M’Cheyne Bible Reading Plan
ప్రథమ కుటుంబం
4 ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయీను[a] అని నామకరణం జరిగింది. హవ్వ “యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను” అంది.
2 ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయీనుకు తమ్ముడు. అతనికి హేబెలు అని నామకరణం చేశారు. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను వ్యవసాయదారుడయ్యాడు.
ప్రథమ హత్య
3-4 కోతకాలంలో కయీను యెహోవాకు ఒక అర్పణను తెచ్చాడు. నేలనుండి తాను పండించిన ఆహార పదార్థాన్ని కయీను తెచ్చాడు. హేబెలు తన మందలో నుండి కొన్ని మంచి బలిసిన తొలిచూలు గొర్రెల్ని తెచ్చాడు.
హేబెలును, అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. 5 అయితే కయీనును, అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయీను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చేసింది. 6 యెహోవా కయీనును అడిగాడు: “నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం అలా విచారంగా ఉందేమిటి? 7 నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. అప్పుడు నిన్ను నేను అంగీకరిస్తాను. కాని నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకొంటుంది. కానీ నీవే ఆ పాపమును[b] అదుపులో పెట్టాలి.”
8 “మనం పొలంలోకి వెళ్దాం రా” అన్నాడు కయీను తన తమ్ముడైన హేబెలుతో. కనుక కయీను, హేబెలు పొలంలోకి వెళ్లారు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేశాడు.
9 తర్వాత, “నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు?”
అంటూ కయీనును యెహోవా అడిగాడు. “నాకు తెలియదు. నా తమ్ముణ్ణి కాపలా కాయడం, వాణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకోవడమేనా నా పని?” అని కయీను జవాబిచ్చాడు.
10 అప్పుడు యెహోవా యిలా అన్నాడు, “నీవు చేసింది ఏమిటి? నీవే నీ తమ్ముణ్ణి చంపేసావు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొర పెట్టుతూ వుంది. 11 (నీవు నీ తమ్ముణ్ణి చంపావు) నీ చేతులనుండి అతని రక్తాన్ని తీసుకోవటానికి భూమి నోరు తెరచుకుంది. భూమిమీద నుండి నీవు శపించబడ్డావు. 12 ఇది వరకు నీవు మొక్కలు నాటుకొన్నావు. అవి చక్కగా పెరిగాయి. కాని ఇప్పుడు నీవు మొక్కలు నాటినా, నీ మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోటు నుండి మరొక చోటుకు నీవు తిరుగుతూ ఉంటావు.”
13 అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించలేని శిక్ష! 14 చూడు! నన్ను ఈ భూమిని విడిచిపెట్టేటట్లు నీవు బలవంతం చేశావు. నేను నీనుండి వెళ్లిపోయి దాగుకొంటాను. (నీ రక్షణనుండి దూరంగా వెళ్తాను). నేనిక్కడ, అక్కడ తిరుగుతుంటాను. నన్ను ఎవరు చూస్తారో వాళ్లు నన్ను చంపేస్తారు.”
15 అప్పుడు కయీనుతో యెహోవా ఇలా అన్నాడు: “నేను అలా జరుగనివ్వను! కయీనూ, నిన్ను ఎవరైనా చంపితే, నేను వారిని మరింతగా శిక్షిస్తా.” తరువాత కయీనుకు యెహోవా ఒక గుర్తు వేశాడు. ఎవ్వరూ అతణ్ణి చంపకూడదు అని ఈ గుర్తు సూచిస్తుంది.
కయీను కుటుంబం
16 అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు. ఏదెనుకు తూర్పునవున్న నోదు దేశములో కయీను నివసించాడు.
17 కయీను తన భార్యతో కలిసినప్పుడు ఆమె గర్భవతియై హనోకు అనే కుమారుని కన్నది. కయీను ఒక పట్టణం కట్టించి తన కుమారుడైన హనోకు పేరు దానికి పెట్టాడు.
18 హనోకుకు ఈరాదు అనే కుమారుడు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు అనే కుమారుడు పుట్టాడు. మహూయాయేలుకు మతూషాయేలు అనే కుమారుడు పుట్టాడు. మతూషాయేలుకు లెమెకు అనే కుమారుడు పుట్టాడు.
19 లెమెకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. ఒక భార్య పేరు ఆదా, మరొక భార్య పేరు సిల్లా. 20 ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. గుడారములలో నివసిస్తూ, పశువులను పెంచుట ద్వారా జీవనోపాధి సంపాదించుకొనే ప్రజలందరికి యాబాలు తండ్రి. 21 ఆదాకు యూబాలు అనే మరో కుమారుడు ఉన్నాడు. (యూబాలు యాబాలు సోదరుడు.) సితారాను, పిల్లన గ్రోవిని ఊదేవారందరికిని యూబాలు తండ్రి. 22 సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. ఇత్తడి, యినుము పనులు చేసే వాళ్లందరికీ తూబల్కయీను తండ్రి. తూబల్కయీను సోదరికి నయమా అని పేరు పెట్టబడింది.
23 లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు:
“ఆదా, సిల్లా, నా మాట వినండి!
లెమెకు భార్యలారా, నేను చెప్పే సంగతులను వినండి:
ఒకడు నన్ను గాయపర్చాడు కనుక నేను వాడ్ని చంపేశాను.
ఒక పిల్లవాడు నన్ను కొట్టగా నేనతనిని చంపేశాను.
24 కయీనును చంపినందుకు శిక్ష చాలా అధికం!
కనుక నన్ను చంపినందుకు శిక్ష మరి ఎంతో అధికంగా ఉంటుంది.”
ఆదాము హవ్వలకు షేతు పుట్టుట
25 ఆదాము హవ్వతో కలిసినప్పుడు హవ్వ మరో కుమారుణ్ణి కన్నది. ఈ కుమారునికి షేతు అని పేరు పెట్టారు. నాకు ఇంకో కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. కయీను హేబెలును చంపాడు, అయితే ఇప్పుడు నాకు షేతు ఉన్నాడు అంది హవ్వ. 26 షేతుకు కూడ ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోషు అని అతడు పేరు పెట్టాడు. ఆ సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించటం మొదలుబెట్టారు.
యేసుకు కలిగిన పరీక్షలు
(మార్కు 1:12-13; లూకా 4:1-13)
4 ఆ తర్వాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. 2 అక్కడ యేసు నలభై రోజులు ఉపవాసం చేసాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది. 3 సైతాను ఆయన దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు” అని అన్నాడు.
4 యేసు సమాధానంగా,
“‘మనుష్యులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు.
కాని దేవుడు పలికిన ప్రతి మాటవలన బ్రతకగలడు’(A)
అని వ్రాసారు” అని అన్నాడు.
5 ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచో బెట్టి, 6 “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఎందుకంటే,
‘నీకు సహాయం చెయ్యమని, దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు.
వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికీ తగలకుండా
నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకొంటారు,’(B)
అని వ్రాసివుంది కదా!” అని అన్నాడు.
7 యేసు వానితో,
“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు!’(C)
అని కూడా వ్రాసి వుంది” అని అన్నాడు.
8 సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదికి తీసుకు వెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను, వాటి వైభవాన్ని చూపి, 9 “నీవు నా ముందు మోకరిల్లి నన్ను పూజిస్తే వీటన్నిటిని నీకిస్తాను” అని అన్నాడు.
10 యేసు:
“సైతానా! నా ముందునుండి వెళ్ళిపో!
ఎందుకంటే ‘నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన సేవ మాత్రమే చెయ్యాలి!’(D)
అని కూడా వ్రాసి ఉంది” అని అన్నాడు.
11 అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసారు.
గలిలయలో యేసుని సేవా ప్రారంభం
(మార్కు 1:14-15; లూకా 4:14-15)
12 యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలిలయకు తిరిగి వచ్చాడు. 13 ఆయన నజరేతును వదిలి, అక్కడి నుండి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించాడు. కపెర్నహూము, జెబూలూను మరియు నఫ్తాలి ప్రాంతంలోని సరస్సు ఒడ్డున ఉంది. 14 ఈయన ఇలా చెయ్యటం వల్ల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమయ్యాయి. యెషయా ప్రవక్త ఈ విధంగా అన్నాడు:
15 “జెబూలూను ప్రాంతమా! నఫ్తాలి ప్రాంతమా!
సముద్రం ప్రక్కన ఉన్న ఓ జనమా! యొర్దాను నదికి అవతలి వైపుననున్న ప్రదేశమా!
యూదులుకాని వాళ్ళు నివసించే ఓ గలిలయా!
16 చీకట్లో నివసిస్తున్న ప్రజలు
గొప్ప వెలుగును చూసారు!
మృత్యుఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న
ప్రజలపై వెలుగు ప్రకాశించింది.”(E)
17 ఆ నాటి నుండి యేసు, “దేవుని రాజ్యం దగ్గర లోనే వుంది. కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించటం మొదలు పెట్టాడు.
యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం
(మార్కు 1:16-20; లూకా 5:1-11)
18 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సీమోనును, అతని సోదరుడు అంద్రెయను చూశాడు. ఈ సోదరులు చేపలు పట్టేవారు. వాళ్ళు అప్పుడు నీళ్ళల్లో వల వేస్తూ ఉన్నారు. 19 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి! మీరు మనుష్యుల్ని పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. 20 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.
21 యేసు అక్కడ నుండి వెళ్తూ మరో యిద్దర్ని చూశాడు. వాళ్ళు కూడా సోదరులు. ఒకని పేరు యాకోబు, మరొకని పేరు యోహాను. తండ్రి పేరు జెబెదయి. ఆ సోదరులు తమ తండ్రితో కలసి పడవలో కూర్చొని వలను సరిచేసుకొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు. 22 వాళ్ళు వెంటనే పడవను, తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు.
యేసు బోధించి రోగులను నయం చేయటం
(లూకా 6:17-19)
23 యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతమంతా పర్యటించాడు. ఆయన ప్రతి రోగిని, బాధపడ్తున్న ప్రతి వ్యక్తిని బాగు చేసాడు. 24 ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపిస్తూవుండింది. ప్రజలు రకరకాల రోగాలు ఉన్నవాళ్ళను, బాధ పడ్తున్న వాళ్ళను, దయ్యాలు పట్టిన వాళ్ళను, మూర్చరోగుల్ని, పక్షవాత రోగుల్ని, ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. ఆయన వాళ్ళను నయం చేశాడు. 25 గలిలయ నుండి, దెకపొలి[a] నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను నది అవతలి వైపుననున్న ప్రాంతాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
దేవాలయ పునర్నిర్మాణానికి విరోధులు
4 1-2 ఆ ప్రాంతంలో నివసించే చాలామంది యూదా, బెన్యామీను జాతీయులకు విరోధులు. చెర నుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు దేవాలయం నిర్మిస్తున్నారని విన్న ఆ శత్రువులు జెరుబ్బాబెలు దగ్గరకీ, వంశ పెద్దల దగ్గరికీ వచ్చి, “నిర్మాణంలో మీకు మమ్మల్ని తోడ్పడనివ్వండి. మేమూ మీలాంటివాళ్లమే. మీ దేవుణ్ణి సహాయం నిమిత్తం మేమూ అర్థిస్తాము. అష్షూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఇక్కడికి తెచ్చినప్పట్నుంచీ మేము మీ దేవునికే బలులు సమర్పించాము” అన్నారు.
3 కాని, జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలుకు చెందిన ఇతర వంశాల పెద్దలూ వాళ్లకి ఇలా సమాధానం చెప్పారు: “కుదరదు, మా దేవుని ఆలయ నిర్మాణంలో మాకు తోడ్పడే అవకాశం మీకు లేదు. యెహోవాకు ఆలయ నిర్మాణం చేసే హక్కు మాది మాత్రమే. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. ఇది పారశీక రాజు కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ.”
4 ఈ మాటలతో వాళ్లకి కోపం వచ్చింది. దానితో వాళ్లు యూదులకు ఇబ్బందులు కలిగించ నారంభించారు. దేవాలయం నిర్మించకుండా యూదులను వాళ్లు నిరుత్సాహపరచి, నిరోధించసాగారు. 5 వాళ్లు ప్రభుత్వాధికారులకు లంచాలిచ్చి, వాళ్లు యూదా ప్రజలకు వ్యతిరేకంగా పని చేసేలా చూశారు. ఆ అధికారులు యూదుల దేవాలయ నిర్మాణ పథకాలను భగ్నం చేసేందుకు నిరంతరం కృషిచేశారు. కోరెషు పారశీక రాజుగా వున్నకాలంలో దర్యావేషు పారశీక రాజు అయ్యేంత వరకూ వాళ్ల యీ ప్రయత్నం కొనసాగింది.
6 యూదులను అడ్డుకొనేందుకుగాను ఆ శత్రువులు పారశీక రాజుకి లేఖలు సైతం వ్రాశారు. అహష్వేరోషు[a] రాజు అయిన ఏడాది వాళ్లొక లేఖ వ్రాశారు.
యెరూషలేము పునర్నిర్మాణానికి విరోధులు
7 ఆ తరువాత అర్తహషస్త[b] పారశీకానికి కొత్తగా రాజు అయిన కాలంలో, వాళ్లలో కొందరు యూదులమీద నిందారోపణలు చేస్తూ లేఖలు వ్రాశారు. అలా వ్రాసినవాళ్లు: బిష్లాము, మిత్రదాతు, టాబెయేలు, ఆ బృందానికి చెందిన ఇతరులు. వాళ్లు అర్తహషస్తకు ఆ లేఖలు అరమేయికు[c] భాషలో, అరమేయికు లిపిలో వ్రాశారు.
8 [d] అప్పుడు ప్రాంతీయాధికారి రెహూమూ, కార్యదర్శి షిమ్షయి కూడా యెరూషలేము ప్రజలకి వ్యతిరేకంగా ఒక లేఖ వ్రాసి, పారసీక రాజు అర్తహషస్తకి పంపారు. ఆ లేఖలో వాళ్లిలా వ్రాశారు.
9 ప్రాంతీయాధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయీ, న్యాయమూర్తులు, టర్పెలాయేలు, పారశీకం, అర్కె, బబులోను, సూసాకి చెందిన ఏలాము మరియు ఇతర ప్రాంతాల ప్రజలమీది ముఖ్యాధికారులు, 10 గొప్పవాడైన బలవంతుడైన అషురుబానిపాలు సమరియా నగరానికీ, యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతాలకూ తరలించిన ప్రజల మహజరు.
11 అర్తహషస్త ప్రభువుకి, యూఫ్రటీసు నదియొక్క పశ్చిమాన నివసించే తమ దాసులు చేసుకున్న విన్నపం:
12 అర్తహషస్త మహారాజుగారికి, తమరు తమవద్ద నుంచి పంపివేసిన యూదులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ యూదులు ఇప్పుడా నగరాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. యెరూషలేము ఒక చెడ్డ నగరం. ఆ నగర ప్రజలు ఎల్లప్పుడూ ఇతర రాజుల మీద తిరగబడుతూవచ్చారు. ఇప్పుడు యూదులు పునాదులు కట్టుదిట్టంచేసి, ప్రాకారాలు కడుతున్నారు.[e]
13 అంతేకాదు అర్తహషస్త మహాప్రభూ, యెరూషలేము నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యెరూషలేము ప్రజలు తమ వృత్తిపన్నులు చెల్లించడం నిలిపేస్తారు. తమ గౌరవార్థం డబ్బు పంపడం మానేస్తారు. వాళ్లు సుంకం పన్నులు చెల్లించడం కూడా మానేస్తారు. ఏలినవారికి ఆ సొమ్మంతా నష్టమవుతుంది.
14 ప్రభువుల పట్ల మాకు బాధ్యతవుంది. తమకీ నష్టాలు వాటిల్లడం మేము చూడలేము. అందుచేతనే తమకీ విషయాలు తెలియజేసుకుంటున్నాము.
15 అర్తహషస్త మహారాజా, తమకు పూర్వం రాజ్యమేలిన రాజులు వ్రాయించిన చరిత్ర పత్రాలు తమరు పరిశీలించండి. ఆ పత్రాలవల్ల యెరూషలేము ఎల్లప్పుడూ యితర రాజులకు వ్యతిరేకంగా తిరుగబడినట్లు తమకు తెలియవస్తుంది. ఇతర రాజులకూ, రాజ్యాలకూ వీళ్ల తిరుగుబాట్లు పెద్దకీడుగా పరిణమించాయి. ప్రాచీనకాలం నుంచి యీ నగరంలో అనేక తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి! యెరూషలేము నాశనం చేయబడినది సరిగ్గా అందుకే!
16 అర్తహషస్త మహారాజా, ఈ నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతంమీద తమకు అదుపు తప్పిపోతుందని తమకు తెలియజేయాలని కోరుకుంటున్నాము.
17 అప్పుడు అర్తహషస్త రాజు వాళ్లకి ఇలా సమాధానం ఇచ్చాడు:
ప్రాంతీయాధికారి రెహూముకి, కార్యదర్శి షిమ్షయికి, సమరియాలోను, యూఫ్రటీసు నదికి పశ్చిమాన మీతో బాటు నివసించేవారికి,
శుభాకాంక్షలు.
18 మీరు మాకు పంపిన లేఖను అనువదించి మాకు వినిపించారు. 19 నా వెనుకటి రాజుల పత్రాలు గాలించవలసిందిగా నేను ఆదేశించాను. ఆ పత్రాలు చదివి వినిపించారు. రాజులకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసిన సుదీర్ఘ చరిత్ర యెరూషలేముకు ఉన్నట్లు మేము కనుగొన్నాము. యెరూషలేములో తరచూ పితూరీలు, తిరుగుబాట్లు సంభవించాయి. 20 యెరూషలేమునూ, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతమంతటినీ శక్తిసంపన్నులైన రాజులు పాలించారు. పన్నులు, రాజుల గౌరవార్థం కానుకలు, సుంకం పన్నులు ఆ రాజులకు చెల్లింపబడ్డాయి.
21 ఇప్పుడిక మీరు చేయవలసినది, వాళ్లని పని నిలిపివేయవలసినదిగా ఆజ్ఞ జారీ చేయడం. యెరూషలేము పునర్నిర్మాణం జరగకుండా మీరా ఆజ్ఞ ఇవ్వాలని నా ఆదేశం. 22 ఈ వ్యవహారంలో అశ్రద్ధ జరగకుండా మీరు జాగ్రత్తవహించాలి. మనం యెరూషలేము పునర్నిర్మాణాన్ని కొనసాగనివ్వరాదు. అదే జరిగితే మాకింక యెరూషలేమునుంచి ఎంత మాత్రమూ డబ్బు ముట్టదు.
23 అర్తహషస్త రాజు పంపిన ఈ లేఖ నకలు రెహూముకీ, కార్యదర్శి షిమ్షయికీ, వాళ్లతోవున్న ఇతర ప్రజలకు అందింది. దాన్ని చదివిన మీదట వాళ్లు వెంటనే యెరూషలేములోని యూదుల వద్దకు వెళ్లారు. ఆ యూదుల చేత నిర్మాణపు పనిని వాళ్లు బలవంతాన నిలిపివేయించారు.
దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోవుట
24 దానితో, యెరూషలేములోని యెహోవా దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోయింది.[f] పారసీక రాజు దర్యావేషు పాలన రెండవ సంవత్సరం[g] దాకా తిరిగి ఈ నిర్మాణ కృషి కొనసాగలేదు.
అపొస్తలులు మరియు యూదుల మహాసభ
4 యాజకులు, మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, సద్దూకయ్యులు కలిసి పేతురు, యోహాను ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఉపదేశిస్తూ ఉన్నారు. 2 ఆ అపొస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. 3 వాళ్ళు పేతురును, యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి ఉంచారు. 4 వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు అయిదు వేలదాకా పెరిగిపోయింది.
5 మరుసటి రోజు నాయకులు, పెద్దలు, పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు. 6 “అన్న” అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సంద్రు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందినవాళ్ళంతా ఆ సమావేశంలో ఉన్నారు. 7 పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. “ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” అని వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెట్టారు.
8 అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ప్రజా నాయకులారా! పెద్దరాలా! 9 ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని తెలుసుకోవాలనుకొంటున్నారా? 10 అలాగైతే మీరు, ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు.
11 ‘ఇల్లు కట్టువాళ్ళైన మీరు పారవేసిన రాయి ఈ యేసే!
ఇప్పుడది మూలకు తలరాయి అయింది.’(A)
12 రక్షణ యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు) తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.”
13 పేతురు, యోహాను చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని గ్రహించారు. 14 కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం చూసి యింకే ఆక్షేపణలు చెయ్యలేక పోయారు.
15 వాళ్ళను మహాసభనుండి వెళ్ళమని ఆజ్ఞాపించి పరస్పరం యిలా చర్చించుకొన్నారు: 16 “వీళ్ళనేం చెయ్యాలి? యెరూషలేము నివాసులందరికి వీళ్ళు అద్భుతమైన మహిమ చేసారని బాగా తెలుసు. మనం దాన్ని కాదనలేం. 17 కాని యిది ప్రజల్లో యింకా ఎక్కువగా వ్యాపించక ముందే యిక మీదట అతని పేరిట ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్ళను వారించాలి.”
18 వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. 19 కాని పేతురు, యోహాను వాళ్ళకు సమాధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, లేక దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి. 20 ఎందుకంటే మేము చూసినదాన్ని, విన్నదాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా వుండలేము” అని అన్నారు.
21 వాళ్ళు పేతురును, యోహానును యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు. 22 దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు.
విశ్వాసుల ప్రార్థన
23 విడుదలయ్యాక పేతురు, యోహాను తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధానయాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు. 24 ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. 25 నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు:
‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి?
ప్రజలెందుకు వృథాగా పన్నాగాలు పన్నుతున్నారు?
26 ‘రాజులు, పాలకులు కలిసి ప్రభువును,
ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’(B)
27 హేరోదు మరియు పొంతి పిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. 28 ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు. 29 ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు! 30 యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!”
31 వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.
విశ్వాసుల ఐకమత్యం
32 విశ్వాసుల మనస్సు, ఆత్మ ఒకే విధంగా ఉండేవి. ఎవ్వరూ “ఇది నాది” అని అనకుండా తమకున్న వాటిని ఇతర్లతో పంచుకొనేవాళ్ళు. 33 దైవికమైన శక్తితో అపొస్తలులు ప్రభువు బ్రతికి వచ్చాడని రుజువు చేసారు. దేవుని అనుగ్రహం వాళ్ళందరిపై సంపూర్ణంగా ఉంది. 34 వాళ్ళలో ఎవ్వరికీ ఏ కొరతలు ఉండేవి కావు. ఇండ్లు, పొలాలు ఉన్నవాళ్ళు వాటిని అమ్మి, 35 ఆ డబ్బును అపొస్తలుల పాదాల ముందుంచేవాళ్ళు. ఆ అపొస్తలులు అవసరమున్న ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచేవాళ్ళు.
36 యోసేపు అనే అతడు లేవి వంశీయుడు. ఇతడు సైప్రసు (కుప్ర) ద్వీపానికి చెందినవాడు. ఇతణ్ణి అపొస్తలులు బర్నబా (ప్రోత్సాహపు కుమారుడని ఈ పదానికి అర్థం) అని పిలిచేవాళ్ళు. 37 ఇతడు తన పొలాన్ని అమ్మి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల ముందుంచాడు.
© 1997 Bible League International