M’Cheyne Bible Reading Plan
నిబంధన మందసం దేవాలయానికి తేబడుట
8 రాజైన సొలొమోను తరువాత ఇశ్రాయేలు పెద్దలందరినీ, ఆయా వంశాల ప్రధాన పురుషులను, ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలను ఒక చోటికి పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో తన వద్దకు రమ్మని చెప్పాడు. సీయోను అనబడే దావీదుపురంనుండి దేవుని ఒడంబడిక పెట్టెను దేవాలయానికి తరలించే కార్యక్రమంలో పాల్గొనమని సొలొమోను వారిని కోరాడు. 2 కావున ఇశ్రాయేలీయులందరూ రాజైన సొలొమోను వద్దకు వచ్చారు. ఏతనీము అనబడే మాసంలో పండుగ సందర్భంగా ప్రత్యేక సెలవు రోజున (పర్ణశాలల పండుగ) సమావేశం జరిగింది. అది సంవత్సరంలో ఏడవనెల.
3 ఇశ్రాయేలు పెద్దలందరూ ఆ స్థలానికి వచ్చారు. అప్పుడు యాజకులు పవిత్ర ఒడంబడిక పెట్టె తీసుకున్నారు. 4 యెహోవా ఒడంబడిక పెట్టె సన్నిధి గుడారము, దానిలోని పవిత్ర వస్తువులతో పాటు వారు మోసుకొని వెళ్లారు. లేవీయులు కొందరు ఈ వస్తువులను మోయుటలో సహాయం చేశారు. 5 రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒడంబడిక పెట్టె ముందు సమావేశమయ్యారు. వారప్పుడు ఎవ్వరూ లెక్కపెట్టలేనన్ని గొర్రెలను, పశువులను బలి యిచ్చారు. 6 అప్పుడు యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టె దాని అసలైన స్థానంలో ఉంచారు. అది అతి పరిశుద్ధ స్థలము. ఒడంబడిక పెట్టె కెరూబుల రెక్కల కిందుగా ఉంచబడింది. 7 ఒడంబడిక పెట్టె ఉంచబడిన స్థానం మీదుగా కెరూబుల రెక్కలు వ్యాపించి వున్నాయి. ఆ రెక్కలు ఒడంబడిక పెట్టె, దానిని మోయుటకు ఉపయోగించే కోలలను కప్పివేశాయి. 8 ఒడంబడిక పెట్టె మోసే కోలలు (కర్రలు) చాలా పొడవైనవి. అతి పరిశుద్ధ స్థలం ముందు పవిత్ర స్థలంలో ఎవరు నిలబడి చూసినా ఆ కోలలను చివరి వరకు చూడగలరు. కాని వాటినెవరూ బయటి నుండి చూడలేరు. ఈ నాటికీ ఆ కోలలు అదే స్థానంలో వున్నాయి. 9 ఆ ఒడంబడిక పెట్టెలో వున్నవి కేవలం రెండు రాతి ఫలకాలు. ఈ రెండు ఫలకాలను హోరేబు అనే చోట మోషే ఈ ఒడంబడిక పెట్టెలో భద్రపరచాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి బయటికి వచ్చిన తరువాత హోరేబు అనే చోటనే యెహోవా వారితో తన ఒడంబడిక చేశాడు.
10 యాజకులు అతి పరిశుద్ధ స్థలాన్ని వదిలి బయటికి వచ్చిన పిమ్మట, ఒక మేఘం యెహోవా దేవాలయాన్ని కమ్మివేసింది. 11 యెహోవా మహిమతో దేవాలయం నిండిపోగా యాజకులు తమ విధులను నిర్వర్తించలేక పోయారు. 12 అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు:
“ఆకాశంలో ప్రకాశించటానికి యెహోవా సూర్యుడ్ని కలుగజేశాడు,
కాని ఆయన మాత్రం ఒక నల్లని మేఘంలో నివసిస్తానన్నాడు.
13 నిజానికి నేకొక అద్భుతమైన దేవాలయాన్ని నీ కొరకు నిర్మించాను,
అది నీవు శాశ్వతంగా నివసించే స్థలం.”
14 ఇశ్రాయేలీయులందరూ అక్కడ నిలబడియున్నారు. రాజైన సొలొమోను వారి వైపు తిరిగి వారిని దీవించుమని దేవుడిని అడిగాడు. 15 తరువాత రాజైన సొలొమోను దేవునికి సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. అతడిలా అన్నాడు:
“ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉన్నతుడు. నా తండ్రి దావీదుకు ఇచ్చిన మాట ప్రకారం అతడు అన్నీ నెరవేర్చాడు. 16 యెహోవా నా తండ్రితో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టునుండి విముక్తులను చేసి తీసుకొని వచ్చాను. కాని నా గౌరవార్థం నాకో దేవాలయం కట్టించటానికి ఇశ్రాయేలు వంశాలు నివసించే ఏ పట్టణాన్నీ నేనింకా ఎన్నుకో లేదు. నా ప్రజలైన ఇశ్రాయేలును ఏలటానికి నేనొక యువరాజును ఎంపిక చేయలేదు. కాని నేను గౌరవింపబడే చోటుగా ఇప్పుడు యెరూషలేమును ఎన్నుకున్నాను. మరియు నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించటానికి దావీదును ఎంపిక చేశాను’ అని చెప్పాడు.
17 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఘనంగా ఒక దేవాలయం కట్టించాలని నా తండ్రి దావీదు మిక్కిలిగా కోరుకున్నాడు. 18 కాని యెహోవా నా తండ్రి దావీదుతో ‘నాకు తెలుసు, నీవు నాకు దేవాలయం కట్టించి గౌరవించాలని మిక్కిలి ఆసక్తితో ఉన్నావు. నాకు దేవాలయ నిర్మాణం చేయాలను కోవటం సంతోషించ తగ్గ విషయం. 19 కాని నాకు దేవాలయం కట్టించేది నీవు కాదు. నేను ఆ పనికి నిన్ను ఎంపిక చేయలేదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ కుమారుడు నాకు దేవాలయ నిర్మాణం చేయిస్తాడు,’ అని అన్నాడు.
20 “కావున యెహోవా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. నా తండ్రి దావీదు స్థానంలో ఇప్పుడు నేను రాజును. యెహోవా కనికరించిన విధంగా ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను దేవాలయం కట్టించాను. 21 దేవాలయంలో దేవుని ఒడంబడిక పెట్టెకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేశాను. మన పూర్వీకులతో యెహోవా చేసిన ఒక ఒడంబడిక ఆ మందసంలో వుంది. యెహోవా మన పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ ఒడంబడిక చేశాడు.”
22 పిమ్మట సొలొమోను యెహోవా బలిపీఠం ముందు నిలబడ్డాడు. ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డారు. రాజైన సొలొమోను చేతులు చాపి, ఆకాశంవైపు చూశాడు. 23 అతనిలా అన్నాడు:
“ఓ ప్రభూ, ఇశ్రాయేలీయుల దేవా! నీవంటి యెహోవా ఆకాశంలో గాని, భూమి మీద గాని మరొక్కడు లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నావు. కావున నీవు వారితో ఒక ఒడంబడిక చేసుకున్నావు. నిన్ననుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక తప్పక అమలు పర్చుతావు. 24 నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు. నీవు ఆ వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే ఆ వాగ్దానం చేశావు. నీ అమోఘమైన శక్తి సంపదతో ఆ వాగ్దానం ఈ రోజు నిజమయ్యేలా చేశావు. 25 ఇశ్రాయేలీయుల దేవుడవైన నా ప్రభువా, నా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను కూడ ఇప్పుడు నెరవేర్చు. నీవిలా అన్నావు: ‘నీవు నా ఆజ్ఞలను పాటించినట్లు నీ కుమారులు కూడా నన్ననుసరించే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఇశ్రాయేలును పాలించటానికి ఒకనిని కలిగి వుంటావు.’ 26 ఇశ్రాయేలు దైవమగు ఓ నా ప్రభువా, నీవు నా తండ్రికిచ్చిన ఆ వాగ్దానం కొనసాగించుమని కూడా నేను వేడు కుంటున్నాను.
27 “కాని దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా? ఈ ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ జాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడ ఖచ్చితంగా నిన్ను ఇముడ్చుకోలేదు. 28 దయచేసి నా ప్రార్థనను, నా మనవిని ఆలకించు. నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. 29 గతంలో నీవు, ‘నేనక్కడ గౌరవింపబడుదు’నని చెప్పావు. దయచేసి ఈ ఆలయాన్ని రాత్రింబవళ్లు కనిపెట్టుకుని ఉండు. ఈ దేవాలయంలో నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. 30 దయచేసి నీ సేవకుడనైన నేను, ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు. మాకు తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని, అక్కడ నుండి మా ప్రార్థన ఆలకించి, మమ్మల్ని మన్నించుమని మేము నిన్ను వేడుకుంటున్నాము.
31 “ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, వాడు ఈ బలిపీఠం వద్దకు తేబడతాడు. ఆ వ్యక్తి గనుక నేరం చేయకపోతే, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ ఒక ప్రమాణం చేస్తాడు. 32 పరలోకంలోనుండి నీవు అది విని, ఆ వ్యక్తి పట్ల న్యాయనిర్ణయం చెయ్యి. దోషిని శిక్షించి, అమాయకుడైన వానిని క్షమించు.
33 “కొన్నిసార్లు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ పట్ల పాపం చేయవచ్చు; మరియు వారి శత్రువులు వారిని ఓడించవచ్చు. వారు మరల నీ వద్దకు తిరిగివచ్చి నీకు స్తోత్రం చేస్తారు. ఈ దేవాలయంలో వారు నిన్ను వేడుకొంటూ ప్రార్థనలు చేస్తారు. 34 పరలోకంలో నీవు వారి ప్రార్థన దయచేసి విను. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించు. మళ్లీ వారి రాజ్యం వారికి వచ్చేలా చేయి. ఈ రాజ్యం వారి పూర్వీకులకు నీవు ఇచ్చినదే!
35 “మరి కొన్ని సార్లు వారు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే, వారి భూముల్లో వర్షం కురియకుండా నీవు చేస్తావు. వారు మరల ఈ ప్రదేశానికి వచ్చి నిన్ను ప్రార్థించి, స్తుతిస్తారు. నీవు వారిని బాధించినప్పుడు, వారు చేసిన పాపాలకు వారు పశ్చాత్తాపం పొందుతారు. 36 ఇది జరిగినప్పుడు, పరలోకంలో నీవు వారి ప్రార్థన ఆలకించుము. నీ సేవకుడనగు నా తప్పులు, ఇశ్రాయేలు ప్రజల తప్పులను మన్నించు. పరలోకాన్నిగురించి వారికి బోధించు. యెహోవా, అప్పుడు దయచేసి రాజ్యంలో వర్షం కురిపించు. ఈ రాజ్యం వారికి నీవిచ్చినదే!
37 “ఈ నేల బాగా ఎండిపోయి, పంటలు పండక పోవచ్చు. లేక భయంకర వ్యాధి ప్రజలలో వ్యాపించవచ్చు. బహుశా పండిన పంటనంతా క్రిమికీటకాదులు నాశనం చేయవచ్చు. లేక నీ ప్రజలు వారి నగరాలలో శత్రువాత పడవచ్చు లేక నీ ప్రజలలో చాలామంది వ్యాధిగ్రస్థులు కావచ్చు. 38 వీటిలో ఏదైనా జరిగినప్పుడు, ఏ ఒక్కడైనా జరిగిన దానికి పశ్చాత్తాపపడి, చేతులు చాచి ఈ దేవాలయంలో నిలబడి నీకు ప్రార్థన చేస్తే, 39 దయచేసి అతని ప్రార్థన ఆలకించు. పరలోకంలో నీవు నీ నివాసంలో వుండగా దానిని ఆలకించు. ఆలకించి ఈ ప్రజలను మన్నించి, వారికి సహాయం చేయి. ప్రజలు నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోగల శక్తి నీకు తప్ప మరి ఎవ్వరికీ లేదు. కావున ప్రతి వ్యక్తికీ తీర్పు తీర్చి ఏది ఉచితమో వానికి అది చేయి. 40 నీవు అలాగున చేయి. దానివల్ల వారు నీ పట్ల భయభ్రాంతులతో, భక్తి భావంతో మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో సదా జీవిస్తారు.
41-42 “ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నీ ప్రతిభా విశేషాలను గురించి వింటారు. వారు దూర ప్రాంతాలనుండి దేవాలయానికి ప్రార్థనలు చేయటానికి వస్తారు. 43 నీ పరలోక నివాసంనుండి దయచేసి వారి మనవి ఆలకించు. ఇతర ప్రాంతాలవారు నిన్నడిగినదంతా దయచేసి నెరవేర్చు. ఇశ్రాయేలులో నీ ప్రజలు నీపట్ల ఎలాంటి భయభక్తులతో మెలుగుతారో, వారు కూడ అలా నీపట్ల విధేయులైయుంటారు. అప్పుడు సర్వప్రాంతాల ప్రజలంతా నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయం గురించి తెలుసుకుంటారు.
44 “కొన్ని సార్లు వారి శత్రువులతో పోరాడటానికి నీవు నీ ప్రజలకు ఆజ్ఞ ఇవ్వవచ్చు. అలాంటప్పుడు వారు నీవు ఎన్నుకున్న ఈ నగరానికి వచ్చిగాని, నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయానికి వచ్చిగాని ప్రార్థన చేస్తారు. 45 ఆ సమయంలో పరలోకంలో వున్న నీవు విని వారికి సహాయం చేయి.
46 “నీ ప్రజలు నీ పట్ల పాపం చేస్తారు. ఇది నాకు తెలుసు. ఎందువల్లననగా పాపం చేయని వ్యక్తి లేడు. నీ ప్రజల పట్ల నీకు కోపం వస్తుంది. వారి శత్రువులు వారిని ఓడించేలా చేస్తావు. వారి శత్రువులు వారిని బందీలు చేసి దూర ప్రాంతాలకు తీసుకొని పోతారు. 47 ఆ దూర పరాయి రాజ్యంలో నీ ప్రజలు జరిగిన దానిని జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన పాపానికి వారు పశ్చాత్తాప పడతారు. ఆ పరాయి రాజ్యంలో బందీలుగా వుండి వారు నిన్ను ప్రార్థిస్తారు. వారు ‘మేము పాపం చేశాం; మేము తప్పుచేశాం’ అని అంటారు. 48 వారు నిజంగా ఆ పరాయి రాజ్యాలలో నిన్ను ఆశ్రయిస్తే, నీవు వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ రాజ్యంవైపుగాని, నీవు ఎన్నుకున్న ఈ నగరంవైపు గాని, నేను నీ గౌరవార్థం కట్టించిన ఈ దేవాలయమువైపు గాని తిరిగి ప్రార్థిస్తే, 49 దయచేసి పరలోకంలో వున్న నీవు వారి ప్రార్థన ఆలకించు. 50 నీ ప్రజల పాపాలన్నిటినీ క్షమించు. నీకు వ్యతిరేకంగా తిరిగినందుకు కూడా వారిని క్షమించు. వారి శత్రువులు వారిపట్ల ఉదారంగా వుండేలా చేయి. 51 వారు నీ ప్రజలే అని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకో. నీవు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చినట్లు జ్ఞాపక ముంచుకో. మండుతున్న కొలిమిలోనుండి బయటికి తీసినట్లు వారిని రక్షించావు!
52 “ప్రభువైన దేవా, నా ప్రార్థనలను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ప్రార్థనలను దయచేసి ఆలకించు. వారు ఏ సమయములో నిన్ను నీ సహాయము కోరి ప్రార్థించినా వారి ప్రార్థన విను. 53 ఈ భూలోకంలోవున్న ప్రజానీకమంతటిలో వారిని నీవు నీ ప్రజలుగా ఎంపిక చేశావు. యెహోవా మా పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు, నీ సేవకుడైన మోషే ద్వారా ఈ వాగ్దానం నీవు చేశావు.”
54 ఈ విధంగా సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బలిపీఠం ముందు అతను మోకాళ్ల మీద ఉన్నాడు. తన చేతులను ఆకాశం వైవు చాచి అతడు ప్రార్థించాడు. సొలొమోను ప్రార్థన ముగించిన పిమ్మట లేచి నిలబడ్డాడు. 55 పిమ్మట, పెద్ద గొంతుతో ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించమని దేవుని అర్థించాడు. సొలొమోను ఇలా అన్నాడు:
56 “యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అలాగే ఆయన మనకు విశ్రాంతి ఇచ్చాడు! తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనేక శుభప్రదమైన వాగ్దానాలను చేశాడు. యెహోవా ఈ వాగ్ధానాలన్నిటినీ నెరవేర్చాడు. 57 మనదేవుడైన యెహోవాను మనతో ఉండమని అడుగుతున్నాను. ఆయన మన పూర్వీకులతో ఎలావున్నాడో అలాగే మనతో కూడ ఉండమని అడుగుతున్నాను. మనలను ఎన్నడూ వదిలి వుండవద్దని వేడు కుంటున్నాను. 58 ఈ రకంగా మనం ఆయనను ఆశ్రయించి, ఆయనను అనుసరించుదాం. ఆయన మనపూర్వీకులకు ఇచ్చిన న్యాయసూత్రాలను, ఆజ్ఞలను మనము ఆచరిద్దాము. 59 నా ఈ ప్రార్థన, నేనడిగిన అన్ని విషయాలు సదా గుర్తుచుకోమని మన దేవుడైన యెహోవాను అడుగుతున్నాను. తన సేవకుడైన రాజు కొరకు, ఇశ్రాయేలు ప్రజలకొరకు ఇవన్నీ జరిపించమని వేడుకుంటున్నాను. ఇలా ప్రతి రోజూ జరిపించమని కూడా వేడుకుంటున్నాను. 60 యెహోవా ఇవన్నీ జరిగేలా చేస్తే ప్రపంచ ప్రజలంతా మన దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకుంటారు. 61 మన దేవుడైన యెహోవాకు మీరంతా చెందియున్నారు. కావున మన దేవుడైన యెహోవాకు విధేయులై యుండాలి. ఆయన న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను మీరంతా తప్పక అనుసరించాలి. మీరిప్పుడు చేస్తున్నట్లు భవిష్యత్తులో కూడ ఆయన మార్గాన్ని మీరనుసరించాలి.”
62 తరువాత రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులందరు యెహోవాకు బలులు అర్పించారు. 63 సొలొమోను ఇరువది రెండు వేల పశువులను, ఒక లక్షాఇరువది వేల గొర్రెలను బలి ఇచ్చాడు. ఇవి సమాధాన బలులుగా అర్పించారు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులు దేవాలయాన్ని దేవునికి అంకితము చేశారు.
64 రాజైన సొలొమోను ఇంకా ఆ రోజు దేవుని ఆలయము ముందున్న ఆవరణను దేవుని కార్యము కొరకు పవిత్రం చేశాడు. అతనక్కడ దహన బలులు, ధాన్యార్పణలు, జంతువుల కొవ్వును సమాధాన సూచకంగా అర్పించాడు. అతి పరిశుద్ధ స్థలము ముందున్న కంచు బలిపీఠం ఇవన్నీ అర్పించటానికి బహు చిన్నది అగుటచే, రాజైన సొలొమోను ఆవరణలో అర్పించాడు.
65 రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు దేవాలయంలో ఆ విధంగా పండుగ జరుపుకున్నారు. ఉత్తర భాగాన బహుదూరంలో ఉన్న హమాతు కనుమ నుండి దక్షిణాన ఈజిప్టు సరిహద్దు వరకుగల ఇశ్రాయేలీయులంతా పండుగలో పాల్గొన్నారు. లెక్కకు మించిన జనాభా అక్కడ చేరింది. ఏడు రోజులపాటు వారంతా అక్కడ ఆహారపానీయాలు స్వీకరిస్తూ వేడుక చేసుకున్నారు. 66 ఎనిమిదవ రోజు సొలొమోను వారందరినీ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు. ప్రజలంతా రాజుకు కృతజ్ఞతా వందనాలు చెప్పి తమ ఇండ్లకు వెళ్లారు. తన సేవకుడైన దావీదుకు, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన సహాయ సంపత్తికి ప్రజలంతా చాలా సంతోషపడ్డారు.
5 మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. 2 క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.
3 కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. 4 అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. 5 ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు.
6 వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. 7 వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. 8 ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. 9 ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. 10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. 11 చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి. 12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. 13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. 14 వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది:
“నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో!
బ్రతికి లేచిరా!
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”
15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 18 మత్తు పదార్థాలు త్రాగుతూ, త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. 19 స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ, స్తుతిగీతాలు, పాటలు పాడండి. 20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.
భార్యాభర్తలు
21 మీకు క్రీస్తు పట్ల భయభక్తులు ఉన్నాయి. కనుక ఒకరికొకరు లోబడి ఉండండి.
22 స్త్రీలు మీరు ప్రభువుపట్ల విశ్వాసం కనబరచండి. అలాగే మీ భర్తలపట్ల కూడా గౌరవము కనబరుస్తూ జీవించండి. 23 క్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘము ఆయనకు శరీరంలాంటిది. ఆయన దాన్ని రక్షిస్తున్నాడు. అదే విధంగా భర్త భార్యకు శిరస్సులాంటివాడు. 24 సంఘం క్రీస్తుకు విధేయతగా ఉన్నట్లే భార్య తన భర్తకు అన్ని విషయాల్లో విధేయతగా ఉండాలి.
25 క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను అర్పించుకున్నట్లే భర్త తన భార్యను ప్రేమించి తనను అర్పించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. 26 క్రీస్తు తన సంఘాన్ని పవిత్రం చేయాలని తనను తాను అర్పించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుని వాక్యమను నీళ్ళతో కడిగాడు; సువార్త సందేశంతో దాన్ని శుద్ధీకరించాడు. 27 దాన్ని తేజోవంతంగా, పవిత్రంగా మరకా మచ్చా లేకుండా, మరే తప్పూ లేకుండా, అపకీర్తి లేకుండా చేసేందుకు ఆ సంఘం కోసం తనకు తానే అర్పించుకొన్నాడు.
28 అదే విధంగా భర్త తన భార్యను తన శరీరంగా భావించి ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తే తనను తాను ప్రేమించుకొన్నదానితో సమానము. 29 సహజంగా ఎవ్వరూ తమ శరీరాన్ని ద్వేషించరు. అందరూ తమ శరీరాన్ని పోషించుకొంటూ రక్షించుకొంటారు. 30 అదే విధంగా మనము క్రీస్తు శరీరంలో భాగాలము. కనుక ఆయన సంఘంగా ఉన్న మనల్ని ఆయన పోషించి రక్షిస్తాడు. 31 “ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.”(A) 32 ఇది గొప్ప రహస్యం. కాని నేను క్రీస్తును గురించి, ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. 33 ఏది ఏమైనా ప్రతి ఒక్కడూ తనను తాను ప్రేమించుకొన్నంతగా తన భార్యను ప్రేమించాలి. భార్య తన భర్తను గౌరవించాలి.
గోగుకు వ్యతిరేకంగా వర్తమానం
38 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, మాగోగు దేశపువాడైన గోగువైపు చూడు. అతడు మెషెకు మరియు తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన నాయకుడు. నీవు నా తరపున గోగుకు వ్యతిరేకంగా మాట్లాడుము. 3 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవతనికి తెలుపు, ‘గోగూ, నీవు మెషెకు మరియు తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన నాయకుడవు! కాని నీకు నేను విరోధిని. 4 నిన్ను నేను పట్టుకుని వెనుకకు తీసుకొని వస్తాను. నీ సైన్యంలోని వారందరినీ నేను పట్టుకు వస్తాను. గుర్రాలను, గుర్రపు సైన్యం వారందరిని పట్టుకు వస్తాను. మీ నోళ్లకు గాలం తగిలించి, మీ అందరినీ తిరిగి తీసుకు వస్తాను. మీ సైనికులంతా వారి దుస్తులు, డాళ్లు, కత్తులు ధరిస్తారు. 5 పెర్షియా (పారసీకము), ఇథియోపియ (కూషు) మరియు పూతు సైనికులందరు కూడ మీతో ఉంటారు. వారంతా తమ డాళ్లు, శిరస్త్రాణాలు ధరిస్తారు. 6 అక్కడ గోమరు కూడ తన సైన్యమంతటితో ఉంటుంది. తన సైనిక పటాలాలన్నిటితో దూరాన గల ఉత్తర దేశమైన తోగర్మా కూడ ఉంటుంది. ఆ బందీల ప్రదర్శనలో ఇంకా అనేకానేక మంది ప్రజలు ఉంటారు.
7 “‘సిద్ధంకండి. అవును. నీవు నీతో కలిసిన సైన్యాలు సిద్ధం కండి. మీరు సిద్ధమై మెలకువతో ఉండండి. 8 ఎంతో కాలం తరువాత మీరు విధులకు పిలవబడుతారు. తరువాతి సంవత్సరాలలో యుద్ధ బాధలనుండి విముక్తి చెందిన దేశంలోకి మీరు వస్తారు. ఆ దేశపు ప్రజలు తాము ఇతర దేశాలనుండి సమ కూర్చబడి ఇశ్రాయేలు పర్వతం మీదికి తిసుకొని రాబడతారు. గతంలో ఇశ్రాయేలు పర్వతాలు పదే పదే నాశనం చేయబడ్డాయి. అయితే ఈ ప్రజలు మాత్రం ఇతర దేశాల నుండి తిరిగి వచ్చినవారు. వారంతా క్షేమంగా నివసిస్తారు. 9 కాని నీవు వారిని ఎదిరించటానికి వస్తావు. నీవొక తుఫానులా వస్తావు. దేశాన్ని ఆవరించి గర్జించే మేఘంలా నీవు వస్తావు. నీవు, నీతో వున్న అన్య దేశాల సైనిక దళాలు ఈ ప్రజల మీదికి వచ్చి పడతారు.’”
10 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఆ సమయంలో నీ మనస్సుకు ఒక ఆలోచన వస్తుంది. నీవు కుయుక్తి పన్నటం మొదలు పెడతావు. 11 నీవు ఈ విధంగా అంటావు, ‘నగరాలకు రక్షణ గోడలు లేకుండా ఉన్న దేశంపై (ఇశ్రాయేలు) నేను దాడిచేస్తాను. వారు ప్రశాంతంగా జీవిస్తున్నారు. సురక్షితంగా ఉన్నామని వారనుకుంటున్నారు. నగరాలను రక్షించటానికి వాటిచుట్టూ గోడలే లేవు. వారి ద్వారాలకు తాళాలు లేవు. అసలు ద్వారాలే లేవు! 12 ఆ ప్రజలను నేను ఓడించి, వారి విలువైన సొమ్ములను నేను కొల్లగొడతాను. ఒకప్పుడు నాశనం చేయబడి, ఇప్పుడు జనంతో క్రిక్కిరిసిన ప్రాంతాలపై నేను యుద్ధం చేస్తాను. అన్యదేశాల నుండి వెనుకకు తీసుకొని రాబడిన ఆ ప్రజలతో (ఇశ్రాయేలు) నేను యుద్ధం చేస్తాను. ఇప్పుడా ప్రజలకు పశువులు, ఆస్తిపాస్తులు సమకూడాయి. వారు ప్రపంచానికి నాలుగుబాటల కూడలి స్థలంలో నివసిస్తున్నారు. కొన్ని అగ్ర రాజ్యాలు ఇతర బలమైన రాజ్యాలకు ఆ ప్రాంతం గుండానే వెళ్లాలి.’
13 “సెబా, దదానువారు; తర్షీషు వ్యాపారులు, ఇతర వ్యాపార కేంద్రాలైన నగరాల వారు నిన్ను చూచి ఇలా అంటారు, ‘విలువైన వస్తువులు పట్టుకు పోవడానికి వచ్చావా? మంచి మంచి వస్తువులు, వెండి బంగారాలు, పశువులు, ఇతర సంపద కొల్లగొట్టి పట్టుకుపోవటానికి నీవు నీ సైనిక దళాలను తీసుకొని వచ్చావా? ఆ విలువైన వస్తువులు పట్టుకు పోవటానికి వచ్చావా?’”
14 దేవుడు ఇలా అన్నాడు, “నరపుత్రుడా, నా తరఫున గోగుతో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని అతనికి తెలియజేయి, ‘నా ప్రజలు ప్రశాంతంగా, నిర్భయంగా జీవిస్తున్న సమయంలో నీవు వారిమీద దండయాత్రకు వస్తావు. 15 సుదూర ఉత్తర ప్రాంతంలో గల నీ దేశంనుండి నీవు వస్తావు. నీతో అనేక మందిని తీసుకొని వస్తావు. వారంతా గుర్రాల మీద వస్తారు. మీరంతా ఒక శక్తివంతమైన మహా సైన్యంగా ఉంటారు. 16 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయటానికి మీరు వస్తారు. దేశాన్ని ఆవరించే గర్జించే ఒక మేఘంలా నీవుంటావు. ఆ సమయం వచ్చినప్పుడు నా దేశం మీద యూద్ధానికి నిన్ను తీసుకొనివస్తాను. గోగూ, అప్పుడు నేనెంత శక్తిమంతుడనో దేశాలన్నీ తెలుసుకొంటాయి! వారు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు. నేను మహనీయుడనని వారు తెలుసుకుంటారు. నీకు నేనేమి చేస్తానో వారు చూస్తారు!’”
17 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “గతంలో నేను నిన్ను గురించి మాట్లాడినట్లు ఆ సమయంలో ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు. నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల సేవలను నేను వినియోగించుకున్నట్లు వారు గుర్తు తెచ్చుకుంటారు. ఇశ్రాయేలు ప్రవక్తలు గతంలో నా తరపున మాట్లాడుతూ, వారిపై యుద్ధానికి నేను నిన్ను తీసుకొని వస్తానని చెప్పినట్లు వారు గుర్తు తెచ్చుకుంటారు.”
18 నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: “ఆ సమయంలో ఇశ్రాయేలు దేశంపై యుద్ధానికి గోగు వస్తాడు. నేను నా కోపాన్ని చూపిస్తాను. 19 నా కోపంలో, ఉద్రేకంలో నేనిలా ప్రమాణం చేస్తున్నాను, ఇశ్రాయేలు దేశంలో ఒక తీవ్రమైన భూకంపం వస్తుందని నేను ఖచ్చితంగా చెపుతున్నాను. 20 ఆ సమయంలో జీవరాశులన్నీ భయంతో కంపించిపోతాయి. సముద్రంలో చేపలు, గాలిలో పక్షులు, అడవుల్లో క్రూరమృగాలు తదితర పాకే జీవులు, మానవులందరూ భయంతో వణికిపోతారు. పర్వతాలు కూలిపోతాయి. కొండ శిఖరాలు విరిగి పడతాయి. ప్రతి గోడా నేలకూలు తుంది!”
21 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “అంతేగాదు. ఇశ్రాయేలు పర్వతాల మీద అన్ని రకాల భయోత్పాతాలను గోగు మీదికి రప్పిస్తాను. అతని సైనికులు తమ కంగారులో ఒకరిపై ఒకరు పడి, తమ కత్తులతో ఒకరి నొకరు పొడుచుకొని చంపుకుంటారు. 22 రోగాలతోను, మరణంతోను గోగును శిక్షిస్తాను. గోగు మీదను, అనేక దేశాల నుండి వచ్చిన అతని సైన్యం మీదను వడగళ్లు, అగ్ని, గంధకం వర్షించేలా చేస్తాను. 23 నేనెంత గొప్పవాడినో నేనప్పుడు చూపిస్తాను. నేను మహనీయుడనని రుజువు చేస్తాను. నేను ఈ పనులు చేయటం అనేక దేశాల వారు చూస్తారు. నేనెవరినో అప్పుడు వారు కనుగొంటారు. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు.”
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
5 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
6 పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
“దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
7 యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
8 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
9 ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
నీ శక్తి గొప్పది!
విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37 చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”
38 కాని దేవా, ఏర్పరచబడిన నీ రాజు[b] మీద నీకు కోపం వచ్చింది.
నీవు అతన్ని ఒంటరివానిగా విడిచి పెట్టావు.
39 నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు.
రాజు కిరీటాన్ని నీవు దుమ్ములో పారవేసావు.
40 రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు.
అతని కోటలన్నింటినీ నీవు నాశనం చేశావు.
41 రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు.
దారినపోయే మనుష్యులు అతని నుండి వస్తువులు దొంగిలిస్తారు.
42 రాజు శత్రువులందరికీ నీవు సంతోషం కలిగించావు.
అతని శత్రువులను యుద్ధంలో నీవు గెలువనిచ్చావు.
43 దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి సహాయం చేశావు.
నీ రాజు యుద్ధంలో గెలిచేందుకు నీవు అతనికి సహాయం చేయలేదు.
44 అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు.
45 అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు.
నీవు అతన్ని అవమానించావు.
46 యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగైయుంటావా?
నీ కోపం అగ్నిలా ఎప్పటికీ మండుతూ ఉంటుందా?
ఎంత కాలం యిలా సాగుతుంది?
47 నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము.
అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.
48 ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు.
ఏ మనిషీ సమాధిని తప్పించుకోలేడు.
49 దేవా, గతంలో నీవు చూపించిన ప్రేమ ఎక్కడ?
దావీదు కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటావని అతనికి నీవు వాగ్దానం చేశావు.
50-51 ప్రభూ, ప్రజలు నీ సేవకులను ఎలా అవమానించారో దయచేసి జ్ఞాపకం చేసుకొనుము.
యెహోవా, నీ శత్రువులనుండి ఆ అవమానాలన్నింటినీ నేను వినాల్సి వచ్చింది.
ఏర్పరచబడిన నీ రాజును ఆ మనుష్యులు అవమానించారు.
52 యెహోవాను శాశ్వతంగా స్తుతించండి.
ఆమేన్, ఆమేన్![c]
© 1997 Bible League International