M’Cheyne Bible Reading Plan
అమాజ్యా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట
14 యూదా రాజయిన యోవాషు కుమారుడైన అమాజ్యా యెహోయాహాజు కొడుకైన యోవాషు ఇశ్రాయేలు రాజుగా వున్న రెండవ సంవత్సరమున యూదాకు రాజయ్యాడు. 2 అమాజ్యా పరిపాలన ప్రారంభించేనాటికి 25 యేళ్లవాడు. యెరూషలేములో అమాజ్యా 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. 3 యెహోవా మెచ్చుకున్న పనులు అమాజ్యా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదువలె అతను పూర్తిగా దేవుని అనుసరించలేదు. తన తండ్రి అయిన యోవాషు చేసిన పనులన్నీ అతను చేశాడు. 4 అతను ఉన్నత స్థానాలను నాశనం చేయలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆ నాటికీ ప్రజలు బలులు అర్పించుచూ, ధూపం వేస్తూ ఉన్నారు.
5 అమాజ్యాకు తన రాజ్యం మీద మంచి అదుపు వున్న ఆ సమయమున, తన తండ్రిని చంపిన అధికారులను అతను చంపాడు. 6 కాని హంతకుల పిల్లలను అతను చంపలేదు. యెహోవా మోషే ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞను ఇచ్చాడు; “తమ పిల్లలు చేసినదానికి వారి తల్లిదండ్రులను చంపకూడదు. తమ తల్లిదండ్రులు చేసిన దానికి వారి పిల్లలను చంపకూడదు. అతనే స్వయంగా చేసిన చెడు పనికి అతనినే చంపవలెను.”(A)
7 అమాజ్యా ఉప్పు లోయలో పదివేల మంది ఎదోము వాళ్లను చంపాడు. యుద్ధంలో అమాజ్యా సెలా అనే స్థలాన్ని “యొక్తయేలు” అని వ్యవహరించాడు. ఆ స్థలం నేటికీ “యొక్తయేలు” అని పిలువ బడుచున్నది.
అమాజ్యా యెహోయాషుకి ప్రతికూలంగా యుద్ధం కోరుకొనుట
8 అమాజ్యా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు వద్దకు దూతల్ని పంపాడు. యెహోయాహాజు ఇశ్రాయేలు రాజయిన యెహూ కుమారుడు. “మనము ముఖాముఖిగా కలుసుకుని యుద్ధం చేద్దాము” అని అమాజ్యా సందేశం పంపించాడు.
9 ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు యూదా రాజయిన అమాజ్యకు తిరిగి వ్రాశాడు. యెహోయాషు ఇలా చెప్పాడు. “లెబానోను దేవదారు చెట్టుకి లెబానోనులోని ముళ్లపొద ఒక సందేశం పంపింది. అది ఏమనగా, నీవు నీ కుమార్తెను నా కుమారుడికి పెళ్లి చేసుకునేందుకు యిమ్ము. కాని లెబానోనులోని ఒక దుష్ట మృగం ఆ త్రోవను వెళుతూ ముళ్లపొద మీద నడిచింది. నీవు ఎదోముని ఓడించిన మాట నిజమే. 10 కాని నీవు ఎదోము మీద పొందిన విజయానికి నీవు గర్వపడుతున్నావు. నీవు ఎదోములో వుండి మిడిసిపడుతున్నావు. ఇంతకు నీవు ఎందుకు ఆపద తెచ్చుకుంటావు. నీవు ఇలా చేస్తే, నీవు పతనంకాగలవు. మరియు యూదా నీతో పాటు నాశనం కాగలదు.”
11 కాని అమాజ్యా యెహోయాషు ఇచ్చిన హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాకు ప్రతి కూలంగా బేత్షెమెషు అనే చోట యుద్ధం చేయడానికి వెళ్లాడు. 12 ఇశ్రాయేలు యూదాను ఓడించాడు. యూదాకు చెందిన ప్రతి వ్యక్తి పారిపోయాడు. 13 బేత్షెమెషు వద్ద ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాను బంధించాడు. అమాజ్యా యెవాషు కుమారుడు. అతను అహజ్యా కుమారుడు. యెహోయాషు అమాజ్యాను యెరూషలేముకు తీసుకువెళ్లాడు. యెహోయాషు ఎఫ్రాయీము ద్వారం నుంచి కోట ద్వారం, 600 అడుగుల యెరూషలేము ప్రాకారమును పగలగొట్టాడు. 14 తర్వాత యెహోయాషు యెహోవా ఆలయం లోని బంగారం, వెండి, వస్తువులను రాజభవనంలోని నిధులను తీసుకుపోయాడు. యెహోయాషు ప్రజలను కూడా తన బందీలుగా తీసుకుపోయాడు. తర్వాత అతను షోమ్రోనుకు తిరిగి వెళ్లాడు.
15 యెహోయాషు చేసిన ఘనకార్యములు యూదా రాజయిన అమాజ్యాతో అతను పోరాడిన విధంతో సహా “ఇశ్రాయేలు రాజ్య చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి వున్నవి. 16 యెహోయాషు మరణించగా, అతనిని అతని పూర్వికులతో పాటు సమాధి చేశారు. ఇశ్రాయేలు రాజులతో పాటుగా షోమ్రోనులో యెహోయాషు సమాధి చేయబడ్డాడు. యెహోయాషు కుమారుడు యరొబాము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
అమాజ్యా మరణం
17 ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు మరణించిన 15 సంవత్సరాల వరకు యూదా రాజయిన యెవాషు కుమారుడు అమాజ్యా బ్రదికాడు. 18 అమాజ్యా జరిగించిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి. 19 యెరూషలేములో ప్రజలు అమాజ్యాకు ప్రతి కూలంగా ఒక పధకం వేశారు. అమాజ్యా లాకీషుకు పారిపోయాడు. కాని ప్రజలు లాకీషుకు అమాజ్యా వెనుకాల కొందరు వ్యక్తులను పంపారు. ఆ వ్యక్తులు లాకీషులో అమాజ్యాను చంపివేశారు. 20 ప్రజలు అమాజ్యా దేహాన్ని గుర్రాల మీద వెనక్కి తీసుకువచ్చి, దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటు అమాజ్యాను సమాధి చేశారు.
అజర్యా యూదా మీద తన పరిపాలన ప్రారంభించుట
21 తర్వాత యూదాలోని మనుష్యులందురు అమాజ్యా కుమారుడైన అజర్యాను క్రొత్త రాజుగా చేశారు. అజర్యా 16 యేండ్లవాడు. 22 అమాజ్యా రాజు మరణించగా, అతని పూర్వికులతో పాటు అతనిని సమాధి చేశారు. తర్వాత అజర్యా ఏలతు పట్టణం మరల నిర్మించి, దానిని యూదాకు స్వాధీన పరిచాడు.
రెండవ యరొబాము ఇశ్రాయేలు మీద తన పరిపాలన ప్రారంభించుట
23 యూదా రాజుగా యోవాషు కుమారుడైన అమాజ్యా పరిపాలనలో 15వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యరొబాము సమరియాలో పరిపాలన ప్రారంభించెను. యరొబాము 41 సంవత్సరాలు పరిపాలించాడు. 24 యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు ఈ యరొబాము చేశాడు. నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలు పాపాలకు కారణమైన ఆ పాపకార్యములను యరొబాము ఆపలేదు. 25 హమాతు నుండి అరబా సముద్రం దాకా వ్యాపించిన ఇశ్రాయేలు దేశమును యరొబాము మరల తీసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన భక్తుడైన అమిత్తయి కుమారుడు యోనాకు చెప్పినట్లు ఇది జరిగింది. అమిత్తయి గత్హేపెరు నుండి వచ్చిన ఒక ప్రవక్త. 26 ఇశ్రాయేలు వారందరికీ చాలా ఇబ్బందులున్నాయని యెహోవా చూశాడు. బానిసలు, స్వతంత్రులూ వున్నారని చూశాడు. ఇశ్రాయేలుకు సహాయం చేయదగిన వ్యక్తి ఎవరూ లేరు. 27 ప్రపంచంలో ఇశ్రాయేలు అన్న పేరుని తీసివేస్తానని యెహోవా చెప్పలేదు. అందువల్ల యెహోవా యెహోయాషు కుమారుడైన యరొబాముని ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు ఏర్పాటు చేసాడు.
28 యరొబాము చేసిన ఘనకార్యాలన్ని “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. ఇశ్రాయేలుకు గాను దమస్కు మరియు హమాతులను యరొబాము తిరిగి పొందిన కథకూడా ఇందులో పొందుపరచబడింది. (ఈ నగరాలు యూదాకి చెందినవి). 29 యరొబాము మరణించగా, ఇశ్రాయేలీయుల రాజులైన అతని పూర్వికులతో పాటుగా అతను సమాధి చేయబడ్డాడు. యరొబాము కుమారుడైన జెకర్యా, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
4 చనిపోయినవాళ్ళపై, బతికివున్నవాళ్ళపై తీర్పు చెప్పే దేవుని సమక్షంలో యేసు క్రీస్తు సమక్షంలో నీకొక ఆజ్ఞ యిస్తున్నాను. ఆయన ప్రత్యక్షం కానున్నాడు కనుక, ఆయన రాజ్యం రానున్నది కనుక, నీకీ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను. 2 దైవసందేశాన్ని ప్రకటించు. అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండు. తప్పులు సరిదిద్దుతూ, అవసరమైతే గద్దిస్తూ, ప్రోత్సాహమిస్తూ, సహనంతో బోధిస్తూ ఉండు.
3 ప్రజలు మంచి ఉపదేశాలు వినటం మానివేసే సమయం వస్తుంది. వాళ్ళు తమ యిష్టం వచ్చినట్లు చేస్తారు. తాము వినదల్చిన లౌకికమైన వాటిని చెప్పగలిగే పండితుల్ని తమ చుట్టూ ప్రోగుచేసుకొంటారు. 4 సత్యం వినటం మాని, కల్పిత సంగతులు వింటారు. 5 కాని అన్ని విషయాల్లో నిగ్రహంగా ఉండు. కష్టాలు ఓర్చుకో. సువార్త ప్రచారం చెయ్యటానికి కష్టించి పనిచెయ్యి. నీ సేవా సంబంధంలో చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తిగా నిర్వర్తించు.
6 నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చింది. 7 ఈ పోటీలో నేను బాగా పరుగెత్తాను. విశ్వాసాన్ని వదులుకోకుండా పందెం ముగించాను. 8 ఇప్పుడు “నీతి” అనే కీరీటం నా కోసం కాచుకొని ఉంది. నీతిగా తీర్పు చెప్పే ప్రభువు “ఆ రానున్న రోజు” దాన్ని నాకు బహుమతిగా యిస్తాడు. నాకే కాక, ఆయన రాక కోసం నిరీక్షిస్తున్నవాళ్ళందరికీ ఆ బహుమతి లభిస్తుంది.
వ్యక్తిగత సలహాలు
9 నా దగ్గరకు త్వరలో రావటానికి సాధ్యమైనంత ప్రయత్నం చెయ్యి. 10 ఎందుకంటే, “దేమా” ప్రపంచం మీద వ్యామోహం వల్ల నన్ను వదిలి థెస్సలొనీకకు వెళ్ళిపొయ్యాడు. క్రేస్కే గలతీయకు వెళ్ళిపొయ్యాడు. తీతు దల్మతియకు వెళ్ళిపొయ్యాడు. 11 లూకా మాత్రము నాతో ఉన్నాడు. మార్కు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నీ వెంట పిలుచుకొని రా. నా ఈ సేవా కార్యక్రమంలో అతని సహాయం నాకు ఉపయోగపడుతుంది. 12 తుకికును ఎఫెసుకు పంపాను.
13 నేను త్రోయలో ఉన్నప్పుడు కర్పు ఇంట్లో నా అంగీ మరిచిపొయ్యాను. దాన్ని, గ్రంథాలను, ముఖ్యంగా తోలు కాగితాల గ్రంథాలను తీసుకొని రా.
14 కంచరి అలెక్సంద్రు నాకు చాలా అపకారం చేసాడు. అతడు చేసిన దానికి ప్రభువు అతనికి తగిన శిక్ష విధిస్తాడు. 15 అతడు మన సందేశాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తాడు కనుక, అతని విషయంలో నీవు కూడా జాగ్రత్తగా ఉండు.
16 నా విషయంలో మొదటి సారి విచారణ జరిగినప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. అందరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపొయ్యారు. దేవుడు వాళ్ళను క్షమించు గాక! 17 నా ద్వారా సువార్త ప్రకటింపబడాలని యూదులు కానివాళ్ళందరు వినాలని ప్రభువు నా ప్రక్కన నిలబడి నాకు శక్తినిచ్చాడు. సింహాల నోటినుండి నన్ను కాపాడాడు. 18 ప్రభువు నాకు ఏ విధమైన కీడు సంభవించకుండా నన్ను కాపాడి, క్షేమంగా పరలోకంలో ఉన్న తన రాజ్యానికి పిలుచుకు వెళ్తాడు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
19 ప్రిస్కిల్లను, అకులను, ఒనేసిఫోరు కుటుంబం వాళ్ళకు నా వందనాలు చెప్పు. 20 ఎరస్తు కొరింథులోనే ఉండిపొయ్యాడు. త్రోఫిము జబ్బుతో ఉండటం వల్ల అతణ్ణి మిలేతులో వదలవలసి వచ్చింది. 21 చలి కాలానికి ముందే నీవిక్కడికి రావటానికి గట్టిగా ప్రయత్నించు.
యుబూలు, పుదే, లిను, క్లౌదియ మరియు మిగతా సోదరులందరు నీకు వందనాలు చెప్పుచున్నారు.
22 ప్రభువు నీ ఆత్మకు తోడైయుండునుగాక! దైవానుగ్రహం నీపై ఉండుగాక!
7 “ఇశ్రాయేలును నేను స్వస్థపరుస్తాను!
ఎఫ్రాయిము యొక్క పాపంగూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
సమరయ అబద్ధాలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
ఆ పట్టణంలో వచ్చి పోయే దొంగలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
2 ఆ ప్రజల నేరాలను నేను జ్ఞాపకం ఉంచుకొంటానని వారు నమ్మరు.
వారు చేసిన చెడ్డపనులు చుట్టూరా ఉన్నాయి.
వారి పాపాలను నేను తేటగా చూడగలను.
3 ఇశ్రాయేలు చేసే చెడ్డపనులు వాళ్ల రాజులను సంతోషపెడ్తాయి.
వాళ్లు చెప్పే అబద్ధాలు వాళ్ల నాయకులను సంతోషపెడ్తాయి.
4 రొట్టెలు చేసేవాడు రొట్టె చేసేందుకు పిండి పిసుకుతాడు.
అతడు రొట్టెను పెనంమీద వేస్తాడు.
రొట్టె పొంగుతున్నప్పుడు
అతడు మంట ఎక్కువ చేయడు.
కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రొట్టెలు చేసేవానిలాగ లేరు.
ఇశ్రాయేలు ప్రజలు వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు.
5 మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. వారు తాగుడు విందులు చేస్తారు.
ద్రాక్షామద్యపు వేడి మూలంగా పెద్దలు రోగులవుతారు.
కనుక దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలతో రాజులు చేతులు కలుపుతారు.
6 ప్రజలు రహస్య పథకాలు వేస్తారు.
వారి హృదయాలు పొయ్యివలె ఉద్రేకంతో మండుతాయి.
వారి కోపం రాత్రి అంతా మండుతుంది.
మర్నాడు ఉదయం అది బహు వేడిగల నిప్పువలె ఉంటుంది.
7 వాళ్లంతా మండుచున్న పొయ్యిలాంటి వాళ్లు.
వారు వారి పాలకులను నాశనం చేశారు.
వారి రాజులంతా పతనం అయ్యారు.
వారిలో ఒక్కడు కూడా సహాయం కోసం నన్ను అడుగలేదు.”
ఇశ్రాయేలు, ఇతర జనాంగాలు
8 “ఎఫ్రాయిము రాజ్యాలతో కలిసిమెలిసి ఉంటుంది.
ఎఫ్రాయిము రెండు వైపులా కాలని రొట్టెలా ఉంది.
9 పరాయివాళ్లు ఎఫ్రాయిము బలాన్ని నాశనం చేస్తారు.
కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు.
ఎఫ్రాయిము తలమీద తెల్లవెంట్రుకలు ఉన్నాయి,
కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు.
10 ఎఫ్రాయిము గర్వం అతనికి విరోధంగా మాట్లాడుతుంది.
ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు కలిగాయి.
అయినప్పటికీ వారు తమ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లలేదు.
ప్రజలు సహాయంకోసం ఆయనవైపు చూడలేదు.
11 కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు.
ప్రజలు సహాయంకోసం ఈజిప్టును పిలిచారు.
సహాయంకోసం ప్రజలు అష్షూరు వెళ్లారు.
12 సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు.
కానీ నేను వారిని వలలో పడవేస్తాను.
వారి మీద నేను నా వల విసిరి,
ఆకాశపక్షుల్లాగ నేను వారిని కిందికి దించుతాను.
వారి ఒడంబడిక[a] విషయంలో నేను వారిని శిక్షిస్తాను.
13 అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టేశారు.
నాకు విధేయులగుటకు వారు నిరాకరించారు. కనుక వారు నాశనం చేయబడతారు.
ఆ ప్రజలను నేను రక్షించాను.
కానీ వారు నాకు విరోధంగా అబద్ధాలు చెబుతారు.
14 అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు.
వారు ఇతరుల భూములలో ధాన్యం,
కొత్త ద్రాక్షారసం కోసం తిరిగేటప్పుడు వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధనలో భాగంగా వారిని వారు కోసుకొంటారు.
కాని వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి పోయారు.
15 నేను వారికి బుద్ధి వచ్చేటట్లు చేసి, వారి చేతులను బలపర్చాను.
కానీ వారు నాకు విరోధంగా దుష్ట పన్నాగాలు పన్నారు.
16 దేవుళ్లు కానివారివైపు (బయలు దేవత) వారు తిరిగారు.
వారు అక్కరకు రాని (వంగని) విల్లులా ఉన్నారు.
వారి నాయకులు తమ బలాన్ని గూర్చి అతిశయించారు.
కానీ వారు కత్తులతో చంపబడతారు.
అప్పుడు ఈజిప్టు ప్రజలు వారిని చూచి నవ్వుతారు.
విగ్రహారాధన నాశనానికి దారి తీస్తుంది.”
యాత్ర కీర్తన.
120 నేను కష్టంలో ఉన్నాను.
సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను.
ఆయన నన్ను రక్షించాడు.
2 యెహోవా, మోసకరమైన నాలుకనుండి,
నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.
3 అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా?
మీరేమి పొందుతారో మీకు తెలుసా?
4 మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని,
మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.
5 అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది.
అది కేదారు[a] గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది.
6 శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను.
7 నాకు శాంతి కావాలి. అయితే, నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.
యాత్ర కీర్తన.
121 కొండల తట్టు నేను చూసాను.
కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
నాకు సహాయం వస్తుంది.
3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
7 ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
8 నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
దావీదు యాత్ర కీర్తన.
122 “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు
నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
2 ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
3 కొత్త యెరూషలేము
ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
4 దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు.
యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
5 ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది.
దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.
6 యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి.
“యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.
7 నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”
8 నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను,
శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
9 మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం
ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
© 1997 Bible League International