M’Cheyne Bible Reading Plan
ప్రజలు చెడ్డవాళ్లగుట
6 భూమిమీద మనుష్యుల సంఖ్య పెరుగుతూ పోయింది. వీరికి ఆడపిల్లలు పుట్టారు. 2-4 ఈ ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నట్లు దేవుని కుమారులు చూశారు. కనుక దేవుని కుమారులు వారికి నచ్చిన ఆడపిల్లల్ని వాళ్లు పెళ్లి చేసుకొన్నారు.
ఆ స్త్రీలు పిల్లల్ని కన్నారు, ఆ కాలంలోను, ఆ తర్వాత కాలంలోను నెఫీలులనువారు[a] ఆ దేశంలో నివసించారు. వారు చాలా ప్రఖ్యాతి చెందిన ప్రజలు, ప్రాచీన కాలంనుండి వారు మహా వీరులు.
అప్పుడు యెహోవా అన్నాడు, “మనుష్యులు మానవ మాత్రులు, వారి మూలంగా నా ఆత్మను ఎల్లప్పుడు కలవరపడనియ్యను. 120 సంవత్సరాలు వారిని బ్రతకనిస్తాను.”
5 భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్లు యెహోవా చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్లు యెహోవా చూశాడు. 6 ఈ భూమిమీద మనుష్యులను చేసినందుకు యెహోవా విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది. 7 కనుక యెహోవా ఇలా అన్నాడు: “భూమిమీద నేను చేసిన మనుష్యులందరినీ నేను నాశనం చేసేస్తాను. ప్రతి మనుష్యుని, ప్రతి జంతువును, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని నేను నాశనం చేస్తాను. ఆకాశ పక్షుల్ని కూడా నేను నాశనం చేస్తాను. ఎందుచేతనంటే, వీటన్నింటినీ నేను చేసినందుకు విచారిస్తున్నాను గనుక.”
8 అయితే భూమిమీద యెహోవాను సంతోషపెట్టిన మనిషి ఒక్కడు ఉన్నాడు. అతడు నోవహు.
నోవహు—జలప్రళయం
9 ఇది నోవహు కుటుంబ కథ. నోవహు తన తరం వారిలోనే నీతిమంతుడు. అతడు ఎల్లప్పుడు దేవునిని అనుసరించాడు. 10 నోవహుకు షేము, హాము, యాఫెతు అని ముగ్గురు కుమారులు.
11-12 దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని పాడుచేసినట్లు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు.
13 కనుక నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు: “మనుష్యులంతా ఈ భూమిని కోపంతో హింసతో నింపేశారు. కనుక జీవిస్తున్న వాటన్నింటిని నేను నాశనం చేస్తాను. ఈ భూమిమీద నుండి వారిని నేను తీసివేస్తాను. 14 చితిసారకపు చెక్కతో నీ కోసం ఒక ఓడను నిర్మించు, ఓడలో గదులను చేసి ఓడకు తారు పైపూత పూయి.
15 “నీవు చేయాల్సిన ఓడ కొలత ఇలా ఉండాలి. 300 అ. పొడవు, 50 అ. వెడల్పు, 30 అ. ఎత్తు. 16 కప్పుకు సుమారు 18 అంగుళాల క్రింద ఓడకు ఒక కిటికీ చేయి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టు. ఓడలో మూడు అంతస్తులు చేయి. పై అంతస్తు, మధ్య అంతస్తు, క్రింది అంతస్తు.
17 “నేను నీతో చెబుతోంది గ్రహించు. ఈ భూమి మీదికి ఒక మహాగొప్ప జలప్రళయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఆకాశం క్రింద జీవిస్తున్న సకల ప్రాణులను నేను నాశనం చేస్తాను. భూమిమీద ఉండే ప్రతీ ప్రాణి చస్తుంది. భూమిమీద ఉన్న అన్నీ చస్తాయి. 18 అయితే నిన్ను నేను రక్షిస్తాను. అప్పుడు నీతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేస్తాను. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు అందరు ఓడలో ఎక్కాలి. 19 భూమిమీద జీవిస్తోన్న ప్రాణులన్నింటిలో రెండేసి చొప్పున నీవు సంపాదించాలి. ఆడ, మగ చొప్పున వాటిని ఓడలోనికి తీసుకొని రావాలి. వాటిని నీతో కూడా సజీవంగా ఉండనివ్వు. 20 భూమిమీద ఉన్న ప్రతీ జాతి పక్షుల్లోనుంచి రెండేసి తీసుకురా. భూమిమీద ఉన్న అన్ని రకాల జంతువుల్లోనుంచి రెండేసి తీసుకురా. నేలమీద ప్రాకు ప్రతి ప్రాణులలో రెండేసి చొప్పున తీసుకురా, భూమిమీద ఉండే అన్ని రకాల జంతువులు మగది, ఆడది నీతో ఉండాలి. ఓడలో వాటిని సజీవంగా ఉంచు. 21 అలాగే భూమి మీద ఉండే ప్రతి విధమైన ఆహారాన్ని ఓడలోనికి తీసుకొనిరా. అది నీకు, జంతువులకు భోజనం అవుతుంది.”
22 వీటన్నింటినీ నోవహు చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే నోవహు వాటన్నిటినీ చేశాడు.
యేసు ఇచ్చుటను గురించి బోధించటం
6 “జాగ్రత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్లు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు.
2 “అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది. 3 కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి. 4 అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
యేసు ప్రార్థన గురించి బోధించటం
(లూకా 11:2-4)
5 “మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం—వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది. 6 మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
7 “అంతేకాక, మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కాని వాళ్ళవలె మాట్లాడవద్దు. ఆలా చేయడంవల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకొంటారు. 8 వాళ్ళవలె చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ తండ్రికి తెలుసు. 9 కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి:
‘పరలోకంలో ఉన్న మా తండ్రీ,
నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము.
10 నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే
ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము.
11 ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం మాకు దయ చేయుము.
12 ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి,
మేము చేసిన పాపాలను కూడా క్షమించుము.
13 మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు.
పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’[a]
14 ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. 15 కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు.
యేసు ఉపవాసమును గురించి బోధించటం
16 “కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. యింకేమీ లభించదు. 17 మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కొండి. 18 అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
నీవు ఇద్దరు యజమానులను సేవించలేవు
(లూకా 12:33-34; 11:34-36; 16:13)
19 “మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు. 20 మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు. 21 మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది.
22 “కన్ను శరీరానికి ఒక దీపంలాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది. 23 మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటై పోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా.
24 “ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం.
మొదట దేవుని రాజ్యం
(లూకా 12:22-34)
25 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీ జీవితాలకు కావలసిన ఆహారాన్ని గురించి కాని, మీ దేహాలకు కావలసిన దుస్తుల్ని గురించి కాని చింతించకండి. జీవితం ఆహారం కన్నా, దేహం దుస్తులకన్నా, ముఖ్యమైనవి కావా? 26 ఆకాశంలో ఎగిరే పక్షుల్ని గమనించండి. అవి విత్తనం విత్తి పంటను పండించవు. ధాన్యాన్ని ధాన్యపు కొట్టులో దాచివుంచవు. అయినా పరలోకంలోవున్న మీ తండ్రి వాటికి ఆహారాన్ని యిస్తాడు. మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా! 27 చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా?
28 “మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డిమీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి పని చేసి దారాన్ని వడకవు. 29 అయినా, నేను చెప్పేదేమిటంటే గొప్ప వైభవమున్న సొలొమోను రాజుకూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితూగలేడు. 30 ఈనాడు ఉండి రేపు మంటల్లో పారవేయబడే ఈ గడ్డిని దేవుడంత అందంగా అలంకరిస్తే మిమ్మల్ని యింకెంత అందంగా అలంకరిస్తాడో కదా! మీలో దృఢ విశ్వాసం లేదు.
31 “‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏ దుస్తుల్ని వేసుకోవాలి?’ అని చింతించకండి. 32 యూదులు కానివాళ్ళు వాటివైపు పరుగెత్తుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి యివన్నీ మీకవసరమని తెలుసు. 33 కాని మొదట ఆయన రాజ్యం కొఱకు, నీతి కొఱకు ప్రయాస పడండి; అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు. 34 రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి.
దర్యావేషు ఆజ్ఞ
6 దర్వావేషు రాజు తన ముందరి రాజుల చారిత్రక పత్రాలను గాలించవలసిందిగా ఆదేశించాడు. ఆ పత్రాలు బబులోనులో డబ్బును పదిలపరచిన ఖజానాలోనే పదిలపరచబడ్డాయి. 2 మాదీయ రాష్ట్రంలోని ఎగ్బతానా కోటలో చుట్టబడిన పత్రం ఒకటి కనిపించింది. ఆ చుట్టబడిన పత్రం[a] లో యిలా వ్రాయబడి వుంది:
అధికార పత్రం: 3 కోరెషు రాజు పాలన మొదటి సంవత్సరంలో, కోరెషు యెరూషలేములోని దేవాలయం విషయంలో ఈ క్రింది ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞలో ఇలా పేర్కొనబడింది:
బలులు అర్పించేందుకు అనువైన యెరూషలేము దేవాలయం తిరిగి నిర్మించబడాలి. దానికి పునాదులు వెయ్యనియ్యండి, దేవాలయం (పొడవు 90 అడుగులు, వెడల్పు 90 అడుగులు వుండాలి.) 4 దాని చుట్టూ వుండే గోడ మూడు వరుసల పెద్ద రాళ్లతో, ఒక వరుస పెద్ద కొయ్య దూలాలతో నిర్మింపబడాలి. దేవాలయ నిర్మాణానికయ్యే ఖర్చులు రాజు ఖజానానుంచి చెల్లించాలి. 5 అంతేకాదు, దేవాలయం నుంచి తెచ్చిన వెండి, బంగారు వస్తువులు తిరిగి వాటి వాటి స్థానాల్లో వుంచబడాలి. వెనక, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలోంచి కొల్లగొట్టి, ఆ వస్తువులను బబులోనుకు తెచ్చాడు. వాటిని తిరిగి ఆ దేవాలయంలో వుంచాలి.
6 ఇప్పుడిక దర్యావేషునైన నేను,
యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంత అధికారియైన తత్తెనైయు, షెతర్బోజ్నయినీ, ఆ రాజ్యంలో నివసించే అధికారులందరినీ యెరూషలేముకు దూరంగా పుండవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. 7 అక్కడి పనివాళ్లని వేధించకండి. ఆ దేవాలయ నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నించకండి. యూదా పాలనాధికారీ, యూదా నాయకులూ ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలి. ఆ దేవాలయం పూర్వం ఎక్కడున్నదో సరిగ్గా అదే స్థలంలో దాన్ని తిరిగి నిర్మించాలి.
8 ఇప్పుడు నేనీక్రింది ఆజ్ఞను జారీ చేస్తున్నాను. దేవాలయం నిర్మిస్తున్న యూదా పెద్దలకు, మీరు ఈ క్రింది పనులు చెయ్యాలి. దేవాలయ నిర్మాణ ఖర్చులు పూర్తిగా ఖాజానానుంచి చెల్లింపబడాలి. ఆ సొమ్ము యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలోని రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేయబడాలి. ఆ నిర్మాణం ఆగిపోకుండా వుండేందుకుగాను మీరీ పనులు త్వర త్వరగా చెయ్యాలి. 9 వాళ్లకి ఏమి కావాలన్నా సరే ఇవ్వండి. పరలోక దేవునికి బలి ఇచ్చేందుకు వాళ్లు దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు కావాలంటే, వాటిని వాళ్లకి ఇవ్వండి. యెరూషలేము యాజకులు గోధుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె కావాలంటే, వాటిని మీరు ప్రతిరోజూ వాళ్లకి తప్పనిసరిగా ఇవ్వండి. 10 పరలోక దేవుని సంతృప్తి పరచేందుకోసం మీరు వీటిని యూదా యాజకులకు ఇవ్వండి. ఆ యాజకులు నా కోసం, నా కొడుకుల కోసం ప్రార్థన చేసేందుకుగాను మీరు వాటిని వాళ్లకి ఇవ్వండి.
11 దీనికీ తోడు నా మరో ఆజ్ఞ: ఎవరైనా ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే అతని ఇంటి దూలాన్ని ఊడపీకి, దానితో అతని పొట్టలో పొడవాలి. అతని ఇంటిని ధ్వంసంచేసి, దాన్నొక రాళ్ల కుప్పగా మార్చాలి.
12 దేవుడు యెరూషలేములో తన నామమును ఉంచాడు. ఈ నా ఆజ్ఞను ధిక్కరించ ప్రయత్నించే వ్యక్తి ఒక రాజైనా, మరొకడెవడైనా, అతన్ని ఆ దేవుడు ఓడిస్తాడని నేను ఆశిస్తున్నాను, యెరూషలేములోని ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ఏ వ్యక్తి అయినా ప్రయత్నిస్తే, దేవుడు అతన్ని నాశనం చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
జాగ్రత్త, ఇది నా (దర్యావేషు రాజు) తిరుగులేని ఆజ్ఞ. దీన్ని విధిగా వెంటనే, పూర్తిగా పాటించాలి!
దేవాలయ నిర్మాణ పనిపూర్తి, ప్రతిష్ఠ
13 సరే, యూఫ్రటీసు నది పశ్చమ ప్రాంత పాలనాధికారి తత్తెనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు దర్యావేషు రాజు ఆజ్ఞను సంపూర్ణంగా పాటించారు. 14 దానితో, యూదుల పెద్దలు (నాయకులు) నిర్మాణ కృషిని కొనసాగించారు. ప్రవక్త హగ్గయి, ఇద్దో కొడుకు జెకర్యాల ప్రోత్సాహంతో వాళ్లు జయప్రదమయ్యారు. వాళ్ల దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞాపాలన క్రమంలో యీ పని పూర్తయింది. ఈ పని పూర్తయ్యేందుకు పారసీక రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆజ్ఞలు పాలింపబడటం కూడా కారణమే. 15 దేవాలయ నిర్మాణం అదారు నెల, మూడవ రోజున[b] దర్వావేషు రాజు పాలన ఆరవ ఏట[c] పూర్తయింది.
16 అప్పుడిక ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, నిర్భంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన ఇతరులు ఆ దేవాలయ ప్రతిష్ఠను పెద్ద పండుగలా, ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.
17 వాళ్లు దేవాలయ ప్రతిష్ఠ పండుగను యిలా జరుపుకున్నారు: వాళ్లు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపోతులను బలి ఇచ్చారు. వాళ్లు 12 మేకపోతులను ఇశ్రాయేలీయులందరి కొరకు పాపపరిహారార్థ బలిగాయిచ్డారు. అది ఒక్కొక్క వంశానికి ఒకటి చొప్పున 12 వంశాల ఇశ్రాయేలీయులకు. 18 అటు తర్వాత, యెరూషలేము దేవాలయంలో సేవల నిమిత్తం వాళ్లు తమ వంశాల్లోనూ, లేవీయులు తమ వంశాల్లోనూ, యాజకులను ఎంపిక చేశారు. వాళ్లీ కార్యక్రమాలను సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలోని నిబంధనల ప్రకారం చేశారు.
పస్కా పండుగ
19 [d] మొదటి నెల పద్నాల్గవ రోజున నిర్బంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన యూదులు పస్కా పండుగ జరుపుకున్నారు. 20 యాజకులు, లేవీయులు ఆ రోజున తమను తాము శుద్ధిచేసుకున్నారు. వాళ్లందరూ తమని తాము శుభ్రం చేసుకుని పస్కా పండుగ నాడు చేసుకునేందుకు సంసిద్ధులయ్యారు. లేవీయులు నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన యూదులందరి కోసం పస్కా పండుగ గొర్రెపిల్లల్ని బలియిచ్చారు. వాళ్లీ బలిని తమ సోదరులైన యాజకుల కోసం, తమకోసం ఇచ్చారు. 21 అలాగు, నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ పస్కా పండుగ భోజనం చేశారు. ఇతరులు స్నానాదులతో తమని తాము శుభ్రం చేసుకుని, ఆ దేశంలో నివసించే ఇతర మనుష్యుల అపరిశుభ్ర అంశాలనుంచి తమని తాము వేరు చేసుకున్నారు. అలా పరిశుద్ధులైన వాళ్లు కూడా పస్కా పండుగ భోజనంలో పాల్గొన్నారు. వాళ్లు సహాయం కోసం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దగ్గరకు పోగలిగేందుకు, వారు తమ్మును తాము వేరు చేసుకొని పరిశుద్ధ పరచుకొన్నారు. 22 వాళ్లు ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. అష్షూరు రాజు[e] మనోవైఖరిని మార్చి, యెహోవా వాళ్లకెంతో సంతోషం కలిగించాడు. దానితో, అష్షూరు రాజు దేవాలయ పునర్నిర్మాణ కృషిని సాగిం చేందుకు వాళ్లకి తోడ్పడ్డాడు.
ఏడుగురిని ఎన్నుకోవటం
6 యేసు అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో గ్రీకు భాషలో మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదులతో, “మా వితంతువుల్ని ప్రతి రోజు చేసే దానాల విషయంలో సరిగ్గా చూడటం లేదు” అని తగువు పెట్టుకొన్నారు.
2 అందువల్ల ఆ పన్నెండుమంది అపొస్తలులు అనుచరులందర్ని సమావేశ పరిచి ఈ విధంగా అన్నారు: “అన్నదానాల విషయం చూడటానికోసం మేము దేవుని సందేశం యొక్క బోధ విషయంలో అశ్రద్ధ వహించటం మంచిది కాదు. 3 సోదరులారా! పవిత్రాత్మ సంపూర్ణంగా గలవాళ్ళను, పూర్ణ జ్ఞానం కలవాళ్ళను ఏడుగురిని మీలోనుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత వాళ్ళకప్పగిస్తాం. 4 మేము మా కాలాన్ని ప్రార్థనలకు, దేవుని సందేశాన్ని ఉపదేశించటానికి వినియోగిస్తాము.”
5 అపొస్తలులు చెప్పింది వాళ్ళకందరికీ బాగా నచ్చింది. వాళ్ళు స్తెఫనును ఎన్నుకొన్నారు. స్తెఫను దేవుని పట్ల గొప్ప విశ్వాసం గలవాడు. అతనిలో పవిత్రాత్మ సంపూర్ణంగా ఉంది. అతణ్ణే కాక ఫిలిప్పును, ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, నీకొలాసును కూడా ఎన్నుకొన్నారు. ఈ నీకొలాసు అంతియొకయకు చెందినవాడు. పూర్వం యూదుల మతంలో చేరినవాడు. 6 ప్రజలు వీళ్ళను అపొస్తలుల ముందుకు పిలుచుకొని వచ్చారు. అపొస్తలులు ప్రార్థించి తమ చేతుల్ని వాళ్ళపై ఉంచారు.
7 దేవుని సందేశం ప్రచారమైంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది యాజకులు విశ్వసించారు.
స్తెఫనును బంధించటం
8 దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. 9 కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు. 10 కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు.
11 ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు. 12 అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్నికూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు.
13-14 తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు. 15 సభలో కూర్చొన్నవాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.
© 1997 Bible League International