Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 29

యూదా రాజుగా హిజ్కియా

29 హిజ్కియా రాజయ్యేనాటికి ఇరువై యైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా. అబీయా జెకర్యా కుమార్తె. ప్రభువైన యెహోవా ఆశించిన మంచి కార్యాలన్నీ హిజ్కియా చేశాడు. తన పూర్వీకుడైన దావీదులా అతడు ప్రతి మంచి పనినీ చేశాడు.

హిజ్కియా ఆలయానికి తలుపులు పెట్టించి, ద్వారాలను పటిష్ఠంచేశాడు. హిజ్కియా ఆలయాన్ని మరల తెరిచాడు. అతడు రాజైన మొదటి సంవత్సరం మొదటి నెలలో ఈ పని చేశాడు. 4-5 యాజకులను, లేవీయులను హిజ్కియా సమావేశపర్చాడు. ఆలయానికి తూర్పు భాగానగల ఖాళీ ప్రదేశంలో అతడు వారిని కలిశాడు. వారితో హిజ్కియా యిలా అన్నాడు: “లేవీయులారా, ఇది వినండి! మీరంతా పవిత్ర సేవా కార్యక్రమానికి సిద్ధంకండి. యెహోవా యొక్క ఆలయాన్ని పవిత్రం చేసే కార్యక్రమానికి అంతా సిద్ధం చేయండి. యెహోవా మీ పితరులు అనుసరించిన దేవుడు. ఆలయానికి చెందని వస్తువులన్నీ అక్కడ నుంచి తీసిపారవేయండి. ఆ వస్తువులు ఆలయాన్ని పవిత్రం చేయజాలవు. మన పూర్వీకులు యెహోవాను వదిలి పెట్టారు. యెహోవా యొక్క ఆలయాన్ని చూడకుండా వారి ముఖాలు తిప్పుకున్నారు. వారు మండప ద్వారాలు మూసివేసి, ఆలయ దీపాలను ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవుని ఆలయపు పవిత్ర స్థానంలో ధూపం వేయటం, దహనబలులు అర్పించటం మానివేశారు. కావున యెహోవా యూదా, యెరూషలేము ప్రజలపట్ల మిక్కిలి కోపంగా వున్నాడు. యెహోవా వారిని శిక్షించాడు. అన్యదేశాలవారు యెహోవా పేరు విని భయపడ్డారు. యూదా, యెరూషలేము ప్రజలను యెహోవా శిక్షించిన తీరు చూసి వారు మిక్కిలి విస్మయం చెందారు. అన్యులు యూదా ప్రజలను చూసి అస్యహించుకుని, సిగ్గుతో తలలు ఆడించారు. ఇవన్నీ నిజమైన విషయాలని మీకు తెలుసు. స్వయంగా మీ కళ్లతో మీరే చూడవచ్చు. అందువల్లనే మీ పూర్వీకులు యుద్ధంలో చంపబడ్డారు. మన కుమారులు, కుమార్తెలు, భార్యలు బందీలుగా చేయబడ్డారు. 10 కావున హిజ్కియానైన నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకోదలిచాను. అప్పుడాయన మనపట్ల ఎంతమాత్రం కోపగించడు. 11 కావున మీరు సోమరితనం మానండి. ఏమాత్రం కాలయాపన చేయవద్దు. యెహోవాకు సేవ చేయటానికి యెహోవాయే మిమ్ముల్ని ఎన్నుకున్నాడు. మీరాయనను సేవించి, ఆయనకు దూపం వేయాలి.”

12-14 ఆలయాన్ని శుద్ధి చేయటానికి ఉద్యమించిన లేవీయులు ఎవరనగా:

కహాతీయుల వంశం నుండి అమాశై కుమారుడైన మహతు, మరియు అజర్యా కుమారుడైన యోవేలు.

మెరారీ వంశం నుండి అబ్దీ కుమారుడైన కీషు, మరియు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా.

గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యెవాహు; యెవాహు కుమారుడైన ఏదేను.

ఎలీషాపాను సంతతిలో షిమ్రీ, యెహియేలు,

ఆసాపు సంతతిలో జెకర్యా, మత్తన్యా.

హేమాను సంతతిలో యెహీయేలు, షిమీ

యెదూతూను సంతతిలో షెమయా, ఉజ్జీయేలు.

15 ఈ లేవీయులు తమ సోదరులనందరినీ పిలిపించి ఆలయాన్ని పవిత్రపర్చడానికి సంసిద్ధులయ్యారు. యెహోవా సంకల్పంతో వచ్చిన రాజాజ్ఞను వారు శిరసావహించారు. వారు ఆలయాన్ని శుద్ధి చేయటానికి లోనికి వెళ్లారు. 16 యాజకులు ఆలయాన్ని పవిత్ర పర్చటానికి అతి పవిత్రస్థలంలోనికి వెళ్లారు. ఆలయంలో వారు చూసిన అపవిత్రమైన వస్తువులన్నిటినీ తీసివేశారు. నిషేధించబడిన వస్తువులన్నిటినీ ఆలయపు ఆవరణలోనికి తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి ఆ నిషిద్ధ వస్తువులన్నిటినీ లేవీయులు కిద్రోను లోయకు తీసికొని వెళ్లి పారవేశారు. 17 మొదటి నెల మొదటి రోజున లేవీయులు పరిశుద్ధ కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. నెలలో ఎనిమిదవ రోజున లేవీయులు ఆలయ ఆవరణలోకి వచ్చారు. అప్పటి నుంచి మరో ఎనిమిది రోజులపాటు పవిత్రారాధనకు పనికి వచ్చేలా ఆలయాన్ని శద్ధిచేశారు. మొదటి నెలలో పదహారవ రోజున పని ముగించారు.

18 పిమ్మట వారు రాజైన హిజ్కియా వద్దకు వెళ్లారు. వారు ఆయనతో, “హిజ్కియా రాజా, మేము పూర్తి ఆలయాన్ని, దహనబలుల బలిపీఠాలను ఆలయంలో ఇతర పరికరాలను శుభ్రపర్చాము. నైవేద్యపు రొట్టెను వుంచే బల్లను, ఆ బల్ల మీద ఉపయోగించే పరికరాలను శుద్ధి చేశాము. 19 రాజైన అహాజు విశ్వాసంలేనివాడై, తాను రాజుగా వున్నప్పుడు కొన్ని వస్తువులను పారవేశాడు. కాని మేము ఆ వస్తువులన్నిటినీ సేకరించి తిరిగి అక్కడ వుంచి పవిత్ర సేవకార్యక్రమానికి సిద్ధం చేసాము. అవన్నీ ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు వున్నాయి” అని చెప్పారు.

20 రాజైన హిజ్కియా నగర అధికారులను సమావేశపర్చి, మరునాటి తెల్లవారుఝామునే యెహోవా ఆలయానికి వెళ్లాడు. 21 వారు ఏడు గిత్తలను, ఏడు గొర్రె పొట్టేళ్లను, ఏడు గొర్రె పిల్లలను మరియు ఏడు చిన్న మేకపోతులను తెచ్చారు. ఇవి యూదా రాజ్యం తరుపున పాపపరిహారార్థ బలుల నిమిత్తం, పవిత్ర స్థలాన్ని శుద్ధిపర్చటానికి, మరియు యూదా ప్రజల పాపపరిహారం కొరకు తేబడ్డాయి. యెహోవా బలిపీఠం మీద ఆ పశువులను బలి యిమ్మని రాజైన హిజ్కియా అహరోను సంతతి వారైన యాజకులకు ఆజ్ఞాపించాడు. 22 కావున యాజకులు గిత్త దూడలను చంపి రక్తాన్ని భద్రపర్చారు. పిమ్మట వారు గిత్త దూడల రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. తరువాత యాజకులు పొట్టేళ్లను చంపి, వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. ఆ తరువాత యాజకులు గొర్రెపిల్లలను చంపి, వాటి రక్తాన్ని బలిపీఠంమీద చల్లారు. 23-24 పిమ్మట యాజకులు మేక పోతులను రాజు ముందుకు, అక్కడ చేరిన ప్రజల ముందుకు తెచ్చారు. ఈ మేకలు పాపపరిహారార్థ బలికొరకు తేబడ్డాయి. యాజకులు తమ చేతులను మేకల మీద వుంచి వాటిని చంపారు. యాజకులు మేకల రక్తాన్ని బలిపీఠం మీద పాపపరిహారం కొరకు చిలికించారు. ఇశ్రాయేలు ప్రజల పాపాలను దేవుడు క్షమించుగాకయని వారాపని చేశారు. ఇశ్రాయేలు ప్రజలందరి తరపున ఈ దహనబలులు, పాపపరిహార బలులు అర్పించాలని రాజు చెప్పాడు.

25 దావీదురాజుకు దైవజ్ఞుడైన గాదు, మరియు ప్రవక్తయైన నాతాను వీరంతా నిర్దేశించిన రీతిగా రాజైన హిజ్కియా యెహోవా ఆలయంలో తాళములు స్వరమండలములు, సితారలు వాయించటానికి లేవీయులను నియమించాడు. ఇలాగు జరుగవలెనని యెహోవా ప్రవక్తల మూలకంగా ఆజ్ఞాపించియున్నాడు. 26 కావున దావీదు చేయించిన వాద్య పరికరాలు చేతబుచ్చుకొని లేవీయులు, బూరలు పుచ్చుకొని యాజకులు సిద్ధంగా నిలబడ్డారు. 27 ఆ తరువాత హిజ్కియా బలిపీఠం మీద దహనబలి అర్పించమని ఆజ్ఞాపించాడు. దహనబలి మొదలైనప్పుడు దైవప్రార్థన కూడ మొదలయ్యింది. బూరలు ఊదబడ్డాయి. ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాలు వాయించబడ్డాయి. 28 దహనబలి కార్యక్రమం పూర్తయ్యే వరకు సమావేశమైన వారంతా తమ శిరస్సులు వంచారు. సంగీత విద్వాంసులు గానం చేశారు; యాజకులు బూరలు ఊదారు.

29 బలులన్నీ పూర్తి అయిన పిమ్మట రాజైన హిజ్కియా, అతనితో వున్న ప్రజలంతా శిరస్సులు వంచి ఆరాధించారు. 30 రాజైన హిజ్కియా, అధికారులు యెహోవాకు స్తుతిగీతాలు పాడుమని ఆజ్ఞ యిచ్చారు. దావీదు, దైవజ్ఞుడగు ఆసాపు రచించిన భక్తిగీతాలు వారు ఆలపించారు. వారు దేవుని కీర్తించి, ఆనందించారు. వారంతా శిరస్సులు వంచి దేవుని ఆరాధించారు. 31 తరువాత హిజ్కియా యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు మీ ప్రభువైన యెహోవా సేవకు పునరంకితమయ్యారు. దగ్గరకు రండి. బలులు, కృతజ్ఞతార్పణలు ఆలయానికి తీసుకొని రండి.” తరువాత ప్రజలు బలులు, కృతజ్ఞతా నైవేద్యాలు తెచ్చారు. సమర్పించాలనుకున్నవారు దహనబలులు కూడ తెచ్చారు. 32 సమావేశమైన, ప్రజలు మందిరానికి తెచ్చిన అనేక దహన బలులు యిలా వున్నాయి: డెభ్బై గిత్త దూడలు, వంద పొట్టేళ్లు, మరియు రెండు వందల గొర్రె పిల్లలు. ఈ జంతువులన్నీ యెహోవాకు దహనబలులుగా సమర్పించబడ్డాయి. 33 యెహోవాకు పరిశుద్ధ బలులుగా ఆరు వందల గిత్తలు, మరియు మూడువేల మేకలు, గొర్రెలు వున్నాయి. 34 దహన బలుల జంతువుల చర్మాలు తీయటానికి, వాటిని నరకటానికి తగినంత మంది యాజకులు లేరు. కావున వారి బంధువులగు లేవీయులు కార్యక్రమం పూర్తయ్యే వరకు, ఇతర యాజకులు పవిత్ర సేవా కార్యక్రమానికి సిద్ధమై వచ్చేవరకు సహాయపడ్డారు. లేవీయులు మాత్రం గంభీరంగా తమ ప్రభువైన యెహోవా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. వారు యాజకులకంటె ఎక్కువగా పనిమీద మనస్సు లగ్నం చేశారు. 35 అక్కడ దహనబలులు, సమాధానబలుల కొవ్వు, పానార్పణలు విస్తారంగా జరుపబడ్డాయి. ఆ విధంగా ఆలయంలో సేవా కార్యక్రమం మళ్లీ మొదలయింది. 36 హిజ్కియా, అతని ప్రజలు దేవుడు తన ప్రజలకొరకు చేసిన ఏర్పాట్ల పట్ల సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమం ఇంత త్వరగా చేయించినందుకు వారిలో ఆనందం వెల్లివిరిసింది.

ప్రకటన 15

ఏడు తెగుళ్ళతో ఏడుగురు దూతలు

15 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.

నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించినవాళ్ళు, దాని నామానికున్న సంఖ్యను జయించినవాళ్ళు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు. దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొఱ్ఱెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు:

“ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన దైవమా!
    నీ కార్యాలు గొప్పవి. అద్భుతమైనవి.
యుగయుగాలకు రాజువు నీవు.
    నీ మార్గాలు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.
ఓ ప్రభూ! నీకెవరు భయపడరు?
నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు?
    నీ వొక్కడివే పరిశుద్ధుడవు.
నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి.
    కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”

దీని తర్వాత పరలోకంలో ఉన్న మందిరాన్ని చూసాను. అంటే సాక్ష్యపు గుడారము తెరుచుకోవటం చూసాను. ఆ మందిరం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళతో బయటకు వచ్చారు. వాళ్ళు తెల్లటి మెరిసే నార బట్టలు వేసుకొని ఉన్నారు. రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి ఆ ఏడుగురు దూతలకు చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన ఏడు బంగారు పాత్రల్ని యిచ్చింది. ఆ మందిరమంతా దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల కలిగిన పొగలతో నిండిపోయింది. ఏడుగురు దూతలు తెచ్చిన ఏడు తెగుళ్ళు పూర్తి అయ్యేవరకు ఆ మందిరంలో ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు.

జెకర్యా 11

ఇతర రాజ్యాల్ని దేవుడు శిక్షించటం

11 లెబానోనూ, అగ్ని ప్రవేశించి నీ దేవదారు వృక్షాలను[a]
    కాల్చివేసేలాగు నీ ద్వారాలను తెరువు.
దేవదారు వృక్షాలు పడిపోయినందుకు సరళ వృక్షాలు విచారిస్తాయి.
    బలమైన ఆ చెట్లు దూరంగా తీసుకుపోబడ్డాయి.
బాషానులోని సింధూర వృక్షాలు
    నరికి వేయబడిన అడవికొరకు దుఃఖిస్తాయి.
విలపించే కాపరుల రోదనను వినండి.
    శక్తివంతులైన వారి నాయకులు పట్టుబడ్డారు.
యువకిశోరాల గర్జన వినండి.
    యొర్దాను నదివద్దగల వాటి చిక్కటి పొదలన్నీ తీసుకుపోబడ్డాయి.

దేవుడైన యెహోవా చెపుతున్నాడు, “చంపటానికి పెంచబడ్డ గొర్రెల విషయం జాగ్రత్త తీసుకో. వాటి నాయకులు యజమానులవలెను, వ్యాపారులవలెను ఉన్నారు. యజమానులు వారి గొర్రెలను చంపుతారు. అయినా వారు శిక్షింపబడరు. వ్యాపారులు గొర్రెలను అమ్మి, ‘దేవునికి జయం, నేను భాగ్యవంతుడనయ్యాను’ అని అంటారు. కాపరులు తమ గొర్రెల కొరకు విచారించరు. ఈ దేశంలో నివసించే ప్రజల కొరకు నేను విచారించను.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను ప్రతివాడినీ తన పొరుగువానిచేత, రాజుచేత దూషింపబడేటట్లు చేస్తాను. వారి దేశాన్ని నాశనం చేసేలాగు నేను వారిని వదులుతాను. నేను వారిని ఆపను!”

కావున చంపబడటానికి పెంచబడిన ఆ అభాగ్యపు గొర్రెలపట్ల నేను శ్రద్ధ తీసుకున్నాను. నాకు రెండు కర్రలు దొరికాయి. ఒక కర్రను “అభిమానం” అని, మరొక కర్రను “సమైక్యత” అని పిలిచాను. తరువాత నేను గొర్రెలపట్ల శ్రద్ధ తీసుకోవటం మొదలు పెట్టాను. ముగ్గురు కాపరులను ఒక్క నెలలో సంహరించాను. నేను గొర్రెలపట్ల కోపించగా, వారు నన్ను ద్వేషించటం మొదలు పెట్టారు. అప్పుడు నేను ఇలా అన్నాను: “నేను వదిలి వేస్తాను! నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకోను! చావు కోరేవారిని నేను చనిపోనిస్తాను. నాశనమైపోవాలని కోరుకొనేవారిని నేను నాశనం కానిస్తాను. ఇంకా మిగిలినవారు ఒకరినొకరు నాశనం చేసుకుంటారు.” 10 తరువాత “అభిమానం” అనే కర్రను నేను తీసుకొని విరుగగొట్టాను. తన ప్రజలతోగల దేవుని ఒడంబడిక రద్దయినట్లు చూపటానికే నేనిది చేశాను. 11 కావున ఆ రోజున నిబంధన రద్దయింది. నన్ను గమనిస్తున్న ఆ నిర్భాగ్యపు గొర్రెలకు ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినదని తెలుసు.

12 అప్పుడు నేనిలా అన్నాను: “మీరు నాకు వేతనం ఇవ్వదలిస్తే ఇవ్వండి. వద్దనుకుంటే మానండి!” వారప్పుడు ముప్పై వెండి నాణెములిచ్చారు. 13 తరువాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “అంటే నా విలువ అంత మాత్రమేనని వారనుకుంటున్నారన్నమాట. ఆ మహాధనాన్ని[b] ఆలయ ఖజానాలో పడవేయి.” కావున ఆ ముప్పై వెండి నాణాలను తీసుకొని యెహోవా ఆలయంలోని ఖజానాలో పడవేశాను. 14 పిమ్మట “సమైక్యత” అనే కర్రను తీసుకొని రెండుగా నరికాను. యూదా, ఇశ్రాయేలుల మధ్యగల ఐక్యతకు భంగం వాటిల్లిందని చూపటానికి నేనిది చేశాను.

15 పిమ్మట యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు గొర్రెలను కాయటానికి అసలు పనికిరాని ఒక కర్రను చూడు. 16 ఈ దేశానికి ఒక కొత్త కాపరిని నేను తెస్తానని ఇది చూపుతుంది. కాని ఈ యువకుడు నాశనం కాబడుతున్న గొర్రెలపట్ల జాగ్రత్త తీసుకోలేడు. గాయపడిన గొర్రెలను అతడు బాగు చేయలేడు. బతికివున్న వాటికి అతడు గ్రాసం[c] ఇవ్వలేడు. ఆరోగ్యంగా ఉన్నవి పూర్తిగా తినబడతాయి. కేవలం వాటి గిట్టలు మాత్రం వదిలివేయబడతాయి.”

17 పనికిమాలిన ఓ నా కాపరీ,
    నీవు నా గొర్రెలను వదిలివేశావు.
అతనిని శిక్షించు!
    అతని కుడి చేతిని, కుడి కంటిని కత్తితో కొట్టు.
    అతని కుడిచేయి నిరుపయోగమవుతుంది.
    అతని కుడి కన్ను గ్రుడ్డిదవుతుంది.

యోహాను 14

యేసు తన శిష్యులను ఆదరించటం

14 “మీరు ఆందోళన చెందకండి. దేవుణ్ణి నమ్మండి. నన్ను కూడా నమ్మండి. నా తండ్రి యింట్లో ఎన్నో గదులున్నాయి. అలా లేక పోయినట్లైతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము నేర్పాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం. నేను వెళ్ళే చోటికి వచ్చే దారి మీకు యిదివరకే తెలుసు” అని యేసు అన్నాడు.

తోమా ఆయనతో, “ప్రభూ! మీరు వెళ్ళే చోటు ఎక్కడుందో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకా దారి ఏ విధంగా తెలుస్తుంది?” అని అన్నాడు.

యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే! నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు. నేను ఎవరో మీకు నిజంగా తెలిసివుంటే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. ఆయనెవరో మీకు తెలుసు” అని సమాధానం చెప్పాడు.

ఫిలిప్పు, “ప్రభూ! మాకు తండ్రిని చూపండి. అది చాలు” అని అన్నాడు.

యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను యింత కాలం మీతో కలిసి ఉన్నాను కదా! అయినా నేనెవరినో నీకు తెలియదా ఫిలిప్పు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అలాగైతే తండ్రిని చూపుమని ఎందుకు అడుగుతున్నావు? 10 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నాడని, నీవు నమ్మటం లేదా? నేను చెప్పే మాటలు నా స్వంతవి కావు. నాలో నివసిస్తున్న తండ్రి తన పనిని చేస్తున్నాడు. 11 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నామని నమ్మండి. లేక మహాత్కార్యాలు చూసైనా నమ్మండి.

12 “ఇది నిజం. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నన్ను నమ్మిన ప్రతి ఒక్కడూ నేను చేసిన కార్యాలు చేస్తాడు. వీటికన్నా యింకా గొప్ప కార్యాలే చేస్తాడు. 13 కుమారుని ద్వారా తండ్రి మహిమ పొందటానికి మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను. 14 నా పేరిట నన్ను ఏమడిగినా నేను చేస్తాను.

పవిత్రాత్మ వాగ్దానం

15 “మీకు నా మీద ప్రేమ ఉంటే నేను ఆజ్ఞాపించినట్లు చేస్తారు. 16-17 మీతో చిరకాలం ఉండి, మీకు సహాయం చెయ్యటానికి మరొక ఉత్తరవాదిని[a] పంపుమని నేను తండ్రిని అడుగుతాను. ఆయన ఆత్మను పంపుతాడు. ఆ పవిత్రాత్మ సత్యాన్ని ప్రకటించటం తన కర్తవ్యం. ప్రపంచం ఆయన్ని చూడలేదు. ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కనుక ఆయన్ని అంగీకరించలేదు. ఆయన మీతో ఉన్నాడు కనుక మీకు ఆయన గురించి తెలుసు. ఆయన భవిష్యత్తులో మీతో ఉంటాడు. లోకం ఆయన్ని అంగీకరించలేదు, ఎందుకంటే అది ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు.

18 “నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. మీ దగ్గరకు తిరిగి వస్తాను. 19 కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో అదే విధంగా మీరు కూడా జీవిస్తారు. 20 ఆ రోజు నేను తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న విషయం మీరు గ్రహిస్తారు. 21 నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్షమౌతాను.”

22 అప్పుడు యూదా (యూదా ఇస్కరియోతు కాదు), “కాని ప్రభూ! మీరు మాకు మాత్రమే ప్రత్యక్షమై, ప్రపంచానికి ప్రత్యక్షంకానని ఎందుకంటున్నారు?” అని అన్నాడు.

23 యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము. 24 నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.

25 “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 26 తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు.

27 “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి. 28 నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29 ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను.

30 “ఈ లోకాధికారి రాబోతున్నాడు. అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు నన్నేమీ చెయ్యలేడు. 31 కాని నాకు తండ్రిపై ప్రేమ ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే యిలా చేస్తున్నాను.

“రండి, యిక్కడి నుండి వెళ్దాం!”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International