Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 27

వాగ్దానాలు ముఖ్యం

27 యెహోవా మోషేతో చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఒకవ్యక్తి యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానం చేయవచ్చు. ఆ వ్యక్తి ఒక మనిషిని యెహోవాకు అర్పిస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు. అలాగైతే ఆ మనిషి ఒక ప్రత్యేక విధానంలో యెహోవాను సేవించాలి. ఆ మనిషికి యాజకుడు కొంత విలువ నిర్ణయించాలి. ప్రజలు ఆ మనిషిని యెహోవా దగ్గర తిరిగి కొనాలంటే వారు ఆ విలువ చెల్లించాలి. ఇరవై నుండి అరవై సంవత్సరాల వయసుగల ఒక మగవాడి విలువ యాభై తులాల వెండి. (వెండిని తూచేందుకు పవిత్ర స్థలంలోని అధికారిక కొలతనే మీరు ఉపయోగించాలి). ఇరవై నుండి అరవై సంవత్సరాల వయస్సుగల ఒక స్త్రీ విలువ ముప్పైతులాలు. ఐదు నుండి ఇరవై సంవత్సరాల వయస్సుగల ఒక మగవాని విలువ ఇరవైతులాలు. ఐదు నుండి ఇరవై సంవత్సరాల వయస్సుగల ఒక స్త్రీ విలువ పది తులాలు. ఒక నెలనుండి ఐదు సంవత్సరాల వయస్సుగల ఒక మగ శిశువు వెల ఐదు తులాలు. ఆడ శిశువు వెల మూడు తులాలు. అరవై సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న ఒక మగవాని వెల పదిహేను తులాలు. ఒక స్త్రీ వెల పది తులాలు.

“ఒక మనిషి ఆ వెల చెల్లించలేనంత పేదవాడైతే ఆ వ్యక్తిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ వ్యక్తి ఎంత మొత్తం చెల్లించగలడు అనే విషయం యాజకుడు తీర్మానిస్తాడు.

యెహోవాకు కానుకలు

“కొన్ని జంతువులు యెహోవాకు బలిగా ఉపయోగపడతాయి. అలాంటి ఒక జంతువును ఒక వ్యక్తి తీసుకొని వస్తే, ఆ జంతువు పవిత్రం అవుతుంది. 10 ఆ వ్యక్తి ఆ జంతువునే యెహోవాకు ఇస్తానని వాగ్దానం చేసాడు గనుక దానికి బదులు ఇంకోదాన్ని యివ్వటానికి అతడు ప్రయత్నించకూడదు. ఇంకో దానితో దీన్ని మార్చేందుకు అతడు ప్రయత్నించకూడదు. మంచి జంతువుకు బదులుగా పనికిరాని జంతువును మార్చాలని అతడు ప్రయత్నించకూడదు. పనికిరాని జంతువుకు బదులుగా మంచి జంతువును మార్చాలనీ అతడు ప్రయత్నించకూడదు. ఆ మనిషి అలా జంతువుల్ని మార్చటానికి ప్రయత్నిస్తే, అప్పుడు ఆ జంతువులు రెండూ పవిత్రం అవుతాయి. అందుచేత అవి రెండూ యెహోవాకే చెందుతాయి.

11 “కొన్ని జంతువులు యెహోవాకు అర్పించేందుకు పనికిరావు. అలాంటి అపవిత్ర జంతువును ఒకదాన్ని ఒకడు యెహోవాకు యిచ్చేందుకు తీసుకొనివస్తే, అప్పుడు ఆ జంతువును యాజకుని దగ్గరకు తీసుకొనిరావాలి. 12 యాజకుడు ఆ జంతువుకు విలువ నిర్ణయం చేస్తాడు. యాజకుడు వెల నిర్ణయం చేసిన తర్వాత ఆ జంతువు మంచిదేగాని పనికిరానిదేగాని, దాని వెల అంతే. 13 ఒక వేళ ఆ వ్యక్తి తిరిగి జంతువును కొనుక్కోవాలనుకొంటే, అతడు దాని వెలకు అయిదో వంతు అదనంగా చెల్లించాలి.

యెహోవాకు అర్పించిన ఇంటి విలువ

14 “ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇంటిని యెహోవాకు పవిత్రంగా ప్రతిష్ఠ చేస్తే, యాజకుడు దాని వెల నిర్ణయం చేయాలి. యాజకుడు అలా వెల నిర్ణయిస్తే ఆ ఇల్లు మంచిదేగాని, పనికి రానిదేగాని ఆ వెల అంతే. 15 అయితే ఆ ఇంటిని ఇచ్చిన వ్యక్తి తిరిగి దానిని తీసుకొనగోరితే, దాని విలువకు అయిదోవంతు అదనంగా చెల్లించాలి. అప్పుడు ఆ ఇల్లు ఆ వ్యక్తికి చెందుతుంది.

భూమి విలువ

16 “ఒక వ్యక్తి తన పొలాల్లో కొంత భాగం యెహోవాకు ప్రతిష్ఠ చేస్తే, దానిలో నాటేందుకు ఎంత విత్తనం అవసరం ఉంటుందో అనేదానిమీద ఆ పొలాల వెల ఆధారపడి ఉంటుంది. పది తూముల యవల విత్తనాల వెల ఏబై తులాల వెండితో సమానము 17 ఒకవేళ బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ వ్యక్తి తన పొలాన్ని కానుకగా యిస్తే, యాజకుడు నిర్ణయించేదేదాని వెల అవుతుంది. 18 కానీ ఆ వ్యక్తి బూరధ్వని మహోత్సన కాలం దాటిపోయాక తన పొలాన్ని కానుకగా యిస్తే, దాని ఖచ్చితమైన వెలను యాజకుడు నిర్ణయించాలి. తర్వాత వచ్చే బూరధ్వని మహోత్సవ కాలానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అతడు లెక్కించాలి. అప్పుడు ఆ లెక్క ఆధారంగా వెలకట్టాలి. 19 ఒకవేళ తన పొలాన్ని కానుకగా యిచ్చిన వ్యక్తి తిరిగి తన పొలాన్ని తీసుకోవాలనుకొంటే, దాని వెలకు అయిదో వంతు అతడు అదనంగా చెల్లించాలి. అప్పుడు ఆ పొలం తిరిగి అతనిదే అవుతుంది. 20 ఆ వ్యక్తి ఆ పొలాన్ని తిరిగి కొనకపోతే, అప్పుడు ఆ పొలం ఎల్లప్పుడూ యాజకులకే చెందుతుంది. ఒకవేళ ఆ భూమిని మరొకరికి అమ్మివేస్తే, ఆ మొదటి వ్యక్తి తిరిగి ఆ పొలం కొనేందుకు వీల్లేదు. 21 ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ పొలాన్ని మళ్లీ కొనకపొతే, బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ భూమి యెహోవాకు పవిత్రంగా ఉండిపోతుంది. అది శాశ్వతంగా యాజకునిదే అవుతుంది. అది సంపూర్ణంగా యెహోవాకు ఇవ్వబడిన భూమిగా ఉంటుంది.

22 “ఒకవేళ ఒక వ్యక్తి అతడు కొన్న పొలాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తే, అది అతని స్వంత పొలంలో ఒక భాగం కానప్పుడు. 23 యాజకుడు బూరధ్వని చేసే మహోత్సవ కాలంవరకుగల సంవత్సరాలను లెక్కించి, దాని ప్రకారం ఆ పొలం వెల నిర్ణయించాలి. అప్పుడు ఆ భూమి యెహోవాదే అవుతుంది. 24 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ భూమి దాని స్వంతదారునిది అవుతుంది. ఆ భూమి ఏ కుటుంబంవారి స్వంతమో తిరిగి వారికే దక్కుతుంది.

25 “ఆ ధరలు చెల్లించేందుకు పవిత్రస్థలంలోని అధికారిక కొలతనే మీరు ఉపయోగించాలి. పవిత్ర స్థలంలో అధికారతులం బరువు 20 చిన్నాలు.

జంతువుల విలువ

26 “పశువుల్ని, గొర్రెల్ని, ప్రజలు యెహోవాకు కానుకగా ఇవ్వవచ్చును. అయితే ఆ జంతువు తొలిచూలు అయితే అది ముందే యెహోవాది. కనుక తొలిచూలు వాటిని ప్రజలు కానుకగా యివ్వలేరు. 27 తొలిచూలు జంతువులను ప్రజలు యెహోవాకు ఇవ్వాలి. అయితే ఆ తొలిచూలు జంతువు అపవిత్రమైనదిగా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి తిరిగి దానిని కొనుక్కోవాలి. ఆ జంతువు వెల యాజకుడు నిర్ణయించగా, ఆ వ్యక్తి, దాని వెలకు అయిదోవంతు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ జంతువును తిరిగి కొనలేకపోతే, యాజకుడు తానే నిర్ణయించే వెలకు ఆ జంతువును అమ్మివేయాలి.

ప్రత్యేక కానుకలు

28 “ప్రజలు యెహోవాకు ఇచ్చే ఒక ప్రత్యేక రకమైన కానుక ఉంది. ఆ కానుక సంపూర్ణంగా యెహోవాదే అవుతుంది. ఆ కానుకను అమ్మటానికి, తిరిగి కొనడానికి వీల్లేదు. ఆ కానుక యెహోవాకు చెందినది. ప్రజలు, జంతువులు, కుటుంబపు ఆస్తిలోని పొలాలు ఆ కానుక కావచ్చును. 29 ఒకవేళ ఆ ప్రత్యేకమైన కానుక ఒక వ్యక్తి అయివుంటే ఆ వ్యక్తిని తిరిగి కొనేందుకు వీల్లేదు. ఆ వ్యక్తి చంపబడవలసినదే.

30 “పంటలన్నింటిలో పదోవంతు యెహోవాకు చెందుతుంది. అంటే పొలాల్లోని పంటలు, చెట్ల ఫలాలు అని అర్ధం. ఆ పదోవంతు యెహోవదే అవుతుంది. 31 కనుక ఎవరైనా తన పదోవంతు తిరిగి తీసుకోవాలి అనుకొంటే, వారు దాని వెలకు అయిదో వంతు అదనంగా చెల్లించి, అప్పుడు దానిని తిరిగి కొనుక్కోవాలి.

32 “ఒక వ్యక్తికిగల పశువులు, గొర్రెలలో నుండి ప్రతి పదో జంతువును యాజకులు తీసుకోవాలి. పదోజంతువు ప్రతీదీ యెహోవాదే అవుతుంది. 33 కోరుకొన్న ఆ జంతువు మంచిదైనా చెడ్డదైనా, దాని స్వంతదారుడు చింతించవలసిన అవసరం లేదు. అతడు ఆ జంతువును మరో జంతువుతో మార్చకూడదు. అలా మరో జంతువుతో దాన్ని మార్చాలని అతడు నిర్ణయించుకొంటే అప్పుడు ఆ రెండు జంతువులూ యెహోవావే అవుతాయి. ఆ జంతువును తిరిగికొనేందుకు వీల్లేదు.”

34 సీనాయి పర్వతం దగ్గర మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అవి. అవి ఇశ్రాయేలు ప్రజలకోసమైన ఆజ్ఞలు.

కీర్తనలు. 34

దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.

34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
    ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
దీన జనులారా, విని సంతోషించండి.
    నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
    మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
    నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
    మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
    యెహోవా నా మొర విన్నాడు.
    నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
    ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
    యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
    ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
    అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
    యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
    ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
    ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
    శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
    ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
    ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.

17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
    ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
    ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
    కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
    ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
    చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
    తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.

ప్రసంగి 10

10 అత్యంత పరిమళ భరితమైన తైలాన్ని గబ్బు పట్టించేందుకు చచ్చిన కొద్దిపాటి ఈగలేచాలు. అదే విధంగా, జ్ఞానాన్నీ, గౌరవాన్నీ, మంటగలిపేందుకు కొద్దిపాటి మూర్ఖత్వం చాలు.

వివేకవంతుడి ఆలోచనలు అతన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. అయితే, అవివేకి అలోచనలు అతన్ని తప్పు మార్గంలో నడిపిస్తాయి. మూర్ఖుడు అలా దారి వెంట పోయేటప్పుడు సైతం తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తాడు. దానితో, వాడొక మూర్ఖుడన్న విషయాన్ని ప్రతి ఒక్కడూ గమనిస్తాడు.

యజమాని కేవలం నీపట్ల కోపం ప్రదర్శించినంత మాత్రాన నీవు నీ కొలువు వదిలెయ్యబోకు. నీవు ప్రశాంతంగా, సాయంగా వుంటే, పెద్ద పెద్ద పొరపాట్లను కూడా నీవు సరిదిద్దవచ్చు.[a]

ప్రపంచంలో జరిగే మరో అంశం నా దృష్టికి వచ్చింది. అది సమంజసమైనది కాదు. సాధారణంగా అది పరిపాలకులు చేసే పొరపాటు: అవివేకులకు ముఖ్యమైన పదవులు, జ్ఞాన సంపన్నులకు అప్రధానమైన పదవులు కట్టబెడతారు. సేవకులుగా ఉండదగినవాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తుండగా, అధికారులుగా ఉండదగిన వాళ్లు (వాళ్ల సరసన బానిసల మాదిరిగా) నడుస్తూవుండటం నేను చూశాను.

ప్రతి పనికీ, దాని ప్రమాదాలు వుంటాయి

గొయ్యి తవ్వే వ్యక్తి, తానే దానిలో పడవచ్చు. గోడ కూలగొట్టేవాణ్ణి పాము కాటెయ్యవచ్చు. పెద్దబండలను దొర్లించేవాడికి వాటివల్లనే గాయాలు కావచ్చు. చెట్లు నరికేవాడికి కూడా ప్రమాదం లేకపోలేదు, (ఆ చెట్లు అతని మీద కూలవచ్చు.)

10 అయితే, పరిజ్ఞానంవుంటే, ఏ పనైనా సులభతరం అవుతుంది. మొండి కత్తితో కొయ్యడం చాలా కష్టం. అయితే, మనిషి దానికి పదును పెడితే, అప్పుడు పని సులభతరమవుతుంది. (జ్ఞానం అంత సున్నిత మైనది.)

11 ఒక వ్యక్తికి పాముల్ని ఎలా అదుపు చేయాలో తెలియవచ్చు. కాని, అతను అందుబాటులో లేనప్పుడు పాము ఎవరినైనా కాటేస్తే ఆ నైపుణ్యం వ్యర్థమే. (జ్ఞానం అలాంటిది.)

12 వివేకవంతుడి మాటలు ప్రశంసా పాత్రలు.
    అయితే అవివేకి మాటలు వినాశకరమైనవి.

13 ఆదిలోనే మూర్ఖుడు అవకతవకగా మాట్లాడతాడు. చివర్లో ఇక అతనివి ఉన్మత్త ప్రలాపాలుగా ముగుస్తాయి. 14 అజ్ఞాని ఎడతెగకుండా (తను చెయ్యబోయే వాటిని గురించి) మాట్లాడతాడు. అయితే, భవిష్యత్తులో ఏమి జరగబోయేది ఎవరికీ తెలియదు. తర్వాత ఏమి జరిగేది ఏ ఒక్కడికి తెలియదు.

15 తన గమ్యానికి చేరుకునే మార్గం యేమిటో తెలుసుకునే నేర్పు మూర్ఖుడికి వుండదు,
    అందుకే అతను జీవితకాలమంతా కష్టించి పని చెయ్యాలి.

పని విలువ

16 రాజు శిశుప్రాయుడైనా, బానిస అయినా ఆ రాజ్యానికి చాలా చెరుపు జరుగుతుంది. అధికారులు తిండిపోతులై, తమ కాలమంతా భోజన పానాదులతోనే వినియోగించేవాళ్లయితే, ఆ దేశానికి చాలా చెరుపే జరుగుతుంది. 17 ఒక దేశపు రాజు కులీనుడైతే, ఆ దేశానికి ఎంతో మంచి జరుగుతుంది.[b] దేశాధికారులు తిండిపోతులు, తాగుబోతులు కాక, శక్తి పుంజుకునేందుకు మాత్రమే అన్నపానాలు మితంగా సేవించే వారైతే, ఆ దేశానికి ఎంతో క్షేమం.

18 మనిషి మరి బద్ధకస్తుడైతే, అతని ఇల్లు కురవనారంభిస్తుంది, ఇంటి పైకప్పు కూలిపోతుంది.

19 మనుష్యులకి తిండి సంతృప్తి నిస్తుంది, ద్రాక్షారసం వాళ్లని మరింత ఆనంద పరుస్తుంది. అయితే, డబ్బుంటే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.

వ్యర్థమాటలు

20 రాజును గురించి చెడుగా మాట్లాడకు. రాజును గురించి చెడ్డ ఆలోచనలు కూడా చేయకు. నీ యింట నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధనికులను గురించి చెడుగా మాట్లాడకు. ఎందుకంటావేమో, గోడలకి చెవులుంటాయి. నీవన్న మాటలన్నీ పిట్టలు చేరవేస్తాయి. వాళ్లకి చేరుతాయి.

తీతుకు 2

మంచి బోధ

ఉత్తమ సిద్ధాంతాల ప్రకారం సత్యాన్ని అనుసరించమని ప్రజలకు బోధించు. వృద్ధులకు శాంతంగా ఉండమని, గౌరవంగా జీవించుని, ఆత్మనిగ్రహం, సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, సహనము కలిగి ఉండమని బోధించు.

అదే విధంగా వృద్ధ స్త్రీలకు పవిత్రంగా జీవించమని, ఇతర్లను దూషించకూడదని, త్రాగుబోతులు కాకూడదని, మంచిని మాత్రమే ఉపదేశమిమ్మని చెప్పు. అలా చేస్తే వాళ్ళు యౌవన స్త్రీలకు తమ భర్తల్ని, తమ పిల్లల్ని ప్రేమించాలని, ఆత్మనిగ్రహం కలిగి ఉండి పవిత్రంగా జీవించాలని, తమ గృహనిర్వాహక కర్తవ్యాలను పూర్తి చెయ్యాలని, దయను అలవరచుకోవాలని, వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉపదేశించి శిక్షణనిస్తారు. అప్పుడు దైవసందేశాన్ని ఎవ్వరూ విమర్శించరు.

అదే విధంగా మనోనిగ్రహం కలిగి ఉండమని యువకులకు బోధించు. నీవు స్వయంగా ఉత్తమ కార్యాలు చేస్తూ వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నీవు బోధించేటప్పుడు మనస్పూర్తిగా, గంభీరంగా బోధించు. విమర్శకు గురికాకుండా జాగ్రత్తగా బోధించు. అప్పుడు నీ శత్రువు విమర్శించటానికి ఆస్కారం దొరకక సిగ్గుపడతాడు.

బానిసలు తమ యజమానుల యిష్టానుసారం నడుచుకోవాలని బోధించు. తమ యజమానులకు ఆనందం కలిగేటట్లు మసలుకోవాలనీ, వాళ్ళకు ఎదురు తిరిగి మాట్లాడరాదని వాళ్ళకు బోధించు. 10 తమ యజమానులనుండి దొంగిలించరాదనీ, తమ యజమానులు తమను విశ్వసించేటట్లు నడుచుకోవాలనీ బోధించు. అప్పుడే మన రక్షకుడైన దేవుని గురించి నేర్చుకొన్నవి సార్థకమౌతాయి.

11 ఎందుకంటే, మానవులకు రక్షణ కలిగించే దైవానుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది. 12 అది నాస్తికత్వాన్ని, ఐహిక దురాశల్ని మానివేయమని బోధిస్తుంది. మనోనిగ్రహం కలిగి, క్రమశిక్షణతో, ఆత్మీయంగా ఈ ప్రపంచంలో జీవించమని బోధిస్తుంది, 13 మనం ఆశిస్తున్న ఆ గొప్ప రోజు వస్తుందని, ఆ రోజున మన దేవుడునూ మన రక్షకుడునూ అయినటువంటి యేసు క్రీస్తు కనిపిస్తాడని నిరీక్షిస్తూ ఉన్నాము. 14 అన్ని పాపాలనుండి మనకు విముక్తి కలగాలని యేసు క్రీస్తు తనను తాను అర్పించుకొన్నాడు. సత్కార్యాలు చెయ్యాలని ఉత్సాహపడుతున్న ఈ ప్రజలు ఈ యేసు క్రీస్తుకు చెందినవాళ్ళు. ఆయన వాళ్ళను తనకోసం పవిత్రంగా చేసాడు.

15 నీవు ఈ విషయాలను బోధించాలి. సంపూర్ణమైన అధికారంతో ప్రజలను ఉత్సాహపరుస్తూ, ఖండిస్తూ, నిన్ను ఎవ్వరూ ద్వేషించకుండా జాగ్రత్త పడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International