M’Cheyne Bible Reading Plan
21 యెహోషాపాతు చనిపోగా, అతనిని అతని పూర్వీకుల సరసన సమాధిఛేశారు. అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. యెహోషాపాతు స్థానంలో అతని కుమారుడు యెహోరాము కొత్త రాజయ్యాడు. 2 యెహోరాము సోదరులు అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, మరియు షెపట్య అనువారు. వీరంతా యెహోషాపాతు కుమారులు. యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజు. 3 యెహోషాపాతు తన కుమారులకు వెండి బంగారు వస్తువులు, తదితర విలువైన కానుకలు యిచ్చాడు అతడు యూదాలో బలమైన కోటలు నిర్మించి యిచ్చాడు. కాని యెహోషాపాతు రాజ్యాన్ని యెహోరాముకు యిచ్చాడు. ఎందువల్లనంటే అతడు పెద్ద కుమారుడు.
యూదా రాజుగా యెహోరాము
4 యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని చేపట్టి తనను తాను పటిష్ట పర్చుకొని స్థిరపడ్డాడు. తరువాత కత్తిని వినియోగించి తన సోదరులనందరినీ చంపి వేశాడు. అతడు మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను కూడా నరికివేశాడు. 5 యెహోరాము ఏల నారంభించే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. 6 అతడు ఇశ్రాయేలు రాజులు నివసించిన రీతిలో జీవితం కొనసాగించాడు. అహాబు కుటుంబం మాదిరిగానే అతడు కూడ నివసించాడు. ఎందువల్ల నంటే అహాబు కుమార్తెనే యెహోరాము వివాహమాడాడు. యెహోరాము యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ చేశాడు. 7 కాని యెహోవా దావీదుతో చేసుకొన్న ఒడంబడిక ప్రకారం ఆయన దావీదు కుటుంబాన్ని నాశనం చేయలేదు. దావీదు కొరకు, ఆయన సంతతివారి కొరకు యెహోవా శాశ్వతంగా ఒక జ్యోతిని వెలిగించుతానని మాట యిచ్చివున్నాడు.[a]
8 యెహోరాము కాలంలోనే యూదా ఆధిపత్యం నుండి ఎదోము విడిపోయి, స్వతంత్ర రాజ్యమయ్యింది. ఎదోమీయులు వారి స్వంత రాజును ప్రకటించుకున్నారు. 9 అందువల్ల యెహోవారాము తన సైన్యాధిపతులతోను, రథాలతోను ఎదోము మీదికి వెళ్లాడు. ఎదోమీయుల సైన్యం యెహోరామును, అతని రథాధిపతులను చుట్టుముట్టింది. కాని యెహోరాము తీవ్రంగా యుద్ధం చేసి చీకటి పడ్డాక బయట పడ్డాడు. 10 అప్పటి నుండి ఈ నాటి వరకు ఎదోము రాజ్యం యూదాపై తిరుగబడుతూనే వుంది. లిబ్నా పట్టణవాసులు కూడా యెహోరాముకు వ్యతిరేకులైనారు. యెహోరాము యెహోవాను విడనాడినందుకు ఫలితంగా ఇదంతా జరిగింది. యెహోవా యెహోరాము పూర్వీకులు ఆరాధించిన దేవుడు. 11 యెహోరాము యూదా కొండలమీద, గుట్టలమీద క్షుద్ర దేవతల పూజలకై స్థలాలను నిర్మించాడు. దేవుడు ఆశించిన దానిని చేయకుండా యెరూషలేము ప్రజలకు యెహోరాము అడ్డుపడ్డాడు. అతడు యూదా ప్రజలను యెహోవాకు దూరం చేశాడు.
12 ప్రవక్తయైన ఏలీయా ద్వారా యెహోరాముకు ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం యిలా వుంది:
“దేవుడైన యెహోవా తెలియజేయునదేమనగా: ఆయన మీ పూర్వీకుడైన దావీదు ఆరాధించిన దైవం. యెహోవా చెప్పుచున్నాడు: ‘యెహోరామూ, నీ తండ్రి యెహోషాపాతు నడిచిన మార్గాన్ని నీవు విడనాడినావు. యూదా రాజైన ఆసా నడిచిన మార్గాన్ని కూడ నీవు విడనాడినావు. 13 అంతేకాదు నీవు ఇశ్రాయేలు రాజులు నడచిన పెడమార్గాన్ని అనుసరించావు. దేవుడు ఆశించిన రీతిగా నడవకుండా నీవు యూదా, యెరూషలేము ప్రజలను ఆపావు. అదే నేరాన్ని అహాబు, అతని కుటుంబంవారు చేశారు. వారు దేవుని పట్ల విశ్వాస ఘాతకులైనారు. నీవు నీ సోదరులను హత్యచేశావు. నీకంటె నీ సోదరులు మంచివారు. 14 కావున త్వరలో యెహోవా నీ ప్రజలను కఠినంగా శిక్షిస్తాడు. యెహోవా నీ పిల్లలను భార్యలను శిక్షించి, నీ ఆస్తిని పాడుచేస్తాడు. 15 నీకు పేగుల్లో భయంకరమైన జబ్బు చేస్తుంది. రోజు రోజుకూ నీ జబ్బు ముదురుతుంది. ఆ భయంకరమైన వ్యాధివల్ల నీ ప్రేగులు బయటికి వచ్చేస్తాయి.’”
16 యెహోవా ఫిలిష్తీయులను, ఇథియోపియులకు (కూషీయులు) దగ్గరలో నివసిస్తున్న అరబీయులను యెహోరాము మీదికి పోయేలా ప్రేరేపించాడు. 17 ఆ ప్రజలు యూదా రాజ్యం మీదికి దండెత్తారు. వారు రాజగృహంలోని ధనాన్నంతా కొల్లగొట్టారు. వారు యెహోరాము కుమారులను, భార్యలను తీసుకొనిపోయారు. యెహోరాము చిన్న కుమారుడు మాత్రం వదిలిపెట్టబడ్డాడు. యెహోరాము చిన్న కుమారుని పేరు యెహోయాహాజు.[b]
18 ఈ సంఘటనలు జరిగిన తరువాత యెహోవా యెహోరాముకు పేగుల్లో నయంకాని వ్యాధిని కలుగజేశాడు. 19 జబ్బు ముదిరి రెండు సంవత్సరాల తరువాత యెహోరాము పేగులు బయటికి వచ్చాయి. భరించలేని బాధతో అతడు చనిపోయాడు. తన తండ్రికి చేసినట్లు ప్రజలు యెహోరాముకు గౌరవసూచకంగా పెద్దమంట వేయలేదు. 20 యెహోరాము రాజయ్యే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. యెహోరాము చనిపోయినప్పుడు ఒక్కడు కూడ విచారించలేదు. యెహోరామును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారుగాని, రాజులను వుంచే చోట అతనిని సమాధి చేయలేదు.
పాతాళం నుండి మిడుతలు
9 ఐదవ దేవదూత తన బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమ్మీద పడ్డ నక్షత్రాన్ని చూశాను. పాతాళం[a] యొక్క తాళం చెవి ఈ నక్షత్రానికి యివ్వబడింది. 2 అతడు పాతాళాన్ని తెరిచాడు. అప్పుడు దాన్నుండి పెద్ద పొగ లేచింది. అది ఒక పెద్ద కొలిమి నుండి వచ్చినట్లు అనిపించింది. పాతాళం నుండి వచ్చిన పొగవల్ల సూర్యుడు, ఆకాశం చీకటైపోయాయి.
3 ఆ పొగనుండి మిడతలు భూమ్మీదికి వచ్చాయి. తేళ్ళవలె కుట్టే శక్తి ఆ మిడతలకివ్వబడింది. 4 భూమ్మీద ఉండే గడ్డికి కాని, మొలకకు కాని, చెట్టుకు కాని హాని చేయవద్దని, నుదుటిమీద దేవుని ముద్రలేనివాళ్ళకు మాత్రమే హాని కలిగించమని ఆ మిడతలకు చెప్పబడింది. 5 మనుష్యుల్ని ఐదు నెలల దాకా హింసించే శక్తి వాటికి యివ్వబడింది. వాళ్ళను చంపే శక్తి వాటికి యివ్వబడలేదు కాని అవి కుట్టినప్పుడు తేళ్ళు కుట్టినట్లు నొప్పి కలుగుతుంది. 6 ఆ కాలంలో మనుష్యులు చావే మంచిదని చావును వెతుకుతారు. కాని వాళ్ళకది దొరకదు. వాళ్ళు చావాలని చాలా ఆశిస్తారు. కాని చావు వాళ్ళను తప్పించుకొని వెళ్ళిపోతుంది.
7 ఆ మిడుతలు యుద్ధానికి సిద్ధం చేయబడిన గుఱ్ఱాలలా కనిపించాయి. వాటి తలలమీద బంగారు కిరీటాల్లాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి. 8 వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి కోరలు సింహపు కోరల్లా ఉన్నాయి. 9 అవి ఇనుప కవచాలు వేసుకొని ఉన్నాయి. వాటి రెక్కల ధ్వని గుఱ్ఱాలు, రథాలు యుద్ధానికి వెడుతున్నప్పుడు కలిగే ధ్వనిలా ఉంది. 10 వాటి తోకలు తేళ్ళ తోకల్లా కొండ్లతో ఉన్నాయి. వాటి తోకల్లో ఐదు నెలల దాకా ప్రజల్ని హింసించే శక్తి ఉంది. 11 పాతాళ లోకపు దూత వాటికి రాజుగా ఉన్నాడు. హీబ్రూ భాషలో వాని పేరు అబద్దోను. గ్రీకు భాషలో వాని పేరు అపొల్లుయోను.
12 మొదటి శ్రమ సమాప్తమయింది. మిగతా రెండు శ్రమలు యింకా జరుగవలసి ఉన్నాయి.
ఆరవ బూర ఊదబడింది
13 ఆరవ దేవదూత తన బూర ఊదాడు. దేవుని ముందున్న బంగారు ధూపవేదిక యొక్క నాలుగు కొనల నుండి నాకు ఒక స్వరం వినిపించింది. 14 ఆ స్వరం బూర ఊదుతున్న ఆరవ దూతతో, “యూఫ్రటీసు మహానది దగ్గర బంధింపబడిన నలుగురు దూతల్ని విడుదల చేయి” అని అనింది. 15 ఇదే గడియ, ఇదే రోజు, ఇదే నెల, ఇదే సంవత్సరము విడుదల చేయబడటానికి వాళ్ళు యింతవరకు బంధింపబడ్డారు. మనుష్యులలో మూడవ భాగాన్ని హతమార్చటానికి వాళ్ళు విడుదల చేయబడ్డారు. 16 ఆ రౌతుల సంఖ్య ఇరవై కోట్లు అన్నట్లు నేను విన్నాను.
17 నాకు కనిపించిన రౌతులు, గుఱ్ఱాలు ఈ విధంగా ఉన్నాయి. రౌతుల కవచాలు అగ్నివలె ఎరుపు, ముదురు నీలం, గంధకాన్ని పోలిన పసుపు రంగుల్లో ఉన్నాయి. గుఱ్ఱాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. వాటి నోళ్ళనుండి మంటలు, పొగ, గంధకము బయటికి వచ్చాయి. 18 వాటి నోళ్ళనుండి వచ్చిన ఈ మూడు పీడలు, అంటే మంటలు, పొగలు, గంధకాల వల్ల మనుష్యులలో మూడవ భాగం హతులై పోయారు. 19 ఆ గుఱ్ఱాల శక్తి వాటి నోళ్ళల్లో, తోకల్లో ఉంది. వాటి తోకలు పాముల్లా ఉన్నాయి. ఆ తోకలకు పాము తలలు ఉన్నాయి. వాటితో అవి కాటువేసి బాధిస్తాయి.
20 ఈ మూడు పీడలు యింత నాశనం చేసినా, మరణించని మానవ జాతి తాము చేసిన పాపాలకు పశ్చాత్తాప పడలేదు. వాళ్ళు దయ్యాల్ని పూజించటం మానుకోలేదు. బంగారము, వెండి, కంచు, రాయి, చెక్కతో చేసిన విగ్రహాలను పూజించటం వాళ్ళు మానుకోలేదు. ఈ విగ్రహాలు చూడకపోయినా, వినకపోయినా, కదలకపోయినా, వాటిని పూజించటం మానుకోలేదు. 21 అంతేకాక, వాళ్ళు తాము చేసిన హత్యలకు, మంత్రతంత్రాలకు, లైంగిక అవినీతికి, దొంగతనాలకు మారుమనస్సు పొందలేదు.
ఎగిరే చుట్టబడిన పత్రం
5 నేను మళ్లీ పైకి చూడగా, చుట్టబడిన ఒక ఎగిరే పత్రాన్ని చూశాను. 2 “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు.
“నేనొక చుట్టగా వున్న ఎగిరే పత్రాన్ని చూస్తున్నాను. ఆ చుట్ట ముప్పై అడుగుల పొడవు, పదిహేను అడుగుల వెడల్పు ఉంది” అని నేను చెప్పాను.
3 అప్పుడు దేవదూత నాతో చెప్పాడు, “ఆ చుట్టబడిన పత్రంమీద ఒక శాపం వ్రాయబడి ఉంది. ఆ పత్రంలో ఒక ప్రక్కన దొంగలకు ఒక శాపం ఉంది. ఆ పత్రానికి మరొక పక్కన అబద్ధపు వాగ్దానాలు చేసేవారికి ఒక శాపం ఉంది. 4 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘దొంగల ఇండ్లకు, నా పేరు మీద దొంగ వాగ్దానాలు చేసేవారి ఇండ్లకు ఆ చుట్టబడిన పత్రాన్ని నేను పంపిస్తాను. ఆ పత్రం అక్కడ వుండి, ఆ ఇండ్లను నాశనం చేస్తుంది. రాళ్లు, కొయ్యస్తంభాలు సహితం నాశనం చేయబడతాయి.’”
స్త్రీ మరియు తొట్టి
5 తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూత బయటికి వెళ్లాడు. అతడు నాతో, “చూడు! నీవు ఏమి జరుగుతున్నట్లు చూస్తున్నావు?” అని అన్నాడు.
6 “అదేమిటో నాకు తెలియదు” అని నేను అన్నాను.
అతడు ఇలా చెప్పాడు: “అది ఒక కొలతొట్టి. ఈ దేశంలో ప్రజలు చేసే పాపాలను కొలవటానికి ఆ బుట్ట ఉద్దేశించబడింది.”
7 ఆ తొట్టి మీదనుంచి సీసపు మూత తొలగించబడింది. ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. దానితో బరువైన (డెబ్బై ఐదు పౌనులు) సీసపు తూనికరాయి ఉంది. 8 “ఈ స్త్రీ చెడును తెలియజేస్తుంది” అని దేవ దూత చెప్పాడు. పిమ్మట దేవదూత ఆ స్త్రీని తొట్టిలో పడదోసి, దానిమీద సీసపు మూతను పెట్టాడు. పాపాలు ఘోరమైనవని (బరువైనవని) ఇది తెలుపుతుంది. 9 తరువాత నేను పైకి చూశాను. అక్కడ సంకుబుడ్డి కొంగవలె రెక్కలు గల ఇద్దరు స్త్రీలను చూశాను. వారు ఎగిరి వచ్చారు. వారి రెక్కల్లో గాలి ఉంది. వారు బుట్టను పట్టి లేవనెత్తారు. బుట్టను పట్టుకొని వారు గాలిలోకి పోయారు. 10 “వారు ఆ బుట్టను ఎక్కడికి మోసుకు పోతున్నారు?” అని నాతో మాట్లాడుతూవున్న దేవదూతను నేనడిగాను.
11 దేవదూత నాతో ఇలా చెప్పాడు: “షీనారులో[a] దానికొక ఆలయం నిర్మించటానికి వారు వెళ్తున్నారు. వారా ఆలయాన్ని నిర్మించాక ఆ బుట్టను అక్కడ ఉంచుతారు.”
8 యేసు మళ్ళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు. 2 సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్ళీ మందిరంలో కనిపించాడు. అక్కడ ప్రజలు ఆయన చుట్టూ సమావేశమయ్యారు. వాళ్ళకు బోధించటానికి ఆయన కూర్చున్నాడు.
3 వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు కలిసి అక్కడికి తీసుకొని వచ్చారు. ఆమెను అందరి ముందు నిలుచో బెట్టి 4 యేసుతో, “బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. 5 మోషే, ధర్మశాస్త్రంలో యిలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారు?” అని అడిగారు.
6 ఆయన్ని పరీక్షించటానికి ఈ ప్రశ్న వేసారు. ఆయన్ని శిక్షించటానికి కారణం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. కాని యేసు వంగి, నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలు పెట్టాడు. 7 వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే, అతడు ఆమెపై మొదటిరాయి విసర వచ్చు!” అని అన్నాడు. 8 ఇలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు.
9 ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. 10 యేసు తలెత్తి చూస్తూ, “వాళ్ళెక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని అడిగాడు.
11 “లేదు ప్రభూ!” అని ఆమె అన్నది.
“నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి పాపం చెయ్యకు!” అని అన్నాడు.
యేసు ఈ ప్రపంచానికి వెలుగు
12 యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు.
13 పరిసయ్యులు సవాలు చేస్తూ, “నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” అని అన్నారు.
14 యేసు సమాధానం చెబుతూ, “నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. 15 మీరు అందరి మానవులవలె తీర్పుచెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను. 16 కాని నేను ఒక వేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. 17 ఇద్దరు కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో వ్రాసారు. 18 నేను నా పక్షాన సాక్ష్యం చెబుతున్నాను. నా యింకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి” అని అన్నాడు.
19 అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు.
యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు. 20 ఆయనీ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ యింకా రాలేదు!
కొందరు యూదులు యేసును అపార్థము చేసికొనటం
21 యేసు మరొకసారి వాళ్ళతో, “నేను వెళ్తున్నాను. మీరు నా కోసం వెతుకుతారు. కాని నేను వెళ్ళేచోటికి మీరు రాలేరు. ఎందుకంటే మీరు మీ పాపాల్లో మరణిస్తారు” అని అన్నాడు.
22 యూదులు, “ఆత్మహత్య చేసుకొంటాడా? అందుకేనా, ‘నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు” అని అన్నారు.
23 యేసు, “మీరు యిక్కడి వాళ్ళు. నేను పైనుండి వచ్చిన వాణ్ణి. మీరు ఈలోకపు వాళ్ళు. నేను ఈ లోకపు వాణ్ణి కాదు. 24 మీరు మీ పాపాలతో మరణిస్తారు” అని అన్నాడు.
25 వాళ్ళు, “అది సరే కాని, నీవెవరు?” అని అడిగారు.
యేసు, “నేను యింతవరకు ఎవర్నని చెబుతున్నానో ఆయన్నే” అని అన్నాడు. 26 “నేను మీ తీర్పు విషయంలో ఎన్నో సంగతులు చెప్పగలను. కాని దానికి మారుగా నన్ను పంపిన వాని నుండి విన్న వాటిని మాత్రమే ప్రపంచానికి చెబుతున్నాను. ఆయన నమ్మదగినవాడు” అని అన్నాడు.
27 ఆయన తన తండ్రిని గురించి చెబుతున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. 28 అందువలన యేసు వాళ్ళతో, “మనుష్యకుమారుణ్ణి పైకి లేపినప్పుడు ఆయన నేనేనని మీరు తెలుసుకుంటారు. అంతేకాక స్వతహాగా నేను ఏమీ చెయ్యనని, నా తండ్రి బోధించిన వాటిని మాత్రమే చెబుతానని తెలుసుకుంటారు. 29 నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను అన్ని వేళలా ఆయనకు యిష్టమైనవే చేస్తాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలి వేయడు” అని అన్నాడు. 30 ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన విశ్వాసులైయ్యారు.
పాపమునుండి విమోచనము గురించి యేసు మాట్లాడటం
31 తనను నమ్మిన యూదులతో యేసు, “మీరు నా బోధనలు పాటిస్తే, మీరు నా నిజమైన శిష్యులు. 32 అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసు కుంటారు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది” అని అన్నాడు.
33 వాళ్ళు, “మేము అబ్రాహాము వంశీయులం. మేమింతవరకు ఎవ్వరికి బానిసలుగా ఉండలేదు. మరి మాకు స్వేచ్ఛ కలుగుతుందని ఎందుకంటున్నావు?” అని అన్నారు.
34 యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస ఔతాడు. 35 బానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. కాని కుమారుడు శాశ్వతంగా ఆ యింటికి చెందినవాడు. 36 కుమారుడు స్వేచ్ఛ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. 37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. అయినా మీకు నా సందేశం నచ్చలేదు. కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. 38 నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి[a] నుండి విన్నదాన్ని చేస్తున్నారు” అని అన్నాడు.
39 “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు! 40 నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు. 41 మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు.
వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు.
42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు. 43 మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. 44 మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావము. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి.
45 “నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు. 46 నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు. 47 దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”
యేసు, అబ్రాహాము
48 “నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా?” అని వాళ్ళు ప్రశ్నించారు.
49 యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు. 50 నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొకాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి. 51 ఇది నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావుచూడడు” అని అన్నాడు.
52 ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటున్నావు. 53 నీవు మా తండ్రి అబ్రాహాము కన్నాగొప్ప వాడవా? అతడు చనిపొయ్యాడు. ప్రవక్తలు కూడా చనిపొయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటున్నావు?” అని అన్నారు.
54 యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు. 55 ఆయన మీకు తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే, నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను. 56 మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు: ఆనంద పడ్డాడు” అని అన్నాడు.
57 ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై ఏళ్ళైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా?” అని అన్నారు.
58 యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను” అని అన్నాడు. 59 ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్ళి పోయాడు.
© 1997 Bible League International