Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 19

హిజ్కియా యెషయా ప్రవక్తతో మాటలాడుట

19 ేహిజ్కియా రాజు ఆ విషయములు అన్నియు విన్నాడు. అతను తన వస్త్రాలు చింపుకుని గోనెపట్ట ధరించాడు. (అతను విచారంగాను తలక్రిందులైనట్లుగాను అది తెలుపుతుంది.) తర్వాత అతను యెహోవా ఆలయానికి వెళ్లెను.

హిజ్కియా, ఎల్యాకీము (రాజభవన అధికారి) షెబ్నా (కార్యదర్శి) మరియు యాజకులలో పెద్ద వారిని అమోజు కుమారుడైన యెషయాప్రవక్త వద్దకు పంపాడు. తాము విచారంగాను తలక్రిందులైనట్లుగాను తెలుపడానికి గోనెపట్ట ధరించారు. వారు యెషయాతో ఇలా అన్నారు: “ఇది యిబ్బంది రోజనీ, మేము తప్పు చేసినట్లుగా తెలిపే రోజనీ హిజ్కియా చెప్పుచున్నాడు. పిల్లలు పుట్టుటకు ఇది సమయము, అయితే వారికి పుట్టుక ఇచ్చేందుకు తగిన బలము లేదు. అష్షూరు రాజుయొక్క సైన్యాధిపతి సజీవుడైన దేవుని గురించి చెడు విషయాలు చెప్పాడానికి ఇక్కడికి పంపబడియున్నాడు. మీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆ విషయములు వినవచ్చు. యెహోవా ఆ విరోధిని శిక్షించవచ్చు. కనుక ఇంకా మిగిలివున్న వారికోసము ప్రార్థన చేయండి.”

హిజ్కియా రాజుయొక్క అధికారులు యెషయా వద్దకు వెళ్లారు. “మీ యాజమాని అయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి. యెహోవా ఇలా చెప్పుచున్నాడు అష్షూరు రాజు, అధికారులు నన్ను ఎగతాళి చేయడానికి మీకు చెప్పిన విషయాలు విని మీరు భయపడవద్దు. నేనతనిలో ఒక ఆత్మను ప్రవేశపెడుతున్నాను. అతను ఒక వందతి వింటాడు. అప్పుడతను తన దేశానికి తిరిగి పారిపోతాడు. అతని దేశంలోనే ఒక ఖడ్గంతో అతను చంపబడేలా నేను చేస్తాను” అని యెషయా వారితో చెప్పాడు.

అష్షూరు రాజు మరల హిజ్కియాని హెచ్చరించుట

అష్షూరు రాజు లాకీషు విడిచి వెళ్లినట్లు ఆ సైన్యాధిపతి తెలుసుకున్నాడు. అందువల్ల అతను తన రాజు లిబ్నాకి విరుద్ధముగా పోరు సలుపుతున్నట్లు చూశాడు. అష్షూరు రాజు కూషు రాజైన తిర్హకా గురించి ఒక వదంతి విన్నాడు. “తిర్హకా నీతో యుద్ధము చేయడానికి వచ్చాడు” అన్నదే ఆ వదంతి.

అందువల్ల అష్షూరు రాజు మరల హిజ్కియా వద్దకు దూతలను పంపించాడు. ఆ దూతలకు ఈ సందేశం ఇచ్చాడు. ఈ విషయాలు తెలియజేశాడు. 10 “యూదా రాజయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి.

‘నీవు విశ్వసించే దేవుడు నిన్ను అవివేకిగా చేసే విధంగా చేయకు. అష్షూరు రాజు యెరూషలేముని ఓడించలేడు; అని అతడు చెప్పుచున్నాడు గదా. 11 అష్షూరు రాజులు ఇతర దేశాలకు వ్యతిరేకంగా చేసిన పనులు నీవు వినియుంటావు. మేము వారిని సర్వ నాశనం చేశాము. నీవు కాపాడుదువా? లేదు. 12 ఆ దేశాల దేవుళ్లు ఆ ప్రజలను కాపాడలేదు. నా పూర్వికులు వారిని సర్వనాశనము చేశారు. వారు గోజాను, హారాను, రెజెపులు తెలశ్శారులోని ఏదోను ప్రజలను నాశనం చేశారు. 13 హమాతు రాజు ఎక్కడ? అర్పాదు రాజు ఎక్కడ? సెపర్వయీము రాజు? హేనా, ఇవ్వా రాజులు? అందురూ ముగింపబడ్డారు.’”

హిజ్కియా యెహోవాని ప్రార్థించుట

14 అష్షూరు రాజు దూతలనుండి వచ్చిన ఉత్తరాలు హిజ్కియా చదివాడు. అప్పుడు హిజ్కియా యెహోవా ఆలయము వద్దకు వెళ్లి, యెహోవా ముందు ఆ ఉత్తరాలు వుంచాడు. 15 హిజ్కియా యెహోవాని ప్రార్థించాడు: “ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, కెరూబుల నడుమ రాజుగా ఆసీనుడవై వున్నావు. దేవుడివి నీవే, ప్రపంచంలోని అన్ని రాజ్యాలకూ నీవే దేవుడివి. నీవు పరలోకము, భూమిని చేశావు. 16 ప్రభువా, నా మొర విను, ప్రభువా, కళ్లు తెరువు, ఈ ఉత్తరాలు చూడు. సన్హరీబు సజీవుడైన దేవుని అవమానిస్తూ చెప్పిన మాటలు విను. 17 అది నిజము, ప్రభూ. ఆ దేశాలను అష్షూరు రాజులు నాశనం చేశారు. 18 ఆ జనాంగాల దేవుళ్లను వారు అగ్నిలోకి కాల్చివేశారు. కాని వారు నిజమైన దేవుళ్లు కారు. వారు కేవలము రాయి, కర్రలతో, మనుష్యులు చేసిన ప్రతిమలు. 19 కనుక ఇప్పుడు, మా దేవుడువైన యెహోవా, మమ్ము అష్షూరు రాజునుండి కాపాడుము. అప్పుడు భూమిమీది అన్ని రాజ్యములు యెహోవావైన నీవే దేవుడవని తెలుసుకుంటాయి.”

దేవుడు హిజ్కియాకు సమాధానమిచ్చుట

20 ఆమోజు కొడుకైన యెషయా హిజ్కియాకి ఈ సందేశము పంపించాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిది చెప్పుచున్నాడు, అష్షూరు రాజు సన్హెరీబుకి విరుద్ధంగా నీవు నన్ను ప్రార్థించావు. అది నేను విన్నాను.

21 “యెహోవా సన్హెరీబును గూర్చి ఇచ్చిన సందేశము: ఈ విధంగా ఉంది:

‘సీయోను (యెరూషలేము) కుమార్తె అయిన ఆ కన్య నీవు ముఖ్యుడవుకాదని భావిస్తున్నది.
    ఆమె నిన్ను ఎగతాళి చేస్తున్నది.
    యెరూషలేము కుమార్తె నీ వెనుక తన తల ఆడిస్తున్నది.
22 కాని నువ్వెవరిని అవమానించి యెగతాళి చేసావు?
    నీవు ఎవరికి విరుద్ధంగా మాట్లాడినావు?
నీవు ఇశ్రాయేలు పవిత్రునికి ప్రతికూలుడిగా వచ్చావు
    నీవు ఆయన కంటె మంచివాడివిగా ప్రవర్తించావు.
23 నీ దూతల ద్వారా యెహోవాను అవమానించి నీవు ఇలా చెప్పావు:
    “ఉన్నత పర్వతాలకు నేను వచ్చాను నా పెక్కు రథాలతో నేను లెబానోను లోపలికి వచ్చాను
    నేను ఉన్నత దేవదారుల వృక్షాలు మరియు లెబానోనులోని ఉత్తమ సరళ వృక్షాలను చేధించాను.
    పచ్చని అడవికి నేను వెళ్లాను. అదియె లెబానోనులోని ఉన్నత భాగము.
24 నూతన ప్రదేశాలలో నేను బావులు తవ్వాను
    మంచినీళ్లు తాగితిని ఈజిప్టు నదులను ఎండించాను.”
25 ఆ దేశము మీదుగా నడిచాను అదే నీవు చెప్పింది, కాని నీవు దేవుడు చెప్పింది వినలేదా?
నేను (దేవుడు) పూర్వమే పథకము వేశాను
    ప్రాచీన కాలం నుండి పథకం వేశాను
    ఇప్పుడది జరుగునట్లు చేశాను
బలిష్ఠమైన ఆ నగరాలు నాశనము చేయుటకును
    రాతి కుప్పలుగా మార్చుటకును నిన్ను అనుమతించాను.
26 నగరాలలో ఉన్నవారు శక్తివిహీనులు వారు
    భీతావహులు గందరగోళంలో ఉన్నావారు
క్ష్రేత్రంలోని పచ్చికలా మొక్కలవలె వారు ఛేదింపదగిన వారు.
వాడుటకు పూర్వము పెరగని విధంగా ఇండ్ల
    కప్పుల మీద పెరిగే పచ్చికవారు.
27 నీవు ఎప్పుడు క్రింద కూర్చుంటావో నాకు తెలియును.
    నీవు యుద్ధానికి వెళ్లడం నాకు తెలుసు
    నీవు ఇంటి దగ్గర ఉండినప్పుడు
నా పట్ల విసుగు చెందినది తెలుసును.
28 అవును. నీవు నాపట్ల విసుగు చెందితివి
    నీ గర్వపు నిందా వాక్యాలు నేను విన్నాను
అందువల్ల నీ ముక్కుకు గాలం వేస్తున్నాను
    నీ నోటికి నా కళ్లెము తగిలిస్తున్నాను ఆ
తర్వాత నిన్ను వెనుకకు మరల్చి
    నీవు వచ్చిన తోవనే నడిపిస్తాను.’”

హిజ్కియాకు యెహోవా సందేశము

29 తర్వాత యెషయా హిజ్కియాతో ఈలాగు చెప్పెను. “నీకు సహాయము చేయనున్నందుకు ఇది ఒక గుర్తు. ఈ సంవత్సరము తనంతట తానే పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. ఆ మరు సంవత్సరము గింజనుండి పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. కాని ఆ మూడో సంవత్సరము నీవు నాటిన గింజలనుండి లభించే ధాన్యము నీవు భుజిస్తావు. నీవు ద్రాక్షా పొలాలు సాగుచేసి, లభించే ఆ ద్రాక్షలు భుజిస్తావు. 30 తప్పించుకున్న ప్రజలు, యూదా వంశంలో మిగిలిన వారు మరల పండించడము మొదలు పెడతారు. 31 కొద్దిమంది సజీవులై వుంటారు, కనుక వారు యెరూషలేమును విడిచి వెళతారు. తప్పించుకున్న ప్రజలు సీయోను కొండలో నుండి వెలుపలికి వెళతారు. యెహోవా యొక్క గాఢాభిప్రాయం అలా చేస్తుంది.

32 “అందువల్ల అష్షూరు రాజుని గురించి యెహోవా చెప్పేదేమనగా:

‘అతడీ నగరంలోకి రాడు.
    అతడీ నగరంలో అస్త్రప్రయోగం చెయ్యలేడు.
అతడు తన కవచాలు ఈ నగరానికి తీసుకురాడు.
    నగరములను దాడి చేసేందుకు ముట్టడి దిబ్బను నిర్మించలేడు.
33 అతడు వచ్చిన త్రోవనే తిరిగి వెళ్తాడు.
    అతడీ నగరంలోకి రాలేడు
అని యెహోవా చెప్పుచున్నాడు!
34 నేనీ నగరాన్ని రక్షిస్తాను.
    నేను నా కొరకు ఇది చేస్తాను నా సేవకుడు దావీదు కొరకు కూడా, ఇది చేస్తాను.’”

అష్షూరు సైన్యం నాశనం చేయబడుట

35 రాత్రి, యెహోవా దూత వెలుపలికి పోయి అష్షూరు శిబిరములోని 1,85,000 మందిని చంపాడు. ప్రజలు ఉదయాన మేల్కొనగా, వారు శవాలు చూశారు.

36 అందువల్ల అష్షూరు రాజయిన సన్హెరీబు తిరిగివెళ్లి నీనెవెకి మరలిపోయాడు. అక్కడే అతడు నిలిచాడు. 37 ఒకరోజు సన్హెరీబు తన దేవుడైన నిస్రోకు ఆలయంలో పూజ చేయిస్తూ ఉన్నాడు. అతని కుమారులు అద్రెమ్మెలెకు మరియు షరెజెరు కత్తితో అతనిని చంపారు. అప్పుడు అద్రెమ్మెలెకు మరియు షరెజెరు అరారాతు దేశములోకి తప్పించుకు పోయారు. మరియు సన్హెరీబు కుమారుడు ఎసర్హద్దోను, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

హెబ్రీయులకు 1

దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు, ఎన్నోవిధాలుగా మన పూర్వికులతో మాట్లాడాడు. అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుడు దేవుని మహిమ యొక్క ప్రకాశం. తండ్రి యొక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ పోషించి సంరక్షిస్తున్నాడు. పాపపరిహారం చేసాక ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ, మహా తేజస్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు. ఆయన దేవదూతలకన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన గొప్ప పేరు కూడా వారసత్వంగా పొందాడు. దేవదూతలకన్నా కుమారుడు గొప్పవాడు.

ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు:

“నీవు నా కుమారుడవు,
    నేడు నేను నీ తండ్రినయ్యాను.”(A)

మరొక చోట:

“నేనతనికి తండ్రి నౌతాను.
    అతడు నా కుమారుడౌతాడు.”(B)

మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు:

“దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!”(C)

దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ:

“దేవుడు తన దూతల్ని ఆత్నలుగాను
    తన సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!”(D)

కాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు:

“ఓ దేవా! నీ సింహాసనం చిరకాలం ఉంటుంది.
    నీతి నీ రాజ్యానికి రాజదండంగా ఉంటుంది.
నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు.
    అందువల్ల దేవుడు, నీ దేవుడు ఆనందమనే నూనెతో నిన్ను
    అభిషేకించి నీ స్నేహితులందరి కన్నా నిన్ను అధికంగా గౌరవించాడు.”(E)

10 ఆయనింకా ఈ విధంగా అన్నాడు:

“ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు.
    ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు.
11 అవి నశించి పోతాయి ఒక వస్త్రంలా పాత బడతాయి.
    కాని, నీవు చిరకాలం ఉంటావు.
12 వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు.
    వాటిని నీవు దుస్తులు మార్చినట్లు మారుస్తావు.
కాని నీవు మాత్రం అలాగే ఉంటావు!
    నీ సంవత్సరములకు అంతంలేదు!”(F)

13 దేవుడు ఏ దేవదూతతోనైనా:

“నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసేవరకు
    నా కుడివైపు కూర్చో,”(G)

అని ఎన్నడైనా అన్నాడా? 14 ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్ళను పంపింది?

హోషేయ 12

యెహోవా ఇశ్రాయేలుకు విరోధి

12 “ఎఫ్రాయిమువాళ్లు తమ కాలాన్ని వృథా చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు రోజంతా ‘గాలిని తరుముతున్నారు.’ వాళ్లు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్షూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ నూనెను ఈజిప్టుకి తరలిస్తున్నారు.”

యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకుగాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన వాటినిబట్టి అతన్ని శిక్షించాలి. యాకోబు ఇంకా తన తల్లి కడుపులో ఉండగానే తన సోదరుణ్ణి మోసగించ నారంభించాడు. యాకోబు బలిష్ఠుడైన యువకుడు. అప్పట్లో అతను దేవునితో పోరాడాడు. యాకోబు దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి దేవుణ్ణి ఒక సహాయం చేయమని అడిగాడు. ఇది బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో మాట్లాడాడు. ఔను, యెహోవాయే సర్వసేనాధిపతియైన దేవుడు. ఆయన పేరు యెహోవా (ప్రభువు). అందుకని, మీరు మీ దేవుని వద్దకు తిరిగి రండి. ఆయనకు విధేయులుగా ఉండండి. దయగలవారిగా నీతిమంతులుగా ఉండండి. సదా మీ దేవుని నమ్మండి.

“యాకోబు ఒక వ్యాపారస్థుడు. అతను తన మిత్రుణ్ణి కూడా మోసగిస్తాడు. అతని తక్కెడలు[a] కూడా సరైనవి కావు. ఎఫ్రాయిము ఇలా అనుకున్నాడు: ‘నేను ఐశ్వర్యవంతుణ్ణి! నాకు ధనరాశులు దొరికాయి. నా నేరాల సంగతి ఎవడూ తెలుసుకోడు. నా పాపాల గురించి ఎవడూ తెలుసుకోడు.’

“మీరు ఈజిప్టు దేశంలో ఉన్ననాటినుంచి యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. గుడార సమావేశ[b] కాలంలో మాదిరిగా నేను మిమ్మల్ని గుడారాల్లో నివసింపజేస్తాను. 10 నేను ప్రవక్తలతో మాట్లాడాను. నేను వాళ్లకి అనేక దర్శనాలు ఇచ్చాను. నేను పద్ధతులను సూచించాను. 11 కాని, గిల్గాదు ప్రజలు పాపులు. అక్కడ అనేక క్షుద్ర దేవతా విగ్రహాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు గిల్గాలువద్ద ఎడ్లను బలులుగా ఇస్తారు. వాళ్లకి బలిపీఠాలు అనేకం ఉన్నాయి. దున్నిన పొలంలో బురద చాళ్లు ఉన్నట్లే వాళ్లకి బారులు బారులుగా బలిపీఠాలు ఉన్నాయి.

12 “యాకోబు అరాము దేశంలోకి పారిపోయాడు. అక్కడ, ఇశ్రాయేలు ఒక భార్యకోసం శ్రమపడ్డాడు. మరో భార్యకోసం గొఱ్ఱెల్ని మేపాడు. 13 కాని, యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును ఈజిప్టునుంచి వెనక్కి రప్పించాడు. యెహోవా ఒక ప్రవక్తద్వారా ఇశ్రాయేలును భద్రంగా కాపాడాడు. 14 కాని, ఎఫ్రాయిము యెహోవాకి మిక్కిలి కోపం కలిగించాడు. ఎఫ్రాయిము చాలామందిని హతమార్చాడు. అందుకని, అతను తన నేరాలకుగాను శిక్షింపబడతాడు. అతని ప్రభువు అతన్ని తన సిగ్గును సహించేటట్లుగా చేశాడు.”

కీర్తనలు. 135-136

135 యెహోవాను స్తుతించండి.
    యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
    ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.

యెహోవా యాకోబును కోరుతున్నాడు.
    యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
    మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
    అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
    మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
    దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
    ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
    బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
    బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
    కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
    దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.

13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
    యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
    కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
    వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
    కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
    ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
    ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.

19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
    అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
    యెహోవా స్తుతించబడును గాక!

యెహోవాను స్తుతించండి!

136 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి!
    ఆయన నిజమైన ప్రేమ నిరంతరం ఉంటుంది.
యెహోవా దేవున్ని స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ ఎల్లప్పుడు ఉంటుంది.
జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది.
దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రున్న్, నక్షత్రాలను చేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
10 దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
11 దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
12 దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
13 దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
14 దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నడిపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
15 దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్రసముద్రంలో ముంచివేశాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
16 దేవుడు తన ప్రజలను ఎడారిలో నడిపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
17 దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
18 దేవుడు బలమైన రాజులను ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
19 దేవుడు అమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
20 దేవుడు బాషాను రాజైన ఓగును ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
21 దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
22 దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
23 దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
24 దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
25 దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
26 పరలోకపు దేవుణ్ణి స్తుతించండి!
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International