M’Cheyne Bible Reading Plan
యాకోబు ఏశావును కలిసికొనుట
33 యాకోబు చూడగా ఏశావు రావడం కనబడింది. ఏశావు, అతనితో 400 మంది మనుష్యులు వస్తున్నారు. యాకోబు తన కుటుంబాన్ని నాలుగు గుంపులుగా చేశాడు. లేయా, ఆమె పిల్లలు ఒక గుంపులో ఉన్నారు, రాహేలు, యోసేపు ఒక గుంపులో ఉన్నారు, ఇద్దరు దాసీలు, వారి పిల్లలు మరి రెండు గుంపుల్లో ఉన్నారు. 2 దాసీలను వారి పిల్లలను యాకోబు ముందు ఉంచాడు. తర్వాత యాకోబు లేయాను ఆమె పిల్లలను ఉంచాడు. ఆ తర్వాత, చివరగా రాహేలును, యోసేపును ఉంచాడు యాకోబు.
3 యాకోబు తానే ఏశావు వస్తున్న వైపు ముందుగా వెళ్లాడు. కనుక ఏశావు దగ్గరకు వచ్చిన మొదటివాడు అతడే. యాకోబు తన అన్న దగ్గరకు నడుస్తూ ఏడు సార్లు నేలమీద సాగిలపడ్డాడు.
4 యాకోబును చూడగానే అతణ్ణి కలుసుకొనేందుకు ఏశావు పరుగెత్తాడు. ఏశావు అతణ్ణి కౌగిలించుకొని హత్తుకొన్నాడు. ఏశావు అతని మెడమీద ముద్దు పెట్టుకొని, వారిద్దరు సంతోషముతో ఏడ్చేశారు. 5 ఏశావు చూడగా స్త్రీలు, పిల్లలు అతనికి కనబడ్డారు. “నీతో ఉన్న వీళ్లంతా ఎవరు?” అని అతడు అడిగాడు.
“దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్లంతాను. దేవుడు నాకు మేలు చేశాడు” అంటూ జవాబు చెప్పాడు యాకోబు.
6 తర్వాత ఇద్దరు దాసీలు, వారితో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లారు. వాళ్లంతా అతని ముందు సాష్టాంగపడ్డారు. 7 తర్వాత లేయా, ఆమెతో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. తరువాత, రాహేలు, యోసేపు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు.
8 “నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కనబడిన ప్రజలంతా ఎవరు? పైగా ఆ జంతువులన్నీ దేని కోసం?” అని ఏశావు అడిగాడు.
దానికి యాకోబు “నీవు నన్ను స్వీకరించాలని అవన్నీ నీకు నా కానుకలు” అని జవాబిచ్చాడు.
9 కాని ఏశావు, “సోదరా, నాకు నీవు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. నాకు కావాల్సినంత ఉన్నది” అన్నాడు.
10 యాకోబు ఇలా అన్నాడు: “అలా కాదు, నేను నిన్ను బతిమాలుకొంటున్నాను. నీవు నిజంగా నన్ను అంగీకరిస్తుంటే, నీవు నా కానుకలు కూడా అంగీకరించాలి. మరలా నేను నీ ముఖం చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని ముఖము చూసినట్లు ఉంది. నీవు నన్ను అంగీకరించటం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. 11 అందుచేత నేను నీకు ఇస్తున్న కానుకలను కూడ స్వీకరించమని ప్రార్థిస్తున్నా. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు కావల్సిన దానికంటే ఎక్కువగా ఉంది.” ఈ విధంగా తన కానుకల్ని తీసుకోమని యాకోబు ఏశావును బతిమాలాడు. కనుక ఏశావు ఆ కానుకలను స్వీకరించాడు.
12 అప్పుడు ఏశావు, “ఇంక నీవు ప్రయాణం కొనసాగించు. నేను కూడ నీతో వస్తాను” అన్నాడు.
13 కాని యాకోబు అతనితో ఇలా చెప్పాడు: “నా పిల్లలు బలహీనులని నీకు తెలుసు. పైగా నా మందలు, వాటి పిల్లలను గూర్చిన జాగ్రత్త నేను తీసుకోవాలి. ఒక్క రోజునే నేను వాటిని చాలా దూరం నడిపిస్తే అవి చస్తాయి. 14 అందుచేత నీవు ముందు వెళ్లు. నేను మెల్లగా నీ వెనుక వస్తాను. పశువులు, మిగిలిన జంతువులు క్షేమంగా ఉండగలిగినంత నిదానంగా నేను నడుస్తాను. మరియు నా పిల్లలు కూడ మరీ అలసిపోకుండా నేను మెల్లగా వస్తాను. శేయీరులో నేను నిన్ను కలుసుకొంటాను.”
15 ఏశావు, “అలాగైతే నీకు సహాయంగా నా మనుష్యులను కొందర్ని నీతో ఉంచుతాను” అన్నాడు.
కానీ యాకోబు, “అదంతా నీ దయ. కాని అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు” అన్నాడు. 16 కనుక ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం కట్టాడు. 17 అయితే యాకోబు సుక్కోతుకు వెళ్లాడు. అక్కడ తనకోసం ఒక యిల్లు, తన పశువుల కోసం కొట్టములు కట్టాడు. అందుకే ఆ చోటుకు సుక్కోతు[a] అని పేరు.
18 ఆ తర్వాత, యాకోబు పద్దనరాము నుండి కనానులో ఉన్న షెకెము పట్టణం వరకు తన ప్రయాణాన్ని క్షేమంగా ముగించాడు. ఆ పట్టణానికి సమీపంగా ఒక పొలంలో యాకోబు తన నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు. 19 షెకెము తండ్రియైన హమోరు కుటుంబం దగ్గర యాకోబు ఆ పొలాన్ని కొన్నాడు. యాకోబు నూరు వెండి నాణ్యాలు చెల్లించాడు. 20 దేవుణ్ణి ఆరాధించటానికి యాకోబు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి “ఏల్, ఇశ్రాయేలీయుల దేవుడు” అని పేరు పెట్టాడు.
రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం
(మత్తయి 13:1-9; లూకా 8:4-8)
4 ఒక రోజు యేసు సముద్రం దగ్గర బోధించటం మొదలు పెట్టాడు. ఆయన చుట్టూ చాలమంది ప్రజలు చేరటం వల్ల ఆయన పడవనెక్కి కూర్చొని నీళ్ళలోకి వెళ్ళాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు. 2 ఆయన ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళకు చాలా విషయాలు బోధించాడు. ఆ విధంగా బోధిస్తూ,
3 “వినండి! ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. 4 అతడు విత్తనములు చల్లుతుండగా కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. వాటిని పక్షులు తినివేసాయి. 5 మరికొన్ని మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందువల్ల అవి త్వరగా మొలకెత్తాయి. 6 కాని సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. వాటికి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. 7 మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల మధ్య పడ్డాయి. ఆ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కలను అణచి వేయటంవల్ల వాటికి ధాన్యం పండలేదు. 8 మరికొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి, ముప్పై వంతుల, అరవైవంతుల, నూరువంతుల పంటను కూడా యిచ్చాయి.”
9 ఈ విధంగా చెప్పి యేసు, “చెవులున్న వాడు విననీ!” అని అన్నాడు.
యేసు బోధించుటకు ఉపమానములను ఎందుకు ఉపయోగించాడు
(మత్తయి 13:10-17; లూకా 8:9-10)
10 ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన పన్నెండుగురు శిష్యులు ఆయన చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు.
11 ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యంయొక్క రహస్య జ్ఞానాన్ని మీకు చెప్పాను. కాని యితరులకు ఈ జ్ఞానం ఉపమానాల ద్వారా చెబుతాను. 12 ఎందుకంటే,
‘వాళ్ళు ఎప్పుడూ చూస్తారు కాని ఏదీ గ్రహించరు.
అన్నీ వింటారు కాని ఒక్కటీ అర్థం చేసుకోరు.
వాళ్ళు అలా చేస్తే దేవుని వైపు మళ్ళవచ్చు దేవుడు వాళ్ళను క్షమిస్తాడు.’”(A)
యేసు విత్తనము యొక్క ఉపమానమును వివరించటం
(మత్తయి 13:18-23; లూకా 8:11-15)
13 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీకీ ఉపమానం అర్థం కాలేదా? మరి మిగతా ఉపమానాల్ని ఎలా అర్థం చేసుకొంటారు? 14 రైతు, దైవ సందేశాన్ని విత్తుతున్నవాడు. 15 కొందరు వ్యక్తులు దారి మీది మట్టిలాంటి వాళ్ళు. వీళ్ళలో విత్తనం నాటిన వెంటనే, అంటేవాళ్ళు విన్న వెంటనే, సైతాను వచ్చి వాళ్ళలో నాటబడిన దైవసందేశాన్ని తీసుకువెళ్తాడు.
16 “మరి కొందరు రాతినేలలాంటి వాళ్ళు. వీళ్ళు సందేశాన్ని విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. 17 కాని వాళ్ళు సందేశాన్ని లోతైన జీవితంలోనికి నాటనివ్వరు. కొంత కాలం మాత్రమే నిలుస్తుంది. ఆ సందేశం కారణంగా కష్టంకాని, హింసకాని కలిగితే వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తారు.
18 “మరి కొందరు ముళ్ళమొక్కలు మొలిచే నేలలాంటి వాళ్ళు. వాళ్ళు దైవసందేశం వింటారు కాని 19 ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, యితర వస్తువుల పట్ల వ్యామోహం, ఆ దైవ సందేశాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి.
20 “ఇతరులు సారవంతమైన భూమిలాంటివాళ్ళు. కనుక వీళ్ళు దైవసందేశాన్ని విని అంగీకరించి ఫలంపొందే వాళ్ళు. కనుక వీళ్ళు ముప్పై, అరవై, నూరువంతుల ఫలం ఫలిస్తారు.”
నీకున్న గ్రహింపును ఉపయోగించుకొనుము
(లూకా 8:16-18)
21 ఆయన మళ్ళీ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీరు దీపాన్ని తెచ్చి స్తంభం మీద పెట్టకుండా మంచం క్రింద లేక పాత్ర క్రింద పెడతారా? లేదు, దీపస్తంభం మీద పెడతారు. 22 దాచబడినవన్నీ బహిరంగమౌతాయి. అన్ని రహస్యాలు బయటపడతాయి. 23 వింటున్న మీరు జాగ్రత్తగా వినండి.” 24 యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మీరు విన్నదాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతతో కొలిచి యిస్తారో అదే కొలతతో యింకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు. 25 వున్నవానికి దేవుడు యింకా ఎక్కువగా యిస్తాడు. లేనివాని దగ్గరనుండి అతని దగ్గర ఉన్నది కూడా తీసివేస్తాడు.”
పెరిగే విత్తనం యొక్క ఉపమానం
26 యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి విత్తనాల్ని భూమ్మీద చల్లుతాడు. 27 అవి రాత్రి, పగలు, అతడు పడుకొని ఉన్నా, లేచివున్నా మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. అవి ఏ విధంగా పెరుగుతున్నాయో అతనికి తెలియదు. 28 భూమి తనంతకు తానె ధాన్యాన్ని పండిస్తుంది. మొదట మొలక వేసి ఆ తర్వాత కంకువేసి, ఆ కంకి నిండా ధాన్యం పండుతుంది. 29 పంటకాలం వరకు ఆ ధాన్యం పూర్తిగా పండిపోతుంది. వెంటనే, రైతు కొడవలిపెట్టి కోస్తాడు.”
దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?
(మత్తయి 13:31-32, 34-35; లూకా 13:18-19)
30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఏ విధంగా ఉందని చెప్పాలి? ఏ ఉపమానాన్ని ఉపయోగించి దాన్ని వర్ణించాలి? 31 అది ఆవగింజలాంటిది. మనం భూమిలో నాటే విత్తనాలన్నిటి కన్నా అది చాలా చిన్నది. 32 కాని ఆ ఆవగింజను నాటాక తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఉంటాయి. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూడుకట్టుకొంటాయి.”
33 యేసు ఇలాంటి ఉపమానాల్ని ఎన్నో ఉపయోగించి, దైవసందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకొన్నంత బోధించాడు. 34 ఉపమానాల్ని ఉపయోగించకుండా వాళ్ళకు ఏదీ బోధించ లేదు. కాని ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు అన్నీ వివరించి చెప్పాడు.
యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం
(మత్తయి 8:23-27; లూకా 8:22-25)
35 ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సముద్రం అవతలివైపుకు వెళ్దాం!” అని అన్నాడు. 36 శిష్యులు, అక్కడ ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి పడవలో ఉన్న యేసును తమవెంట తీసుకు వెళ్ళారు. మరికొన్ని పడవలు కూడా వాళ్ళను అనుసరించాయి. 37 ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి ఆ పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి పోసాగింది. 38 పడవ వెనుక వైపు యేసు తలక్రింద ఒక దిండు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని లేపి ఆయనతో, “బోధకుడా! మేము మునిగి పోయినా మీకు చింతలేదా?” అని అన్నారు.
39 ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది.
40 ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయపడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” అని అన్నాడు.
41 వాళ్ళకు చాలా భయంవేసింది. తమలో తాము, “ఎవరీయన? గాలి, అలలు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయే!” అని ఆశ్చర్యపడ్డారు.
యూదుల విజయం
9 పన్నెండో నెల (అదారు) 13వ రోజున ప్రజలందరూ మహారాజు ఆజ్ఞను మన్నించవలసి వుంది. అది యూదులను చంపాలని యూదుల శత్రువులు ఆశించిన రోజు. అయితే, యిప్పుడు ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. తమను ద్వేషించిన తమ శత్రువులకంటె యూదులు ఇప్పుడు బలంగా వున్నారు. 2 అహష్వేరోషు మహారాజు సామ్రాజ్యంలోని అన్ని నగరాల్లోని యూదులూ సమావేశమయ్యారు. తమను నాశనం చేయాలని కోరినవారి పైన దాడిచేసేటంత బలాన్ని సమకూర్చుకునేందుకుగాను వాళ్లు సమకూడారు. దానితో, వాళ్లని ఎదిరించి నిలబడగల శక్తిగలవారు ఎవ్వరూ లేకపోయారు. యూదులంటే జనం భయపడ్డారు. 3 సామంత రాజ్యాల్లోని అధికారులు, సామ్రాజ్యాధిపతులు, రాజ్య పాలకులు, రాజోద్యోగులు అందరూ యూదులకు తోడ్పడ్డారు. వాళ్ల ఈ తోడ్పాటుకి మొర్దెకై పట్లనున్న భయమే కారణం. 4 మహారాజు భవనంలోని అతి ముఖ్యుల్లో మొర్దెకై ఒకడయ్యాడు. సామంత రాజ్యాల్లోని ప్రతి ఒక్కరికి మొర్దెకై పేరు తెలుసు. అతనికెంత ప్రాముఖ్యం వుందో తెలుసు. మొర్దెకై నానాటికీ మరింత శక్తివంతమైన వ్యక్తి అయ్యాడు.
5 యూదులు తమ శత్రువులందర్నీ ఓడించారు. వాళ్లు తమ శత్రువుల్ని హతమార్చేందుకూ, నాశనం చేసేందుకూ కత్తులు ప్రయోగించారు. తమని ద్వేషించినవారి పట్ల యూదులు తమ చిత్తం వచ్చినట్లు వ్యవహరించారు. 6 యూదులు రాజధాని అయిన షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం చేశారు. 7 యూదులు ఈ క్రిందివారిని కూడా మట్టు పెట్టారు: 8 పర్షందాతా, దల్పోను, అస్పాతా, 9 పోరాతా, అదల్యా, అరీదాతా, పర్శష్తా, అరీసై, అరీదై, వైజాతా. 10 ఈ పదిమందీ హామాను కొడుకులు. హమ్మెదాతా కొడుకైన హామాను యూదులకు గర్భశత్రువు. యూదులు హామాను కొడుకులందర్నీ చంపేశారుగాని, వాళ్లకి చెందిన ఆస్తిపాస్తులు వేటినీ వాళ్లు తాకలేదు.
11 ఆ రోజున రాజధాని అయిన షూషను నగరంలో చంపివేయబడిన వాళ్ల సంఖ్యను మహారాజ తెలుసు కున్నాడు. 12 అప్పుడు మహారాజు మహారాణి ఎస్తేరుతో ఇలా అన్నాడు: “షూషను నగరంలో యూదులు హామాను కొడుకులు పదిమందితో బాటు 500 మందిని చంపేశారు. ఇప్పుడిక మహారాజు సామ్రాజ్యంలోని యితర సామంత రాజ్యాల్లో ఏమి జరగాలని నీవు కోరుకుంటున్నావో చెప్పు. నేను అలా చేయిస్తాను. నీవు కోరుకో, కోరుకున్నదేదైనా సరే, నేను చేయిస్తాను.”
13 ఎస్తేరు ఇలా కోరింది, “మహారాజుకి సమ్మతమైతే, షూషను నగరంలోని యూదులను రేపుకూడా యీ కార్యక్రమం కొనసాగించనివ్వండి, హామాను కొడుకులు పదిమంది కళేబరాలనూ ఉరికంబం మీద వేలాడదీయించండి.”
14 మహారాజు అలాగే ఉత్తరువు ఇచ్చాడు. ఆ ఉత్తరువు షూషను నగరంలో మరోక రోజు అమలు జరిగింది. హామాను కొడుకులు పదిమందీ ఉరి కొయ్యలకు వేలాడదీయబడ్డారు. 15 అదారు నెల 14వ రోజున షూషను నగరంలో యూదులందరూ గుమికూడి, మరో 300 మంది పురుషులను చంపేశారు. అయితే, వాళ్లకి చెందిన ఏ వస్తువుల్నీ యూదులు ముట్టలేదు.
16 అదే సమయంలో యితర సామంత రాజ్యాల్లోని యూదులు కూడా తమని తాము కాపాడుకోగల బలాన్ని పుంజుకునేందుకు గాను వాళ్లు సమావేశ మయ్యారు. వాళ్లు అలా తమ శత్రువులను వదిలించుకున్నారు. యూదులు తమ శత్రువుల్లో 75,000 మందిని హతమార్చారు. అయితే, వాళ్లకి చెందిన వస్తువులు వేటినీ యూదులు చేజిక్కించుకోలేదు. 17 అదారు నెల 13వ రోజున యిది జరిగింది. 14వ రోజున యూదులు విశ్రమించారు. యూదులు ఆరోజును తమ సంతోషకరమైన సెలవు దినం చేసుకున్నారు.
పూరీము పండుగ
18 షూషను నగరంలోని యూదులు అదారు నెల 13, 14 తేదీల్లో సమావేశమయ్యారు. తర్వాత 15వ రోజున వాళ్లు విశ్రమించారు. అందుకని, 15వ రోజును వాళ్లు సంతోషకరమైన పండుగ దినం చేసుకున్నారు. 19 కాగా దేశంలో, చిన్నచిన్న గ్రామాల్లో జీవించే యూదులు ఈ పూరీము పండుగను అదారు నెల 14వ రోజున జరుపుకుంటారు. వాళ్లీ 14వ రోజును ఆనందదాయకమైన పండుగగా జరుపుకుంటారు. వాళ్లు ఆ రోజున విందులు జరుపుకుంటారు. ఒకరి కొకరు బహూమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
20 అప్పుడు జరిగిన ఘటనలన్నింటినీ మొర్దెకై గ్రంథస్తం చేయించాడు. తర్వాత అతను అహష్వేరోషు మహారాజు సామంత రాజ్యాలన్నింటిలోని యూదులందరికీ లేఖలు పంపాడు. అతనా లేఖలను దగ్గర ప్రాంతాలకే కాకుండా దూర ప్రాంతాలకు కూడా పంపాడు. 21 ఏటా అదారు నెల 14, 15 తేదీల్లో యూదులందరూ పూరీము పండుగను పాటించాలని తెలియ చెప్పేందుకుగాను మొర్దెకై ఈ పని చేశాడు. 22 అవి యూదులు తమ శత్రువులను నిశ్శేషం చేసిన రోజులు. అందుకని యూదులు పండుగ దినాలుగా జరుపుకోవాలి. తమ దుఃఖం సంతోషంగా మారిన ఆ నెలను కూడా వాళ్లు పండుగ మాసంగా జరుపుకోవాలి. వాళ్ల రోదన పండుగ దినాలుగా మారిన నెల అది. మొర్దెకై యూదులందరికీ లేఖలు వ్రాశాడు. అతను ఆ రోజులను ఆనందం వెల్లివిరిసే పండుగ దినాలుగా జరుపుకోమని యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్లా రోజుల్లో విందులు జరుపుకోవాలి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవాలి, పేదలకు కానుకలివ్వాలి.
23 యూదులు మొర్దెకై తమకు వ్రాసిన విధంగా చేసేందుకు అంగీకరించారు. తాము ప్రారంభించిన వేడుకలను కొనసాగించేందుకు సమ్మతించారు.
24 అగాగీయుడైన హామ్మెదాతా కొడుకు హామాను యూదులందరికీ గర్భశతృవు. యూదులను నాశనం చేసేందుకుగాను వాళ్లకి వ్యతిరేకంగా అతనొక దుష్ట పథకం వేశాడు. యూదులను నాశనం చేసేందుకూ, నిర్మూలించేందుకూ అనువైన రోజును ఎంపిక చేసేందుకుగాను అతను చీట్లు వేశాడు. ఆ కాలంలో దాన్ని “పూరు” అనేవారు, అందుకే ఆ పండుగను “పూరీము” అంటారు 25 హామాను దుష్కార్యాలు చేశాడు. ఎస్తేరు మహారాజు సన్నిధికి వెళ్లి, మాట్లాడింది. దానితో అతను కొత్త ఆజ్ఞలు పంపాడు. ఆ ఆజ్ఞలు హామాను దుష్ట పథకాలను భగ్నం చయడమేగాక, హామాను దుష్ట పథకంలోని దుష్కార్యాలు హామానుకీ, అతని కుటుంబ సభ్యులకీ సంభవించేలా చేశాయి! దానితో హామానూ, అతని కొడుకులూ ఉరికంబాలకు వేలాడదీయబడ్డారు.
26-27 ఆ కాలంలో చీట్లను “పూరీము” అనేవారు, అందుకే ఈ పండుగను “పూరీము” అంటారు. మొర్దెకై ఒక లేఖ వ్రాసి, యూదులను ఈ పండుగ చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అందుకే, యూదులు ఏటా ఈ పండుగను రెండు రోజులపాటు జరుపుకోవడం ఆచారం అయింది. 28 వాళ్లీ పండుగను తమకు గతంలో జరిగినవాటిని గుర్తుంచుకోగలిగేందుకు గాను జరుపుకుంటారు. యూదులూ, వాళ్లతో చేరేవాళ్లూ ఏటా యీ పండుగను సరైన కాలంలో, సక్రమమైన పద్ధతిలో జరుపుకుంటారు. ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ యీ రెండు రోజులనూ గుర్తుంచుకుంటాయి. వాళ్లీ పండుగను ప్రతి సామంత రాజ్యంలోనూ, ప్రతి పట్టణంలోనూ జరుపుకుంటారు. పూరీము రోజుల్లో పండుగ జరుపుకోవడాన్ని యూదులు ఎన్నడూ మానరు. యూదుల ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ ఈ పండుగను సదా గుర్తుంచుకుంటారు.
29 పూరీమును గురించిన ఉత్తరువు లేఖను అబీహాయిలు కూతురు ఎస్తేరు మహారాణీ, యూదుడైన మొర్దెకైలు కలిసి వ్రాశారు. ఈ రెండవ లేఖ నిజమని నిరూపించేందుకుగాను దాన్ని వారు మహారాజు పూర్తి అనుమతి (ఆజ్ఞ)తో వ్రాశారు. 30 మొర్దెకై ఆ లేఖలను అహష్వేరోషు మహారాజు వారి 127 సామంత రాజ్యాల్లోని యూదులందరికీ పంపాడు. ఈ పండుగ శాంతినీ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్నీ[a] పెంపొందించాలని జనానికి మొర్దెకై సూచించాడు. 31 పూరీము పండుగ సంబరాలు మొదలు పెట్టమని చెప్పేందుకుగాను మొర్దెకై ఈ లేఖలు వ్రాశాడు. ఈ కొత్త పండుగను ఎప్పుడు మొదలు పెట్టాలోకూడా అతను ఆ లేఖల్లో వాళ్లకి తెలియచేశాడు. యూదులకు యీ ఉత్తరువును యూదుడైన మొర్దెకై, మహారాణి ఎస్తేరూ పంపారు. తద్వారా వాళ్లు యీ రెండు రోజుల పండుగను తమ తరతరాల యూదుల కోసం స్థిరపరిచారు. తాము ఉపవాసాలు చేసి, జరిగిన చెడుగుల విషయంలో విలపించే ఇతర పండుగలను గుర్తు పెట్టుకొనేటట్లే యూదులు ఈ పండుగను కూడా గుర్తు పెట్టుకుంటారు. 32 ఎస్తేరు ఉత్తరువు పూరీము పండుగ నియమాలను స్థిరపరచింది. ఆ విషయాలు గ్రంథాల్లో నమోదు చేయబడ్డాయి.
మొర్దెకైకి గౌరవస్థానం
10 అహష్వేరోషు మహారాజు ప్రజల దగ్గర్నుంచి పన్నులు వసూలు చేసేవాడు. సుదూర ప్రాంతాల్లో సముద్ర తీరాన వున్న నగర వాసులతో బాటు, సామ్రాజ్యంలోని ప్రజలందరూ పన్నులు చెల్లించవలసి వచ్చేది. 2 అహష్వేరోషు మహారాజు చేసిన ఘనకార్యాలన్నీ మాదీయ, పారశీక రాజ్యాల చరిత్ర గ్రంథంలో లిఖింపబడ్డాయి. అలాగే మొర్దెకై చేసిన ఘనకార్యాలన్నీ కూడా ఆ చరిత్ర గ్రంథాల్లో చేర్చబడ్డాయి. మహారాజు మొర్దెకైకి ఘనమైన గౌరవస్థానం కల్పించాడు. 3 సామ్రాజ్యంలో అహష్వేరోషు తర్వాత ప్రాముఖ్యంలో మొర్దెకైది ద్వితీయ స్థానం. యూదులందరిలో మొర్దెకైయే అతి ముఖ్యమైన వ్యక్తి. అతని తోటి యూదులు అతన్నెంతగానో గౌరవించేవారు. మొర్దెకై తన జాతీయ ప్రజల సంక్షేమ సౌభాగ్యాల కోసం విశేషంగా కృషి చేశాడు. మొర్దెకై యూదులందరికీ శాంతిని చేకూర్చాడు. అందుకే, సాటి యూదులందరికీ మొర్దెకై అంటే ఎంతో గౌరవం.
అబ్రాహాము యొక్క విశ్వాసం
4 అబ్రాహాము మన మూలపురుషుడు. అతడు ఈ విషయంలో ఏమి నేర్చుకొన్నాడు! 2 అబ్రాహాము చేసిన కార్యాలవలన అతడు నీతిమంతునిగా పరిగణింపబడి ఉంటే అతడు గర్వించటానికి కారణం ఉండేది. కాని దేవుని యెదుట కాదు 3 ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడు కనుక దేవుడు అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”(A)
4 పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు. 5 దుర్మార్గుల్ని నీతిమంతులుగా చెయ్యగల దేవుడు, వాళ్ళు కార్యాలు చెయ్యకపోయినా వాళ్ళు తనను విశ్వసిస్తే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళను నీతిమంతులుగా పరిగణిస్తాడు. 6 క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు:
7 “దేవుడు ఎవరి తప్పుల్ని,
పాపాల్ని క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు.
8 ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో
వెయ్యడో వాళ్ళు ధన్యులు.”(B)
9 మరి, సున్నతి చేయించుకొన్నవాళ్ళు మాత్రమే ధన్యులా లేక సున్నతి చేయించుకోనివాళ్ళు కూడా ధన్యులా? అబ్రాహాములో విశ్వాసం ఉండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడని మనమంటూ వచ్చాము. 10 దేవుడు అతణ్ణి నీతిమంతునిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకొన్న పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప కాదు, ముందే. 11 అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు అతనిలో విశ్వాసముండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. దీనికి చిహ్నంగా అబ్రాహాము సున్నతిని ఒక ముద్రగా పొందాడు. తద్వారా సున్నతి పొందకున్నా, విశ్వాసం ఉన్నవాళ్ళకు అతడు తండ్రి అయ్యాడు. వీళ్ళను నీతిమంతులుగా పరిగణించాలని దేవుని ఉద్దేశం. 12 అబ్రాహాము సున్నతి చేయించుకొన్నవాళ్ళకు కూడా తండ్రి. అంటే అందరికి కాదు. మన తండ్రి అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు నుండి అతనిలో ఉన్న విశ్వాసాన్ని తమలో చూపిన వాళ్ళకు మాత్రమే అతడు తండ్రి.
విశ్వాసంద్వారా దేవుని వాగ్దానం పొందెను
13 అబ్రాహాము మరియు అతని సంతానం ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ వాగ్దానం ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు చెయ్యలేదు. అతనిలో విశ్వాస ముండటంవలన దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానం చేసాడు. 14 ఒకవేళ వారసులు కావటానికి ధర్మశాస్త్రం కారణమైతే, విశ్వాసానికి విలువ ఉండదు. పైగా వాగ్దానానికి అర్థం ఉండదు. 15 ధర్మశాస్త్రం ఉంటే దేవుని ఆగ్రహం ఉంటుంది. కాని ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని అతిక్రమించే ప్రశ్నేరాదు.
16 ఆ వాగ్దానము విశ్వాసము ఉండటంవల్ల సంభవిస్తోంది. అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశ్యం. అది అబ్రాహాము సంతానానికంతా వర్తిస్తుందని దేవుడు అభయమిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళకే కాకుండా అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని తమలో వ్యక్తం చేసేవాళ్ళకు కూడా అది వర్తిస్తుందన్న మాట. అబ్రాహాము మనందరికీ తండ్రి. 17 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను నిన్ను ఎన్నో జనాంగములకు తండ్రిగా చేస్తాను.”(C) దేవుని దృష్టిలో అబ్రాహాము మనకు తండ్రిలాంటి వాడు. దేవుడు చనిపోయినవాళ్ళకు ప్రాణం పొయ్యగలడు. తన ఆజ్ఞలతో లేనివాటిని సృషించగలడు. అలాంటి దేవుణ్ణి అబ్రాహాము విశ్వసించాడు.
18 నిరాశ సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ముకొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. “నీ సంతతివాళ్ళు చాలా మంది ఉంటారు” అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది. 19 అప్పటికి అబ్రాహాముకు సుమారు నూరు సంవత్సరాల వయస్సు. అతని శరీరం బలహీనంగా ఉండింది. పైగా శారాకు గర్భం దాల్చే వయస్సు దాటిపోయి ఉంది. ఈ సంగతులు అబ్రాహాముకు తెలుసు. అయినా అతని విశ్వాసం సన్నగిల్లలేదు. 20 దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. 21 దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోగలడని, ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది. 22 ఈ కారణంగానే, “దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు” 23 “నీతిమంతునిగా పరిగణించాడు” అన్న పదాలు అతనికొరకు మాత్రమే వ్రాయబడలేదు. 24 అవి మనకోసం కూడా వ్రాయబడ్డాయి. మనము మన యేసు ప్రభువును బ్రతికించిన దేవునియందు విశ్వసిస్తున్నాము. కనుక దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా పరిగణిస్తాడు. 25 దేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి అప్పగించాడు. మనం నీతిమంతులం కావాలని ఆయన్ని బ్రతికించాడు.
© 1997 Bible League International