M’Cheyne Bible Reading Plan
అమాలేకీయులను సౌలు నాశనం చేయుట
15 సమూయేలు ఒక రోజు సౌలు వద్దకు వచ్చాడు. గతంలో అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయటానికి యెహోవా తనను పంపిన విషయం జ్ఞాపకం చేస్తూ, మరో వర్తమానం యెహోవా దగ్గర నుండి తెచ్చినట్లు సమూయేలు చెప్పాడు. 2 సర్వశక్తిమంతుడైన యెహోవా వర్తమానం ఇది: “ఈజిప్టునుండి విముక్తి పొంది ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పుడు వారిని కనానుకు పోకుండా ఆపాలని అమాలేకీయులు ప్రయత్నించారు. అమాలేకీయులు ఏమి చేశారో నేను స్వయంగా చూశాను. 3 నీవు ఇప్పుడు వెళ్లు. అమాలేకీయులపై యుద్ధం ప్రకటించు. నీవు అమాలేకీయులను సర్వనాశనం చేయాలి. అంతేగాదు, వారికి చెందిన ప్రతి వస్తువూ నాశనం కావాలి. దేనినీ బతకనివ్వకు. పురుషులను, స్త్రీలను, పిల్లలను పసివాళ్లను, పశువులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను-అన్నింటినీ హతమార్చి వేయాలి.”
4 సౌలు సైన్యాన్ని పిలిచి తెలాయీము వద్ద సమీకరించాడు. సైనికులు రెండు లక్షలమంది ఉన్నారు. అందులో పదివేలమంది యూదాకు చెందినవారు. 5 సౌలు అమాలేకీయుల ఒక నగర సమీపానికి వెళ్లి లోయలో పొంచివున్నాడు. 6 ఆ ప్రాంతంలో కేనీయులు కూడా వున్నారు. సౌలు వారితో అమాలేకీయులను వదిలి వెళ్లిపొమ్మన్నాడు. అలా వెళ్తే అమాలే కీయులతో పాటు వారిని చంపనని చెప్పాడు. “ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి వచ్చినప్పుడు మీరు వారికి కనికరము చూపారు గనుక మిమ్మల్ని చంపను” అని సౌలు అన్నాడు. అది విని అమాలేకీయులనుండి విడి పోయి కేనీయులు వెళ్లిపోయారు.
7 అమాలేకీయులను సౌలు ఓడించాడు. హవీలా నుండి ఈజిప్టు సరిహద్దుల్లోని షూరు పట్టణం వరకూ సౌలు వారితో పోరాడాడు. 8 అమాలేకీయుల రాజైన అగగును మాత్రం సజీవంగా పట్టుకుని అతని సైన్యం అంతటినీ సౌలు చంపేసాడు. 9 సౌలు, మరియు ఇశ్రాయేలు సైనికులు అగగును బతకనిచ్చారు. బలంగా, ఆరోగ్యంగావున్న గొర్రెలను, పశువులను, గొర్రెపిల్లలను కూడా వారు వదిలివేశారు. ప్రయోజన కరమైన వాటన్నింటినీ చంపకుండా విడిచిపెట్టి వారికి అవసరం లేని వాటన్నింటినీ వారు చంపేసారు.
సమూయేలు సౌలుకు తన పాపం విషయం చెప్పుట
10 యెహోవా వాక్కు సమూయేలు దగ్గరకు వచ్చింది. 11 “సౌలు నన్ను అనుసరించటం మానేశాడు. కావున సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతున్నాను. అతడు నా ఆజ్ఞలను శిరసావహించలేదు.” అని యెహోవా చెప్పాడు. ఇది విన్న సమూయేలు గాభరా పడిపోయాడు. రాత్రంతా దుఃఖంతో యెహోవాని ప్రార్థించాడు.
12 మరునాటి తెల్లవారుఝామున సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్లాడు. కానీ అక్కడి ప్రజలు, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. తన గౌరవార్థం అక్కడ ఒక జ్ఞాపక స్తంభం నిలబెట్టడానికి సౌలు వెళ్లాడు. తర్వాత సౌలు అనేక చోట్లకు ప్రయాణం చేసి, చివరికి గిల్గాలు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాడు” అని చెప్పారు.
కనుక సౌలు ఉన్న చోటికే సమూయేలు వెళ్లాడు. సౌలు అమాలేకీయుల దగ్గర తీసుకున్నవాటిలో మొదటి భాగాన్ని అప్పుడే అర్పించాడు. సౌలు వాటిని దహనబలిగా యెహోవాకు అర్పిస్తున్నాడు. 13 సమూయేలు సౌలు దగ్గరకు వెళ్లాడు: “యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక! యెహోవా ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను” అని సౌలు చెప్పాడు.
14 “ఆజ్ఞ నెరవేర్చితే మరి నేను వింటున్న గొర్రెల, పశువుల అరుపులు ఏమిటి” అని సమూయేలు ప్రశ్నించాడు.
15 సౌలు ఇలా జవాబు చెప్పాడు: “సైనికులు వాటిని అమాలేకీయులనుండి తీసుకున్నారు. నీ దేవుడైన యెహోవాకు దహనబలి చేయటానికి సైనికులు మంచి గొర్రెలను పశువులను కాపాడారు. కాని మిగిలిన వాటన్నిటినీ మేము చంపేశాము.”
16 సమూయేలు, “ఇంక మాట్లాడకు. రాత్రి యెహోవా నాకు ఏమి చెప్పాడో నీవు విను” అన్నాడు సౌలుతో.
సౌలు, “సరే నాకు చెప్పు” అన్నాడు.
17 సమూయేలు ఇలా చెప్పాడు: “గతంలో నీవు ప్రముఖుడవు కాదని తలచావు. కాని ఇశ్రాయేలు వంశాలన్నింటికీ నీవు నాయకుడవైనావు. ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా నిన్ను ఎంపిక చేశాడు. 18 యెహోవా నిన్ను ఒక ప్రత్యేక పనిమీద పంపించాడు. ‘వెళ్లి ఆ దుర్మార్గపు అమాలేకీయులనందరినీ చంపివేయి. వాళ్లను పూర్తిగా నాశనం చేయి’ అని యెహోవా చెప్పాడు. 19 కానీ నీవు యెహోవా మాట వినలేదు. వాటిని నీకోసం అట్టే పెట్టుకోవాలను కున్నావు. కనుక ఏది చెడ్డదని యెహోవా చెప్పాడో అదే నీవు చేసావు.”
20 సౌలు, “నేనైతే యెహోవాకు విధేయుడనయ్యాను. యెహోవా పంపిన చోటికి నేను వెళ్లాను. అమాలేకీయులనందరినీ నేను నాశనం చేశాను. వారి రాజు అగగును మాత్రమే నేను తిరిగి తీసుకుని వచ్చాను. 21 సైనికులు మాత్రమే నీ దేవుడైన యెహోవాకు గిల్గాలువద్ద బలి అర్పించేందుకు శ్రేష్ఠమైన గొర్రెలను, పశువులను తీసుకుని వచ్చారు” అన్నాడు.
22 కానీ సమూయేలు, “యెహోవాకు ఎక్కువ ప్రీతి పాత్రమైనది ఏమిటి? దహనబలులు, బలులా? లేక యెహోవా ఆజ్ఞాపాలనయా? దేవునికి బలులు అర్పించటంకంటే, ఆయనకు విధేయుడై ఉండటం శ్రేష్ఠము. పొట్టేళ్ల కొవ్వును అర్పించేకంటే, దేవుని వాక్కు వినటం శ్రేష్ఠము. 23 అవిధేయుడవై ఉండట మంటే మంత్రం వేసే పాపం లాంటిదే. మొండి వైఖరితో నీకు తోచినదే చేయటం విగ్రహారాధనవంటి పాపమే. నీవు యెహోవా ఆజ్ఞను ధిక్కరించావు. ఈ కారణంగా ఇప్పుడు యెహోవా నిన్ను రాజుగా తిరస్కరిస్తున్నాడు.”
24 అప్పుడు సౌలు, “నేను పాపం చేశాను. నేను యెహోవా ఆజ్ఞలకు లోబడలేదు. నీవు చెప్పినట్లుగా నేను చేయలేదు. నేను ప్రజలకు భయపడ్డాను. వారు ఎలా చెప్పితే అలా చేశాను. 25 నా పాపం క్షమించుమని ఇప్పుడు నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను యెహోవాని ఆరాధిస్తాను, నాతో కూడ రా” అని సమూయేలుతో చెప్పాడు.
26 కానీ సమూయేలు, “నేను నీతో మళ్లీ వెనుకకురాను. నీవు యెహోవా ఆజ్ఞ తిరస్కరించావు. ఇప్పుడు యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజుగా తిరస్కరిస్తున్నాడు” అని చెప్పాడు.
27 సమూయేలు వెళ్లిపోవటానికి తిరగగానే, సౌలు అతని అంగీ పట్టుకున్నాడు. అంగీ చిరిగిపోయింది. 28 సమూయేలు, “నీవు నా అంగీ చింపేసావు. అదే విధంగా ఈవేళ యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీనుంచి తీసేస్తాడు. నీ స్నేహితుల్లో ఒకరికి ఈ రాజ్యాన్ని యెహోవా ఇచ్చాడు. ఇతడు నీకంటే మంచివాడు. 29 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెహోవా శాశ్వతంగా జీవిస్తాడు. యెహోవా అబద్ధం చెప్పడు. తన మనస్సు మార్చుకోడు. అనుక్షణం మనస్సుమార్చుకునే మనిషిలాంటివాడు కాదు యెహోవా” అని సౌలుతో చెప్పాడు.
30 సౌలు సమాధానమిస్తూ, “సరే నేను పాపం చేశాను. కాని దయచేసి నాతోకూడ రా. కనీసం నాయకుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు కొంచెం మర్యాద చూపించు. దేవుడైన యెహోవాను నేను ఆరాధించటానికి నాతోకూడ తిరిగి రా” అన్నాడు. 31 కనుక సమూయేలు సౌలుతో కలిసి వెనుకకు వెళ్లాడు. సౌలు యెహోవాను ఆరాధించాడు.
32 “అమాలేకీయుల రాజైన అగగును తన వద్దకు తీసుకుని రమ్మని” సమూయేలు చెప్పాడు.
అగగుసంకెళ్లతో బంధించబడి సమూయేలు ముందుకు వచ్చాడు. “నిశ్చయంగా ఇతడు నన్ను చంపడు” అని అగగు అనుకున్నాడు.
33 కాని సమూయేలు అగగుతో, “నీ కత్తివేటుకు గురిచేసి అనేకమంది పిల్లలను తమ తల్లులకు లేకుండా చేసావు. కనుక ఇప్పుడు నీ తల్లికి పిల్లలు ఉండరు,” అంటూ గిల్గాలులో యెహోవా ఎదుట సమూయేలు అగగును ముక్కలుగా నరికి వేశాడు.
34 అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయాడు. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. 35 ఆ తరువాత సమూయేలు తన జీవితాంతం సౌలును మళ్లీ ఎన్నడూ చూడలేదు. కాని సౌలు విషయంలో సమూయేలు చాలా దుఃఖించాడు. సౌలును ఇశ్రాయేలుకు రాజుగా చేసినందుకు యెహోవా చాలా చింతించాడు.
అధికారులు
13 ప్రభుత్వాన్ని దేవుడే నియమించాడు కనుక ప్రతి ఒక్కడూ ప్రభుత్వం చెప్పినట్లు చెయ్యాలి. ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని కూడా దేవుడే నియమించాడు. 2 అందువల్ల ప్రభుత్వాన్ని ఎదిరించిన వాడు దేవుని ఆజ్ఞను ఎదిరించిన వానితో సమానము. వాళ్ళు శిక్షననుభవించవలసి వస్తుంది. 3 సక్రమంగా నడుచుకొనేవాళ్ళు పాలకులకు భయపడరు. తప్పు చేసినవాళ్ళకే ఆ భయం ఉంటుంది. ప్రభుత్వానికి భయపడకుండా ఉండాలంటే, సక్రమంగా నడుచుకోండి. అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని మెచ్చుకుంటుంది.
4 మీ మంచి కోసం ప్రభుత్వ అధికారులు దేవుని సేవకులుగా పని చేస్తున్నారు. కాని మీరు తప్పు చేస్తే భయపడవలసిందే! వాళ్ళు ఖడ్గాన్ని వృథాగా ధరించరు. దేవుని సేవకులుగా వాళ్ళు తప్పు చేసినవాళ్ళను శిక్షించటానికి ఉన్నారు. 5 అందువల్ల శిక్షింపబడుతారనే కాకుండా మీ అంతరాత్మల కోసం కూడా అధికారులు చెప్పినట్లు చెయ్యటం అవసరం.
6 అధికారులు దేవుని సేవకులు. వాళ్ళు తమ కాలాన్నంతా దీని కోసమే ఉపయోగిస్తున్నారు. అందువల్లే మీరు పన్నులు చెల్లిస్తున్నారు. 7 ఎవరికేది ఋణపడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు ఋణపడి ఉంటే పన్నుల్ని, సుంకాలు ఋణపడి ఉంటే సుంకాల్ని, మర్యాదను ఋణపడి ఉంటే మర్యాదను, గౌరవాన్ని ఋణపడి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.
ప్రేమ
8 తోటివాళ్ళను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నంతా అనుసరించినట్లే కనుక ఇతర్లను ప్రేమించటం అనే ఋణంలో తప్ప మరే ఋణంలో పడకండి. 9 “వ్యభిచారం చెయ్యరాదు; హత్య చెయ్యరాదు; దొంగతనం చెయ్యరాదు; ఇతర్లకు చెందిన వాటిని ఆశించరాదు”(A) అనే మొదలగు ఆజ్ఞలన్నీ, “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి. 10 ప్రేమ పొరుగు వానికి హాని కలిగించదు. కాబట్టి ధర్మశాస్త్రం సాధించాలి అనుకొన్నదాన్ని ప్రేమ సాధిస్తుంది.
11 యేసు క్రీస్తును మనం నమ్మిన నాటి కంటే నేడు రక్షణ దగ్గరగా ఉంది కనుక ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకోండి. ఆ గడియ అప్పుడే వచ్చేసింది. కనుక నిద్రనుండి మేలుకోండి. 12 రాత్రి గడిచిపోతోంది. అంతం కాని పగలు త్వరలోనే రాబోతోంది. అందువల్ల చీకట్లో చేసే పనుల్ని ఆపి, పగటి వేళ ధరించే ఆయుధాల్ని ధరించండి. 13 పగటి వేళకు తగ్గట్టుగా మర్యాదగా మసలుకొండి. ఉగ్రత తాండవం చెయ్యకుండా, త్రాగి మత్తులు కాకుండా, వ్యభిచారం చెయ్యకుండా, నీతి లేని పనులు చెయ్యకుండా, కలహాలు, అసూయలు లేకుండా ప్రవర్తించండి. 14 యేసు క్రీస్తు ప్రభువును వస్త్రంగా ధరించండి. శారీరక వాంఛల్ని ఏ విధంగా తృప్తి పరుచుకోవాలా అని ఆలోచించటం మానుకోండి.
యెరూషలేము పతనం
52 యూదాకు రాజయ్యే నాటికి సిద్కియాకు ఇరవై యొక్క సంవత్సరాల వయస్సు. యెరూషలేములో సిద్కియా పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఈమె తండ్రి పేరు యిర్మీయా.[a] హమూటలు వంశం వారు లిబ్నా పట్టణవాసులు. 2 రాజైన యెహోయాకీము మాదిరిగానే సిద్కియా కూడా దుష్ట కార్యాలు చేశాడు. సిద్కియా ఆ చెడు కార్యాలు చేయటం యెహోవాకు ఇష్టం లేదు. 3 వారి పట్ల యెహోవా కోపగించటంతో యెరూషలేములోను, యూదాలోను భయంకరమైన సంఘటనలు జరిగాయి. చివరికి యెరూషలేము, యూదా ప్రజలను తన ముందు నుంచి దూరంగా తోసివేశాడు.
బబులోను రాజుమీద సిద్కియా తిరుగుబాటు చేశాడు. 4 కావున సిద్కియా పాలనలో తొమ్మిది సంవత్సరాల పది నెలలు దాటి పదవ రోజు[b] గడుస్తూ వుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి దండెత్తాడు. నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా వెంటబెట్టుకు వచ్చాడు. బబులోను సైన్యం యెరూషలేము బయట దిగింది. తరువాత వారు నగరపు గోడల మీదికి ఎగబాకటానికి అనువుగా చుట్టూ దిమ్మలు కట్టారు. 5 రాజైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం[c] జరిగే వరకు యెరూషలేము నగరం బబులోను సైన్యం ముట్టడిలో వుంది. 6 ఆ సంవత్సరం నాల్గవ నెలలో తొమ్మిదవ రోజున నగరంలో కరువు తీవ్రమయ్యింది. నగరంలో ఆహార పదార్ధాలు అయిపోవటం కారణంగా ప్రజలకు తినటానికి తిండి కరువయ్యింది. 7 ఆ రోజున బబులోను సైన్యం యెరూషలేములోనికి ప్రవేశించింది. యెరూషలేము సైన్యం పారిపోయింది. రాత్రి సమయంలో సైనికులు నగరం వదిలి పారిపోయారు. రెండు గోడల మధ్య ద్వారం గుండా వారు బయటకి పోయారు. ఆ ద్వారం రాజు యొక్క ఉద్యానవనం వద్ద వుంది. బబులోను సైన్యం నగరాన్ని చుట్టుముట్టి ఉన్నప్పటికీ, యెరూషలేము సైనికులు పారిపోగలిగారు. వారు ఎడారివైపు పారిపోయారు.
8 కాని, కల్దీయుల సైన్యం రాజైన సిద్కియాను వెంటాడింది. వారు యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు. కాని సిద్కియా సైనికులంతా పారిపోయారు. 9 బబులోను సైన్యం రాజైన సిద్కియాను చెరబట్టింది రిబ్లా నగరంలోవున్న బబులోను రాజు వద్దకు అతన్ని తీసికొని వెళ్లారు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో వుంది. బబులోను రాజు రిబ్లా నగరంలో రాజైన సిద్కియాపై తీర్పు ప్రకటించాడు. 10 రిబ్లా నగరంలోనే బబులోను రాజు సిద్కియా కుమారులను చంపివేశాడు. తన కుమారులు క్రూరంగా చంపబడటం సిద్కియా బలవంతాన చూశాడు. (ఆ హింస చూడటానికి అతనిపై వత్తిడి వచ్చింది.) యూదా అధికారులందరినీ కూడ బబులోను రాజు చంపివేశాడు. 11 పిమ్మట బబులోను రాజు సిద్కియా కండ్లు పెరికివేశాడు. అతనికి కంచు గొలుసులు వేశాడు. తరువాత సిద్కియాను అతడు బబులోనుకు తీసికొనిపోయాడు. బబులోనులో సిద్కియాను అతడు చెరసాలలో ఉంచాడు. సిద్కియా చనిపోయే వరకు చెరసాలలోనే ఉన్నాడు.
12 బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. రాజైన నెబుకద్నెజరు పాలనలో పందొమ్మిదవ సంవత్సరం[d] ఐదవనెలలో పదవ రోజున అతను వచ్చాడు. బబులోనులో నెబూజరదాను ఒక ముఖ్యమైన నాయకుడు. 13 నెబూజరదాను దేవాలయాన్ని తగులబెట్టాడు. రాజభవనాన్ని, యెరూషలేములో ఇతర గృహాలను కూడ అతడు తగులబెట్టాడు. యెరూషలేములో ప్రతి ముఖ్య భవనాన్నీ అతడు తగులబెట్టాడు. 14 కల్దీయుల సైన్యమంతా కలిసి యెరూషలేము చుట్టూవున్న గోడలను కూలగొట్టింది. రాజుయొక్క ఒక ప్రత్యేక అంగరక్షకుని క్రింద ఆ సైన్యం ఉంది. 15 సైనికాధికారి నెబూజరదాను ఇంకా యెరూషలేములో మిగిలిన జనాన్ని బందీలుగా పట్టుకున్నాడు.[e] బబులోను రాజుకు ఇంతకుముందే లొంగిపోయిన వారిని కూడా చెరబట్టి తీసికొనిపోయాడు. యెరూషలేములో మిగిలిన నిపుణులైన చేతి పనివారిని కూడా అతడు తీసికొని వెళ్లాడు. 16 కాని నెబూజరదాను మిక్కిలి పేదవారిని కొందరిని రాజ్యంలో వదిలివేశాడు. వారిని ద్రాక్ష తోటలలోను, పొలాలలోను పవిచేయటానికి అతడు వదలి వెళ్లాడు.
17 కల్దీయుల సైన్యం ఆలయంలోని కంచు స్తంభాలను విరుగగొట్టింది. యెహోవాయొక్క ఆలయంలో గల స్తంభాలను, కంచు సముద్రమును (కోనేరు) కూడ ముక్కలు చేశారు. ఆ కంచునంతా వారు బబులోనుకు తీసికొని పోయారు. 18 బబులోను సైన్యం ఆలయం నుండి ఆ వస్తు సామగ్రిని కూడ తీసికొని పోయింది: కుండలు, పారవంటి గరిటెలు, వత్తులను ఎగదోసే పనిముట్లు, పెద్ద గిన్నెలు, పెనాలు, దేవాలయ అర్చనలో ఉపయెగించే కంచు సామగ్రి వంటి వాటిని కూడ బబులోను సైన్యం తీసికొనిపోయింది. 19 రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి ఈ వస్తువులు తీసుకొని వెళ్లాడు: పళ్లెములు, ధూపకలశాలు, పెద్ద పాత్రలు, కుండలు, దీపస్తంభాలు, పెనములు, పానీయాలు అర్పించే పాత్రలు వెండి, బంగారాలతో చేసిన వస్తువులన్నీ అతడు తీసికొని పోయాడు. 20 రెండు స్తంభాలు, సముద్రం (కోనేరు), దాని క్రింద పన్నెండు కంచు గిత్తదూడల విగ్రహాలు, తోపుడు స్థంభాలు చాలా బరువైనవి. రాజైన సొలొమోను వాటిని యెహోవా ఆలయానికి చేయించాడు. వాటి చేతకు పట్టిన కంచు ఎంత బరువైనదంటే దాన్ని తూచటం కష్టం.
21 ప్రతి కంచుస్తంభం ఇరువది ఏడు అడుగుల (పదునెనిమిది మూరలు) ఎత్తు వుంది. ప్రతి స్తంభం పద్దెనిమిది అడుగుల (పన్నెండు మూరలు) చుట్టు కొలత కలిగివుంది. ప్రతి స్తంభం బోలుగా ఉంది. స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు. 22 మొదటి స్తంభం మీది కంచుపీట ఏడున్నర అడుగుల (ఏడు మూరలు) ఎత్తు కలిగి ఉంది. దాని చుట్టూ వలలాంటి నగిషీ పని, కంచు దానిమ్మకాయల అలంకరణ చేయబడింది. మరొక స్తంభం మీద కూడ దానిమ్మకాయల పనితనం వుంది. అదికూడ మొదటి స్తంభం మాదిరిగానే వుంది. 23 స్తంభాల ప్రక్కల మీద తొంబది ఆరు దానిమ్మకాయలున్నాయి. స్తంభాల పైన వలవంటి నగిషీపని మీద మొత్తం వంద దానిమ్మ కాయలు వున్నాయి.
24 రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి శెరాయాను, సిద్కియాను బందీలుగా తీసికొని పోయాడు. ముగ్గురు ద్వారపాలకులను కూడా బందీలుగా తీసికొనిపోయాడు. శెరాయా ప్రధాన యాజకుడు, అతని తరువాతి వాడు జెఫన్యా. 25 రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి పోరాటయోధుల దళాధిపతిని కూడా పట్టుకున్నాడు. రాజుయొక్క సలహాదారులలో ఏడుగురిని కూడా అతడు పట్టుకున్నాడు. ఆ మనుష్యులు ఇంకా యెరూషలేములో ఉన్నారు. సైన్యంలో మనుష్యులను చేర్చుకొనే అధికారిని (లేఖరి) కూడ అతడు పట్టుకున్నాడు. నగరంలో ఉన్న అరువది మంది సామాన్య ప్రజలను కూడా అతడు పట్టుకున్నాడు. 26-27 అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను ఆ అధికారులందరినీ పట్టుకున్నాడు. వారిని బబులోను రాజు వద్దకు తీసికొనివచ్చాడు. బబులోను రాజు రిబ్లా నగరంలో ఉన్నాడు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో వుంది. రిబ్లా నగరంలో ఆ అధికారులందరికీ రాజు మరణశిక్ష విధించాడు.
ఆ విధంగా యూదా ప్రజలు తమ దేశంనుండి తీసికొనిపోబడ్డారు. 28 నెబుకద్నెజరు చెరబట్టిన వారు వివరాలు ఇలా ఉన్నాయి:
నెబుకద్నెజరు పాలన ఏడవ సంవత్సరం[f] గడుస్తూ వుండగా మూడు వేల ఇరవై ముగ్గురు యూదా ప్రజలు.
29 నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరం[g] జరుగుతూ ఉండగా ఎనిమిది వందల ముప్పది రెండు మంది యెరూషలేము నుండి బందీలుగా తీసికొని పోబడ్డారు.
30 నెబుకద్నెజరు పాలన ఇరువై మూడవ సంవత్సరంలో[h] నెబూజరదాను ఏడువందల నలభై ఐదు మంది యూదా వారిని బందీ చేశాడు. నెబూజరదాను రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక ధళాధిపతి.
మొత్తం మీద నాలుగువేల ఆరువందల మందిని బందీలుగా పట్టుకుపోయారు.
యెహోయాకీను విడుదల
31 యూదా రాజైన యెహోయాకీను బబులోనులో ముప్పది ఏడు సంవత్సరాల పాటు చెరసాలలో ఉన్నాడు. యెహోయాకీను కారాగారవాసంలో ముప్పది ఏడవ సంవత్సరం[i] జరుగుతూ ఉండగా బబులోను రాజైన ఎవీల్మెరోదకు అతని పట్ల మిక్కిలి కనికరం చూపాడు. ఆ సంవత్సరంలో యెహోయాకీనును అతడు చెరసాల నుండి విడుదల చేశాడు. అనగా అది ఎవీల్మెరోదకు బబులోనుకు రాజు అయిన మొదటి సంవత్సరం. ఎవీల్మెరోదకు ఆ సంవత్సరం పన్నెండవ నెలలో ఇరువై ఐదవ రోజున యెహోయాకీనును చెరసాల నుండి విడుదల చేశాడు. 32 ఎవీల్మెరోదకు మిక్కిలి దయగా యెహోయాకీనుతో మాట్లాడాడు. అప్పుడు తనతో బబులోనులో ఉన్న రాజులందరికంటె యెహోయాకీనుకు అతడు గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చాడు. 33 దానితో యెహోయాకీను తన చెరసాల బట్టలు తీసివేశాడు. మిగిలిన తన జీవిత కాలమంతా అతడు ప్రతిరోజూ రాజుయొక్క బల్లవద్దనే భోజనం చేశాడు. 34 బబులోను రాజు ప్రతిరోజూ యెహోయాకీనుకు దినభత్యం ఇచ్చేవాడు. ఇది యెహోయాకీను చనిపోయేవరకు కొనసాగింది.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
31 యెహోవా, నీవే నా కాపుదల.
నన్ను నిరాశపరచవద్దు.
నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
2 దేవా, నా మాట ఆలకించుము.
వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
3 దేవా, నీవే నా బండవు, కోటవు
కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
5 యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
నన్ను రక్షించుము.
6 వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం.
యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను.
7 దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది.
నా కష్టాలు నీవు చూశావు.
నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు.
8 నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు.
వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.
9 యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉంచుము.
నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి.
నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి.
10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది.
నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి.
నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నాయి.
నా బలం తొలగిపోతూ ఉంది.[a]
11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు.
నా పొరుగు వాళ్లంతా కూడా నన్ను ద్వేషిస్తారు.
నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు.
వారు నానుండి దూరంగా ఉంటారు.
12 నేను పాడైపోయిన పనిముట్టులా ఉన్నాను.
నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.
13 ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను.
ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.
14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
నీవే నా దేవుడవు.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
నన్ను రక్షించుము.
17 యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను.
కనుక నేను నిరాశచెందను.
చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు,
మౌనంగా వారు సమాధికి వెళ్తారు.
18 ఆ చెడ్డవాళ్లు గర్వించి,
మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబుతారు.
ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు.
కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి.
19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు.
నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు.
ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు.
కాని ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు.
ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను.
కాని దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.
23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి.
యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు.
కాని తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.
© 1997 Bible League International