Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 30

హిజ్కియా పస్కా పండుగ ఆచరించుట

30 రాజైన హజ్కియా ఇశ్రాయేలు, యూదా ప్రజలందరికీ వర్తమానం పంపించాడు. అతడు ఎఫ్రాయిము, మనష్షే[a] ప్రజలకు కూడా లేఖలు వ్రాశాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పస్కా[b] పండుగ జరిపేందుకు వారిందరినీ యెరూషలేములోని ఆలయానికి రమ్మని హిజ్కియా ఆహ్వానించాడు. పస్కా పండుగ రెండవ నెలలో జరపటానికి అధికారులతోను, యెరూషలేము సమావేశంలోను చర్చించి రాజైన హిజ్కియా నిర్ణయించాడు. పస్కా పండుగను మామూలుగా (నీసాను 14వ తేదీ) జరిగే సమయానికి వారు జరుపుకోలేక పోయారు. ఎందువల్లనంటే పవిత్ర సేవా కార్యాక్రమానికి తగినంత మంది యాజకులు సిద్ధం కాలేదు. పైగా ప్రజలందరూ యెరూషలేములో సమావేశం కాలేదు. ఇప్పుడు పండుగ జరిపే తేదీ పట్ల రాజైన హిజ్కియా, సమావేశమైనవారూ సంతృప్తిని వెలిబుచ్చారు. పిమ్మట బెయేర్షెబా పట్టణం మొదలు దాను పట్టణం వరకు ఇశ్రాయేలంతటా వారీవిషయమై ప్రకటన చేశారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపటానికి ప్రజలంతా యెరూషలేముకు రావాలని వారు చాటించారు. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన విధంగా చాలాకాలంగా ఇశ్రాయేలు ప్రజలలో అధిక సంఖ్యాకులు పస్కా పండుగ జరుపలేదు. కావున దూతలు రాజు యొక్క లేఖలను ఇశ్రాయేలు, యూదా ప్రాంతాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. ఆ లేఖలలో యిలా వ్రాయబడి వుంది:

ఇశ్రాయేలు బిడ్డలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు (యాకోబు) విధేయులై వున్న దేవుడైన యెహోవా వైపు తిరగండి. అప్పుడు మీలో ఇంకా బ్రతికివున్న వారి వద్దకు, అష్షూరు రాజు బారినుండి తప్పించుకున్న వారి వద్దకు యెహోవా వస్తాడు. మీ తండ్రులవలెను, మీ సొదరులవలెను మీరు ప్రవర్తించకండి. యెహోవా వారి దేవుడు; కాని వారు ఆయనకు వ్యతిరేకులయ్యారు. అందువల్ల ప్రజలు వారిని అసహ్యించుకునేలా, వారు నిందలపాలయ్యేలా యెహోవా చేశాడు. ఇది నిజమని మీ కళ్లతో మీరే స్వయంగా చూడవచ్చు. మీ వెనుక తరంవారివలె మీరు మొండిగా ప్రవర్తించకండి. ఇష్ట పూర్వకమైన మీ హృదయాలతో యెహోవాకు విధేయులు కండి. అతి పరిశుద్ధ స్ధలానికి తరలిరండి. అతి పరిశుద్ద స్థలాన్ని యెహోవా శాశ్వతంగా పవిత్ర పర్చాడు. మీ దేవుడైన యెహోవాను కొలవండి. అప్పుడు యెహోవా యొక్క భయంకరమైన కోపం మీనుండి తొలగిపోతుంది. మీరు తిరిగివచ్చి యెహోవాకు విధేయులైతే, బందీలైన మీ బంధువులు, పిల్లలు వారిని చెరబట్టిన శత్రువుల నుండి కనికరం పొందుతారు. మీ బంధువులు, మీ పిల్లలు మళ్లీ ఈ రాజ్యానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా దయగలవాడు; కరుణా మూర్తి. మీరాయనను ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టడు.

10 వార్తాహరులు ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో ప్రతి పట్టణానికీ వెళ్లారు. వారు సుదూర ప్రాంతమైన జెబూలూనుకు కూడా వెళ్లారు. కాని అక్కడి ప్రజలు వార్త తెచ్చిన వారిని చూసి నవ్వి, హేళనచేశారు. 11 కాని అషేరు, మనష్షే మరియు జెబూలూను ప్రాంతాలలో కొంతమంది మాత్రం తమను తాము తగ్గించుకొని, అణకువతో యెరూషలేముకు వెళ్లారు. 12 యెహోవా తన వాక్కు ద్వారా రాజైన హిజ్కియా మరియు అతని అధికారులు ఇచ్చిన ఆజ్ఞలకు యూదా ప్రజంతా విధేయులై వుండేలా వారి మనస్సులు మార్చాడు.

13 చాలామంది ప్రజలు జట్లు జట్లుగా పులియని రొట్టెల పండుగ[c] జరుపుకోటానికి రెండవ నెలలో యెరూషలేముకు వచ్చారు. ప్రజాసమూహం పెద్దగా వుంది. 14 యెరూషలేములో బూటకపు దేవుళ్ల ఆరాధనకు నిర్మింపబడ్డ బలిపీఠాలన్నిటినీ అక్కడ చేరిన ప్రజలు తొలగించారు. బూటకపు దేవుళ్లకు నిర్మించిన ధూప పీఠాలను కూడా వారు తీసివేశారు. ఆ బలిపీఠాలన్నిటినీ వారు కిద్రోను లోయలో పారవేశారు. 15 పిమ్మట వారు రెండవ నెల పదునాల్గవ తేదీన పస్కా గొర్రెపిల్లను చంపారు. యాజకులు, లేవీయులు సిగ్గుపడి పవిత్ర సేవా కార్యక్రమానికి పరిశుద్ధులై సిద్ధమయ్యారు. యాజకులు, లేవీయులు దహనబలులు ఆలయానికి తీసుకొనివచ్చారు. 16 యెహోవా సేవకుడైన మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారంతా ఆలయంలో తమ తమ స్థానాలను ఆక్రమించారు. లేవీయులు బలుల రక్తాన్ని యాజకులకిచ్చారు. ఆ రక్తాన్ని యాజకులు బలిపీఠం మీద చిలికించారు. 17 సమావేశమైన వారిలో శుచియై సేవా కార్యాక్రమానికి సిద్ధం కానివారు అనేకమంది వున్నారు. కావున వారు పస్కా గొర్రెపిల్లలను చంపటానికి అనుమతింపబడలేదు. ఆ కారణంగా లేవీయులు పరిశుద్ధులు కాని వారందరి తరుపునా పస్కా బలులు అర్పించవలసి వచ్చింది. లేవీయులు ప్రతి గొర్రెపిల్లను పవిత్రపర్చి బలికి సిద్ధం చేశారు.

18-19 ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు మరియు జెబూలూను ప్రజలలో చాలామంది పస్కా పండుగుకు ధర్మశాస్త్రీయంగా తమను తాము పవిత్రపర్చుకోలేదు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన రీతిలో వారు పస్కా పండుగను సక్రమంగా జరుపుకోలేదు. కాని హిజ్కియా వారికొరకు ప్రార్థన చేశాడు. హిజ్కియా యిలా ప్రార్థన చేశాడు: “ప్రభువైన యెహోవా, నీవు మంచివాడవు. ఈ ప్రజలు నిజానికి నిన్ను ధర్మశాస్త్రానుసారంగా ఆరాధించాలనుకున్నారు. కాని ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా వారు తమను తాము పవిత్ర పర్చుకోలేదు. దయచేసి వారిని క్షమించు. నీవు మా పూర్వీకులు విధేయులైయున్న దేవుడివి. అతిపవిత్ర స్థానానికి అర్హమైన రీతిలో ప్రజలెవరైనా తమను తాము పవిత్ర పర్చుకొనకపోయినా నీవు వారిని క్షమించ కోరుతున్నాను.” 20 రాజైన హిజ్కియా ప్రార్థన యెహోవా ఆలకించాడు. ఆయన ప్రజలను క్షమించాడు. 21 ఇశ్రాయేలు సంతతివారు యెరూషలేములో ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను జరుపుకున్నారు. వారంతా చాలా ఆనందోత్సాహాలతో వున్నారు. లేవీయులు, యాజకులు ప్రతిరోజు తమ శక్తి కొలది యెహోవాకు స్తోత్రం చేశారు. 22 యెహోవా సేవా కార్యక్రమంలో పరిపూర్ణ జ్ఞానంగల లేవీయులందరినీ రాజైన హిజ్కియా ప్రోత్సహించాడు. ప్రజలు పండుగను ఏడు రోజులపాటు జరిపి సమాధాన బలులు అర్పించారు. వారు తమ పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.

23 ప్రజలంతా అక్కడ మరి ఏడు రోజులు వుండటానికి ఇష్టపడ్డారు. పస్కా పండుగను మరి ఏడు రోజులు జరుపుకున్నందుకు వారు సంతోషించారు. 24 యూదా రాజైన హిజ్కియా ఒక వెయ్యి గిత్తలను, ఏడువేల గొర్రెలను సమావేశమైన ప్రజల ఆహారం నిమిత్తం ఇచ్చాడు. పెద్దలు కూడా వెయ్యిగిత్తలను, పదివేల గొర్రెలను ప్రజలకు ఆహారంగా ఇచ్చారు. చాలామంది యాజకులు పవిత్ర కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. 25 యూదా నుండి వచ్చిన ప్రజా సమూహం, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నుండి వచ్చిన జనం, మరియు ఇశ్రాయేలు నుండి యూదాకు వచ్చిన ఇతర యాత్రీకులు-అందరూ చాలా సంతోషపడ్డారు. 26 అందువల్ల యెరూషలేములో ఆనందం వెల్లివిరిసింది. దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను కాలం తరువాత ఇప్పటివరకు ఇంత వైభవంగా ఏ ఉత్సవం నిర్వహింపబడలేదు. 27 యాజకులు, లేవీయులు లేచి నిలబడి ప్రజలను దీవించుమని యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వారి ప్రార్థన యెహోవా పరిశుద్ధ నివాసం చేరింది.

ప్రకటన 16

కోపంతో నిండుకొన్న ఏడు పాత్రలు

16 మందిరం నుండి ఒక స్వరం బిగ్గరగా ఆ ఏడుగురు దూతలతో, “వెళ్ళండి, దేవుని కోపంతో నిండిపోయిన ఆ ఏడు పాత్రల్ని భూమ్మీద కుమ్మరించండి” అని అనటం నాకు వినిపించింది.

మొదటి దూత వెళ్ళి తన పాత్రను భూమ్మీద కుమ్మరించాడు. మృగం ముద్రవున్నవాళ్ళ దేహాల మీద, మృగం విగ్రహాన్ని పూజించినవాళ్ళ దేహాలమీద బాధ కలిగించే వికారమైన కురుపులు లేచాయి.

రెండవ దూత వెళ్ళి, తన పాత్రను సముద్రం మీద కుమ్మరించాడు. ఆ సముద్రం శవంలోని రక్తంలా మారిపోయింది. సముద్రంలో ఉన్న సమస్త జీవరాసులు మరణించాయి.

మూడవ దూత తన పాత్రను నదులమీద, నీటి ఊటలమీద కుమ్మరించాడు. వాటి నీళ్ళు రక్తంగా మారాయి. నీటి మీద అధికారమున్న దూత ఈ విధంగా అనటం విన్నాను:

“నీవు న్యాయంగా తీర్పు చెప్పావు. నీవు ప్రస్తుతం ఉన్నావు.
గతంలో ఉండిన వాడవు.
నీవు పవిత్రమైన వాడవు, ఎందుకంటే నీవు ఆ విధంగా తీర్పు తీర్చావు.
వాళ్ళు నీ భక్తుల రక్తాన్ని, నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు.
దానికి తగిన విధంగా
    నీవు వాళ్ళకు త్రాగటానికి రక్తాన్నిచ్చావు.”

బలిపీఠం ఈ విధంగా సమాధానం చెప్పటం నేను విన్నాను:

“ఔను ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన ఓ దైవమా!
    నీ తీర్పులు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.”

నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడు. ప్రజల్ని వేడితో మాడ్చివేయటానికి సూర్యునికి అధికారమివ్వబడింది. తీవ్రమైన వేడివల్ల ప్రజలు మాడిపోయారు. వాళ్ళు ఈ తెగుళ్ళ మీద అధికారమున్న దేవుని నామాన్ని దూషించారు. వాళ్ళు పశ్చాత్తాపం చెందటానికి నిరాకరించారు. ఆయన్ని స్తుతించటానికి నిరాకరించారు.

10 ఐదవ దూత తన పాత్రను మృగం యొక్క సింహాసనం మీద క్రుమ్మరించాడు. వెంటనే వాని రాజ్యం చీకటిలో మునిగి పోయింది. ప్రజలు నొప్పితో తమ నాలుకలు కొరుక్కున్నారు. 11 తమ బాధలకు, తమ కురుపులకు పరలోకంలోవున్న దేవుణ్ణి దూషించారు. కాని తాము చేసిన చెడ్డ పనులను మాని మారుమనస్సు పొందటానికి నిరాకరించారు.

12 ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది. 13 ఆ తర్వాత కప్పల్లా కనిపించే అసహ్యకరమైన మూడు దయ్యాలు కనిపించాయి. అవి ఘటసర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త నోటినుండి బయటికి వచ్చాయి. 14 అవి భూతాత్మలు. వాటికి మహత్కార్యాలు చేసే శక్తి ఉంది. అవి సర్వశక్తి సంపన్నుడైన దేవుని “మహాదినం” నాడు జరిగే యుద్ధాని కోసం రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని రాజులందరి దగ్గరకి వెళ్తాయి.

15 “జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమానపడవలసి వస్తుంది.”

16 ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో “హార్‌మెగిద్దోను” అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి.

17 ఏడవ దూత తన పాత్రను గాలిలో క్రుమ్మరించాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీదినుండి ఒక స్వరం బిగ్గరగా “సమాప్తం” అని అన్నది. 18 వెంటనే మెరుపులు మెరిసాయి. ఉరుములు, గర్జనలు వినిపించాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు భూమ్మీద పుట్టిననాటి నుండి అటువంటి భూకంపం ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా ఉంది. 19 మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో “తీవ్రమైన ఉగ్రత” అనబడే మద్యాన్ని పోసాడు. 20 ద్వీపాలు, పర్వతాలు మాయమైపోయాయి. 21 ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది.

జెకర్యా 12:1-13

యూదా చుట్టునున్న దేశాల గూర్చిన దర్శనాలు

12 ఇశ్రాయేలును గురించి యెహోవానుండి వచ్చిన విషాద వార్త. యెహోవా ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన మానవుని ఆత్మను అతనిలో పొందుపర్చాడు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను యెరూషలేమును దాని చుట్టూ ఉన్న దేశాలకు ఒక విషపు గిన్నెలా చేస్తాను. దేశాలు వచ్చి, ఆ నగరంపై దాడి చేస్తాయి. యూదా అంతా బోనులో చిక్కుతుంది. కాని నేను యెరూషలేమును ఒక బరువైన బండలా చేస్తాను. దానిని తీసుకోడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అది అతనినే గాయపర్చుతుంది. ఆ ప్రజలు నిజంగా నరకబడతారు, గీకబడతారు. కాని భూమిపైగల దేశాలన్నీ కలిసి యెరూషలేము మీద యుద్ధానికి వస్తాయి. కాని ఆ సమయంలో నేను గుర్రాన్ని బెదర గొడతాను. దాని మీద స్వారీ చేసే సైనికునికి భయం పుట్టిస్తాను. శత్రు గుర్రాలన్నీ గుడ్డివై పోయేలా చేస్తాను. కాని నా కండ్లు తెరవబడి ఉంటాయి. నేను యూదా వంశాన్ని కనిపెడుతూ ఉంటాను. యూదా వంశ నాయకులు ప్రజలను ప్రోత్సహిస్తారు. వారు, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ దేవుడు, ఆయన మనల్ని బలవంతులుగా చేస్తాడు’ అని అంటారు. ఆ సమయంలో యూదా నాయకులను అరణ్యంలో చెలరేగిన అగ్నిలా నేను చేస్తాను. అగ్ని ఎండు గడ్డిని దగ్ధం చేసినట్లు, వారు తమ శత్రువులను నాశనం చేస్తారు. చుట్టూవున్న వారి శత్రువులను వారు నాశనం చేస్తారు. యెరూషలేము ప్రజలు మళ్లీ తీరికగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు.”

యెరూషలేము ప్రజలు మిక్కిలి గొప్పలు చెప్పుకోకుండా చేయటానికి, యెహోవా యూదా ప్రజలను ముందుగా రక్షిస్తాడు. యూదాలో వున్న ప్రజలకంటె తాము గొప్పవారమని దావీదు వంశంవారు, యెరూషలేములో వుంటున్న ఇతర ప్రజలు గొప్పలు చెప్పుకోలేరు. కాని యెరూషలేము ప్రజలను యెహోవా రక్షిస్తాడు. ఏమీ చేతగానివాడు సహితం దావీదులా గొప్ప సైనికుడవుతాడు. దావీదు వంశంలోని మనుష్యులు దేవుళ్లవలె వుంటారు. ప్రజలను నడిపించే యెహోవా దూతలా వుంటారు.

యెహోవా చెపుతున్నాడు: “ఆ సమయంలో యెరూషలేముపై యుద్ధానికి వచ్చిన దేశాలను నేను నాశనం చేస్తాను. 10 దావీదు వంశాన్ని, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను దయాదాక్షిణ్య స్వభావంతో నింపివేస్తాను. వారు నన్ను పొడిచారు. అలాంటి నా సహాయం కొరకే వారు ఎదురు చూస్తారు. వారు చాలా విచారిస్తారు. తన ఏకైక కుమారుడు చనిపోయినవాడు విలపించేలా, తన మొదటి కుమారుడు చని పోయినవాడు విలపించేలా వారు దుఃఖిస్తారు. 11 యెరూషలేములో గొప్ప దుఃఖ సమయం ఉంటుంది. అది మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను మరణంపట్ల ప్రజల దుఃఖంలా వుంటుంది. 12 ప్రతి ఒక్క కుటుంబం విడిగా దుఃఖిస్తుంది. దావీదు కుటుంబంలోని పురుషులు విడిగా దుఃఖిస్తారు. వారి భార్యలు విడిగా వారికి వారే దుఃఖిస్తారు. నాతాను కుటుంబంలోని పురుషులు ప్రత్యేకంగా విలపిస్తారు. వారి భార్యలు విడిగా దుఃఖిస్తారు. 13 లేవి కుటుంబంలోని పురుషులు విడిగా విచారిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. షిమ్యోను (షిమీ) కుటుంబంలోని పురుషులు విడిగా విలపిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. 14 ఇదే మాదిరి అన్ని వంశాలలోనూ జరుగుతుంది. పురుషులు, స్త్రీలు విడి విడిగా దుఃఖిస్తారు.”

13 కాని, ఆ సమయంలో దావీదు కుటుంబానికి, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకొరకు ఒక నీటి జల తీయబడుతుంది. ఆ జలం వారి పాపాలను కడిగి, వారిని పవిత్రులుగా చేయటానికి ఉద్దేశించబడుతుంది.

యోహాను 15

తీగ, కొమ్మలు

15 “నా తండ్రి తోట యజమాని. నేను నిజమైన ద్రాక్షా తీగను. నాలో ఫలం కాయని కొమ్మలన్నిటిని నా తండ్రి పూర్తిగా కొట్టి వేస్తాడు. ఫలమిచ్చే కొమ్మల్ని, అవి యింకా ఎక్కువ ఫల మిచ్చేటట్లు చెయ్యటానికి వాటికొనల్ని కత్తిరిస్తాడు. నేను మీకు బోధించిన విషయాలవల్ల ఎక్కువ ఫల మిచ్చేటట్లు మీరిదివరకే కత్తిరింపబడ్డారు. నాలో ఐక్యమై ఉండండి. నేను మీలో ఐక్యమై ఉంటాను. కొమ్మ స్వతహాగా ఫలమివ్వ లేదు. అది తీగకు అంటుకొని ఉండాలి. అదేవిధంగా మీరు నాలో ఉంటేనే ఫలమివ్వగలరు.

“నేను తీగను. మీరు నా కొమ్మలు. ఒక వ్యక్తి నాలో ఉండి నేను అతనిలో ఉంటే అతడెక్కువ ఫల మివ్వగలడు. నాకు దూరంగా ఉండి మీరేమీ చెయ్యలేరు. నాలో ఉండని వాళ్ళు కొమ్మవలే పారవేయబడతారు. అప్పుడు కొమ్మలు ఎండి పోతాయి. వాటిని ప్రోగుచేసి ప్రజలు మంటల్లో వేస్తారు. అవి కాలిపోతాయి. మీరు నాలో, నా ఉపదేశాలు మీలో ఉంటే మీరు మీకిష్టమైన దేదైనా అడగండి. అది మీకిస్తాను. కోరింది జరుగుతుంది. మీరు ఎక్కువ ఫలం ఫలించి నా శిష్యులుగా ఉంటే నా తండ్రి మహిమ వ్యక్తం చేసిన వాళ్ళౌతారు.

“నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమకు పాత్రులైఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమలో నిలిచియున్నట్లుగా మీరు నా ఆజ్ఞలకు లోబడినట్లైతే నా ప్రేమలో నిలిచియుంటారు. 11 నా ఆనందం మీరు కూడా పంచుకోవాలని, మీరు సంపూర్ణంగా ఆనందించాలని మీకీ విషయాలన్నీ చెప్పాను. 12 నా ఆజ్ఞ యిది: నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో, అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి. 13 స్నేహితుల కోసం ప్రాణాలివ్వటం కన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను ఆజ్ఞాపించినట్లు చేస్తే మీరు నా స్నేహితులు. 15 నేను యిక మీదటి నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను. ఎందుకంటే, సేవకునికి తన యజమాని చేస్తున్నదేమిటో తెలియదు. కాని నేను నా తండ్రి నుండి విన్న వాటినన్నిటిని మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులని అన్నాను.

16 “మీరు నన్ను ఎన్నుకో లేదు. నేను మిమ్మల్ని ఎన్నుకొన్నాను. మీరు వెళ్ళి చిరకాలం ఉండే ఫలమివ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమించాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రి మీకిస్తాడు. 17 ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది నా ఆజ్ఞ.

ప్రపంచం యొక్క ద్వేషం

18 “ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆ ప్రపంచం మీకన్నా ముందు నన్ను ద్వేషించిందన్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి. 19 మీరు ప్రపంచానికి చెందిన వాళ్ళైతే ఆ ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని తమ వాళ్ళుగా ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచంనుండి ఎన్నుకొన్నాను. కనుక యిప్పుడు మీరు ఈ ప్రపంచానికి చెందరు. అందుకే ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది.

20 “‘యజమాని కంటే సేవకుడు గొప్పకాదు’ అని నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు నన్నే హింసించారు. కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు. వాళ్ళు నా సందేశం పాటించి ఉంటే మీ సందేశం కూడా పాటిస్తారు. 21 నన్ను పంపింది ఎవరో వాళ్ళకు తెలియదు. కనుక నా పేరిట వెళ్ళిన మీ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారు. 22 నేను రాకుండా, వాళ్ళకు బోధించకుండా ఉండివుంటే పాపదోషము వాళ్ళ మీద ఉండేది కాదు. కాని ఇప్పుడు వాళ్ళు తమ పాపాల నుండి తప్పించుకోలేరు.

23 “నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించిన వానిగా పరిగణింపబడతాడు. 24 నేను వాళ్ళ కోసం ఎవరూ చేయని ఈ మహాత్కార్యాలు చేసివుండక పోయినట్లైతే వాళ్ళకు ఈ పాపం అంటి ఉండేది కాదు. కాని యిప్పుడు వాళ్ళు నా అద్భుతాన్ని చూసారు. అయినా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు. 25 కాని ధర్మశాస్త్రంలో, ‘వాళ్ళు నిష్కారణంగా నన్ను ద్వేషించారు’[a] అని వ్రాయబడింది. నెరవేరటానికి యిలా జరిగింది.

26 “నేను నా తండ్రి నుండి సత్య స్వరూపియైన ఆత్మను మీకు ఆదరణకర్తగా పంపుతాను. తండ్రిలో నుండి వచ్చిన ఈ ఆత్మ నన్ను గురించి సాక్ష్యమిస్తాడు. 27 మీరు నాతో మొదటి నుండి ఉన్న వాళ్ళు కనుక మీరు కూడా సాక్ష్యం చెప్పాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International