M’Cheyne Bible Reading Plan
సొలొమోను జ్ఞానాన్ని కోరటం
1 యెహోవా దేవుని కృపవున్నందువల్ల సొలొమోను చాలా శక్తిమంతుడైన రాజుగా రూపొందాడు. యెహోవా సొలొమోనును గొప్ప వ్యక్తిగా చేశాడు.
2 సొలొమోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. అతడు సైన్యాధికారులతోను, దళాధిపతులతోను, న్యాయాధిపతులతోను, ఇంకను ఇశ్రాయేలులోని ప్రతి ఒక్క నాయకునితోను, ప్రతి కుటుంబ పెద్దతోను మాట్లాడాడు. 3 పిమ్మట సొలొమోను, అతని దగ్గరికి వచ్చిన ప్రజలందరూ కలిసి గిబియోనులో వున్న గుట్టమీదికి (ఉన్నత స్థలం) వెళ్లారు. దేవుని సన్నిధి గుడారం అక్కడ ఉంది. యోహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఎడారిలో వున్నప్పుడు ఈ గుడారాన్ని నిర్మించాడు. 4 దేవుని ఒడంబడిక పెట్టె[a] దావీదు కిర్యత్యారీము నుండి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. దానిని వుంచటానికి దావీదు యెరూషలేములో ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని ఒడంబడిక పెట్టెను వుంచటానికి దావీదు యెరూషలేములో ఒక గుడారం ఏర్పాటు చేశాడు. 5 బెసలేలు కంచుతో ఒక బలిపీఠాన్ని తయారుచేశాడు. బెసలేలు తండ్రిపేరు ఊరి. ఊరి తండ్రి పేరు హూరు. కాని ఈ కంచు పీఠం గిబియోనులో పవిత్ర గుడారం ఎదుట వుంది. అందువల్ల సొలొమోను, ప్రజలు కలిసి దేవుని సలహా పొందటానికి గిబియోనుకు వెళ్లారు. 6 సన్నిధి గుడారం వద్ద దేవుని ముందున్న కంచుపీఠం వద్దకు సొలొమోను వెళ్లాడు. బలపీఠం మీద సొలొమోను వెయ్యి దహనబలులు అర్పించాడు.
7 ఆ రోజు రాత్రి దేవుడు సొలొమోనుతో స్వప్నములో యిలా అన్నాడు: “సొలొమోనూ, నీకు ఏమి కావాలో కోరుకో.”
8 సొలొమోను దేవునితో యిలా అన్నాడు: “నా తండ్రి దావీదు పట్ల నీవు చాలా దయకలిగియున్నావు. నా తండ్రి స్థానంలో కొత్త రాజుగా వ్యవహరించటానికి నీవు నన్ను ఎంపిక చేశావు. 9 నా ప్రభువైన దేవా నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చు. ఒక గొప్ప రాజ్యానికి నన్ను రాజుగా ఎంపిక చేశావు. ఇక్కడి జనాభా భూమి మీద ధూళిలా విస్తారంగా వుంది. 10 ఇప్పుడు నాకు తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించు. దానివల్ల ఈ అశేష ప్రజానీకాన్ని సన్మార్గంలో నడిపించగలను. నీ సహాయం లేకుండా ఈ ప్రజానీకాన్ని ఏ ఒక్కడూ పరిపాలించలేడు!”
11 అది విని సొలొమోనుతో దేవుడు యీలా అన్నాడు: “నీ ప్రవర్తన బాగుంది. నీవు ఐశ్వర్యాన్నిగాని, ధనికులకుండే భోగ భాగ్యాలను గాని, పేరుప్రతిష్ఠలనుగాని కోరలేదు. నీ శత్రువులంతా నాశనం కావాలని కూడా నీవు కోరలేదు. నీవు చాలాకాలం బ్రతకాలని దీర్ఘాయుష్షూ కోరలేదు. నా ప్రజలను పాలించటానికి నీవు తెలివిని, వివేచననూ, జ్ఞానాన్ని ప్రసాదించమని కోరావు. ఈ ప్రజలకు రాజుగా నిన్ను నేను ఎంపిక చేశాను. 12 కావున నీకు నేను తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు ధనాన్ని, భాగ్యాలను, గౌరవాన్ని కూడ నేను ఇస్తున్నాను. నీకు ముందున్న రాజులెవ్వరూ ఇంతటి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని పొందియుండలేదు. నీ తరువాత వచ్చే రాజులుకూడ ఇంతటి భాగ్యాన్ని, ఘనతను కలిగియుండరు.”
13 సొలొమోను గిబియోనులోని ఆరాధనా స్థలానికి వెళ్లాడు. సన్నిధి గుడారాన్ని వదిలి, ఇశ్రాయేలు రాజుగా పాలించటానికి యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
సొలొమోను సైన్యాన్ని వృద్దిచేయటం
14 సొలొమోను గుర్రాలను, రథాలను సేకరించాడు. అతనికి పద్నాలుగువందల రథాలు, పన్నెండువేల గుర్రాలు వున్నాయి. సొలొమోను నగరాలలో ప్రత్యేక రథశాలలు నిర్మించి వాటిని అక్కడ వుంచాడు. యెరూషలేములో కూడా కొన్ని గుర్రాలను, రథాలను సొలొమోను వుంచాడు. యెరూషలేములోనే రాజగృహం కూడా వుంది. 15 యెరూషలేములో సొలొమోను విస్తారంగా వెండి బంగారాలను సేకరించి నిల్వచేశాడు. అతడు వెండి బంగారాలను ఎంత మేరకు సేకరించాడనగా వాటి నిల్వలు సామాన్య రాతిగుట్టల్లా వున్నాయి. సొలొమోను సరళ వృక్షాల కలపను చాలా సేకరించాడు. అతడు సరళ చెట్ల కలపను పల్లపు ప్రాంతాలలో విస్తరించి వున్న మేడి చెట్లంత ఎక్కువగా సేకరించాడు. 16 ఈజిప్టు నుంచి, కవే (సైలీషియా అనబడే దక్షిణటర్కీ ప్రాంతం) నుంచి సొలొమోను గుర్రాలను తెప్పించాడు. రాజు వర్తకులు ఈ గుర్రాలను కవేలో కొనేవారు. 17 రాజు వర్తకులు ఈజిప్టులో ఒక్కొక్క రథాన్ని ఆరువందల తులాల వెండిని, ఒక్కొక్క గుర్రాన్ని నూట యేబది తులాల వెండిని వెచ్చించి కోనేవారు, ఆ కాలంలో వర్తకులు గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు, అరాము (సిరియా) రాజులకు కూడ అమ్మేవారు.
జీవ వాక్యం
1 ఏది మొదటినుండి ఉన్నదో, దాన్ని మేము విన్నాము, మా కళ్ళారా చూసాము. చూసి మా చేతుల్తో తాకాము. అదే జీవం కలిగించే వాక్యం. దాన్ని గురించే మీకు ప్రకటిస్తున్నాము. 2 జీవం కనిపించింది. మేము దాన్ని చూసాము. చూసినట్టు సాక్ష్యం కూడా చెపుతున్నాము. ఆ జీవాన్ని గురించి మీకు ప్రకటిస్తున్నాము. ఆ జీవం తండ్రితో ఉంది. అది మాకు కనిపించింది. 3 తండ్రితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు సహవాసం ఉంది కనుక, మీరు కూడా మాతో సహవాసం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేము చూసినదాన్ని, విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాము. 4 మన[a] ఆనందం సంపూర్ణంగా ఉండాలని యిది మీకు వ్రాస్తున్నాను.
వెలుగులో నడుచుట
5 దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసముందని అంటూ చీకట్లో నడిస్తే మనము అసత్యమాడినట్లే కదా! సత్యాన్ని ఆచరించటం మానుకొన్నట్లే కదా! 7 దేవుడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే మన మధ్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మన పాపాలన్నిటిని కడుగుతుంది.
8 మనలో పాపం లేదని అంటే, మనల్ని మనము మోసం చేసుకొన్న వాళ్ళమౌతాము. సత్యం మనలో ఉండదు. 9 మనం చేసిన పాపాన్ని ఒప్పుకొంటే దేవుడు సత్యవంతుడు, సక్రమంగా న్యాయం జరిగించేవాడు కనుక మన పాపాల్ని క్షమిస్తాడు. మనలో ఉన్న అవినీతిని కడిగి వేస్తాడు. 10 మనం పాపాలు చెయ్యలేదని అంటే ఆయన్ని మనం అబద్ధమాడుతున్న వానిగా చేసినట్లౌతుంది. ఆయన సందేశానికి మన జీవితాల్లో స్థానం ఉండదు.
ప్రజల దుష్కార్యాలపట్ల మీకా కలత చెందటం
7 నేను కలత చెందాను! ఎందుకంటే, నేను సేకరించబడిన వేసవి కాలపు పండులా ఉన్నాను.
పండిపోయిన ద్రాక్షాపండ్లవలె ఉన్నాను.
తినటానికి ద్రాక్షాపండ్లు మిగలలేదు.
నేను కాంక్షించే తొలి అంజూరపు పండ్లు లేనేలేవు.
2 అనగా విశ్వాసంగల జనులంతా పోయారు.
ఈ దేశంలో మంచివాళ్లంటూ ఎవ్వరూ మిగలలేదు.
ప్రతి ఒక్కడూ మరొకడిని చంపటానికి వేచివున్నాడు.
ప్రతి ఒక్కడూ తన సోదరుని కపటోపాయంతో పట్టటానికి యత్నిస్తున్నాడు.
3 ప్రజలు తమ రెండు చేతులతో చెడ్డపనులు చేయటానికి సమర్థులైవున్నారు.
అధిపతులు లంచం అడుగుతారు.
ఒక న్యాయాధిపతి న్యాయస్థానంలో తన తీర్పును తారుమారు చేయటానికి డబ్బు తీసుకుంటాడు.
“ముఖ్యులగు పెద్దలు” మంచివైన, న్యాయమైన నిర్ణయాలు చేయరు. వారేది చేయదలచారో అదే చేస్తారు.
4 వారిలో అతి మంచివాడు సహితం ముండ్లపొదవలె ఉంటాడు.
వారిలో మిక్కిలి మంచివాడు సహితం ముండ్లపొద కంటే చాలా కంటకుడై ఉంటాడు.
శిక్షపడే రోజు వస్తూవుంది.
నీ ప్రవక్తలు ఈ రోజు వస్తుందని చెప్పారు.
నీ కావలివాండ్ర దినం రానేవచ్చింది.
ఇప్పుడు నీవు శిక్షింపబడతావు!
ఇప్పుడు నీవు కలవరపడతావు!
5 నీ పొరుగువానిని నమ్మవద్దు!
స్నేహితుని నమ్మవద్దు!
నీ భార్యతో సహితం
నీవు స్వేచ్చగా మాట్లాడవద్దు!
6 తన ఇంటివారే తనకు శత్రువులవుతారు.
ఒక కుమారుడు తన తండ్రిని గౌరవించడు.
ఒక కుమార్తె తన తల్లికి ఎదురు తిరుగుతుంది.
ఒక కోడలు తన అత్తపై తిరుగబడుతుంది.
యెహోవా రక్షకుడు
7 కావున సహాయంకొరకు నేను యెహోవాతట్టు చూస్తాను.
నాకు సహాయం చేయటానికి నేను యెహోవాకొరకు నిరీక్షిస్తాను.
నా దేవుడు నా మొర ఆలకిస్తాడు.
8 నేను పతనమయ్యాను. కానీ, ఓ శత్రువా, నన్ను చూచి నవ్వకు!
నేను తిరిగి లేస్తాను.
నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను.
కానీ యెహోవాయే నాకు వెలుగు.
యెహోవా క్షమిస్తాడు
9 నేను యెహోవాపట్ల పాపం చేశాను.
అందువల్ల ఆయన నేనంటే కోపంగా ఉన్నాడు.
కానీ న్యాయస్థానంలో ఆయన నా తరఫున వాదిస్తాడు.
నాకు మంచి జరిగే పనులు ఆయన చేస్తాడు.
పిమ్మట ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తాడు.
ఆయన చేసింది న్యాయమైనదని నేను గ్రహిస్తాను.
10 నా శత్రువు ఇది చూసి సిగ్గుపడతాడు.
“నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నడిగాడు.
ఆ సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను.
వీధిలో మట్టిమీద నడిచినట్లు జనులు ఆమెమీద నడుస్తారు.
యూదులు తిరిగిరావటం
11 నీ గోడలు తిరిగి కట్టబడే సమయం వస్తుంది.
ఆ సమయంలో వారి దేశం విస్తరిస్తుంది.
12 నీ ప్రజలు నీ దేశానికి తిరిగివస్తారు.
అష్షూరునుండి, ఈజిప్టు దేశపు నగరాలనుండి వారు వస్తారు.
నీ దేశం ఈజిప్టు నది మొదలుకొని యూఫ్రటీసు నదివరకు,
పడమట సముద్రంనుండి తూర్పున పర్వతాలవరకు వ్యాపించి ఉంటుంది.
13 దేశం పాడైపోయింది. దానిలో నివసించే జనులవల్ల,
వారు చేసిన పనులవల్ల అది పాడైపోయింది.
14 కావున దండం చేపట్టి నీ ప్రజలను పాలించు.
నీకు చెందిన ప్రజాసమూహాన్ని పాలించు.
ఆ మంద (జనులు) అడవుల్లోనూ, కర్మెలు పర్వతం మీదనూ ఒంటరిగా ఉంటుంది.
గతంలో మాదిరి ఆ మంద బాషానులోనూ, గిలాదులోనూ నివసిస్తుంది.
ఇశ్రయేలు తన శత్రువులను ఓడించటం
15 నేను నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఎన్నో అద్భుతకార్యాలు జరిపించాను.
ఆ రకంగా మీరింకా ఎన్నో అద్భుత కార్యాలు చూసేలా చేస్తాను.
16 అన్యజనులు ఆ అద్భుతకార్యాలు
చూసి, సిగ్గుపడతారు.
వారి “శక్తి” నాశక్తితో పోల్చినప్పుడు
వ్యర్థమైనదని వారు గ్రహిస్తారు.
వారు విస్మయం చెంది, వారి నోళ్లపై చేతులు వేసుకుంటారు!
వారు చెవులు మూసుకొని, వినటానికి నిరాకరిస్తారు.
17 వారు పాములా మట్టిలో పాకుతారు.
వారు భయంతో వణుకుతారు.
తమ బొరియల్లోనుంచి బయటకు వచ్చే కీటకాలవలె,
వారు నేలమీద పాకుతారు.
వారు భయపడి, దేవుడైన యెహోవా వద్దకు వస్తారు.
నీముందు వారు భయపడతారు!
యెహోవాకు స్తుతి
18 నీవంటి దేవుడు మరొకడు లేడు.
పాపం చేసిన దోషులను నీవు క్షమిస్తావు.
నీ ప్రజలలో మిగిలినవారి పాపాలవైపు నీవు చూడవు.
దేవుడైన యెహోవా కోపం శాశ్వతంగా ఉండదు.
ఎందుకంటే ఆయన కనికరం చూపటానికి ఇష్టపడతాడు.
19 యెహోవా, మమ్మల్ని ఓదార్చు. మా పాపాలను పరిహరించు.
మా పాపాలన్నిటినీ లోతైన సముద్రంలోకి విసిరివేయి.
20 దేవా, నీవు యాకోబు యెడల నమ్మకస్తుడవుగా ఉంటావు.
అబ్రహాము యెడల దయకలిగి యుంటావు. ఎందుకంటే మా పూర్వీకులకు పురాతన కాలమందు నీవు వాగ్దానం చేశావు.
అవినీతి గుమాస్తా యొక్క ఉపమానం
16 యేసు తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఒక ధనవంతుని దగ్గర ఒక గుమాస్తా పని చేస్తూ ఉండేవాడు. కొందరు, గుమాస్తా ఆ ధనవంతుని ధనం వ్యర్థం చేస్తున్నాడని అతనిపై ఆ ధనవంతునితో ఫిర్యాదు చేశారు. 2 ఆ కారణంగా ఆ ధనవంతుడు తన గుమాస్తాను పిలిచి, ‘నేను నిన్ను గురించి వింటున్నదేమిటి? జమాఖర్చుల లెక్కలు నాకు చూపు. నీవిక నా గుమాస్తాగా ఉండటానికి వీల్లేదు’ అని అన్నాడు.
3 “ఆ గుమాస్తా, ‘నేనేం చెయ్యాలి? నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసివేస్తున్నాడు. పొలం దున్ని జీవించాలంటే శక్తి లేదు. భిక్ష మెత్తుకోవాలంటే సిగ్గేస్తుంది. 4 ఆ! నా ఉద్యోగం పోయినప్పుడు ప్రజలు నన్ను తమ ఇండ్లలోనికి ఆహ్వానించేటట్లు ఏమి చెయ్యాలో తెలిసింది’ అని అనుకున్నాడు.
5 “వెంటనే అతడు తన యజమానికి అప్పున్న వాళ్ళను ఒక్కొక్కరిని పిలిచాడు. మొదటివానితో, ‘నా యజమానికి ఎంత అప్పున్నావు?’ అని అడిగాడు. 6 ‘వందలీటరులు ఒలీవ నూనె’ అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమాస్తా, ‘ఈ రసీదు తీసుకొని అక్కడ కూర్చొని దాన్ని వెంటనే యాభై లీటర్లు చెయ్యి’ అని అతనితో అన్నాడు.
7 “ఆ తర్వాత రెండవ వానితో, ‘నీవెంత అప్పున్నావు?’ అని అడిగాడు. ‘వంద గోధుమ సంచులు’ అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమాస్తా, ‘ఈ రసీదు తీసుకొని దాన్ని ఎనభై సంచులు చెయ్యి’ అని అతనితో అన్నాడు.
8 “ఆ యజమాని, ఆ అవినీతి గుమాస్తాను తెలివిగా ప్రవర్తించినందుకు అభినందించాడు. దైవ చింతన కలవాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చూపుతున్న తెలివి కన్నా, ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్ళు తమ పరిస్థితుల్ని ఎక్కువ తెలివిగా ఎదుర్కొంటారు.
9 “నేను చెప్పేదేమిటంటే, మీ ఐహిక సంపదను ఉపయోగించి ఈ లోకపు స్నేహితులను సంపాదించండి. మీ ధనం తరిగిపోయిన తర్వాత వారు మీకు సహాయం అవుతారు. 10 చిన్న విషయాల్లో నమ్మగలిగిన వాణ్ణి పెద్ద విషయాల్లో కూడా నమ్మవచ్చు. చిన్న విషయాల్లో అవినీతిగా ఉన్నవాడు పెద్ద విషయాల్లో కూడా అవినీతిగా ఉంటాడు. 11 ఐహిక సంపద విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు నిజమైన సంపద విషయంలో మిమ్మల్నెవరు నమ్ముతారు? 12 ఇతరుల ఆస్థి విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు మీకు మీ స్వంత ఆస్థిని ఎవరిస్తారు?
13 “ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలాచేస్తే అతడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఒకని పట్ల విశ్వాసం చూపి యింకొకని పట్ల నీచంగా ప్రవర్తిస్తాడు. దేవుణ్ణి, ధనాన్ని సమంగా కొలువలేము.”
ధర్మశాస్త్రము, దేవుని రాజ్యము
(మత్తయి 11:12-13)
14 పరిసయ్యులు ధనాన్ని ప్రేమించేవాళ్ళు కనుక వాళ్ళు ఇది విని యేసును హేళన చేశారు. 15 యేసు వాళ్ళతో, “మీరు ప్రజల ముందు నీతిమంతులుగా ప్రవర్తిస్తారు. కాని మీ హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు. మానవులు వేటికి అత్యధికమైన విలువనిస్తారో వాటిని దేవుడు తిరస్కరిస్తాడు.
16 “యోహాను కాలాందాకా ధర్మశాస్త్రము, ప్రవక్తలు వ్రాసిన విషయాలు ఆచరణలో ఉన్నాయి. యోహాను కాలం నుండి దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటింపబడుతోంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలోకి వెళ్ళాలని తమ శక్త్యానుసారం కష్టపడుతున్నారు. 17 భూమి, ఆకాశము నశించిపోవచ్చు, కాని ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు.
విడాకులు మరియు పునర్వివాహము
18 “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్న ప్రతివాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడాకులివ్వబడిన స్త్రీని వివాహం చేసుకొన్నవాడు కూడా వ్యభిచారిగా పరిగణింపబడతాడు” అని అన్నాడు.
ధనవంతుడు, లాజరు
19 “ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు మంచి విలువైన దుస్తులు వేసుకొని ప్రతిరోజు భోగాలనుభవిస్తూ జీవించేవాడు. 20 అతని గడప ముందు లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కులు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. 21 అతడాధనికుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు.
22 “ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత ఆ ధనికుడు కూడా చనిపొయ్యాడు. అతడు సమాధి చెయ్యబడ్డాడు. 23 నరకంలో ఆ ధనికుడు హింసలు అనుభవిస్తూవుండేవాడు. తలెత్తి చూడగా లాజరును తన ప్రక్కన కూర్చోబెట్టుకున్న అబ్రాహాము కనిపించాడు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. 24 అందువల్ల అబ్రాహామును పిలిచి, ‘తండ్రి అబ్రాహామా! నామీద దయ చూపు. నేను ఈ మంటల్లో తీవ్రంగా బాధపడ్తున్నాను. లాజరుతో ఇక్కడకు వచ్చి తన వేలుముంచి నా నాలుక తడపమని చెప్పండి’ అని అన్నాడు.
25 “కాని అబ్రాహాము, ‘కుమారుడా! జ్ఞాపకం తెచ్చుకో! నీవు బ్రతికిన రోజుల్లో సుఖాలనుభవించావు. లాజరు కష్టాలనుభవించాడు. కాని అతడిక్కడ ఆనందంగా ఉన్నాడు. నీవు బాధలను అనుభవిస్తున్నావు. 26 ఇక్కడి వాళ్ళు అక్కడకు రాకూడదని, అక్కడివాళ్ళు యిక్కడికి రాకూడదని మన మధ్య పెద్ద అఘాతం ఉంది’ అని అన్నాడు.
27 “ఆ ధనికుడు అలాగైతే ‘తండ్రి! లాజరును మా తండ్రి ఇంటికి పంపు. 28 అక్కడ నా ఐదుగురు సోదరులున్నారు. వాళ్ళు యిక్కడకు వచ్చి హింసలు అనుభవించకుండా ఉండేటట్లు వాళ్ళకు బోధించుమని చెప్పు’ అని అన్నాడు.
29 “అబ్రాహాము ఈ విధంగా సమాధానం చెప్పాడు: ‘మోషే, ప్రవక్తలు ఉన్నారు కదా! వాళ్ళు చెప్పినట్లు చెయ్యనీ!’
30 “‘తండ్రీ అబ్రాహామా! చనిపోయిన వాళ్ళనుండి ఎవరైనా వెళ్తే వాళ్ళు విని మారుమనస్సు పొందుతారు’ అని ఆ ధనికుడు అన్నాడు.
31 “అబ్రాహాము, ‘వాళ్ళు మోషే, ప్రవక్తలు చెప్పినట్లు విననట్లైతే చనిపోయినవాడు బ్రతికి వచ్చినా వాళ్ళు వినరు’ అని అన్నాడు.”
© 1997 Bible League International