Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 12-13

మిర్యాము, అహరోను మోషేను విమర్శించటం

12 మిర్యాము, అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అతని భార్య ఇథియోపియా స్త్రీ గనుక వారు అతణ్ణి విమర్శించారు. మోషే ఇథియోపియా ప్రజల్లోని స్త్రీని వివాహం చేసుకోవటం మంచిది కాదని వారు తలంచారు. “ప్రజలతో మాట్లాడటానికి యెహోవా మోషేను వాడుకొన్నాడు. కానీ మోషే ఒక్కడే ఉన్నాడా? మన ద్వారా కూడ యెహోవా మాట్లాడాడు కదా” అని వారు తమలో తాము అనుకొన్నారు.

యెహోవా ఇది విన్నాడు. (మోషే చాలా దీనుడు. అతడు గొప్పలు చెప్పుకోలేదు, సణగ లేదు, భూమి మీద అందరికంటె అతడు దీనుడు.) కనుక యెహోవా అకస్మాత్తుగా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఇప్పుడే సన్నిధి గుడారానికి రండి” అని చెప్పాడు.

కనుక మోషే, అహరోను, మిర్యాము గుడారానికి వెళ్లారు. అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చాడు. గుడార ప్రవేశం దగ్గర యెహోవా నిలబడ్డాడు. “అహరోను, మిర్యామును” తన దగ్గరకు రమ్మని పిల్చాడు యెహోవా. వాళ్లిద్దరూ ఆయనకు దగ్గరగా రాగానే దేవుడు అన్నాడు: “నా మాటలు వినండి, మీ మధ్యకు నేను ప్రవక్తలను పంపినప్పుడు, యెహోవానగు నేను వారికి దర్శనంలో కనబడతాను. కలలో నేనే వారితో మాట్లాడతాను. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. నేను అతనితో మాట్లాడినప్పుడు ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. అతనితో నేను చెప్పాలనుకొనే విషయాలు వివరంగా నేను చెబుతాను. గూఢార్థపు పొడుపు కథలు నేను ప్రయోగించను. మోషే సాక్షాత్తు యెహోవా రూపాన్ని చూడవచ్చు. కనుక నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మీరెందుకు అంత ధైర్యంగా మాట్లాడారు?”

అంతట యెహోవా వారిని విడిచి వెళ్లి పోయాడు. కానీ ఆయనకు వారిమీద చాలా కోపం వచ్చింది. 10 యెహోవా మేఘం గుడారం మీదనుండి పైకి లేచి పోయింది. అప్పుడు అహరోను అటు తిరిగి మిర్యామును చూడగా, ఆమెకు భయంకర కుష్ఠురోగం రావటం అతనికి కనబడింది. ఆమె శరీరం మంచులా తెల్లగా ఉంది.

11 అప్పుడు మోషేతో అహరోను అన్నాడు: “అయ్యా, బుద్ధిహీనంగా మేము పాపం చేసాము, మమ్మల్ని క్షమించు. 12 చచ్చి పుట్టిన శిశువులా ఆమె తన శరీరాన్ని పోగొట్టుకోనియ్యకు.” (కొన్ని సార్లు అలాంటి శిశువు సగం శరీరం తినివేయబడి పుడుతుంది.)

13 కనుక మోషే, “ఓ దేవా ఈ రోగంనుండి ఆమెను బాగుచేయి” అని యెహోవాకు మొరపెట్టాడు.

14 “ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఆమెకు ఏడు రోజులు అవమానం కలుగుతుంది. కనుక ఆమెను ఏడురోజులు పాళెమునకు బయట ఉంచండి. ఆ తర్వాత ఆమె తిరిగి లోనికి రావచ్చు” అని యెహోవా జవాబిచ్చాడు.

15 కనుక మిర్యాము ఏడు రోజులపాటు పాళెమునకు వెలుపల ఉంచబడింది. ఆమె మరల లోనికి తీసుకొని రాబడేంతవరకు ప్రజలు అక్కడనుండి కదలలేదు. 16 అది జరిగిన తర్వాత ప్రజలు హజేరోతు విడిచి పారాను అరణ్యానికి ప్రయాణం చేసారు. ప్రజలు ఆ అరణ్యంలో గుడారాలు వేసుకొన్నారు.

గూఢచారులు కనాను వెళ్లటం

13 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “కనాను దేశాన్ని తరచి చూడ్డానికి కొందరు మనుష్యుల్ని పంపించు. ఇదే నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చే దేశం. పన్నెండు వంశాల్లో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్కరిని పంపించు.”

కనుక యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. పారాను అరణ్యంలోనికి నాయకులను అతడు పంపించాడు. వారి పేర్లు ఇవి:

రూబేను వంశంనుండి జక్కూరు కుమారుడైన షమ్మూయ.

షిమ్యోను వంశంనుండి హోరీ కుమారుడైన షాపాతు.

యూదా వంశంనుండి యెపున్నె కుమారుడైన కాలేబు.

ఇశ్శాఖారు వంశంనుండి యోసేపు కుమారుడైన ఇగాలు.

ఎఫ్రాయిము వంశంనుండి నూను కుమారుడైన హోషేయ.

బెన్యామీను వంశంనుండి రాఫు కుమారుడైన పల్తీ.

10 జెబూలూను వంశంనుండి సోరీ కుమారుడైన గదీయేలు.

11 మనష్షే (యెసేపు వంశాల్లో ఒకటి) వంశంనుండి సూసీ కుమారుడైన గదీ.

12 దాను వంశంనుండి గెమలి కుమారుడైన అమ్మీయేలు.

13 ఆషేరు వంశంనుండి మిఖాయేలు కుమారుడైన సెతూరు.

14 నఫ్తాలి వంశంనుండి వాపెసీ కుమారుడైన నహబీ.

15 గాదు వంశంనుండి మాకీ కుమారుడైన గెయువేలు.

16 ఆ దేశాన్ని చూచి పరిశీలించేందుకు మోషే పంపించిన వారి పేర్లు అవి. (నూను కుమారుడైన హోషేయను మోషే యెహోషువ అని మరో పేరు పెట్టి పిలిచేవాడు.)

17 కనాను దేశాన్ని కనుక్కొనేందుకు మోషే వారిని పంపించినప్పుడు అతడు ఇలా చెప్పాడు: “నెగెవు ఎడారిలోనుండి వెళ్లండి, తర్వాత ఆ కొండల దేశంలోకి వెళ్లండి. 18 ఆ దేశం ఎలా ఉందో చూడండి. అక్కడ నివసిస్తున్న ప్రజలనుగూర్చి తెలుసుకోండి. వారు బలవంతులా? బలహీనులా? వారు కొద్ది మందేనా? చాలమంది ఉన్నారా? 19 వారు నివసిస్తున్న దేశాన్ని గూర్చి తెలుసుకోండి. ఆ భూమి మంచిదా కాదా? వారు నివసించే పట్టణాలు ఎలాంటివి? ఆ పట్టణాలకు గోడలు ఉన్నాయా? ఆ పట్టణాలకు బలీయమైన కాపుదల ఉందా? 20 ఆ దేశాన్ని గూర్చి ఇతర విషయాలు కూడ తెలుసుకోండి. ఆ భూమి, సారమైనదా కాదా? ఆ భూమి మీద చెట్లు ఉన్నాయా? అక్కడనుండి కొన్ని పండ్లు తీసుకుని రావటానికి ప్రయత్నించండి.” (ద్రాక్ష ప్రథమ ఫలాల కాలం ఇది).

21 అప్పుడు వారు ఆ దేశాన్ని పరిశీలించి చూసారు. వారు సీను అరణ్యం నుండి రెహోబు, లెబ్రోహమాతు వరకు వెళ్లారు. 22 నెగెవు ద్వారా ప్రయాణించి హెబ్రోను పట్టణం చేరుకొన్నారు. (ఈజిప్టులోని సోయను పట్టణం కంటె హెబ్రోను ఏడేండ్లు ముందు నిర్మించబడింది.) అక్కడ అహీమాను, షేషయి, తల్మయి నివసించారు. వీరు అనాకీ ప్రజలు. 23 వాళ్లు ఎష్కోలు లోయలో ఒక ద్రాక్ష కొమ్మ కోసారు. ఆ కొమ్మకు ఒక ద్రాక్ష గెల ఉంది. ఇద్దరు మనుష్యులు ఆ గెలను ఒక కర్రకు కట్టి మోసుకొచ్చారు. కొన్ని దానిమ్మ, అంజూరపు పండ్లు కూడ వారు తెచ్చారు. 24 అక్కడ ఇశ్రాయేలు మనుష్యులు ద్రాక్ష గుత్తిని కోసినందుచేత ఆ చోటు ఎష్కోలు[a] అని పిలువబడింది.

25 40 రోజుల పాటు వారు ఆ దేశాన్ని పరిశీలించారు. అప్పుడు వారు తిరిగి వారి నివాసమునకు వచ్చారు. 26 ఆ మనుష్యులు కాదేషు దగ్గర మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తిరిగి వచ్చారు. ఇది పారాను అరణ్యంలో ఉంది. అప్పుడు వారు చూచిన విషయాలన్నింటినీ మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలు అందరితో చెప్పారు. వారు ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. 27 ఆ మనుష్యులు మోషేతో ఇలా చెప్పారు: “నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి మేము వెళ్లాము. ఆ దేశం చాలా బాగుంది. అక్కడ పాలు, తేనెలు ప్రవహిస్తున్నాయి! అక్కడ మేము చూచిన పండ్లు ఇవిగో. 28 కానీ అక్కడ నివసిస్తున్న మనుష్యులు చాలా బలము, శక్తి ఉన్న వాళ్లు. వారి పట్టణాలు బలంగా కాపుదలలో ఉన్నాయి. ఆ పట్టణాలు చాల పెద్దవి. అనాకు కుటుంబానికి చెందిన కొందరు మనుష్యుల్ని కూడ మేము అక్కడ చూశాము. 29 అమాలేకీ ప్రజలు నెగెవు లోయలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండల ప్రాంతంలో నివసిస్తున్నారు. కనానీ ప్రజలు సముద్రతీర ప్రాంతంలోను, యొర్దాను నదీతీరంలోను నివసిస్తున్నారు.”

30 అప్పుడు మోషే దగ్గర ఉన్న వాళ్లను నిశ్శబ్దంగా ఉండమన్నాడు కాలేబు. అప్పుడు కాలేబు, “మనం వెళ్లి ఆ దేశాన్ని మనకోసం స్వాధీనం చేసుకోవాలి. తేలికగా మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు” అని చెప్పాడు.

31 కానీ అతనితోకూడ వెళ్లినవారు, “ఆ మనుష్యులతో మనం పోరాడలేం. వాళ్లు మనకంటె చాల బలంగలవాళ్లు అన్నారు. 32 మనం ఆ దేశ ప్రజలను జయించేందుకు తగిన బలవంతులం కాదు” అని ఇశ్రాయేలు ప్రజలందరితో వారు చెప్పారు. వారు ఇలా చెప్పారు: “మేము చూచిన దేశంనిండా బలాఢ్యులు ఉన్నారు. అక్కడికి వెళ్లిన ఎవరినైనాసరే తేలికగా జయించ గలిగినంత బలంగలవాళ్లు వారు. 33 అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూసాం (నెఫీలీ ప్రజలవాడగు అనాకు సంతానం.) వాళ్ల ముందు నిలబడితే మేము మిడుతల్లా ఉన్నట్టు అనిపించింది. మేమేదో మిడుతలంత చిన్నవాళ్లంగా మమ్మల్ని చూసారు.”

కీర్తనలు. 49

సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన.

49 సర్వ దేశములారా, ఇది వినండి.
    భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
    ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను.
    నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
సామెతపైనా ఆసక్తినుంచుతాను.
    ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను.

అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు.
    నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి
    తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు.
    నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు
    సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు
    కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు,
    మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు.
    మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది.
    వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
12 ధనికులు నిరంతరం జీవించలేరు.
    వారు జంతువుల్లా మరణిస్తారు.
13 బుద్ధిహీనులకు, మరియు వారు చెప్పేది
    అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.
14 మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి.
    మరణం వారి కాపరి.
    వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి.

15 కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు.
    సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు.
16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు.
    వాని ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంట వాడేమీ తీసుకొనిపోడు.
    వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు.
18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు.
    ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా,
19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు.
    అతడు ఇక వెలుగును ఎన్నటికి చూడడు.
20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు. అతడు నశించే మృగంలాంటి వాడు.

యెషయా 2

యూదా, యెరూషలేముకు దేవుని సందేశం

యెరూషలేము, యూదాలను గూర్చి ఆమోజు కూమారుడు యెషయా ఈ సందేశం చూశాడు.

యెహోవా ఆలయం ఒక కొండమీద ఉంది.
    చివరి రోజుల్లో ఆ కొండ, పర్వతాలన్నింటిలో ఎత్తయినదిగా చేయబడుతుంది.
ఆ పర్వతం కొండల శిఖరాలన్నింటికంటె ఎత్తు చేయబడుతుంది.
    అన్ని రాజ్యాల ప్రజలూ అక్కడికి వెళ్తారు.
అనేకమంది ప్రజలు అక్కడికి వెళ్తారు.
    “మనం యెహోవా పర్వతానికి వెళ్దాం. యాకోబు దేవుని మందిరానికి మనం వెళ్లాలి.
అప్పుడు యెహోవా తన జీవన విధానం మనకు ఉపదేశిస్తాడు.
    మనం ఆయనను వెంబడిస్తాం” అని వాళ్లు చెబుతారు.

దేవుని ఉపదేశాలు, యెహోవా సందేశం యెరూషలేములో, సీయోను కొండమీద ప్రారంభమై,
    ప్రపంచం అంతటికీ వ్యాపిస్తుంది.
అప్పుడు అన్ని రాజ్యాల ప్రజలకూ యెహోవా న్యాయాధిపతిగా ఉంటాడు.
    అనేకుల వాదాలను దేవుడు అంతం చేస్తాడు.
ఆ మనుష్యులు తమ పోరాటానికి తమ ఆయుధాలు ఉపయోగించటం మానివేస్తారు.
    వారు తమ ఖడ్గాలతో నాగటి నక్కులు చేస్తారు.
    వారు, తమ ఈటెలను మొక్కలు కత్తిరించే పరికరాలుగా ప్రయోగిస్తారు.
ప్రజలు ప్రజలతో పోరాటం మానివేస్తారు.
    ప్రజలు యుద్ధానికి మళ్లీ ఎన్నడూ శిక్షిణ పొందరు.

యాకోబు వంశస్తులారా, మీరు యెహోవాను వెంబడించాలి.

మీరు మీ ప్రజలను విడిచిపెట్టేశారు కనుక నేను మీతో దీనిని చెబుతున్నాను. తూర్పు దేశాల తప్పుడు అభిప్రాయాలతో మీ ప్రజలు నిండిపోయారు. ఫిలిష్తీయుల్లాగే మీ ప్రజలు జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించారు. ఆ వింత అభిప్రాయాలను మీ ప్రజలు పూర్తిగా స్వీకరించారు. ఇతర స్థలాలకు చెందిన వెండి బంగారాలతో మీ దేశం నిండిపోయింది. అక్కడ చాలా చాలా ఐశ్వర్యాలున్నాయి. మీ దేశం గుర్రాలతో నిండిపోయింది. అక్కడ ఎన్నెన్నో రథాలు ఉన్నాయి. ప్రజలు పూజించే విగ్రహాలతో మీ దేశం నిండిపోయింది. ప్రజలే చేసిన ఆ విగ్రహాలను ప్రజలు పూజిస్తారు. ప్రజలు మరింతగా చెడిపోయారు. ప్రజలు మరీ హీనస్థితికి దిగజారి పోయారు. దేవా, నిజంగా నీవు వాళ్లను క్షమించవు గదూ?

10 వెళ్లి ధూళిలో, బండల చాటున దాక్కొనండి. యెహోవాను గూర్చి మీరు భయపడాలి. ఆయన మహా ప్రభావం నుండి మీరు దాక్కోవాలి.

11 గర్విష్ఠులు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఆ గర్విష్ఠులు అవమానంతో నేలమీద సాగిలపడ్తారు. ఆ సమయంలో యెహోవా మాత్రమే ఇంకా ఉన్నతుడుగా నిలుస్తాడు.

12 యెహోవా ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజు అహంకారులను, అతిశయం గలవారిని యెహోవా శిక్షిస్తాడు. అప్పుడు ఆ గర్విష్ఠులు ఎన్నికలేనివారుగా చేయబడతారు. 13 గర్విష్ఠులైన ఆ మనుష్యులు లెబానోను కేదారు వృక్షాల్లా ఉంటారు. వారు బాషాను మహా మస్తకి వృక్షాల్లా ఉంటారు. కానీ ఆ మనుష్యులను దేవుడు శిక్షిస్తాడు. 14 గర్విష్ఠులైన ఆ ప్రజలు ఎత్తయిన పర్వతాల్లా, కొండల్లా ఉన్నారు. 15 ఆ గర్విష్ఠులు ఎత్తయిన గోపురాల్లా చాలా బలమైన గోడల్లా ఉన్నారు. కానీ ఆ ప్రజలను దేవుడు శిక్షిస్తాడు. 16 ఆ గర్విష్ఠులు తర్షీషు గొప్ప ఓడల్లా ఉన్నారు. (ఈ ఓడలు చాలా విలువైన వస్తువులతో నిండి ఉంటాయి.) కానీ ఆ గర్విష్ఠులను దేవుడు శిక్షిస్తాడు.

17 ఆ సమయంలో ప్రజలు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఇప్పుడు గర్వంగా ఉన్న మనుష్యులు నేలమీద సాగిలపడతారు. మరియు ఆ సమయంలో యెహోవా మాత్రమే ఉన్నతంగా నిలుస్తాడు. 18 విగ్రహాలు (అబద్ధపు దేవతలు) అన్నీ తొలగి పోతాయి. 19 బండల చాటున, నేల బీటల్లో మనుష్యులు దాక్కొంటారు. యెహోవాను గూర్చి ఆయన మహా ప్రభావం గూర్చి ప్రజలు భయపడ్తారు. ఇదంతా భూమిని గజగజ వణకించుటకు యెహోవా నిలబడినప్పుడు జరుగుతుంది.

20 ఆ సమయంలో ప్రజలు వారి వెండి, బంగారు విగ్రహాలను పారవేస్తారు. (ప్రజలు పూజించుటకు మనుష్యులే ఆ విగ్రహాలను తయారు చేశారు.) ప్రజలు ఆ విగ్రహాలను నేలమీది కన్నాలలో ఉండే ఎలుకలకు, గబ్బిలాలకు వేస్తారు. 21 అప్పుడు ప్రజలు బండ సందులలో దాక్కొంటారు. యెహోవాను గూర్చి, ఆయన మహా శక్తిని గూర్చి భయపడి వారు అలా చేస్తారు. భూమిని గజగజ వణికించుటకు యెహోవా నిలబడినప్పుడు ఇది జరుగుతుంది.

22 మిమ్మల్ని రక్షించుట కోసం ఇతరులను నమ్ముకోవటం మీరు మానివేయాలి. వాళ్లూ మనుష్యులే, మనుష్యులు మరణిస్తారు. అందుచేత వాళ్లు కూడా దేవునిలా బలం గల వాళ్లు అని మీరు తలంచవద్దు.

హెబ్రీయులకు 10

యేసు క్రీస్తు—మనకవసరమైన ఏకైక బలి

10 ధర్మశాస్రం రాబోవు మంచి విషయాల నీడలాంటిది. అది అస్పష్టమైనది. అంటే, ఆ మంచి విషయాలు అప్పటికింకా రాలేదన్నమాట. ధర్మశాస్రం ఆదేశించిన విధంగా ప్రజలు దేవుని దగ్గరకు ప్రతి సంవత్సరం వచ్చి తప్పకుండా ఒకే రకమైన బలులు అర్పించేవాళ్ళు. కాని ధర్మశాస్త్రం వాళ్ళలో పరిపూర్ణత కలిగించలేదు. అలా చేసినట్లైతే, వాళ్ళు ఆ బలులు యివ్వటం మాని ఉండేవాళ్ళు. పాపాలు శాశ్వతంగా పరిహారమై వాళ్ళు పశ్చాత్తాపం చెందవలసిన అవసరం ఉండేది కాదు. కాని దానికి మారుగా ఆ బలులు వాళ్ళు చేసిన పాపాల్ని ప్రతి సంవత్సరం వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో పాపపరిహారం కలగటమనేది అసంభవం.

ఆ కారణంగానే, క్రీస్తు ఈ ప్రపంచంలోకి వచ్చాక దేవునితో ఈ విధంగా అన్నాడు:

“బలుల్ని, అర్పణల్ని నీవు కోరలేదు
    కాని, నేనుండటానికి ఈ శరీరాన్ని సృష్టించావు.
జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని,
    పాపపరిహారం కోసం యిచ్చిన బలులు కాని,
    నీకు అనందం కలిగించలేదు.
అప్పుడు నేను, ‘ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను!
    నన్ను గురించి గ్రంథాల్లో వ్రాశారు.
    నేను నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను’ అని అన్నాను.”(A)

“బలుల్ని, అర్పణల్ని, జంతువుల్నికాల్చి యిచ్చిన ఆహుతుల్ని, పాప పరిహారం కోసం యిచ్చిన ఆహుతుల్ని నీవు కోరలేదు. అవి నీకు ఆనందం కలిగించలేదు” అని మొదట అన్నాడు. కాని, ధర్మశాస్త్రం ఈ ఆహుతుల్ని యివ్వమని ఆదేశించింది. ఆ తర్వాత క్రీస్తు, “ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను. నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను” అని అన్నాడు. ఆయన రెండవదాన్ని నెరవేర్చటానికి మొదటిదాన్ని రద్దుచేశాడు. 10 దైవేచ్ఛ నెరవేర్చటానికి క్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించి మనల్ని శాశ్వతంగా పవిత్రం చేశాడు. ఆయన యిచ్చిన మొదటి బలి, చివరి బలి యిదే.

11 ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. ఈ బలులు పాపపరిహారం చెయ్యలేవు. 12 కాని క్రీస్తు మన పాపపరిహారార్థం ఒకే ఒక బలి యిచ్చి దేవుని కుడిచేతి వైపు శాశ్వతంగా కూర్చుండిపొయ్యాడు. 13 అప్పటినుండి, ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చెయ్యాలని కాచుకొని ఉన్నాడు. 14 ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు.

15 ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు యిలా ప్రకటిస్తున్నాడు:

16 “ఆ తర్వాత నేను వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.
నా నియమాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను.
    వాటిని వాళ్ళ మనస్సులపై వ్రాస్తాను.”(B)

17 పరిశుద్ధాత్మ ఇంకా యిలా అన్నాడు:

“వాళ్ళ పాపాల్ని,
    దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను!”(C)

18 వాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి, పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది.

విశ్వాసాన్ని వదులుకోకండి

19 సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. 20 ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు. 21 అంతేకాక, ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు. 22 తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం. 23 మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం.

ఒకరికొకరు సహాయం చేసుకొంటూ బలవంతులై యుండండి

24 ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. 25 సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం[a] సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహపరచుకొంటూ ఉందాం.

దైవకుమారున్నుండి వెళ్ళిపోకండి

26 సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా, మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే, యిక అర్పించటానికి మన దగ్గర బలి ఎక్కడుంది? 27 తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలు రానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి. 28 మోషే నియమాల్ని ఉల్లంఘించినవానిపై యిద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయ చూపకుండా మరణ శిక్ష విధించేవాళ్ళు. 29 మరి దేవుని కుమారుణ్ణి కాళ్ళ క్రింద త్రొక్కినవాణ్ణి, తనను పవిత్రం చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాణ్ణి, అనుగ్రహించే ఆత్మను అవమాన పరిచేవాణ్ణి, యింకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి. 30 “పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను” అని అన్నవాడు, “ప్రభువు తన ప్రజలపై తీర్పు చెపుతాడు”(D) అని అన్నవాడు ఎవరో మనకు తెలుసు. 31 సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్ములు చిక్కుకోవటమనేది భయానకమైన విషయము.

మీకు కలిగిన ధైర్యసహనాల్ని కాపాడుకోండి

32 మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు. 33 కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించేవాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. 34 అంతేకాక, చెరసాలల్లో ఉన్నవాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా “మీ ఆస్తుల్ని” దోచుకొంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే, మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు.

35 అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. 36 మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్ఛ ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు, తాను వాగ్దానం చేసినదాన్ని ప్రసాదిస్తాడు. 37 ఎందుకంటే,

“త్వరలోనే వస్తున్నాడు, వస్తాడు,
    ఆలస్యం చెయ్యడు!
38 నీతిమంతులైన నా ప్రజలు
    నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు.
కాని వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే
    నా ఆత్మకు ఆనందం కలుగదు.”(E)

39 కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయేవాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడేవాళ్ళ లాంటివారం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International