M’Cheyne Bible Reading Plan
యోసేపు తానెవరని చెప్పుట
45 యోసేపు ఇంకెంతమాత్రం తనను తాను ఓర్చుకోలేక పోయాడు. అక్కడున్న ప్రజలందరి ముందు అతడు గట్టిగా ఏడ్చేశాడు. “అందర్నీ ఇక్కడనుండి వెళ్లిపొమ్మనండి” అన్నాడు యోసేపు. అందుచేత అందరూ అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ సోదరులు మాత్రమే యోసేపు దగ్గర ఉన్నారు. అప్పుడు యోసేపు తాను ఎవరయిందీ వారితో చెప్పేశాడు. 2 యోసేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నందుచేత, ఫరో ఇంటిలో ఉన్న ఈజిప్టు ప్రజలంతా అది విన్నారు. 3 యోసేపు తన సోదరులతో “మీ సోదరుడు యోసేపును నేనే, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. కాని ఆ సోదరుల నోట మాట రాలేదు. వారు భయంతో కలవరపడిపోయారు.
4 కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను, రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో చెప్పాడు, “నేనే మీ సోదరుణ్ణి, యోసేపును. ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే. 5 ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్నిబట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను. 6 భయంకరమైన ఈ కరవు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు గడచిపోవాలి. 7 కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు. 8 నేను యిక్కడికి పంపబడటం మీ తప్పుకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేశాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికిని నేను పాలకుడ్ని.”
ఇశ్రాయేలుకు ఈజిప్టు వచ్చుటకు ఆహ్వానం
9 “కనుక మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్లండి. ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది అని నా తండ్రితో చెప్పండి అన్నాడు యోసేపు. ‘దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద అధికారినిగా చేశాడు. ఇక్కడికి నా దగ్గరకు వచ్చేయండి. ఇంకా వేచి ఉండవద్దు. ఇప్పుడే వచ్చేయండి. 10 గోషెను దేశంలో నా దగ్గర మీరు నివసిస్తారు. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ జంతువులు, మీ మందలు ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను. 11 వచ్చే అయిదు కరువు సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని చూచుకొంటాను. అందుచేత మీరూ, మీ కుటుంబాలు, మీ స్వంతది ఏదీ నష్టపోదు.’”
12 యోసేపు తన సోదరులతో మాట్లాడటం కొనసాగిస్తూనే ఉన్నాడు. “ఇప్పుడు మీరు నిజంగా, నేను యోసేపును అని చూడగలుగుతున్నారు. నేనే అని మీ సోదరుడు బెన్యామీనుకు తెలుసు. మీతో మాట్లాడుతున్న నేను మీ సోదరుణ్ణి. 13 కనుక ఇక్కడ ఈజిప్టులో నాకు ఉన్న సమస్త ఘనతను గూర్చి నా తండ్రికి చెప్పండి. మీరు ఇక్కడ చూచిన వాటన్నింటి గూర్చి నా తండ్రికి చెప్పండి. ఇక మీరు త్వరపడి నా తండ్రిని నా దగ్గరకు తీసుకురండి.” అన్నాడు అతడు. 14 అప్పుడు యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగలించుకొని ఏడ్చాడు. బెన్యామీను కూడ ఏడ్చాడు. 15 తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.
16 యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చినట్లు ఫరోకు తెలిసింది. ఫరో ఇల్లంతా ఈ వార్త పాకిపోయింది. దీని విషయమై ఫరో, అతని సేవకులు చాలా సంతోషించారు. 17 కనుక యోసేపుతో ఫరో అన్నాడు: “నీ సోదరులకు కావలసినంత ఆహారం తీసుకొని తిరిగి కనాను దేశం వెళ్లమని చెప్పు. 18 నీ తండ్రిని, వారి కుటుంబాలను తిరిగి ఇక్కడికి నా దగ్గరకు తీసుకొని రమ్మని వారితో చెప్పు. ఈజిప్టులో శ్రేష్ఠమైన భూమిని నివాసానికి నేను నీకు ఇస్తాను. ఇక్కడ మనకు ఉన్న శ్రేష్ఠ ఆహారం నీ కుటుంబం భోంచేస్తారు.” 19 తర్వాత ఫరో అన్నాడు: “మన బండ్లలో మంచి వాటిని కొన్నింటిని మీ సోదరులకు ఇయ్యి. కనాను వెళ్లి, మీ తండ్రిని, స్త్రీలందరిని, పిల్లలను ఆ బండ్లమీద తీసుకొని రమ్మని వారితో చెప్పు. 20 వారి అన్ని సామానులు తెచ్చుకొనే విషయంలో ఏమీ చింత పడవద్దు. ఈజిప్టులో మనకు ఉన్న శ్రేష్ఠ వస్తువులు మనం వారికి ఇద్దాం.”
21 కనుక ఇశ్రాయేలు కుమారులు అలా చేశారు. ఫరో వాగ్దానం చేసినట్లే యోసేపు వారికి మంచి బండ్లు ఇచ్చాడు. వారి ప్రయాణానికి సరిపడినంత ఆహారం యోసేపు వారికి ఇచ్చాడు. 22 ఒక్కో సోదరునికి ఒక్కో జత చక్కని వస్త్రాలు యిచ్చాడు యోసేపు. అయితే బెన్యామీనుకు అయిదు జతల మంచి బట్టలు యోసేపు ఇచ్చాడు. మరియు 300 వెండి నాణాలు కూడ యోసేపు బెన్యామీనుకు ఇచ్చాడు. 23 యోసేపు తన తండ్రికి కానుకలు కూడా పంపించాడు. ఈజిప్టులోని మంచి వస్తువులు చాలా సంచులనిండా నింపి, పది గాడిదలమీద అతడు పంపించాడు. అతని తండ్రి తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన ఆహారం, రొట్టె, ధాన్యం విస్తారంగా పది ఆడగాడిదల మీద అతడు పంపించాడు. 24 అప్పుడు యోసేపు అతని సోదరులను వెళ్లమన్నాడు. వారు వెళ్తూ ఉండగా యోసేపు “తిన్నగా ఇంటికి వెళ్లండి. దారిలో పోట్లాడకండి” అని వారితో చెప్పాడు.
25 కనుక ఆ సోదరులు ఈజిప్టు దేశం విడిచి, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి దగ్గరకు వెళ్లారు. 26 ఆ సోదరులు “నాయనా, యోసేపు బ్రతికే ఉన్నాడు, ఈజిప్టు దేశం అంతటికి అతడే అధికారి” అని అతనితో చెప్పారు. వారి తండ్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు వాళ్లను నమ్మలేదు. 27 అయితే యోసేపు చెప్పినదంతా ఆ సోదరులు వారి తండ్రికి చెప్పారు. తర్వాత తనని ఈజిప్టు తీసుకొని రమ్మని యోసేపు పంపిన బండ్లను యాకోబు చూశాడు. అప్పుడు యాకోబు సంతోషంతో ఉప్పొంగిపొయ్యాడు. 28 “ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు! నేను మరణించక ముందు అతణ్ణి చూస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.
పిలాతు సమక్షంలో యేసు
(మత్తయి 27:1-2, 11-14; లూకా 23:1-5; యోహాను 18:28-38)
15 తెల్లవారుఝామున ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు యేసును బంధించి తీసుకెళ్ళి పిలాతుకు[a] అప్పగించారు.
2 పిలాతు, “నీవు యూదులకు రాజువా?” అని అడిగాడు.
“మీరే అంటున్నారుగా!” అని యేసు సమాధానం చెప్పాడు.
3 ప్రధానయాజకులు యేసు మీద ఎన్నో నేరాలు మోపారు. 4 అందువల్ల పిలాతు యేసుతో మళ్ళీ, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వాళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అని అన్నాడు.
5 అయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.
మరణదండన విధించటం
(మత్తయి 27:15-31; లూకా 23:13-25; యోహాను 18:39–19:16)
6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం. 7 తిరుగుబాటులో పాల్గొని హత్యలు చేసిన వాళ్ళు కారాగారంలో ఉన్నారు. వాళ్ళలో బరబ్బ ఒకడు.
8 ప్రజలు పిలాతు దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం విడుదల చేసినట్లే ఆ సంవత్సరం కూడా ఒకణ్ణి విడుదల చెయ్యమని కోరారు. 9-10 ప్రధానయాజకులు అసూయవల్ల యేసును తనకప్పగించారని పిలాతుకు తెలుసు. కనుక, “యూదుల రాజును విడుదల చెయ్యమంటారా?” అని అడిగాడు. 11 కాని ప్రధానయాజకులు యేసుకు మారుగా బరబ్బాను విడుదల చేసేటట్లు పిలాతును కోరమని ప్రజలను పురికొల్పారు.
12 పిలాతు, “మరి మీరు ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ మనిషిని ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.
13 వాళ్ళు, “సిలువకు వేయుము!” అని కేకలు వేసారు.
14 “ఎందుకు? అతడు చేసిన నేరమేమిటి?” అని పిలాతు అడిగాడు.
ప్రజలు యింకా బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వేయండి” అని కేకలు వేసారు.
15 ఆ ప్రజల గుంపును ఆనందపరచాలని వాళ్ళు అడిగినట్లు బరబ్బను విడుదల చేసాడు. కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వెయ్యమని యేసును భటులకు అప్పగించాడు.
16 భటులు యేసును రాజభవనంలో, అంటే ప్రేతోర్యమునకు తీసుకెళ్ళి, భటులందరిని సమావేశ పరచారు. 17 వాళ్ళాయనకు ఊదారంగు రాజ దుస్తులను తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. 18 ఆ తర్వాత, “యూదుల రాజా! జయము!” అని ఆయన్ని పిలుస్తూ కేకలు వేసారు. 19 ఆయన తలపై కర్రతో మాటి మాటికి కొడుతూ ఆయన మీద ఉమ్మివేసారు. ఆయన ముందు వంగి తమ మోకాళ్ళపై కూర్చొని ఆయన్ని వ్యంగ్యంగా పూజించారు. 20 ఆయన్ని హేళన చేసిన తర్వాత, ఊదారంగు దుస్తుల్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తర్వాత ఆయన్ని సిలువకు వేయటానికి తీసుకు వెళ్ళారు.
యేసుని సిలువకు వేయటం
(మత్తయి 27:32-44; లూకా 23:26-39; యోహాను 19:17-19)
21 కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే వాడొకడు పొలాలనుండి ఆ దారిన వెళ్తూ ఉన్నాడు. ఇతడు అలెక్సంద్రుకు మరియు రూపునకు తండ్రి. భటులు యితనితో బలవంతంగా సిలువ మోయించారు. 22 వాళ్ళు యేసును గొల్గొతాకు తీసుకువచ్చారు. గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం. 23 అక్కడ వాళ్ళు ఆయనకు ద్రాక్షారసంలో మత్తు కలిపి త్రాగమని యిచ్చారు. కాని ఆయన త్రాగలేదు. 24 ఆ తర్వాత వాళ్ళాయన్ని సిలువకు వేసారు. ఆయన దుస్తులు పంచుకోవటానికి చీట్లు వేసి ఎవరికి వచ్చినవి వాళ్ళు తీసుకొన్నారు.
25 ఆయన్ని సిలువ వేసినప్పుడు ఉదయం తొమ్మిది గంటలు. 26 ఆయనపై మోపబడిన నేరాన్ని, “యూదులరాజగు యేసు” అని ఒక పలకపై వ్రాసి తగిలించారు. 27 ఆయనతో సహా యిద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువకు వేసారు. 28 [b]
29 ఆ దారి మీద నడిచివెళ్ళే వాళ్ళు ఆయన్ని అవమానపరచారు. వాళ్ళు తమ తలలాడిస్తూ, “మరి మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్న వాడవు గదా. 30 సిలువ నుండి క్రిందికి దిగి నిన్ను నీవు కాపాడుకోలేవా?” అని అన్నారు.
31 ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా ఆయన్ని హేళన చేస్తూ “ఇతరులను రక్షించాడు కాని తనను తాను రక్షించుకోలేడు. 32 ఈ క్రీస్తు, ఈ ఇశ్రాయేలు రాజు సిలువనుండి క్రిందికి దిగివస్తే చూసి అప్పుడు విశ్వసిస్తాము” అని పరస్పరం మాట్లాడుకొన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడ్డ వాళ్ళు కూడా యేసును అవమానించారు.
యేసు మరణం
(మత్తయి 27:45-56; లూకా 23:44-49; యోహాను 19:28-30)
33 మధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. 34 మూడు గంటలకు యేసు బిగ్గరగా, “ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ” అంటే, “నాదేవా! నాదేవా! నన్నెందుకు ఒంటరిగా వదిలివేసావు”(A) అని కేకవేసాడు.
35 దగ్గర నిలుచున్న కొందరు ఇది విని, “వినండి! అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు.
36 ఒకడు పరుగెత్తి వెళ్ళి ఒక స్పాంజిని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కట్టెకు తగిలించి యేసుకు త్రాగటానికి అందించాడు. మరొకడు, “అతణ్ణి వదలండి! అతణ్ణి క్రిందికి దింపటానికి ఏలియా వస్తాడేమో చూద్దాం!” అని అన్నాడు.
37 పెద్ద కేక పెట్టి యేసు ప్రాణం వదిలాడు.
38 అప్పుడు మందిరంలోని తెర మీది నుండి క్రింది వరకు రెండు భాగాలుగా చినిగిపోయింది. 39 యేసు ముందు నిలుచొని ఉన్న శతాధిపతి ఆయన కేక విని,[c] ఆయన చనిపోయిన విధం చూసి, “ఈయన తప్పక దేవుని కుమారుడు” అని అన్నాడు.
40 కొందరు స్త్రీలు దూరం నుండి అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబుకు, యోసేపుకు తల్లి అయిన మరియ మరియు సలోమే ఉన్నారు. 41 గలిలయలో ఉన్నప్పుడు వీళ్ళు యేసును అనుసరిస్తూ, ఆయనకు సేవచేస్తూ ఉండేవాళ్ళు, వీళ్ళేగాక ఆయన వెంట యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు.
యేసును సమాధి చేయటం
(మత్తయి 27:57-61; లూకా 23:50-56; యోహాను 19:38-42)
42 అది సబ్బాతుకు సిద్దమయ్యే రోజు, అనగా విశ్రాంతి రోజుకు ముందు రోజు సాయంత్రమయింది. 43 అరిమతయియ గ్రామస్తుడు యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని అడిగాడు. యోసేపు మహాసభలో పేరుగల సభ్యుడు. ఇతడు స్వయంగా దేవుని రాజ్యంకొరకు కాచుకొని ఉండేవాడు.
44 యేసు అప్పుడే చనిపోయాడని విని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు. 45 ఆ సైన్యాధిపతి ఔనని అన్నాక యేసు దేహాన్ని తీసుకు వెళ్ళటానికి యోసేపుకు అనుమతి యిచ్చాడు.
46 యోసేపు, నారతో చేసిన వస్త్రాన్ని కొనుక్కొని వచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి ఆ వస్త్రంలో చుట్టాడు. ఆ తర్వాత ఆ దేహాన్ని తీసుకువెళ్ళి రాతితో మలచిన సమాధిలో ఉంచాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధి మూసివేసాడు. 47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లి మరియ ఆ దేహం ఉంచిన స్థలాన్ని చూసారు.
జోఫరు యోబుతో మాట్లాడటం
11 అప్పుడు నయమాతీ వాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు:
2 “ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే!
ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే అనిపిస్తుందా? లేదు.
3 యోబూ, నీకు చెప్పేందుకు
మా వద్ద జవాబు లేదనుకొంటున్నావా?
నీవు దేవునిగూర్చి నవ్వినప్పుడు,
నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అనుకొంటున్నావా?
4 యోబూ! నీవు దేవునితో,
‘నా నమ్మకాలు సరియైనవే,
కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు.
5 యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి,
నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను.
6 అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు.
ప్రతి విషయానికీ, నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెబుతాడు.
అది నిజమైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో:
దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటె తక్కువగానే శిక్షిస్తున్నాడు.
7 “యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా?
సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పదనాన్నీ, శక్తినీ చూపించే హద్దులను నీవు గ్రహించలేవు.
8 అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తైనది!
ఆ హద్దులు సమాధి లోతులకంటె లోతైనవి.
కానీ, అది నీవు గ్రహించలేవు!
9 దేవుడు భూమికంటే గొప్పవాడు,
సముద్రంకంటే పెద్దవాడు.
10 “దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ స్థానానికి తీసుకొనివస్తే,
ఏ మనిషీ ఆయనను వారించలేడు.
11 నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి తెలుసు.
దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు.
12 ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో,
అలాగే బుద్ధిహీనుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు.
13 అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటానికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి.
ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి.
14 నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి.
నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు.
15 అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు నిశ్చలంగా చూడగలుగుతావు.
నీవు బలంగా నిలబడతావు. భయపడవు.
16 యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచిపోగలవు.
నీ కష్టాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం చేసుకొంటావు.
17 అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంటె నీ జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది.
జీవితపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా ప్రకాశిస్తాయి.
18 యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా ఉంటావు.
దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు విశ్రాంతినిస్తాడు.
19 నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, బాధించరు.
మరియు అనేక మంది నీ సహాయం వేడుకొంటారు.
20 కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు,
అయితే ఆశ ఏమి ఉండదు. వారు వారి కష్టాలు తప్పించుకోలేరు.
వారు చస్తారు అనేది ఒక్కటే వారికి ఉన్న ఆశ.”
15 సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. 2 ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. 3 క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.” 4 గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. 5 మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! 6 అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. 7 దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. 8 మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. 9 యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను.
నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”(A)
10 మరొక చోట:
“యూదులు కాని ప్రజలారా!
మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”(B)
11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది:
“యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి.
ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”(C)
12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు:
“యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది.
ఆయన దేశాలను పాలిస్తాడు.
యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”(D)
13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.
ఉద్దేశ్యం
14 సోదరులారా, మీలో మంచితనముందని, సంపూర్ణమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకోగల సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది. 15 అయినా నేను కొన్ని విషయాల్ని గురించి మీకు జ్ఞాపకం చెయ్యాలని వాటిని గురించి మీకు ధైర్యంగా వ్రాసాను. దేవుడిచ్చిన వరం వల్ల ఇది చెయ్యగలిగాను. ఆ వరము ఏదనగా 16 నేను యాజకునిగా పని చేస్తూ దైవసందేశాన్ని యూదులు కానివాళ్ళకు బోధించాలని దేవుడు నన్ను యేసు క్రీస్తుకు సేవకునిగా చేసాడు. ఇందువలన యూదులు కానివాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రం చేయబడి దేవునికి అంగీకారమైన సంతానం కాగలరు.
17 అందువల్ల, నేను యేసు క్రీస్తు ద్వారా దేవుని సేవ చేస్తున్నందుకు గర్విస్తున్నాను. 18 క్రీస్తు నా ద్వారా చేసినవాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పుకుంటాను. యూదులు కానివాళ్ళు నేను చేసిన బోధనల ద్వారా, నా కార్యాల ద్వారా దైవసందేశాన్ని అనుసరించేటట్లు క్రీస్తు చేసాడు. 19 గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పని సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు దాకా అన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగాను. 20 క్రీస్తును గురించి తెలియని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలనే ఆశయం నాలో ఉంది. మరొకడు వేసిన పునాదిపై ఇల్లు కట్టటం నాకిష్టం లేదు. 21 అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఆయన్ని గురించి చెప్పబడినవాళ్ళు చూస్తారు.
కాని వాళ్ళు తెలుసుకొంటారు. ఆయన్ని గురించి విననివాళ్ళు అర్థం చేసుకొంటారు.”(E)
రోము నగరాన్ని దర్శించాలని ప్రయత్నం
22 మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి.
23 ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పని ముగిసింది. అంతేకాక ఎన్నో సంవత్సరాల నుండి మిమ్ముల్ని కలుసుకోవాలనుకొంటున్నాను. 24 నేను స్పెయిను దేశానికి వెళ్ళేటప్పుడు రోము నగరానికి వచ్చి కొన్ని రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. అక్కడి నుండి నేను ప్రయాణం సాగించినప్పుడు మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.
25 కాని ప్రస్తుతం నేను యెరూషలేములోని దేవుని ప్రజలకు సహాయం చెయ్యటానికి అక్కడికి వెళ్తున్నాను. 26 ఎందుకంటే యెరూషలేములోని దేవుని ప్రజల్లో ఉన్న పేదవాళ్ళ కోసం మాసిదోనియ, అకయ ప్రాంతాలలోని సోదరులు చందా ఇవ్వటానికి ఆనందంగా అంగీకరించారు. 27 వాళ్ళు ఈ చందా ఆనందంగా ఇచ్చారు. వాళ్ళకు వీళ్ళు సహాయం చెయ్యటం సమంజసమే. ఎందుకంటే, యూదులు కానివాళ్ళు, యెరూషలేములోని దేవుని ప్రజలు ఆత్మీయ ఆశీర్వాదంలో భాగం పంచుకొన్నారు. కనుక తమకున్న వాటిని వీళ్ళు వాళ్ళతో పంచుకోవటం సమంజసమే. 28 ఈ కార్యాన్ని ముగించి వాళ్ళందరికీ చందా తప్పక ముట్టేటట్లు చూసి స్పెయిను దేశానికి వెళ్ళే ముందు మిమ్మల్ని చూడటానికి వస్తాను. 29 నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తునుండి సంపూర్ణంగా ఆశీస్సులు పొంది వస్తానని నాకు తెలుసు.
30 సోదరులారా! మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే, నా కోసం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించండి. 31 యూదయ ప్రాంతంలోని విశ్వాసహీనులనుండి నేను రక్షింపబడాలని, యెరూషలేములోని దేవుని ప్రజలు నా సహాయాన్ని ఆనందంగా అంగీకరించాలని ప్రార్థించండి. 32 తదుపరి, నేను దేవుని చిత్తమైతే మీ దగ్గరకు ఆనందంగా వచ్చి మీతో సమయం గడుపుతాను. 33 శాంతి ప్రదాత అయినటువంటి దేవుడు మీ అందరికీ తోడుగా ఉండు గాక! ఆమేన్.
© 1997 Bible League International