M’Cheyne Bible Reading Plan
దావీదు మనతో రావద్దు
29 ఆఫెకు వద్ద ఫిలిష్తీయులు తమ సైన్యాన్ని సమకూర్చారు. యెజ్రెయేలులో ఊట బావి వద్ద ఇశ్రాయేలు సైనికులు గుడారాలు వేసుకున్నారు. 2 ఫిలిష్తీయుల పాలకులు నూరుమంది దళాలతో, వేయిమంది దళాలతో ముందడుగు వేస్తున్నారు. దావీదు, అతని మనుష్యులు ఆకీషు వెనుక నడుస్తూఉన్నారు.
3 ఫిలిష్తీయుల దళాధిపతులు, “ఈ హెబ్రీవాళ్లు ఇక్కడ ఏమి చేస్తున్నారు” అని అడిగారు.
అప్పుడు ఆకీషు ఫిలిష్తీయుల దళాధిపతులతో, “ఇతడు దావీదు. ఇతడు సౌలు అధికారుల్లో ఒకడు. దావీదు చాలా కాలంగా నాతో ఉంటున్నాడు. దావీదు సౌలును విడిచిపెట్టి వచ్చి నా దగ్గర ఉంటున్నప్పటి నుండి ఇతనిలో నాకు ఏ తప్పూ కనబడలేదు,” అని చెప్పాడు.
4 కానీ ఆకీషు మీద ఫిలిష్తీ దళాధిపతులకు చాలా కోపం వచ్చింది. “దావీదును వెనుకకు పంపించు! నీవు ఇతనికిచ్చిన ఊరికి ఇతను తిరిగి వెళ్లిపోవాలి. యుద్ధంలోకి ఇతడు మనతో రావటానికి వీల్లేదు. ఇతను ఇక్కడ ఉన్నాడంటే మన మధ్యలో శత్రువును పెట్టుకున్నట్టే అవుతుంది. ఇతను మన మనుష్యులను చంపితన రాజు సౌలును సంతోష పెడతాడు. 5 ఈ దావీదును గూర్చే ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ
‘సౌలు వేల కొలదిగా హతము చేసెననియు,
దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు.’
అని పాట పాడారు” అని చెప్పారు ఆ దళాధిపతులు.
6 అందుచేత ఆకీషు దావీదును పిలిచాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా, నీవు నాకు నమ్మకంగా ఉన్నావు. నీవు నా సైన్యంలో పని చేయటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీవు వచ్చిన రోజునుండి నీలో ఏ తప్పూ నాకు కనబడలేదు. ఫిలిష్తీయుల పాలకులు[a] కూడ నీవు మంచివాడివని తలస్తున్నారు. 7 శాంతితో వెనుకకు వెళ్లిపో. ఫిలిష్తీయుల పాలకులకు విరోధంగా ఏమీ చెయ్యకు,” అని ఆకీషు చెప్పాడు.
8 దావీదు, “నేను ఏమి తప్పుచేసాను? నేను నీ దగ్గరకు వచ్చిన రోజునుండి ఈ రోజు వరకు నీవు నాలో ఏమి తప్పు కనుగొన్నావు? నా యజమానివైన రాజు యొక్క శత్రువులతో నన్నెందుకు పోరాడనివ్వవు?” అని దావీదు అడిగాడు.
9 అందుకు ఆకీషు, “నీవు మంచివాడవని నాకు తెలుసు. నీవు దేవుని దగ్గరనుండి వచ్చిన దేవదూతలా ఉన్నావు. కానీ ఫిలిష్తీయుల దళాధిపతి మాత్రం, ‘దావీదు మాతో కలిసి యుద్ధానికి రాకూడదు’ అంటూనే ఉన్నాడు. 10 తెల్లవారు ఝామునే లేచి నీవూ, నీ మనుష్యులూ వెనక్కు వెళ్లిపోవాలి. నేను మీకిచ్చిన నగరానికి తిరిగి వెళ్లండి. నిన్ను గురించి దళాధిపతి చెప్పిన చెడ్డ మాటలను లెక్క చెయకు. నీవు మంచివాడివి. కనుక సూర్యోదయం కాగానే వెళ్లిపోవాలి” అన్నాడు.
11 అందుచేత దావీదు, అతని మనుష్యులు తెల్లవారుఝామునే లేచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్లిపోయారు. ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు సాగిపోయారు.
అమాలేకీయులు సిక్లగును పట్టుకొనుట
30 దావీదు, అతని మనుష్యులు మూడవ రోజుకు సిక్లగు నగరానికి చేరుకున్నారు. అమాలేకీయులు సిక్లగును ముట్టడివేయుట వారు చూశారు. అమాలేకీయులు నెగెవ్ ప్రాంతం మీద దాడి చేసారు. వారు సిక్లగు మీద దాడి చేసి, పట్టణాన్ని తగులబెట్టారు. 2 సిక్లగులో ఉన్న స్త్రీలను బందీలుగా పట్టుకున్నారు. పడుచువాళ్లను, వృద్ధులను అందరినీ వారు పట్టుకొన్నారు. వారు ఎవ్వరినీ చంపలేదు. కేవలం వారిని బందీలుగా పట్టుకొన్నారు.
3 దావీదు, అతని మనుష్యులు సిక్లగు వచ్చేసరికి పట్టణమంతా తగులబడి పోవటం వారికి కనబడింది. వారి భార్యలు, కొడుకులు, కూతుళ్లు, అంతా బందీలుగా కొనిపోబడ్డారు. అమాలేకీయులు వారిని పట్టుకొన్నారు. 4 దావీదు, అతని సైనికులు సొమ్మసిల్లి పోయేలా గట్టిగా విలపించారు. 5 దావీదు యొక్క ఇద్దరు భార్యలు (యెజ్రెయేలీ అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్య, విధవరాలు అబీగయీలు) కూడ బందీలుగా కొనిపోబడ్డారు.
6 సైన్యంలోని మగవాళ్లంతా వారి కుమారులు, కుమార్తెలు బందీలుగా తీసుకుని పోబడినందుకు విచారంగా, కోపంగా ఉన్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకుంటున్నారు. ఇది దావీదును చాలా తల్లడిల్ల చేసింది. కానీ దావీదు తనదేవుడైన యెహోవా నుంచి బలంపొందాడు. 7 యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదును తెమ్మని” చెప్పాడు దావీదు.
8 అప్పుడు దావీదు యెహోవాకు ప్రార్థన చేసాడు “మా కుటుంబాలను బందీలుగా తీసుకునిపోయిన వారిని నేను వెంటాడనా? వారిని పట్టుకుంటానా?”
అని అడిగాడు, “వారిని వెంటాడు, నీవు వారిని పట్టుకుంటావు. మీ కుటుంబాలను రక్షించుకొంటావు” అని యెహోవా ప్రత్యుత్తర మిచ్చాడు.
దావీదు ఈజిప్టు బానిసను చూచుట
9-10 దావీదు తన ఆరువందల మంది మనుష్యులను తనతో బెసోరు సెలయేటి వద్దకు తీసుకుని వెళ్లాడు. కొంతమంది ఆ సెలయేటి వద్ద ఉండిపోయారు. అక్కడ నిలబడిపోయిన చాలా మంది అలసిపోయి ముందుకు వెళ్లలేనంత బలహీనంగా ఉన్నందువల్ల అక్కడే ఉండిపోయారు. కనుక దావీదు, మరో 400 మంది కలిసి, అమాలేకీయులను తరుముట కొనసాగించారు.
11 ఈజిప్టు మనిషి ఒకడు పొలాల్లో దావీదు మనుష్యులకు కనబడ్డాడు. వారు ఆ ఈజిప్టు వానిని దావీదు దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆ ఈజిప్టు వానికి వారు మంచినీళ్లు, కొంచెం ఆహారం ఇచ్చారు. 12 అంజూరపు పళ్లను, రొట్టెను, రెండు గుత్తుల ఎండు ద్రాక్షలను కూడ వారు అతనికి ఇచ్చారు. అవి తిని వాడు కొంత సేదతీరాడు, మూడు పగళ్లు, మూడు రాత్రులు అతడు ఏమీ తినిగాని, తాగిగాని ఎరుగడు.
13 “నీ యజమాని ఎవరు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు?” అని దావీదు అడిగాడు.
అందుకు, “నేను ఈజిప్టు వాడిని. ఒక అమాలేకీయుని బానిసను, మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. అందుచేత నా యజమాని నన్ను వదిలివేశాడు. 14 కెరేతీయులు నివసించే దక్షిణ ప్రాంతాన్ని, యూదా దేశాన్ని, కాలేబు ప్రజలు నివసించే నెగెవ్ ప్రాంతాన్ని మేము ముట్టడించాము. మేము సిక్లగును కూడ తగులబెట్టాము” అని ఆ ఈజిప్టువాడు దావీదుకు చెప్పాడు.
15 “అయితే మా భార్య పిల్లల్ని తీసుకుని పోయిన ఆ మనుష్యుల దగ్గరకు నీవు నన్ను తీసుకుని వెళతావా?” అని దావీదు ఆ ఈజిప్టు వాడిని అడిగాడు.
“నన్ను చంపననీ, నా యజమానికి తిరిగి నన్ను అప్పగించననీ దేవుని ముందర నీవు మాట ఇస్తే వారిని కనుక్కొనేందుకు నేను సహాయం చేస్తాను” అన్నాడు ఆ ఈజిప్టువాడు.
అమాలేకీయులను దావీదు ఓడించుట
16 ఈజిప్టువాడు దావీదును అమాలేకీయుల దగ్గరకు నడిపించాడు. ఆ సమయంలో వారు తాగుతూ, తింటూ నేలమీద ఇక్కడా అక్కడా పండుకొనివున్నారు. ఫిలిష్తీయుల దేశం నుండి, యూదా దేశం నుండి వారు కొల్లగొట్టిన అస్తిపాస్తులను చూసు కుంటూ సంబరం జరుపుకుంటున్నారు. 17 దావీదు వారిని ఓడించి, చంపేసాడు. సూర్యోదయం నుంచి మరునాటి సాయంత్రం వరకు వారు యుద్ధం చేశారు. సుమారు నాలుగు వందల మంది అమాలేకీ యువకులు మాత్రం ఒంటెలపై దూకి పారిపోయారు వారిలో మిగిలిన వారెవ్వరూ బ్రతికి బయటపడలేదు.
18 దావీదుకు తన ఇద్దరు భార్యలు తిరిగి దొరికారు. అమాలేకీయులు కొల్లగొట్టినదంతా దావీదు తిరిగి తీసుకున్నాడు. 19 ఏమీ ఒదిలిపెట్టబడలేదు. చిన్నాపెద్దా, వారి కూతుళ్లు, కొడుకులు, అందర్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. వారి విలువైన వస్తువులన్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. అమాలేకీయులు దోచుకున్నదంతా వారు తిరిగి తెచ్చుకున్నారు. దావీదు సమస్తం మళ్లీ తెచ్చుకున్నాడు. 20 గొర్రెలన్నిటినీ, పశువులన్నింటినీ దావీదు మరల తెచ్చుకున్నాడు. దావీదు మనుష్యులు వాటిని ముందు నడుపుకుంటూ వచ్చారు. వారు “ఇది దావీదు యొక్క బహుమానం” అన్నారు.
కొల్లసొమ్మును దావీదు అందరికీ సమంగా పంచుట
21 అలసి నీరసించి దావీదును వెంబడించలేక బెసోరు సెలయేటి దగ్గర దిగబడిపోయిన రెండు వందలమంది సైనికుల వద్దకు దావీదు తిరిగి వచ్చాడు. వారంతా దావీదును, సైన్యాన్ని చూచి ఎదురేగి ఆహ్యానించారు. 22 అయితే దావీదు వెంట వెళ్లిన గుంపులో కొందరు చెడ్డవాళ్లు, అల్లరి మూక ఉన్నారు. వారు, “ఈ రెండు వందల మంది మనతో రాలేదు. కనుక మనము తీసుకున్న వాటిలో వారికి ఎవరికీ ఏమీ ఇవ్వం. కాకపోతే వారివారి భార్య పిల్లలను మాత్రం వారు తీసుకుని వెళ్లిపోవచ్చు” అన్నారు.
23 అది విన్న దావీదు, “కాదు, సోదరులారా! అలా చేయకండి. యెహోవా మనకు ఇచ్చిన వాటి విషయం ఆలోచించండి. మనపై దాడి చేసిన శత్రువులను యెహోవా మనచేత ఓడించాడు. 24 మీరు చెప్పే దానిని ఎవరూ వినరు. సామానుల వద్ద కాపలా వున్న వారికి, యుద్ధం చేసిన వారికి సమంగానే వాటా వస్తుంది. అందరు సమంగానే పంచుకోవాలి” అన్నాడు. 25 దావీదు దీనిని ఇశ్రాయేలుకు ఒక నియమంగా, ఒక ఆదేశంగా చేశాడు. ఆ నియమం ఈ నాటికీ అమలులో వుంది.
26 దావీదు సిక్లగుకు వచ్చాడు. అతడు అమాలేకీయుల నుండి తెచ్చిన సంపదలో కొంత భాగాన్ని తన స్నేహితులైన యూదా నాయకులకు పంపాడు. “యెహోవా శత్రువులనుండి మేము తెచ్చిన సంపద లోనుంచి మీకో చిరుకానుక” అని చెప్పి పంపాడు దావీదు.
27 అమాలేకీయులనుంచి తాను తెచ్చిన వస్తువులలో మరికొన్నింటిని బేతేలు నాయకులకు, నెగెవులోని రామోతు, యత్తీరు, 28 అరోయేరు, షిష్మోతు, ఎష్తెమో, 29 రాకాలు మొదలగు యెరహ్మెయేలీ నగరాలకు 30 కేనీయుల, హోర్మా, కోరాషాను, అతాకు 31 మరియు హెబ్రోను నగరాల నాయకులకు దావీదు పంపించాడు. అంతేగాక, దావీదు తన మనుష్యులతో ఎక్కడెక్కడికి వెళ్లాడో ఆ ప్రాంతాల నాయకులకు కూడ వాటిలో కొన్నింటిని దావీదు పంపించాడు.
ఇశ్రాయేలు చరిత్ర నుండి హెచ్చరికలు
10 సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వికులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. 2 వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు. 3 అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు. 4 అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే. 5 అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతావాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.
6 వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు. 7 కొందరు పూజించినట్లు మీరు విగ్రహాలను పూజించకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొన్నారు. లేచి నృత్యం చేసారు.”(A) 8 మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చెయ్యటం వల్ల ఒక్క రోజులో వాళ్ళలో ఇరవై మూడు వేలమంది మరణించారు. 9 వాళ్ళు ప్రభువును శోధించిన విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను పాములు చంపివేసాయి. 10 వాళ్ళవలె సణగకండి. సణగిన వాళ్ళను మరణదూత చంపివేశాడు.
11 మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. 12 కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్నవాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి. 13 మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్థుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.
14 కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండండి. 15 మీరు తెలివిగలవాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి 16 మనము కృతజ్ఞతతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని పంచుకోవటము కదా? మనము విరిచిన రొట్టెను పంచుకోవటము క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా? 17 రొట్టె ఒకటే గనుక ఆ ఒకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనప్పటికిని ఒకే శరీరమైయున్నాము.
18 ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చినదాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా? 19 మరి నేను చెపుతున్నదానికి అర్థం ఏమిటి? విగ్రహాల్లో కాని, ఆరగింపు చేసిన ప్రసాదంలో కాని, ఏదో ప్రత్యేకత ఉందని చెపుతున్నానా? 20 లేదు. నేను చెపుతున్నది ఏమిటంటే యూదులుకానివాళ్ళు బలిపీఠాలపై బలి ఇచ్చినవి దయ్యాల కోసం బలి ఇవ్వబడ్డాయి. అవి దేవునికి అర్పితం కావు. మీరు దయ్యాలతో భాగస్వాములు కారాదని నా విన్నపం. 21 మీరు ప్రభువు పాత్రనుండి త్రాగుతూ దయ్యాల పాత్రనుండి కూడా త్రాగాలని ప్రయత్నించరాదు. మీరు ప్రభువు పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ దయ్యాల పంక్తిలో కూడా కూర్చోవటానికి ప్రయత్నం చేయరాదు. 22 మనం దేవుని కోపాన్ని రేపటానికి ప్రయత్నిద్దామా? మనం ఆయన కంటే శక్తిగలవాళ్ళమా? ఎన్నటికీ కాదు.
మరికొన్ని కర్తవ్యాలు
23 “మనకు ఏది చెయ్యటానికైనా స్వేచ్ఛ ఉంది” కాని అన్నీ లాభదాయకం కావు. “మనకు అన్నీ చెయ్యటానికి స్వేచ్ఛ ఉంది” కాని అన్నిటి వల్ల వృద్ధి కలుగదు. 24 ఎవరూ తమ మంచి కొరకే చూసుకోరాదు. ఇతరుల మంచి కోసం కూడా చూడాలి.
25 మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని అంగడిలో అమ్మే ఏ మాంసాన్నైనా తినండి. 26 “ఎందుకంటే ఈ భూమి, దానిలో ఉన్నవన్నీ ప్రభునివే.”(B)
27 క్రీస్తును విశ్వసించనివాడు మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు ఇష్టముంటే వెళ్ళండి. మనస్సుకు సంబంధించిన ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఏది ఉంచితే అది తినండి. 28 కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని మనస్సుకోసం దాన్ని తినకండి. 29 అంటే, మీ మనస్సు కోసం అని కాదు, ఆ చెప్పినవాని మనస్సు కోసం దాన్ని తినకండి. నా స్వాతంత్ర్యం విషయంలో అవతలివాని మనస్సు ఎందుకు తీర్పు చెప్పాలి? 30 నేను కృతజ్ఞతలు అర్పించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి ఇతరులు నన్నెందుకు విమర్శించాలి?
31 కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ దేవుని ఘనత కోసం చేయండి. 32 యూదులకు గాని, యూదులుకానివాళ్ళకు గాని, దేవుని సంఘానికి గాని, కష్టం కలిగించకుండా జీవించండి. 33 నేను చేస్తున్నట్లు మీరు చెయ్యండి. నేను అన్ని పనులూ ఇతరులను సంతోషపెట్టాలని చేస్తాను. నా మంచి నేను చూసుకోను. వాళ్ళ మంచి కోసం చేస్తాను. వాళ్ళు రక్షింపబడాలని నా ఉద్దేశ్యం.
దేవాలయం వద్ద జరిగిన పాప క్రియలు
8 ఒకరోజు నేను (యెహెజ్కేలు) నా ఇంటిలో కూర్చొని ఉన్నాను. యూదా పెద్దలు నా ముందు కూర్చున్నారు. ఇది చెరబట్టబడిన కాలంలో ఆరవ సంవత్సరం, ఆరవ నెల (సెప్టెంబరు) ఐదవ రోజున జరిగింది. నా ప్రభువైన యెహోవా శక్తి అకస్మాత్తుగా నామీదికి వచ్చింది. 2 అగ్నివంటి రూపాన్నొకటి నేను చూశాను. అది మానవ శరీరంలా ఉంది. నడుము నుండి క్రిందికి అది అగ్నిలా కన్పించింది. నడుము నుండి పైకి ఆ ఆకారం దేదీప్యమానంగా వెలుగొందుతూ, అగ్నిలో కర్రుకాలిన లోహంలా ఉంది. 3 పిమ్మట చెయ్యివంటిదొకటి నేను చూశాను. ఆ చెయ్యి నా మీదికి వచ్చి నా తలపై జుట్టుపట్టుకుంది. పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపింది. ఆ దేవదర్శనంలో ఆయన నన్ను యెరూషలేముకు తీసుకొని వెళ్లాడు. ఆయన నన్ను లోపలి ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. అది నగరానికి ఉత్తర దిశన ఉంది. ఆ ద్వారం దగ్గరే దేవుడు అసూయపడేలా చేసిన విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. 4 కాని ఇశ్రాయేలు దేవుని మహిమ అక్కడ ఉంది. ఆ మహిమ నేను కెబారు కాలువ వద్ద లోయలో చూసిన దర్శనంలా ఉంది.
5 దేవుడు నాతో మాట్లాడుతూ, “నరపుత్రుడా, ఉత్తర దిశవైపు చూడు!” అన్నాడు. నేను ఉత్తరానికి చూశాను. అక్కడ బలిపీఠం వద్దగల ద్వారానికి ఉత్తరంగా దేవుడు అసూయ పడునట్లు చేసిన విగ్రహం ఉంది.
6 మళ్లీ దేవుడు నాకు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి భయంకరమైన పనులు చేస్తున్నారో నీవు చూస్తున్నావా? వారు దానిని ఖచ్చితంగా నా ఆలయం ప్రక్కనే నెలకొల్పారు! నీవు నాతో వస్తే, ఇంకా భయంకరమైన విషయాలు చూస్తావు!”
7 అందువల్ల నేను ఆవరణద్వారం వద్దకు వెళ్లాను. గోడలో ఒక రంధ్రాన్ని చూశాను. 8 దేవుడు నాతో, “నరపుత్రుడా, గోడలో ఒక రంధ్రం చెయ్యి” అని చెప్పాడు. కాబట్టి నేను ఆ తలుపులో ఒక రంధ్రాన్ని చేశాను. లోపల ఒక తలుపు కన్పించింది.
9 అప్పుడు దేవుడు నాతో, “లోనికి వెళ్లి ఇక్కడ ప్రజలు చేస్తున్న భయంకరమైన, దుష్టమైన పనులను చూడు” అని అన్నాడు. 10 నేను లోనికి వెళ్లి చూశాను. అక్కడ మీరు ఊహించటానికే అసహ్యకరమైన పాముల, బల్లుల, క్రిమికీటకాదుల, ఇతర జంతువుల ప్రతిమలు, శిల్పాలు ఉన్నాయి. అవన్నీ ఇశ్రాయేలీయులు ఆరాధించే హేయమైన విగ్రహాలు. ఆ జంతువుల బొమ్మలు అన్ని గోడల మీదా చుట్టూ చెక్కబడి ఉన్నాయి!
11 అక్కడ షాఫాము[a] కుమారుడైన యజన్యాయును, మరి డెబ్బయి మంది ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) ప్రజలతో కలసి ఆ స్థలంలో ఆరాధిస్తున్నారు. వారు ఖచ్చితంగా ప్రజల ముందు నిలబడి ఉన్నారు! ప్రతీ పెద్ద మనిషి చేతిలో ఒక ధూప కలశం ఉంది. సాంబ్రాణి ధూపం గాలిలోకి లేస్తూ ఉంది. 12 అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో ఏమి చేస్తున్నారో నీవు చూశావా? ప్రతి ఒక్కడూ తన బూటకపు దేవునికి ఒక గది కలిగి ఉన్నాడు! ‘మనల్ని యెహోవా చూడలేడు. యెహోవా ఈ దేశాన్ని వదిలేశాడు’ అని వారిలో వారనుకుంటున్నారు.” 13 దేవుడు మళ్లీ, “నీవు నాతో వస్తే, ఆ మనుష్యులు మరీ భయంకరమైన పనులు చేయటం చూస్తావు!” అని అన్నాడు.
14 దేవుడు నన్ను ఆలయ ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. ఈ ద్వారం ఉత్తరపు దిక్కున ఉంది. అక్కడ స్త్రీలు కూర్చుని, ఏడ్వటం చూశాను. వారంతా బూటకపు దైవము తమ్మూజును[b] గురించి దుఃఖిస్తున్నారు!
15 దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ భయంకరమైన విషయాలు గమనించావా? నా వెంట రమ్ము. నీవింతకంటే ఘోరమైన విషయాలు చూస్తావు!” 16 ఆయన నన్ను యెహోవా ఆలయం లోపలి ఆవరణలోనికి తీసుకొని వెళ్లాడు. ఆక్కడ ఇరవైఐదు మంది క్రిందికి వంగి ఆరాధించటం చూశాను. వారు ముందు మండపానికి, బలి పీఠానికి మధ్యలో ఉన్నారు. కాని వారు తప్పు దిశకు తిరిగి కూర్చున్నారు! వారి వీపులు పవిత్ర స్థలానికి వెనుతిరిగి ఉన్నాయి. వారు సూర్యుణ్ణి ఆరాధించటానికి వంగు తున్నారు!
17 అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, ఇది చూశావు గదా! యూదా ప్రజలు ఈ నా ఆలయాన్ని అతి సామాన్యమైనదిగా భావిస్తూ, ఆలయంలోనే వారు చెడు పనులు కొనసాగిస్తున్నారు.! ఈ దేశమంతా దౌర్జన్యంతో నిండిపోయింది. వారు నిరంతరం చెడుకార్యాలు చేస్తూ నాకు పిచ్చి పట్టిస్తున్నారు. చూడు, ఒక బూటకపు దేవతలా చంద్రుని ఆరాధించటానికి వారు ముక్కులకు ఉంగరాలు[c] పెట్టుకుంటున్నారు. 18 వారికి నా కోపం చూపిస్తాను! వారిపట్ల ఏమాత్రం కనికరం చూపించను! వారిని గురించి నేను విచారించను! వారు ప్రాధేయపడి నన్ను పిలుస్తారు. కాని వారి అభ్యర్థనను నేను వినను!”
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.
47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
భూలోకమంతటికీ ఆయన రాజు.
3 ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
4 దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.
5 బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
యెహోవా దేవుడు లేచాడు.
6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
7 దేవుడు సర్వలోకానికి రాజు.
స్తుతిగీతాలు పాడండి.
8 దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
9 రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
దేవుడు మహోన్నతుడు.
© 1997 Bible League International