Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 36

యూదా రాజుగా యెహోయాహాజు

36 యెరూషలేములో కొత్త రాజుగా యూదా ప్రజలు యెహోయాహాజును ఎన్నుకొన్నారు. యెహోయాహాజు యోషీయా కుమారుడు. యుదాకు రాజయ్యేనాటికి యెహోయాహాజు ఇరువది మూడేండ్లవాడు. అతడు యెరూషలేములో మూడు నెలలపాటు రాజుగా వున్నాడు. పిమ్మట ఈజిప్టు రాజైన నెకో యెహోయాహాజును బందీగా పట్టుకున్నాడు. నెకో యూదా ప్రజలను రెండువందల మణుగుల (మూడు ముప్పావు టన్నులు) వెండిని, రెండు మణుగుల (డెబ్బదియైదు పౌనులు) బంగారాన్ని అపరాధ రుసుముగా చెల్లించేలా చేశాడు. యెహోయాహాజు సోదరుని యూదా, యెరూషలేములపై నూతన రాజుగా నెకో నియమించాడు. యెహోయాహాజు సోదరుని పేరు ఎల్యాకీము. పిమ్మట ఎల్యాకీముకు నెకో ఒక క్రొత్త పేరు పెట్టాడు. అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టాడు. కాని యెహోయాహాజును నెకో ఈజిప్టుకు తీసికొని వెళ్లాడు.

యూదా రాజుగా యెహోయాకీము

యూదాకు కొత్త రాజయ్యేనాటికి యెహోయాకీము ఇరువదియైదేండ్లవాడు. యెహోవా కోరిన విధంగా యెహోయాకీము ధర్మంగా ప్రవర్తించలేదు. దేవుడైన యెహోవా పట్ల అతడు పాపం చేశాడు.

బబులోను (బాబిలోనియా) రాజైన నెబుకద్నెజరు యూదాపై దండెత్తి వచ్చాడు. అతడు యెహోయాకీమును బందీగాచేసి అతనికి కంచు గొలుసులు తగిలించాడు. తరువాత యెహోయాకీమును నెబుకద్నెజరు బబులోనుకు తీసికొని వెళ్లాడు. యెహోవా ఆలయం నుండి నెబుకద్నెజరు కొన్ని వస్తువులను దోచుకుపోయాడు. అతడా వస్తువులను బబులోనుకు పట్టుకుపోయి వాటిని తన స్వంత ఇల్లయిన రాజగృహంలో వుంచాడు. యెహోయాకీము చేసిన ఇతర విషయాలు, అతడు చేసిన భయంకరమైన పాపాలు, మరియు అతనిని దోషిగా నిరూపించే అతని ప్రతి కార్యం గురించి ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. యెహోయాకీము స్థానంలో అతని కుమారుడు యెహోయాకీను కొత్తగా రాజయ్యాడు.

యూదా రాజుగా యెహోయాకీను

యూదాకు రాజయ్యేనాటికి యెహోయాకీను పద్దెనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు రాజుగా వున్నాడు. యెహోవా కోరిన విధంగా అతడు తన కార్యాలను నిర్వర్తించలేదు. యెహోవా పట్ల యెహోయాకీను పాపం చేశాడు. 10 వసంత ఋతువులో యెహోయాకీనును పట్టి తెమ్మని రాజైన నెబకద్నెజరు తన మనుష్యులను పంపాడు. వారు యెహోయాకీనును, యెహోవా ఆలయం నుండి కొన్ని ధనరాసులను బబులోనుకు తెచ్చారు. యూదా, యెరూషలేములకు నూతన రాజుగా సిద్కియాను నెబకద్నెజరు నియమించాడు. సిద్కియా అనువాడు యెహోయాకీనుకు బంధువు.

యూదా రాజుగా సిద్కియా

11 యూదాకు రాజుయ్యేనాటికి సిద్కియా ఇరువైఒక సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పద కొండు సంవత్సరాలు రాజుగా వున్నాడు. 12 యెహోవా కోరినట్లు సిద్కియా ఉత్తమ కార్యాలు చేయలేదు. యెహోవా పట్ల సిద్కియా పాపం చేశాడు. దేవుని ముందు అతడు వినయ విధేయతలు చూపించలేదు. ప్రవక్త యిర్మీయా చెప్పిన విషయాలను పాటించలేదు. యెహోవా సందేశాన్ని యిర్మీయా ప్రవచించాడు.

యెరూషలేము నాశనమగుట

13 రాజైన నెబుకద్నెజరుపై సిద్కియా తిరుగుబాటు చేశాడు. గతంలో నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియాతో బలవంతంగా నెబుకద్నెజరు ప్రమాణం చేయించాడు. నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియా దేవుని మీద ప్రమాణం చేశాడు. కాని సిద్కియా తన జీవన విధానం మార్చుకొని, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా మాటవిని, ఆయనకు విధేయుడైయుండటానికి నిరాకరించి మొండి వైఖరి దాల్చాడు. 14 యాజకుల నాయకులు, యూదా ప్రజల నాయకులంతా కూడా మరీ ఎక్కువ పాపం చేసి, యెహోవాకు విశ్వాస ఘాతకులయ్యారు. వారు అన్యదేశీయుల చెడు మార్గాన్నే అనుసరించారు. ఆ నాయకులంతా యెహోవా ఆలయాన్ని అపవిత్రపర్చి పాడుచేశారు. యెరూషలేములో ఆలయాన్ని యెహోవా పవిత్రపర్చాడు. 15 తమ పూర్వీకుల దేవుడగు యెహోవా తన ప్రజలను హెచ్చిరించటానికి అనేక పర్యాయములు ప్రవక్తలను పంపినాడు. తన ప్రజలపట్ల, తన ఆలయంపట్ల సానుభూతిగలవాడుగుటచే యెహోవా అలా చేస్తూ వచ్చాడు. యెహోవా తన ప్రజలనుగాని, తన ఆలయాన్నిగాని నాశనం చేయదల్చలేదు. 16 కాని దేవుని యొక్క ప్రజలే దేవుడు పంపిన ప్రవక్తలను ఎగతాళి చేశారు. వారు ప్రవక్తలు చెప్పేదానిని వినలేదు. వారు దేవుని వర్తమానములను అసహ్యించుకున్నారు. ఆఖరికి దేవుడు తన కోపాన్ని ఎంత మాత్రమూ ఆపుకోలేకపోయాడు. దేవుడు తన ప్రజలపట్ల కోపపడ్డాడు. ఆ కోపాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదు. 17 అందువల్ల యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు వారి మీదికి బబులోను రాజును రప్పించాడు.[a] బబులోను రాజు యువకులను ఆలయంలో వుండగానే చంపివేశాడు. అతడు యూదా, యెరూషలేము ప్రజలమీద ఏమాత్రం కనికరం చూపలేదు. బబులోను రాజు యువకులను, వృద్ధులను కూడ చంపివేశాడు. అతడు పురుషులను, స్త్రీలను చంపాడు. రోగులను, ఆరోగ్యవంతులను కూడ చంపివేశాడు. యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు నెబుకద్నెజరుకు అనుమతి ఇచ్చినాడు. 18 ఆలయంలోని వస్తువులన్నిటినీ నెబుకద్నెజరు బబులోనుకు పట్టుకుపోయాడు. ఆలయంలోను, రాజువద్ద, రాజు యొక్క అధికారులవద్దగల విలువైన వస్తువులన్నిటినీ అతడు పట్టుకుపోయాడు. 19 నెబుకద్నెజరు, అతని సైన్యం ఆలయాన్ని తగులబెట్టారు. వారు యెరూషలేము గోడను పడగొట్టి రాజుకు, రాజాధికారులకు చెందిన ఇండ్లన్నీ తగులబెట్టారు. ప్రతి విలువైన వస్తువును వారు తీసికొనటం గాని, లేక నాశనం చేయటంగాని చేశారు. 20 చనిపోగా మిగిలిన ప్రజలను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వెళ్లి బానిసలుగా పనిచేయించాడు. పర్షియా రాజ్యం (పారసీకము) బబులోను రాజ్యాన్ని ఓడించేవరకు ఆ ప్రజలు బబులోనులో బానిసలుగా వుండి పోయారు. 21 ప్రవక్తయగు యిర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చెప్పిన విషయాలన్నీ ఆ విధంగా సంభవించాయి. యిర్మీయా ద్వారా యెహోవా యిలా చెప్పినాడు: “ఈ ప్రదేశం డెబ్బది యేండ్లపాటు బంజరు[b] భూమిగా మారిపోతుంది. ప్రజలు సబ్బాతు దినాలను[c] పాటించని కారణాన, దానికి పరిహారంగా ఇది జరుగుతుంది.”

22 పర్షియా (పారసీక) రాజు కోరెషు (సైరస్) పాలన మొదటి సంవత్సరంలో[d] ఈ విధంగా జరిగింది. ప్రవక్తయగు యిర్మీయా ద్వారా యెహోవా ప్రకటించిన విషయాలు ఆయన నిజంగా జరిగేలా చేసినాడు. యెహోవా సైరస్ (కోరెషు) హృదయాన్ని స్పందింపజేసి, అతనిచే ఒక ఆజ్ఞ వ్రాయించి దూతల ద్వారా తన రాజ్యమంతా ప్రకటింపజేసినాడు:

23 పర్షియా రాజైన కోరెషు తెలియజేయున దేమనగా:

ఆకాశమందు ప్రభువైన యెహోవా నన్ను ఈ భూమండలానికంతకు రాజుగా చేసినాడు. యెరూషలేములో ఆయనకొక ఆలయం కట్టించే బాధ్యత నాకు అప్పజెప్పినాడు. దేవుని ప్రజలైన మీరంతా ఇప్పుడు యెరూషలేము వెళ్లటానికి స్వేచ్ఛ కలిగియున్నారు. మీ దేవుడైన యెహోవా మీకు తోడై వుండుగాక.

ప్రకటన 22

22 ఆ తర్వాత ఆ దేవదూత స్పటికంలా స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై, పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. ఆ నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. ఆ వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా ఆ వృక్షం ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి.

ఇక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు. వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్ళపై ఉంటుంది. ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు.

ఆ దూత నాతో, “ఇవి నమ్మదగినవి, నిజమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలోనే జరుగనున్న వాటిని తన సేవకులకు చూపించటానికి తన దూతను పంపాడు. ‘చూడు! నేను త్వరలోనే రాబోతున్నాను. ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించే వాడు ధన్యుడు’” అని అన్నాడు.

యోహాను అనబడే నేను ఈ విషయం చూసాను. నేను అవి విని, చూసినప్పుడు నాకు యివి చూపిస్తున్న దూతను ఆరాధించటానికి అతని కాళ్ళమీద పడ్డాను. కాని అతడు నాతో, “నేను నీ తోటి సేవకుణ్ణి, నీ సోదరులతో, ప్రవక్తలతో, ఈ గ్రంథంలో ఉన్న సందేశాలు ఆచరించేవాళ్ళతో కలిసి సేవ చేసేవాణ్ణి. నన్ను ఆరాధించకు. దేవుణ్ణి ఆరాధించు” అని అన్నాడు.

10 అతడు యింకా ఈ విధంగా అన్నాడు: “కాలం సమీపిస్తోంది, కనుక ఈ గ్రంథంలోని ప్రవచన వాక్కును రహస్యంగా దాచవద్దు. 11 తప్పు చేసేవాణ్ణి తప్పు చేయనీ! నీచంగా ప్రవర్తించేవాణ్ణి నీచంగా ప్రవర్తించనీ! నీతిగా ఉండేవాణ్ణి నీతిగా ఉండనీ! పవిత్రంగా ఉండేవాణ్ణి పవిత్రంగా ఉండనీ.”

12 “జాగ్రత్త, నేను త్వరలో రాబోతున్నాను. ప్రతి ఒక్కనికి అతడు చేసేవాటిని బట్టి నా దగ్గరున్నదాన్ని బహుమతిగా ఇస్తాను. 13 ఆదియు, అంతమును[a] నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే, ఆరంభాన్ని, సమాప్తాన్ని నేనే.

14 “జీవవృక్షం మీది ఫలాన్ని తినటానికి అర్హత పొందేందుకు, గుమ్మాల ద్వారా పట్టణంలోకి వెళ్ళే అర్హత పొందేందుకు తమ తమ దుస్తుల్ని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉన్నవాళ్ళు ధన్యులు. 15 పట్టణానికి వెలుపట కుక్కలు, మంత్రగాళ్ళు, అవినీతిపరులు, హంతకులు, విగ్రహారాధికులు, అసత్యాన్ని ప్రేమించి జీవించేవాళ్ళు రకరకాల మనుష్యులు ఉంటారు.

16 “నేను యేసును. ఈ విషయాన్ని సంఘాలకు చెప్పటానికి నా దూతను నీ దగ్గరకు పంపాను. నేను వేరును, దావీదు వంశాంకురాన్ని, ప్రకాశించే వేకువచుక్కను.”

17 ఆత్మ మరియు పెళ్ళికుమార్తె “రండి” అని అంటున్నారు. ఇది విన్నవాడు “రండి!” అనాలి. దాహంతో ఉన్నవాళ్ళు రావచ్చును. ఇష్టమున్నవాడు ఉచితంగా లభించే జీవజలాన్ని త్రాగవచ్చు.

18 ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్కును వినే ప్రతి ఒక్కణ్ణి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. 19 ఒకవేళ ఎవరైనా దీనికి ఏదైనా చేర్చితే, ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకు వస్తాయి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంనుండి ఏవైనా మాటలు తీసి వేస్తే, ఈ గ్రంథంలో వర్ణింపబడిన జీవవృక్షంలో, పవిత్ర పట్టణంలో అతనికున్న హక్కును దేవుడు తీసివేస్తాడు.

20 యేసు ఇవన్నీ నిజమని చెపుతున్నాడు. ఇప్పుడు ఆయన, “ఔను, నేను త్వరలోనే వస్తాను” అని అంటున్నాడు.

ఆమేన్! రండి యేసు ప్రభూ!

21 యేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై ఉండుగాక. ఆమేన్.

మలాకీ 4

“తీర్పు సమయం వస్తుంది. అది కాలుతున్న అగ్ని గుండంలా ఉంటుంది. ఆ గర్విష్ఠులు అందరూ శిక్షించబడతారు. ఆ దుర్మార్గులు అందరూ గడ్డిలా కాలిపోతారు. ఆ సమయంలో వారు అగ్నిలో మండుతున్న ఒక పొదలా ఉంటారు-దాని కొమ్మగాని, వేరుగాని మిగలదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

“అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న సూర్యునిలా, మంచితనం మీమీద ప్రకాశిస్తుంది. మరియు సూర్యకిరణాలవలె అది స్వస్థతా శక్తిని తెచ్చిపెడ్తుంది. పాకనుండి విడిచిపెట్టబడిన దూడల్లా, మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారు. అప్పుడు మీరు ఆ దుర్మార్గుల మీద నడుస్తారు-వారు మీ పాదాలక్రింద బూడిదలా ఉంటారు. తీర్పు సమయంలో ఆ సంగతులను నేను సంభవింపజేస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!

“మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకొని, విధేయత చూపండి. మోషే నా సేవకుడు. హోరేబు (సీనాయి) కొండమీద ఇశ్రాయేలీయులందరికోసం ఆ చట్టాలు, నియమాలు నేను అతనికి ఇచ్చాను.”

“చూడండి, ఏలీయా ప్రవక్తను నేను మీ దగ్గరకు పంపిస్తాను. యెహోవానుంచి వచ్చే ఆ మహాభయంకర తీర్పు సమయానికి ముందు ఆయన వస్తాడు. తల్లిదండ్రులు వారి పిల్లలకు సన్నిహితులగుటకు ఏలీయా సహాయం చేస్తాడు. మరియు అతడు (ఏలీయా) పిల్లలు వారి తల్లిదండ్రులకు సన్నిహితులగుటకు సహాయం చేస్తాడు. ఇది జరిగి తీరాలి. లేదా నేను వచ్చి, మీ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాను,” అని యెహోవా చెప్పాడు!

యోహాను 21

యేసు మళ్ళీ కనిపించటం

21 ఆ తర్వాత తిబెరియ సముద్రం దగ్గర యేసు మళ్ళీ కనిపించాడు. అది ఈ విధంగా జరిగింది: సీమోను పేతురు, దిదుమ అని పిలువబడే తోమా, గలిలయలోని కానా పట్టణానికి చెందిన “నతనయేలు”, జెబెదయి కుమారులు, మరొక యిద్దరు శిష్యులు, అంతా కలిసి ఒక చోట ఉన్నారు. సీమోను పేతురు, “నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను” అని అన్నాడు.

మిగతా వాళ్ళు, “మేము కూడా వస్తున్నాము” అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కాని ఆ రాత్రి వాళ్ళకు చేపలు దొరక లేదు.

తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిలుచొని ఉన్నాడు. కాని శిష్యులు ఆయనే “యేసు” అని గ్రహించలేదు. యేసు, “మిత్రులారా! చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు.

“లేదు” అని వాళ్ళన్నారు.

ఆయన, “పడవ కుడి వైపు మీ వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని అన్నాడు. వాళ్ళు ఆయన చెప్పిన విధంగా వల వేసారు. చేపలు ఎక్కువగా వలలో పడటంవల్ల వాళ్లు ఆ వల లాగలేక పొయ్యారు.

యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “అదిగో చూడు ప్రభువు” అని అన్నాడు. సీమోను పేతురు, “అదిగో ప్రభువు!” అని అతడు అనటం విన్న వెంటనే, యిది వరకు తీసివేసిన తన పై వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని నీళ్ళలోకి దూకాడు. మిగతా శష్యులు ఒడ్డుకు వంద గజాల దూరంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు చేపలతో నిండిన వలను లాగుతూ పడవను నడుపుకుంటూ అతణ్ణి అనుసరిస్తూ ఒడ్డును చేరుకున్నారు. వాళ్ళు పడవ దిగాక కాలుతున్న బొగ్గల మీద చేపలు ఉండటం చూసారు. కొన్ని రొట్టెలు కూడా అక్కడ ఉన్నాయి. 10 యేసు వాళ్ళతో “మీరు పట్టిన కొన్ని చేపలు తీసుకురండీ” అని అన్నాడు.

11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలనిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మొత్తం నూట ఏబది మూడు చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల చినుగలేదు! 12 యేసు వాళ్ళతో, “రండి! వచ్చి భోజనం చెయ్యండి” అని అన్నాడు. “మీరెవరు” అని అడగటానికి శిష్యుల కెవ్వరికీ ధైర్యం చాలలేదు. 13 యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, రొట్టెను తీసుకొని వాళ్ళకిచ్చాడు. అదే విధంగా చేపల్ని కూడా యచ్చాడు.

14 ఆయన బ్రతికింపబడ్డాక తన శిష్యులకు కనిపించడం యిది మూడవసారి.

యేసు మరియు పేతురు

15 వాళ్ళు భోజనం చెయ్యటం ముగించాక యేసు, సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ! వీళ్ళకన్నా నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు.

“ఔను ప్రభూ! ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు.

యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు!” అని అన్నాడు.

16 యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ! నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?” అని మళ్ళీ అడిగాడు.

అతడు, “ఔను ప్రభూ! నేను ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు.

యేసు, “నా గొఱ్ఱెల్ని జాగ్రత్తగా చూసుకో!” అని అన్నాడు.

17 మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ! నన్ను ప్రేమిస్తున్నావా?” అని అన్నాడు.

మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా” అని అడిగినందుకు పేతురు మనస్సు చివుక్కుమన్నది. అతడు, “ప్రభూ! మీకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కూడా తెలుసు” అని అన్నాడు.

యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు! 18 ఇది నిజం. వయస్సులో ఉన్నప్పుడు నీ దుస్తులు నీవు వేసుకొని నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళే వాడవు. కాని వయస్సు మళ్ళిన తర్వాత నీవు చేతులు చాపితే మరొకళ్ళు నీకు దుస్తులు తొడిగించి నీకు యిష్టం లేదన్న చోటికి తీసుకు వెళ్తారు” అని అన్నాడు. 19 పేతురు ఎలాంటి మరణం పొంది దేవునికి మహిమ తెస్తాడో సూచించటానికి యేసు ఇలా అన్నాడు. ఆ తర్వాత అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు.

20 పేతురు వెనక్కు తిరిగి చూసాడు. యేసు ప్రేమించిన శిష్యుడు వెంట రావటం గమనించాడు. రాత్రి భోజనాలప్పుడు యేసుకు ఆనుకొని, “ప్రభూ! మీకు ఎవరు ద్రోహం చేస్తారు!” అని ప్రశ్నించిన వాడు యితడే. 21 పేతురు అతణ్ణి చూసి యేసుతో, “ప్రభూ! అతని సంగతి ఏమిటి?” అని అడిగాడు.

22 యేసు సమాధానంగా, “నేను తిరిగి వచ్చే వరకు అతడు బ్రతికి ఉండాలని నాకిష్టమైతే! ఆ సంగతి నీ కెందుకు. నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.

23 యేసు ఈ విధంగా అనటంవల్ల ఈ శిష్యుడు చనిపోడనే వదంతి సోదరుల్లో వ్యాపించింది. కాని యేసు అతడు చనిపోడని అనలేదు. అతడు, “నేను తిరిగి వచ్చేవరకు అతడు బ్రతికి ఉండాలని నా ఉద్దేశ్యమైతే ఆ సంగతి నీకెందుకు?” అని అన్నాడు, అంతే.

24 వీటిని గురించి సాక్ష్యం చెప్పిన వాడు, వ్రాసిన వాడు ఈ శిష్యుడే. అతని సాక్ష్యం నిజమైనదని మనకు తెలుసు.

25 యేసు యింకా ఎన్నో కార్యాలు చేసాడు. వాటన్నిటిని గురించి వ్రాస్తే ఈ గ్రంథాలకు ఈ ప్రపంచంలో ఉన్న స్థలమంతా కూడా సరిపోదని నేననుకుంటాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International