Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 25

అబ్రాహాము వేరే భార్యల కుటుంబాలు

25 అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకొన్నాడు. ఆయన క్రొత్త భార్య పేరు కెతూరా. కెతూరాకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు పుట్టారు. యొక్షాను షేబకు, దెదానుకు తండ్రి. అష్షూరు, లెయుమీ మరియు లెతూషీ ప్రజలు దెదాను సంతానము. మిద్యాను కుమారులు ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. అబ్రాహాము, కెతూరా వివాహం మూలంగా ఈ కుమారులంతా పుట్టారు. 5-6 అబ్రాహాము చనిపోక ముందు తన దాసీల కుమారులందరికి అతడు కొన్ని కానుకలు ఇచ్చాడు. ఆ కుమారులను అబ్రాహాము తూర్పునకు పంపాడు. అతడు వారిని ఇస్సాకుకు దూరంగా పంపించి వేశాడు. అప్పుడు అబ్రాహాము తన ఆస్తి సర్వస్వం ఇస్సాకుకు ఇచ్చాడు.

అబ్రాహాము 175 సంవత్సరాల వయస్సు వరకు జీవించాడు. అప్పుడు అబ్రాహాము బలము తగ్గిపోయి చనిపోయాడు. సుదీర్ఘ సంతృప్తికర జీవితం అతడు జీవించాడు. అతడు మరణించి తనవారి దగ్గరకు చేర్చబడ్డాడు. అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు కలసి మక్పేలా గుహలో అతణ్ణి పాతిపెట్టారు. సోహరు కుమారుడు ఎఫ్రోను పొలంలో ఈ గుహ ఉంది. అది మమ్రేకు తూర్పున ఉంది. 10 హిత్తీ ప్రజల దగ్గర్నుండి అబ్రాహాము కొన్న గుహ ఇదే. అబ్రాహాము తన భార్య శారాతో అక్కడ పాతిపెట్టబడ్డాడు. 11 అబ్రాహాము చనిపోయిన తరువాత, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరియు ఇస్సాకు బేయేర్ లహాయిరోయిలోనే నివాసం కొనసాగించాడు.

12 ఇష్మాయేలు వంశంవారి జాబితా ఇది. అబ్రాహాము హాగరుల కుమారుడు ఇష్మాయేలు. (శారాకు ఈజిప్టు దాసి హాగరు.) 13 ఇష్మాయేలు కుమారుల పేర్లు ఇవి: మొదటి కుమారుని పేరు సేబాయోతు, తర్వాత కేదారు పుట్టాడు, తర్వాత అద్బయేలు, మిబ్శాము, 14 మిష్మా, దూమారమశ్శా, 15 హదరు, తేమా, యెతూరు, నాఫీషు, కెదెమా పుట్టారు. 16 అవి ఇష్మాయేలు కుమారుల పేర్లు. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత శిబిరం ఉండేది, అదే ఒక చిన్న పట్టణం అయింది. పన్నెండు మంది కుమారులు, వారి స్వంత ప్రజలతో, పన్నెండు మంది యువరాజుల్లా ఉన్నారు. 17 ఇష్మాయేలు 137 సంవత్సరాలు బ్రతికాడు. తరువాత అతను చనిపోయి, అతని పూర్వీకులతో చేర్చబడ్డాడు. 18 ఇష్మాయేలు సంతానం వారు ఎడారి ప్రాంతమంతా బసచేశారు. ఈ ప్రాంతం ఈజిప్టు దగ్గర హవీలా, షూరు నుండి ఉత్తరపు చివరన అష్షూరు వరకు విస్తరించి ఉంది. ఇష్మాయేలు సంతానము తరచూ అతని సోదరుని ప్రజలను ఎదుర్కొన్నారు.

ఇస్సాకు కుటుంబం

19 ఇస్సాకు కుటుంబం చరిత్ర ఇది. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు. 20 ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీయుడగు లాబానుకు సోదరి. 21 ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతిని కానిచ్చాడు.

22 రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను ప్రార్థించి, “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని అడిగింది. 23 ఆమెతో యెహోవా చెప్పాడు:

“నీ గర్భంలో రెండు
    జనాంగాలు ఉన్నాయి.
రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు.
    కాని వారు విభజించబడతారు.
ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు.
    పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.”

24 తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది. 25 మొదటి శిశువు ఎరుపు. వాని చర్మం బొచ్చు అంగీలా ఉంది. కనుక వానికి ఏశావు[a] అని పేరు పెట్టబడింది. 26 రెండవ శిశువు పుట్టినప్పుడు వాడు ఏశావు మడిమను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు[b] అని పేరు పెట్టబడింది. యాకోబు, ఏశావు పుట్టినప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు.

27 అబ్బాయిలు పెద్దవాళ్లయ్యారు. ఏశావు నిపుణతగల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మదిపరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు. 28 ఇస్సాకు ఏశావును చాలా ప్రేమించాడు. ఏశావు వేటాడిన జంతువులను తినటం అతనికి ఇష్టం. కాని రిబ్కాకు యాకోబు మీద ప్రేమ.

29 ఒకసారి ఏశావు వేటనుండి తిరిగి వచ్చాడు. అతను అలసిపోయి, ఆకలితో బలహీనంగా ఉన్నాడు. యాకోబు వంట పాత్రలో చిక్కుడుకాయలు వండుతున్నాడు. 30 కనుక ఏశావు, “నేను ఆకలితో నీరసం అయిపోయాను. ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు” అని యాకోబును అడిగాడు. (అందుకే ప్రజలు అతణ్ణి ఎదోం[c] అని పిలిచేవాళ్లు.)

31 అయితే యాకోబు, “నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని ఈ వేళ నాకు అమ్మివేయాలి” అన్నాడు.

32 ఏశావు “నేను ఆకలితో దాదాపు చచ్చాను. నేను చనిపోతే, నా తండ్రి ఐశ్వర్యాలన్నీ నాకు సహాయపడవు. కనుక నా వాటా నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.

33 కానీ యాకోబు, “దాన్ని నాకు ఇస్తానని ముందు ప్రమాణం చేయాలి” అన్నాడు. కనుక ఏశావు యాకోబుకు ప్రమాణం చేశాడు. తన తండ్రి ఐశ్వర్యంలో తన వాటాను ఏశావు యాకోబుకు అమ్మివేశాడు. 34 అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, త్రాగి వెళ్లిపోయాడు. కనుక ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కులను లక్ష్యపెట్ట లేదని వ్యక్తం చేశాడు.

మత్తయి 24

యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం

(మార్కు 13:1-31; లూకా 21:5-33)

24 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. యేసు, “ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు” అని అన్నాడు.

యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని అడిగారు.

యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా మంది నా పేరిట వచ్చి ‘నేను క్రీస్తును’ అని చెప్పుకొంటూ అనేకుల్ని మోసం చేస్తారు. యుద్ధాలను గురించి, యుద్ధముల వదంతుల్ని గురించి విన్నప్పుడు మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని ‘అంతం’ అప్పుడే రాదు. దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి. అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట.

“ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపుతారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి. 10 ఆ సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు. 11 దొంగ ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. 12 పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. 13 కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. 14 ఈ రాజ్యాన్ని గురించి చేప్పే సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ సువార్త దేశాలన్నిటికిని ఒక ఋజువుగా ఉంటుంది. అప్పుడు అంతం వస్తుంది.

15 “అసహ్యం కలిగించేది, సర్వ నాశనం కలిగించేది పవిత్ర స్థానంలో నిలుచొని ఉండటం మీరు చూస్తారు. దీన్ని గురించి దానియేలు ప్రవక్త మాట్లాడాడు. పాఠకుడు దీని అర్థం గ్రహించాలి. 16 అప్పుడు యూదయ ప్రాంతలోవున్న ప్రజలు కొండల మీదికి పారిపోవటం మంచిది. 17 మిద్దె మీద ఉన్నవాడు తన యింట్లోకి వెళ్ళి ఏదీ తీసుకోరాదు. 18 పొలంలో వున్నవాడు తన వస్త్రాన్ని తీసుకు రావటానికి వెనక్కు మళ్ళరాదు.

19 “ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా! 20 ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. కనుక చలికాలంలో కాని, లేక విశ్రాంతి రోజు కాని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడ కూడదని ప్రార్థించండి. 21 ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి నేటి దాకా అలాంటి కష్టం ఎన్నడూ సంభవించలేదు. యిక ముందు సంభవించదు.

22 “దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసి ఉండక పోయినట్లయితే, ఎవ్వరూ బ్రతికి ఉండే వాళ్ళు కాదు. కాని దేవుడు తానెన్నుకొన్న వాళ్ళకోసం ఆ రోజుల సంఖ్య తగ్గించాడు.

23 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి. 24 ఎందుకంటే క్రీస్తులమని, ప్రవక్తలమని చెప్పుకొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహత్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేసే మోసగాళ్ళు బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్నవాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. 25 చూడండి! ముందే మీకు చెబుతున్నాను.

26 “కనుక మీతో ఎవరైనా, ‘అదిగో! ఆయన నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాడు’ అంటే, అక్కడికి వెళ్ళకండి. లేక, ‘యిక్కడ గదుల్లో ఉన్నాడు’ అంటే, నమ్మకండి. 27 తూర్పునుండి పడమర దాకా మెరిసే మెరుపు వలే మనుష్యకుమారుడు వస్తాడు. 28 శవమున్న చోటే రాబందులు ప్రోగౌతాయి.

29 “ఆ కష్టకాలం గడిచిన వెంటనే,

‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు.
    చంద్రుడు వెలుగునివ్వడు
నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి
    ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’[a]

30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. 31 అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.

32 “ఇక ఇప్పుడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని గురించి నేర్చుకొండి. వాటి రెమ్మలు మృదువై ఆకులు చిగురించగానే, ఎండకాలం దగ్గరకు వచ్చిందని మీకు తెలిసి పోతుంది. 33 అదే విధంగా నేను చెప్పినవన్నీ చూసిన వెంటనే ఆయన దగ్గరలోనే ఉన్నాడని అంటే మీ తలుపు ముందే ఉన్నాడని తెలుసుకొంటారు. 34 ఇది సత్యం. ఇవన్నీ జరిగేదాకా ఈ తరం వాళ్ళు జీవించే ఉంటారు. 35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి!

ఆ దినం కాని, ఆ ఘడియ కాని ఎవ్వరికీ తెలియదు

(మార్కు 13:32-37; లూకా 17:26-30, 34-36)

36 “ఆ రోజును గురించి లేక ఆ ఘడియను గురించి పరలోకంలోని దేవ దూతలకు గాని, కుమారునికి గాని ఎవ్వరికి తెలియదు. తండ్రికి మాత్రం తెలుసు.

37 “నోవహు కాలంలో ఏ విధంగా ఉందో మనుష్యకుమారుడు వచ్చినప్పుడు కూడా అదే విధంగా వుంటుంది. 38 నోవహు తన నావలో ప్రవేశించేదాకా, ప్రళయానికి ముందు రోజుల్లో ప్రజలు తింటూ, త్రాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకొంటూ, పెళ్ళిళ్ళు చేస్తూ జీవించారు. 39 ప్రళయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకొని పోయేదాకా ఆ విధంగా జరుగుతుందని వాళ్ళకు తెలియదు.

“మనుష్యకుమారుడు కూడా అదే విధంగా అకస్మాత్తుగా వస్తాడు. 40 ఆ రోజు ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేస్తూవుంటే ఒకడు ఆయన వెంట తీసుకు పోబడతాడు. రెండవ వాడు వదిలి వేయబడతాడు. 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒక స్త్రీని తన వెంట తీసుకువెళ్తాడు. రెండవ స్త్రీని వదిలి వేస్తాడు.

42 “మీ ప్రభువు ఏ రోజు రానున్నాడో మీకు తెలియదు కనుక సిద్ధముగా ఉండండి. 43 కాని ఈ విషయం తెలుసుకొండి. ఇంటి యజమానికి దొంగ ఎప్పుడు వస్తాడో తెలిసి ఉంటే, తన యింట్లోకి దొంగను రానీయకుండా కాపలాకాస్తాడు. 44 మనుష్య కుమారుడు కూడా మీరు అనుకోని ఘడియలో వస్తాడు. కనుక మీరు కూడా అదే విధంగా సిద్ధంగా ఉండాలి.

మంచి దాసుడు, చెడ్డ దాసుడు

(లూకా 12:41-48)

45 “విశ్వాసము, తెలివిగల ఒక సేవకుణ్ణి ఉదాహరణగా తీసుకోండి. అతని యజమాని అతణ్ణి తన యింట్లో పనిచేసే వాళ్ళకు సరియైన సమయంలో భోజనం పెట్టడానికి నియమించాడు. 46 యజమాని వచ్చినప్పుడు ఆ సేవకుడు తన యజమాని చెప్పినట్లు చేస్తూవుంటే ధన్యుడు. 47 నేను మీకు నిజం చెబుతున్నాను: యజమాని ఆ నౌకరును తనకున్న ఆస్తి అంతటిపై అధికారిగా నియమిస్తాడు.

48 “ఒక వేళ ఆ సేవకుడు దుర్మార్గుడైతే తనలో తాను ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని 49 తన తోటి పని వాళ్ళను కొట్టడం మొదలు పెడ్తాడు. అంతేకాక త్రాగుబోతులతో కలసి తిని, త్రాగుతాడు. 50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి, 51 అతణ్ణి చంపించి పాపులతో సహా నరకంలో పడవేస్తాడు. ఆ నరకంలో వాళ్ళంతా ఏడుస్తూ పండ్లు కొరుకుతూ బాధననుభవిస్తారు.

ఎస్తేరు 1

వష్తి రాణి రాజుకు అవిధేయురాలగుట

అహష్వేరోషు రాజ్యపాలన కాలంలో జరిగిన సంఘటన యిది. అహష్వేరోషు భారత దేశంనుంచి కూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలతో కూడిన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అహష్వేరోషు తన రాజధాని నగరమైన షూషనులో సింహాసనాధిష్ఠుతుడై, తన పాలన సాగించాడు.

అహష్వేరోషు తన రాజ్యపాలన మూడేళ్లు నిండిన సందర్భంగా అధికారులకూ, నాయకులకూ విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకి పారసీక దేశమంతటినుంచి, మాదియా దేశం నుంచి సేనానులూ, ప్రముఖ నాయకులూ హాజరయ్యారు. ఆ విందు నూట ఎనభై రోజులు కొనసాగింది. ఆ విందుసాగిన అన్ని రోజులూ అహష్వేరోషు రాజు తన రాజ్యంలోని గొప్ప సంపదను ప్రదర్శించాడు. రాజభవనపు అందాలనూ, ఐశ్వర్యాన్నీ ప్రదర్శిస్తూ వచ్చాడు. ఆ నూట ఎనభై రోజుల విందు ముగిశాక అహహ్వేరోషు మరో విందు ఏర్పాటు చేశాడు. అది వారం రోజులపాటు కొనసాగింది. ఆ విందు రాజనగరులోని తోటలో జరిగింది. ఆ విందుకి రాజధాని నగరమైన షూషనులోని ప్రజలందరినీ, అత్యంత ముఖ్యులు మొదలుకొని అత్యల్పులను కూడా ఆహ్వానించాడు. ఆ లోపలి తోట చుట్టూ తెలుపు, నీలి తెరలు వేలాడదీయబడ్డాయి. అవి చలువరాతి స్తంభాలకు, తాపిన వెండి కమ్ములకు అవిసెనార, నూలు తాళ్లతో బిగించబడ్డాయి. అక్కడ ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు మొదలైన రంగుల విలువైన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి, బంగారాలతో చేసిన పడకలు వున్నాయి. అతిథులకు ద్రాక్షాసారా బంగారు పాత్రల్లో అందించబడింది. చిత్రమేమిటంటే, ఆ పాత్రల్లో ఒకదాన్ని పోలినది మరొకటి లేదు! రాజు బాగా ఔదార్యవంతుడేమో, ద్రాక్షాసారాకి కొదువ లేకపోయింది. రాజు ఆజ్ఞమేరకు ద్రాక్షాసారా వడ్డించేవాడు ప్రతి ఒక్క అతిథికీ అతను కోరినంత పోశాడు.

మహారాణి వష్తి కూడా స్త్రీలకు రాజభవనంలో విందుచేసింది.

10-11 ఆ విందు ఏడవ రోజున రాజు అహష్వేరోషు ద్రాక్షాసారా ఎక్కువగా సేవించాడు. మంచి మత్తులో వున్న మహారాజు తనను సేవించిన ఏడు మంది సేవకులైన మెహోమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే నపుంసకులకు మహారాణికి కిరీటం ధరింపజేసి, తన ఎదుటకు తీసుకు రావాలని ఆజ్ఞాపించాడు. మహారాణి వష్తి మహా సౌందర్యవతి. ఆమె సౌందర్యాన్ని అధికారులకూ, ప్రముఖులకూ ప్రదర్శించి మెప్పు పొందాలన్నది అతని సంకల్పం.

12 ఆ సేవకులు మహారాణికి మహారాజు ఆజ్ఞను విన్నవించారు. కాని, ఆమె అందరి ముందుకు వెళ్లేందుకు నిరాకరించింది. మహారాజుకు అధికంగా కోపం వచ్చింది. 13-14 న్యాయ చట్టం గురించీ, శిక్షలను గురించి నిపుణుల సలహాలు అడగటం మహారాజుకి పరిపాటి. అందుకని, న్యాయనిపుణులైన తన సలహాదారులతో మహారాజు సంప్రదించాడు. మహా రాజుకి సన్నిహితులైన ఆ సలహాదారుల పేర్లు: కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెను, మర్సెనా, మెమూకాను. ఈ యేడుగురూ పారశీక, మాదీయ దేశాల ప్రముఖులు. మహారాజును దర్శించేందుకు ప్రత్యేకమైన అనుమతులు కలిగినవాళ్లు. సామ్రాజ్యంలో అత్యున్నతమైన అధికారులు. 15 మహారాజు వాళ్లని ఇలా ప్రశ్నించాడు: “మహారాజు తన నపుంసకులద్వారా వష్తి మహారాణికి ఒక ఆజ్ఞ పంపాడు. కాని, ఆమె రాజాజ్ఞను మన్నించలేదు. న్యాయచట్టం ప్రకారం ఆమెపైన ఎలాంటి చర్య తీసుకోవాలి?”

16 అప్పుడు మెమూకాను యితర అధికారులు వింటూండగా మహారాజుకి ఇలా సమాధానమిచ్చాడు: “మహారాణి వష్తి చేసినది నేరం. ఆమె మహారాజు అహష్వేరోషు పట్లనే కాక రాజ్యములోని ఆయన సంస్థా నములన్నిటిలోనుండు అధికారుల పట్ల, ప్రముఖుల పట్ల కూడా నేరం చేసింది. 17 నేనీ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మహారాణి వష్తి చేసిన యీ ఆజ్ఞోల్లంఘనాన్ని గురించి మిగిలిన స్త్రీలందరూ వింటారు. అప్పుడింక యితర స్త్రీలు కూడా తమ భర్తల పట్ల విధేయత చూపడం మానేస్తారు. వాళ్లు తమ భర్తలతో ఇలా వాదిస్తారు: ‘అహష్వేరోషు మహారాజు వష్తి మహారాణిని రమ్మని ఆజ్ఞాపించాడు. కాని, ఆమె వచ్చేందుకు నిరాకరించింది కదా.’

18 “పారశీక, మాదీయ నాయకుల భార్యలు ఈనాడు మహారాణి చేసినదాన్ని గురించి విన్నారు. ఆమె చేసిన పనిచేత వాళ్లు ప్రభావితులవుతారు. ఆ స్త్రీలు కూడా మహారాజుగారి ప్రముఖుల పట్ల అలాగే వ్యవహరిస్తారు. దానితో అవిధేయతా, కోపతాపాలూ రెచ్చిపోతాయి.

19 “మహారాజు సమ్మతిస్తే, నాదొక సూచన, మహారాజా, మీరు ఒక శాసనం జారీచెయ్యాలి. దాన్ని పారశీక, మాదీయ రాజ్యాల న్యాయచట్టాల్లో నమోదు చేయించాలి. అప్పుడిక పారశీక, మాదియ న్యాయచట్టాలను మార్చడం సాధ్యంకాదు. వష్తి అహష్వేరోషు మహారాజు సమక్షంలోకి యిక ఎన్నడూ రాకూడదు. అంతేకాదు, మహారాజు ఆమె (రాణి) పట్టమహిషిత్వ స్థానాన్ని ఆమెకంటె మెరుగైన స్త్రీకి ఇవ్వాలి. 20 మహారాజు ఆజ్ఞ ఆయన సువిశాల సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లోనూ చాటింపబడినాక, స్త్రీలందరూ తమ భర్తలను గౌరవిస్తారు. అప్పుడిక అల్పుల దగ్గర్నుంచి అధికులదాకా స్త్రీలందరూ తమతమ భర్తల్ని గౌరవిస్తారు.”

21 మహారాజుకి, ఆయన ముఖ్యాధికారులకీ యీ సలహా నచ్చింది. దానితో అహష్వేరోషు మహారాజు మెమూకాను చేసిన యీ సూచనను శాసనం చేశాడు. 22 అహష్వేరోషు తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలకీ, ఆయా ప్రాంతీయ భాషల్లో, యీ తాఖీదును పంపాడు. ఆ తాఖీదుల మేరకు, ప్రతి పురుషుడూ తన కుటుంబానికి యజమానిగా ప్రకటింపబడ్డాడు.

అపొస్తలుల కార్యములు 24

ఫేలిక్సు సమక్షంలో విచారణ

24 అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ, కొంతమంది పెద్దలతో, తెర్తుల్లు అనబడే న్యాయవాదితో కలిసి కైసరియ చేరుకున్నాడు. పౌలు పట్ల తాము చేయదలచిన నేరారోపణల్ని రాష్ట్రాధిపతి ముందు ఉంచాడు. తెర్తుల్లు తన వాదనను ప్రారంభిస్తూ, “మీ పాలనలో చాలాకాలం శాంతంగా జీవించాము. ఇది మా అదృష్టం. మీ ముందు చూపువల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి.

“మహా ఘనత పొందిన ఫేలిక్సు ప్రభూ! మీరు చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు, ఎంతో కృతజ్ఞతతో, సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం మాకు ఇష్టం లేదు. కనుక క్లుప్తంగా చెపుతాము. మేము చెప్పేది మాపై దయ ఉంచి వినమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇతడు సమస్యలు, కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. ప్రపంచంలో ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు లేపాడు. ఇతడు కుట్రలు పన్నే నజరేతు జాతికి నాయకుడు. ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చెయ్యటానికి ప్రయత్నించాడు. [a] మీరితణ్ణి విచారిస్తే మేము చేసిన ఆరోపణల యొక్క నిజానిజాలు మీకే తెలుస్తాయి” అని అన్నాడు. న్యాయస్థానంలో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ, తెర్తుల్లు వాదనను బలపరిచారు.

పౌలు నిర్దోషినని ఫేలిక్సుముందు చెప్పుకొనటం

10 రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడమని సంజ్ఞ చేసాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను. 11 నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు కాలేదు. నేను చెబుతున్నదానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు. 12 నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు. 13 వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు.

14 “వాళ్ళు, దేన్ని వేరొక మతంగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వికుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినవాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. 15 వాళ్ళలాగే నాకూ దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్గుడు, దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. 16 అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.

17 “పేదవాళ్ళకు డబ్బు దానం చెయ్యాలని, దేవునికి కానుకలివ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను యెరూషలేముకు వచ్చాను. 18 నేనీ కార్యాలు మందిరావరణంలో చేస్తుండగా వాళ్ళు చూసారు. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు. 19 కాని ఆసియనుండి అక్కడికి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేసానని అనిపిస్తే, యిక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది. 20 నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో ఇక్కడ నిలుచున్నవాళ్ళను చెప్పమనండి. 21 ఔను! నేను ఒకటి చేసాను. వాళ్ళ సమక్షంలో నిలుచొని బిగ్గరగా ‘చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని నమ్మినందుకు మీ ముందు ఈ రోజు నేరస్థునిగా నిలుచున్నాను’ అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చెయ్యలేదు.”

22 యేసు ప్రభువు మార్గం బాగా తెలిసిన ఫేలిక్సు సభను ముగిస్తూ, “సహస్రాధిపతి లూసియ వచ్చాక నీ విషయం నిర్ణయిస్తాను” అని అన్నాడు. 23 శతాధిపతితో, “పౌలును కాపలాలో ఉంచు! కాని కొంత స్వేచ్ఛనివ్వు. అతని స్నేహితులు అతనికి ఏదైనా ఇవ్వటానికి వస్తే వాళ్ళనాపవద్దు” అని అన్నాడు.

పౌలు ఫేలిక్సుతో, అతని భార్యతో మాట్లాడటం

24 కొద్ది రోజుల తర్వాత ఫేలిక్సు తన భార్య ద్రుసిల్లతో వచ్చాడు. ద్రుసిల్ల యూదురాలు. ఫేలిక్సు పౌలును పిలిపించాడు. “యేసు క్రీస్తులో విశ్వాసం” అనే విషయాన్ని గురించి, పౌలు మాట్లాడాడు. ఫేలిక్సు విన్నాడు. 25 పౌలు సన్మార్గాన్ని గురించి, మనో నిగ్రహాన్ని గురించి, రానున్న తీర్పును గురించి చెప్పటం విని ఫేలిక్సు భయపడి, “ఇప్పటికి చాలించి, వెళ్ళు! నాకు వీలున్నప్పుడు నిన్ను మళ్ళీ పిలిపిస్తాను” అని అన్నాడు. 26 కాని తనకు లంచమిస్తాడని ఆశించి అతణ్ణి మాటిమాటికి పిలిపించి అతనితో మాట్లాడేవాడు.

27 రెండు సంవత్సరాలు గడిచాక పోర్కియు ఫేస్తు ఫేలిక్సు స్థానంలో వచ్చాడు. ఫేలిక్సు యూదులకు ఒక ఉపకారం చెయ్యాలనే ఉద్దేశంతో పౌలును కారాగారంలోనే ఉంచాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International