M’Cheyne Bible Reading Plan
అహజ్యా యూదా రాజవటం
22 యెహోరాము స్థానంలో యెరూషలేము ప్రజలు అహజ్యాను[a] కొత్త రాజుగా చేసారు. అహజ్యా యెహోరాము యొక్క చిన్న కుమారుడు. అరబీయులతో యెహోరాము మీదికి వచ్చిన ప్రజలు యెహోరాము కుమారులందరినీ చంపివేశారుగాని, చిన్నవానిని మాత్రం వదిలారు. అందువల్ల అహజ్యా యూదాలో పరిపాలించగలిగాడు. 2 అహజ్యా పరిపాలన ఆరంభించే నాటికి ఇరువది రెండేండ్లవాడు.[b] యెరూషలేములో అహజ్యా ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. అతల్యా తండ్రి పేరు ఒమ్రీ. 3 అహాబు కుటుంబం నివసించిన తీరునే అహజ్యా నివసించాడు. అతడలా నివసించటానికి కారణం అతని తల్లి అతనిని దుష్టకార్యాలకు ప్రేరేపించటమే. 4 యెహోవా దృష్టిలో అహజ్యా పాపకార్యాలు చేశాడు. అహాబు కుటుంబం కూడా అదే చేసింది. అహజ్యా తండ్రి చనిపోయినపిమ్మట అతనికి అహాబు కుటుంబం వారు సలహాదారులయ్యారు. వారు అహజ్యాకు తప్పుడు సలహాలిచ్చారు. ఆ తప్పుడు సలహాలే అతని చావుకు దారితీశాయి. 5 అహాబు కుటుంబం అతని కిచ్చిన సలహనే అహజ్యా పాటించాడు. ఇశ్రాయేలు రాజైన యెహోరాముతో కలిసి అహజ్యా అరాము (సిరియా) రాజైన హజాయేలుపై యుద్ధానికి రామోత్గిలాదు పట్టణానికి వెళ్లాడు. యెహోరాము తండ్రి ఇశ్రాయేలు రాజైన అహాబు. కాని అరామీయులు (సిరియనులు) యుద్ధంలో యెహోరామును గాయపర్చారు. 6 యెహోరాము తన గాయాలను నయం చేసికోటానికి యెజ్రెయేలుకు తిరిగి వెళ్లాడు. అరాము రాజైన హజాయేలుతో రామోతు వద్ద పోరాడుతుండగా అతడు గాయపడ్డాడు. పిమ్మట యెహోరామును చూడటానికి అహజ్యా (యెహోయహాజు) యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు. అహజ్యా తండ్రి పేరు యూదా రాజైన యెహోరాము. యెహోరాము తండ్రి పేరు అహాబు. యెహోరాము గాయపడటంతో అతడు యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు.
7 యెహోరామును చూడటానికి అహజ్యా వెళ్లినప్పుడు దేవుడు అతనికి మరణం కలుగజేశాడు. అహజ్యా వెళ్లి యెహోరాముతో కలిసి యెహూను చూడటానికి వెళ్లాడు. యెహూ తండ్రి పేరు నింషీ. అహాబు వంశాన్ని నాశనం చేయటానికి దేవుడు యెహూను నియమించాడు. 8 అహాబు వంశాన్ని యెహూ నాశనం చేస్తూవున్నాడు. అప్పుడతడు యూదా పెద్దలను, అహజ్యా సేవలో వున్న అతని బంధువులను చూశాడు. యూదా పెద్దలను, అహజ్యా బంధువులను యెహూ చంపివేశాడు. 9 పిమ్మట అహజ్యా కొరకు యెహూ వెదికాడు. అతడు సమరయ (షోమ్రోను) పట్టణంలో దాగుకొనే ప్రయత్నం చేస్తూండగా యెహూ మనుష్యులు అతనిని పట్టుకున్నారు. వారు అహజ్యాను యెహూ వద్దకు తీసుకొని వచ్చారు. వారు అహజ్యాను చంపి, సమాధి చేశారు. “అహజ్యా యెహోషాపాతు వారసుడు. యెహోషాపాతు యెహోవాను నిండు హృదయంతో అనుసరించాడు” అని వారు అన్నారు. యూదా రాజ్యాన్ని సమైక్యంగా వుంచే శక్తి అహజ్యా కుటుంబానికి లేదు.
రాణి అతల్యా
10 అహజ్యా తల్లి పేరు అతల్యా. తన కుమారుడు చంపబడ్డాడని తెలుసుకోగానే ఆమె యూదాలో రాజ వంశస్తుల నందరినీ చంపివేసింది. 11 కాని యెహోషెబతు[c] అనే స్త్రీ అహజ్యా కుమారుడైన యోవాషును దాచివేసింది. యోవాషును, అతని దాదిని యెహోషెబతు లోపలి పడకగదిలో దాచింది. యెహోషెబతు రాజైన యెహోరాము కుమార్తె. ఆమె యెహోయాదా భర్యా. యెహోయాదా ఒక యాజకుడు. పైగా యెహోషెబతు అహజ్యాకు సోదరి. యెహోషెబతు దాచిన కారణంగా, యోవాషును అతల్యా చంపలేకపోయింది. 12 ఆలయంలో ఆరు సంవత్సరాల పాటు యోవాషు యాజకుల వద్ద దాచబడ్డాడు. ఆ సమయంలో అతల్యా పరిపాలన కొనసాగింది.
యాజకుడైన యెహోయాదా, రాజైన యోవాషు
23 ఆరు సంవత్సరాల అనంతరం యెహోయాదా తనశక్తిని, ధైర్యాన్ని చూపించాడు. అతడు సైనికాధిపతులతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ అధిపతులు ఎవరంటే యెరోహాము కుమారుడు అజర్యా; యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలు; ఓబేదు కుమారుడైన అజర్యా; అదాయా కుమారుడైన మయశేయా; మరియు జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతు. 2 వారు యూదా రాజ్యమంతా తిరిగి, యూదా పట్టణాలలో వున్న లేవీయులను కూడ గట్టారు. వారు ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలనుకూడ కలుపుకున్నారు. పిమ్మట వారు యెరూషలేముకు వెళ్లారు. 3 వీరంతా ఆలయంలో సమావేశమై రాజుతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నారు.
ఆ ప్రజలనుద్దేశించి యెహోయాదా యిలా అన్నాడు: “రాజకుమారుడు పరిపాలిస్తాడు. దావీదు సంతతి వారి విషయంలో యెహోవా ఇదే వాగ్దానం చేశాడు. 4 ఇప్పుడు మీరు చేయవలసినదేమనగా: విశ్రాంతి దినాన విధులకు వెళ్లే యాజకులు, లేవీయులలో మూడవ వంతు వారు ద్వారాల వద్ద కాపలా వుండాలి. 5 మీలో ఒక వంతు రాజు ఇంటి వద్ద వుండాలి. ఇంకొక వంతు ప్రధాన ద్వారం (పునాది ద్వారం) వద్ద నిఘావేయాలి. మిగిలిన వారంతా ఆలయ ఆవరణలలో వుండాలి. 6 యెహోవా ఆలయంలో ఎవ్వరినీ ప్రవేశించనీయకండి. యాజకుడు, లేవీయులు పరిశుద్ధులు గనుక వారు మాత్రమే సేవ చేయటానికి లోనికి అనుమతింపబడాలి. వీరు మినహా, మిగిలిన వారంతా యెహోవా నిర్దేశించిన తమ తమ పనులను యధావిధిగా ఆచరించాలి. 7 లేవీయులు రాజు వద్ద నిలవాలి. ప్రతి ఒక్కడూ తన కత్తిని తప్పక ధరించి వుండాలి. ఎవ్వడేగాని ఆలయంలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తే వానిని చంపి వేయండి. రాజు ఎక్కడికి వెళితే అక్కడికి మీరు కూడ అతనితో వెళ్లాలి.”
8 యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినదంతా లేవీయులు, యూదా ప్రజలు అంగీకరించారు. యాజకుల వర్గాలలో ఎవ్వరినీ యాజకుడైన యెహోయాదా ఉపేక్షించి ఊరు కోలేదు. విశ్రాంతి దినాన బయటకు వెళ్లిన వారితో కలిసి ప్రతి సైన్యాధిపతి, అతని మనుష్యులు లోనికి వచ్చారు. 9 యాజకుడైన యెహోయాదా రాజైన దావీదుకు చెందిన ఈటెలను, చిన్న పెద్ద డాళ్లను అధికారులకు ఇచ్చాడు. ఆ ఆయుధాలన్నీ ఆలయంలో వుంచబడ్డాయి. 10 పిమ్మట యెహోయాదా ఎవరెక్కడ నిలబడాలో ఆ మనుష్యులకు చెప్పాడు. ప్రతి ఒక్కడూ తన ఆయుధాన్ని ధరించివున్నాడు. వారంతా ఆలయానికి కుడినుండి ఎడమ ప్రక్కకు బారులుదీరి నిలబడ్డారు. వారు బలిపీఠానికి, ఆలయానికి రాజుకు దగ్గరగా నిలబడ్డారు. 11 వారు రాజకుమారుణ్ణి బయటకు తీసికొని వచ్చి, వాని తలపై కిరీటం పెట్టారు. ఒక ధర్మశాస్త్ర గ్రంథ ప్రతిని అతనికిచ్చారు.[d] తరువాత వారు యోవాషును రాజుగా ప్రకటించారు. యెహోయాదా, అతని కుమారులు కలిసి యోవాషును అభిషిక్తుని చేశారు. వారు “రాజు చిరంజీవియగు గాక!” అని అన్నారు.
12 ప్రజలు ఆలయానికి పరుగెత్తే శబ్దం, రాజును ప్రశంసించే ధ్వనులు అతల్యా విన్నది. ఆమె ఆలయంలో వున్న ప్రజల వద్దకు వచ్చింది. 13 ఆమె రాజును పరికించి చూసింది. ముందు ద్వారం వద్ద రాజస్తంభం దగ్గర రాజు నిలబడి ఉన్నాడు. అధికారులు, బూరలు వూదే వారు రాజుదగ్గర వున్నారు. దేశప్రజలు చాలా సంతోషంగా వున్నారు. వారు బూరలు వూదుతూ వున్నారు. సంగీత వాద్య విశేషాలపై గాయకులు పాడుతున్నారు. ప్రజలందరి చేత దేవునికి స్తుతిగీతాలు గాయకులు తమతోపాటు పాడించారు. ఇదంతా చూచి కలత చెందిన అతల్యా తన బట్టలు చింపుకొని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.
14 యాజకుడైన యెహోయాదా సైన్యాధిపతులను బయటకు రప్పించాడు. “అతల్యాను బయటవున్న సైన్యం వద్దకు తీసుకొని వెళ్లండి. ఆమెను ఎవరైనా అనుసరిస్తే వారిని మీ కత్తులతో నరికి వేయండి” అని వారికి చెప్పాడు. “కాని, అతల్యాను ఆలయంలో మాత్రం చంపవద్దు” అని యాజకుడు సైనికులను హెచ్చరించాడు. 15 తర్వాత అతల్యా రాజ భవనపు అశ్వద్వారం వద్దకు వచ్చినప్పుడు వారామెను పట్టుకున్నారు. ఆమెను ఆ భవనం వద్దనే వారు చంపివేశారు.
16 అప్పుడు యెహోయాదా ప్రజలతోను, రాజుతోను ఒక ఒడంబడిక చేసుకున్నాడు. వారంతా యెహోవా భక్తులై ఆయనను అనుసరించటానికి ఒప్పుకున్నారు. 17 ఆ జనమంతా బయలు విగ్రహం ఆలయంలోకి వెళ్లి దానిని నిలువునా పగులగొట్టారు. బయలు ఆలయంలో వున్న బలిపీఠాలను, ఇతర విగ్రహాలను కూడ వారు నాశనం చేశారు. బయలు పీఠాల ముగింటనే బయలు దేవత యాజకుడైన మత్తానును చంపివేశారు.
18 పిమ్మట యెహోయాదా యెహోవా ఆలయ బాధ్యతలు స్వీకరించే యాజకులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు లేవీయులు. ఆలయ యాజమాన్యం పనిని దావీదు వారికి అప్పజెప్పాడు. మోషే ధర్మశాస్త్రానుసారం ఆ యాజకులు యెహోవాకు దహనబలులు సమర్పిస్తారు. దావీదు ఆజ్ఞాపించిన రీతిగా వారు ఆనందోత్సాహాలతో బలులు అర్పించారు. 19 ఏరకంగానైనా సరే అపరిశుభ్రంగా ఎవ్వరూ ఆలయంలో ప్రవేశించకుండా యెహోయాదా ఆలయ ద్వారాల వద్ద కాపలాదారులను నియమించాడు.
20 యెహోయాదా సైన్యాధిపతులను, ప్రజానాయకులను, ప్రాంతీయ పాలకులను, ఇతర ప్రజలందరినీ తనతో తీసికొని వెళ్లాడు. ఆలయం నుండి రాజును కూడ తనతో తీసుకొని పై ద్వారం గుండా రాజభవనానికి వెళ్లాడు. అక్కడ వారు రాజును సింహాసనంపై కూర్చుండబెట్టారు. 21 యూదా ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. అతల్యా కత్తివేటుకు గురియై చనిపోవటంతో యెరూషలేము నగరంలో శాంతి నెలకొన్నది.
దేవదూత, చిన్న గ్రంథము
10 శక్తివంతుడైన మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి రావటం చూశాను. ఆయన మేఘాన్ని ఒక వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన తలపై మేఘధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యునిలా ఉంది. ఆయన కాళ్ళు మండుతున్న స్తంభాల్లా ఉన్నాయి. 2 ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథం ఉంది. అది తెరువబడి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రం మీద, ఎడమకాలు భూమ్మీద ఉంచి బిగ్గరగా అరిచాడు. 3 ఆ అరుపు సింహ ఘర్జనలా ఉంది. ఆయన అలా అరచినప్పుడు ఏడు ఉరుములు మాట్లాడాయి.
4 ఏడు ఉరుములు మాట్లాడిన వాటిని నేను వ్రాయటం మొదలుపెట్టాను. కాని పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఏడు ఉరుములు అన్న మాటల్ని దాచి ముద్ర వేయి, వాటిని వ్రాయవద్దు” అని అన్నది.
5 సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వైపుకు చాపాడు. 6 చిరకాలం జీవించేవాని మీద, పరలోకం, అందులో ఉన్నవాటిని సృష్టించినవాని మీద, భూమిని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టంచినవానిమీద, సముద్రాన్ని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టించినవాని మీద ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు: “ఇక ఆలస్యం ఉండదు. 7 కాని ఏడవ దూత తన బూర ఊదటం మొదలు పెట్టే రోజులు వచ్చినప్పుడు దేవుని రహస్య ప్రణాళిక సమాప్తమౌతుంది. దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ఈ రహస్యాన్ని ముందే చెప్పాడు.” అని అన్నాడు.
8 నేను పరలోకం నుండి విన్న స్వరం మళ్ళీ నాతో, “వెళ్ళు. సముద్రం మీదా, భూమ్మీదా నిలబడి ఉన్న దూత చేతిలో తెరువబడివున్న గ్రంథాన్ని తీసుకో!” అని అన్నది.
9 అందువల్ల, నేను దేవదూత దగ్గరకు వెళ్ళి, ఆ చిన్న గ్రంథాన్నివ్వమని అడిగాను. ఆయన నాతో, “ఇది తీసుకొని తిను. అది నీ కడుపుకు చేదు కలిగిస్తుంది. కాని నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది” అని అన్నాడు. 10 నేనా చిన్న గ్రంథాన్ని, దూత చేతినుండి తీసుకొని తినివేసాను. అది నా నోటికి తేనెలా మధురంగా ఉండెను. కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగానుండెను. 11 ఆ తర్వాత ఆ దూత నాతో, “నీవు చాలమంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” అని అన్నాడు.
నాలుగు రథాలు
6 నేను పిమ్మట నలు పక్కలా తిరిగి, పైకి చూశాను. అక్కడ నాలుగు రథాలు నాలుగు కంచుపర్వతాల మధ్యగా వెళ్లుచున్నట్లు నేను చూశాను. 2 ఎర్రగుర్రాలు మొదటి రథాన్ని లాగుతున్నాయి. నల్లగుర్రాలు రెండవ రథాన్ని లాగుతున్నాయి. 3 తెల్లగుర్రాలు మూడవ రథాన్ని లాగుతున్నాయి. మరియు ఎర్రమచ్చలున్న గుర్రాలు నాలుగో రథాన్ని లాగుతున్నాయి. 4 నాతో మాట్టాడుచున్న దేవదూతను, “అయ్యా వీటి అర్థమేమిటి?” అని అడిగాను.
5 దేవదూత ఇలా సమాధానమిచ్చాడు: “ఇవి నాలుగు గాలులు.[a] ఇవి కేవలం ఈ సర్వలోకానికి ప్రభువైన దేవుని ముందునుండి వచ్చాయి. 6 నల్లగుర్రాలు ఉత్తరానికి వెళతాయి. ఎర్రగుర్రాలు తూర్పుకు వెళతాయి. తెల్ల గుర్రాలు పడమటికి వెళతాయి. ఎర్ర మచ్చల గుర్రాలు దక్షిణానికి వెళతాయి.”
7 ఎర్రమచ్చల గుర్రాలు తమకు చెందిన భూభాగాన్ని చూడాలని ఆత్రంగా ఉన్నాయి. కావున దేవదూత వాటితో, “వెళ్లి, భూమి మీద నడవండి” అని అన్నాడు. అందుచే అవి వాటికి చెందిన ప్రాంతంలో నడుస్తూ వెళ్లాయి.
8 తరువాత యెహోవా నన్ను బిగ్గరగా పిలిచి ఇలా అన్నాడు: “చూడు, ఉత్తరానికి వెళ్తున్న గుర్రాలు బబులోనులో తమ పని పూర్తి చేశాయి. అవి నా ఆత్మను శాంతింపజేశాయి. నేనిప్పుడు కోపంగా లేను!”
యాజకుడైన యెహోషువ కిరీటాన్ని పొందటం
9 పిమ్మట యెహోవానుండి నేను మరొక వర్తమానం అందుకున్నాను. 10 ఆయన ఇలా చెప్పాడు: “బబులోనులో బందీలుగాఉన్న వారిలోనుండి హెల్దయి, టోబీయా, యెదాయా అనేవారు వచ్చారు. వారి వద్దనుండి వెండి బంగారాలు తీసికొని, జెఫన్యా కుమారుడైన యోషీయా ఇంటికి వెళ్లు. 11 ఆ వెండి బంగారాలను ఒక కిరీటం చేయటానికి వినియోగించు. ఆ కిరీటాన్ని యెహోషువ తలమీద పెట్టు. (యెహోషువ ప్రధాన యాజకుడు. యెహోజాదాకు కుమారుడే యెహోషువ) తరువాత యెహోషువకు ఈ విషయాలు చెప్పు. 12 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“కొమ్మ అని పిలువబడే ఒక మనిషి ఉన్నాడు.
అతడు బలంగా పెరుగుతాడు.
అతడు యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు.
13 అతడు యెహోవా ఆలయాన్ని నిర్మించి,
గౌరవాన్ని పొందుతాడు.
అతడు తన సింహాసనంపై కూర్చుని, పాలకుడవుతాడు.
ఒక యాజకుడు అతని సింహాసనంవద్ద నిలబడతాడు.
ఈ ఇద్దరు మనుష్యులూ శాంతియుత వాతావరణంలో కలిసి పనిచేస్తారు.
14 వారు కిరీటాన్ని ప్రజల జ్ఞాపకార్థం ఆలయంలో ఉంచుతారు. ఆ కిరీటం హెల్దయి, టోబీయా, యెదాయా మరియు జెఫన్నా కుమారుడైన యోషీయాలకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.”
15 మిక్కిలి దూరంలో నివసిస్తున్నవారు వచ్చి ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పుడు ప్రజలైన మీవద్దకు యెహోవా నన్ను పంపినట్లు మీరు నిశ్చయంగా తెలుసుకుంటారు. యెహోవా ఏమి చెపుతున్నాడో అది మీరు చేస్తే ఈ విషయాలన్నీ జరుగుతాయి.
యేసు ఒక పుట్టు గ్రుడ్డివానిని నయం చేయటం
9 ఆయన వెళ్తూ ఒక పుట్టు గ్రుడ్డి వాణ్ణి చూశాడు. 2 ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ! యితడు గ్రుడ్డివానిగా పుట్టాడే! ఎవరు పాపం చేసారంటారు? ఇతడా లేక యితని తల్లిదండ్రులా?” అని అడిగారు.
3 యేసు, “ఇతడు కాని, యితని తల్లిదండ్రులు కాని పాపం చెయ్యలేదు! దేవుని శక్తి యితని జీవితం ద్వారా ప్రదర్శింపబడాలని గ్రుడ్డివానిగా పుట్టాడు. 4 సూర్యాస్తమయం అయ్యేలోగా మనం నన్ను పంపిన వాని కార్యం చేయాలి. రాత్రి రాబోతోంది. అప్పుడు ఎవ్వరూ పని చెయ్యలేరు. 5 ఈ ప్రపంచంలో నేను ఉన్నంత కాలం నేను దానికి వెలుగును” అని అన్నాడు.
6 ఈ విధంగా మాట్లాడి నేల మీద ఉమ్మి వేసాడు. ఆ ఉమ్మితో బురద చేసి, ఆ గ్రుడ్డివాని కళ్ళమీద పూసాడు. 7 అతనితో, “వెళ్ళి, సిలోయం కోనేట్లో కడుక్కో!” అని అన్నాడు. సిలోయం అన్న పదానికి అర్థం “పంపబడిన వాడు.” ఆ గ్రుడ్డివాడు వెళ్ళి తన కళ్ళు కడుక్కున్నాడు. అతనికి దృష్టి వచ్చాక తిరిగి వచ్చాడు.
8 అతని ఇరుగు, పొరుగు వాళ్ళు, అతడు భిక్షమెత్తు కుంటుండగా చూసిన వాళ్ళు, “ఈ మనిషి కూర్చొని భిక్షమెత్తు కుంటూవుండే వాడు కదా!” అని అన్నారు.
9 కొందరు, “ఔనన్నారు. మరికొందరు, కాదు ఇతడు అతనిలా కనిపిస్తున్నాడు, అంతే!” అని అన్నారు.
కాని అతడు స్వయంగా, “నేనే అతణ్ణి” అని అన్నాడు.
10 “మరి అలాగైతే నీకు దృష్టి ఎట్లా వచ్చింది!” అని వాళ్ళు అడిగారు.
11 అతడు, “యేసు అని పిలుస్తారే ఆయన బురద చేసి నా కళ్ళ మీద పూసాడు. తర్వాత నన్ను వెళ్ళి సిలోయం కొనేరులో కడుక్కోమన్నాడు. నేను అలాగే వెళ్ళి కడుక్కున్నాను. ఆ తర్వాత నాకు దృష్టి వచ్చింది” అని సమాధానం చెప్పాడు.
12 వాళ్ళు, “అతడెక్కడ ఉన్నాడు?” అని అడిగారు.
ఆయన, “నాకు తెలియదు” అని అన్నాడు.
పరిసయ్యులు విచారించటం
13 వాళ్ళు యింతకు పూర్వం గ్రుడ్డివానిగా ఉన్న వాణ్ణి పరిసయ్యుల దగ్గరకు పిలుచుకు వచ్చారు. 14 బురద చేసి ఆ గ్రుడ్డివానికి నయం చేసింది విశ్రాంతి రోజు. 15 పరిసయ్యులు దృష్టి ఎట్లా వచ్చిందని అతణ్ణి ప్రశ్నించారు.
అతడు, “ఆయన నా కళ్ళమీద బురద పూసాడు. నేను వెళ్ళి కడుక్కొన్నాను. నాకు దృష్టి వచ్చింది” అని అన్నాడు.
16 కొందరు పరిసయ్యులు, “అతడు విశ్రాంతి రోజును పాటించడు. కనుక అతడు దేవుని నుండి రాలేదు!” అని అన్నారు.
మరికొందరు, “ఇతడు పాపాత్ముడైతే ఇలాంటి అద్భుతాలు చేయగలడా?” అని అన్నారు. అలా వారిలో వారికి వివాదం కలిగింది.
17 వాళ్ళు మళ్ళీ గ్రుడ్డివానితో, “నీవు అతని గురించి ఏమనుకొంటున్నావు” అని అడిగారు.
“ఆయన ఒక ప్రవక్త!” అని ఆ నయమైన వాడు సమాధానం చెప్పాడు.
18 ఇదివరలో గ్రుడ్డివానిగా ఉన్నవాడు యితడేనని; యిప్పుడతనికి దృష్టి వచ్చిందని, అతని తల్లిదండ్రుల్ని పిలువనంపే దాకా యూదులు నమ్మలేదు. 19 అతని తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడా! గ్రుడ్డి వానిగా జన్మించింది ఇతడేనా? ఇతడు ఇప్పుడెట్లా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు.
20 అతని తల్లిదండ్రులు, “అతుడు మా కుమారుడని, గ్రుడ్డివానిగా జన్నించాడని మాకు తెలుసు. 21 కాని అతడు ఇప్పుడేవిధంగా చూడగలుగు తున్నాడో. అతనికి దృష్టి ఎవరిచ్చారో మాకు తెలియదు. అతణ్ణే అడగండి! తనను గురించి సమాధానం చెప్పుకోగల వయస్సు అతనికి ఉంది” అని అన్నారు. 22 యేసే, “క్రీస్తు” అన్న ప్రతి ఒక్కణ్ణి సమాజ మందిరం నుండి బహిష్కరించాలని యూదులు యిది వరకే నిశ్చయించారు. కనుక వాళ్ళకు భయపడి అతని తల్లిదండ్రులు ఈ విధంగా సమాధానం చెప్పారు. 23 అందుకే వాళ్ళు, “అతనికి వయస్సు వచ్చింది. అతణ్ణే అడగండి!” అని అన్నారు.
24 యూదులు గ్రుడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో, “దేవుణ్ణి స్తుతించు, అతణ్ణి కాదు. అతడు పాపాత్ముడని తెలుసు!” అని అన్నారు.
25 “ఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. నాకు ఒకటి తెలుసు. నేనిదివరలో గ్రుడ్డి వాణ్ణి. ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని అతడు సమాధానం చెప్పాడు.
26 “అతడు ఏమి చేసాడు? ఏ విధంగా నీకు దృష్టి కలిగించాడు?” అని వాళ్ళు అడిగారు.
27 అతుడు, “నేను యిది వరకే చెప్పాను. కాని మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటున్నారా?” అని అన్నాడు.
28 వాళ్ళు అతణ్ణి అవమానపరచారు. అతనితో, “నువ్వు అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులము. 29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. ఇక ఇతని గురించా? ఇతడెక్కడినుండి వచ్చాడో కూడా మాకు తెలియదు” అని అన్నారు.
30 అతడు, “ఇది చాలా విచిత్రం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు. అయినా ఆయన నాకు దృష్టి కలిగించాడు. 31 దేవుడు పాపాత్ముల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న విశ్వాసుల మాటలు వింటాడని మాకు తెలుసు. 32 పుట్టు గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించటం ఇది వరకు ఎవ్వరూ వినలేదు. 33 ఇతడు దేవుని నుండి రానట్లైతే ఏమి చెయ్యలేకపొయ్యేవాడు” అని అన్నాడు.
34 ఇది విని వాళ్ళు, “నీవు పాపంలో పుట్టావు. పాపంలో పెరిగావు. మాకు ఉపదేశించటానికి నీకెంత ధైర్యం?” అని అంటూ అతణ్ణి వెలివేశారు.
ఆత్మీయ అంధత్వము
35 అతణ్ణి వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతణ్ణి కనుగొని, “నీవు మనుష్యకుమారుణ్ణి నమ్ముచున్నావా?” అని అడిగాడు.
36 ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి ప్రభూ! విశ్వసిస్తాను!” అని అన్నాడు.
37 యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్నవాడాయనే!” అని అన్నాడు.
38 అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు.
39 యేసు, “నేను తీర్పు చెప్పటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఆ తీర్పేదనగా-గ్రుడ్దివాళ్ళు చూడగలగాలనీ, చూడగలమని అంటున్న వాళ్ళు గ్రుడ్డివాళ్ళు కావాలని నేను వచ్చాను” అని అన్నాడు.
40 ఆయనతో ఉండి ఆయనన్న మాటలు విన్న కొందరు పరిసయ్యులు, “మేము కూడా గ్రుడ్డివాళ్ళ మంటున్నావా?” అని అన్నారు.
41 యేసు, “మీరు గ్రుడ్డి వాళ్ళైనట్లైతే మిమ్ములను దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు. కాని మీరు చూడగలము అంటున్నారు. కనుక మిమ్మల్ని దోషులనవలిసిందే!” అని అన్నాడు.
© 1997 Bible League International