Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 38

యూదా మరియు తామారు

38 సుమారు అదే సమయంలో యూదా తన సోదరులను విడిచి, హీరా అనే ఒకతని దగ్గర ఉండేందుకు వెళ్లాడు. హీరా అదుల్లాము నివాసి. అక్కడ యూదా ఒక కనానీ అమ్మాయిని కలుసుకొని ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. ఆ అమ్మాయి తండ్రి పేరు షూయ. ఆ కనానీ స్త్రీకి ఒక కుమారుడు పుట్టగా, వారు అతనికి ఏరు అని పేరు పెట్టారు. తర్వాత ఆమె మరో కుమారుని కన్నది. ఆ కుమారునికి వారు ఓనాను అని పేరు పెట్టారు. తర్వాత షేలా అనే పేరుగల ఇంకో కుమారుడు ఆమెకు పుట్టాడు. యూదాకు మూడో కుమారుడు పుట్టినప్పుడు, అతడు కజీబులో నివాసం ఉంటున్నాడు.

యూదా తన మొదటి కుమారుడైన ఏరుకు భార్యగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాడు. ఆ అమ్మాయి పేరు తామారు. కానీ ఏరు చాలా చెడ్డపనులు చేశాడు. అతని విషయంలో యెహోవాకు సంతోషం లేదు. అందుచేత యెహోవా అతణ్ణి చంపేశాడు. అప్పుడు యూదా ఏరు సోదరుడైన ఓనానుతో, “పోయి, చనిపోయిన నీ సోదరుని భార్యతో శయనించు. ఆమెకు భర్తలా ఉండు. పిల్లలు పుడితే వారు నీ సోదరుడైన ఏరు పిల్లలుగా పరిగణించబడతారు” అని చెప్పాడు.

ఈ సంబంధంవలన కలిగే పిల్లలు తన పిల్లలుగా పరిగణింపబడరని ఓనానుకు తెలుసు. ఓనాను తామారుతో శయనించి, ఇంద్రియమును బయట పడవేశాడు. 10 దీనితో యెహోవాకు కోపము వచ్చి ఆయన ఓనానును చంపేశాడు. 11 అప్పుడు యూదా, “నీవు తిరిగి నీ తండ్రి యింటికి వెళ్లిపో. నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్లీ పెళ్లి చేసుకోకు” అని తన కోడలైన తామారుతో చెప్పాడు. షేలా కూడ తన అన్నల్లాగే చస్తాడేమోనని యూదాకు భయం. అతని కోడలు తామారు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది.

12 ఆ తర్వాత షూయ కుమార్తె, యూదా భార్య చనిపోయింది. యూదాకు దుఃఖ కాలం తీరిపొయ్యాక, అతడు తన స్నేహితుడు, అదుల్లాము నివాసి హీరాతో కలిసి తిమ్నాతునకు వెళ్లాడు. తన గొర్రెల బొచ్చు కత్తిరించాలని యూదా తిమ్నాతునకు వెళ్లాడు. 13 తామారు తన మామగారు యూదా తన గొర్రెల బొచ్చు కత్తిరించేందుకు తిమ్నాతునకు వస్తున్నాడని తెలుసుకొంది. 14 తామారు ఎప్పుడు విధవరాలి గుడ్డలే ధరించేది. కనుక ఇప్పుడు వేరే వస్త్రాలు ధరించి, నెత్తిమీద ముసుగు వేసుకొంది. అప్పుడు తిమ్నాతునకు దగ్గర్లో ఏనాయిము అనే పట్టణానికి పోయే మార్గంలో కూర్చొంది. యూదా చిన్న కుమారుడు షేల ఇప్పుడు పెద్దవాడయ్యాడని తామారుకు తెలుసు. అయినా గాని ఆమె అతణ్ణి పెళ్లి చేసికొనే ఏర్పాట్లు యూదా చేయటం లేదు.

15 యూదా ఆ మార్గాన ప్రయాణం చేశాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. (వేశ్యలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.) 16 కనుక యూదా ఆమె దగ్గరకు వెళ్లి, “నన్ను నీతో లైంగింకంగా కలవనీ” అని అడిగాడు. (ఆమె తన కోడలు తామారు అని యూదాకు తెలియదు.)

“అసలు నీవు ఏ మాత్రం ఇస్తావేంటి?” అంది ఆమె.

17 యూదా, “నా మందలోనుంచి ఒక మేక పిల్లను పంపిస్తా” అని జవాబిచ్చాడు.

“సరే, ఒప్పుకొంటాను. కాని నీవు ఆ మేక పిల్లను పంపించేంత వరకు నా దగ్గర ఉంచుకొనేందుకు నీవు యింకేమైన నాకు ఇవ్వాలి సుమా” అని జవాబు చెప్పింది ఆమె.

18 “నేను నీకు మేకపిల్లను పంపిస్తానని రుజువుగా ఉండేందుకు నన్నేమి ఇవ్వమంటావు?” అడిగాడు యూదా.

తామారు, “నీవు నీ ఉత్తరాల మీద ఉపయోగించే నీ ముద్ర, దాని దారం, నీ చేతి కర్ర ఇవ్వు” అని చెప్పింది. యూదా అవన్నీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు యూదా తామారును కూడగా ఆమె గర్భవతి అయ్యింది. 19 తామారు ఇంటికి వెళ్లి, తన ముఖం మీద ముసుగు తీసివేసింది. మరల విధవ వస్త్రాలే ఆమె ధరించింది.

20 యూదా తామారుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక మేకను ఇచ్చి తన స్నేహితుడు హీరాను ఏనాయిముకు పంపించాడు. మరియు ఆమె దగ్గర్నుండి ప్రత్యేక ముద్రను, చేతి కర్రను తీసుకొని రమ్మని యూదా అతనితో చెప్పాడు. కానీ హీరాకు ఆమె కనబడలేదు. 21 “ఇక్కడ దారి ప్రక్కగా ఉంటూండే ఆ వేశ్య ఏమయింది?” అని ఏనాయిము దగ్గర కొందరిని అడిగాడు హీరా.

“ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే” అని వాళ్లు అన్నారు.

22 కనుక యూదా స్నేహితుడు యూదా దగ్గరకు తిరిగి వెళ్లి, “ఆ స్త్రీ నాకు కనబడలేదు. అక్కడ ఎన్నడూ వేశ్య లేదని అక్కడ ఉండేవాళ్లు చెప్పారు” అన్నాడు.

23 అందుచేత యూదా, “ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండనివ్వు. మనుష్యులు నన్ను చూచి నవ్వటం నాకు ఇష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నం చేశాను, కానీ ఆమె మనకు కనబడలేదు. అది చాలు” అన్నాడు.

తామారు గర్భవతి

24 మూడు నెలల తర్వాత, “నీ కోడలు తామారు ఒక వేశ్యలా పాపం చేసింది, ఇప్పుడు గర్భవతిగా ఉంది” అని యూదాతో చెప్పారు.

అప్పుడు యూదా, “ఆమెను బయటకు లాగి చంపేసి, ఆమె శరీరాన్ని కాల్చివేయండి” అన్నాడు.

25 తామారును చంపటానికి మనుష్యులు వెళ్లారు. అయితే ఆమె తన మామగారికి ఒక సందేశం పంపింది. “నన్ను గర్భవతిగా చేసినవాడు ఈ వస్తువుల స్వంతదారుడే. (ప్రత్యేక ముద్ర, చేతి కర్ర ఆమె అతనికి చూపించింది.) ఈ వస్తువులు చూడు. ఇవి ఎవరివి? ఈ ముద్ర, దారం ఎవరివి? ఈ చేతి కర్ర ఎవరిది?”

26 వాటిని యూదా గుర్తుపట్టి, “ఆమెదే సరి. నాదే తప్పు. నేను వాగ్దానం చేసిన ప్రకారం నా కుమారుడైన షేలాను నేను ఆమెకు ఇవ్వలేదు” అన్నాడు. యూదా మళ్లీ ఇక ఆమెతో శయనించలేదు.

27 తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది. 28 ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక శిశువు చేయి బయటకు వచ్చింది. మంత్రసాని ఆ చేతికి ఒక ఎర్ర దారం కట్టి, “ఈ శిశువు ముందు పుట్టాడు” అంది. 29 అయితే ఆ శిశువు తన చేయి లోపలకు లాగేసాడు. అప్పుడు మరో శిశువు ముందు పుట్టాడు. కనుక “మొత్తానికి నీవే ముందు భేదించుకొని పుట్టావన్న మాట” అంది మంత్రసాని. అంచేత వారు పెరెసు[a] అని వానికి పేరు పెట్టారు. 30 తర్వాత రెండో శిశువు పుట్టాడు. చేతికి ఎర్రదారం కట్టబడిన శిశువు వీడు. వారు వాడికి జెరహు అనే పేరు పెట్టారు.

మార్కు 8

యేసు నాలుగువేల మందికి పైగా భోజనం పెట్టటం

(మత్తయి 15:32-39)

ఆ రోజుల్లో మళ్ళీ ఒకసారి పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ ఉండనందువల్ల యేసు శిష్యుల్ని పిలిచి, “నాకు జాలివేస్తోంది. వాళ్ళిప్పటికే మూడు రోజులనుండి నా దగ్గరున్నారు. తినటానికి వాళ్ళ దగ్గర ఏమీలేదు. నేను వాళ్ళను ఆకలితో యింటికి పంపివేస్తే వాళ్ళలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు. కనుక వాళ్ళు దారిలో మూర్ఛపోవచ్చు” అని అన్నాడు.

ఆయన శిష్యులు, “ఈ ఎడారి ప్రాంతంలో వాళ్ళు తినటానికి చాలినంత ఆహారం ఎక్కడనుండి తెమ్మంటారు?” అని అన్నారు.

“ఎన్ని రొట్టెలున్నాయి” అని యేసు అడిగాడు.

“ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

యేసు ప్రజల్ని కూర్చోమని చెప్పాడు. ఆ ఏడు రొట్టెలు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచాడు. ఆ రొట్టెముక్కల్ని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. వాళ్ళు అలాగే చేసారు. వాళ్ళ దగ్గర కొన్ని చేపలుకూడా ఉన్నాయి. వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని కూడా పంచమని తన శిష్యులకు యిచ్చాడు.

ప్రజలు వాటిని తిని సంతృప్తి చెందారు. ఆ తర్వాత ప్రజలు తినగా మిగిలిన ముక్కల్ని ఏడు గంపలనిండా నింపారు. నాలుగు వేలమంది ప్రజలు అక్కడవున్నారు. వాళ్ళను పంపివేసి వెంటనే 10 యేసు తన శిష్యులతో కలిసి పడవనెక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.

కొందరు యేసు అధికారాన్ని సందేహించటం

(మత్తయి 16:1-4; లూకా 11:16, 29)

11 పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఆయన్ని పరీక్షించే ఉద్దేశ్యంతోనే ఆకాశంనుండి ఒక రుజువు చూపమన్నారు. 12 ఆయన పెద్దగా నిట్టూర్చి, “ఈ కాలపు వాళ్ళు అద్భుతాల్ని రుజువులుగా చూపమని ఎందుకు అడుగుతారు? ఇది నిజం. మీకు ఏ రుజువూ చూపబడదు” అని అన్నాడు. 13 ఆ తర్వాత ఆయన వాళ్ళను వదిలి పడవనెక్కి అవతలి ఒడ్డు చేరుకొన్నాడు.

శిష్యులు యేసుని అపార్థము చేసికొనటం

(మత్తయి 16:5-12)

14 శిష్యులు రొట్టెలు తేవటం మరిచిపోయారు. వాళ్ళ దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది. 15 యేసు, “జాగ్రత్తగా ఉండండి. పరిసయ్యుల పులుపును హేరోదు పులుపును[a] గమనిస్తూ ఉండండి” అని వాళ్ళను హెచ్చరించాడు.

16 ఇది వాళ్ళు పరస్పరం చర్చించుకొంటూ, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా!” అని అనుకొన్నారు.

17 వాళ్ళు ఏమి చర్చించుకొంటున్నారో యేసు కనిపెట్టి, “రొట్టెలులేవని ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు యింకా అర్థంకాలేదా? మీరు చూడలేదా? మీ బుద్ధి మందగించిందా? 18 మీకు కళ్ళున్నాయి కాని చూడలేరు. చెవులున్నాయి కాని వినలేరు. మీకు జ్ఞాకపం లేదా? 19 నేను ఐదు రొట్టెల్ని విరిచి ఐదువేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపలనిండా నింపారు?” అని అడిగాడు.

“పన్నెండు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

20 “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని గంపలనిండా నింపారు?” అని యేసు అన్నాడు.

“ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

21 “యింకా మీకు అర్థం కాలేదా?” అని ఆయన వాళ్ళతో అన్నాడు.

బేత్సయిదాలో గ్రుడ్డివానికి నయం చేయటం

22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. అక్కడి ప్రజలు గ్రుడ్డివాణ్ణి యేసు దగ్గరకు తీసుకు వచ్చారు. అతణ్ణి తాకమని వాళ్ళు ఆయనను వేడుకొన్నారు. 23 యేసు ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకొని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. యేసు ఆ గ్రుడ్డివాని కళ్ళ మీద ఉమ్మివేసి తన చేతుల్ని వాటిపైవుంచి, “నీకేమైనా కనబడుతోందా” అని అడిగాడు.

24 ఆ గ్రుడ్డివాడు తలెత్తి, “మనుష్యులు నడుస్తున్నట్లు కనబడుతున్నారు. కాని వాళ్ళు చెట్లలా కనబడుతున్నారు” అని అన్నాడు.

25 యేసు మళ్ళీ ఒకసారి అతని కళ్ళపై తన చేతుల్ని ఉంచాడు. వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతనికి దృష్టి వచ్చింది. అన్నీ స్పష్టంగా చూడగలిగినాడు. 26 యేసు అతణ్ణి యింటికి పంపుతూ, “గ్రామంలోకి వెళ్ళవద్దు”[b] అని అన్నాడు.

పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం

(మత్తయి 16:13-20; లూకా 9:18-21)

27 యేసు తన శిష్యులతో కలిసి, కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూవున్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్ళతో, “ప్రజలు నేనెవరని అనుకొంటున్నారు?” అని అడిగాడు.

28 వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమాధానం చెప్పారు.

29 “మరి మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని అడిగాడు.

పేతురు, “మీరే క్రీస్తు”[c] అని సమాధానం చెప్పాడు.

30 తనను గురించి ఎవ్వరికి చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.

యేసు తన మరణాన్ని గురించి చెప్పటం

(మత్తయి 16:21-28; లూకా 9:22-27)

31 ఆ తదుపరి యేసు వాళ్ళకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు: “మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శాస్త్రులు, ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికివస్తాడు.” 32 యేసు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు.

పేతురు ఆయన చేయిపట్టుకొని వారించటం మొదలు పెట్టాడు. 33 కాని యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు ఒకసారి చూసి, పేతురుతో “సైతానా! నాముందు నుండి వెళ్ళిపో! నీవు మానవరీతిగా ఆలోచిస్తున్నావు కాని, దేవుని రీతిగా కాదు” అని అన్నాడు.

34 ఆ తర్వాత తన శిష్యుల్ని, ప్రజల్ని దగ్గరకు పిలిచి, “మీరు నన్ను అనుసరింపదలిస్తే, తనను తాను విసర్జించుకొని తన సిలువను మోస్తూ అనుసరించాలి. 35 ఎందుకంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నాకోసం, సువార్త కోసం ప్రాణాన్ని పోగొట్టుకొన్నవాడు దాన్ని కాపాడుకొంటాడు. 36 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని వదులుకొన్న మనిషికి ఏంలాభం కలుగుతుంది? 37 తన ప్రాణాన్ని తిరిగి పొందటానికి మనిషి ఏంయివ్వగలడు? 38 ఈ తరం వ్యభిచారంతో, పాపంతో నిండివుంది. నా విషయంలో కాని, నా బోధనల విషయంలో కాని ఎవ్వడు సిగ్గుపడతాడో, మనుష్య కుమారుడు తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతలతో కలసి వచ్చినప్పుడు వాని విషయంలో సిగ్గుపడతాడు.”

యోబు 4

ఎలీఫజు మాట్లాడుతున్నాడు

1-2 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు ఇచ్చాడు:

“నీతో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది నిన్ను కలవర పెడుతుందా?
    నేను మాట్లాడాల్సి ఉంది!
యోబూ, ఎంతో మంది మనుష్యులకు నీవు ఉపదేశాన్ని చేసావు.
    బలహీన హస్తాలకు నీవు బలం ఇచ్చావు.
తొట్రిల్లిన మనుష్యులకు నీ మాటలు ఆదరణ కలిగించాయి.
    బలహీనమైన మోకాళ్లను నీవు బలపరిచావు.
కాని ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధైర్య పడుతున్నావు.
    కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తల్లడిల్లి పోయావు!
నీవు దేవున్ని ఆరాధిస్తూ
    ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు.
కనుక నీవు నీ విశ్వాస్యతను నమ్ముకోవాలి.
    నీవు నిర్దోషివి కనుక అదే నీకు నిరీక్షణగా ఉండును గాక.
యోబూ, ఇప్పుడు దీనిని గూర్చి ఆలోచించు నిర్దోషియైన మనిషి ఎవ్వరూ, ఎన్నడూ నాశనం చేయబడలేదు.
    మంచి మనుష్యులు ఎన్నడూ నాశనం చేయబడలేదు.
కీడు, కష్టం ప్రారంభించే మనుష్యులను నేను గమనించాను.
    వారికి కూడా అవే సంభవిస్తాయి.
దేవుని శ్వాస ఆ మనుష్యులను చంపేస్తుంది.
    దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది.
10 దుర్మార్గులు సింహాలవలె గర్జించి గుర్రు పెడతారు.
    కాని దేవుడు దుర్మార్గులను నోరు మూయిస్తాడు.
    మరియు దేవుడు వారి పళ్లు విరుగగొడతాడు.
11 దుర్మార్గులు తినుటకు ఏమి లేని సింహాలవలె ఉంటారు.
    వారు చస్తారు, వారి పిల్లలు చెదరి పోతారు.

12 “రహస్యంగా నాకు ఒక సందేశం అందించబడింది.
    ఆ గుసగుసలు నా చెవులు విన్నాయి.
13 రాత్రివేళ వచ్చే ఒక చెడ్డ కలలా
    అది నా నిద్రను భంగం చేసింది.
14 నేను భయపడి వణకిపోయాను.
    నా ఎముకలన్నీ వణకిపోయాయి!
    ఎలీఫజు మాట్లాడుతున్నాడు
15 ఒక ఆత్మ నా ముఖాన్ని దాటిపోగా
    నా శరీరం మీది వెంట్రుకలు వేగంగా చలించాయి!
16 ఆత్మ ఇంకా నిలిచి ఉంది.
    కాని అదేమిటో నేను చూడలేకపోయాను.
ఒక ఆకారం నా కళ్ల ఎదుట నిలిచింది.
    నిశ్శబ్దంగా ఉంది.
అప్పుడు నేను ఒక మెల్లని స్వరం చెప్పడం విన్నాను.
17 ‘ఒక మనిషి దేవుని కంటే ఎక్కువ (నీతిమంతుడు)గా ఉండలేడు.
    మనిషి తనను చేసిన వానికంటే ఎక్కువ పరిశుద్ధంగా ఉండలేడు.
18 దేవుడు తన పరలోకపు సేవకులను కూడా నమ్మలేడు.
    తన దేవదూతల విషయంలో కూడా దేవుడు తప్పులు పట్టుకోగలడు
19 కనుక దేవుడు మనుష్యుల విషయంలో మరి ఎక్కవ తప్పులు పట్టుకోగలడు.
    మనుష్యులు మట్టి ఇండ్లలో[a] నివసిస్తారు.
    ఈ మట్టి ఇండ్ల పునాదులు మట్టిలో ఉన్నాయి.
    వారు చిమ్మెట కంటే తేలికగా చావగొట్టబడతారు.
20 సూర్వోదయం, సూర్యాస్తమయం మధ్య ఈ మనుష్యులు మరణిస్తారు, వారిని ఎవ్వరూ గుర్తించరు.
    వారు శాశ్వతంగా నశించిపోతారు.
21 వారి గుడారాల తాళ్లు లాగివేయబడతాయి,
    ఈ మనుష్యులు బుద్ధిలేకుండా చస్తారు.’”

రోమీయులకు 8

ఆత్మ ద్వారా జీవము

అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు. దేవుని ఆత్మ మనం యేసు క్రీస్తుతో ఐక్యత పొందటంవల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేక పోయింది. పాపస్వభావం దాన్ని బలహీనంచేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాపస్వభావంతో జీవించటంలేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము.

ప్రాపంచికంగా జీవించేవాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించేవాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి. ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు. ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు.

దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లైతే, మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. 10 ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. 11 మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు.

12 అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు. 13 ఎందుకంటే, ఐహికవాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మద్వారా రూపు మాపితే మీరు జీవిస్తారు.

14 దేవుని ఆత్మను అనుసరించినవాళ్ళు దేవుని కుమారులు. 15 మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి, “అబ్బా! తండ్రీ!” అని పిలుస్తున్నాము 16 మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు. 17 మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి.

రానున్న తేజస్సు

18 మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. 19 దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. 20 సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. 21 బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది.

22 సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. 23 అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. 24 మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? 25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము.

26 అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. 27 ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు.

28 దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. 29 దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. 30 దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు.

క్రీస్తు యేసులో దేవుని ప్రేమ

31 మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? 32 మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? 33 దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. 34 ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? 36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము,
    మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.”(A)

37 ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. 38 చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని 39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International