Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 20

అబ్రాహాము గెరారుకు వెళ్లుట

20 అబ్రాహాము ఆ చోటు విడిచి నెగెబుకు ప్రయాణం కట్టాడు. కాదేషుకు, షూరుకు మధ్యనున్న గెరారుకు అబ్రాహాము వెళ్లాడు. గెరారులో ఉన్నప్పుడు శారా తన సోదరి అని అబ్రాహాము ప్రజలతో చెప్పాడు. గెరారు రాజు అబీమెలెకు ఇది విన్నాడు. అబీమెలెకు శారాను ఇష్టపడి, ఆమెను తీసుకుని వచ్చేందుకు కొందరు సేవకుల్ని పంపించాడు. అయితే ఆ రాత్రి దర్శనంలో అబీమెలెకుతో దేవుడు మాట్లాడి, “చూడు, నీవు చస్తావు. నీవు తెచ్చుకొన్న ఆ స్త్రీ వివాహితురాలు” అని చెప్పాడు.

కానీ అప్పటికి అబీమెలెకు శారాతో శయనించ లేదు. కనుక అబీమెలెకు, “ప్రభూ, నేను దోషిని కాను. నిర్దోషిని నీవు చంపుతావా? ‘ఈ స్త్రీ నా సోదరి’ అని అబ్రాహాము స్వయంగా నాతో చెప్పాడు. ఆ స్త్రీ కూడా ‘ఈ పురుషుడు నా సోదరుడు’ అని చెప్పింది. నేను నిర్దోషిని. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలియలేదు” అన్నాడు.

ఆ దర్శనంలో అబీమెలెకుతో దేవుడు ఇలా చెప్పాడు: “అవును, నాకు తెలుసు, నీవు నిర్దోషివి. నీవు చేస్తున్నది ఏమిటో నీకు తెలియదు అని నాకు తెలుసు. నేను నిన్ను కాపాడాను. నాకు వ్యతిరేకంగా నిన్ను నేను పాపం చేయనీయలేదు. నీవు ఆమెతో శయనించకుండా చేసింది నేనే. కనుక అబ్రాహాము భార్యను తిరిగి అతనికి అప్పగించు. అబ్రాహాము ఒక ప్రవక్త.[a] అతడు నీ కోసం ప్రార్థిస్తాడు, అప్పుడు నీవు బ్రతుకుతావు. కానీ శారాను నీవు తిరిగి అబ్రాహాముకు ఇవ్వకపోతే, నీవు మరణించడం తప్పదు. నీతోబాటు నీ కుటుంబం అంతా మరణిస్తుంది.”

కనుక మర్నాడు వేకువనే, అబీమెలెకు తన సేవకులందరినీ పిల్చాడు. దర్శనంలో సంభవించిన సంగతులన్నీ అబీమెలెకు వారితో చెప్పాడు. సేవకులు చాలా భయపడ్డారు. అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిచి, అతనితో అన్నాడు: “నీవు మాకు ఎందుకు ఇలా చేశావు? నీకు నేను ఏమి అపకారం చేశాను? ఎందుకలా అబద్ధం చెప్పి, ఆమె నీ సోదరి అన్నావు? నా రాజ్యానికి నీవు చాలా చిక్కు తెచ్చిపెట్టావు. నాకు నీవు ఇలా చేయకుండా ఉండాల్సింది. 10 నీవు దేనికి ఇలా చేశావు?”

11 అందుకు అబ్రాహాము చెప్పాడు: “నేను భయపడ్డాను. దేవుడంటే ఇక్కడ ఎవరికీ భయము లేదని అనుకొన్నాను. శారాను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపేస్తారు అనుకొన్నాను. 12 ఆమె నా భార్య, అయితే నా సోదరి కూడాను. ఆమె నా తండ్రి కుమార్తె గాని, నా తల్లి కుమార్తె కాదు. 13 నా తండ్రి ఇంటినుండి దేవుడు నన్ను బయటకు నడిపించాడు. అనేక చోట్ల సంచారం చేసేటట్లు దేవుడు నన్ను నడిపించాడు. అలా జరిగినప్పుడు, ‘నీవు నా సోదరివని ప్రజలతో మనం వెళ్లిన చోటల్లా చెప్పు, నాకు ఈ మేలు చేయి’ అని నేను శారాతో చెప్పాను.”

14 అప్పుడు జరిగిందేమిటో అబీమెలెకు అర్థం చేసుకొన్నాడు. కనుక శారాను అబీమెలెకు తిరిగి అబ్రాహాముకు అప్పగించేశాడు. కొన్ని గొర్రెలు, పశువులు, కొందరు ఆడ, మగ బానిసలను కూడ అబీమెలెకు అబ్రాహాముకు ఇచ్చాడు. 15 మరియు “నీ చుట్టూ చూడు. ఇది నా దేశం. నీకు ఇష్టం వచ్చిన చోట నీవు ఉండవచ్చు” అని అబీమెలెకు అన్నాడు.

16 “చూడు, నీ సోదరుడైన అబ్రాహాముకు 1,000 వెండి నాణెములు ఇచ్చాను. జరిగినవాటి విషయమై నా పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి యిది చేశాను. నేను సక్రమంగా జరిగించినట్లు అందరూ చూడాలని నేను కోరుతున్నాను” అని అబీమెలెకు శారాతో చెప్పాడు.

17-18 అబీమెలెకు కుటుంబంలోని స్త్రీలను గొడ్రాళ్లుగా చేశాడు యెహోవా. అబ్రాహాము భార్య శారాను అబీమెలెకు తీసుకొన్నందుచేత దేవుడు ఇలా చేశాడు. అయితే అబ్రాహాము ప్రార్థించగా అబీమెలెకును, అతని భార్యను మరియు అతని దాసీలను దేవుడు స్వస్థపరచాడు.

మత్తయి 19

విడాకులను గురించి బోధించటం

(మార్కు 10:1-12)

19 యేసు మాట్లాడటం ముగించాక గలిలయ వదలి యొర్దాను నది అవతలి వైపున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు.

కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని వచ్చి, “పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి విడాకులివ్వవచ్చా?” అని అడిగారు.

4-5 యేసు, “మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు: ‘పురుషుడు తన తల్లి తండ్రులను వదలి తన భార్యతో ఏకమౌతాడు. వాళ్ళిద్దరూ కలసి ఒకే శరీరంగా జీవిస్తారు!’(A) ఇది మీరు చదువలేదా? ఆ కారణంగా వాళ్ళనికమీదట యిరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి! దేవుడు ఏకం చేసిన వాళ్ళను మానవుడు వేరు చేయరాదు!” అని సమాధానం చెప్పాడు.

“మరి పురుషుడు విడాకుల పత్రం తన భార్యకిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని వాళ్ళు అడిగారు.

యేసు, “మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వటానికి మోషే మీకు అనుమతి యిచ్చాడు. అంతేకాని మొదటి నుండి ఈ విధంగా లేదు. కాని నేను చెప్పేదేమిటంటే అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడువబడ్డ దానిని పెండ్లి చేసికొంటే వాడును వ్యభిచారిగా అవుతాడు” అని అన్నాడు.

10 శిష్యులు ఆయనతో, “విడాకులివ్వటానికి ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం” అని అన్నారు.

11-12 యేసు, “మీరన్నట్లు చెయ్యటం అందరికి సాధ్యంకాదు. కొందరు నపుంసకులుగా పుడ్తారు. కనుక వివాహం చేసుకోరు. మరి కొందర్ని యితర్లు నపుంసకులుగా చేస్తారు. కనుక వివాహం చేసుకోరు. కాని కొందరు దేవుని రాజ్యం కొరకు వివాహం చేసుకోరు. ఈ బోధను అనుసరించ గలవాడే అనుసరించనీ” అని సమాధానం చెప్పాడు.

యేసు చిన్నపిల్లల్ని దీవించటం

(మార్కు 10:13-16; లూకా 18:15-17)

13 యేసు తన చేతుల్ని చిన్న పిల్లల తలలపై ఉంచి వాళ్ళకోసం ప్రార్థించాలని కొందరు వ్యక్తులు వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. కాని ఆ పిలుచుకు వచ్చిన వాళ్ళను శిష్యులు చివాట్లు పెట్టారు. 14 కాని యేసు, “దేవుని రాజ్యం అలాంటి వాళ్ళదే కనుక వాళ్ళను నా దగ్గరకు రానివ్వండి! వాళ్ళనాపకండి!” అని అన్నాడు. 15 వాళ్ళ తలలపై చేతులుంచాక యేసు అక్కడనుండి ముందుకు సాగిపొయ్యాడు.

ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం

(మార్కు 10:17-31; లూకా 18:18-30)

16 ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, “భోధకుడా! నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలి?” అని అడిగాడు.

17 యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? ఒకే ఒక మంచి వాడున్నాడు. నీవు నిత్యజీవం పొందాలంటే ఆజ్ఞల్ని పాటించు!” అని అన్నాడు.

18 “ఏ ఆజ్ఞలు?” ఆ వ్యక్తి అడిగాడు.

యేసు, “హత్యచేయరాదు, వ్యభిచరించ రాదు. దొంగతనం చెయ్యరాదు. దొంగసాక్ష్యం చెప్పరాదు. 19 తల్లితండ్రుల్ని గౌరవించాలి.(B) మీ పొరుగువాళ్ళను మిమ్మల్మి మీరు ప్రేమించుకొన్నంతగా ప్రేమించాలి” అని సమాధానం చెప్పాడు.(C)

20 ఆ యువకుడు, “నేనవన్నీ చేస్తూనే ఉన్నాను. యింకా ఏం చెయ్యాలి?” అని అడిగాడు.

21 యేసు, “నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు! అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని సమాధానం చెప్పాడు.

22 ఆ యువకుని దగ్గర చాలా ధనముంది కనుక యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు.

23 ఆ తర్వాత యేసు తన శిష్యులతో, “నేను నిజం చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం. 24 నేను మళ్ళీ చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూదిరంధ్రం ద్వారా వెళ్ళటం సులభం!” అన్నాడు.

25 శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి, “మరి రక్షణ ఎవరికి లభిస్తుంది?” అని అడిగారు.

26 యేసు వాళ్ళ వైపు చూసి, “మానవులు దీన్ని స్వతహాగా సాధించలేరు. కాని దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.

27 అప్పుడు పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మేము అన్నీ వదులుకున్నాము. మరి, మాకేం లభిస్తుంది?” అని అన్నాడు.

28 యేసు, “ఇది సత్యం. క్రొత్త ప్రపంచంలో మనుష్యకుమారుడు తేజోవంతమైన సింహాసనంపై కూర్చుంటాడు. నన్ను అనుసరిస్తున్న మీరు కూడా పన్నెండు సింహాసనాలపై కూర్చొని ఇశ్రాయేలు జనాంగంలోని పన్నెండు గోత్రాల్ని పాలిస్తారు. 29 నాకోసం ఇండ్లను కాని, సోదరుల్ని కాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని విడిచినవాడు దానికి నూరువంతుల ఫలం పొందుతాడు. అంతేకాక నిత్యజీవం కూడా పొందుతాడు. 30 కాని ముందున్న వాళ్ళలో చాలామంది వెనక్కి వెళ్తారు. వెనుకనున్న వాళ్ళలో చాలా మంది ముందుకు వస్తారు!” అని అన్నాడు.

నెహెమ్యా 9

ఇశ్రాయేలీయులు తమ పాపాలను ఒప్పుకొనటం

తర్వాత అదే నెల 24 వ రోజున, ఇశ్రాయేలీయులు ఒక చోట చేరి సామూహిక ఉపవాసం చేశారు. వాళ్లు విచార సూచకమైన దుస్తులు ధరించారు. (తమ విచారాన్ని చూపేందుకు గాను) నెత్తిన బూడిద పోసుకున్నారు. నిజంగా ఇశ్రాయేలీయులైన వాళ్లు అన్య జనులనుంచి వేరుపడి, ఆలయంలో నిలబడి, తమ పాపాలనూ, తమ పూర్వీకుల పాపాలనూ ఒప్పుకొన్నారు. వాళ్లక్కడ సుమారు మూడు గంటలసేపు నిలబడ్డారు, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని చదివారు, తర్వాత మరో మూడు గంటలు తమ పాపాలు ఒప్పుకొని, యెహోవా ముంగిట సాగిల పడ్డారు.

అటు తర్వాత, ఈ క్రింది లేవీయులు మెట్లపైన నిలబడ్డారు: యేషూవా, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ. వాళ్లు ఉచ్చ స్వరాల్లో యెహోవాను పిలిచారు. తర్వాత ఈ లేవీయులు మళ్వీ ప్రసంగించారు: యేషువా, బానీ, కద్మీయేలు, హషబ్నెయా, షెరేబ్యా, హోదీయా, షబన్యా, పెతహాయా, వాళ్లు, “లేచి నిలబడి, ప్రభువైన దేవుణ్ణి స్తుతించండి” అని చెప్పారు.

“దేవుడు ఎల్లప్పుడు ఉండును. ఆయన ఎల్లప్పుడూ జీవించును!
నీ ఘననామం స్తుతించబడాలి.
    నీ ఘనమైన నామం సకలాశీర్వచన స్తోత్రాలనూ అధిగమించి పోవాలి!
యెహోవా నీవే దేవుడివి!,
యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు,
    వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు!
భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ
    నీవే సృజించావు!
సముద్రాలను సృజించింది నీవే.
    వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే!
ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే,
    దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!
యెహోవా, నీవే దేవుడివి.
    అబ్రామును ఎంచుకున్నది నీవే.
అతన్ని బబులోనులోని ఊరునుంచి నడిపించింది నీవే.
    అబ్రాహాముగా అతని పేరు మార్చింది నీవే.
అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా చూసుకున్నావు.
    అతనితో నీవొక ఒడంబడిక చేసుకున్నావు.
అతని సంతతి వారికి వాగ్దానం చేశావు
    నీవు కనాను, హిత్తీ, అమోరీ, పెరిజ్జీ, యెబూసీ, గిర్గాషి జాతుల దేశాన్ని ఇస్తానన్న.
నీ మాటను నీవు నిలుపుకున్నావు!
    నీవు నిజాయితీగలవాడవు, మాట నిలుపుకున్నావు!
మా పూర్వీకులు ఈజిప్టులో బాధలు పడటం చూశావు!
    సహాయార్థం ఎర్ర సముద్ర తీరాన వారి మొరలు ఆలకించావు.
10 నీవు ఫరోకి అద్భుతాలు ప్రదర్శించావు
    అతని ఉద్యోగులకీ, ప్రజలకీ దిగ్ర్భాంతికరమైన పనులు చేసి చూపావు.
మా పూర్వీకుల కంటె తాము గొప్ప అని
    ఈజిప్టీయులు అనుకోవడం నీకు తెలుసు.
అయితే నీవు, నీ వెంత గొప్పవాడివో నిరూపించుకొన్నావు!
    ఈనాటికీ అది వాళ్లు జ్ఞాపకం ఉంచుకొంటారు.
11 నీవు వాళ్ల కళ్ల ముందు ఎర్ర సముద్రాన్ని విభాగించావు.
    వాళ్లు పొడినేల మీద నడిచి పోయారు!
ఈజిప్టు సైనికులు వాళ్లని తరుముతున్నారు కాని, నీవు ఆ శత్రువుని సముద్రంలో ముంచేశావు.
    మరి వాళ్లు ఒక రాయిలా నీటిలో మునిగారు.
12 పగటి పూట మేఘస్థంభంలో వుండి వాళ్లని నడిపించావు,
    రాత్రివేళ దీపస్ధంభంలో వుండి వాళ్లని నడిపించావు,
ఆ విధంగా నీవు వారి మార్గాన్ని వెలిగించితివి.
    వాళ్లు చేరవలసిన గమ్యాన్ని చూపావు.
13 అప్పుడిక సీనాయి పర్వతం మీదికి దిగి
    ఆకాశంనుంచి వాళ్లతో మాట్లాడాపు.
వాళ్లకి చక్కటి. ధర్మనియమాలిచ్చావు.
    వాళ్లకి సదుపదేశాలిచ్చావు.
మంచి ఆజ్ఞలిచ్చావు, చక్కటి ఆదేశాలిచ్చావు!
14 నీ ప్రత్యేక విశ్రాంతి దినమైన సబ్బాతుని గురించి వాళ్లకి చెప్పావు.
వాళ్లకి ఆజ్ఞలు, చట్టాలు, ఉపదేశాలు ఇచ్చేందుకు నీ సేవకుడు మోషేని వినియోగించావు.
15 వాళ్లు ఆకలిగొన్నప్పుడు
    వాళ్లకి నీవు ఆకాశంనుంచి తిండినిచ్చావు.
వాళ్లు దప్పి గొన్నప్పుడు
    వాళ్లకి నీవు బండ నుంచి మంచి నీళ్లిచ్చావు.
వాళ్లకి చెప్పావు,
    ‘రండి, ఈ భూమి తీసుకోండని’
నీవు నీ శక్తిని వినియోగించి
    వారికోసం ఆ భూమిని తీసుకున్నావు!
16 కాని వాళ్లు, మా పూర్వీకులు గర్వపడి కన్ను గానక ప్రవర్తించారు.
    వాళ్లు మొండి వారై నీ ఆజ్ఞలు పాటించక నిరాకరించారు.
17 వాళ్లు నీ మాటలు తిరస్కరించారు.
    వాళ్లకు నీవు చేసిన ఆశ్చర్యకారాలను అద్భుతాలను మరిచారు.
వాళ్లు మొండివారై ఎదురు తిరిగినప్పుడు,
    వాళ్లు మళ్లీ వెనుకకు తిరిగి బానిసలయ్యారు.

“నీవు క్షమాశీలివి!
    నీవు దయామయుడివి. కరుణామయుడివి.
    నీవు ఓర్పుగలవాడివి. ప్రేమామయుడవు.
అందుకే నీవు వాళ్లను విడువలేదు.
18 వాళ్లు లేగ దూడల బంగారు బొమ్మలు చేసి, ‘మమ్మల్ని ఈజిప్టు నుంచి వెలికి తెచ్చిన దేవుళ్ళు వీరే’
    అన్నా నీవు వాళ్లని వదిలేయలేదు!
19 నీవెంతో దయామయుడివి!
    అందుకే వాళ్లని ఎడారిలో వదిలేయలేదు.
పగటివేళ మేఘస్థంభాన్ని
    వాళ్లనుంచి తప్పించలేదు.
వాళ్లని నడిపిస్తూనే వచ్చావు.
రాత్రివేళ దీపస్తంభాన్ని
    వాళ్ల దృష్టినుంచి తొలగించ లేదు.
వాళ్ల బాటకి వెలుగు చూపుతూనే వచ్చి
    వాళ్లకి మార్గదర్శనం చేస్తూనే వచ్చావు.
20 వాళ్లని వివేకవంతుల్ని చేసేందుకు నీవు వారికి నీ మంచి ఆత్మను ఇచ్చావు.
    వాళ్లకి ఆహారంగా మన్నానిచ్చావు.
    వాళ్ల దప్పిక తీర్చేందుకు మంచి నీరిచ్చావు.
21 నీవు వాళ్లని నలుబదియేండ్లు పోషించావు!
    ఎడారిలో అవసరమైనవన్నీ వాళ్లు పొందారు.
వాళ్ల దుస్తులు చిరిగి పోలేదు.
    వాళ్ల పాదాలు వాయలేదు, గాయపడలేదు.
22 యెహోవా, నీవు వాళ్లకి రాజ్యాలిచ్చావు, దేశాలిచ్చావు,
    జనాభా పలచగావున్న సుదూర ప్రాంతాలనిచ్చావు.
హెష్బోను రాజైన సీహోను దేశాన్నీ,
    బాషాను రాజైన ఓగు దేశాన్నీ పొందారు వాళ్లు.
23 యెహోవా నీవు వాళ్ల సంతతివారిని విస్తరింప చేసావు.
    వాళ్లు ఆకాశంలోని నక్షత్రాలంత మంది ఉండిరి.
వాళ్ల పూర్వీకులకి నీవివ్వ జూపిన దేశానికి
    నీవు వాళ్లని తీసుకొచ్చావు.
    వాళ్లు ఆ భూమిలో ప్రవేశించి, దాన్ని స్వాధీన పరుచుకున్నారు.
24 ఆ బిడ్డలు ఆ భూమిని వశపరచుకున్నారు.
అక్కడ నివసిస్తున్న కనానీయుల్ని వాళ్లు ఓడించారు.
    ఆ ప్రజలను వాళ్లోడించేటట్టు నీవు చేశావు!
ఆ దేశ ప్రజలను, రాజులను
    నీ ప్రజలేమి చేయదలచుకుంటే, అది చేయనిచ్చావు!
25 వాళ్లు బలీయమైన నగరాలను ఓడించారు.
    సారవంతమైన భూమిని కైవసం చేసుకున్నారు.
మంచి వస్తువులతో నిండిన ఇళ్లూ,
    అంతకు ముందే తవ్విన బావులూ వాళ్లకి చిక్కాయి.
వాళ్లకి ద్రాక్షాతోటలు, ఒలీవ చెట్లు, ఎన్నెన్నో రకాల ఫలవృక్షాలు చిక్కాయి.
    వాళ్లు కడువునిండ తిని, కొవ్వెక్కారు.
వాళ్లకి నీవిచ్చిన ఎన్నెన్నో వింత వస్తుపులు వాళ్లు తనివితీరా అనుభవించారు.
26 మరి తర్వాత వాళ్లు నీకు ఎదురు తిరిగారు!
    వాళ్లు నీ బోధనలను త్రోసిపుచ్చారు!
    వాళ్లు నీ ప్రవక్తల్ని హతమార్చారు.
ఆ ప్రవక్తలు చేసిన తప్పిదం జనాన్ని హెచ్చరించడం,
    వాళ్లని తిరిగి నీ వైపుకి తిప్ప ప్రయత్నించడం కొరకే కాని మా పూర్వీకులు నీకు ప్రతికూలంగా దారుణాలెన్నో చేశారు!
27 వాళ్ల శత్రువులు వాళ్లని చెరపట్టడానికి అందుకనే నీవు అనుమతించావు.
    శత్రువులు వాళ్లని నానా ఇబ్బంది పెట్టారు.
కష్టాలు ఎదురైనప్పుడు మా పూర్వీకులు సహాయంకోసం నీకు మొర పెట్టుకున్నారు.
    పరలోకంలో వున్న నీవు వాళ్ల మొర విన్నావు.
నీవు చాలా దయాశీలివి.
    అందుకని నీవు వాళ్లని కాపాడేందుకు మనుషుల్ని పంపావు.
    ఆ మనుష్యులు వాళ్లని వాళ్ల శత్రువుల నుంచి విడిపించారు.
28 సరే, పరిస్థితులు మెరుగవగానే మా పూర్వీకులు తిరిగి
    ఎన్నెన్నో దారుణాలు చేయనారంభించారు!
నీవు మరలా శత్రువులు వారిని ఓడించి, శిక్షించేటట్టు చేశావు.
వాళ్లు మళ్లీ నీకు మొర పెట్టుకున్నారు.
    పరలోకంలో ఉన్న నీవు ఆ మొర విని వాళ్లకి తోడ్డడావు.
నీవెంతో దయామయుడివి!
    ఇలా జరిగింది ఎన్నెన్నోసార్లు!
29 నీవు వాళ్లని హెచ్చరించావు.
    మంచి మార్గానికి తిరిగి రమ్మన్నావు.
    అయితే, వాళ్లు మరీ గర్వపడి,
    నీ ఆదేశాలను, ఆజ్ఞలను మీరారు.
జనం నీ ఆజ్ఞలను పాటిస్తే
    వాళ్లు నిజంగా బ్రతుకుతారు.
కాని మా పూర్వీకులు నీ ఆజ్ఞలు ఉల్లంఘించారు
వాళ్లు మొండివారై,
    నీకు పెడ ముఖమయ్యారు,
    నీ ఆజ్ఞలు పెడచెవిన పెట్టారు.

30 “నీవు మా పూర్వీకుల పట్ల చాలా ఓర్పు వహించావు.
    వాళ్లు నీతో సరిగా వ్యవహరించక పోయినా చాలా సంవత్సరాలు వాళ్లని సహించావు.
నీ ఆత్మతో వాళ్లని హెచ్చరించావు.
    వాళ్లని హెచ్చరించేందుకు ప్రవక్తల్ని పంపావు.
కాని మా పూర్వీకులు వాళ్ల మాటలు వినలేదు.
    అందుకే నీవు వాళ్లని విదేశాల్లోని మనుష్యులకు అప్పగించావు.

31 “అయితే, నీవెంతో దయామయుడివి!
    వాళ్లని నీవు సర్వనాశనం చేయలేదు.
నీవు వాళ్లని విడువలేదు.
    నీవెంతో దయామయుడివి, దేవా, నీవెంతో కరుణామయుడివి!
32 మా దేవా, నీవు మహా దేవుడివి,
    భయంకరుడివి, శక్తిశాలియైన యోధుడివి!
నీవు దయామయుడివి, విశ్వాసనీయుడివి!
    ఒడంబడికను తప్పని వాడివి!
మాకెన్నో కష్టాలు, కడగళ్లు వచ్చాయి.
    మా కష్టాలు నీవు పట్టించుకుంటావు!
మా ప్రజలందరికీ,
    మా రాజులకీ, మా పెద్దలకీ,
    మా యాజకులకీ, మా ప్రవక్తలకీ ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి.
అష్షూరు రాజు పాలన కాలం నుంచి నేటిదాకా అవి వున్నాయి!
    కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే వున్నాయి!
33 అందుకని దేవా మాకు సంభవించే ప్రతి దాన్నిగురించీ నీదే ఒప్పు,
    మాదే తప్పు.
34 మా రాజులు, నాయకులు, యాజకులు, మరి మా పూర్వీకులు నీ ధర్మనిబంధనలు పాటించలేదు.
    వాళ్లు నీ ధర్మశాస్త్రాన్ని మీరారు,
    నీ హెచ్చరికను ఖాతరు చేయలేదు.
35 తమ స్వదేశంలో నివసించినప్పుడు సైతం మా పూర్వీకులు నీకు సేవ చేయలేదు.
    వాళ్లు దుష్టకార్యాలు చేయడం మానలేదు.
    నీవు వాళ్లకిచ్చిన అద్భుతమైన వాటన్నిటినీ హాయిగా అనుభవించారు.
వాళ్లు సారవంతమైన భూమిని అనుభవించారు సువిశాల దేశాన్ని ఏలుకున్నారు,
    అయినా, తమ దుర్మార్గాలు వీడలేదు.
36 మరి ఇప్పుడు, మేము బానిసలము.
మేమీ భూమిలో ఏ భూమినీ,
    దేని ఫలసాయాలనూ, ఇక్కడ పెరిగే మంచివాటన్నిటినీ
    అనుభవించమని మా పూర్వీకులకు నీవిచ్చావో,
    ఆ భూమిలో మేము ఈనాడు దాసులము.
37 ఈ భూమిలో పంట పుష్కలమైనదే
    కాని మేము పాపాలు చేశాము కదా, అందుకని ఆ పంట నీవు మా నెత్తిన పెట్టిన రాజులకు పోతుంది.
ఆ రాజులు మామీదా, మా పశువుల పైనా పెత్తనం చలాయిస్తారు.
    తమకిష్టము వచ్చినట్లు వ్యవహరిస్తారు.
    దేవా, మేము చాలా కష్టాల్లోవున్నాము.
38 వీటన్నింటి మూలంగా,
    మార్చరాని స్థిరమైన ఒడంబడిక ఒకటి మేము చేసుకుంటున్నాము.
    మేమీ ఒడంబడికను రాత పూర్వకంగా చేసుకొంటున్నాము.
మా నాయకులూ, లేవీయులూ, యాజకులూ ఈ ఒడంబడిక మీద సంతకాలు చేసి,
    ఒక ముద్రతో దానికి ముద్ర[a] వేస్తున్నారు.”

అపొస్తలుల కార్యములు 19

ఎఫెసులో పౌలు

19 అపొల్లో యింకా కొరింథులోనే ఉన్నాడు. పౌలు భూమార్గం ద్వారా ప్రయాణం చేసి ఎఫెసు చేరుకున్నాడు. అక్కడ కొంత మంది శిష్యుల్ని కలుసుకొని వాళ్ళతో, “మీరు విశ్వసించిన పిదప పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు.

వాళ్ళు, “లేదు! పవిత్రాత్మ ఉన్నాడనేది కూడా మేము వినలేదు” అని సమాధానం చెప్పారు.

పౌలు, “మీరు ఎలాంటి బాప్తిస్మం పొందారు?” అని అడిగాడు.

“యోహాను బాప్తిస్మం” అని వాళ్ళు చెప్పారు.

పౌలు, “యోహాను మారుమనస్సుకు సంబంధించిన బాప్తిస్మము నిచ్చాడు. అతడు, తన తర్వాత రానున్నవాణ్ణి, అంటే యేసును నమ్మమని ప్రజలకు బోధించాడు కదా!” అని అన్నాడు.

ఇది విన్నాక వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. పౌలు తన చేతుల్ని వాళ్ళ తలలపై ఉంచగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. వాళ్ళంతా తమకు రాని భాషల్లో మాట్లాడారు. దేవుడు ప్రేరేపించిన సత్యాలు ప్రకటించారు. అక్కడ మొత్తం పన్నెండు మంది ఉన్నారు.

పౌలు యూదుల సమాజమందిరానికి మూడు నెలలు వెళ్ళాడు. దేవుని రాజ్యాన్ని గురించి ధైర్యంగా వాదించి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని కొందరు నమ్మలేదు. తమ పట్టు వదులుకోలేదు. పైగా ప్రభువు చూపిన మార్గాన్ని బహిరంగంగా దూషించారు. అందువల్ల పౌలు వాళ్ళను వదిలి, శిష్యుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. అతడు, తురన్ను ఉపన్యాస శాలలో ప్రతి రోజూ తర్కించేవాడు. 10 ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. ఫలితంగా ఆసియ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులు, గ్రీకులు అందరూ ప్రభువు సందేశాన్ని విన్నారు.

స్కెవ కుమారులు

11 దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేసాడు. 12 ప్రజలు అతడు తాకిన జేబు రుమాళ్ళను, తుండు గుడ్డల్ని తీసుకొని జబ్బుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యేవి. పట్టిన దయ్యాలు వదిలిపొయ్యేవి.

13 చుట్టూ ఉన్న ప్రాంతాలలో తిరిగి దయ్యాల్ని వదిలిస్తున్న కొందరు యూదులు యేసు ప్రభువు పేరునుపయోగించి దయ్యాలు పట్టినవాళ్ళకు నయం చెయ్యటానికి ప్రయత్నించారు. వాళ్ళు, “పౌలు ప్రకటిస్తున్న యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. బయటకు రా!” అని అనేవాళ్ళు. 14 స్కెవ అనే యూదుల ప్రధానయాజకుడు, అతని ఏడుగురు కుమారులు యిలా చేసేవాళ్ళు.

15 ఒకసారి ఆ దయ్యం, “యేసు ఎవరో నాకు తెలుసు. పౌలు ఎవరో నాకు తెలుసు. కాని మీరెవరు?” అని అడిగింది.

16 ఆ దయ్యం పట్టిన వాడు వాళ్ళ మీద పడి వాళ్ళను బాగా కొట్టాడు. వాళ్ళు రక్తం కార్చుకొంటూ ఆ యిల్లు వదిలి దిగంబరంగా పారిపోయారు.

17 ఎఫెసులో నివసిస్తున్న యూదులకు, గ్రీకులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళందరూ భయపడి యేసు ప్రభువు నామాన్ని చాలా గౌరవించటం మొదలు పెట్టారు. 18 ఇది జరిగాక చాలా మంది తాము చేసిన వాటిని బహిరంగంగా ఒప్పుకోవటం మొదలు పెట్టారు. 19 మంత్ర విద్య నేర్చిన కొందరు తమ గ్రంథాల్ని తెచ్చి అందరి సమక్షంలో వాటిని కాల్చి వేసారు. ఆ తదుపరి వాళ్ళు తాము కాల్చిన గ్రంథాల వెలగట్టి వాటి వెల సుమారు యాభై వేల ద్రాక్మాలని[a] నిర్ణయించారు. 20 ఈ విధంగా ప్రభువు సందేశం బాగా వ్యాపించింది. దాని ప్రభావం అభివృద్ధి చెందుతూ వచ్చింది.

పౌలు ప్రయాణానికి సిద్ధపడుట

21 ఆ సంఘటనలు జరిగాక పౌలు మాసిదోనియ, అకయ ప్రాంతాల ద్వారా యెరూషలేము వెళ్ళాలని పరిశుద్ధాత్మ సహాయంతో నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళాక రోమా నగరాన్ని తప్పక దర్శించాలనుకున్నాడు. 22 తనకు సహాయం చేసేవాళ్ళలో యిద్దర్ని మాసిదోనియకు పంపాడు. వాళ్ళ పేర్లు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియ ప్రాంతంలో మరి కొంత కాలం గడిపాడు.

ఎఫెసులో అల్లర్లు

23 ఆ రోజుల్లోనే ప్రభువు చూపిన మార్గాన్ని గురించి పెద్ద గొడవ జరిగింది. 24 “దేమేత్రి” అనే ఒక కంసాలి ఉండేవాడు. ఇతడు అర్తెమి దేవత ఉండే మందిరం యొక్క ప్రతిరూపాలను వెండితో తయారు చేసి అమ్మేవాడు. తద్వారా తన క్రింద పని చేసేవాళ్ళకు చాలినంత డబ్బు సంపాదించేవాడు.

25 తన పనివాళ్ళను, తనలాంటి వృత్తి చేసేవాళ్ళను సమావేశ పరిచి ఈ విధంగా అన్నాడు: “అయ్యలారా! మనమీ వ్యాపారంలో చాలా ధనం గడిస్తున్న విషయం మీకందరికీ తెలుసు. 26 ఈ పౌలు అనేవాడు ఏం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. ఇతడిక్కడ ఎఫెసులో, సుమారు ఆసియ ప్రాంతాలన్నిటిలో మానవుడు సృష్టించిన విగ్రహాలు దేవుళ్ళు కాదంటూ చాలా మంది ప్రజల్ని నమ్మించి తప్పుదారి పట్టిస్తున్నాడన్న విషయం మీరు విన్నారు. 27 ఈ కారణంగా మన వ్యాపారానికున్న మంచి పేరు పోయే ప్రమాదం ఉంది. పైగా అర్తెమి మహాదేవి మందిరానికున్న విలువ పోతుంది. ఆసియ ప్రాంతాల్లోనే కాక ప్రపంచమంతా పూజింపబడుతున్న ఆ దేవత యొక్క గొప్పతనము కూడా నశించి పోతుంది.”

28 ఈ మాటలు విన్న వాళ్ళకు చాలా ఉద్రేకం కలిగింది. వాళ్ళు బిగ్గరగా, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత గొప్పది!” అని నినాదం చెయ్యటం మొదలు పెట్టారు. 29 ఈ అలజడి ఆ పట్టణమంతా వ్యాపించి పోయింది. మాసిదోనియకు చెందిన “గాయి, అరిస్తర్కు” అనే యిద్దరు వ్యక్తులు పౌలు వెంట ఉన్నారు. ప్రజలు వీళ్ళను బంధించి త్రోసుకొంటూ ఒక్క గుంపుగా పెద్ద నాటక శాలలోకి ప్రవేశించారు. 30 పౌలు ప్రజల ముందుకు రావాలనుకొన్నాడు. కాని అనుచరులతన్ని వెళ్ళనివ్వలేదు. 31 పౌలు స్నేహితులు కొందరు ఆ ప్రాంతాలకు పాలకులుగా ఉండేవాళ్ళు. నాటక శాలలోకి వెళ్ళవద్దని వేడుకుంటూ వీళ్ళు పౌలుకు ఒక ఉత్తరం పంపారు.

32 ఆ సభ అంతా గందరగోళంగా ఉంది. కొందరు యిదని, కొందరు అదని బిగ్గరగా కేకలు వేసారు. కొందరికి తప్ప మిగతా వాళ్ళకెవ్వరికి తామక్కడికి ఎందుకు వచ్చింది తెలియదు. 33 యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోసారు. కొందరు కేకలు వేస్తూ అతనికి ఏదో సలహా యిచ్చారు. అతడందర్నీ శాంతంగా ఉండమని సంజ్ఞ చేసి సమాధానంగా ఏదో చెప్పబోయాడు. 34 అతడు కూడా ఒక యూదుడని తెలుసుకొన్నాక వాళ్ళంతా రెండు గంటల సేపు ఒకే గొంతుతో, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత చాలా గొప్పది” అని నినాదం చేసారు.

35 ఆ గ్రామాధికారి ప్రజల్ని శాంతపరుస్తూ యిలా అన్నాడు: “ఎఫెసు ప్రజలారా! మహా దేవత అర్తెమి యొక్క మందిరాన్ని, స్వర్గంనుండి పడిన శిలా విగ్రహాన్ని చూసుకొనే బాధ్యత ఎఫెసు పట్టణంపై ఉంది. ఇది ప్రపంచానికంతా తెలుసు. 36 దీన్ని ఎవరూ కాదనలేరు. కనుక మీరు ఆలోచించకుండా తొందర పడి ఏదీ చెయ్యకండి. శాంతంగా ఉండండి!

37 “వీళ్ళు మన మందిరాన్ని దోచుకోలేదు. మన దేవతను దూషించ లేదు. అయినా మీరు వీళ్ళనిక్కడికి పట్టుకొని వచ్చారు. 38 దేమేత్రికి లేక అతనితో కలిసి పని చేసేవాళ్ళకు వాళ్ళపై నేరం మోపాలని ఉంటే న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి. వాళ్ళ వాద వివాదాలు వినటానికి న్యాయాధిపతులున్నారు.

39 “మీరింకేదైనా చెప్పుకోవాలనుకొంటే చట్ట ప్రకారం జరిగే ప్రజా సమావేశాల్లో చెప్పుకోండి. 40 ఈనాడు జరిగిన సంఘటనవల్ల మనం తిరుగుబాటు చేసామని అధికారులు మనపై నేరం మోపే ప్రమాదం వుంది. అది జరిగితే ఈ అలజడికి ఏ కారణం లేదు కనుక మనం ఏ సమాధానమూ చెప్పలేము.” 41 ఇలా చెప్పి అందర్నీ అక్కడినుండి వెళ్ళమన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International