Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 29

ఆలయం నిర్మాణానికి కానుకలు

29 అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి రాజైన దావీదు ఇలా అన్నాడు: “దేవుడు నా కుమారుడు సొలొమోనును ఎంపిక చేశాడు. సొలొమోను చిన్నవాడు. అందువల్ల తాను చేయవలసిన పనులన్నిటిలో తగిన అనుభవం లేదు. కాని పని మాత్రం అతి ముఖ్యమైనది! ఈ భవనం ప్రజల కొరకు కాదు. ఇది యెహోవా దేవుని ఆలయం. నా దేవుని ఆలయం కట్టించటానికి తగిన నమూనాలు, ఏర్పాట్లు నాశక్తి కొలదీ చేశాను. బంగారంతో చేయదగిన వస్తు సామగ్రికి కావలసిన బంగారం, వెండితో చేయదగిన వస్తువులకు వెండి, కంచు సామగ్రికి కావలసిన కంచు, ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుము, కలప సామాన్లు చేయటానికి తగిన కలప ఏర్పాటు చేశాను. పొదగటానికి సులిమాను రాళ్లు అనబడే మణులను, నల్లరాతిని, విలువైన రంగురంగుల రత్నాలను, పాల రాతిని కూడ నేను ఇచ్చాను. ఆలయం నిర్మాణానికి ఈ రకమైన వస్తుసామగ్రిని లెక్కకు మించి ఇచ్చాను. నా దేవుని ఆలయానికి వెండి బంగారు వస్తువులను ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు చేస్తున్నానంటే నిజంగా నేను నా దేవుని ఆలయం కట్టించ దలిచాను. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికే ఈ వస్తువులన్నీ నేను ఇస్తున్నాను. ఆరువేల మణుగుల[a] ఓఫీరు దేశపు బంగారాన్ని, పద్నాలుగు వేల మణుగుల[b] శుద్ధమైన వెండిని ఇచ్చాను. ఆలయ భవనాల గోడలపై వెండిరేకుల తొడుగు వేస్తారు. వెండి బంగారాలతో చేయదగిన వస్తువులకు కావలసిన వెండిని, బంగారాన్ని ఇచ్చాను. ఆలయానికి పనికివచ్చే అనేక రకాల వస్తు సామగ్రిని నిపుణతగల పనివారు చేయగలిగేలా నేను వెండిని, బంగారాన్ని సమకూర్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులైన మీలో ఎంతమంది ఆరోజు యెహోవా కార్యానికి మనసారా కానుకలు ఇవ్వటానికి సిద్ధంగా వున్నారు?”

కుటుంబాల పెద్దలు, ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు, సహస్ర సైనిక దళాధిపతులు, శత దళాధిపతులు రాజకార్య నిర్వాహకులు వెంటనే తమ విలువైన వస్తువులు స్వయంగా అర్పించారు. ఆలయానికి వారిచ్చిన వస్తువులు ఏవనగా: పదివేల మణుగుల బంగారం, ఇరవై వేల మణుగుల వెండి, ముప్పదియారు వేల మణుగుల కంచు, రెండు లక్షల మణుగుల ఇనుము. విలువైన రత్నాలు కలిగివున్న ప్రజలు వాటిని ఆలయానికి యిచ్చారు. యెహీయేలు విలువైన రత్నాలన్నిటి విషయంలో జాగ్రత్త తీసుకొన్నాడు. యెహీయేలు గెర్షోను వంశీయుడు. తమ నాయకులు అంత ఉదారంగా విరాళాలు ఇవ్వటంతో ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. నాయకులు నిండు హృదయంతో విరాళాలు ఇచ్చి సంతోషపడ్డారు. రాజైన దావీదు కూడ ఆనందంగా వున్నాడు.

దావీదు చక్కటి ప్రార్థన

10 సమావేశపర్చబడిన ప్రజానీకం ముందు దావీదు పిమ్మట యెహోవాకి స్తోత్రం చేశాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు:

“ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, మా తండ్రీ,
    సదా నీకు స్తోత్రం చేస్తాము.
11 గొప్పతనము, శక్తి, మహిమ, విజయము, గౌరవము అన్నీ నీకు చెందినవే
    ఎందుకంటే పరలోకమందు, భూమిమీద అన్నీ నీకు చెందినవే,
ఓ దేవా, రాజ్యము నీదైయున్నది.
    నీవు సమస్త ప్రజలపై అధిపతివైయున్నావు.
12 భోగభాగ్యాలు, గౌరవం నీ నుండేవస్తాయి.
    సమస్తమును పాలించువాడవు నీవు.
నీవు బల పరాక్రమసంపన్నుడవు.
    నీవు ఎవరినైనా గొప్ప వాడినిగా గాని, బలవంతునిగా గాని చేయగల సమర్థుడవు.
13 మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాము.
    మహిమగల నీ నామమును స్తుతిస్తాము!
14 ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు.
ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే.
    నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము.
15 మేము కొత్త వారిలా, బాటసారుల్లా వున్నాము. మా పూర్వీకులు కూడ పరాయివారిలా, బాటసారుల్లా వున్నారు.
ఆశలేని మా బ్రతుకులు ఈ భూమి మీద నీడలాంటివి.
    ఎవ్వరూ స్థిరంగా వుండరు.
16 యెహోవా మా దేవా, నీ ఆలయ నిర్మాణానికై మేము ఈ వస్తువులన్నీ సమకూర్చాము.
    నీ నామము ఘనపర్చబడేలా మేము ఈ ఆలయం నిర్మిస్తాము.
కాని ఈ వస్తుసంపదంతా నీ నుండి వచ్చినదే.
    ప్రతిదీ నీకు చెందినదే.
17 నా దేవా, నీవు ప్రజల హృదయాలను పరీక్షిస్తావని కూడ నాకు తెలుసు.
    ప్రజలు మంచి పనులు చేస్తే నీవు సంతోషిస్తావు.
ఈ వస్తు సముదాయాన్నంతా హృదయ పూర్వకంగా (సదుద్దేశంతో)
    నేను ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాను.
నీ ప్రజలంతా అనేక కానుకలు సంతోషంగా
    నీకు ఇవ్వటానికి ఇక్కడ చేరియున్నట్లు నేను చూశాను.
18 ఓ దేవా, నీవు మా పితరులైన
    అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులకు[c] దేవుడివి.
నీ ప్రజలు సదా నిన్ను కొలిచేలా వారికి దయచేసి సహయపడుము.
    వారి హృదయాలెప్పుడూ నీ వైపు తిప్పుకోగలిగేలా వారికి నీవు సహాయపడుము.
19 నీ పట్ల సత్యవర్తనుడై మెలిగేలా నా కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయుము.
    నీ ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, నీ నియమ నిబంధనలను అతను ఎల్ల వేళలా పాటించేలా నీవతనికి తోడ్పడుము.
ఈ విషయాలలో నీవు సొలొమోనుకు సహాయంచేసి,
    అతను నేను తలపెట్టిన ఆలయ నిర్మాణకార్యక్రమం పూర్తిచేసేలా తోడ్పడుము.”

20 పిమ్మట దావీదు అక్కడ చేరిన ప్రజాసమూహాన్ని ఉద్ధేశించి, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి” అని అన్నాడు. తమ పూర్వీకులు కొలిచిన దేవుడగు యెహోవాను ప్రజలంతా స్తుతించారు. యెహోవాకు, రాజుకు గౌరవ సూచకంగా వారు సాష్టాంగ నమస్కారం చేశారు.

సొలొమోను రాజవటం

21 ఆ మరునాడు ప్రజలంతా యెహోవాకి బలులు అర్పించారు. యెహోవాకు వారు దహన బలులు అర్పించారు. వారు వేయి గిత్తలను, వేయి పొట్టేళ్లను, వేయి గొర్రె పిల్లలను బలి ఇచ్చారు. వారు పానార్పణలను కూడ సమర్పించారు. ఇశ్రాయేలు ప్రజలందరి తరపునా లెక్కలేనన్ని బలులు సమర్పించారు. 22 ఆ రోజు ప్రజలంతా బాగా తిని, త్రాగి ఆనందించారు. యెహోవా అక్కడ వారితో వున్నాడు.

వారు చాలా ఆనందంగా వున్నారు. తరువాత దావీదు కుమారుడైన సొలొమోనును వారు రెండవసారి[d] రాజుగా ప్రకటించారు. వారు సొలొమోనును రాజుగాను, సాదోకును యాజకునిగాను అభిషిక్తం చేశారు. యెహోవా నెలకొని వున్నచోటే వారు ఈ పనిచేశారు.

23 తరువాత సొలొమోను యెహోవా నియమించిన సింహాసనం మీద రాజు హోదాలో కూర్చున్నాడు. సొలొమోను తన తండ్రి స్థానాన్ని అలంకరించి వర్థిల్లాడు. ఇశ్రాయేలు ప్రజలంతా సొలొమోను ఆజ్ఞలను పాటించారు. 24 పెద్దలందరు, బలశాలురైన నాయకులు, రాజైన దావీదు కుమారులందరు సొలొమోనును రాజుగా గుర్తించి అతనికి విధేయులై వున్నారు. 25 యెహోవా సొలొమోనును చాలా గొప్ప వ్యక్తినిగా చేసాడు. యెహోవా సొలొమోనును చాలా ఉన్నతమైన వ్యక్తిగా చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలంతా గుర్తించారు. రాజుకు ఇవ్వవలసిన గౌరవాభిమానాలను యెహోవా సొలొమోనుకు ఇచ్చాడు. సొలొమోనుకు ముందు మరొక రాజెవ్వడూ అంతటి గౌరవాన్ని పొందియుండలేదు.

దావీదు మరణం

26-27 దావీదు ఇశ్రాయేలుకు నలభై సంవత్సరాలు రాజుగా వున్నాడు. దావీదు యెష్షయి కుమారుడు. దావీదు హెబ్రోను నగరంలో ఏడు సంవత్సరాలు పాలించాడు. తరువాత దావీదు యెరూషలేము నగరం నుండి ముప్పది మూడు సంవత్సరాలు పాలించాడు. 28 దావీదు బాగా వృద్ధుడయినాక మరణించాడు. దావీదు ఉత్తమ జీవితాన్ని దీర్ఘకాలం గడిపాడు. దావీదు అన్ని భోగభాగ్యాలు, గౌరవాభిమానాలు పొందాడు. తరువాత అతని కుమారుడు సొలొమోను నూతన రాజు అయ్యాడు.

29 రాజైన దావీదు ఆదినుండి అంతం వరకు చేసిన పనులన్నీ దీర్ఘదర్శియైన సమూయేలు వ్రాసిన వ్రాతలలోను, ప్రవక్తయగు నాతాను వ్రాతలలోను, దీర్ఘదర్శియైన గాదు వ్రాసిన వృత్తాంతాలలోను పొందుపర్చబడ్డాయి. 30 ఆ వ్రాతలన్నీ ఇశ్రాయేలుకు రాజుగా దావీదు చేసిన పనులన్నిటి గురించి తెల్పుతాయి. అవి దావీదు శౌర్యాన్ని గూర్చి, అతనికి సంభవించిన విషయాలను గూర్చి తెలియజేస్తాయి. ఆ వ్రాతలు ఇశ్రాయేలుకు, దాని పొరుగు రాజ్యాలన్నిటిలో జరిగిన కార్యాలు, వాటి పరిస్థితులను తెలియజేస్తాయి.

2 పేతురు 3

యేసు మరలా వస్తాడు

ప్రియమైన సోదరులారా! ఇది నా రెండవ ఉత్తరం. కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని మీకీ రెండు ఉత్తరాలు వ్రాసాను. పవిత్రులైన ప్రవక్తలు చాలాకాలం క్రిందటే చెప్పిన సందేశాలను మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా యిచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం.

చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి: “వస్తానని వాగ్దానం చేసాడే, ఎప్పుడు వస్తాడు? మా పూర్వికులు మరణించినప్పటి నుండే కాదు. ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండీ అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి” అని వాళ్ళంటారు.

చాలా కాలం క్రితమే దేవుడు తన మాటతో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. వాళ్ళు ఈ విషయాన్ని కావాలనే మరిచిపోతారు. ఈ భూమి నీళ్ళనుండి, నీళ్ళ ద్వారా సృష్టింపబడింది. నీళ్ళ కారణంగా ప్రళయం వచ్చి ఆనాటి ప్రపంచం నాశనమై పోయింది. దేవుడు ఆ మాటతోటే ఈనాటి ఆకాశాన్ని, భూమిని మంటలతో నాశనం చెయ్యటానికి దాచి ఉంచాడు. తీర్పుచెప్పే రోజుదాకా, అంటే దైవభక్తి లేనివాళ్ళను నాశనంచేసే రోజుదాకా దాచి ఉంచుతాడు.

కాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి[a] ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు.

10 కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి. 11 అన్నీ ఈ విధంగా నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి. 12 దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగి పోతాయి. 13 దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం.

14 ప్రియ సోదరులారా! మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక మీలో ఏ దోషమూ, కళంకమూ లేకుండా ఉండేటట్లు అన్నివిధాల ప్రయత్నం చెయ్యండి. శాంతం వహించండి. 15 మన ప్రభువు యొక్క సహనము మనకు రక్షణను యిస్తుందని గ్రహించండి. దేవుడు యిచ్చిన విజ్ఞానంతో మన ప్రియమిత్రుడు పౌలు మీకు ఈ విషయాల్ని గురించి వ్రాసాడు. 16 అతడు వ్రాసిన ఉత్తరాలన్నీ యిదేవిధంగా వ్రాసాడు. వాటన్నిటిలోనూ ఈ విషయాల్ని గురించే మాట్లాడాడు. అతని ఉత్తరాల్లోని కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం లేనివాళ్ళు, చపల చిత్తం గలవాళ్ళు యితర లేఖనాలపై తప్పుడు వ్యాఖ్యానం చేసినట్లే దీనిమీద కూడ తప్పడు వ్యాఖ్యానం చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు నాశనమైపోతారు.

17 అందువల్ల ప్రియమైన సోదరులారా! ఇప్పుడీ విషయాలు మీకు తెలుసు. కనుక జాగ్రత్తగా ఉండండి. నీతికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తుల తప్పుడు మాటలకు మోసపోకండి. మీలో వున్న స్థిరత్వాన్ని వదులుకోకండి. 18 మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల మీకున్న కృతజ్ఞతను పెంచుకుంటూ, ఆయన్ని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉండండి. ఆయనకి ఇప్పుడూ, చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.

మీకా 6

యెహోవా ఫిర్యాదు

యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను.
నీవు లేచి, పర్వతాలముందు నిలబడు.
    వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి.
తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది.
    పర్వతాల్లారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి.
భూమి పునాదుల్లారా, యెహోవా చేప్పేది వినండి.
    ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు!

యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను?
    మీరు నాపట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను?
    మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి!
నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను!
    ఐగుప్తు (ఈజిప్టు) దేశం నుండి మిమ్మల్ని నేను తీసుకువచ్చాను.
మీకు నేను దాస్యంనుండి విముక్తి కలిగించాను.
    నేను మీవద్దకు మోషే, అహరోను, మిర్యాములను పంపాను.
నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్టవ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి.
    బెయోరు కుమారుడైన బిలాము అనేవాడు బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకోండి.
అకాసియ (షిత్తీము) నుండి గిల్గాలువరకు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి.
    అప్పుడు యెహోవా న్యాయ వర్తనుడని మీరు తెలుసుకుంటారు!”

దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు?

దేవుడైన యెహోవా సన్నిధికి నేను వచ్చినప్పుడు,
    నేను దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు నాతో నేనేమి తీసుకొనిరావాలి?
ఒక సంవత్సరం వయస్సుగల కోడెదూడను
    దహనబలి నిమిత్తం తీసుకొని నేను యెహోవా వద్దకు రావాలా?
యెహోవా వెయ్యి పొట్టేళ్లతో లేక పదివేల నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా?
    నా పాప పరిహారానికి నా ప్రథమ సంతానాన్ని బలి ఇవ్వనా?
నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో
    భాగంగా పుట్టిన శిశువును అర్పించనా?

మానవుడా, మంచి విషయాలను గురించి యెహోవా నీకు చెప్పియున్నాడు.
    యెహోవా నీనుండి కోరేవి ఇవి:
ఇతరులపట్ల నీవు న్యాయంగా ప్రవర్తించు.
    ప్రజలపట్ల ప్రేమ, దయ కలిగిఉండటానికి ఇష్టపడు.
    అణకువ కలిగి నీ దేవునితో జీవించు.

ఇశ్రాయేలీయులు ఏమి చేస్తున్నారు?

దేవుడైన యెహోవా కంఠం నగరాన్ని (యెరూషలేమును) పిలుస్తూవుంది.
తెలివిగల మనుష్యుడు యెహోవా నామాన్ని గౌరవిస్తాడు.
    కావున శిక్షించే దండంపట్ల, ఆ దండాన్నిచేత ధరించేవానిపట్ల ధ్యానముంచు!
10 దుష్టులు తాము దొంగిలించిన
    ధనరాశులను ఇంకా దాస్తున్నారా?
దుష్టులు ఇంకా మరీ చిన్న బుట్టలతో
    జనాన్ని మోసగిస్తున్నారా?
    అలా ప్రజలను మోసగించే విధానాలను యెహోవా అసహ్యించుకుంటాడు!
11 దుష్టులు ఇంకా తప్పుడు కొలతలు,
    తప్పుడు తూనికలతో ప్రజలను మోసగిస్తున్నారా?
తప్పుడు కొలతలు కొలవటానికి వారింకా దొంగ తూకపురాళ్లు,
    దొంగ కొలతలుగల సంచులు కలిగియున్నారా?
    అవును! అవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి!
12 ఆ నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన పనులు చేస్తున్నారు!
    ఆ నగరవాసులు ఇంకా అబద్ధాలు చెపుతున్నారు!
    అవును, ఆ ప్రజలు అబద్ధాలు చెపుతూనే ఉన్నారు!
13 కావున నేను నిన్ను శిక్షించటం మొదలుపెట్టాను.
    నీ పాపాల కారణంగా నేను నిన్ను నాశనంచేస్తాను.
14 నీవు తింటావు; కానీ నీ కడుపు నిండదు.
    నీ కడుపు ఖాళీగా ఉండి, నీవు ఇంకా ఆకలితో ఉంటావు.
నీవు ప్రజలను సురక్షితంగా ఉంచటానికి ప్రయత్నిస్తావు.
    కాని కత్తులు పట్టిన జనులు నీవు కాపాడిన జనులను చంపుతారు, నిన్ను పట్టుకుంటారు.
15 నీవు విత్తనాలు చల్లుతావు;
    కానీ నీవు పంట కోయలేవు.
ఒలీవ గింజలను గానుగ పడతావు;
    కానీ నీకు నూనె రాదు.
నీ తియ్యటి ద్రాక్షారసం తాగటానికి
    నీవు అనుమతింపబడవు.
16 ఎందుకంటే నీవు ఒమ్రీ[a] నిర్దేశించిన కట్టుబాట్లను అనుసరిస్తూ,
    అహాబు వంశంవారు చేసిన చెడు పనులన్నీ చేస్తున్నావు.
నీవు వారి బోధలను పాటిస్తున్నావు.
    అందువల్ల నీవు నాశనమయ్యేలా చేస్తాను.
నీ నగరవాసులు నవ్వుల పాలవుతారు.
    చీదర పుట్టించే నా జనులు బందీలుగా కొనిపోబడతారు.

లూకా 15

తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానం

(మత్తయి 18:12-14)

15 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు. కాని పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి తింటాడు” అని గొణిగారు.

అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి ఆ తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా? అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, ‘తప్పిపోయిన నా గొఱ్ఱె దొరికింది. మనమంతా ఆనందించుదాం’ అని అంటాడు. నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు పొందనవసరం లేని తొంభైతొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగె ఆనందంకన్నా పాపం చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు.

“ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి యిల్లంతా వూడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా? దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది. 10 నేను చెప్పేదేమిటంటే అదే విధంగా ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు” అని అన్నాడు.

తప్పిపోయిన కుమారుని ఉపమానం

11 యేసు ఇంకా ఇలా చెబుతూ పోయాడు: “ఒకనికి యిద్దరు కుమారులు ఉన్నారు. 12 చిన్నవాడు తండ్రితో, ‘నాన్నా! నా భాగం ఆస్తి నాకు ఇచ్చేయి’ అని అడిగాడు. తండ్రి సరేనని తన ఆస్తిని ఇరువురి మధ్య పంచిపెట్టాడు.

13 “కొద్ది రోజుల్లో చిన్నవాడు తనపాలు భాగం తీసుకొని దూర దేశాలకు వెళ్ళి పొయ్యాడు. ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు పెట్టాడు. 14 అంతా ఖర్చయి పోయింది. ఇంతలో అతడున్న దేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అతని దగ్గర ఏమీ మిగల్లేదు. కనుక ఆ దేశంలో ఉన్న ఒక ఆసామి దగ్గర ఉద్యోగంలో చేరాడు. 15 ఆ ఆసామి అతణ్ణి పందులు కాయటానికి నియమించాడు. 16 ఆ పందులు తీనే ఆహారంతో తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. ఆయినా ఎవ్వరూ అతనికి ఏదీ ఇవ్వలేదు.

17 “అతనికి బుద్ధి వచ్చింది. అతడు ‘నా తండ్రి పనివాళ్ళ దగ్గర కూడా కావలసినంత తిండి ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. 18 నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తాను. వెళ్లి అతనితో నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల కూడా పాపం చేశాను. 19 నేను నీ కుమారుడనని చెప్పుకొంటానికి కూడా తగను. నన్ను కూడా నీ దగ్గర పని చేసేవాళ్ళతో ఉండనీ!’ అని చెప్పాలని మనస్సులో అనుకున్నాడు. 20 వెంటనే అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు.

చిన్న కుమారుడు తిరిగి రావటం

“ఇంటికి కొంత దూరంలో ఉండగానే అతని తండ్రికి తనకుమారుణ్ణి చూసి చాలా కనికరం కలిగింది. అతడు పరుగెత్తుకొంటూ తన కుమారుని దగ్గరకు వెళ్ళి అతణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. 21 అతడు తండ్రితో, ‘నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల పాపం చేసాను. నేను నీ కుమారుణ్ణని చెప్పుకోవటానికి కూడా తగను’ అని అన్నాడు.

22 “అతని తండ్రి పని వాళ్ళతో, ‘వెంటనే వెళ్ళి మంచి దుస్తులు, వేలికి ఉంగరము, కాళ్లకు జోళ్ళు తెచ్చి యితనికి తొడిగించండి. 23 బాగా బలిసిన దూడను తీసుకు వచ్చి కొయ్యండి. పండుగ చేసుకొందాం. 24 చనిపోయిన నా కుమారుడు బ్రతికి వచ్చాడు. తప్పి పోయినవాడు తిరిగి దొరికాడు’ అని అన్నాడు. వాళ్ళు వెంటనే పండుగ చేసుకోవడం మొదలు పెట్టారు.

పెద్ద కుమారుడు దోషారోపణ చేయటం

25 “ఇంతలో పెద్దవాడు పొలంనుండి ఇంటికి వస్తూవున్నాడు. ఆతనికి ఇంటినుండి సంగీతము, నాట్యము జరుగుతున్న ధ్వనులు వినిపించాయి. 26 అతడు పని వాళ్ళలో ఒకణ్ణి పిలిచి, ‘ఏమి జరుగుతోంది?’ అని అడిగాడు. 27 ఆ పనివాడు ‘మీ తమ్ముడు వచ్చాడు. మీ నాన్న అతడు క్షేమంగా తిరిగి వచ్చాడని బాగా బలిసిన దూడను కోసి విందు చేస్తున్నాడు’ అని చెప్పాడు.

28 “ఇది విని అతనికి కోపం వచ్చింది. కనుక ఇంట్లొకి అడుగు పెట్టనని అన్నాడు. అందువల్ల అతని తండ్రి వెలుపలికి వచ్చి బ్రతిమిలాడాడు. 29 అతడు తండ్రితో, ‘యిదిగో నాన్నా! ఎన్నో ఏండ్లనుండి నేను బానిసలాగా పనిచేసాను. నీ ఆజ్ఞ జవదాట లేదు. ఆయినా నేను నా స్నేహితులతో విందు చేసుకోవటానికి నీవు ఒక్క చిన్న గొఱ్ఱెను కూడా ఇవ్వలేదు. 30 కాని, నీ ఈ కుమారుడు ఆస్థినంతా వేశ్యలకు తగలెట్టి ఇల్లు చేరుకొంటే వానికోసం బలిసిన దూడను కోస్తున్నావు!’ అని అన్నాడు.

31 “కాని తండ్రి అతనితో, ‘నా బాబూ! నీవెప్పుడూ నా దగ్గరే ఉంటున్నావు. కనుక నా దగ్గర ఉన్నవన్నీ నీవి. 32 కాని నీ ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. తప్పిపోయిన వాడు దొరికాడు. కనుక మనం ఆనందంగా పండుగ చేసుకోవాలి’ అని అన్నాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International