ఎవరు ఆయన పాత్ర నుండి త్రాగుతారో అతడు ప్రభువు శరీరం పట్ల, ఆయన రక్తం పట్ల పాపం చేసినవాడగును. 28 ప్రతీ వ్యక్తి రొట్టెను తినే ముందు, ఆ పాత్రనుండి త్రాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి. 29 ప్రభువు శరీరమని గ్రహించక రొట్టెను తినువాడు, మరియు ద్రాక్షారసం త్రాగువాడు శిక్షావిధికి గురి అవుతాడు. 30 అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగగ్రస్తులు అయినారు, కొందరు మరణించారు. 31 కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకొంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు. 32 కాని, మనకు సరియైన శిక్షణ యివ్వాలని ప్రభువు మనల్ని శిక్షిస్తాడు. ప్రపంచంతో పాటు మనకు శిక్ష లభించరాదని ఆయన ఉద్దేశ్యం.

33 అందువల్ల నా సోదరులారా! మీరు భోజనానికి సమావేశమైనప్పుడు ఒకరి కోసం ఒకరు కాచుకోండి. 34 మీరు సమావేశమైనప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా ఆకలి వేస్తే, అలాంటివాడు యింట్లోనే తిని రావాలి. అలా చేస్తే మీరు సమావేశమైనప్పుడు తీర్పుకు గురికారు. నేను వచ్చినప్పుడు మీకు మిగతా ఆజ్ఞలు యిస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International