M’Cheyne Bible Reading Plan
ఆలయాన్ని దేవునికి అంకింతం చేయటం
7 సొలొమోను ప్రార్థన పూర్తి చేసేసరికి ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులను, మిగిలిన అర్పణలను దహించి వేసింది. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది. 2 యెహోవా మహిమ నిండి వున్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేక పోయారు. 3 ఆకాశం నుండి అగ్ని దిగిరావటం ఇశ్రాయేలీయులంతా చూశారు. యెహోవా మహిమ ఆలయాన్ని ఆవరించి వుండటం కూడ వారు చూశారు. వారంతా బాటపై సాష్టాంగ పడ్డారు. వారు యెహోవాను స్తుతించి, నమస్కరించారు. వారింకా యిలా అన్నారు:
“ప్రభువు ఉత్తముడు,
ఆయన కరుణ ఎప్పటికీ కొనసాగుతుంది.”
4 పిమ్మట రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవా ముందు బలులు అర్పించారు. 5 రాజైన సొలొమోను ఇరవై రెండువేల గిత్తలను, ఒక లక్షా ఇరవైవేల గొర్రెలను బలియిచ్చాడు. రాజు, ప్రజలు అంతా కలిసి ఆలయాన్ని పవిత్రం చేశారు. అది యెహోవా ఆరాధనకై వినియోగింపబడాలి. 6 యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సిద్ధంగా నిలబడ్డారు. లేవీయులు కూడ యెహోవా మేళం వాయించే పనిముట్లు పట్టుకుని నిలిచారు. దేవునికి వందనాలర్పించే నిమిత్తం ఈ వాద్య విశేషాలను రాజైన దావీదు చేయించాడు. “దేవుని ప్రేమ అనంతం!” అని యాజకులు, లేవీయులు పలికారు. లేవీయులకు ఎదురుగా నిలబడి యాజకులు బాకాలు ఊదారు. ఇశ్రాయేలీయులందరూ నిలబడ్డారు.
7 ఆలయం ముందున్న ఆవరణ మధ్య భాగాన్ని సొలొమోను ప్రతిష్ఠించాడు. అక్కడే సొలొమోను దహనబలులు,[a] సమాధాన బలుల కొవ్వును అర్పించాడు. తాను నిర్మించిన కంచు బలిపీఠం దహనబలులు, ధాన్యపు అర్పణలు, కొవ్వును పెట్టటానికి చాలనందున, సొలొమోను ఆలయ ఆవరణ మధ్య భాగాన్ని వినియోగించాడు.
8 సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఏడు రోజులపాటు పండుగ చేశారు. సొలొమోనుతో చాలా మంది జనం వున్నారు. హమాతు పట్టణద్వారం నుండి ఈజిప్టు సెలయేటి వరకు వున్న ప్రాంత మంతటి నుండి జనసమూహాలు వచ్చాయి. 9 ఏడు రోజుల పండుగ ఆచరణ ముగిశాక, ఎనిమిదవ రోజున వారు పవిత్ర సమావేశం ఏర్పాటు చేశారు. బలిపీఠాన్ని వారు పవిత్రం (శుద్ధి) చేశారు. దానిని దైవారాధనలోనే వినియోగిస్తారు. వారు ఏడు రోజులు పండుగ ఆచరించారు. 10 ఆ సంవత్సరం ఏడవ నెల ఇరవై మూడవ రోజు సొలొమోను ప్రజలందరినీ తమ తమ ఇండ్లకు పంపివేశాడు. యెహోవా దావీదుపట్ల, సొలొమోను పట్ల, ఇశ్రాయేలు ప్రజలపట్ల ఎంతో ఉదారంగా వున్నందుకు ప్రజలంతా చాలా సంతోషించారు. వారి హృదయాలు ఆనందమయమయ్యాయి.
యెహోవా సొలొమోను వద్దకు రావటం
11 సొలొమోను ఆలయాన్ని, రాజభవనాన్ని నిర్మించటం పూర్తిచేశాడు. ఆలయ నిర్మాణంలోను, తన ఇంటి నిర్మాణంలోను సొలొమోను అనుకున్న పనులన్నీ పూర్తిచేశాడు. 12 ఆ రాత్రి యెహోవా సొలొమోనుకు దర్శనమిచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు:
“సొలొమోనూ, నీ ప్రార్థన నేను విన్నాను. బలులు యివ్వటానికి అనువైన ప్రదేశంగా ఈ స్థలాన్ని నేనే ఎంపిక చేశాను. 13 వర్షాలు లేకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడుగాని, దేశాన్ని నాశనం చేసే విధంగా నేను మిడతల దండులను పంపినుప్పుడుగాని, నేను నా ప్రజలకు వ్యాధులు సొకేలా చేసినప్పుడుగాని, 14 నా పేరు మీద పిలవబడే నా ప్రజలు అణకువతో వుండి నన్ను ప్రార్థిస్తే, నా కొరకు ఎదురు చూస్తే, వారు తమ చెడు మార్గాలను విడనాడితే, నేనప్పుడు ఆకాశం నుండి వారి మొర ఆలకిస్తాను. నేను వారి పాపాలను క్షమిస్తాను. నేను వారి దేశాన్ని బాగు చేస్తాను. 15 నేను నా నేత్రలను తెరచియున్నాను. నా చెవులు ఈ ప్రదేశంలో చేసిన ప్రార్థనలను వింటాయి. 16 ఇక్కడ నా పేరు శాశ్వతంగా ఉండునట్లు నేనీ ప్రదేశాన్ని ఎంపిక చేసి, దానిని పవిత్రంగా మార్చాను. అవును; నా కళ్లు, నా హృదయం ఇక్కడ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ వుంటాయి. 17 సొలొమోనూ, నీవిప్పుడు నీ తండ్రి మెలగిన రీతిలో నా ముందు జీవిస్తే, నా ఆజ్ఞలన్నీ పాటిస్తే, నా ధర్మశాస్త్రాన్ని, నియమాలను అనుసరిస్తే, 18 నిన్నొక శక్తి గల రాజుగా చేస్తాను. నీ రాజ్యాన్ని సుస్థిరమైనదిగా చేస్తాను. నీ తండ్రియైన దావీదుతో అదే ఒడంబడిక చేశాను. ‘దావీదూ, ఇశ్రాయేలు రాజుగా నీ కుటుంబంలో ఒకడు కొనసాగుతాడు’ అని నేను చెప్పియున్నాను.
19 “కానీ నీవు నా ధర్మాన్ని, ఆజ్ఞలను శిరసావహించనిచో, నీవు గనుక అన్యదేవతారాధనకు పాల్పడితే, 20 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నేను వారికిచ్చిన రాజ్యం నుండి బయటకు త్రోసివేస్తాను. నా నామముతో పవిత్రపర్చబడిన ఈ ఆలయాన్ని నేను వదలి వేస్తాను. ఇతర దేశాలన్నీ చెడుమాటలు పలికేలా ఈ ఆలయమును మార్చివేస్తాను. 21 అత్యున్నతంగా గౌరవింపబడిన ఈ ఆలయం ప్రక్కగా వెళ్లే వారెవరైనా చూసి ఆశ్చర్యపోతారు. ‘ఈ రాజ్యానికి, ఈ ఆలయానికి, యెహోవా ఎందుకింత భయంకర పరస్థితి కల్పించాడు?’ అని అనుకుంటారు. 22 పిమ్మట వారు ఈ రకంగా సమాధానం చెప్పుకుంటారు: ‘వారి పూర్వీకుల దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు ప్రజలు అనుసరించలేదు. ఆయనే వారిని ఈజిప్టు నుండి విముక్తి చేసి బయటకు తీసుకొనివచ్చాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు అన్యదేవతలను సేవించారు. వారు విగ్రహాలను కొలిచారు. అందువల్లనే యెహోవా ఈ భయంకర పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలకు కల్పించాడు అని అనుకుంటారు.’”
1 దేవుడు ఎన్నుకున్న అమ్మగారికి, ఆమె సంతానానికి, పెద్దనైన నేను వ్రాస్తున్నది ఏమనగా, 2 మీ పట్ల నాకు నిజమైన ప్రేమవుంది. సత్యం మాలో శాశ్వతంగా ఉంది కాబట్టే, నాకే కాకుండా సత్యం తెలిసిన వాళ్ళందరికీ మీ పట్ల ప్రేమ ఉంది.
3 తండ్రి అయిన దేవుడు, తండ్రి యొక్క కుమారుడైన యేసు క్రీస్తు మనకు సత్యంతో, ప్రేమతో ఇచ్చిన కృప, దయ, శాంతి మనలో ఉండాలని కోరుతున్నాను.
4 మీ సంతానంలో కొందరు, తండ్రి ఆజ్ఞాపించినట్లు నిజాయితీగా జీవిస్తున్నారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. 5 అమ్మా! మొదటినుండి ఉన్న ఆజ్ఞనే నేను మీకు వ్రాస్తున్నాను కాని, క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మనము పరస్పరం ప్రేమతో ఉండాలని అంటున్నాను. 6 ఆయన ఆజ్ఞల్ని విధేయతతో పాటించటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్నట్లు, ప్రేమతో జీవించుమని ఆయన ఆజ్ఞాపించాడు.
7 యేసు క్రీస్తు శరీరంతో రాలేదనే మోసగాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో వ్యాపించారు. వాళ్ళు మోసగాళ్ళు; క్రీస్తు విరోధులు. 8 పని చేయటంవల్ల లభించే ఫలాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. సంపూర్ణమైన ఫలం లభించేటట్లు చూసుకోండి.
9 క్రీస్తు ఉపదేశాన్ని ఉల్లంఘించినవానిపై దేవుని అనుగ్రహం ఉండదు. ఆ ఉపదేశానుసారం నడుచుకొనేవానిపై తండ్రి, కుమారుల అనుగ్రహం ఉంటుంది. 10 ఈ ఉపదేశం తమ వెంట తీసుకురాకుండా మీ దగ్గరకు వచ్చినవాణ్ణి మీ ఇంట్లోకి రానివ్వకండి. అలాంటివాణ్ణి పలుకరించకండి. 11 ఎవరైనా అలాంటివాణ్ణి పలుకరిస్తే, ఆ పలుకరించబడినవాడు చేసిన చెడ్డ పనుల్లో అతడు కూడ భాగస్థుడౌతాడు.
12 నాకింకా ఎన్నో విషయాలు వ్రాయాలని ఉంది. కాని కాగితాన్ని, సిరాను ఉపయోగించటం నాకు యిష్టం లేదు. నేను మిమ్మల్ని కలిసి ముఖాముఖి మీతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాను. అప్పుడు మనకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది. 13 దేవుడు ఎన్నుకొన్న మీ సోదరి యొక్క సంతానం,[a] వాళ్ళ అభివందనాలు మీకు తెలుపుతున్నారు.
2 నేనొక కాపలాదారునిగా నిలబడి గమనిస్తాను.
యెహోవా నాకు ఏమి చెపుతాడో వినటానికి నేను వేచి ఉంటాను.
ఆయన నా ప్రశ్నలకు ఎలా సనాధానమిస్తాడో నేను వేచివుండి తెలుసుకుంటాను.
హబక్కూకునకు దేవుడు సమాధానమివ్వటం
2 యెహోవా నాకు సమాధానమిచ్చాడు: “నేను నీకు చూపించేవాటిని వ్రాయి. ప్రజలు సులభంగా చదవగలిగే రీతిలో దానిని ఒక పలకమీద స్పష్టంగా వ్రాయి. 3 ఈ వర్తమానం భవిష్యత్తులో ఒక ప్రత్యేక సమయం గురించినది. ఈ వర్తమానం పరిసమాప్తిని గురించినది. అది నిజమవుతుంది! ఆ సమయం ఎన్నడూ రానట్టుగా కన్పించవచ్చు. కాని ఓపికతో దానికొరకు వేచివుండు. ఆ సమయం వస్తుంది. అది ఆలస్యం కాదు. 4 దీనిని విన నిరాకరించే వారికి ఈ వర్తమానం సహాయపడదు. కాని మంచివాడు ఈ వర్తమానాన్ని నమ్ముతాడు. తన విశ్వాసం కారణంగా, ఆ మంచి వ్యక్తి దీనిని నమ్ముతాడు.”
5 దేవుడు చెప్పాడు: “ద్రాక్షమద్యం మనిషిని మోసం చేయగలదు. అదే మాదిరి ఒక బలవంతుని గర్వం అతనిని అవివేకునిగా చేస్తుంది. అతనికి శాంతి ఉండదు. అతడు మృత్యువువలె ఉంటాడు. అతడు ఇంకా, ఇంకా కోరుతూనే ఉంటాడు. మృత్యువువలె అతనికి తృప్తి అంటూ ఉండదు. అతడు ఇతర దేశాలను ఓడించటం కొనసాగిస్తూనే ఉంటాడు. ఆ ప్రజలను చెరపట్టటం కొనసాగిస్తూ ఉంటాడు. 6 కాని అతి త్వరలోనే ఆ ప్రజలంతా అతనిని చూచి నవ్వుతారు. తన ఓటమిని గురించి వారు కథలు చెపుతారు. వారు నవ్వి, ‘అది మిక్కిలి హేయమైనది! ఆ వ్యక్తి అనేక వస్తువులు దొంగిలించాడు. తనవి కానివాటిని తన వశం చేసుకున్నాడు. అతడు ధనాన్ని విస్తారంగా తీసుకున్నాడు. ఆ వ్యక్తికి అది అతి శ్రమకారకమైన పని’ అని అంటారు.
7 “నీవు (బలవంతుడు) ప్రజలవద్ద డబ్బు తీసుకున్నావు. ఒక రోజు ఆ ప్రజలు మేల్కొని, జరుగుతున్నదానిని గుర్తిస్తారు. వారు నీకు ఎదురు తిరుగుతారు. అప్పుడు వారే నీనుండి వస్తువులు తీసుకొంటారు. నీవు చాలా భయపడతావు. 8 నీవు అనేక దేశాలనుండి వస్తువులు దొంగిలించావు. కావున ఆ ప్రజలు నీ నుండి చాలా తీసుకుంటారు. నీవు అనేకమందిని చంపివేశావు. నీవు దేశాలను, నగరాలను నాశనం చేశావు. నీవక్కడ ప్రజలందరినీ చంపివేశావు.
9 “అవును, అన్యాయం చేసి ధనవంతుడైన వానికి మిక్కిలి శ్రమ. సురక్షిత ప్రదేశంలో నివసించటానికి అతడు ఆ పనులు చేశాడు. ఇతరులు తనను దోచుకోవటాన్ని తను ఆపగలనని అతడు అనుకొంటున్నాడు. కాని అతనికి కీడు వాటిల్లుతుంది. 10 నీవు (బలవంతుడు) అనేక మందిని నాశనం చేయటానికి వ్యూహాలు పన్నావు. ఇది నీ స్వంత ప్రజలనే అవమానానికి గురిచేసింది. నీవు ప్రాణాన్ని కోల్పోతావు. 11 గోడరాళ్ళు నీకు వ్యతిరేకంగా అరుస్తాయి. నీ స్వంత ఇంటి వాసాలు సహితం నీవు తప్పు చేశావని ఒప్పుకుంటాయి.
12 “అన్యాయం చేసి, నరహత్య చేసి నగరం నిర్మించిన నాయకునికి మిక్కిలి కీడు. 13 అటువంటి జనులు నిర్మింప తలపెట్టిన వాటన్నిటినీ అగ్నిచే కాల్చివేయటానికి సర్వశక్తిమంతుడైన యెహోవా నిర్ణయించాడు. వారు చేసిన పనంతా వృథా. 14 అప్పుడు ప్రతిచోట ప్రజలు యెహోవా యొక్క మహిమను గూర్చి తెలుసుకుంటారు. సముద్రంలోకి నీరు వ్యాపించునట్లు ఈ వార్త వ్యాపిస్తుంది. 15 తను కోపం చెంది, ఇతరులను బాధించే వ్యక్తికి మిక్కిలి శ్రమ. ఆ వ్యక్తి కోపంలో ఇతరులను నేలకు పడగొడతాడు. అతడు వారిని వస్త్రవిహీనులుగాను, తాగినవారిగాను చూస్తాడు.
16 “కాని అతడు యెహోవా కోపాన్ని తెలుసుకుంటాడు. ఆకోపం యెహోవా కుడి చేతిలో విషపు గిన్నెలా ఉంటుంది. అతడు ఆ కోపాన్ని రుచిచూచి, తాగిన వానిలా నేలమీద పడతాడు.
“దుష్టపాలకుడా, నీవు ఆ గిన్నెనుండి తాగుతావు. నీవు పొందేది అవమానం; గౌరవం కాదు. 17 నీవు లెబానోనులో ఎంతోమందిని బాధించావు. అక్కడ నీవు ఎన్నో పశువులను దొంగిలించావు. కావున, చనిపోయిన ప్రజల కారణంగాను, నీవా దేశానికి చేసిన చెడుపనుల వల్లను నీవు భయపడతావు. నీవా నగరాలకు, వాటిలో నివసించే ప్రజలకు చేసిన పనులనుబట్టి నీవు భయపడతావు”
విగ్రహాలను గూర్చిన వర్తమానం
18 అతని బూటకపు దేవుడు అతనికి సహాయం చేయడు. ఎందుకనగా అది ఒకానొకడు లోహవు తొడుగు వేసి చేసిన బొమ్మ. అది కేవలం విగ్రహం. కావున దానిని చేసినవాడు అది సహాయం చేస్తుందని ఆశించలేడు. ఆ విగ్రహం కనీసం మాట్లాడలేదు. 19 ఒక కొయ్య విగ్రహముతో “నిలబడు” అని చెప్పేవానికి మిక్కిలి వేదన! మాట్లాడలేని ఒక రాతితో, “మేలుకో” అని చెప్పేవానికి బాధ తప్పదు. ఆ వస్తువులు అతనికి సహాయపడలేవు. ఒక విగ్రహం బంగారంతో గాని, వెండితో గాని తొడుగు వేయబడవచ్చు. కాని ఆ విగ్రహంలో ప్రాణం లేదు.
20 కాని యెహోవా విషయం వేరు! యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. కావున ఈ భూమి అంతా నిశ్శబ్దంగా వుండి, యెహోవాముందు గౌరవ భావంతో మెలగాలి.
నిజమైన కానుక
(మార్కు 12:41-44)
21 యేసు చుట్టూ చూసాడు. ధనవంతులు హుండీలో కానుకలు వేయటం ఆయన గమనించాడు. 2 అతి పేదరాలైన ఒక వితంతువు రెండు పైసాలు హుండీలో వెయ్యటం కూడా ఆయన గమనించాడు. 3 ఆయన, “నేను చెప్పేదేమిటంటే ఈ బీదవితంతువు అందరికన్నా ఎక్కువ ఆ హుండిలో వేసింది. 4 యితర్లు తమ దగ్గరున్న సంపద నుండి కొంత మాత్రమే కానుకగా వేసారు. కాని ఆమె తాను జీవించటానికి దాచుకొన్నదంతా ఆ హుండీలో వేసింది” అని అన్నాడు.
యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం
(మత్తయి 24:1-14; మార్కు 13:1-13)
5 ఆయన శిష్యుల్లో కొందరు ఆ మందిరానికి చెక్కబడిన రాళ్ళ అందాన్ని గురించి, ప్రజలు యిచ్చిన కానుకలతో చేసిన అలంకరణను గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు.
6 కాని యేసు, “మీరిక్కడ చూస్తూన్నవన్నీ రాయి మీద రాయి నిలువకుండా నేలమట్టమై పోయ్యే సమయం వస్తుంది” అని అన్నాడు.
7 వాళ్ళు, “అయ్యా! యివి ఎప్పుడు సంభవిస్తాయి! ఇవి జరుగబోయేముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయి” అని అడిగారు.
8 ఆయన, “జాగ్రత్త! మోసపోకండి. నా పేరిట అనేకులు వచ్చి, ‘నేనే ఆయన్ని అని, కాలం సమీపించింది’ అని అంటారు. వాళ్ళను అనుసరించకండి. 9 యుద్ధాల్ని గురించి, తిరుగుబాట్లను గురించి వింటే భయపడకండి. ఇవన్నీ ముందు జరిగి తీరవలసిందే. కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు.
10 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “దేశం దేశంతో, రాజ్యం రాజ్యంతో యుద్ధం చేస్తుంది. 11 అన్నిచోట్లా తీవ్రమైన భూకంపాలు, కరువులు, రోగాలు సంభవిస్తాయి. ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆకాశంలో భయంకర గుర్తులు కనిపిస్తాయి.
12 “కాని యివన్నీ జరుగక ముందే యూదులు మిమ్మల్ని బంధించి, హింసించి సమాజ మందిరాలకు అప్పగిస్తారు. ఆ సమాజ మందిరాల అధికారులు మిమ్మల్ని కారాగారంలో పడవేస్తారు. రాజుల ముందు, రాజ్యాధికారుల ముందు నిలబెడతారు. ఇవన్నీ నాపేరు కారణంగా జరుగుతాయి. 13 తద్వారా వాళ్ళకు సువార్తను గురించి చేప్పే అవకాశం మీకు కలుగుతుంది. 14 వాళ్ళ సమక్షంలో మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి సిద్ధం కారాదని మీ మనస్సులో నిర్ణయించుకోండి. 15 ఎందుకంటే సరియైన సమయానికి మాట్లాడటానికి అవసరమైన పదాన్ని నేను మీకు అందిస్తాను. కావలసిన జ్ఞానం యిస్తాను. మీ ప్రతివాదులు మీ మాటల్ని ఖండించకుండా ఉండేటట్లు చేస్తాను. వాళ్ళలో తిరిగి వాదించే శక్తి లేకుండా చేస్తాను. 16 మీ తల్లి తండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు మీకు ద్రోహం చేస్తారు. మీలో కొందర్ని చంపి వేస్తారు. 17 నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. 18 కాని మీ తల మీదనున్న ఒక్కవెంట్రుక కూడా రాలిపోదు. 19 సహనంతో ఉండండి. అప్పుడే మిమ్మల్ని మీరు వీటన్నిటియందు విశ్వాసం ద్వారా రక్షించుకోగలుగుతారు.
యేసు యెరూషలేము నాశనమౌతుందని చెప్పటం
(మత్తయి 24:15-21; మార్కు 13:14-19)
20 “యెరూషలేము చుట్టూ సైన్యాలు చూసినప్పుడు అది నాశనమయ్యే రోజులు వచ్చాయని గ్రహించండి. 21 అప్పుడు యూదయలో ఉన్న మీరు పరుగెత్తి కొండల మీదికి వెళ్ళండి. పట్టణంలో ఉన్న వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపొండి. గ్రామాల్లో ఉన్న వాళ్ళు పట్టణాల్లోకి వెళ్ళకండి. 22 ఇది శిక్షా సమయం. ఇదివరకు లేఖనాల్లో వ్రాసినవన్నీ నిజంకానున్న సమయం. 23 ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత కష్టం కలుగుతుందో కదా! ఈ దేశానికి పెద్ద దుఃఖంకలుగనున్నది. దేవుడు తన కోపాన్ని ఈ దేశంపై చూపనున్నాడు. 24 కొందరు కత్తికి బలి అవుతారు. మరి కొందరు ఖైదీలుగా యితర దేశాలకు తీసుకు వెళ్ళబడతారు. యూదులుకాని వాళ్ళ కాలం ముగిసేదాకా వాళ్ళు యెరూషలేమును అణగత్రొక్కి ఉంచుతారు.
భయపడవద్దు
(మత్తయి 24:29-31; మార్కు 13:24-27)
25 “సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో సూచనలు కన్పిస్తాయి. సముద్రాల రోదనకు, తీవ్రమైన అలలకు దేశాలు భయపడి కలవరం చెందుతాయి. 26 రానున్న ఘోరాన్ని తలంచుకొని ప్రజలు భయంతో మూర్చపోతారు. ఆకాశపు జ్యోతులు గతి తప్పుతాయి. 27 అప్పుడు శక్తితో, గొప్ప తేజస్సుతో మేఘం మీద మనుష్యకుమారుడు రావటం వాళ్ళు చూస్తారు. 28 ఇవి జరగటం మొదలైనప్పుడు లేచి మీ తలలెత్తి చూడండి. అంటే మీకు రక్షణ దగ్గరకు వచ్చిందని అర్థం” అని అన్నాడు.
చెట్ల ఉపమానం
(మత్తయి 24:32-35; మార్కు 13:28-31)
29 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఆ అంజూరపు చెట్టును చూడండి. అంతెందుకు; చెట్లన్నిటిని చూడండి. 30 చెట్టు చిగురు వేయగానే ఎండాకాలం దగ్గరకు వచ్చిందని గ్రహిస్తారు. 31 అదే విధంగా ఈ సంఘటనలు జరగటం చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని గ్రహించండి.
32 “ఇది నిజం. ఇవన్నీ సంభవించేవరకు ఈ తరంవాళ్ళు గతించరు. 33 ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి.
అన్ని వేళలా సిద్ధంగా ఉండండి
34 “జాగ్రత్త! విందులు, వినోదాలు చేసుకొంటూ త్రాగుబోతులై జీవించకండి. ప్రాపంచిక విషయాల్లో మునిగిపోకండి. అలా చేస్తే మీ బుద్ధి పని చెయ్యటం మానేస్తుంది. అప్పుడు ఆ దినం మీరు సిద్ధంగా లేనప్పుడు వచ్చి మీ మీద పడుతుంది. 35 అది ప్రపంచం మీదికంతా వస్తుంది. 36 అన్ని వేళలా జాగ్రత్తగా ఉండండి. ఈ దుర్ఘటనలనుండి తప్పించుకొనే శక్తి, మనుష్యకుమారుని సమక్షంలో నిలబడగలిగే శక్తి కలగాలని ప్రార్థించండి.”
37 యేసు ప్రతి రోజు మందిరంలో బోధిస్తూ ఉండేవాడు. ప్రతిరాత్రి ఒలీవలకొండ మీదికి వెళ్ళి గడిపేవాడు. 38 ప్రజలందరు ఆయన బోధనలు వినాలని తెల్లవారుఝామునే మందిరానికి వెళ్ళేవాళ్ళు.
© 1997 Bible League International