Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 6

అందుకు యెహోవా, “ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు. అతని మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. దానితో అతడు నా ప్రజలను వెళ్లనిస్తాడు. వారు వెళ్లిపోవడానికి అతడు ఎంత ఇష్టపడతాడంటే, అతడే వారిని వెళ్లిపొమ్మని బలవంతం చేస్తాడు” అని మోషేతో చెప్పాడు.

మోషేతో దేవుడు ఇలా చెప్పాడు, “యెహోవాను నేనే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రత్యక్షమయ్యాను. వాళ్లు, (ఎల్‌షడ్డయి) సర్వశక్తిగల దేవుడు అని నన్ను పిలిచారు. నా పేరు యెహోవా అని వారికి తెలియలేదు. వారితో నేను ఒక ఒడంబడిక చేసాను. కనాను దేశం వారికి ఇస్తానని వాగ్దానం చేసాను. వారు ఆ దేశంలో నివసించారు గాని అది వారి స్వంత దేశం కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్లకు ఉన్న కష్టాలు నాకు తెలుసు. వారు ఈజిప్టులో బానిసలుగా ఉన్నారని నాకు తెలుసు. నా ఒడంబడిక కూడా నాకు జ్ఞాపకం ఉంది. కనుక నేను వాళ్లతో నీవు ఇలా చెప్పమన్నట్టు ప్రజలతో చెప్పు. ‘నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని స్వతంత్రుల్నిగా చేస్తాను. ఈజిప్టు వాళ్లకు మీరు బానిసలుగా ఉండరు. నేను నా మహాశక్తిని ప్రయోగించి మహా భయంకర శిక్షను ఈజిప్టు వారి మీదికి రప్పిస్తాను. అప్పుడు మిమ్మల్ని నేను రక్షిస్తాను. మీరు నా ప్రజలుగా ఉంటారు. నేనే మీ దేవుడిగా ఉంటాను. నేనే యెహోవాను, మీ దేవుడనని, ఈజిప్టునుండి నేనే మిమ్మల్ని విడిపించానని మీరు తెలుసుకొంటారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను.’”

అందుచేత మోషే ఇదంతా ఇశ్రాయేలు వాళ్లతో చెప్పాడు. అయితే, ప్రజలు పనిలో చాలా కష్టపడుచున్నందుచేత మోషేను వారు సహించలేదు. అతని మాట వారు వినలేదు.

10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 11 “ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశంనుండి తప్పక వెళ్లిపోనివ్వాలని ఫరో దగ్గరకు వెళ్లి చెప్పు.”

12 అయితే మోషే, “ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినరు. అలాంటప్పుడు ఫరో అంతకంటె వినడు. అసలే నాకు మాట్లాడటం చేతకాదు” అని అన్నాడు.

13 కాని మోషే, అహరోనులతో యెహోవా మాట్లాడాడు. వారు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని యెహోవా వారికి ఆజ్ఞాపించాడు. ఫరో దగ్గరికి వెళ్లి అతనితో కూడ మాట్లాడాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు నుండి బయటకు నడిపించుమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు.

ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో కొన్ని

14 ఇశ్రాయేలు కుటుంబాల నాయకుల పేర్లు ఇవి:

ఇశ్రాయేలు జ్యేష్ఠపుత్రుడు రూబేనుకు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి అనే నలుగురు కుమారులు గలరు.

15 యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు అనువారు షిమ్యోను కుమారులు. (షావూలు కనానీ స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు).

16 లేవీ 137 సంవత్సరాలు బ్రతికాడు. గెర్షోను, కహాతు, మెరారీ అనువారు లేవీ కుమారులు.

17 గెర్షోను కుమారులు లిబ్నీ, షిమీ.

18 కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు. అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనువారు కహాతు కుమారులు.

19 మహలి, ముషి అను వారు మెరారీ కుమారులు.

ఈ కుటుంబాలన్ని ఇశ్రాయేలు కుమారుడు లేవీ సంతానం.

20 అమ్రాము 137 సంవత్సరాలు బ్రతికాడు. అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును వివాహం చేసుకొన్నాడు. ఈ అమ్రాము కుమారులే మోషే, అహరోనులు.

21 కోరహు, నెపెగు, జిఖ్రీ అనువారు ఇస్హారు కుమారులు.

22 మిషాయేలు, ఎల్జఫను, సిత్రీ అనువారు ఉజ్జీయేలు కుమారులు.

23 అహరోను ఎలీషెబను వివాహం చేసుకొన్నాడు. (ఎలీషెబ అమ్మినాదాబు కుమార్తె. నయసోను సోదరి) అహరోను ఎలీషెబలకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులు పుట్టారు.

24 కోరహు కుమారులు అంటే, అస్సీరు, ఎల్కానా, అబియాసాపు.

25 అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెను పెండ్లాడాడు, వాళ్లు ఫీనెహాసుకు జన్మనిచ్చారు.

ఈ మనుష్యులంతా ఇశ్రాయేలు కుమారుడైన లేవీ సంతానం.

26 అహరోను, మోషే ఈ వంశానికి చెందిన వాళ్లు, “ఇశ్రాయేలు ప్రజల వంశాలను నడిపించండి” అని యెహోవా చెప్పింది వీళ్లకే. 27 ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన వాళ్లు అహరోను, మోషే, ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు విడిచి పెట్టి వెళ్లనివ్వాల్సిందిగా ఫరోతో చెప్పింది వీళ్లే.

దేవుడు మళ్లీ మోషేను పిల్చాడు

28 ఈజిప్టు దేశంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. 29 “నేను యెహోవాను. నేను నీతో చెప్పిందంతా ఈజిప్టు రాజుతో చెప్పు” అన్నాడు.

30 “కానీ, నేను చక్కగా మాట్లాడలేను గదా! రాజు నా మాట వినడు” అని జవాబిచ్చాడు మోషే.

లూకా 9

యేసు అపోస్తలులను పంపటం

(మత్తయి 10:5-15; మార్కు 6:7-13)

యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని సమావేశ పరిచి దయ్యాల్ని పారద్రోలటానికి, రోగాలను నయం చేయటానికి వాళ్ళకు శక్తి, అధికారము ఇచ్చాడు. వాళ్ళను ప్రపంచంలోకి పంపుతూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుమని, రోగాలున్న వాళ్ళకు నయం చెయ్యమని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళతో, “ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వెంట చేతి కర్రకాని, సంచికాని, ఆహారంకాని, ధనంకాని, మారు దుస్తులు కాని, యితర వస్తువులు కాని తీసుకు వెళ్ళకండి. ఒక యింటికి వెళ్తే ఆ గ్రామం వదిలే దాకా ఆ యిల్లు విడిచి వెళ్ళకండి. ప్రజలు మీకు స్వాగతం ఇవ్వకుంటే ఆ ఊరు వదిలి వెళ్ళే ముందు వాళ్ళు చేసిన పొరపాటు చూపటానికి మీ కాలి ధూళి దులపండి” అని అన్నాడు.

ఆ తర్వాత వాళ్ళు బయలు దేరి ప్రతి గ్రామానికి వెళ్ళారు. ప్రతిచోటా దైవ సందేశాన్ని ప్రకటించారు. రోగాలున్న వాళ్ళకు నయం చేసారు.

హేరోదు ఆందోళన

(మత్తయి 14:1-12; మార్కు 6:14-29)

సామంతరాజైన హేరోదు జరుగుతున్న వాటిని గురించి విని చాలా కంగారు పడ్డాడు. యోహాను బ్రతికి వచ్చాడని కొందరన్నారు. ఏలీయా కనిపించాడని కొందరన్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్తల్లో ఒకడు బ్రతికి వచ్చాడని అన్నారు. కాని హేరోదు, “నేను యోహాను తల నరికించాను కదా. మరి ఎవర్ని గురించి వింటున్నాను?” అని మనస్సులో అనుకొన్నాడు. హేరోదు యేసును చూడాలని ఆతృత పడ్డాడు.

యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం

(మత్తయి 14:13-21; మార్కు 6:30-44; యోహాను 6:1-14)

10 అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ యేసుతో చెప్పారు. ఆ తర్వాత యేసు అపొస్తలులను ప్రజలకు దూరంగా బేత్సయిదా అనే పట్టణానికి తన వెంట తీసుకు వెళ్ళాడు. 11 ప్రజలకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు యేసును చూడటానికి అక్కడికి కూడా వెళ్ళారు. ఆయన వాళ్ళను ఆహ్వానించి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి రోగాలున్న వాళ్ళకు నయం చేశాడు.

12 సూర్యాస్తమయమౌతుండగా ఆయన వద్దకు పన్నెండు మంది అపొస్తలులు వచ్చి, “మనం ఏ మూలో ఉన్నాం. ప్రజల్ని వెళ్ళమనండి. చుట్టూ ఉన్న పల్లెలకు, గ్రామాలకు వెళ్ళి ఆహారము, విశ్రమించటానికి స్థలం చూసుకొంటారు” అని అన్నారు.

13 యేసు వాళ్ళతో, “వాళ్ళు తినటానికి మీరేదైనా ఆహారం ఇవ్వండి” అని అన్నాడు.

వాళ్ళు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి. మేము వెళ్ళి వీళ్ళందరికోసం ఆహారం కోనుక్కు రావాలని మీ ఉద్దేశ్యమా?” అని అన్నారు. 14 సుమారు ఐదువేలమంది పురుషులు అక్కడ ఉన్నారు.

కాని యేసు తన శిష్యులతో, “పంక్తికి యాభైమంది చొప్పున వాళ్ళను కూర్చో బెట్టండి” అని అన్నాడు.

15 శిష్యులు ఆయన చెప్పినట్లు చేసారు. వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు. 16 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని భాగాలు చేశాడు. వాటిని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. 17 అందరూ కడుపు నిండుగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ఆహారాన్ని పండ్రెండు గంపల నిండా నింపారు.

పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం

(మత్తయి 16:13-19; మార్కు 8:27-29)

18 ఒకరోజు యేసు ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ప్రార్థించటం ముగించాక వాళ్ళతో, “ప్రజలు నేను ఎవర్నని అంటున్నారు?” అని అడిగాడు.

19 వాళ్ళు, “కొందరు బాప్తిస్మము నిచ్చే యోహాను అని అంటున్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్త బ్రతికి వచ్చాడు అని అంటున్నారు” అని సమాధానం చెప్పారు.

20 “మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని ఆయన అడిగాడు.

పేతురు, “మీరు దేవుడు పంపిన క్రీస్తు” అని సమాధానం చెప్పాడు.

21 “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని యేసు ఖండితంగా చెప్పాడు.

యేసు తన మరణాన్ని గురించి చెప్పటం

(మత్తయి 16:21-28; మార్కు 8:31–9:1)

22 ఆయన వాళ్ళతో, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్ని తిరస్కరిస్తారు. ఆయన చంపబడి మూడవ రోజున బ్రతికింపబడతాడు” అని అన్నాడు.

23 ఆ తర్వాత వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా వెంట రావాలనుకొన్నవాడు తన కోరికల్ని చంపుకొని, తన సిలువను ప్రతిరోజు మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 24 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొంటాడు. 25 ప్రపంచాన్నంతా జయించి తనను పోగొట్టుకొని, తన జీవితాన్ని నాశనం చేసుకొంటే దానివల్ల కలిగే లాభమేమిటి? 26 నన్ను, నా సందేశాన్ని అంగీకరించటానికి సిగ్గుపడిన వాళ్ళ విషయంలో, మనుష్యకుమారుడు తన తేజస్సుతో, తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతల తేజస్సుతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. 27 ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడకుండా మరణించరు.”

యేసుని రూపాంతరం

(మత్తయి 17:1-8; మార్కు 9:2-8)

28 ఈ విధంగా చెప్పిన ఎనిమిది రోజులకు పేతురు, యోహాను, యాకోబును తన వెంట తీసుకొని ఒక కొండ మీదికి యేసు ప్రార్థించటానికి వెళ్ళాడు. 29 ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖతేజస్సు మారింది. ఆయన దుస్తులు తెల్లగా ప్రకాశించటం మొదలు పెట్టాయి. 30 అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు తేజస్సుతో యేసు ముందు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళు మోషే, ఏలీయాలు. 31 యెరూషలేములో నెరవేర్చబడనున్న దైవేచ్ఛను గురించి, అంటే ఆయన మరణాన్ని గురించి, మాట్లాడారు. 32 పేతురు, అతని వెంటనున్న వాళ్ళు మంచి నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళకు మెలకువ వచ్చింది. వాళ్ళు లేచి యేసు తేజస్సును, ఆయనతో నిలుచొని ఉన్న ఆ యిద్దరి పురుషుల తేజస్సును చూసారు. 33 మోషే, ఏలీయాలు వెళ్తుండగా పేతురు యేసుతో, “ప్రభూ! మనము యిక్కడ ఉండటం మంచిది. మీకొకటి, మోషేకొకటి, ఏలీయా కొకటి మూడు పర్ణశాలలు వేయమంటారా?” అని అడిగాడు. పరిస్థితి అర్థం చేసుకోకుండా అతడు ఈ మాటలు అన్నాడు.

34 పేతురు ఈ మాట అంటుడగానే ఒక మేఘం వచ్చి వాళ్ళను కప్పివేసింది. వాళ్ళను ఆ మేఘం కప్పివేస్తుండగా పేతురుకు, అతనితో ఉన్న వాళ్ళకు భయం వేసింది. 35 ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎన్నుకొన్నవాడు. ఆయన చెప్పినట్లు చెయ్యండి” అని వినబడింది.

36 ఆ స్వరం మాట్లాడటం ముగించాక వాళ్ళకు అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. చాలా కాలందాకా శిష్యులు తాము చూసిన దాన్ని ఎవ్వరికి చెప్పలేదు.

యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం

(మత్తయి 17:14-18; మార్కు 9:14-27)

37 మరుసటి రోజు వాళ్ళు కొండ దిగగానే పెద్ద ప్రజల గుంపు ఒకటి యేసును చూడటానికి అక్కడ సమావేశమైంది. 38 ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! వచ్చి నా కుమారుణ్ణి కటాక్షించుమని వేడు కుంటున్నాను. నాకు ఒక్కడే కుమారుడు. 39 ఒక దయ్యం అతణ్ణి ఆవరిస్తుంది. అది మీదికి రాగానే అతడు బిగ్గరగా కేకలు వేస్తాడు. అది ఆతణ్ణి క్రింద పడవేస్తుంది. అతడు వణుకుతూ నోటినుండి నురుగులు కక్కుతాడు. అది అతణ్ణి వదలటం లేదు. అతణ్ణి పూర్తిగా నాశనం చేస్తొంది. 40 ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని మీ శిష్యుల్ని వేడుకున్నాను. కాని వాళ్ళు ఆ పని చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.

41 యేసు, “మూర్ఖతరం వారలారా! విశ్వాస హీనులారా! మీతో ఉండి ఎన్ని రోజులు సహించాలి? నీ కుమారుణ్ణి పిలుచుకురా!” అని అన్నాడు.

42 ఆ దయ్యం పట్టినవాడు వస్తూవుంటే అది అతణ్ణి నేల మీద పడవేసింది. యేసు ఆ దయ్యాన్ని వెళ్ళిపొమ్మని గద్దించి ఆ బాలునికి నయం చేశాడు. తదుపరి అతణ్ణి అతని తండ్రికి అప్పగించాడు. 43 దేవుని మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం

(మత్తయి 17:22-23; మార్కు 9:30-32)

యేసు చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుండి కోలుకోక ముందే యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు: 44 “నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మనుష్యకుమారుణ్ణి ఒక ద్రోహి యితర్లకు అప్పగిస్తాడు.” 45 వాళ్ళకు దీని అర్థం తెలియలేదు. వాళ్ళకు అర్థం కాకుండునట్లు రహస్యంగా ఉంచబడింది. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు ధైర్యం చాలలేదు.

దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?

(మత్తయి 18:1-5; మార్కు 9:33-37)

46 తమలో అందరికన్నా ఎవరు గొప్ప అన్న అంశంపై శిష్యుల మధ్య ఒక వాదం మొదలైంది. 47 యేసుకు వాళ్ళ ఆలోచనలు తెలిసిపోయాయి. ఆయన ఒక చిన్న పిల్లవాణ్ణి తీసుకొని తన ప్రక్కన నిలబెట్టుకొని 48 వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా పేరిట ఈ పసివానిని అంగీకరిస్తే నన్ను అంగీకరించిన దానితో సమానము. నన్ను అంగీకరిస్తే నన్ను పంపిన వానిని అంగీకరించిన దానితో సమానము. మీలో అందరికన్నా తక్కువవాడు అందరికన్నా గొప్పవానితో సమానము.”

మీకు విరోధికానివాడు మీవాడే

(మార్కు 9:38-40)

49 యోహాను, “అయ్యా! మీ పేరుతో ఒకడు దయ్యాల్ని వదిలిస్తున్నాడు. అతడు మన వాడు కాదు. కనుక అలా చెయ్యవద్దని అడ్డగించాము” అని అన్నాడు.

50 యేసు, “అతణ్ణి ఆపకండి. నాకు వ్యతిరేకంగా ఉండని వాడు నాకు అనుకూలంగా ఉన్న వానితో సమానము” అని అన్నాడు.

విశ్వసించని గ్రామము

51 ఆయన పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగింది. యేసు యెరూషలేము వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. 52 తన దూతల్ని తనకన్నా ముందు పంపాడు. వాళ్ళు ఆయన కోసం అన్నీ సిద్దం చెయ్యాలని ఒక సమరయ పల్లెకు వెళ్ళారు. 53 ఆ వూరి వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయనకు స్వాగతమివ్వలేదు. 54 ఆయన శిష్యులలో యాకోబు, యోహాను యిది చూసి యేసుతో, “ప్రభూ! వాళ్ళను నాశనం చేయటానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటారా?” అని అడిగారు.

55 యేసు వాళ్ళవైపు చూసి వాళ్ళను గద్దించాడు.[a] 56 అక్కడి నుండి వాళ్ళంతా మరొక గ్రామానికి వెళ్ళారు.

యేసును వెంబడించటం

(మత్తయి 8:19-22)

57 వాళ్ళు దారిమీద నడుస్తుండగా ఒకడు యేసుతో, “మీరు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.

58 యేసు, “నక్కలు నివసించటానికి బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడా స్థలం లేదు” అని అన్నాడు.

59 యేసు యింకొకనితో, “నా వెంట రా!” అని అన్నాడు.

కాని అతడు, “ప్రభూ! నేను వెళ్ళి ముందు నా తండ్రిని సమాధి చేసి రానివ్వండి!” అని అన్నాడు.

60 యేసు అతనితో, “చనిపోయిన వాళ్ళ సంగతి చనిపోయినవాళ్ళు చూసుకోనీ. నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు” అని అన్నాడు.

61 ఇంకొకడు, “ప్రభూ! నేను మిమ్మల్ని అనుసరిస్తాను. కాని ముందు వెళ్ళి నాయింటి వాళ్ళకు చెప్పి రానివ్వండి” అని అన్నాడు.

62 అందుకు యేసు, “దున్నుటకు నాగల్ని పట్టుకొని వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు” అని అతనితో చెప్పాడు.

యోబు 23

యోబు జవాబు

23 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:

“ఈవేళ నేను ఇంకా కోపంగా ఆరోపిస్తూనే ఉన్నాను.
    దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు, కనుక నేను ఆరోపిస్తూనే ఉంటాను.
దేవునిని ఎక్కడ వెదకాలో
    ఆయన యొద్దకు ఎలా వెళ్లాలో నాకు తెలిస్తే బాగుండేది, అని నా ఆశ.
నేను దేవునికి నా గాధ వివరించుకొంటాను.
    నేను నిర్దోషిని అని చూపించటంకోసం నా నోరు వాదాలతో నిండిపోతుంది.
నా వాదాలకు దేవుడు ఎలా జవాబు ఇస్తాడో నేను తెలిసికోవాలని కోరుతున్నాను.
    అప్పుడు నేను దేవుని జవాబులు గ్రహిస్తాను.
దేవుడు గొప్ప శక్తితో నాకు విరోధంగా ఉంటాడా?
    లేదు, ఆయన నా మాట వింటాడు!
అక్కడ, దేవుని యెదుట ఒక మంచి మనిషి తన గాధను దేవునికి వివరించవచ్చును.
    అప్పుడు నా న్యాయమూర్తి నన్ను విముక్తుణ్ణి చేయవచ్చును.

“కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు.
    ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు కనబడలేదు.
దేవుడు ఉత్తరాన పని చేస్తున్నప్పుడు నాకు ఆయన కనబడడు.
    దేవుడు దక్షిణంగా తిరిగినప్పుడు ఇంకా ఆయన నాకు కనబడడు.
10 కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు.
    ఆయన నన్ను పరీక్షించటం ముగించినప్పుడు నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. నేను స్వచ్ఛమైన బంగారంలా ఉన్నట్టు ఆయన చూస్తాడు.
11 నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే నడిచాను.
    దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు.
12 దేవుడు ఆజ్ఞాపించే వాటినే నేను ఎల్లప్పుడూ చేస్తాను.
    నా భోజనం కంటే దేవుని నోటినుండి వచ్చే మాటలు నాకు ఇష్టం.

13 “కానీ దేవుడు ఎన్నటికీ మారడు.
    ఏ మనిషి ఆయనకు విరోధంగా నిలబడలేడు.
    దేవుడు అనుకొన్నది ఆయన చేస్తాడు.
14 దేవుడు నాకు వ్యతిరేకంగా ఏమి పథకం వేశాడో దాన్ని ఆయన చేస్తాడు.
    నా కోసం ఆయనకు ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి.
15 అందుకే నేను దేవుని ఎదుట జీవిస్తూ ఉండగా నేను భయపడతాను.
    వీటన్నింటిని గూర్చీ నేను తలచినప్పుడు దేవునికి నేను భయపడతాను.
16 దేవుడు నా హృదయాన్ని బలహీనం చేస్తాడు.
    నేనేమో నా ధైర్యం కోల్పోతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను భయపెడతాడు.
17 కానీ చీకటి నన్ను మౌనంగా ఉండేటట్టు చేయదు.
    గాఢాంధకారం నా ముఖాన్ని కప్పేస్తుంది.

1 కొరింథీయులకు 10

ఇశ్రాయేలు చరిత్ర నుండి హెచ్చరికలు

10 సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వికులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు. అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు. అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే. అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతావాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.

వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు. కొందరు పూజించినట్లు మీరు విగ్రహాలను పూజించకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొన్నారు. లేచి నృత్యం చేసారు.”(A) మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చెయ్యటం వల్ల ఒక్క రోజులో వాళ్ళలో ఇరవై మూడు వేలమంది మరణించారు. వాళ్ళు ప్రభువును శోధించిన విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను పాములు చంపివేసాయి. 10 వాళ్ళవలె సణగకండి. సణగిన వాళ్ళను మరణదూత చంపివేశాడు.

11 మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. 12 కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్నవాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి. 13 మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్థుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.

14 కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండండి. 15 మీరు తెలివిగలవాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి 16 మనము కృతజ్ఞతతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని పంచుకోవటము కదా? మనము విరిచిన రొట్టెను పంచుకోవటము క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా? 17 రొట్టె ఒకటే గనుక ఆ ఒకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనప్పటికిని ఒకే శరీరమైయున్నాము.

18 ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చినదాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా? 19 మరి నేను చెపుతున్నదానికి అర్థం ఏమిటి? విగ్రహాల్లో కాని, ఆరగింపు చేసిన ప్రసాదంలో కాని, ఏదో ప్రత్యేకత ఉందని చెపుతున్నానా? 20 లేదు. నేను చెపుతున్నది ఏమిటంటే యూదులుకానివాళ్ళు బలిపీఠాలపై బలి ఇచ్చినవి దయ్యాల కోసం బలి ఇవ్వబడ్డాయి. అవి దేవునికి అర్పితం కావు. మీరు దయ్యాలతో భాగస్వాములు కారాదని నా విన్నపం. 21 మీరు ప్రభువు పాత్రనుండి త్రాగుతూ దయ్యాల పాత్రనుండి కూడా త్రాగాలని ప్రయత్నించరాదు. మీరు ప్రభువు పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ దయ్యాల పంక్తిలో కూడా కూర్చోవటానికి ప్రయత్నం చేయరాదు. 22 మనం దేవుని కోపాన్ని రేపటానికి ప్రయత్నిద్దామా? మనం ఆయన కంటే శక్తిగలవాళ్ళమా? ఎన్నటికీ కాదు.

మరికొన్ని కర్తవ్యాలు

23 “మనకు ఏది చెయ్యటానికైనా స్వేచ్ఛ ఉంది” కాని అన్నీ లాభదాయకం కావు. “మనకు అన్నీ చెయ్యటానికి స్వేచ్ఛ ఉంది” కాని అన్నిటి వల్ల వృద్ధి కలుగదు. 24 ఎవరూ తమ మంచి కొరకే చూసుకోరాదు. ఇతరుల మంచి కోసం కూడా చూడాలి.

25 మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని అంగడిలో అమ్మే ఏ మాంసాన్నైనా తినండి. 26 “ఎందుకంటే ఈ భూమి, దానిలో ఉన్నవన్నీ ప్రభునివే.”(B)

27 క్రీస్తును విశ్వసించనివాడు మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు ఇష్టముంటే వెళ్ళండి. మనస్సుకు సంబంధించిన ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఏది ఉంచితే అది తినండి. 28 కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని మనస్సుకోసం దాన్ని తినకండి. 29 అంటే, మీ మనస్సు కోసం అని కాదు, ఆ చెప్పినవాని మనస్సు కోసం దాన్ని తినకండి. నా స్వాతంత్ర్యం విషయంలో అవతలివాని మనస్సు ఎందుకు తీర్పు చెప్పాలి? 30 నేను కృతజ్ఞతలు అర్పించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి ఇతరులు నన్నెందుకు విమర్శించాలి?

31 కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ దేవుని ఘనత కోసం చేయండి. 32 యూదులకు గాని, యూదులుకానివాళ్ళకు గాని, దేవుని సంఘానికి గాని, కష్టం కలిగించకుండా జీవించండి. 33 నేను చేస్తున్నట్లు మీరు చెయ్యండి. నేను అన్ని పనులూ ఇతరులను సంతోషపెట్టాలని చేస్తాను. నా మంచి నేను చూసుకోను. వాళ్ళ మంచి కోసం చేస్తాను. వాళ్ళు రక్షింపబడాలని నా ఉద్దేశ్యం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International