M’Cheyne Bible Reading Plan
యోషీయా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట
22 యోషీయా పరిపాలనకు వచ్చేనాటికి, అతను ఎనిమిదేండ్లవాడు. యెరూషలేములో అతను 31 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతుకి చెందిన అదయా కుమార్తె. 2 యెహోవా మంచివని చెప్పిన పనులు యోషీయా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదు వలె, యోషీయా దేవుని అనుసరించాడు. దేవుడు ఆశించిన విధంగా యోషియా దేవుని బోధనలు పాటించాడు.
ఆలయ మరమ్మతుకి యోషీయా ఆజ్ఞాపించుట
3 యోషీయా రాజుగా వున్న 18వ సంవత్సరాన, అతను కార్యదర్శి అయిన మెఘల్లాము కొడుకైన అజల్యా కుమారుడు షాఫానును యెహోవా యొక్క ఆలయానికి పంపాడు. 4 “ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా వద్దకు వెళ్లుము. యెహోవా ఆలయానికి ప్రజలు తీసుకువచ్చిన ధనాన్ని ఎంచమని చెప్పుము. ప్రజల వద్దనుంచి ద్వారపాలకులు ఆ ధనము వసూలు చేశారు. 5 యెహోవా ఆలయము మరమ్మతుల కోసము పనివారికి ఆ ధనాన్ని యాజకులు వినియోగించాలి. యెహోవా ఆలయాన్ని పర్యవేక్షించే వారికి యాజకులు ఆ డబ్బు ఇవ్వాలి. 6 ఆ డబ్బును వడ్రంగులకు, రాయి బ్రద్దలు చేసేవారికి, రాతి పనివారికి ఆ డబ్బు ఉపయోగించబడాలి. ఆలయము కోసము కలపకొనేందుకు రాళ్లు కొనేందుకు ఆ డబ్బు వినియోగము కావాలి. 7 పనివారికి ఇచ్చే ధనాన్ని లెక్కించవద్దు. పనివారు నమ్మదగిన వారు” అని యోషీయా చెప్పాడు.
ఆలయంలో ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడుట
8 ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శి అయిన షాఫానుతో, “యెహోవా ఆలయములో నేను ధర్మశాస్త్ర గ్రంథము కనుగొన్నాను” అని చెప్పాడు. హిల్కీయా ఆ పుస్తకము షాఫానుకి ఇవ్వగా, షాఫాను అది చదివాడు.
9 కార్యదర్శి షాఫాను యోషీయా రాజు వద్దకు పోయి జరిగిన విషయము చెప్పాడు. “నీ సేవకులు ఆలయములో వున్న ధనమునంతా పోగుజేశారు. యెహోవా ఆలయాన్ని పరీక్షించేవారికి ఆ ధనమును వారు ఇచ్చివేశారు.” అని షాఫాను చెప్పాడు. 10 తర్వాత షాఫాను కార్యదర్శి రాజుతో, “మరియు ప్రధాన యాజకుడు హిల్కీయా నాకు ఈ గ్రంథము ఇచ్చాడు” అని పలికాడు. తర్వాత షాఫాను రాజుకు ఆ పుస్తకము చదివి వినిపించాడు.
11 రాజు ఆ ధర్మశాస్త్ర గ్రంథములోని మాటలు వినగానే, తాను తలక్రిందులైనాననీ, విచారం చెందినాననీ తెలిపేందుకు తన వస్త్రాలు చింపుకొన్నాడు. 12 తర్వాత రాజు యాజకుడు హిల్కీయాకు కార్యదర్శి షాఫానుకు, అతని కుమారుడు అహీకాముకు, మీకాయా కుమారుడు అక్బోరుకు, రాజు సేవకుడు అశాయాకు ఆజ్ఞ ఇచ్చాడు. 13 యోషీయా రాజు, “వెళ్లి మనమేమి చేయాలో యెహోవాని అడుగు. నా కోసము, ప్రజల కోసము, యూదా మొత్తానికి యెహోవాని అడుగుము. ఈ పుస్తకములోని మాటలు గురించి అడుగు. యెహోవా మనపట్ల కోపంగా వున్నాడు. మన పూర్వీకులు ఈ పుస్తకములోని మాటలు పాటించక పోవడంవల్ల. మనకోసము వ్రాయబడిన అన్ని ఆజ్ఞలను మనము పాటించలేదు” అని చెప్పాడు.
యోషీయా మరియు ప్రవక్త్రి అయిన హుల్దా
14 అందువల్ల హిల్కీయా యాజకుడు, అహికాము, అక్బోరు, షాఫాను మరియు అశాయా స్త్రీ ప్రవక్త అయిన హుల్దా వద్దకు వెళ్లారు. హర్హను కుమారుడు తిక్వా కుమారుడైన షల్లూము భార్యయే హుల్దా. అతను యాజకుల వస్త్రాలను జాగరూకతతో చూస్తున్నాడు. హుల్దా యెరూషలేములో రెండవ ప్రదేశంలో నివసిస్తున్నది. వారు హుల్దా వద్దకు పోయి మాట్లాడారు.
15 తర్వాత హుల్దా వారితో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు. నా వద్దకు పంపిన మనిషితో చెప్పు. 16 యెహోవా ఇలా చెప్పుచున్నాడు. ఇక్కడ నివసించే ప్రజలకు, ఈ స్థలానికి నేను ఇబ్బంది తెస్తున్నాను. యూదా రాజు చదివిన పుస్తకములో ఈ కష్టాలు లేక ఇబ్బందులు సూచించబడ్డవి. 17 యూదా ప్రజలు నన్ను విడిచి పెట్టారు. ఇతర దేవుళ్లకు ధూపము వేశారు. వారు నాకు మహా కోపము తెప్పించారు. వారు ఎక్కువ విగ్రహాలు తయారు చేశారు. అందువల్ల ఈ స్ధలము పట్ల నా కోపమును ప్రదర్శిస్తాను. నా కోపము ఆర్పశక్యము కానట్టి నిప్పు వంటిది.”
18-19 “యూదా రాజైన యోషీయా యెహోవా యొక్క సలహా తెలుసుకొనుమని నిన్ను పంపాడు. యోషీయాకు విషయాలు చెప్పు. నీవు వినే ఈ మాటలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. నేనీ స్థలమును గురించీ, ఇక్కడ నివసించే వారిని గురించీ చెప్పిన మాటలు నీవు విన్నావు. నీ హృదయము మృదువైనది. ఈ విషయాలు వినగానే నీవు విచారించావు. ఈ ప్రదేశానికి (యెరూషలేము) భయంకర సంఘటనలు జరుగుతాయని నేను చెప్పాను. నీ విచారాన్ని తెలుపడానికి నీ వస్త్రాలు చింపావు. నీవు విలపించ సాగావు. అందువల్లనే నేను విన్నాను. యెహోవా ఇది చెప్పుచున్నాడు. 20 నీ పూర్వికులతో వుండడానికి నేను నిన్ను తీసుకువస్తాను. నీవు మరణిస్తావు. ప్రశాంతంగా నీవు నీ సమాధి చేరతావు. అందువల్ల నేను ఈ ప్రదేశానికి (యెరూషలేము) తెచ్చు కష్టాలను నీ కండ్లు చూడవు.”
అప్పుడు యాజకుడు హిల్కీయా, అహికాము, అక్బోరును, షాఫాను, మరియు యోషీయా రాజుకు ఆ సందేశము చెప్పారు.
4 దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. 2 ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది. 3 సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము.
“నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను:
‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను’”(A)
అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. 4 కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను”(B) అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. 5 దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.
6 ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేకపొయ్యారు. 7 అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు:
“ఈ రోజు మీరాయన స్వరం వింటే,
మూర్ఖంగా ప్రవర్తించకండి.”(C)
8 యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. 9 అందువల్ల, దేవుని ప్రజల కోసం “విశ్రాంతి” కాచుకొని ఉంది. 10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు. 11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.
12 దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది.
యేసు గొప్ప ప్రధాన యాజకుడు
14 పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. 16 అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.
మిడుతలు పంటలను పాడుచేయుట
1 పెతూయేలు కుమారుడైన యోవేలు ఈ సందేశాన్ని యెహోవా దగ్గరనుండి అందుకొన్నాడు:
2 నాయకులారా, ఈ సందేశం వినండి!
దేశంలో నివసించే మనుష్యులారా, మీరందరూ నామాట వినండి.
మీ జీవితకాలంలో ఇలాంటిది ఏదైనా ఇదివరకు జరిగిందా?
లేదు! మీతండ్రుల కాలంలో ఇలాంటిది ఏదైనా జరిగిందా? లేదు!
3 ఈ సంగతులను గూర్చి మీరు మీ పిల్లలతో చెపుతారు.
మీపిల్లలు వారి పిల్లలతో చెపుతారు.
మీ మనుమలు, మనుమరాండ్రు తమ తరువాత తరమువారితో చెపుతారు.
4 కోత మిడుతలు విడిచిపెట్టినదానిని
దండు మిడుతలు తినేస్తాయి
దండు మిడుతలు విడిచిపెట్టినదానిని
దూకుడు మిడుతలు తినేస్తాయి.
దూకుడు మిడుతలు విడిచిపెట్టినదానిని
వినాశ మిడుతలు తినేశాయి!
మిడుతలు—పెద్ద దండు
5 మద్యపాన మత్తులారా, మేల్కొని, ఏడ్వండి!
ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి.
ఎందుకంటే, మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపోయింది.
ఆ ద్రాక్షామద్యం మరో గుక్కెడు మీకు దొరకదు.
6 నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒక పెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది.
వారు లెక్కించ శక్యం కానంతమంది సైనికులు ఉన్నారు.
ఆ మిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా చీల్చివేయగలవు!
అది వారికి సింహపుకోరలు ఉన్నట్టుగా ఉంటుంది.
7 నా ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపళ్ళు అన్నింటినీ
ఆ “మిడుతలు” తినేస్తాయి!
అవి నా అంజూరపు చెట్లను నాశనం చేస్తాయి.
మిడుతలు నా చెట్ల బెరడును తినేస్తాయి.
కొమ్మలు తెల్లబారి పోతాయి.
చెట్లు నాశనం చేయబడతాయి.
ప్రజలు దుఃఖించుట
8 పెళ్లికి సిద్ధంగా ఉండి, తనకు కాబోయే భర్త
అప్పుడే చంపి వేయబడగా, ఒక యువతి ఏడ్చేలా ఏడ్వండి.
9 యాజకులారా! యెహోవా సేవకులారా! ఏడ్వండి.
ఎందుకంటే యెహోవా ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇక ఉండవు.
10 పొలాలు పాడుచేయబడ్డాయి.
చివరికి నేలకూడా విలపిస్తుంది.
ఎందుకనగా ధాన్యం పాడైపోయింది.
కొత్త ద్రాక్షారసం ఎండిపోయింది.
ఒలీవ నూనె ఇకలేదు.
11 రైతులారా! విచారించండి.
ద్రాక్షాతోట రైతులారా! గట్టిగా ఏడ్వండి.
గోధుమ, యవల[a] కోసం ఏడ్వండి!
ఎందుకంటే పొలంలోని పంట నష్టమైంది.
12 ద్రాక్షావల్లులు ఎండిపోయాయి.
అంజూరపుచెట్టు చస్తోంది.
దానిమ్మ చెట్టు, ఖర్జూరపుచెట్టు,
జల్దరు[b] చెట్టు, పొలములోని చెట్లు అన్నీ ఎండిపోయాయి.
ప్రజల్లో సంతోషం చచ్చింది.
13 యాజకులారా, మీ విచార సూచక వస్త్రాలు ధరించి గట్టిగా ఏడ్వండి.
బలిపీఠపు సేవకులారా, గట్టిగా ఏడ్వండి.
నా దేవుని సేవకులారా, మీరు మీ విచారసూచక వస్త్రాలతోనే నిద్రపోతారు.
ఎందుకంటే, దేవుని ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇకమీదట ఉండవు.
మిడుతల భయంకర నాశనం
14 ఉపవాసం ఉండాల్సిన ఒక ప్రత్యేక సమయం ఉంటుందని ప్రజలతో చెప్పు. ప్రత్యేకమైన ఒక సమావేశం కోసం ప్రజల్నిపిలువుము. దేశంలో నివసిస్తున్న నాయకులను, ప్రజలందరిని సమావేశ పరచు. నీదేవుడైన యెహోవా ఆలయానికి వారిని తీసుకొనివచ్చి యెహోవాకు ప్రార్థించండి.
15 దుఃఖపడండి! ఎందుకంటే, యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది. ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరనుండి శిక్ష ఒక దాడిలా వస్తుంది. 16 మన ఆహారం పోయింది. మన దేవుని ఆలయంనుండి ఆనందం, సంతోషం పోయాయి. 17 మనం విత్తనాలు విత్తాం, కాని ఆ విత్తనాలు ఎండిపోయి, చచ్చి, మట్టిలో పడివున్నాయి. మన మొక్కలు ఎండిపోయి, చచ్చిపోయాయి. మన కొట్టాలు ఖాళీ అయిపోయి పడిపోతున్నాయి.
18 జంతువులు ఆకలితో మూలుగుతున్నాయి. పశువుల మందలు గందరగోళంగా తిరుగుతున్నాయి. అవి మేసేందుకు గడ్డి లేదు. గొఱ్ఱెలు చస్తున్నాయి. 19 యెహోవా, సహాయంకోసం నీకు నేను మొరపెడుతున్నాను. అగ్ని మా పచ్చటి పొలాలను ఎడారిగా మార్చేసింది. పొలంలోని చెట్లన్నింటినీ జ్వాలలు కాల్చివేశాయి. 20 అడవి జంతువులకు కూడ నీ సహాయం కావాలి. కాలువలు ఎండిపోయాయి. నీళ్ళు లేవు. మా పచ్చటి పొలాలను అగ్ని ఎడారిగా మార్చివేసింది.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
140 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రుల నుండి నన్ను కాపాడుము.
2 ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
3 వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.
4 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
5 ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు.
నా దారిలో వారు ఉచ్చు పెడతారు.
6 యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
7 యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
8 యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
వారి పథకాలు నెగ్గనీయకు.
9 యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
నా శత్రువులను అగ్నిలో పడవేయుము.
వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము.
ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు.
నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.
దావీదు స్తుతి కీర్తన.
141 యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము.
త్వరపడి నాకు సహాయం చేయుము.
2 యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము.
నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.
3 యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము.
నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
4 నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు.
చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము.
చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను భాగస్థుడను కాకుండా చేయుము.
5 ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు.
అది నాకు మంచిదే.
వారి విమర్శను నేను అంగీకరిస్తాను.
నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.
6 ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు.
అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.
7 మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది.
అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడతాయి.
8 యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను.
నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.
9 ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము.
ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
10 నేను హాని లేకుండా తప్పించుకొనగా
ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.
© 1997 Bible League International