M’Cheyne Bible Reading Plan
ద్వారపాలకులు
26 కోరహు వంశం నుండి వచ్చిన ద్వారపాలకుల జట్టులు ఏవనగా:
మెషెలెమ్యా మరియు అతని కుమారులు, (మెషెలెమ్యా తండ్రి పేరు కోరే. అతడు ఆసాపు వంశంలోని వాడు.) 2 మెషెలెమ్యా సంతానవంతుడు. జెకర్యా పెద్దవాడు. యెదీయవేలు రెండవవాడు. జెబద్యా మూడవవాడు. యత్నీయేలు నాల్గవవాడు. 3 ఏలాము ఐదవ కుమారుడు. యెహోహనాను ఆరవవాడు. ఎల్యోయేనై ఏడవ కుమారుడు.
4 ఓబేదెదోము, అతని కుమారులు. ఓబేదెదోము పెద్ద కుమారుడు షెమయా. యెహోజాబాదు అతని రెండవ కుమారుడు. యోవాహు మూడవవాడు. శాకారు అతని నాల్గవ కుమారుడు. నెతనేలు అయిదవవాడు. 5 అమ్మీయేలు ఆరవవాడు. ఇశ్శాఖారు అతని ఏడవ కుమారుడు. పెయుల్లెతై అతని ఎనిమిదవ కుమారుడు. దేవుడు నిజంగా ఓబేదెదోమును[a] ఆశీర్వదించాడు. 6 ఓబేదెదోము కుమారుడు షెమయా. షెమయాకు కూడ కుమారులున్నారు. తన తండ్రి కుటుంబంలో షెమయా కుమారులంతా ధైర్యంగల సేనానులు కావటంతో వారు నాయకులయ్యారు. 7 షెమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు, ఎలీహు, మరియు సెమక్యా అనేవారు. ఎల్జాబాదు బంధువులు నేర్పరులైన పనివారు. 8 వారంతా ఓబేదెదోము సంతతివారు. వారు, వారి కుమారులు, బంధువులు అంతా పరాక్రమశాలురు. వారు మంచి రక్షక భటులు. ఓబేదెదోము సంతతివారు అరువది ఇద్దరు.
9 మెషెలెమ్యా కుమారులు, బంధువులు పరాక్రమవంతులు. అతని కొడుకులు, బంధువులు కలిసి పద్దెనిమిది మంది వున్నారు.
10 మెరారీ వంశానికి చెందిన ద్వారపాలకులు ఎవరనగా, హోసా పెద్ద కుమారునిగా షిమ్రీ పరిగణింపబడ్డాడు. నిజంగా షిమ్రీ పెద్ద కుమారుడు కాదు. కాని అతని తండ్రి అతనిని పెద్దవాడుగా ఆదరించాడు. 11 హిల్కీయా అతని రెండవ కుమారుడు. టెబల్యాహు అతని మూడవ కుమారుడు. జెకర్యా నాల్గవవాడు. అంతా కలిసి హోసాకు పదముగ్గురు కుమారులు, బంధువులు వున్నారు.
12 వీరు ద్వారపాలకుల జట్ల నాయకులు. వీరి ఇతర బంధువుల వలెనే ద్వారపాలకులకు ఆలయ సేవలో ఒక విశిష్టమైన పద్ధతి వుంది. 13 ప్రతి కుటుంబానికి ఒక ద్వారం కాపలా కొరకు కేటాయించబడింది. ప్రతి కుటుంబానికీ ద్వారాలు నిర్ణయించటానికి చీట్లు వేయబడ్డాయి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే భేధం పాటించకుండా అంతా సమంగా చూడబడ్డారు.
14 చీట్లు వేయగా తూర్పు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. షెలెమ్యా కుమారుడు జెకర్యాకు కూడ చీట్లు వేయబడ్డాయి. జెకర్యా చాలా తెలివైన సలహాదారు. ఉత్తర ద్వారం జెకర్యాకు వచ్చింది. 15 ఓబేదెదోముకు దక్షిణ ద్వారం వచ్చింది. ఓబేదెదోము కుమారులు విలువైన వస్తువులు దాచే ఇంటి కాపలాకై ఎంపిక చేయబడ్డారు. 16 షుప్పీము, హోసా పడమటి ద్వారం కాపలాకు, ఎగువ మార్గంలో వున్న షల్లెకెతు ద్వారం కాపలాకు ఎంపిక చేయబడ్డారు.
భటులు ఒకరి ప్రక్కన ఒకరు వరుసగా నిలబడ్డారు. 17 తూర్పుద్వారం వద్ద ప్రతి రోజూ ఆరుగురు లేవీయులు కాపలా వుండేవారు. ఉత్తర ద్వారం వద్ద ప్రతి రోజూ ఐదుగురు లేవీయులు నిలబడేవారు. దక్షిణ ద్వారం వద్ద నలుగురు లేవీయులు నిలబడేవారు. విలువైన వస్తువులు దాచే ఇంటివద్ద ఇద్దరు లేవీయులు కాపలా వుండేవారు. 18 పడమటి సభాస్థానం వద్ద నలుగురు భటులు కాపలా వుండేవారు. సభాస్థానానికి వెళ్లే బాటమీద ఇద్దరు భటులు వుండేవారు.
19 ఇవి ద్వారపాలకుల జట్లు. ఆ ద్వారపాలకులు కోరహు (కోరే), మెరారి సంతతివారు.
కోశాధికారి, మరియు ఇతర అధికారులు
20 అహీయా లేవీయుల వంశంవాడు. దేవాలయంలో విలువైన వస్తువుల పరిరక్షణ అహీయా బాధ్యత. పవిత్ర వస్తువులు, పరికరాలు వుంచిన స్థలాలను కాపాడటం కూడా అహీయా బాధ్యత.
21 గెర్షోను తెగవారిలో లద్దాను ఒక కుటుంబపు మూలపురుషుడు. యెహీయేలీ అనేవాడు లద్దాను వంశంలో ఒక నాయకుడు. 22 యెహీయేలీ కుమారులు జేతాము, అతని సోదరుడైన యోవేలు. దేవాలయంలో విలువైన వస్తువులన్నిటి పరిరక్షణ వారి బాధ్యత.
23 ఇతర నాయకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను మరియు ఉజ్జీయేలు వంశాల నుండి ఎంపిక చేయబడ్డారు.
24 ఆలయంలో విలువైన వస్తువులపై కాపలా షూబాయేలు బాధ్యత. షూబాయేలు తండ్రి పేరు గెర్షోము. గెర్షోము తండ్రి పేరు మోషే. 25 షూబాయేలు బంధువుల వివరాలు: ఎలీయెజెరు తరపున అతని బంధువులు ఎవరనగా: ఎలీయెజెరు కుమారుడు రెహబ్యా. రెహబ్యా కుమారుడు యెషయా. యెషయా కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు జిఖ్రీ. జిఖ్రీ కుమారుడు షెలోమీతు. 26 షెలోమీతు, అతని బంధువులు ఆలయానికై దావీదు సేకరించిన వస్తువులన్నిటిపై కాపలా వున్నారు.
సైన్యాధికారులు కూడ ఆలయానికి విరాళాలు ఇచ్చారు. 27 వారు యుద్ధాలలో శత్రువుల నుండి తీసుకొన్న వస్తువులలో కొన్నింటిని కూడ విరాళంగా ఇచ్చారు. వాటన్నిటినీ వారు యెహోవా ఆలయ నిర్మాణంలో వినియోగించటానికి ఇచ్చారు. 28 షెలోమీతు, అతని బంధువులు కలిసి దీర్ఘదర్శియగు (ప్రవక్త) సమూయేలు, రాజైన సౌలు, నేరు కుమారుడగు అబ్నేరు, సెరూయా కుమారుడైన యోవాబు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి సంరక్షణ బాధ్యత కూడా వహించారు. షెలోమీతు, అతని బంధువులు యెహోవాకు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి విషయంలో జాగ్రత్త వహించారు.
29 కెనన్యా ఇస్హారు కుటుంబంలోని వాడు. కెనన్యా, అతని కుమారులు మందిరపు బయట బాధ్యతలు స్వీకరించారు. వారు రక్షకభటులుగాను, న్యాయాధిపతులుగాను ఇశ్రాయేలులో వివిధ ప్రాంతాలలో పని చేశారు. 30 హషబ్యా హెబ్రోను కుటుంబంలోని వాడు. హషబ్యా, అతని బంధువులు దేవుని అన్ని కార్యాలలోను; యోర్దాను నదికి పశ్చిమానగల ఇశ్రాయేలులో రాజుగారి పనులలోను శ్రద్ధ తీసుకొనే వారు. హషబ్యా వర్గంలో పదిహేడువేల మంది బలవంతులున్నారు. 31 వారికి యెరీయా పెద్ద అని హెబ్రోను కుటుంబ చరిత్ర తెలుపుతుంది. దావీదు నలుబది ఏండ్లు రాజుగా వున్న కాలంలో తన ప్రజల వంశ చరిత్రలు చూచి బలపరాక్రమాలుగల వారిని, నేర్పరులైన పనివారిని వెదుకమని ఆజ్ఞాపించాడు. అట్టివారిలో కొంతమంది గిలియాదులో గల యాజేరు పట్టణంలో నివసిస్తున్న హెబ్రోను వంశీయులలో వున్నట్లు కనుగొన్నారు. 32 యెరీయాకు రెండువేల ఏడువందల మంది బలవంతులైన, కుటుంబ పెద్దలైన బంధువులున్నారు. యెహోవా కార్యాలు చేయటంలోను, రాజు పనులు చక్కబెట్టటం లోను రూబేనీయుల, గాదీయుల మరియు మనష్షే సగం వంశీయుల పనిని పరిశీలించేందుకు రాజైన దావీదు యెరీయా బంధువులైన ఆ రెండువేల ఏడువందల మందిని నియమించాడు.
సైనిక సమూహాలు
27 సైన్యంలో చేరి రాజు సేవలో నిమగ్నమైన ఇశ్రాయేలీయుల వివరణ: ప్రతి సంవత్సరంలోను ప్రతి సమూహం ఒక నెలపాటు తమ విధికి హాజరయ్యేది. రాజును సేవించిన వారిలో వంశాలకు అధిపతులు, శతదళాధిపతులు, సహస్ర దళాధిపతులు, మరియు రక్షక భటులు వున్నారు. ప్రతి సైనిక విభాగంలోను ఇరవైనాలుగు వేలమంది మనుష్యులున్నారు.
2 మొదటి నెలలో మొదటి దళానికి యాషాబాము అధిపతి. యాషాబాము తండ్రి పేరు జబ్దీయేలు. యాషాబాము దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులున్నారు. 3 యాషాబాము పెరెజు సంతతివారిలో ఒకడు. యాషాబాము సైనికాధికారులందరికీ మొదటి నెలలో అధిపతి.
4 రెండవ నెలలో సైనిక దళానికి దోదై అధిపతి. అతడు అహూయహు సంతతివాడు (అహోహీయుడు). దోదై విభాగంలో ఇరవై నాలుగువేల మంది ఉన్నారు.
5 మూడవ అధికారి బెనాయా. మూడవ నెలలో బెనాయా సైనికాధికారి. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. యెహోయాదా ప్రముఖ యాజకుడు. బెనాయా దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు. 6 ముప్పది మంది మహా యోధుల్లోగల బెనాయా ఇతడే. వారిని బెనాయా నడిపించాడు. బెనాయా కుమారుడు అమ్మీజాబాదు. బెనాయా దళానికి నిర్వాహకుడుగా వున్నాడు.
7 నాల్గవ అధికారి అశాహేలు. అతడు నాల్గవ నెలలో దళాధిపతి. అశాహేలు యోవాబు సోదరుడు. తరువాత అశాహేలు కుమారుడు జెబద్యా తన తండ్రి స్థానంలో అధిపతి అయ్యాడు. అశాహేలు దళంలో ఇరవైనాలుగు వేలమంది సైనికులు వున్నారు.
8 ఐదవ అధికారి షమ్హూతు. షమ్హూతు ఐదవ నెలలో అధిపతి. షమ్హూతు ఇశ్రాహేతీయుడు. షమ్హూతు విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
9 ఆరవ అధిపతి ఈరా. ఈరా ఆరవ నెలలో అధిపతి. ఈరా తండ్రి పేరు ఇక్కెషు. ఇక్కెషు తెకోవ పట్టణంవాడు. ఈరా విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
10 ఏడవ అధిపతి హేలెస్సు. హేలెస్సు ఏడవ నెలలో అధిపతి. అతడు పెలోనీయుడు. ఎఫ్రాయిము సంతతికి చెందినవాడు. హేలెస్సు దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు.
11 ఎనిమిదవ అధిపతి సిబ్బెకై. సిబ్బెకై ఎనిమిదవ నెలలో అధిపతి. సిబ్బెకై హుషాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. సిబ్బెకై విభాగంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు.
12 తొమ్మిదవ అధిపతి అబీయెజెరు. అబీయెజెరు తొమ్మిదవ నెలలో అధిపతి. అబీయెజెరు అనాతోతు పట్టణం వాడు. అతడు బెన్యామీనీయుడు. అబీయెజెరు దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.
13 పదవ అధిపతి మహరై. మహరై పదవ నెలలో అధిపతి. మహరై నెటోపాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. మహరై దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
14 పదకొండవ అధిపతి బెనాయా. బెనాయా పదకొండవ నెలలో అధిపతి. అతడు పిరాతోనీయుడు. బెనాయా ఎఫ్రాయిము సంతతివాడు. బెనాయా వర్గంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.
15 పన్నెండవ అధిపతి హెల్దయి. పన్నెండవ నెలలో అధిపతి హెల్దయి. అతడు నెటోపాతీయుడు. హెల్దయి ఓత్నీయేలు కుటుంబీకుడు. హెల్దయి దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.
ఇశ్రాయేలు వంశ నాయకులు
16 ఇశ్రాయేలు వంశాలు, వాటి పెద్దలు ఎవరనగా:
రూబేను: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు.
షిమ్యోను: మయకా కుమారుడైన షెఫట్య.
17 లేవీ: కెమూయేలు కుమారుడైన హషబ్యా.
అహరోను: సాదోకు.
18 యూదా: దావీదు సోదరులలో ఒకడైన ఎలీహు.
ఇశ్శాఖారు: మిఖాయేలు కుమారుడగు ఒమ్రీ.
19 జెబూలూను: ఓబద్యా కుమారుడైన ఇష్మయా.
నఫ్తాలి: అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు.
20 ఎఫ్రాయిము: అజజ్యాహు కుమారుడైన హోషేయ.
పశ్చిమ మనష్షే: పెదాయా కుమారుడైన యోవేలు.
21 తూర్పు మనష్షే: జెకర్యా కుమారుడైన ఇద్దో.
బెన్యామీను: అబ్నేరు కుమారుడగు యహశీయేలు.
22 దాను: యెహోరాము కుమారుడు అజరేలు.
వారంతా ఇశ్రాయేలు వంశాలకు అధిపతులు.
దావీదు ఇశ్రాయేలీయులను లెక్కించటం
23 ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయటానికి దావీదు నిర్ణయించాడు. అయితే వారు అసంఖ్యాకంగా వున్నారు. ఎందువల్లననగా దేవుడు ఇశ్రాయేలు వారిని ఆకాశంలో నక్షత్రాల్లా వృద్ధిచేస్తానని చెప్పాడు. అందువల్ల దావీదు ఇరవై ఏండ్ల వయస్సు వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని మాత్రమే లెక్కించమన్నాడు. 24 సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు ప్రారంభించాడు. కాని పూర్తి చేయలేదు.[b] ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు మిక్కిలి కోపం చెందాడు. అందువల్ల రాజైన దావీదు పాలన గురించిన చరిత్ర గ్రంథంలో జనాభాసంఖ్య చేర్చబడలేదు.
రాజకార్య నిర్వహకులు
25 రాజుయొక్క ఆస్తి కాపాడటంలో బాధ్యతగల వారెవరనగా:
అదీయేలు కుమారుడు అక్మావెతు ఆధీనంలో రాజగిడ్డంగులు వుంచారు.
చిన్న చిన్న పట్టణాలలోను, గ్రామాలలోను, పొలాలలోను, దుర్గాలలోను వున్న వస్తువులను భధ్రపరచు గదులకు బాధ్యత, ఉజ్జీయా కుమారుడైన యోనాతానుకు[c] ఇవ్వబడింది.
26 వ్యవసాయ కూలీలపై కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమితుడయ్యాడు.
27 ద్రాక్షా తోటల సంరక్షణాధికారి షిమీ, షిమీ రామా పట్టణానికి చెందినవాడు.
ద్రాక్షాతోటలనుండి సేకరించిన ద్రాక్షా రసపు నిల్వలు, వాటి పరిరక్షణ బాధ్యత జబ్దికి ఇవ్వబడింది. జబ్ది షెపాము ఊరివాడు.
28 పడమటి కొండల ప్రాంతంలో ఒలీవ చెట్ల, మేడి చెట్ల పరిరక్షణ, నిర్వహణ బాధ్యత బయల్ హనాను వహించాడు. బయల్ హనాను గెదేరీయుడు.
ఒలీవ నూనె నిల్వల మీద అధికారి యోవాషు.
29 షారోను ప్రాంతంలో మేసే ఆవుల మీద పర్యవేక్షకుడు షిట్రయి. షిట్రయి షారోను ప్రాంతంవాడు.
లోయలోని ఆవుల మీద అధికారి అద్లయి కుమారుడైన షాపాతు.
30 ఒంటెలపై అధికారి ఓబీలు ఇష్మాయేలీయుడు.
గాడిదల సంరక్షణాధికారి యెహెద్యాహు. యెహెద్యాహు మేరోనోతీయుడు.
31 గొర్రెల విషయం చూసే అధికారి యాజీజు. యాజీజు హగ్రీయుడు.
నాయకులైన ఈ వ్యక్తులందరూ రాజైన దావీదు ఆస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి నియమితులయ్యారు.
32 యోనాతాను తెలివైన సలహాదారు. పైగా లేఖకుడు. యోనాతాను దావీదు పినతండ్రి. రాజకుమారుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి హక్మోనీ కుమారుడైన యెహీయేలు నియమింపబడ్డాడు. 33 అహీతోపెలు రాజుకు సలహాదారు (మంత్రి). హూషై రాజుకు స్నేహితుడు (చెలికాడు). హూషై అర్కీయుడు. 34 అహీతోపెలు తరువాత అతని స్థానంలో యెహోయాదా మరియు అబ్యాతారు లిరువురూ రాజుకు సలహాదారులయ్యారు. యెహోయాదా తండ్రి పేరు బెనాయా. యోవాబు రాజు సేనకు అధిపతి.
1 యేసు క్రీస్తు సేవకుడును, అపొస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు, మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతినిబట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవాళ్ళకు వ్రాస్తున్నది.
2 దేవుణ్ణి గురించి, మన ప్రభువైన యేసు క్రీస్తును గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.
మనకవసరమైన ప్రతిదాన్ని దేవుడు మనకిచ్చాడు
3 మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవటానికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, ఆత్మీయ జీవితానికి కావలసినవాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు. 4 ఈ విధంగా, అమూల్యమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకోసం చేసాడు. ఆ వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ ప్రపంచంలోని పాపాలనుండి తప్పించుకొని, తన స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసాడు.
5 అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవరుచుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని, 6 జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను, 7 ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా దయతో నిండిన ప్రేమను అలవరుచుకోండి. 8 ఈ గుణాలు మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని ఫలవంతంగాను, ఉపయోగకరంగాను చేస్తాయి. 9 ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి ఉండదు. అలాంటివాడు గ్రుడ్డివానితో సమానము. అంటే ఇలాంటి వ్యక్తి, తాను యిదివరలో చేసిన పాపాల్ని దేవుడు క్షమించాడన్న విషయం మరిచిపోయాడన్నమాట.
10 సోదరులారా! దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించేటట్లు యింకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూవుంటే మీరేనాటికీ క్రిందపడరు. 11 తద్వారా మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘనస్వాగతం లభిస్తుంది.
12 వీటిని గురించి మీకిదివరకే తెలుసు. ప్రస్తుతం మీరంగీకరించిన సత్యంలో మీకు దృఢమైన విశ్వాసముంది. అయినా ఈ విషయాల్ని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 13 గుడారమనే ఈ శరీరంలో ప్రాణమున్నంతవరకు, మీకు జ్ఞాపకం చేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. 14 ఎందుకంటే, మన యేసు క్రీస్తు ప్రభువు ముందే స్పష్టం చేసినట్లు, నేను త్వరలోనే ఈ దేహాన్ని వదిలివేస్తానని నాకు తెలుసు.[a] 15 నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొనేటట్లు నేను అన్ని విధాలా పాటుపడతాను.
ప్రవచన వాక్యం
16 యేసు క్రీస్తు ప్రభువు రాకను గురించి, ఆయన శక్తిని గురించి తెలివిగా అల్లిన కథల ద్వారా మేము మీకు చెప్పలేదు. మేము ఆయన గొప్పతనాన్ని కళ్ళారా చూసాము. 17 ఆయన తన తండ్రి అయిన దేవుని నుండి కీర్తిని, మహిమను పొందుతుండగా, గొప్ప బలముగల స్వరము వినిపించింది: “ఈయన నా కుమారుడు. ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగుతోంది”[b] అని, 18 పవిత్రమైన పర్వతంపై మేము ఆయనతో ఉన్నప్పుడు పరలోకంనుండి ఈ స్వరం వినిపించటం మేము స్వయంగా విన్నాము.[c]
19 అందువల్ల, ప్రవక్తలు చెప్పిన సందేశమంటే మాకు యింకా ఎక్కువ విశ్వాసం కలిగింది. మీరు ఆ సందేశాన్ని గమనించటం మంచిది. ఆ సందేశం చీకటిలో వెలిగే వెలుగులాంటిది. సూర్యోదయమయ్యే వరకూ, వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వెలుగును మీరు గమనిస్తూ ఉండాలి. 20 అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. 21 ఎందుకంటే, “ప్రవచనం” మానవులు తమ యిష్ట ప్రకారం పలికింది కాదు. పవిత్రాత్మచే ప్రేరేపణ పొంది వాళ్ళు దేవుణ్ణుండి సందేశాన్ని పలికారు.
యెరూషలేమునుండి న్యాయం రావటం
4 చివరి రోజులలో ఇలా జరుగుతుంది.
పర్వతాలన్నిటిలో దేవుడైన యెహోవా ఆలయమున్న పర్వతం మిక్కిలి ప్రాముఖ్యంగలది అవుతుంది.
అది కొండలన్నిటిలో ఉన్నతంగా చేయబడుతుంది.
అన్యదేశాల ప్రజలు దానివద్దకు ప్రవాహంలా వస్తారు.
2 అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు:
“రండి, మనం యెహోవా పర్వతంమీదికి వెళదాం!
యాకోబు దేవుని ఆలయానికి వెళదాం!
యెహోవా తన ధర్మాన్ని మనకు నేర్పుతాడు.
ఆయన మార్గంలో మనం నడుద్దాం.”
ఎందువల్లనంటే దేవుని బోధలు సీయోనునుండి వస్తాయి.
యెహోవా వాక్కు యెరూషలేమునుండి వస్తుంది!
3 యెహోవా అనేక జనుల మధ్య తీర్పు తీర్చుతాడు.
బహు దూరానగల బలమైన దేశాల ప్రజలకు ఆయన తీర్పు ఇస్తాడు.
అప్పుడు వారు తమ కత్తులను సాగగొట్టి వాటిని నాగలికర్రులుగా చేస్తారు.
ఆ జనులు తమ ఈటెలను సాగగొట్టి చెట్లను నరికే పనిముట్లుగా చేస్తారు.
జనులు ఒకరితో ఒకరు కత్తులతో యుద్ధం చేయటం మాని వేస్తారు.
వారిక ఎన్నడూ యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేయరు!
4 లేదు, ప్రతి ఒక్కడూ తన ద్రాక్షాచెట్లక్రింద,
అంజూరపు చెట్లక్రింద కూర్చుంటాడు.
వారిని ఎవ్వరూ భయపడేలా చేయరు!
ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెప్పాడు!
5 అన్యదేశాల ప్రజలు తమతమ దేవుళ్లను అనుసరిస్తారు.
కానీ మనం మాత్రం మన దేవుడైన యెహోవా నామాన్ని సదా స్మరించుకుంటాం!
రాజ్యం తిరిగి పొందటం
6 యెహోవా చెపుతున్నాడు,
“యెరూషలేము గాయపర్చబడగా కుంటిది అయ్యింది.
యెరూషలేము అవతలకు విసిరివేయబడింది.
యెరూషలేము గాయపర్చబడింది; శిక్షింపబడింది.
అయినా నేను ఆమెను నా వద్దకు తీసుకొనివస్తాను.
7 “ఆ ‘కుంటి’ నగరవాసులే బతుకుతారు.
ఆ నగర ప్రజలు నగరం వదిలివెళ్లేలా బలవంత పెట్టబడ్డారు.
కాని నేను వారిని ఒక బలమైన రాజ్యంగా రూపొందిస్తాను.”
యెహోవా వారికి రాజుగా ఉంటాడు.
ఆయన శాశ్వతంగా సీయోను పర్వతం మీదనుండి పరిపాలిస్తాడు.
8 ఓ మందల కావలిదుర్గమా,
ఓ సీయోను కుమార్తె పర్వతమైన
ఓఫెలూ, గతంలోమాదిరి
నీవొక రాజ్యంగా రూపొందుతావు.
అవును, సీయోను కుమారీ,
ఆ రాజ్యం నీకు వస్తుంది.
ఇశ్రాయేలీయులు బబులోనుకు ఎందుకు వెళ్లాలి?
9 నీవిప్పుడు అంత బిగ్గరగా ఎందుకు ఏడుస్తున్నావు?
నీ రాజు వెళ్లిపోయాడా?
నీ నాయకుని నీవు కోల్పోయావా?
ప్రసవవేదనపడే స్త్రీలా నీవు బాధ పడుతున్నావు.
10 సీయోను కుమారీ, నీవు బాధపడు.
ప్రసవించే స్త్రీలా నీవు నొప్పిని అనుభవించి “బిడ్డను” కను.
ఎందుకంటే నీవు (యెరూషలేము) నగరాన్ని ఇప్పుడు వదిలివేస్తావు.
నీవు వెళ్లి పొలంలో నివసిస్తావు.
నీవు బబులోను (బాబిలోనియా)కు వెళతావు.
కానీ నీవక్కడనుండి రక్షింపబడతావు.
యెహోవా అక్కడికి వెళ్లి, నిన్ను
నీ శత్రువులనుండి తిరిగి తీసుకొని వస్తాడు.
యెహోవా ఇతర దేశాలను నాశనం చేయుట
11 అనేక దేశాలు నీమీద యుద్ధానికి వచ్చాయి.
“సీయోనువైపు చూడు!
దానిపై దాడి చేయండి!” అని ఆ జనులు అంటారు.
12 ఆ జనులు వారి వ్యూహాలు పన్నారు.
కాని యెహోవా చేసే యోచన మాత్రం వారు ఎరుగరు.
యెహోవా ఆ ప్రజలను ఇక్కడికి ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో తీసుకొని వచ్చాడు.
కళ్లంలో ధాన్యం నూర్చబడినట్లు ఆ జనులు నలగదొక్కబడతారు.
ఇశ్రాయేలు శత్రువులను ఓడించుట
13 “సీయోను కుమారీ, లెమ్ము; ఆ జనాలను అణగదొక్కు.
నేను నిన్ను బాగా బలపర్చుతాను.
నీకు ఇనుప కొమ్ములు, కంచు గిట్టలు ఉన్నట్లవుతుంది.
అనేకమంది జనులను నీవు ముక్కలుగా చితకగొడతావు.
వారి సంపదను నేను యెహోవాకు ఇస్తాను.
వారి భాగ్యాన్ని సర్వజగత్తుకూ అధిపతియైన యెహోవాకు సమర్పిస్తాను.”
పాపాలు చెయ్యటం మానుకోండి
13 ఆ సమయంలో అక్కడున్న వాళ్ళలో కొందరు యేసుతో, “పిలాతు గలిలయ ప్రజల రక్తాన్ని బలి యిచ్చిన జంతువుల రక్తంతో కలిపాడని” చెప్పారు. 2 యేసు వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ విధంగా చనిపోయినందుకు వీళ్ళు యితర గలిలయ ప్రజలకంటే ఎక్కువ పాపం చేసారని మీ అభిప్రాయమా? 3 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి. 4 గోపురం మీదపడి సిలోయములో చనిపోయిన ఆ పద్దెనిమిది మంది సంగతేమిటి? యెరూషలేములో నివసించే ఇతర ప్రజలకు కాకుండా వీళ్ళకు ఈ గతి పట్టటం సమంజసమని మీ అభిప్రాయమా? 5 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి.”
పండ్లుకాయని అంజూరపు చెట్టు యొక్క ఉపమానం
6 ఆ తర్వాత యేసు ఈ ఉపమానం చెప్పాడు: “ఒకడు తన ద్రాక్షాతోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. పండ్లు కోసం ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళి అతడు తరచు చూస్తూవుండేవాడు. కాని అతనికి పండ్లు కనిపించలేదు. 7 అతడు తోటమాలితో, ‘ఈ చెట్టుకు పండ్లు కాస్తాయేమోనని మూడేళ్ళు చూసాను. కాని దానికి పండ్లు కాయలేదు. దాన్ని కొట్టేయి. అది అనవసరంగా భూమి సారాన్ని గుంజి వేస్తోంది’ అని అన్నాడు. 8 ఆ తోట మాలి, ‘అయ్యా! దీన్ని యింకొక సంవత్సరం వదిలెయ్యండి. నేను చుట్టూ పాదు త్రవ్వి ఎరువు వేస్తాను. 9 వచ్చే సంవత్సరం పంట కాస్తే, మంచిదే. కాయకపోతే అప్పుడు కొట్టి వేయవచ్చు’ అని అన్నాడు.”
యేసు విశ్రాంతిరోజున ఒక స్త్రీని నయం చేయటం
10 ఒక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. 11 దయ్యం పట్టటంవల్ల పద్దెనిమిది ఏళ్ళనుండి రోగంతో బాధపడ్తున్న స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగి ఉంది. ఆమె చక్కగా నిలువలేకపోయేది. 12 యేసు ఆమెను చూసి దగ్గరకు రమ్మని పిలిచి ఆమెతో, “అమ్మా! నీ రోగం నుండి నీకు విముక్తి కలిగించాను.” 13 అని అంటూ ఆమె మీద తన చేతుల్ని ఉంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టింది.
14 విశ్రాంతి తీసుకోవలసిన రోజున ఆమెకు నయం చేసినందుకు ఆ సమాజమందిరపు అధికారికి కోపం వచ్చింది. అతడు ప్రజలతో, “ఆరు రోజులు పని చెయ్యటానికి ఉన్నాయి. ఆ రోజుల్లో వచ్చి నయం చేయించుకోండి. విశ్రాంతి తీసుకోవలసిన రోజున కాదు” అని అన్నాడు.
15 యేసు, “మీరు కపటులు. విశ్రాంతి రోజు మీ ఎద్దును, గాడిదను కొట్టం నుండి విప్పుకొని వెళ్ళి నీళ్ళు త్రాగించరా? 16 ఈమె అభ్రాహాము కుమార్తె. పద్దెనిమిది సంవత్సరాలు సైతాను ఈమెను తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. మరి ఈమెకు విశ్రాంతి రోజు ఆ బంధంనుండి విముక్తి కలిగించనవసరం లేదంటారా?” అని అడిగాడు. 17 ఈ మాటలు, ఆయన విరోధులు సిగ్గుపడేటట్లు చేశాయి. కాని ఆయన చేసిన మహత్కార్యాల్ని చూసి ప్రజలు చాలా ఆనందించారు.
దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?
(మత్తయి 13:31-33; మార్కు 4:30-32)
18 ఆ తర్వాత యేసు, “దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి? 19 అది ఒక ఆవగింజ లాంటిది. దాన్ని ఒకడు తన తోటలో నాటాడు. అది పెరిగి చెట్టయింది. ఆకాశంలో ఎగిరే పక్షులు దాని కొమ్మల మీద వ్రాలాయి” అని అన్నాడు.
20 యేసు మళ్ళీ, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి?” అని అడిగి, 21 “అది పిండిలో కలిపే పులుపు లాంటిది. ఒక స్త్రీ ఆ పులుపును మూడు కుంచాల పిండిలో ఆ పిండంతా పులిసేదాకా కలిపింది” అని సమాధానం చెప్పాడు.
ఇరుకు ద్వారం
(మత్తయి 7:13-14, 21-23)
22 యేసు పట్టణాల్లో, పల్లెల్లో బోధిస్తూ యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. 23 ఒకడు, “ప్రభూ! కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు.
ఆయన వాళ్ళతో, 24 “దేవుని రాజ్యానికి ఉన్న ద్వారం యిరుకైనది. ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి గట్టి ప్రయత్నం చేయండి అనేకులు ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారు. కాని ప్రవేశించలేరు. 25 ఇంటి యజమాని లేచి తలుపులకు తాళం వేస్తాడు. మీరు బయట నిలబడి తలుపు తడుతూ ‘అయ్యా! మాకోసం తలుపు తెరవండి!’ అని వేడుకొంటారు. కాని ఆయన ‘మీరెవరో, ఏ ఊరినుండి వచ్చారో నాకు తెలియదు’ అని సమాధానం చెబుతాడు. 26 అప్పుడు మీరు, ‘మీతో కలిసి తిన్నాము. మీరు మా వీధుల్లో బోధించారు’ అని అంటారు. 27 కాని ఆయన, ‘మీరెవరో నాకు తెలియదు. ఎక్కడినుండి వచ్చారో తెలియదు. ఇక్కడినుండి వెళ్ళండి, మీరంతా దుర్మార్గులు’ అని అంటాడు.
28 “మీరు అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును ఇతర ప్రవక్తలను దేవుని రాజ్యంలో చూస్తారు. మిమ్మల్ని బయట పారవేసినందుకు మీరు దుఃఖిస్తారు. బాధననుభవిస్తారు. 29 ప్రజలు ఉత్తర దక్షిణాల నుండి, తూర్పు పడమరల నుండి దేవుని రాజ్యంలో జరుగుతున్న విందుకు వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. 30 ఇప్పుడు చివరి స్థానాల్లో కూర్చున్నవాళ్ళు అక్కడ ముందు స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు మొదటి స్థానాల్లో ఉన్న వాళ్ళు అక్కడ చివరి స్థానాల్లో కూర్చుంటారు” అని అన్నాడు.
యేసు యెరూషలేము విషయంలో దుఃఖించటం
(మత్తయి 23:37-39)
31 అప్పుడు కొందరు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, “ఈ ప్రాంతం వదిలి యింకెక్కడికైనా వెళ్ళు. హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు” అని అన్నారు.
32 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ రోజు, రేపు ప్రజలకు నయం చేస్తాను. దయ్యాల్ని వదిలిస్తాను. మూడవరోజు నేను చేయవలసిన కార్యం ముగిస్తుంది. వెళ్ళి ఈ విషయం ఆ గుంట నక్కతో చెప్పండి. 33 ప్రవక్త అయినవాడు యెరూషలేమునకు బయట మరణించకూడదు కదా. కనుక ఏది ఏమైనా ఈ రోజు, రేపు, ఎల్లుండి నా ప్రయాణం సాగిస్తూ ఉండవలసిందే.
34 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తలను చంపుతున్నావు. దేవుడు పంపిన ప్రచారకుల్ని రాళ్ళతో కొడుతున్నావు. కోడి తన పిల్లల్ని రక్షించటానికి రెక్కల క్రిందికి చేర్చుకొన్నట్లే నీ ప్రజలను నాదగ్గరకు చేర్చుకోవాలని ఎన్నో సార్లు అనిపించింది! కాని నీవు దానికి అంగీకరించలేదు! 35 నీ ఇల్లు పాడుబడుతుంది. ‘ప్రభువు పేరిట వచ్చినవాడు ధన్యుడు’ అని నీవనేవరకు నీవు నన్ను చూడవు.”
© 1997 Bible League International