Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 9-10

ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి.

యెరూషలేము ప్రజలు

యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబులోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది. మొట్టమొదటి సారిగా తమ స్థలాలకు, పట్టణాలకు తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు ఉన్నారు.

యెరూషలేములో నివసించిన యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే వంశాల ప్రజలు ఎవరనగా:

అమీహూదు కుమారుడు ఊతై. అమీహూదు తండ్రి పేరు ఒమ్రీ. ఒమ్రీ తండ్రి పేరు ఇమ్రీ. ఇమ్రీ తండ్రి బానీ. పెరెసు సంతతి వాడు బానీ. యూదా కుమారుడు పెరెసు.

యెరూషలేములో నివసించిన షిలోనీయులెవరనగా: షిలోనీయులలో మొదటివాడైన ఆశాయా మరియు అతని కుమారులు.

యెరూషలేములో నివసించిన జెరహు వంశం వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు.

మెషుల్లాము కుమారుడు సల్లు; మెషుల్లాము తండ్రి హోదవ్యా; హోదవ్యా తండ్రి హసెనూయా అనేవారు యెరూషలేములో నివసించిన బెన్యామీను సంతతివారు. యెహోరాము కుమారుడు ఇబ్నెయా. ఉజ్జీ కుమారుడు ఏలా. మిక్రి కుమారుడు ఉజ్జీ. షెఫట్యా కుమారుడు మెషుల్లాము. రగూవేలు కుమారుడు షెఫట్యా. ఇబ్నీయా కుమారుడు రగూవేలు. యెరూషలేములో తొమ్మిది వందల ఏబదిఆరు మంది బెన్యామీనీయులు ఉన్నట్లు వారి వంశ చరిత్ర తెలుపుతుంది. వీరంతా ఆయా కుటుంబ పెద్దలు.

10 యెరూషలేములో నివసించిన యాజకులు ఎవరనగా: యెదాయా, యెహోయారీబు, యాకీను, 11 మరియు హిల్కీయా కుమారుడైన అజర్యా. మెషుల్లాము కుమారుడు హిల్కీయా. సాదోకు కుమారుడు మెషుల్లాము. మెరాయోతు కుమారుడు సాదోకు. అహీటూబు కుమారుడు మెరాయోతు. ఆలయ నిర్వహణలో అహీటూబు ముఖ్యమైన అధికారి. 12 యెరోహాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండ్రి పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మశై అను వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యహజేరా. యహజేరా తండ్రి పేరు మెషుల్లాము. మెషుల్లాము తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు ఇమ్మెరు.

13 యాజకులంతా మొత్తం పదిహేడు వందల అరవై మంది. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. ఆలయంలో పూజాది కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారిదే.

14 యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారెవరనగా: హష్షూబు కుమారుడు షెమయా. హష్షూబు తండ్రి పేరు అజ్రీకాము. అజ్రీకాము తండ్రి పేరు హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు. 15 బకబక్కరు, హెరెషు, గాలాలు మరియు మత్తన్యా కూడా యెరూషలేములో నివసించారు. మత్తన్యా తండ్రి పేరు మీకా. మీకా తండ్రి పేరు జిఖ్రీ. జిఖ్రీ తండ్రి ఆసాపు. 16 ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు.

17 యెరూషలేములో నివసించిన ద్వారపాలకులు ఎవరనగా: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను మరియు వారి బంధువులు. షల్లూము వారికి నాయకుడు. 18 తూర్పు దిశలో రాజు ప్రవేశించే దేవాలయ ద్వారం వద్ద వీరు నిలబడేవారు. వారు లేవి సంతతికి చెందిన ద్వారపాలకులు. 19 షల్లూము తండ్రి పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. షల్లూము, అతని సోదరులు ద్వారపాలకులే. వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు[a] చేసిన విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ వుండేవారు. 20 గతంలో ద్వారపాలకుల అధిపతిగా ఫీనెహాసు వ్యవహరించాడు. ఫీనెహాసు తండ్రి పేరు ఎలియాజరు. ఫీనెహాసుకు యెహోవా కృప ఉంది. 21 పవిత్ర గుడారపు ద్వారానికి జెకర్యా కూడ కావలి ఉన్నాడు.

22 పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి పేర్లన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూయేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు మిక్కిలి నమ్మకస్తులు. 23 యెహోవా నివాసమైన పవిత్ర గుడారపు ద్వారాలను కాపలా కాసే బాధ్యత ద్వార పాలకులది వారి సంతతి వారిదైయున్నది. 24 తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు నాలుగు పక్కలా ఉన్నాయి. 25 పరిసర గ్రామాలలో నివసించే ఈ ద్వారా పాలకుల బంధువులు అప్పుడప్పుడు వచ్చి వారికి సహాయపడేవారు. వచ్చినప్పుడల్లా వారు ద్వారపాలకులకు ఏడేసి రోజులు సహాయంగా ఉండేవారు.

26 ద్వారపాలకులందరి మీద నలుగురు ద్వార పాలకులు నాయకత్వం వహించేవారు. వారు లేవీయులు. దేవుని నివాసంలో అన్ని గదుల అజమాయిషీ, ధనాగారాల పరిరక్షణ గావించేవారు. 27 వారు రాత్రంతా దేవాలయాన్ని కాపలా కాసేవారు. పైగా ప్రతిరోజూ ఉదయం ఆలయం ద్వారం తెరచే పని కూడ వారిదే.

28 దేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విషయమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరున్నారు. ఆ వస్తుసామగ్రిని లోనికి తెచ్చినపుడు వారు లెక్కపెట్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని వెళ్లేటప్పుడు కూడ లెక్క పెట్టేవారు. 29 మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు. 30 కాని సుగంధ ద్రవ్యాలను కలిపే పని మాత్రం యాజకులది.

31 నైవేద్యంగా వినియోగించే రొట్టె చేయటానికి మత్తిత్యా అనే లేవీయుడు నియమించబడ్డాడు. షల్లూము పెద్ద కుమారుడు మత్తిత్యా. షల్లూము అనే వాడు కోరహు సంతతివాడు. 32 విశ్రాంతి దినాన దైవ సన్నిధికి సమర్పించే నైవేద్యపు రొట్టె తయారు చేయటానికి కోరహు సంతతి ద్వార పాలకులలో కొందరు నియమించబడ్డారు.

33 లేవీయులలో దేవాలయ గాయకులుగా వున్న వారు, వారి కుటుంబ పెద్దలు దేవాలయపు గదులలో నివసించేవారు. వారు రాత్రింబవళ్లు దేవాలయ పనిలో నిమగ్నమై వుండుటచేత మరొక పని చేసేవారు కాదు.

34 ఈ లేవీయులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడిన విధంగా వారంతా పెద్దలు. వారు యెరూషలేములో నివసించారు.

సౌలు రాజు కుటుంబ చరిత్ర

35 గిబియోను తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీయేలు భార్య పేరు మయకా. 36 యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని మిగిలిన కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 37 గెదోరు, అహ్యో, జెకర్యా మరియు మిక్లోతు. 38 మిక్లోతు కుమారుడు షిమ్యాను. యెహీయేలు కుటుంబం వారు యెరూషలేములో తమ బంధువుల వద్దనే నివసించారు.

39 నేరు కుమారుని పేరు కీషు. కీషు కుమారుని పేరు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు.

40 యోనాతాను కుమారుని పేరు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.

41 మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ మరియు ఆహాజు. 42 ఆహాజు యెహోయద్దాకు తండ్రి. యెహోయద్దా కుమారుని పేరు యరా. యరా కుమారుల పేర్లు ఆలెమెతు, అజ్మావెతు మరియు జిమ్రీ. జిమ్రీ కుమారుడు మోజా, 43 మోజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రెఫాయా. రెఫాయా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.

44 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వారంతా ఆజేలు కుమారులు.

సౌలు రాజు మరణం

10 ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు. ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారులను తరుముకుంటూ పోయి, వారిని పట్టుకుని చంపివేశారు. సౌలు కుమారులు యోనాతాను, అబీనాదాబు, మల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు. సౌలు చుట్టూ యుద్ధం ముమ్మరంగా సాగింది. విలుకాండ్రు సౌలుపై బాణాలు వదిలి గాయపర్చారు.

అప్పుడు తన ఆయుధాలు మోసే వానితో[b] సౌలు ఇలా చెప్పాడు: “నీ కత్తి దూసి నన్ను చంపివేయి. నీవలా చేస్తే ఆ పరదేశీయులు[c] వచ్చి నన్ను హింసించి ఎగతాళి చేయరు.”

కాని ఆయుధాలు మోసే సౌలు సేవకుడు భయపడ్డాడు. సౌలును చంపటానికి నిరాకరించాడు. అప్పుడు సౌలు తన కత్తినే ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కత్తి మొనపై అతను పడి తనను తాను చంపుకున్నాడు. సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూసాడు. తర్వాత అతను కూడా తన కత్తి మొనపై పడి తనను తాను చంపుకున్నాడు. ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు మరణించారు. పైగా సౌలు కుటుంబం వారంతా కలిసి చనిపోయారు.

లోయలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలంతా తమ సైన్యం పారిపోవటం చూసారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం ప్రజలు చూసారు. దానితో వారు కూడ భయపడి తమ పట్టణాలను వదలి పారిపోయారు. తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు వదిలిపోయిన పట్టణాలకు వచ్చి, అక్కడ నివసించసాగారు.

శవాలనుండి విలువైన వస్తువులను సేకరించటానికి ఫిలిష్తీయులు మరునాడు వచ్చారు. వారు గిల్బోవ పర్వతం మీద సౌలు శవాన్ని, అతని ముగ్గురు కుమారుల శవాలను చూసారు. ఫిలిష్తీయులు సౌలు శరీరంమీద విలువైన వస్తువులను తీసుకొన్నారు. వారు సౌలు తలను, అతని ఆయుధాలను తీసుకొన్నారు. పిమ్మట వారు తమ దేశం నలుమూలలా ఉన్న బూటకపు దేవుళ్ల గుళ్లకు, ప్రజలకు ఈ వార్తను అందజేయటానికి దూతలను పంపారు. 10 సౌలు ఆయుధాలను ఫిలిష్తీయులు తమ బూటకపు దేవుళ్ల గుళ్లల్లో దాచారు. సౌలు తలను వారు దాగోను[d] గుడిలో వేలాడదీసారు.

11 యాబేష్గిలాదు పట్టణంలో నివసించే వారంతా ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా విన్నారు. 12 యాబేష్గిలాదులో వున్న యోధులంతా వెళ్లి సౌలు, అతని కుమారుల శవాలను యాబేష్గిలాదుకు తిరిగి తెచ్చారు. ఆ యోధులు సౌలు, అతని కుమారుల ఎముకలను యాబేషులో ఒక పెద్ద చెట్టు క్రింద పాతిపెట్టారు. తర్వాత వారు ఏడు రోజులు ఉపవాసమున్నారు.

13 సౌలు మరణానికి ముఖ్య కారణం అతను యెహోవాపట్ల విశ్వాసంగా లేకపోవటం. సౌలు యెహోవా మాటను లెక్కపెట్టలేదు. 14 యెహోవాకు ప్రార్థన చేయకుండా తన సంశయాలను నివారించుకొనటానికి, కర్ణ పిశాచిగల స్త్రీని ఆశ్రయించాడు. అందువల్ల యెహోవా సౌలును చంపి, రాజ్యాన్ని దావీదుకు అప్పగించాడు. దావీదు తండ్రి పేరు యెష్షయి.

హెబ్రీయులకు 12

కుమారులు, క్రమశిక్షణ

12 అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొంటున్న పాపాల్ని వదిలించుకొందాం. మనం పరుగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగెడదాం. మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్యలేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు. పాపాత్ములు తనపట్ల కనబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు.

దేవుడు తండ్రిలాంటివాడు

మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం యింతవరకు కలుగలేదు. మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు:

“నా కుమారుడా! ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు!
    నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు!
ఎందుకంటే, ప్రభువు తనను ప్రేమించిన వాళ్ళనే శిక్షిస్తాడు.
    అంతేకాక తన కుమారునిగా అంగీకరించిన ప్రతి ఒక్కణ్ణి శిక్షిస్తాడు.”(A)

కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూసుకొంటాడు. తండ్రి నుండి శిక్షణ పొందని కుమారుడెవడున్నాడు? మీకు శిక్షణ లభించకపోతే మీరు దేవుని నిజమైన కుమారులు కారన్న మాట. ప్రతి ఒక్కడూ క్రమశిక్షణ పొందుతాడు. మన తండ్రులు మనకు శిక్షణనిచ్చారు. ఆ కారణంగా వాళ్ళను మనం గౌరవించాము. మరి అలాంటప్పుడు మన ఆత్మలకు తండ్రి అయిన వానికి యింకెంత గౌరవమివ్వాలో ఆలోచించండి. 10 మన తల్లిదండ్రులు వాళ్ళకు తోచిన విధంగా కొద్దికాలం పాటు మనకు క్రమశిక్షణ నిచ్చారు. కాని దేవుడు మన మంచికోసం, ఆయన పవిత్రతలో మనం భాగం పంచుకోవాలని మనకు శిక్షణనిచ్చాడు. 11 శిక్షణ పొందేటప్పుడు బాధగానే వుంటుంది. ఆనందంగా ఉండదు. కాని ఆ తర్వత శిక్షణ పొందినవాళ్ళు నీతి, శాంతి అనే ఫలం పొందుతారు.

నీవు ఎలా జీవిస్తున్నావో జాగ్రత్తగావుండు

12 అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి. 13 మీరు నడిచే దారుల్ని[a] సమంగా చేసుకోండి. అప్పుడు ఆ దారులు కుంటివాళ్ళకు అటంకం కలిగించటానికి మారుగా సహాయపడ్తాయి.

14 అందరిపట్ల శాంతి కనబరుస్తూ జీవించటానికి ప్రయత్నించండి. పవిత్రంగా జీవించండి. పవిత్రత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడలేరు. 15 ఒక్కరు కూడా దైవానుగ్రహానికి దూరం కాకుండా జాగ్రత్తపడండి. 16 వ్యభిచారం చెయ్యకండి. ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠపుత్రునిగా తన హక్కుల్ని అమ్మివేసిన ఏశావువలె భక్తిహీనులై జీవించకండి. 17 ఏశావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదం పొందాలని కోరినప్పుడు దేవుడు నిరాకరించిన విషయం మీకు తెలుసు. అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్ళు పెట్టుకొన్నాడు. కాని లాభం కలుగలేదు.

18 తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్నిజ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకొన్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. 19 ఆ పర్వతం నుండి బూర ధ్వని, మాట్లాడుతున్న కంఠ ధ్వని వినటానికి రాలేదు. ఆ కంఠం విన్నవాళ్ళు భయపడి వినడానికి నిరాకరించారు. 20 ఎందుకంటే, “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా ఆ జంతువును రాళ్ళతో కొట్టాలి”(B) అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్ళు భరించలేకపొయ్యారు. 21 ఆ దృశ్యము ఎంత భయంకరంగా ఉందంటే, మోషే “నేను భయంతో వణికి పోతున్నాను”(C) అని అన్నాడు.

22 కాని మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము! సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేలకొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు. 23 మొట్టమొదట జన్మించిన వాళ్ళ సంఘానికి మీరు వచ్చారు. వీళ్ళ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి. మానవుల న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. దేవుడు పరిపూర్ణత కలిగించిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. 24 క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు రక్తానికన్నా ఉత్తమసందేశాన్నిచ్చే “ప్రోక్షింపబడే రక్తం” దగ్గరకు మీరు వచ్చారు.

25 జాగ్రత్త! మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్ళు నిరాకరించారు. తద్వారా ఆయన ఆగ్రహంనుండి తప్పించుకోలేకపోయారు. మరి ఆయన పరలోకంనుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహంనుండి ఎలా తప్పించుకొనగలము? 26 ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది. కాని యిప్పుడు ఆయన, “నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా మరొక్కసారి కదిలిస్తాను”(D) అని వాగ్దానం చేసాడు. 27 “మరొక్కసారి” అన్న పదాలు, కదిలే వాటిని, అంటే సృష్టింపబడ్డవాటిని నాశనం చేస్తాడని సూచిస్తున్నాయి. కదలనివి అలాగే ఉండిపోతాయి.

28 ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞులమై ఉందాం. ఆయన్ని భయభక్తులతో, ఆయనకు యిష్టమైన విధంగా ఆరాధించుదాము. 29 ఎందుకంటే, మన దేవుడు “మండుచున్న అగ్నిలాంటివాడు.”(E)

ఆమోసు 6

ఇశ్రాయేలు నుండి మంచిరోజులు తొలగింపబడటం

సీయోను వాసులారా, మీలో కొంతమంది చాలా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
    సమరయ పర్వతంమీద ఉన్న ప్రజలలో కొంతమంది సురక్షితంగా ఉన్నట్లు తలంచుచున్నారు.
కాని మీకు చాలా దుఃఖము కలుగుతుంది. మీరు ప్రాముఖ్యమైన జనాంగపు ముఖ్య నాయకులు.
    ఇశ్రాయేలు ప్రజలు సలహా కొరకు మీ వద్దకు వస్తారు.
మీరు వెళ్లి కల్నేలో[a] చూడండి.
    అక్కడనుండి పెద్ద నగరమైన హమాతుకి[b] వెళ్లండి.
    ఫిలిష్తీయుల నగరమైన గాతుకు వెళ్లండి.
ఆ రాజ్యాలకంటే మీరేమైనా గొప్పవారా?
    లేదు. మీ దానికంటే వారి రాజ్యాలు విశాలమైనవి.
శిక్షా దినము బహు దూరాన ఉన్నదనుకొని,
    దౌర్జన్య పరిపాలనకు దగ్గరవుతున్నారు.
కాని మీరు అన్ని సుఖాలు అనుభవిస్తారు.
    మీరు దంతపు మంచాలపై పడుకుంటారు.
మీ పాన్పులపై మీరు చాచుకొని పడుకుంటారు. మందలోని మంచి లేత గొర్రె పిల్లలను,
    పశువులశాలలోని మంచి చిన్న గిత్త దూడలను మీరు తింటారు.
మీరు స్వరమండలాలను వాయిస్తారు.
    దావీదువలె మీరు కనిపెట్టిన వాద్య విశేషాలపై సాధన చేస్తారు.
చిత్రమైన గిన్నెల్లో మీరు ద్రాక్షారసం తాగుతారు.
    మీరు శ్రేష్ఠమైన పరిమళ తైలాలు వాడతారు.
యోసేపు వంశం నాశనమవుతూ
    ఉందని కూడా మీరు కలవరం చెందరు.

ఆ ప్రజలు వారి పాన్పులపైన చాచుకొని పడుకున్నారు. కాని వారి మంచి రోజులు అంతమవుతాయి. వారు బందీలవలె అన్యదేశాలకు తీసుకొనిపోబడతారు. ముందుగా అలా పట్టుకుపోబడే వారిలో ఈ ప్రజలు వుంటారు. ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేశాడు. దేవుడును, సర్వ శక్తిమంతుడును అయిన యెహోవా తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు:

“యాకోబుకు గర్వకారణమైన వస్తువులను నేను అసహ్యించుకుంటాను.
    అతని బలమైన బురుజులను నేను అసహ్యించుకుంటాను.
అందుచేత ‘శత్రువు’ నగరాన్ని,
    దానిలోని ప్రతి వస్తువును తీసుకునేలా చేస్తాను.”

ప్రాణంతో మిగిలే ఇశ్రాయేలీయులు తక్కువ

ఆ సమయంలో ఒకానొక ఇంట్లో పదిమంది జీవించియుండవచ్చు. ఆ ఇంటిలో మరి కొంతమంది మరణించవచ్చు. 10 ఒక బంధువు ఆ శవాన్ని బయటకు తీసికొనిపోయి దహనం చేయవచ్చు. ఆ బంధువు ఇంటినుంచి ఎముకలు తేవటానికి వెళ్తాడు. ఇంటిలో దాగిన ఏ వ్యక్తినైనా ప్రజలు పిలిచి, “నీ వద్ద ఇంకా ఏమైనా శవాలు మిగిలియా?” అని అడుగుతారు.

ఆ వ్యక్తి, “లేవు …” అని సమాధానమిస్తాడు.

అప్పుడా వ్యక్తియొక్క బంధువు ఇలా అంటాడు: “నిశ్శబ్దం! మనం యెహోవా మాట ఎత్తకూడదు.”

11 చూడు, దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇవ్వగా,
    పెద్ద ఇండ్లు ముక్కలుగా పగిలిపోతాయి.
    చిన్న ఇండ్లు చిన్న ముక్కలైపోతాయి.
12 గుర్రాలు బండలపై పరుగిడతాయా?
    లేదు! ప్రజలు ఆవులను నేల దున్నటానికి వినియోగిస్తారా?
అవును! కాని మీరు అన్నిటినీ తారుమారు చేస్తారు.
    మీరు మంచిని, న్యాయాన్ని విషంగా మార్చారు.
13 మీరు లో-దెబారులో సుఖంగా ఉన్నారు.
    “మేము కర్నయీమును మా స్వశక్తిచే తెచ్చుకున్నాం” అని మీరంటారు.

14 “కాని ఇశ్రాయేలూ, నేను మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను. ఆ రాజ్యం మీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. లేబో-హమాతు నుండి అరాబా వాగువరకూ మీ అందరికీ కష్టాలు వస్తాయి.” దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

లూకా 1:39-80

మరియ ఎలీసబెతును కలుసుకోవటం

39 మరియ వెంటనే యూదా పర్వత ప్రాంతం లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమైంది. 40 ఆ గ్రామంలోనున్న జెకర్యా యింటికి వెళ్ళి ఎలీసబెతును కలుసుకొని ఆమె క్షేమ సమాచారాలు అడిగింది. 41 ఎలీసబెతు ఆమె మాటలు విన్న తక్షణమే, ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాడు. ఎలీసబెతు పవిత్రాత్మతో నిండిపోయింది.

42 ఆమె బిగ్గరగా, “దేవుడు ఏ స్త్రీని దీవించనంతగా నిన్ను దీవించాడు. అదే విధంగా నీ గర్భంలో నున్న శిశువు కూడా ధన్యుడు. 43 కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా? 44 నీ మాటలు నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. 45 ప్రభువు చెప్పినట్లు జరుగుతుందని విశ్వసించావు. ధన్యురాలవు” అని అన్నది.

మరియ పాడిన భక్తి గీతం

46 మరియ ఈ విధంగా అన్నది:

47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది.
    దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48 దీనురాల్ని నేను!
    ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
    నన్ను ధన్యురాలంటారు!
49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
    ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51 తన బలమైన హస్తాన్ని జాపి
    గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
    దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
    ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
    అతని సంతతితో చెప్పినట్లు
55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”

56 మరియ ఎలీసబెతు యింట్లో మూడు నెలలుండి, ఆ తర్వాత యింటికి తిరిగి వెళ్ళిపోయింది.

యోహాను జన్మ వృత్తాంతం

57 ఎలీసబేతుకు నెలలు నిండి మగశిశువును ప్రసవించింది. 58 బంధువులు మరియు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు.

59 ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు. 60 కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది.

61 వాళ్ళు, “మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవ్వరూ లేరే?” అని అన్నారు. 62 ఆ పిల్లవాని తండ్రికి సంజ్ఞలు చేసి అతడే పేరు పెట్టదలచాడో అని అడిగారు.

63 అతడు వ్రాయటానికి ఒక పలక నివ్వమని అడిగి దానిపై, “అతనికి యోహాను అని పేరు పెట్టండి” అని వ్రాసాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. 64 వెంటనే అతని నోరు, నాలుక కదిలి బాగైపోయింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. 65 ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ నిండుకుపొయ్యాయి. యూదయ పర్వత ప్రాంతమంతా ఈ వార్త వ్యాపించింది. 66 ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది.

జెకర్యా చెప్పిన భవిష్యం

67 ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు:

68 “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి!
    ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
69 మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి
    మనకోసం పంపాడు.
70 గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా
    ఈ విషయం చెప్పాడు.
71 దేవుడు శత్రువుల బారినుండి,
    మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
72 మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు.
    పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
73 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
74     మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
75     జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!

76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు!
    ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
77 పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!

78 “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి
    ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
79 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి
మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”

80 ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International