M’Cheyne Bible Reading Plan
యాకోబు తన కుమారులను ఆశీర్వదించుట
49 అప్పుడు యాకోబు తన కుమారులందరినీ తన దగ్గరకు పిలిచాడు. అతడు చెప్పాడు: “నా కుమారులందరూ ఇక్కడ నా దగ్గరకు రండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను మీకు చెబుతాను.
2 “యాకోబు కుమారులారా, మీరంతా కలిసి వచ్చి వినండి.
మీ తండ్రి ఇశ్రాయేలు మాటలు వినండి.
3 “రూబేనూ, నీవు నా మొట్టమొదటి కుమారుడవు, నా బలం నీవు.
పురుషునిగా నా శక్తికి మొదటి ఋజువు నీవే.
నా కుమారులందరిలోను గౌరవించదగినవాడివి, మహా బలశాలివి నీవు.
4 కానీ నీవు ఉద్రేకంతో అదుపుదప్పిన ప్రవాహం వలే ఉన్నావు,
కాబట్టి నీవు ఎక్కువ గౌరవించదగిన నా కుమారుడవు కావు
నీ తండ్రి పడకను నీవు ఎక్కావు.
నీ తండ్రి భార్యలలో ఒకదానితో నీవు శయనించావు
నీవు నా పడకకు అవమానం తెచ్చావు,
ఆ పడకపై నీవు శయనించావు.
5 “షిమ్యోను, లేవీ సోదరులు.
తమ ఖడ్గములతో పోరాడటం అంటే వారికి ప్రీతి.
6 రహస్యమందు వారు చెడు కార్యాలను తలస్తారు.
వారి పథకాలలో నా ఆత్మ భాగాన్ని కోరటం లేదు,
వారి రహస్య సమావేశాలను నేను అంగీకరించను,
వారు వారి పగవారిని కోపంతో చంపారు. వారు కేవలం సరదాలకు పశువులకు హాని చేశారు.
7 వారి కోపం శాపం, అది చాల బలీయమయింది.
వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా క్రూరులు.
యాకోబు దేశంలో వారి వంశాలకు వారి స్వంత భూమి వారికి ఉండదు.
ఇశ్రాయేలు అంతటిలో వారు చెదరి ఉంటారు.
8 “యూదా, నీ సోదరులు నిన్ను పొగడుదురు.
నీవు నీ శత్రువులను ఓడిస్తావు.
నీ సోదరులు నీకు సాగిలపడ్తారు.
9 యూదా సింహంలాంటివాడు. కుమారుడా,
తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం వంటి వాడవు నీవు.
యూదా సింహంవంటి వాడు. అతడు విశ్రాంతికోసం పండుకొంటాడు.
అతణ్ణి లేపుటకు ఎవరూ సాహసించరు.
10 యూదా వంశపు పురుషులు రాజులుగా ఉంటారు.
అతని కుటుంబం పరిపాలిస్తుంది అనే సూచన
అసలైన రాజు వచ్చేంతవరకు[a] అతని కుటుంబాన్ని విడువదు.
అప్పుడు అనేక మంది అతనికి విధేయులై అతణ్ణి సేవిస్తారు.
11 అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు[b] శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు.
అతడు తన బట్టలు ఉదుకుటకు శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు.
12 ద్రాక్షారసం త్రాగి అతని కళ్లు ఎరుపెక్కి ఉంటాయి.
పాలు త్రాగి అతని పళ్లు తెల్లగా ఉంటాయి.
13 “జెబూలూను సముద్రానికి సమీపంగా జీవిస్తాడు.
అతని తీరం ఓడలకు క్షేమ స్థలంగా ఉంటుంది.
అతని భూమి సీదోను వరకు విస్తరిస్తుంది.
14 “ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె ఉంటాడు.
భారమైన బరువు మోసినందుచేత అతడు పండుకొని ఉంటాడు.
15 అతడు తన విశ్రాంతి స్థలం మంచిదిగా ఉండేటట్లు చూసుకొంటాడు
తన భూమి రమ్యమైనదిగా ఉండేటట్లు అతడు చూసుకొంటాడు.
తర్వాత అతడు బరువులు మోయుటకు ఒప్పుకొంటాడు.
బానిసగా పని చేసేందుకు అతడు ఒప్పుకొంటాడు.
16 “ఇతర ఇశ్రాయేలు వంశస్థుల్లాగే దాను
తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు.
17 దారి ప్రక్కన ఉండే పామువలె దాను ఉండునుగాక.
త్రోవ దగ్గర పొంచి ఉండే కట్లపామువలె అతడు ఉండుగాక.
ఆ పాము గుర్రపు మడిమెను కాటు వేస్తుంది.
ఆ గుర్రంమీద స్వారీ చేసే మనిషి గుర్రం మీదనుండి పడిపోతాడు.
18 “యెహోవా, నీ రక్షణకోసం నేను కనిపెట్టుకొని ఉన్నాను.
19 “దొంగల గుంపు గాదు మీద పడ్తారు.
కానీ గాదు వారిని తరిమివేస్తాడు.”
20 “ఆషేరు భూమి మంచి ఆహారాన్ని సమృధ్ధిగా పండిస్తుంది
ఒక రాజుకు సరిపోయేలాంటి భోజనం అతనికి ఉంటుంది.”
21 “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు నఫ్తాలి.
అతని మాటలు విన సొంపుగా ఉంటాయి.”
22 “యోసేపు చాలా విజయశాలి.
నీళ్ల ఊట దగ్గర ఎదిగే ద్రాక్షావల్లిలా,
కంచెమీద అల్లుకొనే ద్రాక్షా తీగెలా అతడు ఫలిస్తాడు.
23 చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు.
బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు.
24 అయితే తన మహత్తర విల్లుతోను, నైపుణ్యంగల తన చేతులతోను
అతడు పోరాటం గెల్చాడు.
తన శక్తిని యాకోబు యొక్క శక్తిమంతుని నుండి
గొర్రెల కాపరినుండి, ఇశ్రాయేలు బండనుండి
25 నీకు సహాయకుడైన నీ తండ్రి దేవునినుండి అతడు పొందుతాడు.
“సర్వశక్తిమంతుడగు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక!
పైన ఆకాశంనుండి ఆశీర్వాదములను, అగాధ స్థలములనుండి ఆశీర్వాదములను
ఆయన నీకు అనుగ్రహించునుగాక.
స్తనముల దీవెనలు, గర్భపు దీవెనలు ఆయన నీకు ఇచ్చునుగాక.
26 నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేళ్లు జరిగాయి.
మరియు నీ తండ్రినైన నేను అంతకంటె ఎక్కువగ ఆశీర్వదించబడ్డాను.
నీ సోదరులు నీకు ఏమీ లేకుండా నిన్ను విడిచిపెట్టారు.
అయితే ఇప్పుడు నా ఆశీర్వాదములన్నీ
కొండంత ఎత్తుగా నీమీద క్రుమ్మరించబడతాయి.”
27 “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు.
ఉదయాన అతడు చంపుకొని తింటాడు.
మిగిలిన దానిని అతడు సాయంకాలం పంచుకొంటాడు.”
28 ఇవి ఇశ్రాయేలు పండ్రెండు కుటుంబాలు. మరియు వారి తండ్రి వారితో చెప్పిన విషయాలు ఇవి. వారిలో ప్రతి కుమారునికి తగిన ఆశీర్వాదం అతడు వారికి ఇచ్చాడు. 29 తర్వాత ఇశ్రాయేలు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఇలా చెప్పాడు, “నేను మరణించినప్పుడు నా ప్రజలతో ఉండాలని నేను కోరుచున్నాను. హిత్తీయుడగు ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకులతో బాటు పాతిపెట్టబడాలని కోరుతున్నాను. 30 ఆ గుహ మమ్రే దగ్గర మక్ఫేలా పొలంలో ఉంది. అది కనాను దేశంలో ఉంది. అబ్రాహాము తనను పాతిపెట్టేందుకు స్థలం ఉండాలని ఎఫ్రోను దగ్గర ఆ భూమిని కొన్నాడు. 31 అబ్రాహాము, అతని భార్య శారా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య రిబ్కా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. నా భార్య లేయాను నేను ఆ గుహలోనే పాతిపెట్టాను. 32 హిత్తీ మనుష్యుల దగ్గర కొన్న పొలంలో ఉంది ఆ గుహ.” 33 యాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగించిన తర్వాత అతడు పండుకొని, పడకమీద తన కాళ్లు చాపుకొని మరణించాడు.
యేసు జన్మ వృత్తాంతం
(మత్తయి 1:18-25)
2 ఇది యిలా వుండగా రోమా సామ్రాజ్యమంతటా జనాభా లెక్కలు సేకరించటానికి కైసరు ఔగుస్తు చక్రవర్తి ఒక ప్రకటన జారీ చేశాడు. 2 కురేనియ సిరియ దేశాన్ని పాలిస్తున్న కాలంలో మొదటి సారిగా ఇలాంటి జనాభా లెక్కలు సేకరింపబడ్డాయి. 3 అందువల్ల ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి తమ స్వగ్రామాలకు వెళ్ళారు.
4 యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతడు గలిలయలోని నజరేతు అనే పట్టణం నుండి యూదయ దేశంలోని దావీదు పట్టణానికి వెళ్ళాడు. దీన్ని బేత్లెహేము అని అనే వాళ్ళు. 5 మరియతో ఇతనికి పెళ్ళి నిశ్చయమై ఉంది. మరియ గర్భంతో ఉంది. అతడు ఆమెను తన వెంట తీసుకొని తమ పేర్లు జాబితాలో వ్రాయించుకోటానికి వెళ్ళాడు. 6 వాళ్ళక్కడ ఉండగా ఆమెకు ప్రసవవేదన వచ్చింది. 7 ఆమె మగ శిశువును ప్రసవించింది. ఈయన ఆమె మొదటి కుమారుడు. వాళ్ళకు సత్రంలో గది దొరకనందువల్ల ఆమె ఆ పసివాణ్ణి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది.
గొఱ్ఱెల కాపరులు చూసిన దృశ్యం
8 ఊరు ప్రక్క పొలాల్లో ఉన్న గొఱ్ఱెల కాపరులు రాత్రివేళ తమ గొఱ్ఱెల్ని కాపలాకాస్తూ ఉన్నారు. 9 ఒక దేవదూత వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ చుట్టూ దివ్యమైన వెలుగు ప్రకాశించింది. వాళ్ళు చాలా భయపడ్డారు. 10 ఆ దేవదూత వాళ్ళతో, “భయపడకండి! మీకే కాక ప్రజలందరికి ఆనందం కలిగించే సువార్త తెచ్చాను. 11 దావీదు పట్టణంలో ఈ రోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఆయనే మన ప్రభువు. 12 మీకొక గుర్తు చెబుతాను. పశువుల తొట్టిలో, పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక పసివాడు మీకు కనిపిస్తాడు” అని అన్నాడు.
13 తక్షణం పరలోకంలోనుండి చాలామంది దేవదూతలు వచ్చి అక్కడున్న దేవదూతతో నిలుచొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా అన్నారు:
14 “మహోన్నత లోకంలోవున్న దేవునికి మహా తేజస్సు కలుగుగాక!
భూమ్మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగుగాక!”
15 దేవదూతలు వాళ్ళను వదిలి పరలోకానికి వెళ్ళి పొయ్యాక గొఱ్ఱెల కాపరులు, “జరిగిన దాన్ని గురించి ప్రభువు మనకు చెప్పాడు. బేత్లెహేము వెళ్ళి ఇది చూసి వద్దాం” అని మాట్లాడుకొన్నారు.
16 వాళ్ళు తక్షణం అక్కడికి వెళ్ళారు. మరియను, యోసేపును, తొట్టిలో పడుకొనివున్న పసివాణ్ణి, చూసారు. 17 ఆ బాలుణ్ణి చూసాక ఆయన్ని గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో చెప్పారు. 18 వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు. 19 కాని, మరియ యివన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది. 20 గొఱ్ఱెల కాపరులు తాము విన్నవి, చూసినవి దేవదూత చెప్పినట్లు జరిగినందుకు వాటిని గురించి మాట్లాడుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన తేజస్సును పొగుడుతూ తిరిగి వెళ్ళిపొయ్యారు.
21 ఎనిమిదవ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అని నామకరణం చేసారు. మరియ గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు.
బాలుని దేవాలయానికి తీసుకెళ్ళటం
22 మోషే ధర్మశాస్త్రానుసారం మరియ, యోసేపులు పరిశుభ్రం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళు ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్పించటానికి యెరూషలేముకు వెళ్ళారు. 23 ప్రభువు యొక్క ధర్మశాస్త్రంలో, “మొదటి మగసంతానాన్ని దేవునికి సమర్పించాలి”[a] అని వ్రాయబడి ఉంది. 24 అంతేకాక, ప్రభువు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి యివ్వాలనుకొన్నారు.
సుమెయోను యేసును చూడటం
25 ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు. 26 ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపర్చాడు. 27 పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు. 28 సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్తో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడు:
29 “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు.
30 నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను.
31 నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు!
32 యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే.
నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!”
33 యేసు తల్లితండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. 34 ఆ తర్వాత సుమెయోను వాళ్ళను ఆశీర్వదించి యేసు తల్లియైన మరియతో ఈ విధంగా అన్నాడు: “ఈ బాలుని కారణంగా ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు! మరెందరో పడిపోతారు! ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలా మంది ఎదిరిస్తారు. 35 తద్వారా మనుష్యుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయట పడ్తాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.”
అన్నా యేసును చూడటం
36 ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది. 37 అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది.
38 మరియ, యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి గురించి చెప్పింది.
యోసేపు, మరియ ఇంటికి తిరిగి రావటం
39 ప్రభువు ధర్మశాస్త్రానుసారం చేయవలసినవన్నీ చేశాక మరియ, యోసేపులు తమ స్వగ్రామమైన గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు. 40 యేసు పెరిగి పెద్ద వాడయ్యాడు. బలంతోపాటు తెలివి కూడా ఆయనలో అభివృద్ధి కొనసాగింది. దేవుని అనుగ్రహం ఆయన మీద ఉంది.
పన్నెండు ఏండ్ల తర్వాత
41 ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము వెళ్ళేవాళ్ళు. 42 కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు పన్నెండు సంవత్సరాలున్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళారు. 43 పండుగ తర్వాత ఆయన తల్లిదండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళటానికి ప్రమాణమయ్యారు. కాని యేసు యెరూషలేములోనే ఉండిపొయ్యాడు. తల్లిదండ్రులకు ఇది తెలియదు. 44 తమ గుంపులో ఉన్నాడనుకొని వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేసారు. తమతో లేడని గ్రహించాక వాళ్ళు తమ స్నేహితులతో, బంధువులతో ఉన్నాడనుకొని వాళ్ళలో వెతకసాగారు. 45 ఆయన కనిపించక పోయే సరికి వాళ్ళు ఆయన్ని వెతకటానికి యెరూషలేము తిరిగి వెళ్ళారు.
46 మూడు రోజులు వెతికాక ఆయన వాళ్ళకు మందిరంలో కూర్చొని వాళ్ళు చెప్పినవి వింటూ, వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా కన్పించాడు. 47 ఆయనలో ఉన్న గ్రహింపు శక్తికి, ఆయన సమాధానాలకు అక్కడవున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. 48 ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ని చూసి చాలా ఆశ్చర్య పోయారు. యేసు తల్లి ఆయనతో, “ఇలా ఎందుకు చేసావు బాబు? నేను, మీ నాన్న దిగులుపడి అన్ని చోట్లా వెతికాము!” అని అన్నది.
49 యేసు, “నా కోసం ఎందుకు వెతికా రమ్మా! నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా?” అని అన్నాడు. 50 వాళ్ళకు ఆయన అన్న మాటలు అర్థం కాలేదు.
51 ఆ తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు. వినయ విధేయతలతో నడుచుకునే వాడు. కాని ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనల్ని తన మనస్సులో ఆలోచిస్తూ ఉండేది. 52 యేసు జ్ఞానంలో, బలంలో, అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు.
యోబుకు ఎలీఫజు జవాబు
15 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు యోబుకు జవాబిచ్చాడు:
2 “యోబూ! నీవు నిజంగా జ్ఞానం గలవాడవైతే
నీవు వట్టి మాటలతో జవాబు ఇవ్వవు.
జ్ఞానం గల మనిషి పూర్తిగా తూర్పు వేడిగాలి (పనికిమాలిన మాటల) తో ఉండడు.
3 జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని
ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావా?
4 యోబూ! నీ యిష్టం వచ్చినట్టు నీవు ఉంటే
ఎవ్వరూ దేవుణ్ణి గౌరవించరు, ఆయన్ని ప్రార్థించరు. దేవుని సన్నిధియందు చేసే ధ్యానానికి నీవు ఆటంకం తెస్తావు.
5 నీవు చెప్పే విషయాలు నీ పాపాన్ని తేటగా చూపిస్తాయి.
యోబూ! నీవు తెలివిగల మాటలు ప్రయోగించి నీ పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావు.
6 నీది తప్పు అని నేను నీకు రుజువు చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకు? నీ స్వంత నోటితో నీవు పలికే విషయాలే నీ తప్పును తెలియ జేస్తున్నాయి.
నీ స్వంత పెదాలు నీకు విరోధంగా మాట్లాడుతున్నాయి.
7 “యోబూ! మొట్ట మొదట పుట్టింది నీవే అని తలుస్తున్నావా?
కొండలు చేయబడక ముందే నీవు జన్మించావా?
8 దేవుని రహస్య పథకాలు నీవు విన్నావా?
నీ మట్టుకు నీవు ఒక్కడవు మాత్రమే జ్ఞానం గలవాడవని తలుస్తున్నావా?
9 యోబూ! నీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ తెలుసు.
నీవు గ్రహించలేని విషయాలు మేము గ్రహిస్తాం.
10 తల నెరసిన మనుష్యులు మరియు వృద్ధులు మాతో ఏకీభవిస్తారు.
అవును, చివరికి నీ తండ్రికంటే పెద్ద వాళ్లు కూడా మా పక్షంగా ఉన్నారు.
11 దేవుడు నిన్ను ఆదరించేందుకు ప్రయత్నిస్తాడు
కానీ నీకు అది మాత్రమే చాలదు.
సౌమ్యమయిన పద్ధతిలో దేవుని సందేశం మేము నీకు చెప్పాము.
12 యోబూ! నీవెందుకు అర్థం చేసుకోవు?
సత్యాన్ని ఎందుకు చూడలేక పోతున్నావు?
13 నీవు ఈ కోపపు మాటలు చెప్పినప్పుడు
నీవు దేవునికి విరోధంగా ఉన్నావు.
14 “ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు.
స్త్రీ నుంచి జన్మించిన మనిషి, దేవునితో సరిపడి ఉండ జాలడు.
15 దేవుడు కనీసం తన దూతలను కూడ నమ్మడు.
దూతలు నివసించే ఆకాశం కూడా పవిత్రమైనది కాదు.
16 మానవుడు అంతకంటే దౌర్భాగ్యుడు.
మానవుడు అసహ్యమైనవాడు మరియు పాడైపోయాడు.
అతడు మంచి నీళ్లు త్రాగినట్టుగా కీడును త్రాగుతాడు.
17 “యోబూ, నా మాట విను. నేను దానిని నీకు వివరిస్తాను.
నాకు తెలిసిన దానిని నేను నీతో చెబుతాను.
18 జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు నేను నీతో చెబుతాను.
ఆ జ్ఞానం గల మనుష్యుల పూర్వీకులు ఈ విషయాలను వారితో చెప్పారు.
ఆ జ్ఞానులు రహస్యాలేమీ నా దగ్గర దాచిపెట్టలేదు.
19 వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది.
వారిని ఇబ్బంది పెట్టేందుకు పరాయివాళ్లు ఎవరూ ఆ దేశంలో లేరు.
20 దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధతో శ్రమ పడతాడు.
క్రూరమైన మనిషి తన కోసం దాచ బడిన సంవత్సరాలన్నింటిలో శ్రమపడతాడు,
21 భయంకర శబ్దాలు అతని చెవులకు వినిపిస్తాయి
మరియు అతడు క్షేమంగా ఉన్నానని అనుకొన్నప్పుడు శత్రువు అతని మీద దాడి చేస్తాడు.
22 దుర్మార్గపు వ్యక్తి చాలా విసిగిపోతాడు. చీకటి నుండి తప్పించుకొనే ఆశ అతనికి ఉండదు.
అతణ్ణి చంపివేసేందుకు ఎక్కడో ఒక ఖడ్గం కనిపెడుతూనే ఉంటుంది.
23 అతడు అటూ ఇటూ ఆహారం కోసం ‘ఎక్కడ అది’ అంటూ సంచరిస్తూనే ఉంటాడు.
కాని అతని శరీరం రాబందులకు ఆహారం అవుతుంది. అతనికి చావు మూడిందని అతనికి తెలుసు.
24 చింత, శ్రమ అతణ్ణి భయపెడుతున్నాయి. అతణ్ణి నాశనం చేసేందుకు
ఒక రాజు సిద్ధంగా ఉన్నట్టు ఈ విషయాలు అతనిపై దాడి చేస్తాయి.
25 ఎందుకంటే దుర్మార్గుడు దేవుని మీద తన పిడికిలి బిగిస్తాడు కనుక దుర్మార్గుడు దేవునికి విధేయుడయ్యేందుకు నిరాకరిస్తాడు.
సర్వశక్తిమంతుడైన దేవునికి విరోధంగా దుర్మార్గుడు బలవంతునిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.
26 ఆ మనిషి చాలా మొండివాడు.
దుర్మార్గుడు తన బలమైన లావుపాటి కేడెముతో దేవుని మీద దాడి చేస్తాడు.
27 దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి వుండవచ్చు.
వాని నడుము కొవ్వు పొరలతో బలిసి ఉండవచ్చు.
28 కానీ శిథిలమైన పట్టణాల్లో వాడు నివసిస్తాడు.
ఎవరూ నివసించని ఇండ్లలో ఆ దుర్మార్గుడు నివసిస్తాడు.
అవి పడిపోయేట్టు ఉన్న శిథిల గృహాలు.
29 దుర్మార్గుడు ధనికుడుగా ఉండవచ్చు.
అతని ఐశ్వర్యం ఎక్కువ కాలం ఉండదు.
అతని పంటలు ఎక్కువగా పండవు.
30 దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు.
అగ్నిచేత కొమ్మలు కాలిపోయిన చెట్టులా అతడు ఉంటాడు.
దేవుని శ్వాస దుర్మార్గుని తుడిచివేస్తుంది.
31 దుర్మార్గుడు పనికిమాలిన వాటిని నమ్ముకొని తనను తానే మోసం చేసుకోకూడదు.
ఎందుకంటే, వానికి ఏమీ దొరకదు కనుక.
32 దుర్మార్గుని ఆయుష్షు తీరిపోకముందే
వాడు ముసలివాడై, ఎండిపోతాడు. మళ్లీ ఎన్నటికి పచ్చగా ఉండని ఎండిపోయిన కొమ్మలా అతడు ఉంటాడు.
33 ద్రాక్షాపండ్లు పక్వానికి రాకముందే రాలిపోతున్న ద్రాక్షావల్లిలా దుర్మార్గుడు ఉంటాడు.
ఆ వ్యక్తి పూలు రాలిపోయిన ఒలీవ చెట్టులా ఉంటాడు.
34 ఎందుకంటే, దేవుడు లేని ప్రజల పని వ్యర్థము.
డబ్బును ప్రేమించే మనుష్యుల ఇండ్లు అగ్నిచేత నాశనం చేయబడతాయి.
35 వారు కష్టాలకు పథకం వేసి దుర్మార్గపు పనులు చేస్తారు.
మనుష్యులను మోసం చేసేందుకు వారు ప్రయత్నం చేస్తారు.”
మానవులను అనుసరించుట తప్పు
3 సోదరులారా! ఆత్మీయత కలవాళ్ళతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక పొయ్యాను. ఆత్మీయత లేనివాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడాను. క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితంలో, మిమ్నల్ని పసిపిల్లలుగా పరిగణించి మాట్లాడాను. 2 మీరు అన్నం తినటానికి సిద్ధంగా లేరు. కనుక పాలు యిచ్చాను. మీరు ఇప్పటికీ సిద్దంగా లేరు. మీరింకా ఆత్మీయత లేనివాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. 3 మీలో అసూయలు, పోట్లాటలు ఇంకా ఉన్నాయి. అంటే మీరు ఆత్మీయత లేనివాళ్ళలా జీవిస్తున్నట్లే కదా! అంటే మీరు మిగతావాళ్ళలా జీవిస్తున్నట్లే కదా! 4 మీలో ఒకడు, “నేను పౌలును అనుసరిస్తున్నాను” అని, మరొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని అంటున్నారు. అలా మామూలు మనుష్యులు అంటారు.
5 ఇంతకూ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము కేవలం దేవుని సేవకులం. మా ద్వారా మీరు క్రీస్తును విశ్వసించారు. అంతే. ప్రభువు అప్పగించిన కర్తవ్యాన్ని మాలో ప్రతి ఒక్కడూ నిర్వర్తించాడు. 6 నేను విత్తనం నాటాను. అపొల్లో నీళ్ళు పోసాడు. కాని దాన్ని పెంచుతున్నవాడు దేవుడే. 7 విత్తనం నాటటం, నీళ్ళు పోయటం ముఖ్యంకాదు. దాన్ని పెంచే దేవుడు ముఖ్యమైనవాడు. 8 విత్తనం నాటేవానికి, నీళ్ళు పోసేవానికి ఉద్దేశ్యం ఒక్కటే. చేనిన పనిని బట్టి ప్రతీ ఒక్కనికి ప్రతిఫలం లభిస్తుంది. 9 ఎందుకంటే, మేము దేవునితో కలిసి పనిచేసేవాళ్ళం.
మీరు ఆయన పొలమునూ ఆయన భవనమునై యున్నారు. 10 దేవుని అనుగ్రహం వల్ల నేను నేర్పుగల నిర్మాణకుడుగా పునాదులు వేసాను. ఇతరులు ఆ పునాదిపై కడుతున్నారు. ప్రతి ఒక్కడూ తానేవిధంగా కడుతున్నాడో గమనిస్తూ జాగ్రత్తగా కట్టాలి. 11 ఆ “పునాది” యేసు క్రీస్తు కనుక ఇదివరకే వేసిన ఆ పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వరూ వేయలేరు. 12 కొందరు బంగారము, వెండి, విలువైన రత్నాలు ఉపయోగించి ఈ పునాది మీద కడతారు. మరికొందరు చెక్కను, గడ్డిని, ఆకుల్ని ఉపయోగించి కడతారు. 13 వాళ్ళ పనితనము క్రీస్తు వచ్చిన రోజున ఆయనయొక్క వెలుగులో బయటపడుతుంది. “ఆ రోజు” నిప్పువలె వస్తుంది. ఆ నిప్పు ప్రతి ఒక్కరి పనితనాన్ని పరీక్షిస్తుంది. 14 వాళ్ళు నిర్మించింది నిలిస్తే వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. 15 అది కాలిపోతే వాళ్ళకు నష్టం కలుగుతుంది. కాని మంటలనుండి అతనొక్కడే తప్పించుకొన్న విధంగా రక్షింపబడతాడు.
16 మీరు దేవుని మందిరమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? 17 కనుక దేవుని మందిరాన్ని నాశనం చేసినవాణ్ణి దేవుడు నాశనం చేస్తాడు. దేవుని మందిరం పవిత్రమైనది. మీరే ఆ మందిరం.
18 మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ప్రాపంచిక విషయాల్లో తెలివి ఉందని భావించేవాడు మొదట తనను తాను జ్ఞానహీనునిగా ఎంచుకొంటే తర్వాత జ్ఞాని కాగలడు. 19 ఎందుకంటే దేవుడు ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని మూర్ఖమైనదానిగా పరిగణిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో, “తమ చమత్కారము ఉపయోగించే జ్ఞానుల్ని దేవుడు పట్టేస్తాడు”(A) అని వ్రాయబడి ఉంది. 20 మరొకచోట, “జ్ఞానుల ఆలోచనలు పనికిరావని ప్రభువుకు తెలుసు”(B) అని వ్రాయబడి ఉంది. 21 కనుక మానవుల తెలివిని పొగడకండి. అవన్నీ మీవి. 22 పౌలు, అపొల్లో, కేఫా, ప్రపంచము, బ్రతుకు, చావు, ప్రస్తుతము, భవిష్యత్తు అన్నీ మీవి. 23 మీరు క్రీస్తుకు చెందినవారు. క్రీస్తు దేవునికి చెందినవాడు.
© 1997 Bible League International