M’Cheyne Bible Reading Plan
మనష్షే, ఎఫ్రాయిములకు ఆశీర్వాదాలు
48 కొంత కాలం తర్వాత, తన తండ్రి చాలా అస్వస్థతగా ఉన్నాడని యోసేపుకు తెలిసింది. కనుక మనష్షే, ఎఫ్రాయిము అనే తన యిద్దరు కుమారులను తీసుకొని, యోసేపు తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. 2 యోసేపు వచ్చినప్పుడు ఎవరో ఇశ్రాయేలుతో చెప్పారు, “నీ కుమారుడు యోసేపు నిన్ను చూడటానికి వచ్చాడు” అని. ఇశ్రాయేలు చాలా బలహీనంగా ఉన్నాడు, అయినప్పటికీ కష్టంగా ప్రయత్నించి తన పడకమీద కూర్చున్నాడు.
3 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు, “కనాను దేశంలోని ఊజు వద్ద సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 4 దేవుడు నాతో చెప్పాడు: ‘నిన్ను ఒక గొప్ప వంశంగా నేను చేస్తాను. నీకు అనేకమంది పిల్లలను నేను ఇస్తాను, మీరు గొప్ప జనం అవుతారు. మీ వంశీకులు ఈ భూమిని శాశ్వతంగా స్వంతం చేసుకుంటారు.’ 5 ఇప్పుడు నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నేను రాకముందు యిక్కడ ఈజిప్టు దేశంలో ఈ ఇద్దరు కుమారులు పుట్టారు. ఎఫ్రాయిము, మనష్షే అనే నీ యిద్దరు కుమారులు నా స్వంత కుమారుల్లాగే ఉంటారు. రూబేను, షిమ్యోనులు నాకెలాగో వారు కూడ నాకు అంతే. 6 కనుక ఈ ఇద్దరు బాలురు నా కుమారులే. నాకు ఉన్న దానంతటిలో వారికి కూడ భాగం ఉంది. అయితే నీకు ఇంకా కుమారులు పుడితే, వాళ్లు నీ స్వంత కుమారులుగా ఉంటారు. అయితే వారు ఎఫ్రాయిము మనష్షేలకు కుమారులుగా ఉంటారు. అంటే భవిష్యత్తులో ఎఫ్రాయిము, మనష్షేలు కలిగి ఉండే దానంతటిలో వాళ్లూ భాగస్థులవుతారు. 7 పద్దనరాము నుండి చేసిన ప్రయాణంలో రాహేలు చనిపోయింది. ఇది నాకు చాలా దుఃఖం కలిగించింది. ఆమె కనాను దేశంలో చనిపోయింది. అప్పటికి మేము ఇంకా ఎఫ్రాతా (ఎఫ్రాతా బెత్లెహేము) వైపు ప్రయాణం చేస్తున్నాం. ఎఫ్రాతా పోయే మార్గంలో నేను ఆమెను సమాధి చేశాను.”
8 అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు.
9 యోసేపు తన తండ్రితో, “వీళ్లు నా కుమారులు. దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిలు వీళ్లే” అని చెప్పాడు.
“నీ కుమారులను నా దగ్గరకు తీసుకొని రా! నేను వారిని ఆశీర్వదిస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.
10 ఇశ్రాయేలు వృద్ధుడు గనుక అతని చూపు సరిగ్గా లేదు. అందుచేత యోసేపు ఆ బాలురను తన తండ్రికి దగ్గరగా తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు వారిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. 11 అప్పుడు ఇశ్రాయేలు, “నీ ముఖం మళ్లీ చూస్తానని నేను ఎన్నడూ అనుకోలేదు. అయితే చూడు! నిన్ను, నీ పిల్లలను కూడ దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు యోసేపుతో.
12 అప్పుడు యోసేపు ఆ బాలురను ఇశ్రాయేలు ఒడిలోనుండి దించగా, వారు అతని తండ్రి ఎదుట సాగిలపడ్డారు.
13 ఎఫ్రాయిమును తన కుడి ప్రక్కను, మనష్షేను తన ఎడమ ప్రక్కను యోసేపు ఉంచాడు. (కనుక ఇశ్రాయేలుకు ఎడమ ప్రక్క ఎఫ్రాయిము, కుడి ప్రక్క మనష్షే ఉన్నారు). 14 కానీ ఇశ్రాయేలు తన చేతులను అటుయిటు మార్చి చిన్న పిల్లవాడు ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు పెద్దపిల్లవాడు మనష్షే తలమీద తన ఎడమ చేతిని పెట్టాడు. మనష్షే జ్యేష్ఠుడైనప్పటికి అతడు తన ఎడమ చేతిని మనష్షే మీద ఉంచాడు. 15 మరియు ఇశ్రాయేలు యోసేపును ఆశీర్వదించి ఇలా చెప్పాడు:
“నా పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు మన దేవుణ్ణి ఆరాధించారు.
ఆ దేవుడే నా జీవితమంతా నన్ను నడిపించాడు.
16 ఆయనే నా కష్టాలన్నింటినుండి నన్ను రక్షించిన దూత.
ఆయనే ఈ బాలురను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
ఇప్పుడు ఈ పిల్లలకు నా పేరు ఉంటుంది. మన పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకుల పేర్లు వారికి ఉంటాయి.
వారు ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప రాజ్యాలుగా ఎదగాలని నా ప్రార్థన.”
17 తన తండ్రి కుడిచేయి ఎఫ్రాయిము మీద ఉంచినట్లు యోసేపు చూశాడు. ఇది యోసేపుకు సంతోషం కలిగించలేదు. యోసేపు తన తండ్రి చేయి తీసుకొని, ఎఫ్రాయిము తలమీదనుండి తీసి, మనష్షే తలమీద ఉంచాలనుకొన్నాడు. 18 యోసేపు తన తండ్రితో, “నీ కుడి చేయి సరైన వాడిమీద పెట్టలేదు. మనష్షే జ్యేష్ఠుడు” అని చెప్పాడు.
19 అయితే అతని తండ్రి వాదించి చెప్పాడు, “నాకు తెలుసు కొడుకా, మనష్షే జ్యేష్ఠుడు. అతడు గొప్పవాడవుతాడు. అతడు అనేకమంది ప్రజలకు తండ్రి కూడ అవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాడికంటె గొప్పవాడవుతాడు. మరియు చిన్నవాడి వంశం ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది.”
20 అలా ఇశ్రాయేలు ఆనాడు వారిని ఆశీర్వదించాడు.
“ఇశ్రాయేలువారు ఆశీర్వదించుటకు
నీ నామాన్ని ఉపయోగిస్తారు.
ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు ‘దేవుడు ఎఫ్రాయిము
మరియు మనష్షేవలె చేయునుగాక అని వాళ్లంటారు’ అని అతడు చెప్పాడు.”
ఈ విధంగా మనష్షేకంటె ఎఫ్రాయిమును గొప్ప చేశాడు ఇశ్రాయేలు.
21 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు “చూడు, నా మరణ ఘడియ దాదాపు సమీపించింది. అయితే దేవుడు మాత్రం ఇంకా మీతో ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి ఆయన మిమ్మును నడిపిస్తాడు. 22 నీ సోదరులకు ఇవ్వనిది నేను నీకు ఇచ్చాను. అమోరీ ప్రజలనుండి నేను గెలుచుకొన్న పర్వతాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ పర్వతం కోసం నా కత్తితో, నా బాణంతో నేను ఆ మనుష్యులతో పోరాడి గెల్చాను.”
మరియ ఎలీసబెతును కలుసుకోవటం
39 మరియ వెంటనే యూదా పర్వత ప్రాంతం లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమైంది. 40 ఆ గ్రామంలోనున్న జెకర్యా యింటికి వెళ్ళి ఎలీసబెతును కలుసుకొని ఆమె క్షేమ సమాచారాలు అడిగింది. 41 ఎలీసబెతు ఆమె మాటలు విన్న తక్షణమే, ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాడు. ఎలీసబెతు పవిత్రాత్మతో నిండిపోయింది.
42 ఆమె బిగ్గరగా, “దేవుడు ఏ స్త్రీని దీవించనంతగా నిన్ను దీవించాడు. అదే విధంగా నీ గర్భంలో నున్న శిశువు కూడా ధన్యుడు. 43 కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా? 44 నీ మాటలు నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. 45 ప్రభువు చెప్పినట్లు జరుగుతుందని విశ్వసించావు. ధన్యురాలవు” అని అన్నది.
మరియ పాడిన భక్తి గీతం
46 మరియ ఈ విధంగా అన్నది:
47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది.
దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48 దీనురాల్ని నేను!
ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
నన్ను ధన్యురాలంటారు!
49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51 తన బలమైన హస్తాన్ని జాపి
గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
అతని సంతతితో చెప్పినట్లు
55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”
56 మరియ ఎలీసబెతు యింట్లో మూడు నెలలుండి, ఆ తర్వాత యింటికి తిరిగి వెళ్ళిపోయింది.
యోహాను జన్మ వృత్తాంతం
57 ఎలీసబేతుకు నెలలు నిండి మగశిశువును ప్రసవించింది. 58 బంధువులు మరియు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు.
59 ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు. 60 కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది.
61 వాళ్ళు, “మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవ్వరూ లేరే?” అని అన్నారు. 62 ఆ పిల్లవాని తండ్రికి సంజ్ఞలు చేసి అతడే పేరు పెట్టదలచాడో అని అడిగారు.
63 అతడు వ్రాయటానికి ఒక పలక నివ్వమని అడిగి దానిపై, “అతనికి యోహాను అని పేరు పెట్టండి” అని వ్రాసాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. 64 వెంటనే అతని నోరు, నాలుక కదిలి బాగైపోయింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. 65 ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ నిండుకుపొయ్యాయి. యూదయ పర్వత ప్రాంతమంతా ఈ వార్త వ్యాపించింది. 66 ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది.
జెకర్యా చెప్పిన భవిష్యం
67 ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు:
68 “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి!
ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
69 మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి
మనకోసం పంపాడు.
70 గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా
ఈ విషయం చెప్పాడు.
71 దేవుడు శత్రువుల బారినుండి,
మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
72 మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు.
పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
73 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
74 మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
75 జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!
76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు!
ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
77 పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!
78 “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి
ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
79 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి
మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”
80 ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.
14 యోబు ఈ విధంగా చెప్పాడు:
“మనమందరం కష్టంతో నిండిన
కొద్దిపాటి జీవితం కోసమేపుట్టాం.
2 మనిషి జీవితం పువ్వులాంటిది.
అతడు త్వరగా పెరిగి, త్వరగా చస్తాడు.
కొంచెం సేపు ఉండి, ఆ తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం.
3 దేవా, నీవు అలాంటి మనిషిని గమనిస్తావా?
నీతో తీర్పు పొందటానికి నన్ను నీ ముందుకు తీసుకొనిరమ్ము.
4 “మురికి దానిలో నుండి శుభ్రమైన దాన్ని ఎవరు తీయగలరు? ఎవ్వరూ తీయలేరు.
5 నరుని జీవితం పరిమితం.
దేవా, నరుని మాసాల సంఖ్య నీవు నిర్ణయం చేశావు.
నరుడు మార్చజాలని హద్దులు నీవు ఉంచావు.
6 కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని ఒంటరిగా విడిచిపెట్టు.
అతని కాలం తీరేవరకు అతని కష్టజీవితం అతణ్ణి అనుభవించనివ్వు.
7 “అయితే ఒక చెట్టుకు నీరీక్షణ ఉంది.
దాన్ని నరికివేస్తే, అది మరల పెరుగుతుంది.
అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది.
8 భూమిలో దాని వేర్లు పాతవైపోవచ్చును.
దాని మొద్దు మట్టిలో చీకిపోవచ్చును.
9 కానీ నీళ్లు ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది.
మొక్కల్లా అది కొమ్మలు వేస్తుంది.
10 అయితే మనిషి మరణిస్తాడు.
అతని శరీరం పాతి పెట్టబడుతుంది. మనిషి చనిపోయినప్పుడు, అతుడు వెళ్లిపోయాడు.
11 సముద్రంలో నీరు ఇంకిపోయినట్టు,
ఒక నది నీరు ఎండిపోయినట్టు
12 సరిగ్గా అదే విధంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు,
అతడు పండుకొని, మళ్లీ లేవలేడు.
మరణించే మనుష్యులు, ఆకాశాలు ఉండకుండా పోయేంత వరకు
మేల్కొనరు, నిద్రించటం మానుకోరు.
13 “నీవు నన్ను నా సమాధిలో దాచిపెడితే బాగుండునని నా (యోబు) ఆశ.
నీ కోపం పోయేవరకు, నీవు నన్ను అక్కడ దాచిపెడితే బాగుండుననిపిస్తుంది నాకు.
అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు నీవు ఒక సమయాన్ని ఏర్పరచుకోవచ్చు
14 ఒక మనిషి మరణిస్తే, అతడు మరల బ్రతుకుతాడా?
నేను వేచి ఉంటాను, నేను విడుదల అయ్యేంత వరకు కష్టపడి పోరాడుతాను.
15 దేవా, నీవు నన్ను పిలుస్తావు,
నేను (యోబు) నీకు జవాబు ఇస్తాను.
నన్ను నీవు చేశావు,
నన్ను నీవు కోరుతావు
16 అప్పుడు నేను వేసే ప్రతి అడుగూ నీవు గమనిస్తావు.
కానీ, నేను చేసిన పాపాలు నీవు జ్ఞాపకం చేసుకోవు.
17 నీవు నా పాపాలు ఒక సంచిలో కట్టివేసి, దూరంగా పారవేయి.
18 “సరిగ్గా ఒక పర్వతం కూలిపోయినట్టు
ఒక బండదాని స్థలం నుండి తొలగించబడినట్టు
19 నీళ్లు రాళ్లను కడిగివేసి వాటిని అరగ దీసినట్టు,
నీళ్లు నేలమీద మట్టిని కొట్టుకుపోవునట్లు,
అదే విధంగా, దేవా నీవు ఒక మనిషి ఆశను నాశనం చేస్తావు.
20 నీవు మనిషిని ఒకసారి ఓడించి ముగిస్తే
మనిషి పోయినట్టే.
నీవు వాని ముఖాన్ని చావు ముఖంగా మార్చివేసి
శాశ్వతంగా వానిని పంపించివేస్తావు.
21 వాని కుమారులు గౌరవించబడినా అది ఎన్నటికీ అతనికి తెలియదు.
అతని కుమారుడు చెడు చేస్తే అతడు ఎన్నటికీ దానిని చూడడు.
22 మనిషి తన స్వంత శరీరంతో బాధ అనుభవిస్తాడు.
అతడు తన కోసమే ఎక్కువగా దుఃఖిస్తాడు.”
నా సందేశం: సిలువ వేయబడిన యేసు క్రీస్తు
2 సోదరులారా! నేను మీ దగ్గరకు వచ్చి దేవుని రహస్యాన్ని ప్రకటించినప్పుడు మాటల చాతుర్యంతో గాని లేక ఉత్కృష్టమైన విజ్ఞానంతో గాని ప్రకటించలేదు[a] 2 ఎందుకంటే నేను మీతో ఉన్నప్పుడు యేసు క్రీస్తునూ, ఆయన సిలువ మరణాన్ని తప్ప మిగతా వాటిని గురించి మరచిపోవాలని నిర్ణయించుకొన్నాను. 3 నేను మీదగ్గరకు వచ్చినప్పుడు నా శక్తిపై నమ్మకం పెట్టుకొని రాలేదు. భయంతో వణుకుతూ వచ్చాను. 4 మిమ్నల్ని సమ్మతింప చెయ్యాలని నేను జ్ఞానంతో నిండిన పదాలుపయోగించి నా సందేశం బోధించలేదు. దేవుని ఆత్మ యిచ్చిన శక్తినుపయోగించి నా సందేశంలో ఉన్న సత్యాన్ని ఋజువు చేసాను. 5 మీ విశ్వాసానికి మానవుల పాండిత్యం కాకుండా దేవుని శక్తి పునాదిగా ఉండాలని నా ఉద్దేశ్యం.
ఆత్మ ఇచ్చిన జ్ఞానము
6 కాని ఆత్మీయ పరిపూర్ణత పొందినవాళ్ళకు మేము జ్ఞానంతో నిండిన సందేశం చెపుతాము. ఆ సందేశం ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు. అది ప్రపంచాన్ని పాలించే పాలకులకు సంబంధించిన జ్ఞానమూ కాదు. చివరికి ఆ పాలకులు లేకుండా పోతారు. 7 నేను చెపుతున్నది దేవుడు చెప్పిన రహస్య జ్ఞానం. “ఇది” ఇంతదాకా మానవులనుండి రహస్యంగా దాచబడిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు మహిమ కలగాలని కాలానికి ముందే దేవుడు నిర్ణయించాడు. 8 ఈనాటి పాలకులు దాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని అర్థం చేసుకొనివుంటే మహిమా స్వరూపి అయిన మన ప్రభువును సిలువకు వేసి చంపేవాళ్ళు కాదు. 9 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకోసం సిద్ధంగా
ఉంచిన వాటిని ఎవరి కళ్ళూ చూడలేదు.
ఎవరి చెవులు వినలేదు.
ఎవరూ వాటిని ఊహించలేదు.”(A)
10 కాని దేవుడు ఈ రహస్యాన్ని మనకు తన ఆత్మ ద్వారా తెలియచేసాడు.
ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తాడు. దేవునిలో దాగి ఉన్నవాటిని కూడా పరిశోధిస్తాడు. 11 మానవునిలో ఉన్న ఆలోచనలు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. అదే విధంగా దేవునిలో ఉన్న ఆలోచనలు ఆయన ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. 12 మనం ఈ ప్రపంచానికి సంబంధించిన ఆత్మను పొందలేదు. దేవుడు పంపిన ఆత్మను మనం పొందాము. తాను ఉచితంగా యిచ్చినవాటిని గురించి మనం తెలుసుకోవాలని ఆయన ఉద్ధేశ్యం.
13 మానవులు తమ జ్ఞానంతో బోధించిన పదాలను వాడకుండా ఆత్మ బోధించిన పదాలను వాడి, ఆత్మీయ సత్యాలను ఆత్మీయ భాషలో చెపుతూ ఉంటాము. 14 తనలో దేవుని ఆత్మ లేని మానవుడు, దేవుని ఆత్మ ఇచ్చే వరాలను అంగీకరించడు. అతనికవి మూర్ఖంగా కనిపిస్తాయి. వాటిని ఆత్మీయంగా మాత్రమే అర్థం చేసుకోగలము కనుక అతడు వాటిని అర్థం చేసుకోలేడు. 15 ఆత్మీయంగా ఉన్నవాడు అందరిపై తీర్పు చెప్పకలడు. కాని అతనిపై ఎవడూ తీర్పు చెప్పలేడు. 16 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ప్రభువులో ఉన్న జ్ఞానం ఎవరు తెలుసుకోగలరు? ప్రభువుకు ఎవరు సలహా యివ్వగలరు?”(B)
కాని మన విషయం వేరు. మనలో క్రీస్తు మనస్సు ఉంది.
© 1997 Bible League International