Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 2

ఏడవ రోజు-విశ్రాంతి

కనుక భూమి, ఆకాశం, వాటిలోని ప్రతిదీ పూర్తయింది. దేవుడు తాను చేస్తున్న పని ముగించాడు. కనుక ఏడవ రోజున దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకొన్నాడు. ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించి, దానిని పవిత్ర దినంగా చేశాడు. దేవుడు ప్రపంచాన్ని చేసేటప్పుడు జరిగించిన పని అంతటి నుండి ఆ రోజున విశ్రాంతి తీసుకొన్నాడు గనుక, ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేశాడు.

మొదటి మనిషి, ఏదెను తోట

ఇదే భూమి, ఆకాశం చరిత్ర. భూమిని, ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల విషయం ఇది. భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పొలాల్లో ఏమీ పెరగటం లేదు. అప్పటికి యింకా ఎక్కడా మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమిమీద యింకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకొనే ఏ మనిషి అప్పటికి లేడు.

భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది. అప్పుడు యెహోవా దేవుడు నేలనుండి మట్టి తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాలలో జీవ వాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడు అయ్యాడు. అప్పుడు తూర్పున ఏదెను అను చోట ఒక తోటను యెహోవా వేశాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు. అప్పుడు చూచుటకు అందంగా కనబడే చెట్లన్నింటినీ, మరియు ఆహారానికి మంచివైన చెట్లు అన్నింటినీ భూమి పుట్టించునట్లు దేవుడు చేశాడు. జీవ వృక్షమును, మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి.

10 ఏదెనులో నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై నాలుగు చిన్న నదులయింది. 11 మొదటి నది పేరు పీషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది. 12 (ఆ దేశంలో బంగారం ఉంది, ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోళం, గోమేధికము కూడా ఉన్నాయి). 13 రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశమంతటా ప్రవహిస్తుంది. 14 మూడో నది పేరు హిద్దెకెలు. ఆ నది అష్షూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. నాలుగో నది యూఫ్రటీసు.

15 మనిషిని ఏదెను తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటనుగూర్చి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని. 16 యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ యిచ్చాడు: “ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నీవు తినవచ్చు. 17 అయితే మంచి, చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఆ చెట్టు పండు నీవు తిన్న రోజున తప్పక చస్తావు.”

మొదటి స్త్రీ

18 అప్పుడు యెహోవా దేవుడు, “పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటియైన సహకారిణిని నేను చేస్తాను. మరియు ఆ సహకారిణి అతనికి సహాయం చేస్తుంది” అనుకొన్నాడు.

19 పొలాల్లోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేలనుండి యెహోవా దేవుడు చేశాడు. ఈ జంతువులన్నింటిని యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు, మనిషి ప్రతిదానికి పేరు పెట్టాడు. 20 సాధు జంతువులన్నింటికీ, ఆకాశ పక్షులన్నింటికి, అడవి క్రూర జంతువులన్నింటికి మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని, పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు. 21 అందుచేత ఆ పురుషుడు గాఢనిద్ర పోయేటట్లు చేశాడు యెహోవా దేవుడు. అతడు నిద్రపోతూ ఉండగా, అతని శరీరంలోని ప్రక్క ఎముకలలో ఒకదాన్ని తీశాడు. ప్రక్క ఎముకను తీసిన చోటును అతని మాంసముతో యెహోవా దేవుడు పూడ్చి వేశాడు. 22 స్త్రీని చేసేందుకు, అతని ప్రక్క ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యెహోవా దేవుడు తీసుకొని వచ్చాడు. 23 అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు:

“ఇప్పుడు, ఇది నావంటి మనిషే.
    ఆమె ఎముక నా ఎముకల్లోనుంచి వచ్చింది.
    ఆమె శరీరం నా శరీరంలోనుంచి వచ్చింది.
ఆమె నరునిలోనుండి తీయబడింది
    గనుక ఆమెను నారి అంటాను.”

24 ఇందువల్ల పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి, తన భార్యను హత్తుకొంటాడు. వాళ్లిద్దరు ఏకమవుతారు.

25 ఆ తోటలో ఆ పురుషుడు, అతని భార్యా నగ్నంగా ఉన్నారు. కాని వారికి సిగ్గు తెలియదు.

మత్తయి 2

తూర్పు నుండి జ్ఞానులు రావటం

హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని అన్నారు.

ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు. అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని[a] సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు. వాళ్ళు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు:

“‘యూదయ దేశంలోని బేత్లెహేమా!
    నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు!
ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు.
    ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.’”(A)

ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు. వాళ్ళను బేత్లెహేముకు పంపుతూ, “వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” అని అన్నాడు.

వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. 10 వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు.

11 ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోళం బహూకరించారు. 12 హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు.

ఈజిప్టు దేశానికి తరలి వెళ్ళటం

13 వాళ్ళు వెళ్ళిపొయ్యాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, “లెమ్ము! తప్పించుకొని తల్లీబిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు! హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు. కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు” అని అన్నాడు.

14 యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. 15 యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండి పొయ్యాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, “నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను”(B) అని అన్న మాట నిజమైంది.

హెరోదు బెత్లెహేములో మగపిల్లలను చంపటం

16 జ్ఞానులు తనను మోసం చేసారని గ్రహించి హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బేత్లేహేములో, దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా తక్కువ వయస్సుగల బాలురనందర్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు. 17 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది:

18 “రామా గ్రామంలో అతి దుఃఖంతో
    ఏడుస్తున్న స్వరం వినిపించింది.
రాహేలు తన సంతానం కొఱకు ఏడ్చింది.
    ఎవరు ఓదార్చిన వినలేదు.
    ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు.”(C)

నజరేతుకు తిరుగు ప్రయాణం

19 హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, 20 “లెమ్ము! శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు. కనుక తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు” అని అన్నాడు.

21 అందువల్ల యోసేపు లేచి తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. 22 కాని, యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపొయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటంవల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపొయ్యాడు. 23 అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా, ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి.

ఎజ్రా 2

యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్ల జాబితా

వీళ్లు బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా పట్టుకొని, బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమ తమ సొంత పట్టణాలకి తిరిగి వెళ్లారు. జెరుబ్బాబెలుతో పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వాళ్లున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్ల జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది:

పరోషు వంశస్థులు2,172
షెపట్యా వంశస్థులు372
అరహు వంశస్థులు775
యేషూవ, యోవాబు వంశాలకి చెందిన పహత్మోయాబు, మోయాబు వంశస్థులు2,812
ఏలాము వంశస్థులు1,254
జత్తూ వంశస్థులు945
జక్కయి వంశస్థులు760
10 బానీ వంశస్థులు642
11 బేబై వంశస్థులు623
12 అజ్గాదు వంశస్థులు1,222
13 అదొనీము వంశస్థులు666
14 బిగ్వయి వంశస్థులు2,056
15 అదీను వంశస్థులు454
16 అటేరు వంశస్థులు (హిజ్కియా కుటుంబం)98
17 బెజయి వంశస్థులు323
18 యోరా వంశస్థులు112
19 హాషుము వంశస్థులు223
20 గిబ్బారు వంశస్థులు95
21 బెత్లెహేము పట్నానికి చెందినవాళ్లు123
22 నెటోపా పట్టణం వాళ్లు56
23 అనాతోతు పట్టణంవాళ్లు128
24 అజ్మావెతు పట్టణంవాళ్లు42

25 కిర్యాతారీము, కెఫీరా,

బెయేరోతు పట్టణాల వాళ్లు743
26 రమా, గెబా పట్టణాలవాళ్లు621
27 మిక్మషు పట్టణం వాళ్లు123
28 బేతేలు, హాయి పట్టణంవాళ్లు222
29 నెబో పట్టణంవాళ్లు52
30 మగ్బీషు పట్టణంవాళ్లు156
31 ఏలాము అనే మరో పట్టణంవాళ్లు1,254
32 హారీము పట్టణంవాళ్లు320
33 లోదు, హదీదు, ఓనో పట్టణాలవాళ్లు725
34 యెరికో పట్టణంవాళ్లు345
35 సెనాయా పట్టణంవాళ్లు3,630

36 యాజకులు:

యేషూవ కుటుంబానికి చెందిన యెదాయ వంశస్థులు973
37 ఇమ్మేరు వంశస్థులు1,052
38 పషూరు వంశస్థులు1,247
39 హారీము వంశస్థులు1,017

40 ఇప్పుడిక లేవీయులలో

హోదవ్యా కుటుంబానికి చెందిన యేషూవా, కద్మీయేలు వంశస్థులు74

41 గాయకుల జాబితా:

అసాపు వంశస్థులు128

42 దేవాలయపు ద్వారపాలకుల వంశస్థులు

షల్లూము, ఆటేరు, టల్నోను, అక్కూబు, హటీటా, షోబయి వంశస్థులు139

43 దేవాలయపు ప్రత్యేక సేవకుల వంశస్థులు

జీహా, హశూపా, టబ్బాయోతు,

44 కేరోసు, సీయహా, పాదోను,

45 లెబానా, హగాబా, అక్కూబు,

46 హాగాబు, షల్మయి, హానాను,

47 గిద్దేలు, గహరు, రెవాయా,

48 రెజీను, నెకోదా, గజ్జాము,

49 ఉజ్జా, పాసెయ, బేసాయి,

50 అస్నా, మెహూనీము, నెపూసీము,

51 బక్బూకు, హకూపా, హర్హూరు

52 బజ్లీతు, మెహీదా, హర్షా

53 బర్కోసు, సీసెరా, తెమహు

54 నెజీయాహు, హటీపా,

55 సొలొమోను సేవకుల వంశస్థులు:

సొటయి, సోపెరెతు, పెరూదా,

56 యహలా, దర్కోను, గిద్దేలు,

57 షెపట్య, హట్టీలు, పొకెరెతు, జెబాయీము మరియు అమి

58 దేవాలయ సేవకులూ, మరిము సొలొమోను సేవకుల వంశస్థులు కలిసి మొత్తం392

59 తేల్మెలహు తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీయుల కుటుంబాలకు చెందినవాళ్లమని నిరూపించుకో లేకపోయారు. వాళ్లెవరంటే,

60 దెలాయ్యా, టోబీయా, నెకోదా సంతతివారు మొత్తం652

61 యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది వంశస్థులు వున్నారు:

హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశస్థులు. (గిలాదుకు చెందిన ఒకడు బర్జిల్లయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బర్జిల్లయి సంతతివాడిగా పరిగణించబడ్డాడు.)

62 వీళ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో నమోదు కాలేదు. తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులుగా సేవ చేయలేకపోయారు. 63 వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులను తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారి చేశాడు. ఒక యాజకుడు ఊరీము, తుమ్మీము[a] ధరించి, ఏమి చేయాలని దేవుణ్ణి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులేమీ తినలేకపోయారు.

64-65 మొత్తంమీద తిరిగివచ్చిన ఆ వంశంలో 42,360 మంది వున్నారు. వాళ్లలో 7,337 మంది స్త్రీ, పురుష సేవకులను పరిగణలోకి తీసుకోకపోతే తేలిన సంఖ్య ఇది. వాళ్లతో 200 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు. 66-67 వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.

68 ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు పూనుకొన్నారు. 69 వాళ్లు దేవాలయ నిర్మాణానికి తమ శక్తి కొద్దీ కానుకలు ఇచ్చారు 1,100 పౌనుల బంగారం, 3 టన్నుల వెండి, యాజకులు ధరించే 100 దుస్తులు వాళ్లు ఇచ్చారు.

70 ఈ విధంగా యాజకులు, లేవీ గోత్రీకులు, తదితరులు కొంతమంది యెరూషలేముకి, దాని చుట్టూవున్న ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమ తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు.

అపొస్తలుల కార్యములు 2

పవిత్రాత్మ రావటం

పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళంతా ఒక చోట సమావేశం అయ్యారు. తీవ్రమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పరలోకంనుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చొన్న యింటినంతా నింపివేసింది. అప్పుడు వాళ్ళకు నాలుకల్లా అగ్నిజ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరి మీదా దిగినవి. అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు.

అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యూదులు ఉండినారు. ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు.

వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా? అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్లా వింటున్నాడు? మేము, అంటే ‘పార్తీయ’ దేశంవాళ్ళు, ‘మాదీయ’ దేశంవాళ్ళు, ‘ఏలామీ’ దేశంవాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు, 10 ఫ్రుగియ, పంఫులియ, ఈజిప్టు ప్రాంతాలవాళ్ళు, ‘లిబియ’లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాలనుండి వచ్చినవాళ్ళు, రోమా నగరంనుండి వచ్చినవాళ్ళు, 11 యూదులు, యూద మతంలో చేరినవాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు.

12 దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు. 13 “బాగా మద్యం త్రాగి మత్తులో ఉన్నారు” అని కొందరు వాళ్ళనెగతాళి చేసారు.

పేతురు ఉపన్యసించటం

14 ఇది విని పేతురు పదకొండుగురితో లేచి, పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ, “తోటి యూదా సోదరులారా! యెరూషలేంలో నివసిస్తున్న సమస్త ప్రజలారా! నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 15 మీరనుకొన్నట్లు వీళ్ళు త్రాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం తొమ్మిది గంటలే కదా! 16 దీన్ని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా వ్రాసాడు కనుక యివి జరుగుతున్నాయి:

17 ‘దేవుడు ఈ విధంగా అంటున్నాడు:
ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కురిపిస్తాను!
    మీ కుమారులు, కుమార్తెలు నా ప్రవచనాలు పలుకుతారు!
    మీ యువతరం దివ్యదర్శనాలు చూస్తుంది.
    వయస్సు మళ్ళిన మీవాళ్ళు కలలుగంటారు.
18 ఆడా, మగా అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను.
    అప్పుడు వాళ్ళు నా ప్రవచనాలు చెబుతారు.
19 పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను.
    క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను.
    రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి.
20 సూర్యుణ్ణి చీకటిగా మారుస్తాను.
    చంద్రుణ్ణి ఎర్రటి రక్తంలా మారుస్తాను.
ఉత్కృష్టమైనటువంటి, తేజోవంతమైనటువంటి ప్రభువు యొక్క దినం రాక ముందే యిది జరుగుతుంది.
21 అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు ప్రతి ఒక్కణ్ణి ప్రభువు రక్షిస్తాడు.’(A)

22 “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది వినండి. దేవుడు నజరేతు నివాసియైన యేసును, తాను ప్రత్యేకంగా నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహత్యాలు, అద్భుతాలు మీకోసం చేసాడు. సూచనలు చూపాడు. ఈ మహత్యాలు, అద్భుతాలు చేసినట్లు, సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు. 23 దైవ సంకల్పానుసారం ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు. 24 కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఆయనకు మరణవేదననుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని బంధించి ఉంచటం చేతకాలేదు. 25 దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు:

‘ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా చూసాను.
    నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు!
26 అందుకే నా మాటల్లో
    ఆనందం నిండియున్నది.
అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది.
27     ఎందుకంటే, నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్ళతో వదిలివేయవు
    నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు.
28 నాకు జీవపు దారుల్ని చూపావు!
    నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’(B)

29 “సోదరులారా! మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చనిపొయ్యాడు. అతణ్ణి సమాధి చేసారు. ఆ సమాధి ఈ నాటికీ ఉంది. 30 దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశంలో పుట్టిన వాణ్ణొకణ్ణి సింహాసనంపై కూర్చోబెడ్తానని దేవుడు అతనికి ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసాడు. ఇది దావీదుకు తెలుసు. 31 ఈ జరుగనున్న దాన్ని గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు:

‘దేవుడు ఆయన్ని సమాధిలో వదిలివేయ లేదు.
ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు.’

క్రీస్తు సమాధినుండి లేచే విషయమై దావీదు మాటలాడుచూ ఉన్నాడు. 32 కావున దేవుడు ఈ యేసునే మృత్యువునుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము. 33 యేసు పరలోకానికి ఎత్తబడినాడు. ఇప్పుడు యేసు దేవునితో ఆయన కుడిప్రక్కన ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను యేసుకు ఇచ్చాడు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మయే. యేసు ఇప్పుడాయాత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు వింటున్నది, చూస్తున్నది. 34-35 యేసులా దావీదు పరలోకానికి వెళ్ళలేదు. అయినా, అతడీవిధంగా అన్నాడు:

‘ప్రభువు నా ప్రభువుతో,
నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు
    నీవు నా కుడివైపు కూర్చో!’(C)

36 “అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.”

37 ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.

38 పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది. 39 దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.”

40 వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.” 41 అతని సందేశాన్ని అంగీకరించినవాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు.

విశ్వాసుల సహవాసం

42 వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై, ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు. 43 దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది. 44 భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనేవాళ్ళు. 45 తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు. 46 ప్రతి రోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించేవాళ్ళు, 47 దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించినవాళ్ళను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International