Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 13-14

ఒడంబడిక పెట్టెను తిరిగి తీసుకొని రావటం

13 దావీదు తన సైన్యంలోని సేనాధిపతులతో మాట్లాడాడడు. అతడు శతదళాధిపతులతోను, సహస్రదళాధిపతులతోను మాట్లాడాడు. పిమ్మట దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపర్చాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: “మీ అందరికీ ఇది మంచిదనిపించితే, ఇది యెహోవా సంకల్పమే అయితే మనం ఇప్పుడు ఇశ్రాయేలులో మన సోదరులందరికీ ఒక వర్తమానం పంపుదాము. ఈ వర్తమానాన్ని మన సోదరులతో పాటు వారి పట్టణాలలోను, పొలాలలోను నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు కూడ అందజేద్దాము. వారందరినీ వచ్చి మనల్ని కలవమని వర్తమానం పంపండి. ఒడంబడిక పెట్టెను మనం యెరూషలేముకు తీసుకొనివద్దాము. సౌలు రాజుగా వున్నన్నాళ్ళూ ఒడంబడిక పెట్టెను మనం అశ్రద్ధ చేశాము.” దావీదు చెప్పిన విషయం సరియైనదని గుర్తించి, ఇశ్రాయేలు ప్రజలంతా అతని సూచనను అంగీకరించారు.

కావున ఈజిప్టులోని షీహోరు నది మొదలు లెబోహమాతు పట్టణం వరకుగల ఇశ్రాయేలీయులందరినీ దావీదు సమావేశపర్చాడు. ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము పట్టణం నుండి తిరిగి తెచ్చే నిమిత్తం వారంతా ఒక చోటికి పిలవబడ్డారు. దావీదు మరియు అతనితో వున్న ఇశ్రాయేలీయులు కలిసి యూదాలోని బాలా పట్టణానికి వెళ్లారు. (బాలా అనేది కిర్యత్యారీముకు మరో పేరు.) ఒడంబడిక పెట్టెను బయటకు తేవటానికి వారక్కడికి వెళ్లారు. ఒడంబడిక పెట్టె అనేది యెహోవా దేవుని పవిత్రపెట్టె. యెహోవా కెరూబుల మధ్య ఆసీనుడై వుంటాడు. ఈ పెట్టె యెహోవా పేరుతో పిలవబడుతుంది.

ఒడంబడిక పెట్టెను ప్రజలు అబీనాదాబు ఇంటి నుండి బయటకు తీసారు. వారు దానిని ఒక కొత్త బండిమీద పెట్టారు. ఉజ్జా, అహ్యో అనేవారు బండిని తోలారు.

దావీదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ముందు తమ శక్తికొలది భక్తి శ్రద్ధలతో ఉత్సవం చేస్తున్నారు. వారు భక్తిగీతాలు పాడుతూ, తంబుర, సితారాలను వాయిస్తూ, తాళాలు మ్రోగిస్తూ, మద్దెలలు వాయిస్తూ, బూరలు ఊదుతూ వేడుక చేస్తున్నారు.

వారు కీదోను నూర్పిడి కళ్ళం వద్దకు వచ్చారు. అక్కడికి రాగానే బండిని లాగే ఎద్దులు కాళ్లు జారి తడబడ్డాయి. దానితో బండిమీద ఉన్న ఒడంబడిక పెట్టె ఇంచుమించు క్రిందపడినంత పని అయ్యింది. అప్పుడు ఉజ్జా తనచేయి చాపి పెట్టెను పట్టుకోబోయాడు. 10 ఉజ్జా పట్ల దేవునికి చాలా కోపం వచ్చింది. ఉజ్జా పెట్టెను ముట్టుకున్న నేరానికి దేవుడు అతనిని చంపివేసాడు. ఉజ్జా దేవుని ముందే పడి చనిపోయాడు. 11 ఉజ్జా పట్ల యెహోవా కోపగించినందుకు దావీదు కలత చెందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ ప్రదేశం “పెరెజ్ ఉజ్జా”[a] అని పిలవబడుతూ వుంది.

12 ఆ రోజు దావీదు దేవునికి భయపడ్డాడు. “ఒడంబడిక పెట్టెను నా వద్దకు ఏ విధంగా తీసుకొని వెళ్లగలను?” అని అనుకున్నాడు. 13 కావున దావీదు ఒడంబడిక పెట్టెను తనతో దావీదు నగరానికి తీసుకొని వెళ్లలేదు. ఒడంబడిక పెట్టెను ఓబేదెదోము ఇంటివద్ద వదిలిపెట్టాడు. ఓబేదెదోము గాతు నగరంవాడు. 14 మూడు నెలల పాటు ఒడంబడిక పెట్టె ఓబేదెదోము ఇంటిలో అతని ఇంటివారి సంరక్షణలో వుంది. యెహోవా ఓబేదెదోము కుటుంబం వారిని, అతను కలిగివున్న ప్రతి దానిని దీవించాడు.

దావీదు రాజ్య విస్తరణ

14 తూరు నగర రాజు పేరు హీరాము. దావీదు వద్దకు హీరాము దూతలను పంపాడు. హీరాము దేవదారు కలపను, రాళ్లు చెక్కే వాస్తు శిల్పులను, వడ్రంగులను దావీదు వద్దకు పంపాడు. దావీదుకు ఒక భవనం నిర్మించటానికి హీరాము వారిని పంపాడు. యెహోవా నిజంగానే తనను ఇశ్రాయేలుకు రాజుగా చేసినట్లు దావీదు అప్పుడు గుర్తించాడు. యెహోవా దావీదును, ఇశ్రాయేలు ప్రజలను బాగా ప్రేమించాడు. అందువల్ల దేవుడు దావీదు రాజ్యాన్ని విస్తరించి, బలమైన రాజ్యంగా రూపొందించాడు.

యెరూషలేము నగరంలో దావీదు చాలా మంది స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. అతనికి చాలామంది కొడుకులు, కూతుళ్లు కలిగారు. యెరూషలోములో దావీదుకు పుట్టిన పిల్లల పేర్లు ఏవనగా: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇభారు, ఎలీషూవ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫీయ, ఎలీషామా, బెయెల్యెదా మరియు ఎలీపెలెటు.

దావీదు ఫిలిష్తీయులను ఓడించటం

దావీదు ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుడయినట్లు ఫిలిష్తీయులు విన్నారు. కావున ఫిలిష్తీయులంతా దావీదును వెదుక్కుంటూ పోయారు. ఆ విషయం దావీదు విని వారిని ఎదుర్కోవటానికి వెళ్లాడు. ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో నివసిస్తున్న వారిపై దాడిచేసి, వారిని దోచుకున్నారు. 10 అప్పుడు దావీదు దేవుని ప్రార్థించి, “దేవా, నేను ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా? వారిని ఓడించేలా నీవు నాకు సహాయం చేస్తావా?” అని అడిగాడు.

యెహోవా అందుకు సమాధానంగా, “వెళ్లు, ఫిలిష్తీయులను నీవు ఓడించేలా నేను చేస్తాను” అని చెప్పాడు.

11 తరువాత దావీదు, అతని మనుష్యులు బయల్పెరాజీము పట్టణానికి వెళ్లారు. అక్కడ వారు ఫిలిష్తీయులను ఓడించారు. అప్పుడు దావీదు, “తెగిన ఆనకట్టలో నుండి నీరు ఉరుకులు పరుగులతో ప్రవహించి పోయేలా, దేవుడు నా శత్రువులను నానుండి చెల్లా చెదురు చేశాడు! దేవుడు ఈ కార్యం నాచేత చేయించాడు” అని అన్నాడు. అందువల్లనే ఆ ప్రదేశానికి బయల్పెరాజీము[b] అని పేరు పెట్టబడింది. 12 ఫిలిష్తీయులు వారి విగ్రహాలను బయల్పెరాజీములో వదిలి పెట్టిపోయారు. ఆ విగ్రహాలన్నిటినీ తగులబెట్టమని దావీదు తన ప్రజలకు ఆజ్ఞయిచ్చాడు.

ఫిలిష్తీయులపై మరో విజయం

13 రెఫాయీము లోయలో నివసిస్తున్న ప్రజలపై ఫిలిష్తీయులు మళ్ళీ దాడి చేశారు. 14 దావీదు మరల దేవుని ప్రార్థించాడు. దావీదు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. యెహోవా ఇలా అన్నాడు: “దావీదూ, నీవు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నప్పుడు కొండమీద నీవు వారి ముందుకు పోవద్దు. దానికి బదులు నీవు వారిని చుట్టుముట్టి వెళ్లు. కంబళి చెట్లు వున్న చోటున దాగివుండు. 15 ఒక కాపలాదారుని చెట్ల మీద కూర్చుండబెట్టు. ఆ చెట్ల క్రింద నుండి వాళ్లు నడిచివెళ్లే అడుగుల చప్పుడు అతడు వినగానే నీవు ఫిలిష్తీయులను ఎదిరించు. నేను నీకు ముందుగా వెళ్లి ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడిస్తాను!” 16 దేవుడు చెప్పిన రీతిగా దావీదు చేసాడు. ఆ విధంగా దావీదు, అతని మనుష్యులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడించారు. గిబియోను పట్టణం నుండి గాజెరు వరకు వారు ఫిలిష్తీయుల సైనికులను చంపివేసారు. 17 అప్పుడు దావీదు అన్ని దేశాలలోను పేరు పొందాడు. వివిధ రాజ్యాల వారు దావీదును చూచి భయపడేలా దేవుడు చేశాడు.

యాకోబు 1

దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన యాకోబునైన నేను, చెదరిపోయి, పలు ప్రాంతాలలో నివసిస్తున్న పన్నెండు గోత్రాల వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వ్రాయునదేమనగా:

విశ్వాసము, జ్ఞానము

2-3 నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు.

మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు.

ధనము, దరిద్రము

దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి. 10 ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసినవాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. 11 ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తాడు. మండుటెండకు గడ్డి ఎండిపోతుంది. దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదే విధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తుండగానే మరణిస్తాడు.

పరీక్షలు, దుర్బుద్ధులు

12 పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు. అంటే దేవుడు తనను ప్రేమించినవాళ్ళకు చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట. 13 ఒకడు శోధింపబడినప్పుడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. ఎందుకంటే దేవుడు చెడుద్వారా శోధింపడు. ఆయన ఎవర్నీ శోధించడు. 14 దురాశలకు లోనై ఆశల్లో చిక్కుకు పోయినప్పుడు నీతికి దూరమై చెడును చెయ్యాలనే బుద్ధి పుడుతుంది. 15 దురాశ గర్భం దాల్చి పాపాన్ని ప్రసవిస్తుంది. ఆ పాపం పండి మరణాన్ని కంటుంది.

16 నా ప్రియమైన సోదరులారా! మోసపోకండి. 17 ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. 18 దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు.

వినటం, చెయ్యటం

19 నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని తెలుసుకోండి: ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి. 20 ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు. 21 అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలివెయ్యండి. మీలో నాటుకుపోయిన దైవసందేశాన్ని విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించగలదు.

22 దైవసందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు. 23-24 దైవసందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు. 25 స్వేచ్ఛను కలిగించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న ప్రతీ కార్యము ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు.

దేవుణ్ణి ఆరాధించే సత్యమార్గం

26 తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం వేసుకోకపోతె తనకు తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. అతని విశ్వాసం నిష్ప్రయోజనమౌతుంది. 27 అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండటము, ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి.

ఆమోసు 8

పక్వానికి వచ్చిన పండు దర్శనం

యెహోవా ఇది నాకు చూపించాడు. వేసవి కాలపు పండ్లగంప నొకదానిని నేను చూశాను. “ఆమోసూ, నీ వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్నడిగాడు.

“ఒక గంపెడు వేసవి కాలపు పండ్లు” అని నేను చెప్పాను.

అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చింది. నేనిక ఎంత మాత్రం వారి పాపాలను చూసి చూడనట్లు ఉండను. ఆలయంలో పాడే పాటలు శోక గీతాలుగా మారతాయి. నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. ప్రతి చోటా శవాలు పడి ఉంటాయి. ప్రజలు నిశ్శబ్దంగా శవాలను మోసుకుపోయి పీనుగుల గుట్టమీద వేస్తారు.”

ఇశ్రాయేలు వ్యాపారుల ధనాశ

నేను చెప్పేది వినండి! నిస్సహాయులైన ప్రజలపై మీరు నడిచి వెళ్తారు.
    ఈ దేశ పేదప్రజలను నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.
వర్తకులారా, మీరిలా అంటారు,
    “మేము ధాన్యాన్ని అమ్ముకొనేటందుకు అమావాస్య ఎప్పుడు వెళ్లిపోతుంది?
అమ్మకానికి మా గోధుమలు తేవటానికి
    విశ్రాంతిదినం ఎప్పుడైపోతుంది?
కొలతలు తగ్గించి, ధరలు పెంచుతాము.
    దొంగత్రాసు వేసి ప్రజలను మోసగిస్తాము.
పేదవారు ఎలాగో వారి అప్పులు తీర్చలేరు గనుక,
    మేము వారిని బానిసలనుగా కొంటాము.
జత చెప్పుల విలువకు ఆ నిస్సహాయులను మేము కొంటాము.
    ఆహా, నేలపై ఒలికిన ధాన్యాన్ని కూడా మేము అమ్ముకోవచ్చు.”

యెహోవా ఒక మాట ఇచ్చాడు. యాకోబుకు గర్వ కారణమైన తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు:

“ఆ ప్రజలు చేసిన పనులను నేనెన్నడూ మరువను.
ఆ పనుల కారణంగా భూమి అంతా కంపిస్తుంది.
    దేశంలో నివసించే ప్రతివాడు చనిపోయినవారి కొరకు విలపిస్తాడు.
ఈజిప్టులోని నైలు నదిలా భూమి అంతా ఉవ్వెత్తుగా లేచి పతనమవుతుంది.
    భూమి అటూ ఇటూ ఊగిసలాడుతుంది.”
యెహోవా ఈ విషయాలు కూడా చెప్పాడు:
“ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో సూర్యుడు అస్తమించేలా నేను చేస్తాను.
    మబ్బులేని పగటి సమయంలో భూమిపై చీకటి కమ్మేలా చేస్తాను.
10 మీ పండుగ దినాలను చనిపోయినవారి కొరకు దుఃఖించే దినాలుగా మార్చుతాను.
    మీ పాటలన్నీ మృతులకొరకు విలాప గీతాలవుతాయి.
ప్రతివానిపైన విషాద సూచిక దుస్తులు వేస్తాను.
    ప్రతివాని తలను బోడితల చేస్తాను.
ఏకైక పుత్రుడు చనిపోయినప్పుడు కలిగే గొప్ప
    దుఃఖంలాంటి దుఃఖాన్ని నేను కలిగిస్తాను.
అది ఒక భయంకరమైన అంతం.”

దేవుని వాక్యంకొరకు కరువు

11 యెహోవా చెపుతున్నాడు:

“చూడు, దేశంలో కరువు పరిస్థితిని
    నేను కల్పించే సమయం వస్తూవుంది.
ప్రజలు ఆహారం కొరకు ఆకలిగొనరు.
    ప్రజలు నీటి కొరకు దప్పిగొనరు.
    కాని యెహోవా వాక్యాల కొరకు ప్రజలు ఆకలిగొంటారు.
12 ప్రజలు ఒక సముద్రంనుండి
    మరొక సముద్రం వరకు తిరుగుతారు.
    వారు ఉత్తరాన్నుండి తూర్పుకు పయనిస్తారు.
యెహోవా వాక్యం కొరకు ప్రజలు ముందుకు, వెనుకకు పోతారు.
    కాని వారు దానిని కనుగొనలేరు.
13 ఆ సమయంలో అందమైన యువతీ యువకులు
    దప్పికతో సొమ్మసిల్లుతారు.
14 షోమ్రోనుయొక్క పాపము సాక్షిగా ప్రమాణం చేసేవారు
    ఇలా అంటారు: ‘దానూ, నీ దేవుని జీవముతోడు.’
    ‘బెయేర్షెబా మార్గంతోడు’ అని. ఆ ప్రజలు పతనమవుతారు,
వారు మరెన్నడూ లేవరు.”

లూకా 3

యోహాను బోధించటం

(మత్తయి 3:1-12; మార్కు 1:1-8; యోహాను 1:19-28)

కైసరు తిబెరి రాజ్యపాలన చేస్తున్న పదు నైదవ సంవత్సరములో:

యూదయ దేశాన్ని పొంతి పిలాతు పాలిస్తూ ఉన్నాడు.

హేరోదు గలిలయ దేశానికి సామంతరాజుగా ఉన్నాడు.

హేరోదు తమ్ముడు ఫిలిప్పు ఇతూరయ, త్రకోనీత ప్రాంతాలకు పాలకుడుగా ఉన్నాడు.

లుసానియా అబిలేనే రాష్ట్రానికి సామంతరాజుగా ఉన్నాడు.

ఇతని కాలంలోనే అన్న మరియు కయప ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళ కాలంలోనే జెకర్యా కుమారుడైన యోహాను అరణ్య ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నాడు. అక్కడ అతనికి దేవుని సందేశం లభించింది. ఆతర్వాత అతడు యొర్దాను నది చుట్టూ ఉన్న ప్రాంతాలన్ని తిరిగి, “పాప క్షమాపణ పొందాలంటే మారుమనస్సు కలిగి బాప్తిస్మము పొందాలి” అని బోధించాడు. దీన్ని గురించి యెషయా ప్రవక్త గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:

“‘ప్రభువు కోసం మార్గం వేయుమని ఆయన
బాటలు చక్కగా చేయుమని ఎడారి ప్రాంతములో
    ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.
లోయలు పూడ్చివేయ బడుతాయి.
    కొండలు గుట్టలు నేలమట్టమౌతాయి.
వంకర బాటలు చక్కగా ఔతాయి.
    కరుకు బాటలు నునుపుగా ఔతాయి.
మానవులు దేవుడు ప్రసాదించే రక్షణను చూస్తారు!’”(A)

ప్రజలు బాప్తిస్మము పొందటానికి గుంపులు గుంపులుగా యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను, “మీరు సర్పసంతానం. దేవునికి కోపం రానున్నది. ఆ కోపం నుండి పారిపోవాలనుకుంటున్నారు. అలా చేయుమని ఎవరు చెప్పారు? మారుమనస్సు పొందినట్లు ఋజువు చేసే పనులు చెయ్యండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని గొప్పలు చెప్పుకొన్నంత మాత్రాన లాభం లేదు. ఈ రాళ్ళనుండి దేవుడు అబ్రాహాము సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను. చెట్లవేళ్ళమీద గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫలమివ్వని చెట్టును కొట్టెసి ఆయన మంటల్లో పార వేస్తాడు” అని అన్నాడు.

10 “మరి మేము ఏం చెయ్యాలి?” అని ప్రజలు అడిగారు.

11 యోహాను, “రెండు చొక్కాలున్న వాడు ఒక చొక్కాకూడా లేని వానితో వాటిని పంచుకోవాలి. అలాగే మీ ఆహారం కూడా పంచుకోవాలి” అని అన్నాడు.

12 పన్నులు సేకరించేవాళ్ళు కూడా బాప్తిస్మము పొందటానికి వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.

13 “సేకరించ వలసిన పన్నుల కన్నా ఎక్కువ పన్నులు సేకరించవద్దు” అని అతడు వాళ్ళతో అన్నాడు.

14 కొందరు సైనికులు కూడా వచ్చి, “మేము ఏం చెయ్యాలి?” అని అతణ్ణి అడిగారు.

అతడు సమాధానం చెబుతూ, “ప్రజల నుండి డబ్బుగుంజవద్దు! వాళ్ళపై తప్పుడు నిందలు మోపకండి. మీ జీతంతో తృప్తి చెందండి” అని అన్నాడు.

15 ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయి ఉండవచ్చనుకున్నారు.

16 యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము[a] నిచ్చాను. కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచెప్పులు విప్పే అర్హతకూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు. 17 చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఆ చేటతో ధాన్యాన్ని శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు.” 18 యోహాను వాళ్ళకు హెచ్చరిక కలిగేటట్లు యింకా ఎన్నో విషయాలు చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు.

యోహాను సేవా ఎలా అంతమైయింది

19 రాజ్యాధికారి హేరోదుకు అతని సోదరుని భార్య అయిన హేరోదియతో సంబంధంవుంది. దీని కారణంగా, హేరోదు చేసిన యితర దుష్కార్యాల కారణంగా యోహాను అతణ్ణి తీవ్రంగా విమర్శించాడు. 20 తద్వారా హేరోదు, యోహానును కారాగారంలో ఉంచాడు. ఇలా చేసి తాను చేసిన దుష్కార్యాలకు మరొక దుష్కార్యం చేర్చుకొన్నాడు.

యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం

(మత్తయి 3:13-17; మార్కు 1:9-11)

21 యోహాను ప్రజలకు బాప్తిస్మమునిస్తూ వుండినాడు. అప్పుడు వాళ్ళతో సహా యేసుకు కూడా బాప్తిస్మమునిచ్చాడు. యేసు ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది. 22 పవిత్రాత్మ ఒక పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై వ్రాలాడు. వెంటనే పరలోకం నుండి ఒక స్వరం, “నీవు నా ప్రియ కుమారుడివి, నిన్ను నేను ప్రేమించుచున్నాను. నీయందు ఎక్కువగా నేను ఆనందించుచున్నాను” అని వినబడింది.

యోసేపు వంశ వృక్షం

(మత్తయి 1:1-17)

23 యేసు బోధించటం మొదలు పెట్టినప్పుడు ఆయనకు సుమారు ముప్పై సంవత్సరాలు. యేసు యోసేపు కుమారుడు అని ప్రజలు అనుకునేవాళ్ళు.

యోసేపు హేలీ కుమారుడు,

24 హేలీ మత్తతు కుమారుడు,

మత్తతు లేవి కుమారుడు.

లేవి మెల్కీ కుమారుడు.

మెల్కీ యన్న కుమారుడు.

యన్న యోసేపు కుమారుడు.

25 యోసేపు మత్తతీయ కుమారుడు,

మత్తతీయ ఆమోసు కుమారుడు.

ఆమోసు నాహోము కుమారుడు,

నాహోము ఎస్లి కుమారుడు.

ఎస్లి నగ్గయి కుమారుడు.

26 నగ్గయి మయతు కుమారుడు.

మయతు మత్తతీయ కుమారుడు.

మత్తతీయ సిమియ కుమారుడు.

సిమియ యోశేఖు కుమారుడు.

యోశేఖు యోదా కుమారుడు.

27 యోదా యోహన్న కుమారుడు.

యోహన్న రేసా కుమారుడు,

రేసా జెరుబ్బాబేలు కుమారుడు.

జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు.

షయల్తీయేలు నేరి కుమారుడు,

28 నేరి మెల్కీ కుమారుడు,

మెల్కీ అద్ది కుమారుడు.

అద్ది కోసాము కుమారుడు,

కోసాము ఎల్మదాము కుమారుడు,

ఎల్మదాము ఏరు కుమారుడు,

29 ఏరు యెహోషువ కుమారుడు.

యెహోషువ ఎలీయెజెరు కుమారుడు.

ఎలీయెజెరు యోరీము కుమారుడు.

యోరీము మత్తతు కుమారుడు,

మత్తతు లేవి కుమారుడు.

30 లేవి షిమ్యోను కుమారుడు,

షిమ్యోను యూదా కుమారుడు,

యూదా యోసేపు కుమారుడు.

యోసేపు యోనాము కుమారుడు.

యోనాము ఎల్యాకీము కుమారుడు,

31 ఎల్యాకీము మెలెయా కుమారుడు.

మెలెయా మెన్నా కుమారుడు.

మెన్నా మత్తతా కుమారుడు.

మత్తతా నాతాను కుమారుడు.

నాతాను దావీదు కుమారుడు,

32 దావీదు యెష్షయి కుమారుడు,

యెష్షయి ఓబేదు కుమారుడు,

ఓబేదు బోయజు కుమారుడు,

బోయజు శల్మాను కుమారుడు,

శల్మాను నయస్సోను కుమారుడు,

33 నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు.

అమ్మీనాదాబు అరాము కుమారుడు.

అరాము ఎస్రోము కుమారుడు,

ఎస్రోము పెరెసు కుమారుడు,

పెరెసు యూదా కుమారుడు.

34 యూదా యాకోబు కుమారుడు,

యాకోబు ఇస్సాకు కుమారుడు,

ఇస్సాకు అబ్రాహాము కుమారుడు,

అబ్రాహాము తెరహు కుమారుడు,

తెరహు నాహోరు కుమారుడు,

35 నాహోరు సెరూగు కుమారుడు,

సెరూగు రయూ కుమారుడు,

రయూ పెలెగు కుమారుడు,

పెలెగు హెబెరు కుమారుడు,

హెబెరు షేలహు కుమారుడు,

36 షేలహు కేయినాను కుమారుడు,

కేయినాను అర్పక్షదు కుమారుడు,

అర్పక్షదు షేము కుమారుడు,

షేము నోవహు కుమారుడు,

నోవహు లెమెకు కుమారుడు,

37 లెమెకు మెతూషెల కుమారుడు,

మెతూషెల హనోకు కుమారుడు,

హనోకు యెరెదు కుమారుడు,

యెరెదు మహలలేలు కుమారుడు,

మహలలేలు కేయినాను కుమారుడు,

38 కేయినాను ఎనోషు కుమారుడు,

ఎనోషు షేతు కుమారుడు,

షేతు ఆదాము కుమారుడు,

ఆదాము దేవుని కుమారుడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International