Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 9

దేవుడు మరల సొలొమోను వద్దకు వచ్చుట

సొలొమోను యెహోవా దేవాలయాన్ని, తన రాజ భవనాన్ని నిర్మించటం పూర్తి చేశాడు. తాను నిర్మించదలచుకొన్నవన్నీ పూర్తి చేశాడు. తరువాత యెహోవా సొలొమోనుకు పూర్వం గిబియోను పట్టణంలో ప్రత్యక్షమైనట్లు మళ్లీ కన్పించాడు. యెహోవా అతనితో ఇలా అన్నాడు,

“నీ ప్రార్థన విన్నాను. నీవు నన్ను చేయమని అడిగిన విషయాలను కూడా విన్నాను. నీవు ఈ దేవాలయము కట్టించావు. నేను దానిని పవిత్రస్థలంగా చేశాను. కావున నేనక్కడ శాశ్వతంగా ఆరాధించబడతాను. నేను దానిని కనిపెట్టుకుని ఉండి ఎల్లప్పుడూ దానిని గూర్చి ఆలోచన చేస్తాను. నీ తండ్రివలె నీవు సదా నన్ను ఆరాధిస్తూ వుండాలి. అతడు న్యాయవర్తనుడు; నిజాయితీపరుడు. నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను నీవు పాటించాలి. నీవు ఇవన్నీ పాటిస్తే, ఇశ్రాయేలు రాజు ఎల్లప్పుడూ నీ వంశంలో నుండి వచ్చేలా చేస్తాను. ఈ వాగ్దానం నేను నీ తండ్రి దావీదుకు చేశాను. ఇశ్రాయేలు ఎల్లప్పుడూ అతని సంతానంలోని వాడొకనిచే పరిపాలింపబడుతుందని నేనతనితో చెప్పాను.

6-7 “అయితే నీవు గాని, నీ సంతతి గాని నన్ను అనుసరించక పోయినా, నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను పాటించకపోయినా, లేక మీరు ఇతర దేవుళ్లను సేవించి, ఆరాధించినా, నేను ఇచ్చిన రాజ్యంలో నుంచి ఇశ్రాయేలీయులు బయటికి పోయేలా ఒత్తిడి తెస్తాను. ఇశ్రాయేలీయులు నలుగురిలో నవ్వులపాలై, క్రమశిక్షణారాహిత్యంలో ఒక ఉదాహరణగా మిగిలిపోతారు. నేను ఈ దేవాలయాన్ని పవిత్రపరిచాను. ఇది ప్రజలు నన్ను గౌరవించే స్థలం. కాని మీరు నా ఆజ్ఞలను మన్నించకపోతే ఈ దేవాలయాన్ని నేలమట్టం చేస్తాను. ఈ దేవాలయం సర్వనాశనం చేయబడుతుంది. ఇది చూచిన ప్రతివాడూ విస్మయము చెందుతాడు. వారంతా, ‘యెహోవా ఈ రాజ్యానికి, ఈ దేవాలయానికి ఈ భయంకర పరిస్థితిని ఎందుకు కల్పించాడు?’ అని అడుగుతారు. మరికొందరు, ‘ఈ పరిణామం ఎందుకు వచ్చిందంటే ఆ ప్రజలు వారి యెహోవా దేవుని మర్చిపోయారు. వారి దేవుడు వారి పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకుని వచ్చాడు. కాని వారు ఇతర దైవాలను సేవించటం మొదలు పెట్టారు’ అని సమాధానం చెపుతారు.”

10 ఇరవై సంవత్సరాల కాలవ్యవధిలో రాజైన సొలొమోను యెహోవా యొక్క దేవాలయాన్ని, తన రాజగృహాన్ని కట్టించాడు. 11 ఇరవై సంవత్సరాల తరువాత రాజైన సొలొమోను గలిలీయ దేశమందున్న ఇరవై పట్టణాలను తూరు రాజైన హీరాముకు ఇచ్చాడు. హీరాము రాజు ఆలయ నిర్మాణంలోను, రాజ భవన నిర్మాణంలోను సహాయపడినందుకు, సొలొమోను ఈ పట్టణాలను ఇచ్చాడు. సొలొమోను కోరినంత దేవదారు కలపను, సరళ వృక్షాలను, బంగారాన్ని హీరాము ఇచ్చాడు. 12 కావున సొలొమోను ఇచ్చిన ఆ పట్టణాలను చూడటానికి తూరు నుండి హీరాము బయలుదేరి వెళ్లాడు. హీరాము ఆ పట్టణాలను చూచి తృప్తిపడలేదు. 13 “ఈ పనికిరాని పట్టణాలను నాకు ఎందుకిచ్చినట్లు సోదరా?” అని హీరాము రాజు అన్నాడు. హీరాము రాజు ఆ పట్టణ ప్రాంతాలకు కాబూల్[a] ప్రాంతమని పేరు పెట్టాడు. ఈ నాటికి ఆ ప్రాంతం కాబూల్ అని పిలవబడుతోంది. 14 హీరాము సుమారు రెండు వందల నలభై[b] మణుగుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు పంపాడు.

15 రాజైన సొలొమోను దేవాలయ నిర్మణానికి, రాజభవన నిర్మణానికి బానిసలను బలవంతంగా పని చేయించాడు. ఈ బానిసలను చాలా ఇతర కట్టడాల విషయంలో కూడ రాజైన సొలొమోను వినియోగించుకున్నాడు. అతడు మిల్లోను[c] నిర్మించాడు. అతడింకా నగరానికి చుట్టూ ప్రాకారం కట్టించాడు. అతను హాసోరు, మెగిద్దో, మరియు గెజెరు నగరాలను కూడ పునర్మించాడు.

16 గతంలో ఈజిప్టు రాజు గెజెరు నగరంపై దండెత్తి దానిని తగులబెట్టాడు. అక్కడ నివసించే కనానీయులను చంపేశాడు. ఫరో కుమార్తెను సొలొమోను వివాహం చేసుకొన్నాడు. పెండ్లి కానుకగా ఫరో ఆ నగరాన్ని సొలొమోనుకు ఇచ్చాడు. 17 సొలొమోను ఆ నగరాన్ని తిరిగి నిర్మించాడు. సొలొమోను దిగువ బేత్ హోరోనును కూడ నిర్మించాడు. 18 రాజైన సొలొమోను బయలాతును, యూదయ అరణ్యములోనున్న తామారు నగరాలను కూడా నిర్మించాడు. 19 రాజైన సొలొమోను ధాన్యాగారములు, తదితర వస్తువులు నిల్వచేయు గోదాములుండు నగరాలను కూడ కట్టించాడు. తన రథాలకు, గుర్రాలకు తగిన శాలలు కూడ నిర్మింపజేశాడు. యెరూషలేములోను, లెబానోను లోను, ఇంకా తాను రాజ్యం చేసిన ప్రాంతాలలోను సొలొమోను రాజు కావాలనుకున్న కట్టడాలను చాలా నిర్మించాడు.

20 ఇశ్రాయేలీయులు కానివారు రాజ్యంలో చాలా మంది వున్నారు. వారు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు. 21 ఇశ్రాయేలీయులు ఈ ప్రజలను నాశనం చేయలేక పోయారు. సొలొమోను వారిని బానిసలుగా పనిచేసేటందుకు బలవంతం చేశాడు. వారంతా ఈ నాటికీ బానిసలే. 22 కాని సొలొమోను ఇశ్రాయేలీయుల నెవ్వరినీ తన బానిసలు కమ్మని బలవంతం చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు సైనికులుగాను, ప్రభుత్వ అధికారులుగాను, ఉద్యోగులుగాను, సైన్యాధిపతులుగాను, రథాధిపతులుగాను, రథసారథులుగాను పని చేశారు. 23 సొలొమోను చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించడానికి ఐదువందల ఏభై మంది అధికారులున్నారు. వారు పనివారి మీద అధికారులు.

24 ఫరో కుమార్తె దావీదు నగరం నుండి సొలొమోను ఆమెకు కట్టించిన భవనానికి వెళ్లింది. అప్పుడు సొలొమోను మిల్లోను నిర్మించాడు.

25 సంవత్సరానికి మూడుసార్లు సొలొమోను బలిపీఠం మీద దహన బలులు మరియు సమాధాన బలులు అర్పించాడు. ఈ బలిపీఠం సొలొమోను యెహోవా కొరకు నిర్మించింది. రాజైన సొలొమోను యెహోవా ముందు ధూపం వేసేవాడు. కావున దేవాలయ నిర్వహణకు కావలసిన వస్తువులన్నీ అతడు సరఫరా చేసేవాడు.

26 ఎసోన్గెబెరు వద్ద రాజైన సొలొమోను ఓడలను కూడ నిర్మించాడు. ఈ పట్టణం ఏలతు దగ్గర వుంది. ఇది ఎదోము రాజ్యంలో ఎర్ర సముద్రపు తీరాన వుంది. 27 రాజైన హీరాము వద్ద సముద్ర విషయాలలో ఆరితేరిన మనుష్యులు కొందరున్నారు. వీరు తరచు ఓడలలో ప్రయాణం చేసేవారు. సొలొమోను మనుష్యులతో కలిసి సొలొమోను ఓడలలో పని చేయటానికి హీరాము రాజు ఆ మనుష్యులను పంపాడు. 28 సొలొమోను ఓడలు ఓఫీరను స్థలానికి వెళ్లాయి. ఆ ఓడలు ఓఫీరు నుండి ఎనిమిది వందల నలభై మణుగుల[d] బంగారాన్ని రాజైన సొలొమోనుకు తీసుకొని వచ్చాయి.

ఎఫెసీయులకు 6

తల్లిదండ్రుల్ని గౌరవించండి

బిడ్డలారా! ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇది మంచిపని, “మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి”(A) అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది. “మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”(B)

తండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు. దానికి మారుగా ప్రభువు చెప్పిన మార్గాన్ని వాళ్ళకు బోధించి, అందులో శిక్షణనిచ్చి వాళ్ళను పెంచాలి.

బానిసలు, యజమానులు

బానిసలు తమ యజమానుల పట్ల విధేయతతో ఉండాలి. వాళ్ళకు మనస్ఫూర్తిగా క్రీస్తుకు విధేయులైనట్లు సేవ చెయ్యాలి. వాళ్ళ అభిమానం సంపాదించాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు గమనిస్తున్నప్పుడు మాత్రమే కాక అన్ని వేళలా మీ పనులు మీరు చెయ్యాలి. మీరు క్రీస్తు బానిసలు. కనుక మనస్ఫూర్తిగా దైవేచ్ఛానుసారం చెయ్యండి. సంతోషంగా సేవ చెయ్యండి. మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభువు సేవ చేస్తున్నట్లు భావించండి. ప్రభువు మనిషి చేసిన సేవను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అతడు బానిస అయినా సరే. లేక యజమాని అయినా సరే. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి.

యజమానులు బానిసలపట్ల మంచిగా ఉండాలి. యజమానులు బానిసలను భయపెట్టరాదు. మీ యజమాని, వాళ్ళ యజమాని పరలోకంలో ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపడు.

దేవుడు యిచ్చిన ఆయుధాలు

10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. 11 సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి. 12 మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము. 13 కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.

14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. 15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. 16 వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. 17 రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. 18 ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి.

19 నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడ ప్రార్థించండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. 20 సంకెళ్ళలోవున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి.

చివరి వందనాలు

21 ప్రభువును విశ్వసిస్తున్న సేవకుడు, మన ప్రియ సోదరుడు అయిన “తుకికు” మీకు అన్నీ చెబుతాడు. అతని ద్వారా మీకు నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో తెలుస్తుంది. 22 మేము ఏ విధంగా ఉన్నామో మీరు తెలుసుకోవాలని మరియు అతడు మీకు ప్రోత్సాహం కలిగించాలని అతణ్ణి నేను మీ దగ్గరకు పంపుతున్నాను.

23 సోదరులందరికీ తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతో పాటు శాంతి, ప్రేమ లభించుగాక! 24 మన యేసు క్రీస్తు ప్రభువును ప్రేమించేవాళ్ళకు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ లభించుగాక!

యెహెజ్కేలు 39

గోగు, అతని సైన్యం యొక్క అంతం

39 “నరపుత్రుడా, నా తరపున గోగుకు వ్యతిరేకంగా మాట్లాడు. యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని అతనికి తెలియజేయుము, ‘గోగూ, నీవు మెషెకు, తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన నాయకుడవు! కాని నేను నీకు వ్యతిరేకిని. నిన్ను నేను పట్టుకొని వెనుకకు తీసుకొని వస్తాను. దూరపు ఉత్తర ప్రాంతం నుండి నిన్ను తీసుకు వస్తాను. ఇశ్రాయేలు పర్వతాలపై యుద్ధానికి నిన్ను నేను తీసుకు వస్తాను. కాని నీ ఎడమచేతి నుండి నీ ధనుస్సును నేల రాల్చుతాను. నీకుడి చేతి నుండి నీ బాణాలు పడిపోయేలా చేస్తాను. ఇశ్రాయేలు పర్వతాల మీద నీవు చంపబడతావు. నీవు, నీ సైనిక దళాలు, నీతో ఉన్న అన్య దేశాల జనులు యుద్ధంలో చంపబడతారు. మాంసం తినే ప్రతి పక్షి, క్రూర మృగాలకి నిన్ను ఆహారంగా పడవేస్తాను. నీవు నగర ప్రవేశం చేయవు. నీవు ఆరు బయటనే పొలాల్లో చంపబడతావు. ఇది చెప్పినది నేనే!’” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

దేవుడు ఇలా చెప్పాడు, “మాగోగు మీదికి, తీరం వెంబడి నిర్భయంగా నివసిస్తున్న ప్రజల మీదికి అగ్నిని పంపిస్తాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకొంటారు. నేనొక్కడినే ఇశ్రాయేలులో మహనీయుణ్ణి. ప్రజలు నా పవిత్ర నామాన్ని ఇక ఎంతమాత్రం పాడు చేయకుండా చూస్తాను. దేశాలన్నీ నేనే యెహోవానని తెలుసుకుంటాయి. నేను ఇశ్రాయేలులో నెలకొన్న పవిత్రుడినైన యెహోవానని వారు తెలుసుకుంటారు. ఆ సమయం ఆసన్నమవుతూ ఉంది! అది జరిగి తీరుతుంది!” యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “ఆ రోజును గురించే నేను మాట్లాడుతున్నాను.

“ఆ సమయంలో ఇశ్రాయేలు నగరాలలో నివసిస్తున్న ప్రజలు ఆ పొలాలలోకి వెళతారు. వారు శత్రువుల ఆయుధాలన్నీ ఏరి తగలబెడతారు. డాళ్లు, ధనుస్సులు, బాణాలు, దుడ్డు కర్రలు, ఈటెలు అన్నీ వారు తగులబెడతారు. ఆ ఆయుధాలన్నిటినీ వారు ఏడేండ్ల పాటు వంట చెరకుగా ఉపయోగిస్తారు. 10 ఈ ఆయుధాలనే వారు వంట చెరకుగా ఉపయోగించటంతో వారు పొలాల్లో పుల్లలు ఏరటం గాని, అడవిలో కట్టెలు కొట్టటం గాని చేయవలసిన అవసరం లేదు. వారిని దోచుకోవాలని వచ్చిన సైనికుల నుండి విలువైన వస్తువులను వారే తీసుకుంటారు. తమవద్ద విలువైన వస్తువులను దోచుకున్న సైనికుల నుండి వారే మంచి వస్తువులను తీసుకుంటారు.” ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.

11 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “ఆ సమయంలో గోగును సమాధి చేయటానికి ఇశ్రాయేలులో నేనొక స్థలాన్ని ఎంపిక చేస్తాను. మృత సముద్రానికి తూర్పున ఉన్న ప్రయాణీకుల లోయలో అతడు సమాధి చేయబడతాడు. అది ప్రయాణికుల బాటను మూసివేస్తుంది. గోగు మరియు అతని సైన్యమంతా అక్కడే సమాధి చేయబడతారు గనుక అలా జరుగుతుంది. ప్రజలు ఆ ప్రదేశాన్ని ‘గోగు సైన్యపు లోయ’ అని పిలుస్తారు. 12 దేశాన్ని శుద్ధి చేయటానికి ఇశ్రాయేలు వంశం వారు వారిని ఏడు నెలల పాటు పాతిపెడతారు. 13 దేశంలోని సామాన్య ప్రజలంతా ఆ శత్రు సైనికులను పాతిపెడతారు. నేను ఖ్యాతి తెచ్చుకున్న ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కీర్తి వహిస్తారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయం చెప్పాడు.

14 దేవుడు ఇలా చెప్పాడు: “ఆ చనిపోయిన సైనికులను పాతి పెట్టటానికి పనివారిని పూర్తి సమయ ప్రాతిపదికపై ప్రజలు నియమించవలసి ఉంటుంది. ఈ రకంగా వారు దేశాన్ని పవిత్రం చేస్తారు. పనివారు ఏడునెలల పాటు పని చేస్తారు. వారు శవాలను వెదుకుతూ నలుదిశలా తిరుగుతారు. 15 పనివారు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఒక్కడైనా ఒక ఎముకను చూస్తే దాని ప్రక్కన ఒక గుర్తు పెడతాడు. సమాధులు త్రవ్వేవారు వచ్చి ఆ ఎముకను గోగు సైన్యపులోయలో పాతిపెట్టే వరకు ఆ గుర్తు అక్కడ ఉంటుంది. 16 ఆ మృతుల నగరానికి హమోనా[a] అని పేరు పెడతారు. ఈ విధంగా వారు దేశాన్ని శుద్ధి చేస్తారు.”

17 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నరపుత్రుడా, అన్ని పక్షుల, అడవి జంతువులతో నా తరఫున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఇక్కడికి రండి! ఇక్కడికి రండి! చుట్టూ మూగండి. నేను మీ కొరకు సిద్ధం చేస్తున్న బలిని మీరు తినండి. ఇశ్రాయేలు పర్వతాల మీద చాలా పెద్ద బలి ఇవ్వబడుతుంది. రండి. మాంసం తినండి. రక్తం తాగండి. 18 బలాఢ్యులైన సైనికుల శరీరాల మాంసం మీరు తింటారు. మహా రాజుల రక్తాన్ని మీరు తాగుతారు. బాషానుకు చెందిన పొట్టేళ్లు, గొర్రె పిల్లలు, మేకలు, బలిసిన గిత్తల్లా వారుంటారు. 19 మీకు కావలసిన కొవ్వునంతా మీరు తినవచ్చు. మీ పొట్టలు నిండేలా మీరు రక్తం తాగవచ్చు. మీ కొరకు నేను ఇచ్చే బలి మాంసం మీరు తిని, తాగుతారు. 20 నా బల్లవద్ద తినటానికి మీకు మాంసం పుష్కలంగా లభిస్తుంది. వారిలో గుర్రాలు, రథసారధులు బలిష్ఠులైన సైనికులు, ఇతర పోరాట యోధులు ఉన్నారు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.

21 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, “నేనేమి చేశానో ఇతర దేశాల వారు చూసేలా చేస్తాను. ఆ అన్యదేశాల వారు నన్ను గౌరవించటం మొదలు పెడతారు! ఆ శత్రువు మీద నేను ఉపయోగించిన నా శక్తిని వారు చూస్తారు. 22 ఆ రోజునుంచి ఇశ్రాయేలు వంశం వారు నేను తమ దేవుడగు యెహోవానని తెలుసుకుంటారు. 23 అన్యదేశాలు ఇశ్రాయేలు వంశం వారు ఎందుకు బందీలుగా కొనిపోబడ్డారో తెలుసుకుంటాయి. నా ప్రజలు నామీద తిరుగుబాటు చేసినట్లు వారు తెలుసుకుంటారు. కావున నేను వారికి విముఖుడనయ్యాను. వారి శత్రువులు వారిని ఓడించేలా చేశాను. అందుచే నా ప్రజలు యుద్ధంలో చంపబడ్డారు. 24 వారు పాపం చేసి, వారిని వారు మలినపర్చుకున్నారు. కావున వారు చేసిన పనులకు నేను వారిని శిక్షించాను. నేను వారికి విముఖుడనై, వారికి సహాయం చేయ నిరాకరించాను.”

25 కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇప్పుడు యాకోబు వంశాన్ని దేశ బహిష్కరణ నుండి విముక్తిచేసి తీసుకు వస్తాను. ఇశ్రాయేలు వంశమంతటి మీద దయ చూపుతాను. నా పవిత్ర నామ పరిరక్షణ విషయంలో నేను నా రోషాన్ని తెలియజేస్తాను. 26 ప్రజలు వారి అవమానాలను, వారు నాపై తిరుగుబాటు చేసిన రోజులను వారు మర్చిపోతారు. వారు తమ స్వంత దేశంలో సురక్షితంగా నివసిస్తారు. వారి నెవరూ భయపెట్టరు. 27 అన్య దేశాలనుంచి నా ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాను. వారి శత్రు రాజ్యాల నుండి వారిని కూడదీస్తాను. నేనెంత పవిత్రుడనో అనేక దేశాలు అప్పుడు చూస్తాయి. 28 వారు తమ ఇండ్లను వదిలి ఇతర దేశాలకు బందీలుగా పోయేటట్లు ఇంతకు ముందు నేను చేశాను. తరువాత మళ్లీ వారిని కూడదీసి తమ స్వంత దేశానికి తీసుకొని వచ్చాను. అందువల్ల నేను వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు. 29 ఇశ్రాయేలు వంశం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దాని తరువాత మరెన్నడూ నేను నా ప్రజలకు విముఖుడనై ఉండను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

కీర్తనలు. 90

నాలుగవ భాగం

(కీర్తనలు 90–106)

దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.

90 ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు.
    దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.

మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా,
    తిరిగి రండని నీవు చెప్పుతావు.
నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి.
    గత రాత్రిలా అవి ఉన్నాయి.
నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము.
మేము గడ్డిలా ఉన్నాము.
    ఉదయం గడ్డి పెరుగుతుంది.
    సాయంత్రం అది ఎండిపోయి ఉంటుంది.
దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము.
    నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది!
మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు.
    దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు.
నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు.
    మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి.
10 మేము 70 సంవత్సరాలు జీవిస్తాము.
    బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము.
మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి.
    అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము.
11 దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు.
    కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి.
12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
    నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
    నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
    మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
    ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
    వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
    మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International