Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 9-10

నూతన ఆరంభం

నోవహును, అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతనితో చెప్పాడు: “అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపు. భూమిమీదనున్న ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, నేలమీద ప్రాకు ప్రతి ప్రాణి, సముద్రంలోని ప్రతి చేప నీకు భయపడతాయి. వాటన్నిటిపైన నీవు పాలకునిగా ఉంటావు.” “గతంలో నీవు తినేందుకు పచ్చ మొక్కల్ని ఇచ్చాను. ఇప్పుడు ప్రతి జంతువు నీకు ఆహారం అవుతుంది. భూమిపైనున్న సమస్తాన్ని నీకు ఇస్తున్నాను. అదంతా నీదే. అయితే నీకు నేను ఒక ఆజ్ఞ యిస్తున్నాను. దానిలో ఇంకా ప్రాణము (రక్తం) ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు. అనగా ఏ మనిషినైనా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని అడుగుతాను, అలానే ఏ మనిషినైనా మరో మనిషి ప్రాణం తీస్తే, ఆ మనిషి రక్తాన్ని అడుగుతాను.

“దేవుడు అచ్చం తనలాగే మనుష్యులను చేశాడు.
    కనుక యింకొక మనిషిని చంపినవాడు మరో మనిషి చేత చంపబడాలి.

“నోవహూ! నీవు, నీ కుమారులు అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపుదురు గాక!”

తర్వాత నోవహుతో, అతని కుమారులతో దేవుడు ఇలా అన్నాడు: “నీతోను నీ తర్వాత నీ ప్రజలతోను ఇప్పుడు నేను నా వాగ్దానం చేస్తున్నాను. 10 నీతోబాటు ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నింటితోను, పశువులన్నింటితోను, జంతువులన్నింటితోను నేను వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదనున్న ప్రతి ప్రాణితో నేను వాగ్దానం చేస్తున్నాను. 11 ఇదే నీకు నా వాగ్దానం. వరదనీటిచేత, భూమిమీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా జరుగదు. భూమిమీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.”

12 తర్వాత నోవహు, అతని కుమారులతో యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను మీకు యిచ్చినట్లు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను ఈ వాగ్దానం నేను చేశానని చెప్పేందుకు ఇది రుజువు. ఈ వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొనసాగుతుంది. ఇదే ఆ రుజువు. 13 మేఘాల్లో నా రంగుల ధనస్సునుంచుచున్నాను. నాకు, భూమికి జరిగిన ఒడంబడికకు రుజువు ఆ రంగుల ధనస్సు. 14 భూమికి పైగా మేఘాలను నేను రప్పించినపుడు, మేఘాలలో రంగుల ధనస్సును మీరు చూస్తారు. 15 రంగుల ధనస్సును నేను చూపినప్పుడు నీతోను, భూమిమీదనున్న సకల ప్రాణులతోను జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ భూమిమీద సకల ప్రాణులను ఒక జలప్రళయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబుతోంది. 16 మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను చూచినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నాకును, భూమిమీద సకల ప్రాణులకును మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను.”

17 కనుక, “భూమిమీద సకల ప్రాణులతోను నేను చేసిన ఒడంబడికకు ఆ మేఘ ధనస్సు రుజువు” అని యెహోవా నోవహుతో చెప్పాడు.

మళ్లీ సమస్యలు ప్రారంభం

18 నోవహుతో కూడ అతని కుమారులు ఓడలోనుండి బయటకు వచ్చారు. వారి పేర్లు షేము, హాము, యాఫెతు. (హాము కనానుకు తండ్రి). 19 ఆ ముగ్గురు మగవాళ్లు నోవహు కుమారులు. మరియు భూమిమీద ప్రజలంతా ఆ ముగ్గురి కుమారులనుండి వచ్చినవాళ్లే.

20 నోవహు వ్యయసాయదారుడయ్యాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. 21 నోవహు ద్రాక్షారసం చేసి, దాన్ని త్రాగాడు. అతడు మత్తెక్కి తన గుడారంలో పండుకొన్నాడు. నోవహు బట్టలు ఏమీ వేసుకొనలేదు. 22 కనాను తండ్రి హాము, దిగంబరంగా ఉన్న తన తండ్రిని చూశాడు. గుడారం వెలుపలున్న తన సోదరులతో హాము ఈ విషయం చెప్పాడు. 23 అప్పుడు షేము, యాఫెతు కలసి ఒక అంగీని తెచ్చారు. వాళ్లు ఆ అంగీని తమ భుజాలమీద మోసి గుడారంలోకి తీసుకువెళ్లారు. వారు వెనక్కి గుడారంలోకి నడిచివెళ్లి బట్టలు లేకుండా ఉన్న తమ తండ్రి ఒంటిమీద బట్ట కప్పారు.

24 ఆ తర్వాత నోవహు మేల్కొన్నాడు. (ద్రాక్షారసంవల్ల అతడు నిద్రపోతూ ఉన్నాడు). అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసినదాన్ని అతడు తెలుసుకొన్నాడు. 25 కనుక నోవహు అన్నాడు:

“కనాను[a] శపించబడును గాక!
    కనాను తన సోదరులకు బానిస అగును గాక!”

26 నోవహు ఇంకా ఇలా అన్నాడు:

“షేము దేవుడగు యెహోవా స్తుతించబడును గాక!
    కనాను షేముకు బానిస అవును గాక.
27 యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమిని ఇచ్చును గాక!
    షేము గుడారాలలో దేవుడు నివసించును గాక!
    కనాను వారికి బానిస అవును గాక!”

28 జలప్రళయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు బ్రతికాడు. 29 నోవహు మొత్తం 950 సంవత్సరాలు బ్రతికాడు. తరువాత అతడు మరణించాడు.

జనముల అభివృద్ధి, విస్తరణ

10 నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:

యాఫెతు సంతానము

యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.

గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా

యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.

మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో నివసించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతులవారయ్యారు. ప్రతి జాతివారికి వారి స్వంత భాష ఉంది.

హాము సంతానము

హాము కుమారులు కూషు, మిస్రాయిము,[b] పూతు, కనాను.

కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా.

రాయమా కుమారులు షేబ, దదాను.

కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు. నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి యెహోవా యెదుట గొప్ప వేటగాడైన నిమ్రోదువంటివాడు” అంటారు.

10 షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదుకల్నే అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది. 11 నిమ్రోదు అష్షూరుకు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె, రహోబోతీరు, కాలహు, 12 రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. (నీనెవెకు, కాలహు పట్టణానికి మధ్య రెసెను ఉంది.)

13 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, 14 పత్రుసీయులు, కస్లూహీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయిము తండ్రి. (ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారే.)

15 సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను. హేతుకు కనాను తండ్రి. 16 యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, 17 హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, 18 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికిని కనాను తండ్రి.

కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి. 19 ఉత్తరాన సీదోను నుండి దక్షిణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొఱ్ఱా, అద్మా, సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే.

20 ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయి. వారు వేరు వేరు జాతులయ్యారు.

షేము సంతానము

21 యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి.

22 షేము కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.

23 అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాష.

24 అర్పక్షదు షేలహుకు తండ్రి.

షేలహు ఏబెరుకు తండ్రి.

25 ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక కుమారునికి పెలెగు[c] అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలములోనే భూమి విభజించబడింది. కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను.

26 యొక్తాను కుమారులు అల్మదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, 27 హదోరము, ఊజాలు, దిక్లాను 28 ఓబాలు, అబీమాయెలు, షేబ, 29 ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు. 30 మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది.

31 వాళ్లు షేము వంశంనుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది.

32 నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే.

మత్తయి 9

యేసు పక్షవాత రోగిని నయం చేయటం

(మార్కు 2:1-12; లూకా 5:17-26)

యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు. కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.

ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు.

వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లోకి దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు? ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనటం సులభమా లేక ‘లేచి నిలుచో’ అని అనటం సులభమా? పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, “లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.

పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు. ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.

మత్తయిని పిలవటం

(మార్కు 2:13-17; లూకా 5:27-32)

యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు.

10 యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, పాపులు వచ్చారు, వాళ్ళంతా యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. 11 పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు.

12 యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. 13 ‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’(A) అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.

యేసు ఇతర మతనాయకులవలె కాదు

(మార్కు 2:18-22; లూకా 5:33-39)

14 ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి, యేసును, “మేము, పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా; మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.

15 యేసు, “పెళ్ళికుమారుని అతిథులు పెళ్ళి కుమారుడు వాళ్ళతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్ళి కుమారుడు వెళ్ళి పోయే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని సమాధానం చెప్పాడు.

16 “పాత వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది. 17 అదే విధంగా క్రొత్త ద్రాక్షారసమును పాతతోలు సంచిలో దాచరు. అలా చేస్తే ఆ తోలుసంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది. అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి. అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి” అని యేసు అన్నాడు.

యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం

(మార్కు 5:21-43; లూకా 8:40-56)

18 యేసు ఈ విధంగా మాట్లాడుతుండగా యూదుల సమాజమందిరానికి అధికారిగా ఉన్నవాడు ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరిల్లి, “నా కూతురు చనిపోయింది. కాని మీరు వచ్చి మీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది” అని అన్నాడు.

19 యేసు, ఆయన శిష్యులు లేచి అతని వెంట వెళ్ళారు.

20 వాళ్ళు వెళ్తుండగా పండ్రెండేండ్ల నుండి రక్త స్రావంతో బాధ పడ్తున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. 21 ఆమె, “నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు నాకు నయమైపోతుంది” అని తనలో తాను అనుకొన్నది.

22 యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి, “ధైర్యంగా వుండమ్మా! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది” అని అన్నాడు.

23 యేసు ఆ అధికారి యింట్లోకి ప్రవేశిస్తూ, అక్కడ పిల్లన గ్రోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు ఉండటం చూసాడు. 24 వాళ్ళతో, “వెళ్ళిపొండి, ఆమె చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే!” అని అన్నాడు. వాళ్ళాయన్ని హేళన చేసారు. 25 ఆయన వాళ్ళను పంపేసాక లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి తాకాడు. ఆమె వెంటనే లేచి నిలుచుంది. 26 ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.

ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపు కలిగించటం

27 యేసు అక్కడినుండి బయలుదేరి వెళ్తుండగా యిద్దరు గ్రుడ్డివాళ్ళు, “దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు.

28 యేసు యింట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, “ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా?” అని అడిగాడు. “ఉంది ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

29 అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, “మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలుగనీ!” అని అన్నాడు. 30 వాళ్ళకు చూపు వచ్చింది. యేసు, “ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి!” అని వాళ్ళను హెచ్చరించాడు. 31 కాని వాళ్ళు వెళ్ళి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేసారు.

32 వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాడి నొకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. 33 యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్ఘాంతపోయి, “ఇలాంటిదేదీ ఇదివరకెన్నడూ ఇశ్రాయేలులో జరగలేదే?” అని అన్నారు.

34 కాని పరిసయ్యులు, “అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.

కొద్దిమంది పనివాళ్ళు

35 యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ అన్ని పట్టణాలు, పల్లెలు పర్యటన చేసాడు. దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించాడు. అన్నిరకాల రోగాల్ని, బాధల్ని నయం చేసాడు. 36 ప్రజలు కాపరిలేని గొఱ్ఱెల్లా అలసిపోయి, చెదరిపోయి ఉండటం చూసి యేసు వాళ్ళపై జాలి పడ్డాడు. 37 ఆ తర్వాత తన శిష్యులతో, “పంట బాగా పండింది కాని పని వాళ్ళే తక్కువగా ఉన్నారు. 38 పంట ప్రభువును, పంట కోయటానికి పనివాళ్ళను పంపమని ప్రార్థించండి” అని అన్నాడు.

ఎజ్రా 9

యూదేతరులతో మిశ్రమ వివాహాలు

మేమీ పనులన్నీ ముగించాక ఇశ్రాయేలు నాయకులు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు: “ఎజ్రా, ఇశ్రాయేలీయులు తమ చుట్టూ వున్నవారితో తమని తాము వేరుగా నిలుపుకోలేదు. యాజకులు, లేవీయులు సైతం తమ ప్రత్యేకతను కాపాడుకోలేదు. కనాను, హిత్తీ, పెరిజ్జీ, యెబూషీ, అమ్మోను, మెయాబు, ఈజిప్టు అమోరీ జాతులవారు చేసే పాపపు పనులతో ఇశ్రాయేలీయులు చెడుగా ప్రభావితులవుతున్నారు. ఇశ్రాయేలీయులు మన చుట్టూ వున్న ఆయా జాతులవారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు తమ ప్రత్యేకతను నిలుపుకొని వుండవలసింది. కాని. వాళ్లు తమ చుట్టూవున్న ఇతర జాతీయులను పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు నాయకులు, ముఖ్య అధికారులు ఈ విషయంలో చెడ్డ విధానాన్ని అనుసరించారు.” ఈ విషయాలు విన్న నేను నా మనో దుఃఖాన్ని తెలిపేందుకు అంగీని, పైవస్తాన్ని చింపుకున్నాను. నా జుట్టు, గడ్డం పీక్కున్నాను. కలత చెంది దిగ్భ్రాంతుడనై నేను కూర్చుండి పోయాను. అప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ప్రతి ఒక్కడూ భయకంపితుడయ్యాడు. చెరనుంచి తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు దేవుని పట్ల నమ్మక ద్రోహులుగా వ్యవహారించినందుకు వాళ్లందరూ భయపడ్డారు. సాయంత్రపు బలివరకు కలతచెందిన నేను మాటలాడక అక్కడే కూర్చుండిపోయాను. అందరూ నా చుట్టూ మూగారు.

సాయంత్రపు బలివేళ అవడంతో, నేను లేచి నిలబడ్డాను. నా అంగీ, పై వస్త్రమూ చీలికలు పేలికలైవున్నాయి. యెహోవా దేవునివైపు చేతులు చాపి ప్రార్థిస్తూ, మోకరిల్లాను. అప్పుడు నేనిలా ప్రార్థించాను:

“ఓ దేవా, ఎక్కువ సిగ్గుచేత, కలవరపాటుచేత నేను నీవైపు ముఖము ఎత్తలేకపోతున్నాను. మా పాపాలు, దోషాలు మా తలల ఎత్తును మీరిపోయి ఆకాశాన్ని అంటుతున్నాయి. మా పూర్వీకుల నాటినుంచి నేటి మా తరందాకా మేము అనేకానేక పాపాలు చేశాము. అందుకే మా రాజులూ, యాజకులూ శిక్షింపబడ్డారు. విదేశాల రాజులు మా పైన దాడి చేసి మా ప్రజలను బందీలుగా తీసుకుపోయారు. ఆ రాజులు మా సంపదను కొల్లగొట్టి, మమ్మల్ని అవమానానికి గురిచేశారు. ఈ నాటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.

“చివరికి ఇప్పుడు, దేవా, నీవు మాపట్ల దయ చూపావు. మాలో కొద్దిమంది చెరనుంచి తప్పించుకొని ఈ పవిత్ర ప్రాంతంలో నివసించడాన్ని సాధ్యంచేశావు. ప్రభువా, నీవు మాకు కొత్త జీవితం, దాస్యములో నుంచి విముక్తి ప్రసాదించావు. మేము బానిసలుగా వున్నమాట నిజమే, కాని, నీవు మమ్మల్మి శాశ్వతంగా బానిసలుగా ఉండనియ్యవు. నీవు మాపట్ల దయ చూపావు. పారసీక ప్రభువులు మాపట్ల దయ చూపేలా నీవు చేశావు. నీ దేవాలయం ధ్వంసం చేయబడింది. కాని, నీవు మాకు నూతన జీవితం ప్రసాదించి, మేము నీ ఆలయాన్ని తిరిగి నిర్మించి, దాన్ని సరికొత్తదానిలా మలచగలిగే అవకాశం మాకు కల్పించావు. దేవా! యూదా, యెరూషలేములకు రక్షణగా ప్రాకారం కట్టేందుకు నీవు మాకు తోడ్పడ్డావు.

10 “ఇప్పుడు దేవా, నీకు మేము చెప్పగలిగింది ఏముంది? మేము మళ్లీ నీ మాట పాటించడం మానేశాం! 11 దేవా, నీవు నీ సేవకులైన నీ ప్రవక్తల ద్వారా ఆ ఆదేశాలను మాకు ఇచ్చావు. నీవు ఇలా అన్నావు, ‘మీరు స్వంతం చేసుకొని, నివసించబోయే ప్రాంతం అపవిత్రమైన భూమి. అక్కడ నివసిస్తూ వచ్చిన మనుష్యులు చేసిన చెడ్డపనుల మూలంగా అది అపవిత్రమైనది. వాళ్లు ఈ దేశంలో అన్నిచోట్లా ఇలాంటి చెడ్డపనులు చాలా చేశారు. వాళ్లు తమ పాపాలతో ఈ దేశాన్ని అపవిత్రం చేశారు. 12 అందుకని, ఇశ్రాయేలీయులారా, మీ బిడ్డలు వారి బిడ్డలను పెళ్లి చేసుకోకుండా చూడండి. మీరు వాళ్లతో కలవకండి! నా ఆదేశాలను పాటించండి, వారితో శాంతి ఒప్పందం చేయకండి. అప్పుడు మీరు శక్తి కలిగి, దేశంలోని మంచి వాటిని ఆనందంగా అనుభవించగలుగుతారు. అప్పుడు మీరు ఈ దేశాన్ని నిలుపుకొని, దాన్ని మీ బిడ్డలకు సంక్రమింప జేయగలుగుతారు.’

13 “మనకి వాటిల్లిన కష్టాలకు మన చెడ్డక్రియలే కారణం. మనం పాపాలు చేశాం, మన దోషాలు అనేకమైనవి. అయితే, ఓ దేవా, నీవు మమ్ముల్ని శిక్షించ వలసినంతగా శిక్షించలేదు. మేము ఘోరమైన పాపాలు ఎన్నో చేశాము. మమ్మల్ని నీవు ఇంకెంతో కఠినంగా శిక్షించియుండవలసింది. మాలో కొందర్ని దాస్యంలో సహితం తప్పించుకోనిచ్చావు. 14 నీ ఆదేశాలను భంగ పరచకూడదని మేము తెలుసుకున్నాము. మేము వాళ్లను పెళ్లి చేసుకోకూడదు. వాళ్లు చేసేవి చాలా చెడ్డ పనులు. దేవా, మేమా చెడ్డవాళ్లతో పెళ్లి కొనసాగించినట్లయితే, నీవు మమ్మల్ని నాశనం చేస్తావని మాకు తెలుసు! అప్పుడిక ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కడూ ప్రాణాలతో మిగిలివుండడు.

15 “యెహోవా, ఇశ్రాయేలు ప్రజల దేవా, నీవు నీతి మంతుడవై యున్నావు. మాలో కొందర్ని ప్రాణాలతో మిగిల్చావు. మా దోషం కారణంగా, మాలో ఒక్కడుకూడా నీ ముందు నిలిచేందుకు అర్హుడుకాడు.”

అపొస్తలుల కార్యములు 9

సౌలు మార్పునొందటం

సౌలు ప్రభువు అనుచరుల్ని చంపిస్తానని ఇంకా ఎగిరిపడ్తూనే ఉన్నాడు. ప్రధానయాజకుని దగ్గరకు వెళ్ళి డెమాస్కసు పట్టణంలోని సమాజ మందిరాలకు ఉత్తరాలు వ్రాసి యివ్వమని అడిగాడు. ప్రభువు మార్గాన్ని అనుసరించేవాళ్ళు కనిపిస్తే స్త్రీ, పురుష భేదం లేకుండా వాళ్ళను బంధించి యెరూషలేముకు తీసుకు రావాలని అతని ఉద్దేశ్యం.

అతడు డెమాస్కసు పొలిమేరలు చేరుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశంనుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అతడు నేలకూలిపొయ్యాడు. ఒక స్వరం, “సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు?” అని వినబడింది.

“ప్రభూ! మీరెవరు?” అని సౌలు అడిగాడు. “నేను నీవు హింసిస్తున్న యేసును. లేచి పట్టణంలోకి వెళ్ళు. నీవేం చెయ్యాలో అక్కడ నీకు చెప్పబడుతుంది” అని ఆయన సమాధానం చెప్పాడు.

సౌలుతో ప్రయాణం చేస్తున్నవాళ్ళు మూగవాళ్ళలా నిల్చున్నారు. వాళ్ళు ఆ స్వరం విన్నారే కాని వాళ్ళకెవ్వరూ కనపడలేదు. క్రింద పడ్డ సౌలు లేచి నిలుచొని కళ్ళు తెరిచాడు. కాని అతనికి ఏమీ కనిపించలేదు. వాళ్ళతని చేయి పట్టుకొని డెమాస్కసులోనికి నడిపించారు. మూడు రోజుల దాకా అతడు గ్రుడ్డివానిగానే ఉండిపోయాడు. ఆహారం కాని, నీళ్ళు కాని ముట్టలేదు.

10 డెమాస్కసులో యేసు భక్తుడొకడుండేవాడు. అతని పేరు అననీయ. ప్రభువతనికి దివ్యదర్శనంలో కనపడి, “అననీయా!” అని పిలిచాడు.

“ఇదిగో, ఇక్కడున్నాను ప్రభూ!” అని అతడు జవాబు చెప్పాడు.

11 ప్రభువతనితో, “‘తిన్నని వీధి’ అని పిలువబడే వీధిలో ఉన్న ‘యూదా’ యింటికి వెళ్ళు, ‘తార్సు’ అనే పట్టణంనుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు. 12 అతడొక దివ్యదర్శనంలో ‘అననీయ’ అనే పేరుగలవాడు అతని దగ్గరకు వచ్చినట్లు, అతనికి దృష్టి రావటానికి అతనిపై చేతులుంచబడినట్లు చూసాడు” అని చెప్పాడు.

13 అననీయ, “ప్రభూ, అతడు యెరూషలేంలోని పరిశుద్ధులకు చాలా హాని చేసినట్లు చాలా మంది విన్నారు. 14 మిమ్మల్ని శరణుజొచ్చిన ప్రతి ఒక్కణ్ణి బంధించే అధికారం అతడు ప్రధానయాజకుల దగ్గరనుండి పొందాడు”, అని సమాధానం చెప్పాడు.

15 అప్పుడు ప్రభువు అననీయతో, “వెళ్ళు! నా పేరు యూదులు కానివాళ్ళకు, వాళ్ళ పాలకులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి యితణ్ణి నేను ఒక సాధనంగా ఎన్నుకొన్నాను. 16 నా పేరిట అతడెన్ని కష్టాలు పడవలసి వస్తుందో నేనతనికి తెలియచేస్తాను” అని అన్నాడు.

17 ఆ తర్వాత అననీయ అక్కడినుండి బయలుదేరి సౌలు ఉన్న యింటికి వెళ్ళాడు. తన చేతుల్ని సౌలు మీద ఉంచి, “సోదరుడా! సౌలా! యేసు ప్రభువు నీవిక్కడికి వస్తున్నప్పుడు నీకు దారిలో కనిపించాడే, ఆయనే, నీవు మళ్ళీ చూడగలగాలని, పవిత్రాత్మ నీలో నిండాలని నన్ను పంపాడు” అని అన్నాడు. 18 వెంటనే పొరల్లాంటివి సౌలు కళ్ళనుండి రాలి క్రిందపడ్డాయి. అతడు మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము పొందాడు. 19 ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది.

సౌలు డెమాస్కసులో బోధించుట

సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు. 20 ఆ తర్వాత, యూదుల సమాజ మందిరాల్లో, “యేసు దేవుని కుమారుడు” అని బోధించటం మొదలు పెట్టాడు.

21 అతని మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసును నమ్మిన వాళ్ళను చంపినవాడు ఇతడే కదా! ఇక్కడికి వచ్చింది యేసు శిష్యులను బంధించటానికే కదా! అలా బంధించి వాళ్ళను ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలనే కదా అతని ఉద్దేశ్యం!” అని అనుకొన్నారు.

22 కాని సౌలు ఇంకా ఎక్కువ ఆత్మబలంతో డెమాస్కసులో నివసించే యూదులకు, “యేసు ప్రభువే క్రీస్తు” అని రుజువు చేసి వాళ్ళను ఆశ్చర్యపరిచాడు.

సౌలు యూదులనుండి తప్పించుకొనుట

23 చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు. 24 కాని సౌలుకు వాళ్ళ కుట్ర తెలిసిపోయింది. యూదులు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలా కాచారు. 25 కాని అతని శిష్యులు రాత్రివేళ అతణ్ణి ఒక బుట్టలో దాచి కోట గోడనుండి క్రిందికి దింపారు.

యెరూషలేములో సౌలు

26 సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు. 27 కాని బర్నబా అతణ్ణి పిలుచుకొని అపొస్తలుల దగ్గరకు వచ్చి, వాళ్ళతో సౌలు ప్రయాణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అతనితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము చెప్పాడు.

28 స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు. 29 గ్రీకు మాట్లాడే యూదులతో మాట్లాడి వాదించాడు. వాళ్ళు అతణ్ణి చంపాలని నిశ్చయించారు. 30 సోదరులకు యిది తెలియగానే అతణ్ణి కైసరియకు తీసుకెళ్ళి అక్కడినుండి తార్సుకు పంపారు.

31 ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

లుద్ద మరియు యొప్పేలో పేతురు

32 పేతురు దేశమంతా తిరుగుతూ “లుద్ద” అనే పట్టణంలో నివసిస్తున్న విశ్వాసుల్ని కలుసుకోవటానికి వెళ్ళాడు. 33 అక్కడ ఎనిమిదేళ్ళనుండి పక్షవాతంతో మంచంపట్టిన “ఐనెయ” అనేవాణ్ణి చూసాడు. 34 “ఐనెయా!” అని పిలిచి “యేసు క్రీస్తు నీకు నయం చేస్తాడు. లేచి నీ పరుపును సర్దుకో!” అని అన్నాడు. ఐనెయ వెంటనే లేచి నిలుచున్నాడు. 35 లుద్ద, షారోను పట్టణాల్లో నివసిస్తున్నవాళ్ళంతా ఐనెయను చూసి ప్రభువునందు విశ్వాసముంచారు.

36 “యొప్పే” అనే పట్టణంలో, తబితా అనే శిష్యురాలు ఉండేది. ఈమెను గ్రీకు భాషలో దొర్కా అని పిలిచేవాళ్ళు. ఈమె పేదలకు సహాయం చేస్తూ ఉండేది. ఎప్పుడూ మంచి పనులు చేసేది. 37 పేతురు అదే ప్రాంతాల్లో ఉండగా ఆమె జబ్బు పడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ మీది గదిలో ఉంచారు. 38 లుద్ద యొప్పే పట్టణానికి దగ్గరగా ఉండింది. పేతురు లుద్దలో ఉన్నాడని, శిష్యులు యిద్దరు మనుష్యుల్ని అతని దగ్గరకు పంపి వెంటనే రమ్మని వేడుకున్నారు.

39 పేతురు వాళ్ళ వెంట వెళ్ళాడు. అతడు రాగానే మేడ మీది గదికి తీసుకు వెళ్ళారు. అతని చుట్టూ చేరిన వితంతువులు, దొర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన రకరకాల దుస్తుల్ని చూపి విలపించారు. 40 పేతురు వాళ్ళందర్ని గదినుండి వెలుపలికి పంపి తన మోకాళ్ళపై ప్రార్థించాడు. శవం వైపు తిరిగి, “లే, తబితా!” అని అన్నాడు. ఆమె కళ్ళు తెరిచింది. పేతురును చూసి లేచి కూర్చుంది. 41 అతడు చేతులందించి ఆమె నిలబడటానికి సహాయం చేసాడు. ఆ తదుపరి పేతురు భక్తుల్ని, వితంతువుల్ని పిలిచి వాళ్ళకు ప్రాణంతో ఉన్న తబితాను చూపాడు.

42 యొప్పే ప్రాంతమంతా యిది తెలిసిపోయింది. అనేకులు ప్రభువు భక్తులయ్యారు. 43 పేతురు యొప్పేలో సీమోను అనే ఒక చెప్పులు కుట్టేవాని యింట్లో చాలా రోజులు గడిపాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International