M’Cheyne Bible Reading Plan
మీకాయా రాజైన అహాబును హెచ్చరించటం
18 యెహోషాపాతుకు ఎక్కువగా ధనం, గౌరవం లభించాయి. రాజైన అహాబుతో అతడు వివాహం[a] ద్వారా ఒక ఒడంబడిక ఏర్పరచుకొన్నాడు. 2 కొద్ది సంవత్సరాల తరువాత యెహోషాపాతు సమరయ (షోమ్రోను) లో అహాబును చూడటానికి వెళ్లాడు. యెహోషాపాతు, అతని పరివారం యొక్క గౌరవార్థం అహాబు అనేక గొర్రెలను, ఆవులను వధించాడు. ఆ సమయాన రామోత్గిలాదు పట్టణంపై దాడి చేయటానికి అహాబు యెహోషాపాతును ప్రోత్సహించాడు. 3 “రామోత్గిలాదుపై దండెత్తటానికి నీవు నాతో వస్తావా?” అని అహాబు యెహోషాపాతును అడిగాడు. అహాబు ఇశ్రాయేలు రాజు. యెహోషాపాతు యూదా రాజు. అహాబుకు యెహోషాపాతు యిలా సమాధాన మిచ్చాడు: “నేను నీవాడను. నా మనుష్యులు నీవారు. మేము యుద్ధానికి నీతో వస్తాము. 4 కాని ముందుగా మనం యెహోవా వర్తమానం ఏమైనా వుంటుందేమో చూద్దాం,” అని యెహోషాపాతు అన్నాడు.
5 అందువల్ల అహాబు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించాడు. అహాబు వారితో, “మేము రామోత్గిలాదు పట్టణం మీదికి యుద్ధానికి వెళ్లవచ్చా? లేదా?” అని అన్నాడు.
అప్పుడు ప్రవక్తలు, “వెళ్లండి; ఎందువల్లనంటే దేవుడు రామోత్గిలాదును మీరు ఓడించేలా చేస్తాడు” అని అహాబుకు సమాధాన మిచ్చారు.
6 కాని యెహోషాపాతు యిలా అన్నాడు: “ఇక్కడ యెహోవా యొక్క ప్రవక్త ఎవరైనా వున్నారా? యెహోవా ప్రవక్తలలో ఒకని ద్వారా ఆయన ఏమి చెబుతున్నాడో తెలుసుకోవలసిన అవసరం వుంది.”
7 అప్పుడు రాజైన అహాబు యెహోషాపాతుతో యిలా అన్నాడు: “ఇక్కడ ఇంకా ఒక మనిషి వున్నాడు. మనం అతని ద్వారా యెహోవాను అడుగుదాం. కాని ఈ మనిషిని నేను అసహ్యించుకుంటాను. ఎందువల్లనంటే అతడు యెహోవా నుండి నాకు ఒక్క మంచి వర్తమానం కూడ అందచేయడు. నాకు ఎప్పుడూ చెడువార్తలే తెస్తాడు. ఆ వ్యక్తి పేరు మీకాయా. అతడు ఇమ్లా కుమారుడు.”
కాని యెహోషాపాతు, “అహాబూ నీవు అలా అనరాదు” అని అన్నాడు.
8 అప్పుడు రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి, “ఇమ్లా కుమారుడైన మీకాయాను త్వరగా తీసుకొని రమ్మని పంపాడు.”
9 ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు తమతమ రాజదుస్తులు ధరించారు. వారిద్దరు సమరయ (షోమ్రోను) నగర ముఖద్వారం దగ్గర వున్న నూర్పిడి కళ్లం వద్ద తమతమ సింహాసనాలపై కూర్చున్నారు. అక్కడకు వచ్చియున్న నాలుగువందల మంది ప్రవక్తలు రాగల సంగతుల వర్తమానాలను రాజుల ముంగిట చెబుతున్నారు. 10 కెనయనా కుమారుని పేరు సిద్కియా. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు చేయించుకు వచ్చాడు. సిద్కియా యిలా అన్నాడు: “యెహోవా ఈ రకంగా చెప్పుచున్నాడు: ‘నీవు ఈ ఇనుప కొమ్ములు వినియోగించి, అరామీయులు (సిరియనులు) నశించిపోయే వరకు వారిని పొడుస్తావు.’” 11 ప్రవక్తలంతా అదే విషయం చెప్పారు. వారిలా అన్నారు: “రామోత్గిలాదు పట్టణానికి వెళ్లు. నీకు విజయం చేకూరుతుంది. రాజు అరాము ప్రజలను ఓడించేలా యెహోవా తోడ్పడుతాడు.”
12 మీకాయాను పిలవటానికి వెళ్లిన దూత అతనితో యీలా చెప్పాడు: “మీకాయా, వినండి; ప్రవక్తలంతా ఒకే రీతిగా ప్రవచిస్తున్నారు. రాజుకు విజయం చేకూరుతుందని వారు చెబుతున్నారు. వారు చెప్పినట్లుగానే నీవు కూడా తెలియజేయి. నీవు కూడ మంచి విషయాలే చెప్పు.”
13 “యెహోవా జీవముతోడు నేను నా దేవుడు తెలియజేసిన రీతినే చెబుతాను” అని మీకాయా అన్నాడు.
14 పిమ్మట మీకాయా రాజైన అహాబు వద్దకు వచ్చాడు. రాజు అతనితో, “మీకాయా, మేము రామోత్గిలాదు పట్టణంపై దండెత్తటానికి వెళ్లవచ్చునో, లోదో తెలియజేయి” అని అన్నాడు.
అందుకు మీకాయా, “వెళ్లి దాడి చేయి, దేవుడు నీవాప్రజలను ఓడించేలా చేస్తాడు,” అని చెప్పాడు.
15 అహాబు రాజు మీకాయాతో, “గతంలో చాలా సార్లు నిజమే ప్రవచించేలా యెహోవా పేర నీచేత ప్రమాణం చేయించాను,” అని అన్నాడు.
16 అప్పుడు మీకాయా యీలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా పర్వతాలపై చిందరవందరై పోయినట్లు నేను చూశాను. వారు కాపరిలేని గొర్రెల్లా వున్నారు. యెహోవా చెప్పినదేమంటే, ‘వారికి నాయకుడు లేడు. కావున ప్రతి ఒక్కడినీ క్షేమంగా ఇంటికి పోనిమ్ము.’”
17 అది విని ఇశ్రాయేలు రాజు అహాబు యెహోషాపాతుతో యిలా అన్నాడు: “మీకాయా నాకు ఎప్పుడూ యెహోవా నుండి మంచి వార్త తేడని నేను నీకు ముందే చెప్పాను! నా గురించి అతడు తెచ్చేవన్నీ చెడు వర్తమానాలే!”
18 మీకాయా ఇంకా యిలా అన్నాడు: “యెహోవా వర్తమానాన్ని వినండి! యెహోవా తన సింహాసనంపై కూర్చుని వున్నట్లు నేను చూశాను. పరమండల సైన్యమంతా ఆయన చుట్టూ చేరివుంది. 19 యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు అక్కడ చంపబడే విధంగా, యుక్తిగా రామోత్గిలాదుపై అతనిని యుద్ధానికి ఎవరు పంపగలరు?’ అని అడిగినాడు. ఆయన చుట్టూ చేరిన పలువురు పలురకాలుగా చెప్పారు. 20 పిమ్మట ఒక ఆత్మవచ్చి యెహోవా ముందు నిలబడి, ‘అహాబును నేను మోసపుచ్చుతాను’ అని అన్నది. ‘ఎలా?’ అని యెహోవా ఆత్మని అడిగాడు. 21 ‘నేను అసత్యలాడే ఆత్మగా మారి అహాబు ప్రవక్తలలో ప్రవేశించి వారి నోట అబద్ధాలు పలికిస్తాను’ అని ఆత్మ చెప్పింది. అది విని ‘అహాబును మోసగించటంలో నీకు జయమగు గాక! నీవు బయటకు వెళ్లి కార్యము సాధించు’ అని యెహోవా అన్నాడు.
22 “అహాబూ, ఇప్పుడు చూడు; యెహోవా ఒక అసత్య ఆత్మను నీ ప్రవక్తలలో ప్రవేశపెట్టాడు. నీకు కీడు మూడుతుందని యెహోవా చెప్పియున్నాడు.”
23 పిమ్మట సిద్కియా తిన్నగా మీకాయా వద్దకు వెళ్లి చెంపమీద చాచికొట్టాడు. సిద్కియా తండ్రి పేరు కెనయనా. సిద్కియా యిలా అన్నాడు: “మీకాయా, యెహోవా వద్దనుండి వచ్చిన ఆత్మ నన్ను వదిలి నిన్నావరించటానికి ఎటునుండి వచ్చింది?”
24 దానికి మీకాయా “సిద్కియా, నీవు లోపలి గదిలోకి పోయి దాగుకొనే రోజున నీవది తెలుసుకొంటావు!” అని సమాధానమిచ్చాడు.
25 పిమ్మట రాజైన అహాబు యిలా అన్నాడు: “మీకాయాను తీసుకొని వెళ్లి నగరపాలకుడైన ఆమోనుకు, రాజకుమారుడైన యెవాషుకు అప్పజెప్పండి. 26 రాజాజ్ఞగా ఆమోనుకు, యెవాషుకు యిలా చెప్పండి: ‘మీకాయాను చెరసాలలో పెట్టండి. నేను యుద్ధం నుండి తిరిగి వచ్చేవరకు అతనికి రొట్టె నీరు తప్ప ఇతర ఆహారమేదీ యివ్వవద్దు.’”
27 మీకాయా యిలా సమాధానమిచ్చాడు: “అహాబూ, నీవు యుద్ధాన్నుండి క్షేమంగా తిరిగి వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండలేదని అర్థం. ఓ ప్రజలారా, నా మాటలు విని జ్ఞాపకం పెట్టుకోండి!”
రామోత్గిలాదులో అహాబు చంపబడటం
28 పిమ్మట ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్గిలాదు పట్టణాన్ని ముట్టడించారు. 29 అహాబు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలోకి వెళ్లే ముందు నేను నా వేషం మార్చివేస్తాను. కాని నీవు మాత్రం నీ రాజదుస్తులే ధరించు” అని అన్నాడు. ఇశ్రాయేలు రాజు మారువేషం వేసిన పిమ్మట రాజులిద్దరూ యుద్ధానికి వెళ్లారు.
30 అరాము (సిరియా) రాజు తన రథాల అధిపతులకు ఒక ఆజ్ఞ యిచ్చాడు. అతడు వారితో యిలా అన్నాడు: “ఎంత గొప్ప వాడేగాని, ఎంత సామాన్యుడే గాని, మీరు ఎవ్వరితోనూ పోరాడవద్దు. కాని మీరు ఇశ్రాయేలు రాజైన అహాబుతోనే యుద్ధం చేయండి.” 31 రథాధిపతులు యెహోషాపాతును చూచినప్పుడు అతడే ఇశ్రాయేలు రాజైన అహాబు అనుకున్నారు! అతన్ని ఎదిరించటానికి వారు యెహోషాపాతు మీదికి తిరిగారు. కాని యెహోషాపాతు కేకలు పెట్టటంతో యెహోవా అతనికి సహాయపడ్డాడు. రథాధిపతులు యెహోషాపాతును వదిలి పోయేలాగు దేవుడు వారి మనస్సు మార్చాడు. 32 వారు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు కాదని తెలిసికొన్నప్పుడు వారతనిని తరమటం మానివేశారు.
33 కాని ఒక సైనికుడు దేనికీ గురిపెట్టకుండా ఒక బాణాన్ని మామూలుగా వదిలాడు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. కవచం కప్పకుండా వున్న అతని శరీర భాగంలో ఆ బాణం తగిలింది. అప్పుడు అహాబు తన రథసారధితో, “రథాన్ని వెనుకకు తిప్పి నన్ను యుద్ధరంగం నుండి బయటకు తీసుకొని వెళ్లు. నేను గాయపడ్డాను.” అని చెప్పాడు.
34 ఆ రోజు యుద్ధం తీవ్రంగా జరిగింది. అహాబు తన రథంలో ఆనుకొని సాయంత్రంమయ్యే వరకు అరామీయులను (సిరియనులు) చూస్తూ నిలబడివున్నాడు. సూర్యుడు అస్తమించే సమయంలో అహాబు చనిపోయాడు.
దేవుని సేవకులు రక్షింపబడతారు
7 ఇది జరిగిన తర్వాత భూమి నాలుగు మూలలా నలుగురు దేవదూతలు నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు భూమ్మీద, సముద్రం మీద, చెట్ల మీద గాలి వీయకుండా భూమి యొక్క నలుదిశలనుండి వీచే గాలిని పట్టుకొన్నారు. 2 అతడు వారిని పిలిచాడు. ఈ నలుగురి దూతలకు భూమికి, సముద్రానికి హాని చేయగల శక్తి ఉంది. మరొక దూత తూర్పునుండి రావటం చూసాను. అతని దగ్గర చిరంజీవి అయిన దేవుని ముద్ర ఉంది. 3 అతడు బిగ్గరగా ఆ నలుగురి దూతలతో, “దేవుని సేవకుల నొసళ్ళపై ముద్ర వేసే వరకు, భూమికి గాని, సముద్రానికి గాని, చెట్లకు గాని హాని కలిగించకండి” అని అన్నాడు.
4 ఆ తర్వాత ముద్రలు వేయబడ్డవారి సంఖ్య నాకు వినబడింది. వాళ్ళ సంఖ్య మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వేలు. వీళ్ళందరు ఇశ్రాయేలు జనాంగం, అన్ని గోత్రాలకు చెందిన వాళ్ళు.
5 యూదా గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
రూబేను గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
గాదు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
6 ఆషేరు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
నఫ్తాలి గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
మనష్షే గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
7 షిమ్యోను గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
లేవి గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
ఇశ్శాఖారు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
8 జెబూలూను గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
యోసేపు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
బెన్యామీను గోత్రం నుండి పన్నెండు వేలమందికి ముద్ర వేయబడింది.
ఒక పెద్ద ప్రజల గుంపు
9 దీని తర్వాత ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద ప్రజల గుంపు నా ముందు కనిపించింది. వాళ్ళలో ప్రతి దేశానికి చెందినవాళ్ళు ఉన్నారు. ప్రతి భాషకు చెందినవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెల్లటి దుస్తులు వేసుకొని, చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు, గొఱ్ఱెపిల్ల ముందు నిలబడి ఉండటం నాకు కనిపించింది. 10 వాళ్ళందరు, “సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, గొఱ్ఱెపిల్లకు రక్షణ చెందుగాక!” అని బిగ్గరగా అన్నారు.
11 సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. 12 “ఆమేన్! మన దేవుణ్ణి స్తుతించుదాం! ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొందాం. ఆయనలో తేజస్సు, జ్ఞానము, గౌరవము, అధికారము, శక్తి చిరకాలం ఉండుగాక! ఆమేన్!”
13 పెద్దల్లో ఒకడు నాతో, “తెల్లటి దుస్తులు వేసుకొన్న వాళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు.
14 “అయ్యా! మీకే తెలియాలి!” అని నేను సమాధానం చెప్పాను.
“మహా శ్రమలనుండి వచ్చినవాళ్ళు వీళ్ళే. తమ దుస్తుల్ని గొఱ్ఱెపిల్ల రక్తంలో ఉతికి శుభ్రం చేసుకొన్నారు. 15 అందువల్ల వాళ్ళు దేవుని సింహాసనం ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో ఉండి ఆయన సేవ చేస్తారు. ఆ సింహాసనంపై కూర్చొన్నవాడు వాళ్ళందరిపై తన గుడారం కప్పుతాడు. 16 వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. వాళ్ళకు ఏ వేడీ తగులదు. 17 సింహాసనంపై కూర్చొన్న గొఱ్ఱెపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు.”
ప్రధాన యాజకుడు
3 పిమ్మట దేవదూత ప్రధాన యాజకుడైన యెహోషువను నాకు చూపించాడు. యెహోవా దూత ముందు యెహోషువ నిలబడి ఉన్నాడు. యెహోషువకు కుడి పక్కగా సాతాను నిలబడి ఉన్నాడు. యెహోషు మీద చెడు పనులు చేసినట్లు నింద మోపటానికి సాతాను అక్కడ ఉన్నాడు. 2 అప్పుడు యెహోవా దూత ఇలా చెప్పాడు: “సాతానూ, యెహోవా నిన్ను విమర్శించు గాక! నీవు అపరాధివని యెహోవా తీర్పు ఇచ్చుగాక! యెరూషలేమును యెహోవా తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఆ నగరాన్ని రక్షించాడు. అది నిప్పులోనుండి లాగిన మండే కట్టెలా ఉంది.”
3 యెహోషువ దేవదూత ముందు నిలుచున్నాడు. యెహోషువ ఒక మురికి వస్త్రం ధరించివున్నాడు. 4 అప్పుడు దేవదూత తనవద్ద నిలబడిన ఇతర దేవ దూతలతో, “యెహోషువ వేసుకున్న మురికి వస్త్రాలను తీసివేయండి” అని చెప్పాడు. పిమ్మట దేవదూత యెహోషువతో మాట్లాడాడు. అతడు ఇలా అన్నాడు: “ఇప్పుడు నీ నేరాన్ని నేను తీసివేశాను. నీకు నూతన వస్త్రాలను ఇస్తున్నాను.”
5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచు” అని అన్నాను. కావున ఒక శుభ్రమైన తల పాగాను వారతని తలపై పెట్టారు. యెహోవా దూత అక్కడ నిలబడి వుండగా వారు అతనికి నూతన వస్త్రాలు తొడిగారు. 6 పిమ్మట యెహోషువకు యెహోవా దేవదూత ఈ విషయాలు చెప్పాడు:
7 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
“నేను చెప్పిన విధంగా జీవించు.
నేను చెప్పినవన్నీ చెయ్యి.
నీవు నా ఆలయానికి అధికారివిగా ఉంటావు.
నీవు దాని ఆవరణ విషయం శ్రద్ధ తీసుకుంటావు.
ఇక్కడ నిలబడిన దేవదూతలవలె
నీవు నా ఆలయంలో ఎక్కడికైనా వెళ్లటానికి నీకు స్వేచ్ఛ ఉంది.
8 కావున యెహోషువా, నీవూ, నీతో ఉన్న ప్రజలూ నేను చెప్పేది తప్పక వినాలి.
నీవు ప్రధాన యాజకుడవు. నీతో ఉన్న జనులు నిజంగా అద్భుతాలు నెరవేర్చగలరు.
నేను నిజంగా నా ప్రత్యేక సేవకుని తీసుకువస్తాను.
అతడు ‘కొమ్మ’ (చిగురు) అని పిలువబడతాడు.
9 చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని పెట్టాను.
ఆ రాతికి ఏడు పక్కలు (కండ్లు) ఉన్నాయి.
ఆ రాతి మీద నేనొక ప్రత్యేక వర్తమానం చెక్కుతాను.
నేను ఒక్క రోజులో ఈ దేశంలోని పాపాలన్నీ తీసివేస్తానని ఇది తెలియ జేస్తుంది.”
10 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు:
“ఆ సమయంలో ప్రజలు తమ స్నేహితులతోను,
పొరుగువారితోను కూర్చొని మాట్లాడుకుంటారు.
ప్రతి ఒక్కడూ తన అంజూరపు చెట్టు క్రింద,
తన ద్రాక్షాలత క్రింద ప్రశాంతంగా కూర్చుంటాడు.”
యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మత్తయి 14:13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17)
6 ఇది జరిగిన కొద్ది రోజులకు, యేసు గలిలయ సముద్రం (తిబెరియ సముద్రం) దాటి వెళ్ళాడు. 2 ఆయన అద్భుతమైన మహిమలతో రోగులకు బాగుచెయ్యటం చూసి, పెద్ద ప్రజల గుంపు ఒకటి ఆయన్ని అనుసరిస్తూవచ్చింది. 3 యేసు తన శిష్యులతో కలిసి కొండ మీదికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. 4 అవి పస్కా పండుగకు ముందు రోజులు. పస్కా యూదల పండుగ.
5 యేసు తలెత్తి పెద్ద ప్రజలగుంపు తన వైపు రావటం చూసి, ఫిలిప్పుతో, “వీళ్ళు తినటానికి ఆహారం ఎక్కడ కొందాం?” అని అడిగాడు. 6 అతణ్ణి పరీక్షించటానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి చెయ్యాలో ముందే ఆలోచించుకొన్నాడు.
7 ప్రతి ఒక్కనికి ఒక్కొక్క ముక్క దొరకాలన్నా, రెండువందల దేనారాలు ఖర్చు చేయవలసి వస్తుంది. అయినా అది చాలదు.
8 యేసు శిష్యుల్లో ఒకడైన అంద్రెయ అక్కడున్నాడు. యితడు సీమోను పేతురు సోదరుడు. 9 “ఇక్కడ ఒక బాలుని దగ్గర యవలతో చేసిన ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చేపలు ఉన్నాయి. కాని యింతమందికి అవి ఎట్లా సరిపోతాయి?” అని అన్నాడు.
10 యేసు, “ప్రజల్ని కూర్చోపెట్టండి!” అని అన్నాడు. అక్కడ చక్కటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల సంఖ్య ఐదువేలు. 11 యేసు ఆ రొట్టెల్ని తీసుకొని, దేవునికి కృతజ్ఞత చెప్పి, అక్కడ కూర్చున్నవాళ్ళకు పంచిపెట్టాడు. అదే విధంగా చేపల్ని కూడా పంచి పెట్టాడు. అందరూ కావలసినంత తిన్నారు.
12 వాళ్ళు తృప్తిగాతిన్నాక, తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా వాళ్ళు తినగా మిగిలిన ముక్కల్ని ఎత్తి పెట్టండి!” అని అన్నాడు. 13 ఐదు బార్లీ రొట్టెల్ని పంచగా మిగిలిన ముక్కల్ని శిష్యులు పండ్రెండు గంపలనిండా నింపారు.
14 ప్రజలు యేసు చేసిన ఆ మహాకార్యాన్ని చూసి, “లోకానికి రానున్న ప్రవక్త ఈయనే!” అని అనటం మొదలు పెట్టారు.
15 యేసు వాళ్ళు తనను బలవంతంగా రాజును చెయ్యాలనుకుంటున్నారని గ్రహించాడు. కనుక ఆయన ఏకాంతంగా కొండకు వెళ్ళిపోయ్యాడు.
యేసు నీళ్ళపై నడవటం
(మత్తయి 14:22-27; మార్కు 6:45-52)
16 సాయంకాలమైంది. ఆయన శిష్యులు సముద్రం దగ్గరకు వెళ్ళారు. 17 వాళ్ళు ఒక పడవనెక్కి సముద్రంకు అవతలి వైపుననున్న కపెర్నహూము అనే పట్టణం వైపు వెళ్ళసాగారు. అప్పటికే చీకటి పడింది. యేసు వాళ్ళనింకా కలుసుకోలేదు. 18 గాలి తీవ్రంగా వీయటంవల్ల అలలు అధికమయ్యాయి. 19 మూడు నాలుగుమైళ్ళ దూరందాకా తెడ్లు వేసాక, యేసు నీళ్ళ పై నడుస్తూ పడవ దగ్గరకు రావటం వాళ్ళు చూసారు. వాళ్ళకు బాగా భయం వేసింది. 20 కాని, యేసు వాళ్ళతో, “నేనే! భయపడకండి!” అని అన్నాడు. 21 ఈ మాట అన్న తర్వాత ఆయన పడవలోకి రావటానికి వాళ్ళు అంగీకరించారు. ఆ తదుపరి వాళ్ళు, తాము వెళ్ళదలచిన తీరాన్ని త్వరలోనే చేరుకున్నారు.
జనులు యేసుకొరకు చూడటం
22 తెల్లవారింది. అవతలి ఒడ్డున ఉండి పోయిన ప్రజలకు అక్కడ ఒకే పడవ ఉందని, యేసు శిష్యులతో కలిసి వెళ్ళలేదని, శిష్యులు మాత్రమే వెళ్ళారని, తెలుసు కొన్నారు. 23-24 వాళ్ళు యేసు, ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించిన వెంటనే, వెతకటానికి నిశ్చయించుకున్నారు. తిబెరియ నుండి కొన్ని పడవలు వచ్చి ఒడ్డు చేరాయి. ప్రభువు దేవునికి కృతజ్ఞత చెప్పి, రొట్టెల్ని ప్రజలకు పంచిన స్థలం దీని సమీపంలో ఉంది. వాళ్ళు ఆ పడవలెక్కి ఆయన్ని వెదుకుతూ కపెర్నహూము వెళ్ళారు.
యేసు మన జీవితానికి ఆహారం లాంటివాడు
25 యేసు అవతలి ఒడ్డున కనిపించగానే, వాళ్ళు ఆయనతో, “రబ్బీ! మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?” అని అడిగారు.
26 యేసు, “ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకటం లేదు. రొట్టెలు తిని మీ కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకుతున్నారు. 27 చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు.
28 వాళ్ళు ఆయన్ని, “దైవకార్యం చెయ్యాలంటే మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు.
29 యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు.
30 కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, “అలాగైతే, మేము నమ్మేటట్లు ఏ అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తారు? 31 మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను[a] తిన్నారు. దీన్ని గురించి గ్రంథాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన, వాళ్ళు తినటానికి పరలోకం నుండి ఆహారం యిచ్చాడు.”
32 యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు. దాన్ని యిచ్చేవాడు నా తండ్రి. 33 ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్నిస్తాడు” అని అన్నాడు.
34 వాళ్ళు, “అయ్యా! యికనుండి ఈ ఆహారం మాకివ్వండి!” అని అన్నారు.
35 యేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు. 36 కాని నేను ఇంతకు క్రితం చెప్పినట్లు, నన్ను చూసారు! అయినా మీరు నమ్మలేదు! 37 తండ్రి నాకప్పగించిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణెవణ్ణి నేను ఎన్నటికి నెట్టి వేయను. 38 ఎందుకంటే, నేను పరలోకం నుండి నా యిష్టం నెరవెర్చుకోవటానికి దిగిరాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చాను. 39 నన్ను పంపిన వాని కోరిక యిది: నా కప్పగింపబడిన వాళ్ళను నేను పోగొట్టు కోరాదు. వాళ్ళను చివరి రోజు బ్రతికించాలి. 40 కుమారుని వైపు చూసి ఆయన్ని నమ్మినవాడు అనంత జీవితం పొందాలి. ఇది నా తండ్రి కోరిక. అలా నమ్మిన వాణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను.”
41 ఆయన, “నేను పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని” అని అనటం విని యూదులు గొణిగారు. 42 “ఇతడు యోసేపు కుమారుడైన యేసు కదా! ఇతని తల్లిదండ్రుల్ని మనం ఎరుగుదుమే! మరి యిప్పుడితడు, ‘నేను పరలోకం నుండి దిగి వచ్చానని’ ఎందుకు అంటున్నాడు?” అని వాళ్ళన్నారు.
43 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీలో మీరు గొణుక్కోవడం చాలించండి. 44 నన్ను పంపిన తండ్రి పంపితే తప్ప, నా దగ్గరకు ఎవ్వడూ రాలేడు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణి చివరి రోజు నేను బ్రతికిస్తాను. 45 ప్రవక్తల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది: ‘దేవుడు వాళ్ళందరికీ బోధిస్తాడు.’(A) తండ్రి మాట విని ఆయన చెప్పింది నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు. 46 దేవుని నుండి వచ్చినవాడు తప్ప తండ్రినెవ్వరూ చూడలేదు. ఆయన మాత్రమే తండ్రిని చూసాడు.
47 “ఇది నిజం. నమ్మినవానికి అనంత జీవితం లభిస్తుంది. 48 నేను మీ జీవితానికి ఆహారాన్ని. 49 మీ పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు మన్నా తిన్నారు. అయినా చనిపోయారు. 50 కాని ఈయన పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం. దీన్ని అందరూ తినవచ్చు. దీన్ని తిన్నవాడు మరణించడు. 51 పరలోకం నుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం యిస్తాను.”
52 ఆ తర్వాత, “మనకు తన శరీరాన్ని తినటానికి ఈయన ఏవిధంగా యిస్తాడు?” అని యూదులు పరస్పరం తీవ్రంగా వాదించుకున్నారు.
53 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మనుష్యకుమారుని శరీరం తిని, ఆయన రక్తం తాగ్రితే తప్ప మీలో జీవం ఉండదు. 54 నా శరీరము తిని, నా రక్తం త్రాగిన వానికి అనంతజీవితం లభిస్తుంది. అతణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను. 55 ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం. నా రక్తం నిజమైన పానీయము. 56 నా శరీరం తిని, నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు.
57 “సజీవుడైన నా తండ్రి నన్ను పంపాడు. ఆయన కారణంగానే నేను జీవిస్తున్నాను. అదే విధంగా నన్ను ఆహారంగా తిన్నవాడు నాకారణంగా జీవిస్తాడు. 58 పరలోకం నుండి దిగివచ్చిన నిజమైన ఆహారం యిదే! ఇది మన పూర్వీకులు తిన్న ఆహారంలాంటిది కాదు. వాళ్ళు అది తిన్నా చనిపొయ్యారు. కాని ఈ ఆహారాన్ని తిన్నవాళ్ళు అనంతజీవితం పొందుతారు.”
59 యేసు, కపెర్నహూములోని యూదుల సమాజ మందిరంలో బోధిస్తూ ఈ విషయాలు చెప్పాడు.
చాలా మంది శిష్యులు యేసును వదిలి వెళ్ళటం
60 ఆయన చెప్పినవి విని చాలా మంది శిష్యులు, “ఈ బోధన చాల కష్టమైనది. దీన్ని ఎవరు అంగీకరించగలరు?” అని అన్నారు.
61 తన శిష్యులు ఈ విషయాన్ని గురించి గొణుక్కుంటున్నారని యేసు గ్రహించాడు. ఆయన వాళ్ళతో, “ఇది మీకు కష్టంగా ఉందా? 62 మనుష్యకుమారుడు, తాను ముందున్న చోటికి వెళ్ళటం చూస్తే మీరెమంటారు? 63 ఆత్మ జీవాన్నిస్తాడు. శరీరానికి విలువ లేదు. నామాటలు ఆత్మకు సంబంధించినవి. అవి జీవం. 64 కాని, మీలో కొందరు నమ్మటం లేదు” అని అన్నాడు. తనను నమ్మని వాడెవడో, తనకు ద్రోహం చేసేవాడెవడో యేసుకు ముందునుండి తెలుసు. 65 యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “తండ్రి అనుమతిస్తే తప్ప నా దగ్గరకు ఎవ్వరూ రాలేరని అందుకే అన్నాను.”
66 ఆ రోజు నుండి చాలా మంది శిష్యులు ఆయన్ని అనుసరించటం మానుకొని వెనక్కు మళ్ళి పోయారు.
67 యేసు, “మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా?” అని పన్నెండు మందిని అడిగాడు.
68 సీమోను పేతురు, “ప్రభూ మేము ఎవరి దగ్గరకు వెళ్ళాలి? అనంత జీవితాన్ని గురించి చెప్పే మాటలు మీ దగ్గర ఉన్నాయి. 69 మీరు దేవునికి సంబంధించిన వారని, పవిత్రులని మాకు తెలుసు. అది మేము నమ్ముతున్నాము” అని సమాధానం చెప్పాడు.
70 అప్పుడు యేసు, “మీ పన్నెండు మందిని ఎన్నుకొన్న వాణ్ణి నేనే కదా! అయినా మీలో ఒకడు సైతాను!” అని అన్నాడు. 71 ఆయన ఉద్దేశ్యం సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా అని. యూదా పన్నెండు మందిలో ఒకడైయుండి యేసుకు ద్రోహం చేస్తాడు.
© 1997 Bible League International