M’Cheyne Bible Reading Plan
ఆదాము కుటుంబ చరిత్ర
5 ఆదాము[a] వంశాన్ని గూర్చిన గ్రంథం ఇది. దేవుడు తన పోలికలో మనిషిని (ఆదామును) చేశాడు. 2 ఒక పురుషుణ్ణి, మరో స్త్రీని దేవుడు చేశాడు. వాళ్లిద్దర్నీ చేసిన రోజున ఆయన వాళ్లను ఆశీర్వదించి, అప్పుడు వాళ్లకు మనుష్యులు అని పేరు పెట్టాడు.
3 ఆదాముకు 130 సంవత్సరముల వయస్సు వచ్చాక ఇంకో కుమారునికి తండ్రి అయ్యాడు. ఈ కుమారుడు అచ్చం ఆదాములాగే ఉన్నాడు. ఆదాము తన కుమారునికి షేతు అని పేరు పెట్టాడు. 4 షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరములు బ్రతికాడు. ఆ కాలంలో ఆదాముకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 5 కనుక ఆదాము మొత్తం 930 సంవత్సరములు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
6 షేతుకు 105 సంవత్సరముల వయస్సులో ఎనోషు అనే ఒక కుమారుడు పుట్టాడు. 7 ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో షేతుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 8 కనుక మొత్తం 912 సంవత్సరాలు షేతు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
9 తొంబై సంవత్సరాల వయస్సు దాటిన తరువాత ఎనోషుకు కేయినాను అనే కుమారుడు పుట్టాడు. 10 కేయినాను పుట్టిన తర్వాత, ఎనోషు 815 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి యింకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 11 కనుక మొత్తం 905 సంవత్సరాలు ఎనోషు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
12 కేయినానుకు 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతినికి పుట్టాడు. 13 మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో కేయినానుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 14 కనుక కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
15 మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు యెరెదు అనే కుమారుడు అతనికి పుట్టాడు. 16 యెరెదు పుట్టిన తర్వాత, మహలలేలు 830 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 17 కనుక మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
18 యెరెదుకు 162 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత హనోకు అనే కుమారుడు పుట్టాడు. 19 హనోకు పుట్టిన తర్వాత, యెరెదు 800 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 20 కనుక యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
21 హనోకుకు 65 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత మెతూషెల అనే కుమారుడు అతనికి పుట్టాడు. 22 మెతూషెల పుట్టిన తర్వాత, హనోకు యింకా 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 23 కనుక హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు. 24 హనోకు దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ఒకనాడు దేవుడు హనోకును తనతో తీసుకుపోయాడు గనుక అతడు కనబడకుండా పోయాడు.
25 మెతూషెలకు 187 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత లెమెకు అనే కుమారుడు పుట్టాడు. 26 లెమెకు పుట్టిన తర్వాత, మెతూషెల 782 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 27 కనుక మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించాడు. అతడు అప్పుడు మరణించాడు.
28 లెమెకు వయస్సు 182 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు. 29 లెమెకు తన కుమారునికి నోవహు[b] అని పేరు పెట్టాడు. “దేవుడు భూమిని శపించాడు గనుక వ్యయసాయదారులమైన మనం చాలా కష్టపడి పని చేస్తున్నాం. అయితే నోవహు మనకు నెమ్మది కలుగజేస్తాడు” అన్నాడు లెమెకు.
30 నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరములు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 31 కనుక లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
32 నోవహుకు 500 సంవత్సరములు దాటిన తర్వాత షేము, హాము, యాఫెతు అనే కుమారులు పుట్టారు.
కొండ మీద ఉపదేశం
(లూకా 6:20-23)
5 యేసు ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ మీదికి వెళ్ళి కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళారు. 2 యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలు పెట్టాడు:
3 “ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం.
కనుక వాళ్ళు ధన్యులు.
4 దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు.
కనుక వాళ్ళు ధన్యులు.
5 నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు.
కనుక వాళ్ళు ధన్యులు.
6 అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్ళకు ప్రతిఫలం దొరకుతుంది.
కనుక వాళ్ళు ధన్యులు.
7 దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది.
కనుక వాళ్ళు ధన్యులు.
8 శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు.
కనుక వాళ్ళు ధన్యులు.
9 శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు.
కనుక శాంతి స్థాపకులు ధన్యులు.
10 నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం.
కనుక వాళ్ళు ధన్యులు.
11-12 “నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు.
ఉప్పు—వెలుగు
(మార్కు 9:50; 4:21; లూకా 14:34-35; 8:16)
13 “మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు.
14 “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం. 15 దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది. 16 అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు.
ధర్మశాస్త్రాన్ని గురించి ఉపదేశం
17 “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను. 18 ఇది సత్యం. భూమి, ఆకాశం గడచి పోయేలోపుల అన్ని సంగతులు, ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం, పొల్లుతో సహా నెరవేరుతాయి.
19 “ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దుచేసిన వాడును, తనలాగే చెయ్యమని బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువ వాడుగా ఎంచబడుతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు. 20 ఎందుకంటే, మీరు శాస్త్రులకన్నా, పరిసయ్యుల[a] కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడక పోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను.
హత్య చెయ్యరాదు
21 “పూర్వంలో ‘హత్య చేయరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది’ అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. 22 కాని నేను చెప్పేదేమిటంటే తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు. తన సోదరుణ్ణి “పనికిమాలినవాడా” అన్న ప్రతి వ్యక్తి మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి “మూర్ఖుడా!” అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది.
23-24 “మీరు, మీ కానుకను బలిపీఠం దగ్గరవుంచటానికి ముందు, మీ సోదరునికి మీపై ఏ కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. వెళ్ళి, మీ సోదరునితో ముందు రాజీ పడండి. ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి.
25 “మీరు, మీ ప్రతివాదితో దారిలో ఉన్నప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోండి. అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు. ఆ భటుడు మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు. 26 ఇది సత్యం. మీరు చెల్లించవలసిన చివరికాసు చెల్లించే వరకు మీరా కారగారం నుండి బయటపడరు.
వ్యభిచారం చేయరాదు
27 “‘వ్యభిచారం చేయరాదు’(A) అని చెప్పటం మీరు విన్నారు. 28 కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ వైపు కామంతో చూసినవాడు, హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు. 29 మీరు పాపం చెయ్యటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. 30 మీరు పాపం చెయ్యటానికి మీ కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది.
విడాకులను గురించి బోధించటం
(మత్తయి 19:9; మార్కు 10:11-12; లూకా 16:18)
31 “‘తన భార్యకు విడాకులివ్వదలచిన వ్యక్తి ఆమెకు ఒక విడాకుల పత్రం ఇవ్వాలి’(B) అని చెప్పే వాళ్ళు. 32 కాని నేను చెప్పేదేమంటే భార్య మీద వ్యభిచార కారణంలేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె వ్యభిచారిణిగా పరిగణింప బడటానికి అతడు కారకుడౌతాడు. అలా విడాకులు పొందిన స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. వ్యభిచార కారణాన మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే కారణాన కాదు.
ప్రమాణాలు
33 “అంతేకాక మాట తప్పకండి. ‘ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి,’ అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. 34 కాని నేను చెప్పేదేమిటంటె, దేని మీదా ప్రమాణం చెయ్యకండి, ఆకాశం దేవుని సింహాసనం కనుక ఆకాశం మీద ప్రమాణం చెయ్యకండి. 35 భూమి దేవుని పాదపీఠం కనుక భూమ్మీద ప్రమాణం చెయ్యకండి. యెరూషలేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చెయ్యకండి. 36 మీ తలపై ఉన్న ఒక్క వెంట్రుకను కూడా తెలుపుగా కాని, నలుపుగా కాని మార్చలేరు. కనుక, మీ తలపై ప్రమాణం చెయ్యకండి. 37 మీరు ‘ఔను’ అని అనాలనుకొంటే ఔననండి. ‘కాదు’ అని అనాలనుకొంటే కాదనండి. మరేవిధమైన ప్రమాణం మీ నుండి వచ్చినా దానికి కారణం ఆ సైతానే.
కంటికి కన్ను
(లూకా 6:29-30)
38 “‘కంటికి కన్ను, పంటికి పన్ను ఊడ దీయాలి’(C) అని అనటం మీరు విన్నారు. 39 కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. 40 ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి. 41 ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి. 42 అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి.
శత్రువులను ప్రేమించు
(లూకా 6:27-28, 32-36)
43 “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’(D) అని చెప్పటం మీరు విన్నారు. 44 కాని నేను చెప్పేదేమిటంటే ‘మీ శత్రువుల్ని ప్రేమించండి[b] మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి.’ 45 అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. 46 మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా? 47 మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే! 48 పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.
5 ఆ కాలంలో ప్రవక్తలైన హగ్గయి,[a] ఇద్దో కొడుకు జెకర్యా[b] దేవుని పేరట ప్రవచించారు. యూదా, యెరూషలేములోని యూదులను వాళ్లు ప్రోత్సహించారు. 2 దానితో, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవలు యెరూషలేములోని దేవాలయ నిర్మాణ కృషిని తిరిగి ప్రారంభించారు. దేవుని ప్రవక్తలందరూ వారితో ఉండి, ఆ పనికి తోడ్పడుతూ వచ్చారు. 3 ఆ కాలంలో యూఫ్రటీసునది పశ్చిమ ప్రాంతానికి తత్తెనైయు అధిపతి. తత్తెనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు నిర్మాణ కృషి సాగిస్తున్న జెరుబ్బాబెలు, యేషూవ, తదితరుల వద్దకు వెళ్లి, “ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి, దీన్ని సరికొత్తదానిగా రూపొందించడానికి మీకు ఎవరు అనుమతినిచ్చారు?” అని నిలదీశారు. 4 అంతేకాదు, వాళ్లు జెరుబ్బాబెలును, “ఈ భవనం పని చేస్తున్న వాళ్ల పేర్లు యేమిటి?” అని కూడా ప్రశ్నించారు.
5 అయితే, యూదా నాయకుల మీద దేవుని దృష్టివుంది. దర్యావేషు రాజుకి భవన నిర్మాతలు లేఖలు పంపుకున్నారు. రాజు సమాధానం పంపేదాకా, వాళ్లు పనిని నిలుపు చేయవలసిన అవసరం లేకపోయింది. వాళ్లు తమ నిర్మాణ కృషిని కొనసాగించారు.
6 యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతాధిపతి అయిన తతైనైయు, షతర్బోజ్నయి, వారి ముఖ్య సహోద్యోగులు దర్యావేషు రాజుకి ఒక లేఖ పంపారు. 7 ఆ లేఖ నకలు ఇది:
దర్యావేషు రాజుకి,
శుభం!
8 దర్యావేషు రాజుకి మేము ఇందు మూలంగా తెలియజేసేది ఏమంటే, తమ ఆదేశం మేరకు యూదా రాజ్యంలో గొప్ప దేవుని ఆలయానికి మేము వెళ్లాము. యూదాలోని ప్రజలు ఆ ఆలయాన్ని పెద్దపెద్ద రాళ్లతో కడుతున్నారు. గోడల్లో వాళ్లు పెద్ద దూలాలు పరుస్తున్నారు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. వాళ్లు చాలా వేగంగా నిర్మాణం సాగిస్తున్నారు. త్వరలోనే పనిపూర్త వుతుంది.
9 వాళ్లు చేస్తున్న పనిని గురించి మేము వాళ్ల నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడిగాము. “ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించేందుకూ, కొత్తదానిగా దాన్ని రూపొందించేందుకూ మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని మేము ప్రశ్నించాము. 10 మేము వాళ్ల పేర్లు కూడా అడిగాము. వాళ్లెవరో మీరు తెలుసు కోగలిగేందుకు వీలుగా మేము వాళ్ల పేర్లు వ్రాసి పెట్టాలని అనుకున్నాము.
11 వాళ్లు మాకు ఇచ్చిన సమాధానం యిది:
“మేము భూ, పరలోకాల అధిపతియైన యెహోవా దేవుని సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు మహారాజొకడు నిర్మించి ముగించిన దేవాలయాన్ని మేమిప్పుడు తిరిగి నిర్మిస్తున్నాం. 12 కాని, మా పూర్వీకులు దేవునికి కోపం తెప్పించారు. ఆయన వారిని బబులోను రాజైన నెబుకద్నెజరుకు లోబరిచాడు. నెబుకద్నెజరు ఈ దేవాలయాన్ని నిర్మూలించాడు, ప్రజలను బలవంతాన బబులోనుకు బందీలుగా తీసుకుపోయాడు. 13 అయితే, కోరెషు రాజు దేవాలయం తిరిగి నిర్మింపబడాలని ఒక ప్రత్యేకాజ్ఞ జారీ చేశాడు. 14 కోరెషు గతంలో యెహోవా దేవాలయం నుంచి కొల్లగొట్టిన వెండి, బంగారు వస్తువులను బబులోనులోని అబద్ధపు దేవత ఆలయంనుంచి బయటికి తీయించాడు. నెబుకద్నెజరు గతంలో ఆ వస్తువులను యెరూషలేములోని ఆలయం నుంచి కొల్లగొట్టి, వాటిని బబులోను లోని తన అబద్ధపు దేవత దేవాలయంలో ఉంచాడు. ఇప్పుడు కోరెషు రాజు ఆ వెండి, బంగారు వస్తువులను షేష్బజ్జరుకు ఇచ్చాడు. కోరెషు షేష్బజ్జరును ప్రాంతీయాధికారిగా నియమించాడు.”
15 కోరెషు షేష్బజ్జరును ఇలా ఆదేశించాడు: “నువ్వీ వెండి, బంగారు వస్తువులను తీసుకుపోయి, వాటిని తిరిగి యెరూషలేములోని దేవాలయంలో పెట్టు. గతంలో ఉన్న చోటనే దేవాలయాన్ని తిరిగి నిర్మింప జేయి.”
16 షేష్బజ్జరు వచ్చి, యెరూషలేములోని దేవాలయానికి పునాదులు నిర్మించాడు. ఆనాటి నుంచి నేటిదాకా పని కొనసాగింది. అయితే, ఆ పని యింకా పూర్తి కాలేదు.
17 ఇప్పుడిక, తమకి సమ్మతమైతే, రాజుగారి ఆధికారిక, చారిత్రక పత్రాలను గాలించండి. యెరూషలేములో దేవాలయం నిర్మించుమని కోరెషు రాజు ఆజ్ఞ జారీ చేశాడన్న మాట నిజమేనేమో పరిశీలించుము. తర్వాత తమరీ విషయంలో తీసుకున్న నిర్ణయమేమిటో దయచేసి మాకొక లేఖద్వారా తెలియజేయండి.
అననీయ మరియు సప్పీరా
5 “అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు. 2 “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు.
3 అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా, నీ మనస్సులో సాతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు? 4 అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”
5 ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనని విన్నవాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. 6 కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు.
7 మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు. 8 పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు.
“ఔను! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది.
9 పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసినవాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు. 10 తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు. 11 సంఘానికి, ఈ సంఘటనలు విన్నవాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది.
అనేకులను నయం చేయటం
12 అపొస్తలులు, విశ్వాసులు ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు. 13 ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతావాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు. 14 చాలా మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు. 15 ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్నవాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. 16 ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలనుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్నవాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్నవాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది.
అపొస్తలులు హింసించబడటం
17 సద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు అసూయతో నిండిపోయారు. 18 వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు. 19 కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు. 20 వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు. 21 దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలు పెట్టారు.
ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు. 22-23 భటులు కారాగారానికి వచ్చారు. కాని వాళ్ళకు అపొస్తలులు కనపడలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళి, “మేము కారాగారపు ద్వారాలు భద్రంగా తాళం వేయబడి ఉండటం చూసాము. ద్వారపాలకులు ద్వారాల దగ్గర ఉండటం చూసాము. కాని ద్వారాలు తెరిచి చూస్తే అపొస్తలులు లేరు” అని చెప్పారు. 24 ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు వాళ్ళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్యపడ్డారు.
25 ఇంతలో ఒకడు వచ్చి, “మీరు కారాగారంలో ఉంచినవాళ్ళు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. 26 ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకొని వాళ్ళను పట్టుకు రావటానికి వెళ్ళాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారనే భయం వాళ్ళలో ఉంది. కనుక అపొస్తలులపై వాళ్ళు ఏ దౌర్జన్యం చేయలేదు.
27 అపొస్తలుల్ని పిలుచుకు వచ్చి మహాసభ ముందు నిలుచోబెట్టారు. ప్రధాన యాజకుడు విచారణ చేస్తూ, 28 “మీ యేసు పేరిట బోధించవద్దని మేము యిది వరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము. అయినా యెరూషలేమంతా మీ బోధలతో నింపివేసారు. అంతేకాక అతని మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు” అని అన్నాడు.
29 పేతురు, మిగతా అపొస్తలులు యిలా అన్నారు: “మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, మానవుల ఆజ్ఞల్ని కాదు. 30 మీరు సిలువకు వ్రేలాడదీసి చంపిన యేసును మా పూర్వికుల దేవుడు బ్రతికించాడు. 31 దేవుడు ఆయనకు తన కుడి వైపుననున్న స్థానాన్నిచ్చాడు. ఆయన్ని ఒక అధిపతిగా, రక్షకుడిగా నియమించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం. 32 వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.”
33 ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపొస్తలులను చంపాలనుకున్నారు. 34 కాని “గమలీయేలు” అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండితుడు. ప్రజల గౌరవం పొందినవాడు. 35 అతడు వాళ్ళని సంబోధిస్తూ, “ఇశ్రాయేలు ప్రజలారా! వీళ్ళను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి! 36 ఇదివరలో థూదా కనిపించి తానొక గొప్పవాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు నాలుగువందలమంది అతణ్ణి అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదిరిపోయారు. చివరకు ఏమీ మిగల్లేదు. 37 అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అనే వాడు వచ్చి ప్రజల్ని చేరదీసి తిరుగుబాటు చేసాడు. ఇతడు గలిలయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు. 38 అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది: వాళ్ళ విషయం పట్టించుకోకండి! వాళ్ళను వదిలివేయండి! వాళ్ళ కార్యము, వాళ్ళ ఉద్దేశ్యము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది. 39 అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్ళను ఆపలేరు. అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళౌతారు” అని అన్నాడు.
40 సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపొస్తలుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి వేసారు. 41 అపొస్తలులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహాసభనుండి వెళ్ళిపోయారు. 42 ప్రతి రోజూ మందిరంలో, ఇంటింటా “యేసే క్రీస్తు” అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు.
© 1997 Bible League International