M’Cheyne Bible Reading Plan
అతల్యా యూదాలోని రాజకుమారులందరిని చంపుట
11 అతల్యా అహజ్యా యొక్క తల్లి. తన కుమారుడు చనిపోయినట్లు ఆమె చూసింది. అందువల్ల ఆమె లేచి రాజవంశం అంతటినీ చంపివేసింది.
2 యెహోషెబ రాజైన యెహోరాము యొక్క కుమార్తె. అహజ్యా సోదరి. యోవాషు రాజ కుమారులలో ఒకడు. మిగిలిన పిల్లలు చంపబడినప్పుడు యెహోషెబ యెవాషును తీసుకుని దాచింది. ఆమె యెవాషును అతని దాదిని ఆమె పడక గదిలో ఉంచింది. అందువల్ల యెహోషెబ మరియు దాది అతల్యాకి తెలియకుండా యెవాషును కాపాడారు. ఆ విధంగా యోవాషు మరణించలేదు.
3 తర్వాత యోవాషు మరియు యెహోషెబా యెహోవా యొక్క ఆలయంలో దాగివున్నారు. అక్కడ యోవాషు ఆరు సంవత్సరములు దాగివున్నాడు. మరియు అతల్యా యూదా దేశాన్ని పరిపాలించింది.
4 ఏడవ సంవత్సరమున ప్రధాన యాజకుడయిన యెహోయాదా సైనికుల అధిపతులను కాపలాదారులను రప్పించాడు. యెహోయాదా వారిని యెహోవా ఆలయములో ఒక చోట సమకూర్చాడు. తర్వాత యెహోయాదా వారితో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. ఆలయంలో యెహోయాదా వారిని ఒక వాగ్దానం చేయమని నిర్భందించాడు. అప్పుడు వారికి రాజుగారి కుమారుడైన యెవాషును చూపించాడు.
5 తర్వాత యెహోయాదా వారికొక ఆజ్ఞ విధించాడు. “ఈ పని మీరు చెయ్యాలి. ప్రతి విశ్రాంతి రోజున మీలో ఒక మూడోవంతు రావాలి. మీరు రాజభవనాన్ని కాపలా కాయాలి. 6 రెండో మూడోవంతు సూరు ద్వారం వద్ద వుండాలి. మరియు మరియొక మూడోవంతు కాపలాదారులకు వెనకాల ద్వారం వద్ద వుండాలి. ఈ విధంగా మీరు ఒక గోడవలె యెవాషును రక్షించాలి. 7 ప్రతి విశ్రాంతి రోజు మీలో రెండువంతులు యెహోవా ఆలయాన్ని కాపలా కాయాలి. యెవాషు రాజుని రక్షించాలి. యెవాషు రాజు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్లినా మీరు అతని వెంట వుండాలి. 8 మొత్తం రాజుని అవరించి వుండాలి. ప్రతి కాపలాదారుడు తన ఆయుధాన్ని చేత ధరించి వుండాలి. మీకు మరీ దగ్గరగా వచ్చే ఎవనినైనా మీరు హతమార్చాలి” అని అన్నాడు.
9 యెహోయాదా యాజకుడు ఆజ్ఞాపించిన అన్నిటినీ అధిపతులు పాటించారు. ప్రతి అధిపతి తన మనుష్యులను తీసుకున్నాడు. ఒక బృందమేమో శనివారంనాడు రాజుకు కాపలాగా ఉండాలి. వారం మిగిలిన రోజుల్లో ఇతర బృందాలు రాజుకు కాపలాగా వుండాలి. యెహోయాదా యాజకుని వద్దకు ఆ మనుష్యులందరు వెళ్లారు. 10 మరియు యాజకుడు బల్లెములు, కవచములు అధిపతులకు ఇచ్చాడు. ఆ బల్లెములు కవచములు యెహోవా ఆలయంలో దావీదు ఉంచినవి. 11 ఈ కాపలాదార్లు ఆయుధములు ధరించి ఆలయం కుడి మూలనుంచి మరియు ఆలయం ఎడమ మూలవరకు నిలబడ్డారు. వారు బలిపీఠం, ఆలయం చుట్టూ నిలబడ్డారు. వారు దేవాలయంలో రాజును కాపాడడానికి అతని చుట్టూ నిలబడ్డారు. 12 ఈ మనుష్యులు యోవాషును బయటకు తీసుకొని వచ్చి, అతని తల మీద వారు కిరీటం ఉంచారు. దేవునికీ రాజుకూ మధ్య జరిగిన ఒడంబడికను రాజుకి ఇచ్చారు. తర్వాత వారు అతనిని అభిషేకించి కొత్త రాజుగా చేశారు. “రాజు వర్ధిల్లుగాక!” అని వారు కరతాళ ధ్వనులు చేశారు; నినాదాలు చేశారు.
13 రాణి అతల్యా కాపలాదారులు మరియు ప్రజల నుండి శబ్ధం విన్నది. అందువల్ల ఆమె యెహోవా ఆలయం వద్దనున్న ప్రజల దగ్గరకు వెళ్లింది. 14 అతల్యా మామూలుగా రాజు నిలబడే స్తంభం వద్ద రాజుని చూసింది. రాజుకోసం బాకాలూదే నాయకులను ప్రజలను కూడా ఆమె చూసింది. అందరు మనుష్యులు చాలా సంతోషంగా వున్నట్లు ఆమె చూసింది. బూరలు మ్రోగాయి. ఆమె తలక్రిందులయినట్లుగా తెలుపడానికి తన వస్త్రములు చింపుకొన్నది. తర్వాత అతల్యా, “రాజ ద్రోహం, రాజద్రోహం” అని అరిచింది.
15 సైనికులు అధికారులుగానున్న అధిపతులకు యాజకుడు అయిన యెహోయాదా ఒక ఆజ్ఞ విధించాడు. “ఆలయం వెలుపలికి అతల్యాను తీసుకొని వెళ్లండి. ఆమెనూ, అనుచరులనూ చంపండి. కాని యెహోవా ఆలయంలో వారిని చంపకండి” అని యెహోయాదా వారికి చెప్పాడు.
16 అందువల్ల సైనికులు అతల్యాను లాగివేశారు. అంతఃపురానికి గుర్రాలు వెళ్లే ప్రవేశంగుండా ఆమె వెళ్లేటప్పుడు ఆమెను చంపివేశారు.
17 తర్వాత యెహోయాదా రాజుకు, ప్రజలకు మధ్య ఒక ఒడంబడిక చేశాడు. ఈ ఒడంబడిక రాజు, ప్రజలు యెహోవాకి చెందిన వారని తెలుపుతుంది. యెహోయాదా రాజుకు, ప్రజలకు మధ్య కూడా ఒక ఒడంబడిక చేశాడు. ప్రజలకు రాజు ఏమి చేయాలో ఈ ఒడంబడిక తెలుపుతుంది. ప్రజలు విధేయులై రాజుని అనుసరిస్తారని ఈ ఒడంబడిక తెలుపుతుంది.
18 తర్వాత మనుష్యులు అందరు అసత్య దేవత బయలు ఆలయానికి వెళ్లారు. ఆ మనుష్యులు బయలు విగ్రహాన్ని, అతని బలిపీఠాలను ధ్వంసం చేశారు. వాటిని వారు ముక్కలు ముక్కలుగా చేశారు. ఆ మనుష్యులు బయలు యొక్క యాజకుడు మత్తానును బలిపీఠముల వద్ద చంపివేశారు.
అందువల్ల యాజకుడు అయిన యెహోయాదా యెహోవా ఆలయాన్ని ఆ మనుష్యుల అధికారమున నిర్వహణార్థం ఉంచాడు. 19 యాజకుడు మనుష్యులందరిని నడిపించాడు. వారు యెహోవా ఆలయంనుండి రాజు ఇంటివరకు వెళ్లారు. రాజు ప్రత్యేక కాపలాదార్లు, అధిపతులు రాజుతోపాటు వెళ్లారు. మరియు మనుష్యులందరూ వారిని అనుసరించారు. వారు రాజభవన ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లారు. యెవాషు రాజు సింహాసనం మీద ఉన్నాడు. 20 మనుష్యులు అందరు చాలా సంతోషంగా వున్నారు. నగరం శాంతంగా ఉంది. మరియు రాణి అతల్యా రాజభవనం వద్ద కత్తితో చంపబడింది. 21 యోవాషు రాజయినప్పుడు, అతను ఏడేండ్లవాడు.
యోవాషు పరిపాలన ప్రారంభించుట
12 ఇశ్రాయేలు రాజుగా యెహూ పాలన సాగించిన ఏడవ సంవత్సరంనుండి యోవాషు తన పరిపాలన ప్రారంభించాడు. యెరూషలేములో యోవాషు 40 సంవత్సరములు పాలించాడు. యోవాషు తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా. 2 యెహోవా దృష్టికి సరి అయిన పనులు యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు. 3 కాని అతను ఉన్నత స్థానాలను నాశనం చెయ్యలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆనాటికీ ప్రజలు బలులు అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు.
యోవాషు ఆలయ పునరుద్ధరణకు ఆజ్ఞాపించుట
4-5 “యెహోవా ఆలయంలో చాలా ధనం వున్నది. ప్రజలు ఆలయానికి కొన్ని వస్తువులు సమర్పించారు. వారిని లెక్కించినప్పుడు ప్రజలు ఆలయం పన్ను చెల్లించారు. డబ్బు ఇవ్వాలనే వుద్దేశ్యంతో వారు ఇచ్చారు. యాజకులైన మీరు ఆ ధనం తీసుకొని యెహోవా ఆలయాన్ని బాగు చేయండి. తాను సేవచేసే ప్రజలనుండి లభించే డబ్బును ప్రతి యాజకుడు వినియోగించాలి. యెహోవా ఆలయానికి ఆ డబ్బుతో మంచిపనులు చేయాలి” అని యాజకులకు యోవాషు చెప్పాడు.
6 కాని యాజకులు మరమ్మతులు చేయలేదు. యోవాషు రాజుగావున్న 23వ సంవత్సరమున, యాజకులు అప్పటికి మరమ్మతులు చేయలేదు. 7 అందువల్ల యోవాషు రాజు యెహోయాదా యాజకుని, ఇతర యాజకులను పిలిపించుకున్నాడు. యెవాషు, యెహోయాదా, ఇతర యాజకులతో, “మీరెందుకు ఆలయాన్ని మరమ్మతు చేయలేదు? మీరు సేవించే మనుష్యుల వద్దనుండి మీరు డబ్బును తీసుకోవడం నిలిపివేయండి. ఆ డబ్బును వాడకండి. ఆలయాన్ని మరమ్మతు చేయుటకే అది వినియోగించ బడాలి” అని చెప్పాడు.
8 ప్రజలవద్ద నుండి డబ్బు వసూలు చేయడాన్ని ఆపివేయడానికి యాజకులు సమ్మతించారు. అయితే ఆలయాన్ని బాగు చేయకూడదని నిర్ణయించుకున్నారు. 9 అందువల్ల యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె తీసుకుని దానిమీద ఒక రంధ్రం చేశాడు. తర్వాత యెహోయాదా బలిపీఠపు దక్షిణ దిశగా పెట్టెను ఉంచాడు. ఈ పెట్టె యెహోవా ఆలయానికి ప్రజలు వచ్చే ద్వారానికి ప్రక్కగా వున్నది. కొందరు యాజకులు ఆలయంలోని ఆ ద్వారాన్ని కాపలా కాసారు. యెహోవాకి ప్రజలు సమర్పించిన డబ్బును ఆ యాజకులు తీసుకుని, ఆ పెట్టలో వేశారు.
10 తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు ఆ పెట్టెలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి కార్యదర్శి, ప్రధాన యాజకుడు ఆ పెట్టెలో డబ్బు చాలా ఉండడం చూసివప్పుడు, వారు ఆ పెట్టె నుండి డబ్బు తీసుకొని, ఆ డబ్బును సంచులలో వేసి లెక్కించారు. 11 యెహోవా ఆలయాన పనిచేసే వారికి వారు ఆ డబ్బు ఇచ్చి వేశారు. వడ్రంగులు మరి ఇతర ఆలయ కాపరులకు డబ్బు ఇచ్చారు. 12 రాళ్లు చెక్కే వారికి రాళ్లు మోసేవారికి ఇవ్వడానికి ఆ డబ్బు వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు వారు ఆ డబ్బు వినియోగించారు.
13-14 యెహోవా ఆలయానికి ప్రజలు డబ్బు ఇచ్చారు. కాని యాజకులు ఆ డబ్బును వెండి కప్పులు, దీపాలు వెలిగించేందుకు వుపయోగించే కప్పులు, గిన్నెలు, బూరలు, బంగారం, వెండి పాత్రలు చేసేందుకు వినియోగించలేక పోయారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడింది. ఆ పని వారు యెహోవా ఆలయాన్ని బాగు చేశారు. 15 ఆ డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. ఆ డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని ఏ పనివానిని నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మకస్థులుగా ఉన్నారు.
16 అపరాధ పరిహారార్థ బలులు, పాపపరిహారార్థ బలులు సమర్పించు సమయములో ప్రజలు ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. ఆ డబ్బు యాజకులకు చెందినది.
హాజాయేలు నుండి యోవాషు యెరూషలేమును రక్షించుట
17 సిరియారాజు హాజాయేలు. గాతు నగరానికి ప్రతికూలంగా యుద్ధం చేయడానికి హజాయేలు వెళ్లాడు. హజాయేలు గాతుని ఓడించాడు. తర్వాత అతను యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి నిశ్చయించాడు.
18 యెహోషాపాతు, యెహోరాము, అహజ్యాలు యూదా రాజులుగా వున్నారు. వారు యోవాషు పూర్వికులు. వారు యెహోవాకు చాలా వస్తువులు సమర్పించారు. ఆ వస్తువులు ఆలయంలో ఉంచబడ్డాయి. యోవాషు కూడా చాలా వస్తువులు యెహోవాకు సమర్పించాడు. యోవాషు ఆలయంలోవున్న అన్ని వస్తువులు, బంగారం తీసుకున్నాడు. తన యింట్లో ఉన్న వాటిని కూడా తీసుకున్నాడు. తర్వాత యోవాషు ఆ విలువగల వస్తువులను సిరియా రాజైన హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేమునుండి వెళ్లిపోయాడు.
యోవాషు మరణం
19 యోవాషు చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.
20 యోవాషు అధికారులు అతనికి విరుద్ధంగా పథకం వేశారు. వారు సిల్లాకి వెళ్లే మార్గమున ఉన్న మిల్లో అనే ఇంట్లో యోవాషును చంపివేశారు. 21 షిమాతు కుమారుడైన యోజాకారు[a], షోమేరు కుమారుడైన యెహోజాబాదు యోవాషు అధికారులు. వారు యోవాషుని చంపివేశారు.
దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటుగా యోవాషుని సమాధి చేశారు. యోవాషు కుమారుడైన అమజ్యా అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
క్రీస్తు యేసు యొక్క విధేయ సైనికుడు
2 నా కుమారుడా! యేసు క్రీస్తులోనున్న కృప ద్వారా బలవంతుడుగా నుండు. 2 నేను బోధించిన వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగలవాళ్ళకు, యితరులకు బోధించగల సామర్థ్యము ఉన్నవాళ్ళకు అప్పగించు. 3 యేసు క్రీస్తుకు మంచి సైనికునివలే, మాతో కలిసి విశ్వాసంతో కష్టాలు సహించు. 4 సైనికునిగా పని చేసేవాడు సామాన్య ప్రజల విషయాల్లో తలదూర్చడు. గాని అతడు, తన సైన్యాధిపతిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు. 5 అదే విధంగా ఆట పందెంలో పాల్గొనేవాడు ఆ ఆట నియమాల్ని పాటిస్తే కాని విజయం సాధించలేడు. 6 కష్టించి పని చేసే రైతుకు, వచ్చిన పంటలో భాగము అందరికన్నా ముందు లభిస్తుంది. 7 నేను చెప్పేవాటిని గురించి ఆలోచించు. ప్రభువు నీకు వీటన్నిటిని గురించి తెలుసుకొనే జ్ఞానం కల్గిస్తాడు.
8 దావీదు వంశానికి చెందిన యేసు క్రీస్తు బ్రతికింపబడ్డాడన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను బోధించే సువార్త. 9 ఈ సువార్త బోధించటం వల్ల నేను సంకెళ్ళతో నేరస్తునివలె కష్టాలు అనుభవిస్తున్నాను. కాని దేవుని సందేశానికి సంకెళ్ళు లేవు. 10 కనుకనే, దేవుడు ఎన్నుకొన్నవాళ్ళ కోసం ఈ కష్టాలు సహిస్తున్నాను. యేసుక్రీస్తు వల్ల లభించే రక్షణ, శాశ్వతమైన మహిమ, వాళ్ళకు కూడా లభించాలని నా అభిలాష.
11 ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది:
మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం.
12 మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం చేస్తాం!
మనం ఆయన్ని కాదంటే ఆయన మనల్ని కాదంటాడు.
13 మనం నమ్మతగనివాళ్ళమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు.
తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు.
దేవుడు సమ్మతించిన పనివాడు
14 వాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను హెచ్చరించు. అలాంటి వాదనవల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది. 15 దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు.
16 విశ్వాసహీనమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. అలాంటివాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు. 17 వీళ్ళ బోధ పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమెనై, ఫిలేతు ఈ గుంపుకు చెందినవాళ్ళు. 18 వీళ్ళు సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్థానం జరిగిపోయిందని చెప్పి కొందరి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు.
19 అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తనవాళ్ళెవరో ప్రభువుకు తెలుసు.(A) ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలివెయ్యాలి” అని వ్రాయబడి ఉంది.
20 గొప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక, చెక్కతో, మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి. 21 దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు.
22 యౌవనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచేవాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని అనుసరించు. 23 కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు. 24 అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి. 25 తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి. 26 అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చి సాతాను వేసిన వలనుండి తప్పించుకోగల్గుతారు. ఎందుకంటే సాతాను వాళ్ళను తన యిచ్ఛ నెరవేర్చటానికి బంధించి పెట్టాడు.
గోమెరును బానిసత్వంనుండి హోషేయ తిరిగి కొనుట
3 అప్పుడు యెహోవా నాతో, “గోమెరుకు చాలా మంది విటులు ఉన్నారు. కాని నీవు ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుచేతనంటే అది యెహోవా చేసినట్టుగా ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాని వారు ఇతర దేవతలను పూజిస్తూనే ఉన్నారు. మరియు ఎండుద్రాక్షల అడలు తినటం వారికి ఇష్టం” అని మరల చెప్పాడు.
2 కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను. 3 కాబట్టి నేను ఆమెతో, “చాలా రోజులు నీవు నాతో కలసి ఇంటి వద్దనే ఉండాలి. నీవు వేశ్యలా ఉండకూడదు. నీవు మరో పురుషునితో పడుకో కూడదు. నేను నీకు భర్తగా ఉంటాను” అని చెప్పాను.
4 అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజుగాని, లేక ఒక నాయకుడు గాని లేకుండా అనేక రోజులు కొనసాగుతారు. ఒక బలి అర్పణగాని, లేక ఒక స్మారకశిలగాని లేకుండా ఉంటారు. వారికి ఏఫోదుగాని, లేక, గృహ దేవతలు గాని ఉండవు. 5 దీని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వెనుకకు వస్తారు. వారు వారి దేవుడైన యెహోవా కోసం, వారి రాజైన దావీదు కోసం వెతుకుతారు. చివరి దినాల్లో వారు యెహోవాను, ఆయన మంచితనాన్నీ గౌరవిస్తారు.
ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపంగా ఉండుట
4 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం వినండి! ఈ దేశంలో నివసించే ప్రజల మీద ఆయనకు గల వ్యాజ్యెం ఏమిటో యెహోవా చెపుతాడు వినండి. “ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి ఎరుగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను, నమ్మకస్తులుగాను లేరు. 2 ప్రజలు (అబద్ధపు) ఒట్టు పెట్టుకుంటారు, అబద్ధాలు చెపుతారు, చంపుతారు, దొంగిలిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. ప్రజలు మరల మరల హత్య చేస్తారు. 3 అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి. 4 ఏ వ్యక్తీ మరో వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. యాజకునితో! వాదం పెట్టుకోవద్దు. 5 మీరు (యాజకులు) పగటివేళ పడిపోతారు. మరియు రాత్రివేళ ప్రవక్త కూడ మీతోపాటు పడిపోతాడు. మరియు మీ తల్లిని నేను నాశనం చేస్తాను.
6 “నా ప్రజలకు తెలివి లేదు గనుక నాశనం చేయబడ్డారు. నేర్చుకొనేందుకు మీరు నిరాకరించారు. కనుక నా కోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చుటకు నేను నిరాకరిస్తాను. మీరు మీ దేవుని న్యాయచట్టం మరచిపోయారు గనుక నేను మీ పిల్లల్ని మరచిపోతాను. 7 వారు గర్విష్ఠులయ్యారు! వారు నాకు విరోధంగా ఇంకా ఇంకా ఎక్కువ పాపం చేశారు. కనుక వారి ఘనతను అవమానంగా నేను మార్చివేస్తాను.
8 “యాజకులు ప్రజల పాపాలలో చేరిపోయారు. వారు ఆ పాపాలను ఇంకా ఇంకా ఎక్కువగా కోరుకొన్నారు. 9 కనుక ప్రజలకంటే యాజకులు వేరుగా ఏమీలేరు. వారు చేసిన వాటి విషయమై నేను వారిని శిక్షిస్తాను. వారు చేసిన వాటికోసం నేను వారికి తగిన శిక్ష విధిస్తాను. 10 వారు భోజనం చేస్తారు కాని వారికి తృప్తి ఉండదు. వారు లైంగిక పాపాలు చేస్తారు. కాని వారికి పిల్లలు ఉండరు. ఎందుచేతనంటే వారు యెహోవాను విడిచిపెట్టి వేశ్యలవలె తయారయ్యారు.
11 “లైంగిక పాపాలు, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షారసం మనిషిలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని నాశనం చేస్తాయి. 12 నా ప్రజలు కట్టెముక్కలను సలహా అడుగుతున్నారు. ఆ కట్టెలు వారికి జవాబిస్తాయని వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ ఆ బూటకపు దేవతలను వెంటాడారు. 13 వారు కొండ శిఖరాల మీద బలులు అర్పిస్తారు. కొండలమీద, సిందూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద ధూపం వేస్తారు. ఆ చెట్ల కింద నీడ బాగున్నట్టు కనిపిస్తుంది. కనుక మీ కుమార్తెలు ఆ చెట్ల కింద వ్యభిచరిస్తారు. మరియు మీ కోడళ్లుకూడా పాపాలు చేస్తారు.
14 “వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గానీ, లైంగిక పాపాలు చేసినందుకు మీ కోడళ్లనుగాని నేను నిందించలేను. పురుషులు వెళ్లి, వేశ్యలతో పడుకొంటారు. వారు వెళ్లి, ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తారు. కనుక ఆ తెలివి తక్కువ ప్రజలు వారిని వారే పాడు చేసుకుంటున్నారు.
ఇశ్రాయేలీయుల సిగ్గుకరమైన పాపాలు
15 “ఇశ్రాయేలూ, నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తిస్తున్నావు. కానీ, యూదాను అపరాధిగా ఉండనియ్యకు. గిల్గాలుకు గాని లేక బేతావెనుకు గాని వెళ్లకుము. ప్రమాణాలు చేయటానికి యెహోవా నామం ఉపయోగించకుము. మరియు ‘యెహోవా జీవంతోడు …!’ అని అనవద్దు. 16 ఇశ్రాయేలుకు యెహోవా ఎన్నో ఇచ్చాడు. గడ్డి విస్తారంగా ఉన్న విశాలమైన పొలంలోకి తన గొర్రెలను తీసికొనివెళ్లే కాపరిగా ఆయన ఉన్నాడు. కానీ, ఇశ్రాయేలు మొండిది. ఇశ్రాయేలు మరల మరల పారిపోయే పెయ్యలాగ ఉంది. 17 ఎఫ్రాయిము అతని విగ్రహాలతో కలిశాడు కనుక అతన్ని ఒంటరిగా విడిచివేయండి. 18 వారి త్రాగుడు వారిని ప్రక్కకు త్రిప్పివేసింది. వారు విడువక ఇష్టానుసారంగా జారత్వము చేస్తూ ఆమెను సిగ్గుతో కప్పుతున్నారు. 19 కాని ఆమెను, ఆమె రెక్కలతో బంధించును. వారి బలి అర్పణల వలన వారు సిగ్గునొందుదురు.”
అయిన్
121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
తప్పుడు బోధలు నాకు అసహ్యం.
పే
129 యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం,
అందుకే నేను దానిని అనుసరిస్తాను.
130 ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది.
నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది.
131 యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను.
నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను.
132 దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము.
నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము.
133 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము.
నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు.
134 యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము.
నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి
నీ న్యాయచట్టాలు నేర్పించుము.[a]
136 ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల
నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను.
సాదె
137 యెహోవా, నీవు మంచివాడవు.
నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
© 1997 Bible League International