Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 6

ఎలీషా మరియు గొడ్డలి

ప్రవక్తల బృందం ఎలీషాతో ఇలా చెప్పింది: “మేమా ప్రదేశంలో నివసిస్తున్నాము. కాని మాకది చాలా చిన్నదిగా వుంది. యోర్దాను నదివద్దకు వెళ్లి, అడవిలో చెట్లు నరుకుదాము. మనలో ప్రతి ఒక్కరికి ఒక దూలము లభిస్తుంది. అక్కడ నివాసయ్యోగ్యమైన ఇల్లు నిర్మించుకుందాము.”

“బాగుంది, అలాగే కానివ్వండి” అని ఎలీషా బదులు చెప్పాడు.

“మాతో మీరు రండి” అని ఒకడనెను. ఎలీషా “బాగుంది, నేను కూడా మీతో వస్తాను” అని చెప్పాడు.

అందువల్ల ఎలీషా ప్రవక్తల బృందంతో పాటు వెళ్లాడు. వారు యోర్దాను నది వద్దకు చేరుకుని కొన్ని చెట్లు నరకసాగారు. కాని ఒక వ్యక్తి ఒక చెట్టు నరికేటప్పుడు, చేతినుండి గొడ్డలి జారిపోయి నీళ్లలో పడింది. అప్పుడతను, “యజమానీ, నేను ఆ గొడ్డలి చేబదులుగా తెచ్చాను” అని అరిచాడు.

దైవజనుడైన ఎలీషా, “అది ఎక్కడ పడింది” అని అడిగాడు.

గొడ్డలి పడిన చోటును అతను ఎలీషాకు చూపాడు. అప్పుడు ఎలీషా ఒక కొమ్మ నరికి, కర్రను నదిలోకి విసిరివేశాడు. ఆ కొమ్మ ఇనుప గొడ్డలి నీళ్లలో తేలునట్లు చేసింది. “గొడ్డలి పైకి తీసుకో” అని ఎలీషా చెప్పాడు. అప్పుడా వ్యక్తి గొడ్డలిని తీసుకున్నాడు.

సిరియా ఇశ్రాయేలును పట్టుకొనుటకు ప్రయత్నించుట

సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని తన సైనికోద్యోగులతో ఆయన సమాలోచన చేస్తున్నాడు. “ఈ చోట దాక్కుని ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు వారిని ఎదుర్కోనండి” అని అతను చెప్పాడు.

కాని దైవజనుడు అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకి ఒక సందేశం పంపాడు. ఎలీషా ఇట్లన్నాడు: “జాగ్రత్తగా వుండండి. ఆ స్థలంగుండా పోవద్దు! సిరియా సైనికులు అక్కడ దాగుకొని వున్నారు”

10 ఇశ్రాయేలు రాజు తన మనుష్యులకు సందేశం పంపుతూ దైవజనుడు (ఎలీషా) తనకు హెచ్చరిక చేశాడని తెలియపరిచాడు. ఇశ్రాయేలు రాజు పలువురిని కాపాడగలిగాడు.

11 ఇందువల్ల సిరియా రాజు తలక్రిందులయ్యాడు. తన సైనికోద్యోగుల్ని సమావేశ పరచి వారితో, “ఇశ్రాయేలు రాజుకోసం గూఢచారి పని చేస్తున్నదెవరో చెప్పండి” అని అడిగాడు.

12 సిరియా రాజు అధికారులలో ఒకడు, “ప్రభూ, రాజా, మాలో ఎవ్వరమూ గూఢాచారులము కాము. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు అనేక రహస్య విషయాలు చెప్పగలడు. మీరు నిద్రించే గృహంలో మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పగలడు” అన్నాడు.

13 అప్పుడు సిరియా రాజు, “ఎలీషాని కనుగొనండి. అతనిని పట్టుకునేందుకు నేను మనుష్యులను పంపుతాను” అన్నాడు.

“ఎలీషా దోతానులో ఉన్నాడు” అని రాజ సేవకులు చెప్పారు.

14 అప్పుడు సిరియా రాజు గుర్రాలు, రథాలు, ఒక పెద్ద సైన్యం దోతానుకు పంపాడు. వారు రాత్రి వేళ చేరి నగరాన్ని చుట్టుముట్టారు. 15 ఆ ఉదయం ఎలీషా సేవకుడు తర్వగా మేల్కోన్నాడు. అతను వెలుపలికి పోయి నగరం చుట్టూ ఒక పెద్ద సైన్యం రథాలు, గుర్రాలు ఉండటం చూశాడు.

ఎలీషా సేవకుడు, “నా యజమానీ! మనమేమి చేయగలము” అని ఎలీషాని చూసి అడిగాడు.

16 “భయపడకు, సిరియా కోసం యుద్ధం చేసే సైన్యం కంటె మనకోసం చేసే సైన్యం చాలా పెద్దది” అని ఎలీషా చెప్పాడు.

17 అప్పుడు ఎలీషా ప్రార్థించి ఇలా చెప్పాడు: “యెహోవా, నా సేవకుని కళ్లు తెరిపింపుము. అప్పుడతను చూడగలడు.”

యెహోవా ఆ యువకుని కళ్లు తెరిపించాడు. మరియు సేవకుడు కొండ చుట్టూ అగ్నిరథాలు గుర్రాలు వుండటం చుశాడు. అవి ఎలీషా చుట్టూ ఉన్నాయి.

18 ఈ అగ్నిరథాలు గుర్రాలు ఎలీషాకోసం క్రిందికి దిగి వచ్చాయి. ఎలీషా యెహోవాను ప్రార్థించాడు. “ఈ మనష్యులను అంధులను చేయవలసిందిగా నిన్ను ప్రార్థించుచున్నాను” అన్నాడు.

ఎలీషా ప్రార్థించిన ప్రాకారం యెహోవా చేశాడు. సిరియా సైనికులు అంధులగునట్లు యెహోవా చేశాడు. 19 సిరియా సైనికులను వుద్దేశించి ఎలీషా, “ఇది సరి అయిన మార్గం కాదు. ఇది సరి అయిన నగరం కాదు. నన్ను అనుసరించండి. మీరు ఎవరికోసం వెతుకుతున్నారో నేను అతని వద్దకు మిమ్మలను తీసుకుని వెళతాను” అన్నాడు. తర్వాత ఎలీషా సిరియా సైన్యాన్ని షోమ్రోనుకు నడిపించాడు.

20 వారు షోమ్రోనుకు చేరుకోగానే, “యెహోవా, వీరి కళ్లు తెరిపించుము. అప్పుడు వారు చూడగలుగుతారు” అని ఎలీషా ప్రార్థించాడు.

అప్పుడు యెహోవా వారి కళ్లు తెరిపించాడు. 21 తామప్పుడు షోమ్రోను నగరంలో వునన్నట్లుగా సైనికులు చూశారు. ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యాన్ని చూశాడు. ఎలీషాతో ఇశ్రాయేలు రాజు, “తండ్రీ, వారిని నేను చంపనా,” అని అడిగాడు.

22 “నీ ఖడ్గముతో, విల్లమ్ములతో నీవు యుద్ధంలో పట్టుకున్న ఈ మనుష్యులను నీవు చంపగోరుచున్నావా? సిరియా సైనికులకు రొట్టెలు మంచినీళ్లు ఇమ్ము. వారిని తిని త్రాగనిమ్ము. తర్వాత వారు వారి దేశానికి యజమాని వద్దకు వెళ్తారు” అని ఎలీషా చెప్పాడు.

23 ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యానికై చాలా ఆహారం తయారు చేయించాడు. ఆ సైనికులు తిన్నారు, త్రాగారు. తర్వాత ఇశ్రాయేలు రాజు సిరియా సైనికులను వారి దేశానికి పంపించాడు. సిరియా సైనికులు వారి యజమాని వద్దకు వెళ్లారు. సిరియా వారు దాడి చేయడానికై సైనికులెవరినీ ఇశ్రాయేలుకి పంపలేదు.

భయంకరమైన కరవు కాలం షోమ్రోనులో ఏర్పడుట

24 ఇది జరిగిన తర్వాత, సిరియా రాజుయిన బెన్హదదు తన సర్వసైన్యాన్ని సమీకరించి షోమ్రోను నగరాన్ని చుట్టుముట్టి దాడి చేయడానికి వెళ్లాడు. 25 నగరంలోకి ప్రజలు ఆహారం తీసుకురాకుండా సైనికులు చేశారు. అందువల్ల షోమ్రోనులో భయంకరమైన కరువు ఏర్పడింది. అది యెంత కష్టకాలమంటే, ఒక గాడిద తల ఎనభై వెండి రూపాయిలకు మరియు పావురపు పావు రెట్ట ఐదు వెండి రూపాయిలకు అమ్మబడింది.

26 ఇశ్రాయేలు రాజు నగరాన్ని ఆవరించిన ప్రాకారము మీద నడుస్తున్నాడు. ఒక స్త్రీ అతనిని ఉద్దేశించి కేక పెట్టింది. “నా ప్రభువా, యజమాని! దయచేసి నాకు సహాయం చెయ్యండి” అని.

27 ఇశ్రాయేలు రాజు, “యెహోవా కనుక సహాయం చేయకపోతే, నేను ఎలా సహాయం చేయగలను? నీకు ఇవ్వదగింది నావద్ద ఏమియులేదు, కళ్లంలో ధాన్యం లేదు. ద్రాక్షరసపు శాలలో ద్రాక్షరసం లేదు.” 28 తర్వాత, “నీకు వచ్చిన కష్టమేమి?” అని ఇశ్రాయేలు రాజు అడిగాడు.

ఆ స్త్రీ ఇలా బదులు చెప్పింది. “నీవు నీ కుమారుని మాకిచ్చివేయండి. అతనిని చంపి నేడు ఆహారం భుజిస్తాము. ఆ తర్వాత మేము మా కుమారుని రేపు భుజిస్తాము” అని ఈమె చెప్పింది. 29 కాబట్టి మా కుమారుణ్ణి ఉడికించి తినేశాము. ఆ మరుసటి రోజు నేను ఆ స్త్రీని ఇలా అడిగాను: “నీవు నీ కుమారుని ఇమ్ము. మేము అతనిని చంపి నేడు భుజిస్తాము. కాని ఆమె తన కుమారుని దాచివేసింది.”

30 ఆ స్త్రీ పలుకులు వినగానే, రాజు తాను తలక్రిందులైనానని దుఃఖాన్ని తెలపడానికి తన వస్త్రాలు చింపుకున్నాడు. ఆ గోడమీదుగా రాజు వెళ్తున్నప్పుడు రాజు గోనె పట్ట ధరించాడనీ, అది అతడు తల క్రిందులయిన, వ్యసనమయిన స్థితిని తెలుపుతున్నదని ప్రజలు గ్రహించారు.

31 రాజు, “ఈరోజు ఆఖరికి షాపాతు కుమారుడైన ఎలీషా తల కనుక అతని దేహం మీద ఉంటే, నన్ను దేవుడు శిక్షించునుగాక!” అని చెప్పాడు.

32 ఎలీషా వద్దకు రాజు ఒక దూతను పంపించాడు. ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. మరియు పెద్దలు (నాయకులు) అతనితోపాటు ఉన్నారు. ఆ దూత అక్కడికి చేరుకోవడానికి ముందుగా, పెద్దల్ని ఉద్దేశించి అతను ఇలా అన్నాడు: “చూడండి, ఆ హంతకుని కుమారుడు (ఇశ్రాయేలు రాజు) నా తల నరికి వేసేందుకు మనుష్యులను పంపిస్తున్నాడు. ఆ దూత చేరగానే, తలుపు మూసివేయండి తలుపు పట్టుకుని, అతనిని లోపలికి రానివ్వకండి. నేనతని యజమాని అడుగులు అతని వెనుక వస్తున్నట్టు ఆ సవ్వడి మనకు వినిపించునుగదా.”

33 ఎలీషా ఆ పెద్దలతో (నాయకులతో) మాట్లాడుతూండగా, దూత అక్కడికి వచ్చాడు. ఆ సందేశమిది: “యెహోవా నుండి ఈ కష్టం వచ్చింది. ఇంకా యెహోవా కోసం నేనెందుకు వేచివుండాలి.”

1 తిమోతికి 3

పెద్దలు, పరిచారకులు

ఇక్కడొక నమ్మదగిన సంగతి: సంఘంలో పెద్ద కావాలనుకొన్నవాడు గొప్ప సంగతినే కోరుకొనుచున్నాడు. పెద్ద నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీవ్రతుడై ఉండాలి. మితంగా జీవించాలి. వివేకవంతుడై ఉండాలి. సంఘంలో గౌరవం కలిగి ఉండాలి. ఇతర్లకు సహాయం చేస్తూ ఉండాలి. బోధించగల సామర్థ్యం ఉండాలి. అలాంటివాడు మద్యం త్రాగరాదు. అతనిలో కోపానికి మారుగ వినయం ఉండాలి. పోట్లాడే గుణం ఉండకూడదు. ధనం మీద ఆశ ఉండకూడదు. తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోగలిగి ఉండాలి. అతడు తన పిల్లలు తనపట్ల విధేయతగా ఉండేటట్లు, తనను మనస్ఫూర్తిగా గౌరవించేటట్లు చేసుకోవాలి. తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోలేనివాడు దేవుని సంఘాన్ని ఏ విధంగా నడపగలడు?

అతడు క్రొత్తగా నమ్మినవాడై ఉండకూడదు. అటువంటి వ్యక్తి ఉబ్బెక్కిపోయి సాతాను పొందిన శిక్షనే పొందవచ్చు. సంఘానికి చెందనివాళ్ళలో కూడా అతనికి మంచి పేరు ఉండాలి. అప్పుడే అతడు చెడ్డ పేరు పొందకుండా సాతాను వలలో పడకుండా ఉంటాడు.

ప్రత్యేక పరిచారకులు

అదే విధంగా సంఘ పరిచారకులు గౌరవింపదగినవాళ్ళై ఉండాలి. నీతిపరులై ఉండాలి. త్రాగుబోతులు కాకూడదు. మోసాలు చేసి లాభాలు పొందేవాళ్ళు కాకూడదు. దేవుడు చెప్పిన సత్యాలను వాళ్ళు పవిత్ర హృదయంతో ఆచరించాలి. 10 వాళ్ళు మొదట పరీక్షింపబడాలి. ఆ తర్వాత ఎవ్వరికీ ఏ ఆక్షేపణ లేనట్లయితే వాళ్ళను పరిచారకులుగా ఎన్నుకోవచ్చు.

11 అదే విధంగా పరిచర్యచేయు స్త్రీలు[a] కూడా గౌరవింపదగినవాళ్ళై ఉండాలి. వాళ్ళు యితర్లను నిందిస్తూ మాట్లాడరాదు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. నమ్మదగినవాళ్ళై ఉండాలి.

మన జీవిత రహస్యం

12 పరిచారకుడు కూడా ఏకపత్నీ వ్రతుడై ఉండాలి. తన పిల్లల్ని, కుటుంబాన్ని సక్రమంగా నడపాలి. 13 ఆ విధంగా నడిపేవాళ్ళు క్రీస్తులో మంచి పేరు, బలమైన విశ్వాసం సంపాదించుకొంటారు.

14 నేను నీ దగ్గరకు త్వరలోనే రావాలనుకొంటున్నాను. అయినా నేనీ ఆజ్ఞల్ని ఎందుకు వ్రాస్తున్నానంటే, 15 ఒకవేళ నేను రావటం ఆలస్యం అయితే ప్రజలు దేవుని కుటుంబంలో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ లేఖ ద్వారా నీకు తెలియజేస్తున్నాను. దేవుని సంఘం ఒక స్తంభంలాంటిది. అది సత్యానికి ఆధారమైనది. 16 ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది.

క్రీస్తు మానవ రూపం ఎత్తాడు.
పరిశుద్ధాత్మ వలన ఆయన నిజమైన నిర్దోషిగా నిరూపించబడ్డాడు.
దేవదూతలు ఆయన్ని చూసారు.
రక్షకుడని ఆయన గురించి జనాంగములకు ప్రకటింపబడింది.
ప్రజలు ఆయన్ని విశ్వసించారు.
ఆయన తన మహిమతో పరలోకానికి కొనిపోబడ్డాడు.

దానియేలు 10

హిద్దెకెలు నది దగ్గర దానియేలు దర్శనము

10 పారసీక రాజగు కోరెషు పాలన మూడవ సంవత్సరంలో, బెల్తెషాజరు అను దానియేలుకు ఒక విషయం తెలియపర్చబడింది. అది యుద్ధమును గూర్చిన నిజ సంగతి. ఇది దర్శనం ద్వారా దానియేలుకు బయలుపడింది గనుక అతడు గ్రహించాడు.

ఆ దినాల్లో దానియేలు అను నేను మూడు వారాలు దుఃఖాక్రాంతుడనయ్యాను. ఆ మూడు వారాల్లో, నేను ఎలాంటి పుష్ఠికరమైన ఆహారాన్ని భుజించలేదు, మాంసాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకోలేదు, తలకు నూనె రాసుకోలేదు.

మొదటి నెల ఇరవై నాల్గవ రోజున, గొప్ప నది అయిన టైగ్రిసు (హిద్దెకెలు) నది గట్టుమీద నేను నిలబడి ఉన్నాను. నేనక్కడ నిలబడి కన్నులెత్తి చూస్తూండగా ఒక వ్యక్తి నార బట్టలు ధరించుకొని, నడుము చుట్టూ మేలిమి బంగారపు దట్టి ధరించుకొని యున్నాడు. ఆయన శరీరం గోమేధికంవలె పసుపుగాను, ముఖం మెరుపువలె ప్రకాశవంతంగాను, కళ్లు ప్రకాశిస్తున్న దీపాలవలె కనిపించానియి చేతులూ, కాళ్లూ మెరుస్తున్న కంచువలెను, మాటల శబ్దం నర సమూహపు కంఠధ్వని వలెను ఉన్నాయి.

దానియేలు అను నేనొక్కడనే ఆ దర్శనం చూశాను. నా వెంటనున్న మనుష్యులు ఆ దర్శనం చూడలేదు. కాని వారు భయంతో వణుకుచూ పారిపోయి దాగుకొన్నారు. అందువల్ల నేను ఒంటరి వాడనై, ఆ గొప్ప దర్శనాన్ని చూచి, నాలో బలము లేనివాడనయ్యాను. మృతుడైనవాని ముఖంవలె నా ముఖం పాలిపోయి బలంలేని వాడనయ్యాను. దర్శనంలో కనిపించిన వ్యక్తి మాటలాడడం విన్నాను. అతను మాటలాడడం వినగా, నేను గాఢనిద్ర పొందిన వాడనై నేలమీద సాష్టాంగ పడ్డాను.

10 అప్పుడు ఒకని చెయ్యి నన్ను తాకి, వణకుచున్న నా చేతులను, మోకాళ్లను బలపరచి నన్ను నిలువ బెట్టింది. 11 అతడు నాతో, “బహు ప్రియుడవైన దానియేలూ! నేను నీతో చెప్పు మాటల్ని జాగ్రత్తగా వినుము. సరిగా నిలువబడు. నేను నీ కోసమే నీ యొద్దకు పంపబడ్డాను” అని అన్నాడు. అతడు నాతో ఈ మాట చెప్పుచుండగా వణకుతూ నేను నిలబడ్డాను. 12 అప్పుడు అతడు నాతో, “దానియేలూ, భయపడకు. నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని గ్రహించటానికి నీ మనస్సు నిలుపుకొన్న ఆ మొదటి రోజునుండి నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థిస్తూంన్నందువల్లనే నేను నీ వద్దకు వచ్చాను. 13 పారసీక రాజ్యాధిపతి ఇరవై యొక్క రోజులు నన్ను అడ్డగించాడు. కాని ప్రధాన దూతలలో ఒకడైన మిఖాయేలు నా సహాయం కోసం వచ్చాడు. అతన్ని నేను పారసీక రాజ్యాధి పతియొద్ద విడిచి వచ్చాను. 14 అంత్య దినాల్లో నీ జనులకు జరుగబోయే సంగతుల్ని నీకు తెలియ జేయటానికి నేను వచ్చాను. ఈ దర్శనం రాబోయే దినాలకు సంబధించింది” అని చెప్పాడు.

15 అతడు అలా మాటలాడుతూ ఉండగా, నా ముఖము నేలకు వంచి నేను మౌనంగా ఉండిపోయాను. 16 మానవ పుత్రులను పోలిన ఒకతను నా పెదవులు తాకాడు. నేను నా నోరు తెరిచి, మాటలాడటానికి ప్రారంభించాను. నేను నా ఎదుట నిలబడిన ఆ వ్యక్తితో, “అయ్యా, దర్శనంలో కనిపించిన వాటివల్ల బాధనొంది బలము లేని వాడనయ్యాను. 17 అయ్యా! నీ సేవకుడనైన నేను నీతో ఎలా మాట్లాడగలను? నా బలంపోయింది. నాకు ఊపిరి ఆడనట్లయింది” అని అన్నాను.

18 మానవునిలా కనిపించిన ఆ వ్యక్తి మళ్లీ నన్ను ముట్టి, బలపరిచాడు. 19 అతడు నాతో, “బహు ప్రియుడవయిన మనుష్యుడా! భయపడవద్దు. నీకు శాంతి కలుగునుగాక! శక్తివంతుడవై ధైర్యంగా ఉండు” అని అన్నాడు.

అతడు మాటలాడగానే నేను బలం పొంది ఇలాగన్నాను: “అయ్యా, నాకు నీవు శక్తినిచ్చావు. ఇప్పుడు నీవు మాట్లాడవచ్చును.”

20 అప్పుడు అతను, “దానియేలూ, నేను ఎందుకు నీవద్దకు వచ్చానో నీకు తెలుసా? నేను త్వరగా మరలి పోయి పారసీక రాజ్యాధిపతితో యుద్ధం చేయాలి. నేను వెళ్లినప్పుడు, గ్రీకు యువరాజు వస్తాడు. 21 సత్య గ్రంథంలో ఏమి వ్రాయబడిందో అది నేను నీకు చెపుతాను. ఈ సంగతుల్లో మీ అధిపతి మిఖాయేలు తప్ప మరి యెవ్వరూ నా పక్షంగా నిలబడరు.

కీర్తనలు. 119:1-24

ఆలెఫ్[a]

119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
    వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
    వారు యెహోవాకు విధేయులవుతారు.
యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
    ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
    ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
అప్పుడు నేను నీ ఆజ్ఞలను
    ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
    నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
    కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!

బేత్

యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
    నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
    దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
    ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
    నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
    నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
    నీ మాటలు నేను మరచిపోను.

గీమెల్

17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
    తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
    చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
    ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
    నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
    అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
    అది నాకు మంచి సలహా ఇస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International