M’Cheyne Bible Reading Plan
వెళ్లాల్సిన సమయం—యాకోబు పారిపోవుట
31 ఒక రోజున లాబాను కొడుకులు మాట్లాడుకోవడం యాకోబు విన్నాడు. “మన తండ్రికి ఉన్నదంతా యాకోబు తీసివేసుకొన్నాడు. యాకోబు ధనికుడైపోయాడు, ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు.” అని వాళ్లు చెప్పుకొన్నారు. 2 అప్పుడు లాబాను ఇదివరలో ఉన్నంత స్నేహంగా తనతో యిప్పుడు లేనట్లు యాకోబు గమనించాడు. 3 అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల నివాస దేశానికి నీవు తిరిగి వెళ్లిపో. నేను నీకు తోడుగా ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు.
4 కనుక యాకోబు తన గొర్రెలు, మేకల మందలను ఉంచిన పొలాల్లో తనను కలిసికోమని రాహేలు, లేయాలకు చెప్పాడు. 5 రాహేలు, లేయాలతో యాకోబు ఇలా చెప్పాడు: “మీ తండ్రి నామీద కోపంగా ఉన్నాడు. ఇది వరకు ఎప్పుడూ అతడు నాతో స్నేహంగా ఉండేవాడు, కాని ఇప్పుడు లేడు. అయితే, నా తండ్రి దేవుడు నాతో వున్నాడు. 6 నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు. 7 అయితే మీ తండ్రి నన్ను మోసం చేశాడు. నా జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటినుండి దేవుడు నన్ను కాపాడాడు.
8 “ఒకసారి లాబాను అన్నాడు: ‘మచ్చలు ఉన్న మేకలన్నీ నీవు ఉంచుకోవచ్చు. ఇది నీ జీతం.’ అతడు ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ మచ్చలు ఉన్న పిల్లలనే కన్నాయి. కనుక అవి అన్నీ నావే. కానీ అప్పుడు లాబాను, ‘మచ్చలు గల మేకలను నేను తీసుకొంటాను, చారలున్న మేకలన్నీ నీవే. అది నీకు జీతం’ అన్నాడు. అతడు యిలా చెప్పిన తర్వాత జంతువులన్నీ చారలు గల పిల్లల్ని పెట్టాయి. 9 కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు.
10 “జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. అలా కలుస్తున్న మగ మేకలు మాత్రమే మచ్చలు, చారలు గలవిగా నేను చూశాను. 11 కలలో ఆ దేవదూత నాతో మాట్లాడాడు. ఆ దేవదూత, ‘యాకోబూ!’ అన్నాడు.
“‘చిత్తం’ అన్నాను నేను.
12 “ఆ దేవదూత అన్నాడు: ‘చూడు, మచ్చలు, చారలు ఉన్న మేకలు మాత్రమే ఎదవుతున్నాయి. ఇలా జరిగేటట్లు నేను చేస్తున్నాను. లాబాను నీ యెడల చేస్తోన్న అపకారం అంతా నేను చూశాను. క్రొత్తగా పుట్టిన మేక పిల్లలన్నీ నీకే చెందాలని నేను ఇలా చేస్తున్నాను. 13 బేతేలులో నీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే. ఆ స్థలంలో నీవు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం మీద ఒలీవ నూనె నీవు పోశావు. అక్కడ నాకు నీవు ఒక వాగ్దానం చేశావు. నీవు తిరిగి నీ పుట్టిన స్థలానికి వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధపడు.’”
14-15 రాహేలు, లేయాలు యాకోబుతో అన్నారు: “మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయివాళ్లుగా చూశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేశాడు, మరియు ఆ తరువాత మాకు రావలసిన సొమ్ము అంతా వాడేసుకొన్నాడు. 16 మా తండ్రి దగ్గర్నుండి ఈ ఆస్తి అంతా దేవుడు తీసివేశాడు, ఇప్పుడు అది మనది మన పిల్లలది. కనుక నీవు ఏం చేయాలని దేవుడు నీతో చెప్పాడో అలాగే నీవు చేయాలి!”
17 అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు. 18 అప్పుడు వాళ్లు అతని తండ్రి నివసించిన కనాను దేశానికి తిరిగి ప్రయాణం మొదలుబెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో నివసించినప్పుడు సంపాదించుకొన్న సమస్తం అతడు తీసికొని వెళ్లాడు. 19 ఈ సమయంలో లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటానికి వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక, రాహేలు అతని ఇంటిలోకి వెళ్లి, తన తండ్రికి చెందిన విగ్రహాల్ని దొంగిలించింది.
20 సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేశాడు. అతడు వెళ్లిపోతున్నట్లు లాబానుతో చెప్పలేదు. 21 యాకోబు తన కుటుంబాన్ని, తనకి ఉన్న సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్లిపోయాడు. వాళ్లు యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండవైపు ప్రయాణం అయ్యారు.
22 యాకోబు పారిపోయినట్లు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. 23 కనుక లాబాను తన మనుష్యుల్ని సమావేశపరచి, యాకోబును తరమటం మొదలు పెట్టాడు. ఏడు రోజుల తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును చూశాడు. 24 ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు దేవుడు ప్రత్యక్షమయి, “నీవు యాకోబుతో చెప్పే ప్రతీ మాట గూర్చి జాగ్రత్త సుమా!” అన్నాడు దేవుడు.
దొంగిలించిన దేవుళ్ల కోసం వెదకుట
25 మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను పట్టుకొన్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసుకొన్నాడు. కనుక లాబాను, అతని మనుష్యులంతా గిలాదు కొండమీద గుడారాలు వేసుకొన్నారు.
26 యాకోబుతో లాబాను అన్నాడు: “నీవెందుకు నన్ను మోసం చేశావు? యుద్ధంలో చెరపట్టిన స్త్రీలవలె నా కూతుళ్లను ఎందుకు తీసుకు పోతున్నావు? 27 నాకు చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో చెప్పి ఉంటే నీకు నేను విందు చేసేవాణ్ణి. వాయిద్యాలతో సంగీతం, నాట్యం ఉండేవి. 28 కనీసం నా మనవళ్లను, మనవరాళ్లను ముద్దు పెట్టుకోనివ్వలేదు, నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా చేయటం చాలా బుద్ధి తక్కువ పని. 29 నిజంగా నిన్ను బాధించగల శక్తి నాకు ఉంది. అయితే గత రాత్రి నీ తండ్రి దేవుడు నాకు దర్శనం యిచ్చాడు. ఏ విధంగా కూడ నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చరించాడు. 30 నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ నీకు ఉన్నట్లు నాకు తెలుసు. అందుకే నీవు బయల్దేరావు. కాని నా యింటి దేవతలను ఎందుకు దొంగిలించావు?”
31 యాకోబు ఇలా జవాబిచ్చాడు: “భయం చేత నీకు చెప్పకుండా బయల్దేరాను. నీ కుమార్తెలను నా దగ్గర్నుండి నీవు తీసుకొంటావేమో అనుకొన్నాను. 32 అంతేగాని నీ విగ్రహాలను మాత్రం నేను దొంగిలించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్లలో ఎవరి దగ్గరయినా నీ విగ్రహాలు దొరికితే, అలాంటి వ్యక్తి చంపివేయబడుగాక. నీ మనుష్యులే నాకు సాక్షులు. నీకు చెందినది ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే నీదైతే దాన్ని తీసుకో” లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలించినట్లు యాకోబుకు తెలియదు.
33 కనుక లాబాను వెళ్లి యాకోబు గుడారాల్లో వెదికాడు. యాకోబు గుడారంలోను, తర్వాత లేయా గుడారంలోను అతడు వెదికాడు. ఆ తర్వాత బానిస స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెదికాడు. కాని అతని నివాసంలో దేవుళ్లు కనబడలేదు. అప్పుడు లాబాను రాహేలు గుడారంలోకి వెళ్లాడు. 34 రాహేలు తన ఒంటె సామగ్రిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు.
35 “నాయనా, నా మీద కోపగించకు. నీ యెదుట నేను నిలబడలేక పోతున్నాను. నేను ఋతు క్రమంలో ఉన్నాను” అని రాహేలు తన తండ్రితో చెప్పింది. కనుక లాబాను ఆ బస అంతటా వెదికాడు, కాని తన ఇంటి దేవుళ్లు అతనికి కనబడలేదు.
36 అప్పుడు యాకోబుకు చాలా కోపం వచ్చింది. యాకోబు అన్నాడు: “నేనేం తప్పు చేశాను? ఏ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను? నన్ను వెంటాడే హక్కు నీకెక్కడిది? 37 నా ఆస్తి అంతా నీవు వెదికావు. నీకు చెందినది ఏమీ నీకు దొరకలేదు. నీకేమైనా దొరికి ఉంటే దాన్ని నాకు చూపించు. మన మనుష్యులకు కనబడేటట్లు దాన్ని ఇక్కడ పెట్టు. మనలో ఎవరిది సరిగా ఉందో మనవాళ్లే నిర్ణయిస్తారు. 38 ఇరవై సంవత్సరాలు నీ కోసం నేను పని చేశాను. ఆ కాలమంతటిలో గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని ఒక్కటి కూడా పుట్టుకలో చావలేదు. నీ మందలోని పొట్టేళ్లలో ఒక్కటి కూడా నేను తినలేదు. 39 ఎప్పుడైనా సరే, అడవి మృగాలు గొర్రెల్ని చంపితే, ఆ విలువ నేనే చెల్లించాను. చచ్చిన జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి, ఇది నా తప్పు కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే, రాత్రింబవళ్లు నీ మందల్ని కాపలా కాచాను. 40 పగలు ఎండకు నా బలం క్షీణించింది. రాత్రి చలి మూలంగా నా కన్నులకు నిద్ర దూరమయింది. 41 20 సంవత్సరాలు ఒక బానిసలా నేను నీకు పని చేశాను. నీ కుమార్తెలను సంపాదించుకోవటానికి మొదట 14 సంవత్సరాలు నేను నీకు పని చేశాను. తర్వాత ఆరు సంవత్సరాలు నీ జంతువుల్ని సంపాదించటంకోసం పని చేశాను. ఆ కాలంలో నా జీతాన్ని నీవు పదిసార్లు మార్చావు. 42 అయితే నా పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే గనుక నాకు తోడుగా లేకపోతే, నీను నన్ను వట్టి చేతులతో పంపి ఉండేవాడివి. కాని నా కష్టాలను దేవుడు చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే సరి అని గతరాత్రి దేవుడు రుజువు చేశాడు.”
యాకోబు, లాబాను సంధి
43 యాకోబుతో లాబాను చెప్పాడు: “ఈ అమ్మాయిలు నా కుమార్తెలు. వారి పిల్లలు నాకు చెందినవాళ్లు. ఈ జంతువులన్నీ నావే. ఇక్కడ నీకు కనబడుతోన్న సమస్తం నాదే. అయినప్పటికీ నా కుమార్తెలను, వారి పిల్లలను నా దగ్గర ఉంచుకొనేందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు. 44 కనుక నీతో ఒడంబడిక చేసుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఒడంబడిక ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ ఒక రాళ్ల కుప్ప వేద్దాం.”
45 కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు, అతడు ఒక ఒడంబడిక చేసుకొన్నట్లు సూచనగా దాన్ని నిలువబెట్టాడు. 46 మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా వేయమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు ఆ రాళ్ల కుప్ప ప్రక్కన వాళ్లు భోజనం చేశారు. 47 ఆ స్థలానికి యగర్ శాహదూత[a] అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు[b] అని పేరు పెట్టాడు.
48 “మనం ఇద్దరం మన ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప సహాయపడుతుంది” అన్నాడు లాబాను యాకోబుతో. అందుకే ఆ స్థలానికి గలేదు అని యాకోబు పేరు పెట్టాడు.
49 అప్పుడు లాబాను, “మనం ఒకరినుండి ఒకరం విడిపోయేటప్పుడు యెహోవా మనల్ని కాపాడును గాక!” అన్నాడు. కనుక ఆ స్థలానికి మిస్పా అని కూడ పేరు.
50 అప్పుడు లాబాను అన్నాడు, “నా కుమార్తెలను నీవు బాధిస్తే, దేవుడు నిన్ను శిక్షిస్తాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొంటే దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. 51 ఇవిగో, ఇవి మన యిద్దరి మధ్య నేను ఉంచిన రాళ్లు. మనమిద్దరం ఒక ఒడంబడిక చేసుకొన్నామని సూచించేందుకు, జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప. ఇది ప్రత్యేక బండ. 52 మనం మన ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప, ఈ ప్రత్యేక బండ మనకు తోడ్పడుతాయి. నేనెన్నడూ ఈ రాళ్లు దాటి నీ మీదకు రాను. అలానే నీవు కూడా ఎన్నడూ ఈ రాళ్లు దాటి నామీద పోరాడటానికి రాకూడదు. 53 ఈ ఒప్పందాన్ని గనుక మనం మీరితే, అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి పూర్వీకుల దేవుడు మనలను నేరస్థులుగా తీర్పు చెప్పును గాక.”
యాకోబు తండ్రియైన ఇస్సాకు, దేవుణ్ణి “భయంకరుడు” అని పిల్చాడు. కనుక యాకోబు ఆ పేరు మీదనే వాగ్దానం చేశాడు. 54 అప్పుడు యాకోబు ఒక పశువును వధించి, ఆ కొండమీద దానిని బలిగా అర్పించాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన వాళ్లను పిల్చాడు. భోజనం చేసి, ఆ రాత్రికి వారు ఆ కొండమీదనే గడిపారు. 55 మర్నాడు ఉదయాన్నే లాబాను తన కుమార్తెలకు, వారి పిల్లలకు వీడ్కోలు ముద్దు పెట్టాడు. అతడు వాళ్లను ఆశీర్వదించి తిరిగి తన యింటికి వెళ్లిపోయాడు.
యేసు పక్షవాత రోగిని నయం చేయటం
(మత్తయి 9:1-8; లూకా 5:17-26)
2 కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. 2 చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. 3 ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు. 4 చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. 5 యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, “కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అన్నాడు.
6 అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. 7 “ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు?” అని అనుకొన్నారు.
8 వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? 9 ఏది సులభం? పక్షవాత రోగితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి!’ అని అనటం సులభమా లేక, ‘నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు!’ అని అనటం సులభమా? 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో, 11 “నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి స్తుతించారు.
లేవి (మత్తయి) యేసును వెంబడించటం
(మత్తయి 9:9-13; లూకా 5:27-32)
13 యేసు మళ్ళీ సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. చాలామంది ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన వాళ్ళకు బోధించటం మొదలుపెట్టాడు. 14 అక్కడి నుండి బయలుదేరి ముందుకు నడుస్తూండగా అల్ఫయి కుమారుడైన లేవి[a] పన్నులు వసూలు చేసే పాకలో కూర్చుని వుండటం చూసాడు. యేసు అతనితో, “నా వెంటరా” అని అన్నాడు. లేవి లేచి ఆయన్ని అనుసరించాడు.
15 యేసు, ఆయన శిష్యులు లేవి యింట్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఆయనతో సహా చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, పాపం చేసిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలామంది యేసు అనుచరులు. 16 పరిసయ్యులలోని శాస్త్రులు యేసు పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో భోజనం చెయ్యటం చూసారు. వాళ్ళు ఆయన శిష్యులతో, “ఆయన పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో ఎందుకు కలసి తింటాడు?” అని అడిగారు.
17 ఇది విని యేసు వాళ్ళతో, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.
యేసు ఇతర మతనాయకులవలె కాదు
(మత్తయి 9:14-17; లూకా 5:33-39)
18 యోహాను శిష్యులు, పరిసయ్యులు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొందరు యేసు దగ్గరకు వచ్చి, “యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసాలు చేస్తారు కదా! మీ శిష్యులు ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.
19 యేసు, “పెళ్ళికుమారుడు వాళ్ళతో ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాసం చెయ్యరు, 20 కాని, వాళ్ళనుండి పెళ్ళికుమారుణ్ణి తీసుకు వెళ్ళేరోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.
21 “పాత వస్త్రంపై ఉన్న చిరుగుకు క్రొత్త వస్త్రంతో ఎవరు కుడ్తారు? అలా చేస్తే క్రొత్త వస్త్రం గుంజుకుపోయి మొదటి చిరుగు ఇంకా పెద్దదౌతుంది. 22 పాత తోలు సంచుల్లో క్రొత్త ద్రాక్షారసం ఎవరూ దాచారు. అలా దాస్తే క్రొత్త ద్రాక్షరసం ఆ తోలు సంచిని చినిగేటట్లు చేస్తుంది. తోలుసంచీ, ద్రాక్షారసం రెండూ నాశనమౌతాయి. అందువల్ల క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తోలు సంచుల్లోనే దాచాలి” అని కూడా యేసు అన్నాడు.
యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు
(మత్తయి 12:1-8; లూకా 6:1-5)
23 ఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా వెళ్తూవున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని దాన్యపు కంకుల్ని త్రుంచారు. 24 పరిసయ్యులు ఆయనతో, “అదిగో చూడండి! వాళ్ళు విశ్రాంతి రోజు చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.
25 యేసు, “దావీదు, అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం కావలసివచ్చింది. అప్పుడు దావీదు ఏం చేసాడో మీరు ఎన్నడూ చదవలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న కాలంలో దావీదు దేవాలయంలోకి ప్రవేశించి దేవుని సముఖమున పెట్టిన రొట్టె తీసుకొని, తానుతిని, తన సహచరులకు కూడా కొంత యిచ్చాడు. ఈ రొట్టెను యాజకులు తప్ప యితరులు తినకూడదు” అని అన్నాడు.
27 యేసు వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడలేదు. 28 అందువల్ల మనుష్యకుమారునికి విశ్రాంతి రోజుపై కూడా అధికారం ఉంది.”
హామాను ఉరితీయ బడుట
7 మహారాజూ, హామానూ మహారాణి ఎస్తేరు విందుకి వెళ్లారు. 2 విందు రెండోరోజున వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూవుండగా మహారాజు ఎస్తేరును మరల ఇలా అడిగాడు: “మహారాణి ఎస్తేరూ, నీకేం కావాలి? నువ్వేమి కోరుకున్నా సరే, దాన్ని నీకు ఇస్తాను. నీ కోరిక ఏమిటి? నీకు ఏదైనా సరే, చివరకు అర్ధ రాజ్యమైనా సరే ఇస్తాను.”
3 అప్పుడు మహారాణి ఎస్తేరు ఇలా సమాధానం యిచ్చింది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, మీరు నన్ను అనుగ్రహిస్తే, నాకూ, నా ప్రజలకీ కూడా ప్రాణదానం చెయ్యండి! నేను కోరుకొనేది అంత మాత్రమే. 4 ఎందుకంటే నాశనం చేయబడేందుకు, చంపివేయబడేందుకు, నిర్మూలించబడేందుకు నేనూ, నా ప్రజలూ అమ్మివేయబడ్డాం. మేము కేవలం బానిసలుగా అమ్మివేయబడివుంటే, నేను ఊరక ఉండి పోదును. ఎందుకంటే, అది మహారాజును విసిగించవలసినంతటి సమస్య అయ్యుండేది కాదు.”
5 మహారాజు అహష్వేరోషు మహారాణి ఎస్తేరును ఇలా ప్రశ్నించాడు: “మీ విషయంలో ఇలా చేసింది ఎవరు? నీ ప్రజలకు ఇలా చేయ సాహసించిన వ్యక్తి ఎవరు?”
6 “మాకు విరోధి, శత్రువు దుర్మార్గుడైన ఈ హామానే” అని జవాబిచ్చింది ఎస్తేరు.
దానితో, మహారాజు ముందు నిలబడ్డ హామాను భయ భీతుడయ్యాడు. 7 మహారాజుకి పట్టరాని కోపం వచ్చింది. ఆయన లేచి నిలబడ్డాడు. ద్రాక్షాసారా అక్కడే వదిలేసి, బయటి తోటలోకి వెళ్లాడు. కాని, హామాను మహారాణిని క్షమాభిక్ష వేడుకునేందుకు అక్కడే నిలిచిపోయాడు. అప్పటికే మహారాజు తనని చంపి వేయాలని నిర్ణయించుకున్నట్లు హామాను గ్రహించినందువల్లనే, మహారాణి ఎస్తేరును క్షమాభిక్ష అడుక్కునేందుకు అక్కడ ఉండి పోయాడు. 8 సరిగ్గా తోటనుంచి విందుశాలకి వస్తూన్నప్పుడే ఎస్తేరు వాలి కూర్చున్న శయ్యమీద హామాను పడుతూవుండటం మహారాజు కంటపడింది. మహారాజు కోపస్వరంతో, “నేనీ ఇంట్లో ఉండగానే నువ్వు మహారాణి మీద దాడి చేస్తున్నావా?” అని గర్జించాడు.
మహారాజు కేక వినగానే, సేవకులు లోనికి వచ్చి హామానుని పట్టుకున్నారు. 9 మహారాజు సేవకుల్లో ఒకడి పేరు హార్బోనా. ఆ నపుంసకుడు మహారాజుతో ఇలా చెప్పాడు: “హామాను యింటి దగ్గర 75 అడుగల ఉరికంబం వుంది మహారాజా. దానిమీద మొర్దెకైని ఉరి తీయించేందుకు హామాను దాన్ని నిర్మింపజేశాడు. మిమ్మల్మి హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నప్పుడు, ఆ సమాచారాన్ని తెలియజేసి, మీకు సహాయపడినది యీ మొర్దెకైయేనండి.”
“హామానుని అదే ఉరికంబం మీద ఉరి తియ్యండి” అని ఆజ్ఞాపించాడు మహారాజు.
10 దానితో, మొర్దెకైని ఉరితీయించేందు కోసం హామాను నిర్మించిన ఉరికంబం మీదనే హామాను ఉరితీయబడ్డాడు.
దేవుని తీర్పు
2 ఇతర్లపై తీర్పు చెప్పే నీవు, ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏవిషయాల్లో నీవు ఇతర్లపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవుకూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు. 2 దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నవాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. 3 మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? 4 లేక, నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయం నీకు తెలియదా?
5 కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది. 6 ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.(A) 7 కొందరు ఎప్పుడూ మంచిపనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు. 8 మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటివాళ్ళపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు. 9 చెడును చేసిన ప్రతి మనిషికి కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, తర్వాత ఇతరులకు కూడా సంభవిస్తాయి. 10 మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి. 11 దేవుడు పక్షపాతం చూపడు.
12 ధర్మశాస్త్రము లేని పాపులు ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు. అలాగే ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేసినవాళ్ళపై దేవుడు ధర్మ శాస్త్రానుసారం తీర్పు చెపుతాడు. 13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించేవాళ్ళను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు.
14 యూదులుకానివాళ్ళకు ధర్మశాస్త్రం లేదు. కాని వాళ్ళు సహజంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకొంటే వాళ్ళకు ధర్మశాస్త్రం లేకపోయినా, వాళ్ళు నడుచుకునే పద్ధతే ఒక ధర్మశాస్త్రం అవుతుంది. 15 వాళ్ళ ప్రవర్తన ధర్మశాస్త్ర నియమాలు వాళ్ళ హృదయాలపై వ్రాయబడినట్లు చూపిస్తుంది. ఇది నిజమని వాళ్ళ అంతరాత్మలు కూడా చెపుతున్నాయి. వాళ్ళు కొన్నిసార్లు సమర్థించుకొంటూ, మరి కొన్నిసార్లు నిందించుకొంటూ, తమలోతాము వాదించుకుంటూ ఉంటారు.
16 ఆ రోజు దేవుడు మానవుల రహస్య ఆలోచనలపై యేసు క్రీస్తు ద్వారా తీర్పు చెపుతాడు. నేను ప్రజలకు అందించే సువార్త ఈ విషయాన్ని తెలియజేస్తుంది.
యూదులు, వాళ్ళ ధర్మశాస్త్రము
17 నీవు యూదుడవని చెప్పుకొంటావు. ధర్మశాస్త్రాన్ని నమ్ముకొన్నావు. దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని గురించి గర్వంగా చెప్పుకుంటావు. 18 నీవు ధర్మశాస్త్రం ప్రకారము శిక్షణ పొందావు. దేవుని ఉద్దేశ్యం తెలుసుకొన్నావు. మంచిని గుర్తించ గలుగుతున్నావు. 19 అంధులకు మార్గదర్శివని, చీకట్లో ఉన్నవాళ్ళకు వెలుగువంటివాడవని నీవనుకొంటున్నావు. 20 మీ ధర్మశాస్త్రంలో జ్ఞానం, సత్యం ఉన్నాయి కనుక నీవు మూర్ఖులను సరిదిద్దగలననుకొంటున్నావు. అజ్ఞానులకు బోధించగలననుకొంటున్నావు. 21 ఇతర్లకు బోధించే నీవు స్వయంగా నీకు నీవే ఎందుకు బోధించుకోవటం లేదు? దొంగతనము చేయరాదని బోధించే నీవు దొంగతనము చేయవచ్చా? 22 వ్యభిచారం చేయరాదని బోధించే నీవు వ్యభిచారం చేయవచ్చా? విగ్రహారాధనను అసహ్యించుకునే నీవు మందిరాలు దోచుకోవచ్చా? 23 ధర్మశాస్త్రాన్ని గురించి గర్వంగా చెప్పుకొనే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అగౌరవపరచవచ్చా? 24 ఈ విషయంపై, “నీ కారణంగా దేవుని పేరు యూదులుకానివాళ్ళ మధ్య దూషింపబడింది”(B) అని వ్రాయబడి ఉంది.
25 ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సున్నతికి[a] విలువ ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, నీ సున్నతికి విలువలేదు. 26 కనుక సున్నతి చేయించుకోనివాళ్ళు ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్ళు సున్నతి చేయించుకొన్నవాళ్ళతో సమానము కదా? 27 యూదులైన మీ దగ్గర ధర్మశాస్త్రం వ్రాత మూలంగా ఉంది. మీరు సున్నతి చేయించుకుంటారు. అయినా, మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు కనుక, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి, అతడు సున్నతి పొందని వాడైనా మీరు తప్పు చేస్తున్నారని రుజువు చేస్తున్నాడు.
28 నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదునివలే బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడు కాలేడు. 29 అంతరంగంలో యూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృదయపు సున్నతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు. ఇలాంటివాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. మానవులు కాదు.
© 1997 Bible League International