Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 18

ముగ్గురు అతిథులు

18 తర్వాత మళ్లీ అబ్రాహాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మమ్రేలోని సింధూర వనమునకు దగ్గర్లో అబ్రాహాము నివసిస్తున్నాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అబ్రాహాము తన గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడు. అబ్రాహాము తలెత్తి చూడగా, తన ముందర నిలచిన ముగ్గురు మనుష్యులు కనబడ్డారు. అబ్రాహాము వాళ్లను చూడగానే అతడు వారి దగ్గరకు వెళ్లి, వారి ముందు వంగి, ఇలా అన్నాడు, “అయ్యలారా, మీ దాసుడనైన నా దగ్గర దయచేసి కొంత కాలం ఉండండి. మీ కాళ్లు కడుక్కొనేందుకు నేను నీళ్లు తెస్తాను. చెట్ల క్రింద మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. మీ కోసం నేను భోజనం తెస్తాను, కడుపు నిండా భోంచేయండి. తర్వాత మీ దారిన మీరు వెళ్లొచ్చు.”

“చాలా బాగుంది, అలాగే కానీయి” అని ఆ ముగ్గురు మనుష్యులు అన్నారు.

అబ్రాహాము తన గుడారము దగ్గరకు త్వరత్వరగా వెళ్లాడు. “మూడు రొట్టెలకు సరిపడె గోధుమలు త్వరగా తయారు చేయి” అని అబ్రాహాము శారాతో అన్నాడు. తర్వాత అబ్రాహాము తన పశువుల దగ్గరకు పరుగెత్తాడు. అబ్రాహాము చాలా మంచి లేత దూడను తీసుకొని తన సేవకునికి ఇచ్చాడు. త్వరగా ఆ దూడను వధించి, దానితో భోజనం సిద్ధం చేయమని అబ్రాహాము చెప్పాడు. ఆ మాంసాన్ని ఆ ముగ్గురు మనుష్యులు భోంచేసేందుకు అబ్రాహాము ఇచ్చాడు. అతడు పాలు, వెన్న కూడ వాళ్లకు ఇచ్చాడు. ఆ ముగ్గురు చెట్టు క్రింద భోజనం చేస్తూ ఉండగా అబ్రాహాము వారి దగ్గర నిలబడ్డాడు.

“నీ భార్య శారా ఎక్కడ?” అంటూ ఆ ముగ్గురు అబ్రాహామును అడిగారు.

“ఆమె అక్కడ గుడారంలో ఉంది” అని అబ్రాహాము అన్నాడు.

10 అప్పుడు యెహోవా, “మళ్లీ వసంతకాలంలో నేను వస్తాను. అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు” అని అన్నాడు.

గుడారం లోపల శారా ఈ విషయాలు విన్నది. 11 అబ్రాహాము శారాలు చాలా ముసలివాళ్లు. స్త్రీలు పిల్లలను కనగల వయస్సు శారాకు దాటిపోయింది. 12 అందుచేత తాను విన్న మాటలను శారా నమ్మలేదు. “ఇప్పుడు నేను ముసలిదాన్ని, నా భర్త ముసలివాడు. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా” అనుకొంది తనలో తాను.

13 అప్పుడు అబ్రాహాముతో యెహోవా ఇలా అన్నాడు: “నేను చెప్పింది శారా నమ్మటం లేదు. ఆమె నవ్వింది. ‘నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా!’ అంది. 14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను వస్తానని చెప్పిన వసంతకాలంలో మళ్లీ వస్తాను, అప్పుడు నీ భార్య శారాకు కుమారుడు ఉంటాడు.”

15 అయితే శారా, “నేను నవ్వలేదు” అంది. (భయపడి ఆమె అలా అంది.)

కాని యెహోవా, “కాదు, నీవు చెప్పేది నిజం కాదని నాకు తెలుసు. నీవు నవ్వావు” అన్నాడు.

16 అప్పుడు ఆ మనుష్యులు వెళ్లటానికి లేచారు. వారు సొదొమ వైపు చూసి, ఆ దిశగా నడక ప్రారంభించారు. వారికి వీడ్కోలు చెప్పటానికి అబ్రాహాము వాళ్లతో కొంత దూరం నడిచాడు.

దేవునితో అబ్రాహాము బేరం

17 యెహోవా తనలో తాను ఇలా అనుకొన్నాడు: “ఇప్పుడు నేను చేయబోతున్నది అబ్రాహాముకు నేను చెప్పాలా? 18 అబ్రాహాము గొప్ప శక్తిగల జనానికి మూల పురుషుడు అవుతాడు. అతని మూలంగా భూమి మీది ప్రజలంతా ఆశీర్వదించబడుతారు. 19 అబ్రాహాముతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేసుకున్నాను. అతని పిల్లలు, సంతానము యెహోవా ఇష్ట ప్రకారం జీవించేటట్లు అబ్రాహాము వారికి ఆజ్ఞాపించాలని నేను ఇలా చేశాను. సక్రమంగా న్యాయంగా వాళ్లు జీవించాలని నేను ఇలా చేశాను. అప్పుడు, యెహోవానైన నేను వాగ్దానం చేసిన వాటిని అతనికి ఇవ్వగలను.”

20 మరల యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ గొమొఱ్ఱాల అరుపులు చాలా పెద్దవి. వారి పాపం చాలా భయంకరమైనది అని నేను విన్నాను. 21 కనుక నేను వెళ్లి, అక్కడి విషయాలు నేను విన్నంత చెడ్డగా ఉన్నాయేమో చూస్తాను. అప్పుడు నాకు నిశ్చయంగా తెలుస్తుంది.”

22 అంచేత ఆ మనుష్యులు మళ్లీ సొదొమవైపు నడక ప్రారంభించారు. అయితే అబ్రాహాము యెహోవాతో అక్కడ ఉండిపోయాడు. 23 అప్పుడు అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అడిగాడు. “యెహోవా, నీవు దుష్టులను నాశనం చేసేటప్పుడు మంచివారిని కూడా నాశనం చేస్తావా? 24 ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది మంచివాళ్లు ఉంటే ఎలా? ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా? అక్కడ నివసిస్తున్న 50 మంది మంచివాళ్ల కోసం తప్పక నీవు ఆ పట్టణాన్ని కాపాడు. 25 ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. చెడ్డవాళ్లను చంపడంకోసం 50 మంది మంచివాళ్లను నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. భూలోకమంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.”

26 అప్పుడు, “సొదొమ పట్టణంలో 50 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణం అంతటిని కాపాడుతాను” అన్నాడు యెహోవా.

27 దానికి అబ్రాహాము ఇలా అన్నాడు: “ప్రభూ, నీతో పోల్చుకొంటే, నేను ధూళిని, బూడిదను మాత్రమే. అయినా నేను మరోసారి తెగించి ఈ ప్రశ్న అడుగుతున్నాను. 28 ఒకవేళ అయిదుగురు మంచివాళ్లు తప్పిపోయి, 45 మంది మంచివాళ్లు మాత్రమే ఆ పట్టణంలో ఉంటే ఎలా? కేవలం అయిదుగురు తక్కువ అయినందువల్ల మొత్తం పట్టణమంతటిని నాశనం చేస్తావా?”

“అక్కడ 45 మంది మంచివాళ్లు గనుక నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను వదిలివేస్తాను” అన్నాడు యెహోవా.

29 మరల అబ్రాహాము, “అక్కడ 40 మంది మంచివాళ్లు మాత్రమే నీకు కనబడినా, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని యెహోవాను అడిగాడు.

“40 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు యెహోవా.

30 అందుకు అబ్రాహాము, “ప్రభూ, నా మీద కోపగించకు. మరొక్క మాట అడుగుతాను. ఆ పట్టణంలో 30 మంది మంచివాళ్లు మాత్రమే కనబడితే, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని అడిగాడు.

అందుకు యెహోవా, “అక్కడ 30 మంది మంచివాళ్లు నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని చెప్పాడు.

31 అప్పుడు అబ్రాహాము, “నా ప్రభువుతో మరోసారి మాటలాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది మంచివాళ్లే ఉంటే” అన్నాడు.

“20 మంది మంచివాళ్లు నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని జవాబిచ్చాడు యెహోవా.

32 అప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు, “ప్రభూ, నాపై కోపగించకు, ఈ ఒక్కసారే చివరిగా నీతో మాటలాడ తెగిస్తున్నాను. పదిమంది మంచివాళ్లే గనుక అక్కడ నీకు కనబడితే, నీవేం చేస్తావు?”

“పదిమంది మంచివాళ్లు గనుక అక్కడ నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అన్నాడు యెహోవా.

33 యెహోవా అబ్రాహాముతో మాట్లాడటం అయిపోయింది గనుక యెహోవా వెళ్లిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి వెళ్లిపోయాడు.

మత్తయి 17

యేసుని రూపాంతరం

(మార్కు 9:2-13; లూకా 9:28-36)

17 యేసు ఆరు రోజుల తర్వాత పేతురును, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును, ఒక ఎతైన కొండ మీదికి తన వెంట ప్రత్యేకంగా పిలుచుకు వెళ్ళాడు. ఆయన అక్కడ వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన దుస్తులు వెలుతురువలే తెల్లగా మరాయి. అదే క్షణంలో వాళ్ళ ముందు మోషే మరియు ఏలీయా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు.

పేతురు యేసుతో, “ప్రభూ! మనమిక్కడ ఉండటం మంచిది. మీరు కావాలంటే మూడు పర్ణశాలలు నిర్మిస్తాము—మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అని అన్నాడు.

అతడు ఇంకా మాట్లాడుతుండగా ఒక కాంతివంతమైన మేఘం ఆ ముగ్గుర్ని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన పట్ల నాకు ప్రేమ ఉంది. ఈయన నాకు చాలా నచ్చాడు. ఈయన మాట వినండి” అని వినిపించింది.

ఇది విని శిష్యులు భయంతో సాష్టాంగ పడ్డారు. యేసు వచ్చి వాళ్ళను తాకుతూ, “లేవండి! భయపడకండి!” అని అన్నాడు. వాళ్ళు తలెత్తి చూసారు. వాళ్ళకు యేసు తప్ప యింకెవరూ కనపడలేదు.

వాళ్ళు కొండ దిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్యకుమారుడు బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని గురించి ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.

10 “మరి మొదట ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు” అని శిష్యులు అడిగారు.

11 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఏలియా తప్పకుండా వస్తాడు. వచ్చి అన్నీ ముందున్నట్లు స్థాపిస్తాడు. 12 నేను చెప్పేదేమిటంటే, ఏలియా ఇదివరకే వచ్చాడు. కాని వాళ్ళతన్ని గుర్తించలేదు. పైగా అతని పట్ల తమ యిష్టానుసారంగా ప్రవర్తించారు. అదే విధంగా వాళ్ళు మనుష్య కుమారునికి కూడా బాధలు కలిగిస్తారు.” 13 యేసు బాప్తిస్మమునిచ్చే యోహానును గురించి మాట్లాడుతున్నట్లు శిష్యులకు అప్పుడు అర్థమయింది.

యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం

(మార్కు 9:14-29; లూకా 9:37-43)

14 వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి, 15 “ప్రభూ! నా కుమారునిపై దయ చూపండి. అతడు మూర్ఛ రోగంతో చాలా బాధపడ్తున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడ్తూ ఉంటాడు. 16 అతణ్ణి నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకు వచ్చాను. కాని వాళ్ళతనికి నయం చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.

17 అప్పుడు యేసు, “మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి. ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకు రండి” అని అన్నాడు. 18 యేసు ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది.

19 శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయాము?” అని అడిగారు.

20 యేసు, “మీలో దృఢవిశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేక పొయ్యారు. కాని ఇది సత్యం. 21 మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో ‘అక్కడికి వెళ్ళు’ అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు.

యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం

(మార్కు 9:30-32; లూకా 9:43-45)

22 వాళ్ళంతా గలిలయలో మళ్ళీ కలుసుకొన్నప్పుడు యేసు వాళ్ళతో, “మనుష్య కుమారుడు దుర్మార్గులకు అప్పగించబడుతాడు. 23 వాళ్ళాయన్ని చంపుతారు. కాని మూడవ రోజు ఆయన తిరిగి బ్రతికి వస్తాడు” అని అన్నాడు. ఇది విని శిష్యులు చాలా దుఃఖించారు.

పన్ను చెల్లించుట గురించి యేసు బోధించటం

24 యేసు, ఆయన శిష్యులు కపెర్నహూము చేరుకొన్నారు. అక్కడ అరషెకెలు పన్నులు సేకరించే అధికారులు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు గుడి పన్ను చెల్లించడా?” అని ప్రశ్నించారు.

25 “చెల్లిస్తాడు” అని పేతురు సమాధానం చెప్పి యింట్లోకి వెళ్ళాడు.

అతడేం మాట్లాడక ముందే యేసు, “సీమోనూ! నీవేమంటావు? రాజులు సుంకాలు, పన్నులు ఎవర్నుండి సేకరిస్తారు? తమ స్వంత కుమారుల నుండా? లేక యితర్లనుండా?” అని అడిగాడు.

26 “ఇతర్లనుండి” అని పేతురు సమాధానం చెప్పాడు.

యేసు, “అలాగయితే కుమారులు చెల్లించవలసిన అవసరం లేదన్న మాటేగా! 27 కాని వాళ్ళకాటంకం కలిగించటం నాకిష్టం లేదు. సరస్సు దగ్గరకు వెళ్ళి గాలం వెయ్యి! మొదట పట్టుకొన్న చేప నోటిని తెరిచి చూస్తే నీకు నాలుగు ద్రాక్మాల[a] నాణెం కనబడుతుంది. దాన్ని తీసుకువెళ్ళి నా పక్షాన, నీ పక్షాన వాళ్ళకు చెల్లించు!” అని అన్నాడు.

నెహెమ్యా 7

ఈ విధంగా, మేము ప్రాకార నిర్మాణం పూర్తి చేశాము. తర్వాత మేము ద్వార పాలకులను ఎంపిక చేశాము. ఆలయ గాయకులుగా వుంటూ, యాజకులకు తోడ్పడేవాళ్లను ఎంపిక చేశాము. అటు తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకు అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ పరుడు. అత్యధిక సంఖ్యాకులు కంటె, అతను అధిక దేవుని భయం కలిగినవాడు. అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకుగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి.”

తిరిగి వచ్చిన బందీల జాబితా

అప్పుడు ఆ నగరం విశాలంగా పుంది, కావలసినంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా నిర్మింపబడలేదు. జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగొట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది.

చెరనుంచి తిరిగి వచ్చిన వాళ్ల వివరం వుంది. వెనక బబులోను రాజు నెబుకద్నెజరు వీళ్లని బబులోనుకి బందీలుగా పట్టుకుపోయాడు. వాళ్లు ఇప్పుడు యెరూషలేముకీ, యూదాకీ తిరిగి వచ్చారు. వాళ్లలో ప్రతి ఒక్కడూ తన స్వంత పట్టణానికి పోయాడు. ఈ క్రిందివాళ్లు జెరుబ్బాబెలు[a] తో కలిసి వచ్చారు: యేషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, సహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా. ఇశ్రాయేలుకి చెందిన ఈ క్రింది మనుష్యులు ఈ క్రింది సంఖ్యలో తిరిగి వచ్చారు:

పరోషు వంశీయులు2,172
షెపట్యా వంశీయులు372
10 ఆరహు వంశీయులు652
11 పహత్మోయాబు వంశీయులు (వీళ్లు యేషూవ, జోయాబు వంశపు వాళ్లు)2,818
12 ఏలాము వంశీయులు1,254
13 జత్తూ వంశీయులు845
14 జక్కయి వంశీయులు760
15 బిన్నూయి వంశీయులు648
16 బేబై వంశీయులు628
17 అజ్గాదు వంశీయులు2,322
18 అదోనీకాము వంశీయులు667
19 బిగ్వయి వంశీయులు2,067
20 ఆదీను వంశీయులు655
21 హిజ్కియా కుటుంబానికి చెందిన ఆటేరు వంశీయులు98
22 హాషూము వంశీయులు328
23 బేజయి వంశీయులు324
24 హారీపు వంశీయులు112
25 గిబియోను వంశీయులు95
26 బేత్లేహేము, నెటోపా పట్టణాల వాళ్లు188
27 అనాతోతు పట్టణం వాళ్లు128
28 బేతజ్మావెతు పట్టణం వాళ్లు42
29 కిర్యతారీము, కెఫీరా, బేయెరోతు పట్టణాల వాళ్లు743
30 రమా, గెబ పట్టణాల వాళ్లు621
31 మిక్మషు పట్టణం వాళ్లు122
32 బేతేలు, ఆయి పట్టణాల వాళ్లు123
33 రెండవ నెబో పట్టణం వాళ్లు52
34 రెండవ ఏలాము పట్టణం వాళ్లు1,254
35 హారిము పట్టణం వాళ్లు320
36 యెరికో పట్టణం వాళ్లు345
37 లోదు హదీదు, ఓనో పట్టణాల వాళ్లు721
38 సెనాయా పట్టణం వాళ్లు3,930

39 వీళ్లు యాజకులు:

యేషూవా కుటుంబం ద్వారా యెదాయా వంశీయులు973
40 ఇమ్మేరు వంశీయులు1,052
41 పషూరు వంశీయులు1,247
42 హారిము వంశీయులు1,017

43 లేవీ వంశానికి చెందిన వాళ్లు:

యేషువా, హోదేయా,[b] కద్మీయులు74

44 వీళ్లు గాయకులు:

ఆసావు వంశీయులు148

45 వీళ్లు ద్వారపాలకులు:

షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబ, హటీటాం, షోబయి వంశీయులు138

46 వీళ్లు ఈ కింది వంశాల ఆలయ ప్రత్యేక సేవకులు:

జీహా, హశూఫా, టబ్బాయేలు

47 కేరోసు, సీయహా, పాదోను,

48 లెబానా, హగాబా, షల్మయి,

49 హానాను, గిద్దేలు, గహరు

50 రెవాయ, రెజీను, నెకోదా,

51 గజ్జాము, ఉజ్జా, పాసెయ.

52 బేసాయి, మెహూనీము, నెపూషేసీము.

53 బక్బూకు, హకూఫా, హర్హూరు,

54 బజ్లీతు, మెహీదా, హర్షా,

55 బర్కోసు, సీసెరా, తెమాహా,

56 నెజీయహు, హటేపా.

57 సొలొమోను దాసుల వంశాలకు చెందిన వారు:

సొటయి, సోపెరెతు, పెరూదా,

58 యహలా, దర్కొను, గిద్దేలు,

59 షెఫట్యా, హట్టీలు, పొకెరెతు, హజ్జెబాయిము, అమోను.

60 ఆలయ సేవకులు, సొలొమోను దాసుల వంశీయులు కలిసి మొత్తం392

61 కొందరు ఈ క్రింది పట్టణాలనుంచి యెరూషలేముకు వచ్చారు. తేల్మెలెహు, తెల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు, అయితే, వీళ్లు తమ కుటుంబాలు ఇశ్రాయేలుకి చెందినవో కావో నిరూపించుకోలేక పోయారు.

62 దెలాయ్యా, టోబీయా, నెకొనిదా వంశీయులు642

63 యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు

హబాయా, హక్కోజు, బర్జిల్లయి (గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలను పెళ్లి చేసుకున్నవాళ్లు బర్జిల్లయి వంశీయులుగా పరిగణింపబడ్డారు.)

64 వీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా పని చేయగలిగేందుకు గాను, తమ పూర్వీకులు యాజకులన్న విషయాన్ని వాళ్లు నిరూపించలేక పోయారు. దానితో, వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో చేర్చబడలేదు. 65 అత్యంత పవిత్రమైన వస్తువులను వాళ్లకి ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీము[c] ఉపయోగించి, దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి, ప్రార్థించేదాకా వాళ్లు ఈ అతి పరిశుద్ధ వస్తువుల్లో వేటికీ అర్హులు కాకుండా పోయారు.

66-67 మొత్తం మీద, ఆ బృందంలో తిరిగి వచ్చిన వాళ్లు 42,360 మంది వున్నారు. వాళ్ల 7,337 దాసదాసీలు ఈ మొత్తం సంఖ్యలో చేర్చబడలేదు. వాళ్లతోబాటు 245 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు. 68-69 వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు వున్నాయి.

70 కుటుంబ పెద్దలు కొందరు పనినిర్వహణకు సహాయంగా కొంత డబ్బు ఇచ్చారు. పాలనాధికారి ఖజానాకు 19 పౌనుల బంగారు ఇచ్చాడు. అతను 50 పళ్లాలు, యాజకులు ధరించేందుకు 530 జతల దుస్తులు కూడా ఇచ్చాడు. 71 కుటుంబ పెద్దలు పని నిర్వహణ కోసం 375 పౌనుల బంగారాన్ని ఖజానాకి ఇచ్చారు. వాళ్లు 1 1/3 టన్నులు వెండిని కూడ ఇచ్చారు. 72 మొత్తంమీద ఇతరులు 375 పౌనుల బంగారము, 1 1/3 టన్నుల వెండిని, యాజకుల కోసం 67 రకాల దుస్తులు ఇచ్చారు.

73 ఈ విధంగా యాజకులు, లేవీయులు, ద్వార పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమ తమ స్వంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రాయేలీయులందరూ తమ స్వంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఆ సంవత్సరం ఏడవ నెల[d] నాటికి ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.

అపొస్తలుల కార్యములు 17

థెస్సలొనీకలో

17 వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ” పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు. క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి రుజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు. తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.

ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేనివాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు. వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు. వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.

ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు. ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు.

బెరయలో

10 అర్థరాత్రి కాగానే సోదరులు పౌలును, సీలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చినవాళ్ళు యూదుల సమాజమందిరానికి వెళ్ళారు. 11 థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయవాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవసందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథం చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. 12 చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు.

13 పౌలు దైవసందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు. 14 వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు. 15 పౌలుతో వెళ్ళినవాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.

ఏథెన్సులో

16 పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ దుఃఖించింది. 17 అందువల్ల సమాజమందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవభీతిగల యూదులుకాని ప్రజలతో, సంతకు వచ్చి పోయే ప్రజలతో ప్రతి రోజు మాట్లాడే వాడు. 18 ఎపికూరీయులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు.

“ఆ వదరుబోతు ఏమంటున్నాడు?” అని కొందరు అన్నారు. “ఇతర దేవుళ్ళను గురించి ప్రబోధిస్తున్నట్లుంది” అని మరి కొందరు అన్నారు. పౌలు యేసును గురించి, ఆయన బ్రతికి రావటాన్ని గురించి ప్రకటించటం వల్ల అతణ్ణి వాళ్ళిలా విమర్శించారు.

19 వాళ్ళు అతనిని పట్టుకొని అరేయొపగు సభకు పిలుచుకు వచ్చారు. “నీవు చెబుతున్న ఈ క్రొత్త బోధ ఏమిటో మేము తెలుసుకోవచ్చా?” అని కొందరు అడిగారు. 20 “నీవు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేసావు. వాటి అర్థం మాకు చెప్పు” అని మరి కొందరడిగారు. 21 ఏథెన్సు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు, తమ కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పటంలోనో లేక వినటంలోనో గడిపేవాళ్ళు. మరే పని చేసేవాళ్ళు కాదు.

22 పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. 23 నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.

24 “ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు. 25 మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతి వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? 26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.

27 “మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. 28 ‘మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం.’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’

29 “మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని, లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడు కాడు. 30 గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ఉండినాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి, తాను చేయనున్నదాన్ని ప్రజలందరికీ రుజువు చేసాడు.”

32 చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు. 33 పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు. 34 కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసి అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగువాళ్ళున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International