Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 44

యోసేపు పరీక్షించుట

44 అప్పుడు యోసేపు తన సేవకునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు: “ఈ మనుష్యులు మోసుకొని పోగలిగినంత ధాన్యం వారి సంచుల్లో నింపు. ప్రతి ఒక్కరి సొమ్మును తిరిగి వారి వారి ధాన్యపు సంచుల్లో పెట్టు. అందరిలో చిన్న తమ్ముని సంచిలో డబ్బు పెట్టు. అయితే నా ప్రత్యేకమైన వెండి పాత్రనుకూడ అతని సంచిలో పెట్టు.” ఆ సేవకుడు యోసేపు చెప్పినట్లు చేశాడు.

మర్నాటి ఉదయాన్నే ఆ సోదరులు వారి గాడిదలతోబాటు వారి దేశం పంపించబడ్డారు. వారు పట్టణం విడిచిన తర్వాత యోసేపు తన సేవకునితో చెప్పాడు: “నీవు వెళ్లి ఆ మనుష్యుల్ని వెంబడించు. వాళ్లను ఆపుజేసి మేము మీతో మంచిగా ఉన్నాం. అయినా మీరెందుకు మాతో చెడ్డగా ప్రవర్తిస్తున్నారు? మా యజమాని వెండి పాత్రను మీరెందుకు దొంగిలించారు? ఇది నా యజమాని యోసేపు పానం చేసే పాత్ర. రహస్య విషయాలను తెలుసుకొనేందుకు ఆయన ఉపయోగించే పాత్ర ఇది. ఆయన పాత్రను దొంగిలించి మీరు తప్పు చేశారు అని వాళ్లతో చెప్పు.”

అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు. అతడు సవారి చేసి ఆ సోదరులను ఆపుజేసాడు. అతడు చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు ఆ సేవకుడు వారితో చెప్పాడు.

అయితే ఆ సోదరులు ఆ సేవకునితో ఇలా అన్నారు: “ఆ పాలకుడు యిలా ఎందుకు అన్నాడు? అలాంటిదేమీ మేము చేయము. ఇంతకు ముందు మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు మేము తెచ్చి ఇచ్చాం. అందుచేత మీ యజమాని ఇంటినుండి వెండి బంగారం ఏవీ మేము నిజంగా దొంగిలించం. మాలో ఎవరి సంచిలోనైనా సరె ఆ వెండి పాత్ర నీకు కనబడితే, వాడు చావాల్సిందే. అతణ్ణి నీవు చంపేయి, మేము మీకు బానిసలమవుతాం.”

10 “మీరు చెప్పినట్లే చేద్దాం. కాని నేను మాత్రం ఎవర్నీ చంపను. వెండి పాత్ర గనుక నాకు కనబడితే ఆ మనిషి మాత్రం నాకు బానిస అవుతాడు. మిగిలిన వాళ్లు స్వేచ్ఛగా వెళ్లొచ్చు” అన్నాడు ఆ సేవకుడు.

బెన్యామీను పట్టుబడుట

11 అప్పుడు ప్రతి ఒక్క సోదరుడూ తన సంచిని నేలమీద పెట్టి తెరిచాడు. 12 సేవకుడు సంచుల్లో చూశాడు. అతడు పెద్దవానితో మొదలు పెట్టి చిన్నవానితో ముగించాడు. బెన్యామీను సంచిలో ఆ పాత్ర అతనికి కనబడింది. 13 సోదరులకు దుఃఖం వచ్చేసింది. దుఃఖంతో వాళ్లు వారి వస్త్రాలు చింపేసుకొన్నారు. వారు వారి సంచుల్ని మళ్లీ గాడిదలమీద పెట్టి తిరిగి ఆ పట్టణం వెళ్లారు.

14 యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వెళ్లారు. యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ సోదరులంతా నేలమీద సాష్టాంగపడ్డారు. 15 యోసేపు “మీరెందుకు ఇలా చేశారు? రహస్యాలు తెలుసుకొనే ఒక ప్రత్యేక పద్ధతి నా దగ్గర ఉందని మీకు తెలియదా? ఈ పని నాకంటె బాగా ఇంకెవ్వరూ చేయలేరు” అన్నాడు.

16 యూదా, “అయ్యా, మేము ఇంకేమీ చెప్పలేం. వివరించే దారి యింకొకటి లేదు. మేము నేరస్థులం కాదని చూపించే విధం ఇంకొకటి లేదు. మేము చేసిన మరో పని మూలంగా దేవుడు మమ్మల్ని నేరస్థులుగా తీర్పు తీర్చాడు. కనుక మేము అందరం చివరకు బెన్యామీనుతో కూడ బానిసలమవుతాం” అన్నాడు.

17 కానీ యోసేపు, “నేను మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేయను. పాత్రను దొంగిలించిన మనిషి ఒక్కడే నాకు బానిస అవుతాడు. మిగిలిన మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరకు వెళ్లవచ్చు” అన్నాడు.

బెన్యామీను కోసం యూదా బ్రతిమలాడుట

18 అప్పుడు యోసేపు దగ్గరకు యూదా వెళ్లి ఇలా చెప్పాడు: “అయ్యా, దయచేసి తమరితో నన్ను తేటగా చెప్పనివ్వండి. దయచేసి నాపై కోపగించకండి. మీరు ఫరో అంతటి వారని నాకు తెలుసు. 19 క్రితంసారి మేము ఇక్కడ ఉన్నప్పుడు, ‘మీకు తండ్రిగాని, సోదరుడు గాని ఉన్నాడా?’ అని తమరు అడిగారు. 20 దానికి మేము, ‘మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ముసలివాడు. మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు మా తండ్రికి ముసలితనంలో పుట్టాడు, అందుచేత మా తండ్రికి వాడంటే చాలా ప్రేమ. పైగా ఆ చిన్న కుమారుని అన్న చనిపోయాడు. అందుచేత ఆ తల్లికి పుట్టిన కుమారులలో మిగిలినవాడు ఇతడు ఒక్కడే. మా తండ్రికి ఇతనంటే ఎంతో ప్రేమ’ అని జవాబు చెప్పాం. 21 అప్పుడు ‘ఆ సోదరుని నా దగ్గరకు తీసుకొని రండి, నేను అతడ్ని చూడాలి’ అన్నారు తమరు. 22 దానికి మేము ‘ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు. అతడ్ని అతని తండ్రి విడిచిపెట్టలేడు. అతని తండ్రి అతణ్ణి గనుక పోగొట్టుకొంటే, ఆయన దుఃఖంతో మరణిస్తాడు’ అని తమరితో చెప్పాం. 23 కానీ తమరేమో ‘మీరు మీ చిన్న తమ్ముడ్ని తప్పక తీసుకొని రావాల్సిందే, లేకపోతే మీకు ధాన్యం అమ్మేది లేదు’ అన్నారు మాతో. 24 కనుక మేము తిరిగి మా తండ్రి దగ్గరకు వెళ్లి, మీరు మాతో చెప్పినది ఆయనకు చెప్పాం.

25 “తర్వాత మా తండ్రి ‘మీరు మళ్లీ వెళ్లి మనకోసం ధాన్యం కొనండి’ అన్నాడు. 26 మేము మా తండ్రితో ‘మా చిన్న తమ్ముడు లేకుండా మేము వెళ్లలేం. మా చిన్న తమ్ముడ్ని చూచేంత వరకు మళ్లీ మాకు ధాన్యం అమ్మనని ఆ పాలకుడు అన్నాడు’ అని చెప్పాం. 27 అప్పుడు మా తండ్రి మాతో, ‘నా భార్య రాహేలు ఇద్దరు కుమారుల్ని నాకు కన్నది. 28 ఒక కుమారుడ్ని నేను బయటకు వెళ్లనిస్తే, అతణ్ణి అడవి మృగం చంపేసింది. అప్పట్నుండి నేను అతణ్ణి చూడలేదు. 29 రెండో కుమారునిగూడా మీరు నా దగ్గర్నుండి తీసుకొని పోతే, అతనికి ఏమైనా సంభవిస్తే ఆ దుఃఖంతో నేను మరణించాల్సిందే!’ అన్నాడు. 30 కనుక ఇప్పుడు మేము మా చిన్నసోదరుడు మాతో లేకుండా ఇంటికి వెళ్తే, ఏమి జరుగుతుందో ఊహించండి. మా తండ్రి జీవితంలో ఈ కుర్రవాడు చాలా ముఖ్యం. 31 ఈ కుర్రవాడు మాతో లేకపోవటం గమనిస్తే, మా తండ్రి చనిపోతాడు. ఆ తప్పు మాదే అవుతుంది. మహాగొప్ప దుఃఖంతో మా తండ్రి చనిపోయేటట్లు చేసిన వాళ్లమవుతాం.

32 “ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసుకొన్నాను. ‘ఇతణ్ణి మళ్లీ నీ దగ్గరకు తీసుకొని రాకపోతే నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని’ నా తండ్రితో నేను చెప్పాను. 33 కనుక ఇప్పుడు నేను మీకు మనవి చేసేది, మిమ్మల్ని బ్రతిమాలాడేది ఏమిటంటే, దయచేసి ఈ పిల్లవాణ్ణి తన సోదరులతో వెళ్లనివ్వండి. నేను ఇక్కడే ఉండి, మీకు బానిసను అవుతాను. 34 ఈ పిల్లవాడు నాతో లేకపోతే, నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్లలేను. నా తండ్రికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.”

మార్కు 14

యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం

(మత్తయి 26:1-5; లూకా 22:1-2; యోహాను 11:45-53)

14 పస్కా పండుగకు, పులియబెట్టని రొట్టెల పండుగకు రెండురోజుల ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును బంధించి చంపటానికి పన్నాగం పన్నటం మొదలు పెట్టారు. “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజలు అల్లర్లు మొదలు పెట్టవచ్చు” అని మాట్లాడుకొన్నారు.

బేతనియ గ్రామంలో తైలాభిషేకం

(మత్తయి 26:6-13; లూకా 12:1-8)

ఆ సమయంలో యేసు బేతనియలో ఉన్నాడు. ఆయన కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉండగా, ఒక స్త్రీ ఇంట్లోకి వచ్చింది. ఆమె స్వచ్ఛమైన అగరు చెట్లనుండి చేసిన మిక్కిలి విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తన వెంట తెచ్చింది. ఆ బుడ్డి మూత పగులగొట్టి ఆ అత్తరును యేసు తలపై పోసింది.

ఇది చూసి అక్కడున్న వాళ్ళలో కొందరికి కోపం వచ్చింది. వాళ్ళు పరస్పరం, “అత్తరును ఇలా వృధా చేయటం ఎందుకు? దాన్ని అమ్మితే మూడు వందల దేనారాలు[a] వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు యిచ్చి ఉండవలసింది” అని ఆ స్త్రీని గూర్చి గొణుక్కున్నారు.

యేసు, “ఆపండి. ఆమెనెందుకు కంగారు పెడుతున్నారు. ఆమె మంచి పని చేసింది. పేదవాళ్ళు మీలో ఎప్పుడూ ఉంటారు. మీ కిష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సహాయం చెయ్యవచ్చు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను. ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహంపై అత్తరు పోసింది.[b] ఇది నిజం. ప్రపంచంలో సువార్త ప్రకటించిన ప్రతిచోటా ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.

యేసుకు ద్రోహం చెయ్యటానికి యూదా అంగీకరించటం

(మత్తయి 26:14-16; లూకా 22:3-6)

10 ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు, యేసును ప్రధాన యాజకులకు పట్టివ్వటానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. 11 వాళ్ళు ఇది వినిచాలా ఆనందపడి, అతనికి డబ్బిస్తామని వాగ్దానం చేసారు. అందువల్ల యూదా యేసును పట్టివ్వటానికి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.

పస్కా భోజనం

(మత్తయి 26:17-25; లూకా 22:7-14, 21-23; యోహాను 13:21-30)

12 పులియబెట్టని రొట్టెలపండుగ వచ్చింది. మొదటి రోజు పస్కా గొఱ్ఱెపిల్లను బలి యివ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, “ఎక్కడికి వెళ్ళి పస్కా[c] పండుగ భోజనం సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు.

13 యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించండి. 14 అతడు ప్రవేశించిన యింటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని, నేను అన్నట్లు చెప్పండి. 15 అన్ని వస్తువులతో సిద్దంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.”

16 శిష్యులు పట్టణంలోకి వెళ్ళారు. యేసు చెప్పి నట్లే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం సిద్ధం చేసారు.

17 సాయంత్రం కాగానే యేసు పన్నెండుగురితో కలిసి వచ్చాడు. 18 వాళ్ళంతా బల్లముందు కూర్చొని భోజనం చేస్తూవున్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, “ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళలో ఒకడు, నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.

19 వాళ్ళకు దుఃఖం వచ్చింది. “ఖచ్చితంగా నేను కాదుగదా ప్రభూ” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు.

20 యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు, నాకు ద్రోహం చేస్తాడు. 21 లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్లిపోవుచున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడౌతాడు. వాడు జన్మించివుండకపోతే బాగుండేది” అని అన్నాడు.

ప్రభు రాత్రి భోజనము

(మత్తయి 26:26-30; లూకా 22:15-20; 1 కొరింథీ. 11:23-25)

22 అంతా భోజనం చేస్తుండగా, యేసు రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది నా దేహం, దీన్ని తీసుకొండి” అని అన్నాడు.

23 ఆ తర్వాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకిచ్చాడు. వాళ్ళందరూ ఆ గిన్నె నుండి త్రాగారు. 24 “ఇది నా నిబంధన[d] రక్తం. ఆ రక్తాన్ని అందరికోసం కార్చాను. 25 ఇది నిజం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగేదాకా, యిప్పుడు తప్ప మరెప్పుడూ ద్రాక్షారసం త్రాగను” అని యేసు అన్నాడు.

26 వాళ్ళు ఒక భక్తిగీతం పాడాక ఒలీవల కొండ మీదికి వెళ్ళారు.

యేసు తన శిష్యులు ఆయన్ను విడిచిపెడతారని చెప్పటం

(మత్తయి 26:31-35; లూకా 22:31-34; యోహాను 13:36-38)

27 యేసు వాళ్ళతో, “మీ మనస్సులు చెదరి పోతాయి. ఎందుకంటే లేఖనాల్లో,

‘నేను గొఱ్ఱెల కాపరిని కొడతాను!
    గొఱ్ఱెలన్నీచెదరిపోతాయి!’(A)

అని వ్రాయబడింది. 28 కాని, నేను బ్రతికివచ్చాక మీకన్నా ముందుగా గలిలయకు వెళ్తాను” అని అన్నాడు.

29 అప్పుడు పేతురు, “అందరి విశ్వాసం పోయినా నా విశ్వాసం సన్నగిల్లదు” అని అన్నాడు.

30 యేసు సమాధానంగా, “ఇది నిజం. ఈ రోజు, అంటే ఈ రాత్రి కోడి రెండు[e] సార్లు కూయక ముందే నీవు మూడుసార్లు నేనెవరో తెలియదంటావు” అని అన్నాడు.

31 కాని పేతురు ఎన్నటికి అలా అననని అంటూ, “నేను మీతో మరణించవలసి వచ్చినా సరే నేనెప్పటికీ మీరెవరో తెలియదనను” అని అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు.

యేసు ఏకాంతంగా ప్రార్థించటం

(మత్తయి 26:36-46; లూకా 22:39-46)

32 అంతా గెత్సేమనె అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థించి వచ్చేదాకా మీరిక్కడే ఉండండి” అని అన్నాడు. 33 కాని యేసు పేతురును, యాకోబును, యోహానును, తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు చాలా దుఃఖం,[f] ఆవేదన కలగటం మొదలుపెట్టింది. 34 ఆయన వాళ్ళతో, “నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి” అని అన్నాడు.

35 ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై మోకరిల్లి వీలైతే “ఆ ఘడియ” రాకూడదని ప్రార్థిస్తూ, 36 ఆయన, “అబ్బా తండ్రి! నీకన్నీ సాధ్యం ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు.

37 ఆయన వచ్చి తన శిష్యులు నిద్రిస్తుండడం చూసాడు. ఆయన పేతురుతో, “సీమోనూ! నిద్రిస్తున్నావా, ఒక గంట మేలుకో లేక పోయావా? 38 మెలకువతో ఉండండి. ప్రార్థించండి. అప్పుడే మీరు సైతాను ప్రేరణకు లోంగకుండా ఉంటారు. ఆత్మ సిద్ధమే కాని శరీరంలో బలం లేదు” అని అన్నాడు.

39 యేసు, మళ్ళీ వెళ్ళి మొదటివలే ప్రార్థించాడు. 40 ఆయన తిరిగివచ్చి శిష్యుల కళ్ళు భారంగా ఉండటంవల్ల వాళ్ళు నిద్రిస్తూ వుండటం గమనించాడు. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు.

41 యేసు మూడవసారి తిరిగివచ్చి వాళ్ళతో, “ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి. సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి. మనుష్య కుమారుడు పాపులకు అప్పగింపబడుతున్నాడు. 42 లేవండి! వెళ్దాం రండి. అదిగో! ద్రోహి వస్తున్నాడు!” అని అన్నాడు.

యేసును బంధించటం

(మత్తయి 26:47-56; లూకా 22:47-53; యోహాను 18:3-12)

43 ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు.

44 ఆ ద్రోహి వాళ్ళతో, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకొంటానో[g] ఆయనే యేసు. ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకు వెళ్ళండి” అని వాళ్ళతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్ళతో మాట్లాడుకొన్నాడు. 45 వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ!” అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకొన్నాడు. 46 వచ్చిన ప్రజలు యేసును బంధించారు. 47 యేసు ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేసాడు.

48 యేసు, “మీరు కత్తులతో, కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా? 49 నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని, లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి” అని అన్నాడు. 50 అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు.

51 ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని, 52 అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు.

మహాసభ సమక్షంలో యేసు

(మత్తయి 26:57-68; లూకా 22:54-55, 63-71; యోహాను 18:13-14, 19-24)

53 వాళ్ళు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు. 54 పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరిస్తూ ప్రధాన యాజకుని యింటి పెరట్లోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా చలిమంటలు వేసుకొంటూ వాళ్ళతో కూర్చున్నాడు.

55 ప్రధానయాజకులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు, యేసుకు మరణదండన విధించటానికి తగిన సాక్ష్యం కోసం వెతక సాగారు. కాని వాళ్ళకు సాక్ష్యం లభించలేదు. 56 చాలా మంది ప్రతికూలంగా దొంగసాక్ష్యం చెప్పారు. కాని వాళ్ళ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు.

57 అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం చెప్పారు: 58 “‘మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మానవులు కట్టని మరొక మందిరాన్ని నిర్మిస్తాను’ అని అతడు అనటం మేము విన్నాము.” 59 కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు.

60 ఆ తర్వాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల ముందు నిలుచొని యేసుతో, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా! నీవేమంటావు?” అని అడిగాడు. 61 కాని యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు.

ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడవా?” అని మళ్ళీ ప్రశ్నించాడు.

62 యేసు, “ఔను, సర్వశక్తిసంపన్నుడైన దేవుని కుడిచేతి వైపు మనుష్యకుమారుడు కూర్చొని ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు.

63 ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని[h] “మనకు యితర సాక్ష్యాలు ఎందుకు? 64 అతడు దైవదూషణ చేయటం మీరు విన్నారుగదా; మీ అభిప్రాయమేమిటి?” అని సభ్యుల్ని అడిగాడు.

అందరూ మరణదండన విధించాలని అన్నారు. 65 ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం మొదలుపెట్టారు. కొందరు ఆయన కళ్ళకు గంతలు కట్టి తమ పిడికిలితో గుద్ది, “ఎవరో చెప్పుకో” అని హేళన చేసారు. కాపలాకాచే భటులు ఆయన్ని తీసుకువెళ్ళి కొట్టారు.

పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం

(మత్తయి 26:69-75; లూకా 22:56-62; యోహాను 18:15-18, 25-27)

66 పేతురు, క్రింద యింటి ముందు పెరట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని దాసీలలో ఒకతె అక్కడకు వచ్చింది. 67 పేతురు చలిమంటలు వేసుకొంటూ అక్కడ ఉండటం చూసి అతని దగ్గరకు వెళ్ళి అతణ్ణి పరీక్షగా చూసింది. “నజరేతు యేసుతో నీవు కూడా ఉన్నావు కదూ!” అని ఆమె పేతురుతో అన్నది.

68 అతడు నాకు తెలియదంటూ, “నీవేం అంటున్నానో నాకు అర్థం కావటంలేదు” అని అన్నాడు. పేతురు ద్వారం వైపు వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది.

69 ఆ దాసీపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వాళ్ళతో, “ఇతడు వాళ్ళలో ఒకడు” అని మళ్ళీ అన్నది. 70 మళ్ళీ పేతురు, “అది నిజం కాదు; నాకు తెలియదు” అని అన్నాడు.

కొద్ది సేపయ్యాక పేతురుతో నిలుచున్న వాళ్ళు అతనితో, “నీవు కూడ గలిలయ వాడవు కనుక తప్పకుండా వాళ్ళలో ఒకడివి” అని అన్నారు.

71 పేతురు తన మీద ఒట్టు పెట్టుకొంటూ, “ప్రమాణంగా చెబుతున్నాను. మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.

72 వెంటనే రెండవసారి[i] కోడి కూసింది. అప్పుడు యేసు తనతో అన్న ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి రెండు సార్లు కూయకముందే నేనెవరో తెలియదని మూడుసార్లు అంటావు.” పేతురు దుఃఖం ఆపుకోలేక శోకించటం మొదలు పెట్టాడు.

యోబు 10

10 “నా స్వంత జీవితం నాకు అసహ్యం. అందుచేత నేను స్వేచ్ఛగా ఆరోపణలు చేస్తాను.
    నా ఆత్మ చాలా వేదనగా ఉంది కనుక ఇప్పుడు నేను మాట్లాడతాను.
నేను దేవునితో చెబుతాను, ‘నన్ను నిందించవద్దు.
    నేను ఏమి తప్పు చేశాను, నాకు చెప్పు. నా మీద నీకు ఎందుకు విరోధం?
దేవా, నీవు నన్ను ఇలా చులకనగా చూడటం నీకు సంతోషమా?
    చూస్తుంటే, నీవు చేసిన దాని గూర్చి నీకు శ్రద్ధ లేనట్లుంది. దుర్మార్గులు వేసే పథకాలకు నీవు సంతోషిస్తున్నావా?
దేవా, నీకు మానవ నేత్రాలు ఉన్నాయా?
    మనుష్యులు చూసినట్టుగా నీవు సంగతులు చూస్తున్నావా?
మా రోజుల్లాగ నీవి కొద్దిపాటి రోజులా?
    మా సంవత్సరాల్లా నీవి కొన్ని సంవత్సరాలేనా?
నీవు నా తప్పుకోసం చూస్తూ
    నాపాపం కోసం వెదకుతున్నావు.
కానీ నేను నిర్దోషిని అని నీకు తెలుసు.
    అయితే నీ శక్తినుండి నన్ను ఎవ్వరూ రక్షించలేరు!
దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని తీర్చిదిద్దాయి.
    కానీ ఇప్పుడు నీవే నన్ను నాశనం చేస్తున్నావు.
దేవా, నీవు నన్ను మట్టిలా చేసావని జ్ఞాపకం చేసుకో.
    కానీ, నీవు ఇప్పుడు నన్ను మరల మట్టిగా ఎందుకు మారుస్తున్నావు?
10 పాలు ఒలుకబోసినట్టుగా నీవు నన్ను సోస్తున్నావు.
    నన్ను వెన్న చిలకరించినట్లుగా చేస్తున్నావు.
11 ఎముకల్ని, మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను చేశావు.
    తర్వాత చర్మంతో, మాంసంతో నీవు నన్ను కప్పివేశావు.
12 నీవు నాకు జీవం ఇచ్చావు. నాకు చాలా దయ చూపించావు.
    నా విషయమై నీవు శ్రద్ధ చూపించావు. నా ఆత్మను కాపాడావు.
13 కానీ నీవు నీ హృదయంలో దాచుకొన్నది ఇది. నీ హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది
    ఇదేనని నాకు తెలుసు. అవును, నీ మనసులో ఉన్నది ఇదేనని నాకు తెలుసు.
14 ఒకవేళ నేను పాపం చేస్తే, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించవచ్చునని
    నీవు నన్ను గమనిస్తూ ఉంటావు.
15 నేను పాపం చేసినప్పుడు, నేను దోషిని.
    అది నాకు చాలా చెడు అవుతుంది.
కానీ నేను నిర్దోషిని అయినా సరే, నేను నా తల ఎత్తుకోలేను.
    ఎందుకంటే, నేను సిగ్గుతో, బాధతో నిండిపోయాను గనుక.
16 ఒకవేళ నాకు జయం కలిగి నేను అతిశయిస్తోంటే
    ఒకడు సింహాన్ని వేటాడినట్టు నీవు నన్ను వేటాడుతావు.
    నీవు మరోసారి నా మీద నీ శక్తి చూపిస్తావు.
17 నాకు విరోధంగా సాక్ష్యం చెప్పేందుకు
    నీకు ఎల్లప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు.
నామీద నీ కోపం ఎక్కువ అవుతుంది.
    నీవు నా మీదికి కొత్త సైన్యాలను పంపిస్తావు.
18 అందుచేత, దేవా అసలు నీవు నన్ను ఎందుకు పుట్టనిచ్చావు?
    నన్ను ఎవరూ చూడక ముందే నేను మరణించి ఉంటే ఎంత బాగుండేది.
19 నేను ఎన్నడూ ఒక మనిషిని కాకుండా ఉంటే బాగుండును.
    నేను నా తల్లి గర్భం నుండి తిన్నగా సమాధికి మోసికొనిపోబడితే ఎంత బాగుండేది.?
20 నా జీవితం దాదాపు అయిపోయింది.
    కనుక నన్ను ఒంటరిగా వదిలెయ్యి.
    ఏదో కొద్దిపాటి వసతుల్ని అనుభవించనివ్వు.
21 ఏ చోటునుండి అయితే ఎవ్వరూ ఎన్నడూ తిరిగిరారో,
    అంధకారం, మరణం ఉండే ఆ చోటుకు నేను వెళ్లక ముందు, నాకు మిగిలి ఉన్న కొద్ది సమయం నన్ను అనుభవించనివ్వు.
22 ఎవ్వరూ చూడలేని, అంధకార ఛాయల, గందరగోళ స్థలానికి నేను వెళ్లకముందు నన్ను అనుభవించనివ్వు.
    అక్కడ వెలుగు కూడా చీకటిగా ఉండి ఉంటుంది.’”

రోమీయులకు 14

విమర్శించకండి

14 సంపూర్ణమైన విశ్వాసం లేనివాణ్ణి నిరాకరించకండి. వాదగ్రస్థమైన సంగతుల్ని విమర్శించకండి. ఒకడు అన్నీ తినవచ్చని విశ్వసిస్తాడు. కాని సంపూర్ణ విశ్వాసం లేని ఇంకొకడు కూరగాయలు మాత్రమే తింటాడు. అన్నీ తినే వ్యక్తి అలా చెయ్యని వ్యక్తిని చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా అన్నీ తినని వాడు, తినేవాణ్ణి విమర్శించకూడదు. అతణ్ణి కూడా దేవుడు అంగీకరించాడు కదా. ఇతర్ల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయం. ప్రభువు అతణ్ణి నిలబెట్ట గలడు కనుక అతడు నిలబడ గలుగుతున్నాడు.

ఒకడు ఒక రోజు కన్నా మరొక రోజు ముఖ్యమైనదని భావించవచ్చు. ఇంకొకడు అన్ని రోజుల్ని సమానంగా భావించవచ్చు. ప్రతి ఒక్కడూ తాను పూర్తిగా నమ్మిన వాటిని మాత్రమే చెయ్యాలి. ఒక రోజును ప్రత్యేకంగా భావించేవాడు ప్రభువు పట్ల అలా చేస్తాడు. మాంసాన్ని తినేవాడు తినటానికి ముందు దేవునికి కృతజ్ఞతలు చెపుతాడు. కనుక అతనికి ప్రభువు పట్ల విశ్వాసం ఉందన్నమాట. తిననివాడు కూడా ప్రభువుకు కృతజ్ఞతలు చెపుతాడు కనుక అతనికి కూడా ప్రభువు పట్ల విశ్వాసము ఉందన్నమాట.

మనలో ఎవ్వరూ తమకోసం మాత్రమే బ్రతకటం లేదు. అదే విధంగా తమ కోసం మాత్రమే మరణించటం లేదు. మనం జీవిస్తున్నది ప్రభువు కొరకు జీవిస్తున్నాము. మనం మరణించేది ప్రభువు కోసం మరణిస్తున్నాము. అందువల్ల మనం మరణించినా, జీవించినా ప్రభువుకు చెందిన వాళ్ళమన్నమాట. ఈ కారణంగానే మరణించిన వాళ్ళకు, జీవించే వాళ్ళకు ప్రభువుగా ఉండాలని క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు.

10 ఇక ఇదిగో, నీవు నీ సోదరునిపై ఎందుకు తీర్పు చెపుతున్నావు? మరి మీలో కొందరెందుకు మీ సోదరుని పట్ల చిన్నచూపు చూస్తున్నారు? మనమంతా ఒక రోజు దేవుని సింహాసనం ముందు నిలబడతాము. 11 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ప్రభువు ఈ విధంగా అన్నాడు: నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను.
    నా ముందు అందరూ మోకరిల్లుతారు,
    దేవుని ముందు ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరిస్తుంది.”(A)

12 అందువల్ల మనలో ప్రతి ఒక్కడూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది.

ఇతరులు పాపం చేసేలా చేయకు

13 కాబట్టి ఇతర్లపై తీర్పు చెప్పటం మానుకొందాం. అంతేకాక, మీ సోదరుని మార్గంపై అడ్డురాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని తీర్మానం చేసుకోండి. 14 ఏ ఆహారం అపవిత్రం కాదని యేసు ప్రభువు ద్వారా నేను తెలుసుకొన్నాను. కానీ ఎవరైనా ఒక ఆహారం అపవిత్రమని తలిస్తే అది అతనికి అపవిత్రమౌతుంది.

15 నీవు తినే ఆహారం వల్ల నీ సోదరునికి దుఃఖం కలిగితే నీవు ప్రేమగా ఉండటం మానుకొన్నావన్న మాట. నీ ఆహారం కారణంగా నీ సోదరుణ్ణి నాశనం చెయ్యవద్దు. అతని కోసం క్రీస్తు మరణించాడు. 16 నీ మంచి పనుల్ని ఇతర్లు దూషించకుండా ప్రవర్తించు. 17 దేవుని రాజ్యం అంటే తినటం, త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. 18 ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు.

19 అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి దారి తీసే కార్యాలను చేద్దాం. 20 ఆహారం కొరకు దేవుని పనిని నాశనం చెయ్యకూడదు. అన్ని ఆహారాలు తినవచ్చు. కాని, ఇతర్ల ఆటంకానికి కారణమయ్యే ఆహారాన్ని తినటం అపరాధం. 21 నీ సోదరుడికి ఆటంక కారకుడివి అవటం కన్నా, మాంసాన్ని తినకుండా ఉండటం, ద్రాక్షారసం త్రాగకుండా ఉండటంలాంటి పన్లేవీ చెయ్యకుండా ఉండటం ఉత్తమం.

22 అందువల్ల వీటి విషయంలో నీవు ఏది నమ్మినా ఎలా ఉన్నా అది నీకు, దేవునికి సంబంధించిన విషయం. తానంగీకరిస్తున్న వాటి విషయంలో తనను తాను నిందించుకోని వ్యక్తి ధన్యుడు. 23 సందేహిస్తూ తినే వ్యక్తి విశ్వాసం లేకుండా తింటున్నాడు. కనుక దేవుడతనికి శిక్ష విధిస్తాడు. విశ్వాసంతో చేయని పనులన్నీ పాపంతో కూడుకొన్నవి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International