M’Cheyne Bible Reading Plan
శారా మరణించింది
23 శారా 127 సంవత్సరాలు జీవించింది. 2 కనాను దేశంలోని కిర్యతర్బా (అనగా హెబ్రోను) పట్టణంలో ఆమె మరణించింది. అబ్రాహాము చాలా దుఃఖించి, ఆమె కోసం అక్కడ ఏడ్చాడు. 3 అప్పుడు మరణించిన తన భార్యను విడిచిపెట్టి, హిత్తీ ప్రజలతో మాట్లాడేందుకు అబ్రాహాము వెళ్లాడు. 4 “నేను ఈ దేశవాసిని కాను. ఇక్కడ నేను యాత్రికుడను మాత్రమే. అందుచేత నా భార్యను పాతిపెట్టుటకు నాకు స్థలము లేదు. నేను నా భార్యను పాతిపెట్టడానికి దయచేసి నాకు కొంత స్థలం ఇవ్వండి” అన్నాడు.
5 హిత్తీ ప్రజలు అబ్రాహాముకు ఇలా జవాబు చెప్పారు. 6 “అయ్యా, మా మధ్య మీరు దేవుని మహా నాయకులలో ఒకరు. చనిపోయిన మీ వాళ్లను పాతిపెట్టేందుకు మా శ్రేష్ఠమైన స్థలాన్ని మీరు తీసుకోవచ్చు. చనిపోయిన వాళ్లను పాతిపెట్టే మా స్థలాల్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అక్కడ మీ భార్యను పాతిపెట్టడానికి మేము ఎవ్వరం అడ్డు చెప్పం.”
7 అబ్రాహాము లేచి ప్రజలకు నమస్కరించాడు. 8 అబ్రాహాము వాళ్లతో చెప్పాడు: “నేను నా భార్యను పాతిపెట్టడానికి మీరు నిజంగా నాకు సహాయం చేయగోరితే, సోహరు కుమారుడు ఎఫ్రోనుతో నా పక్షంగా మీరు మాట్లాడండి. 9 మక్పేలా గుహను నేను కొనాలని కోరుతున్నాను. ఇది ఎఫ్రోను స్వంతం. అది అతని పొలం చివరిలో ఉంది. దాని విలువ ఎంతో అంత మొత్తం నేను చెల్లిస్తాను. పాతిపెట్టే స్థలంగా దీనిని నేను కొంటున్నట్లు మీరంతా సాక్షులుగా ఉండాలని నేను కోరుతున్నాను.”
10 ఎఫ్రోను ఆ జనం మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఎఫ్రోను అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు: 11 “లేదయ్యా, నేను ఆ స్థలం ఇక్కడ మా అందరి ప్రజల సమక్షంలో నీకిచ్చేస్తాను. ఆ గుహను నేను నీకిస్తాను. నీవు నీ భార్యను పాతిపెట్టుకొనేందుకు ఆ స్థలం నేను నీకు ఇచ్చివేస్తాను.”
12 అప్పుడు అబ్రాహాము హిత్తీయుల ముందు వంగి నమస్కారం చేశాడు. 13 అబ్రాహాము, “ఆ పొలానికి పూర్తి ధర నేను చెల్లిస్తాను. నా డబ్బు స్వీకరించు. నా మృతులను నేను పాతిపెట్టుకొంటాను” అని ప్రజలందరి ముందు ఎఫ్రోనుతో చెప్పాడు.
14 అబ్రాహాముకు ఎఫ్రోను ఇలా జవాబు చెప్పాడు: 15 “అయ్యా, నా మాట వినండి. 400 తులాల వెండి మీకు గాని నాకు గాని ఏపాటి? భూమిని తీసుకొని, చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో.”
16 తనతో ఆ పొలం వెల ఎఫ్రోను చెబుతున్నాడని గ్రహించి ఆ వెల 400 తులాల వెండి తూచి అబ్రాహాము అతనికి ఇచ్చాడు.
17-18 కనుక ఎఫ్రోను పొలానికి స్వంతదారులు మారిపోయారు. ఈ పొలం మమ్రేకు తూర్పున మక్పేలాలో ఉంది. ఆ పొలానికి, పొలంలో ఉన్న గుహకు, అందులోని చెట్లన్నిటికీ అబ్రాహాము స్వంతదారుడయ్యాడు. ఎఫ్రోను అబ్రాహాముల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆ పట్టణ ప్రజలంతా చూశారు. 19 ఇది జరిగిన తర్వాత మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో అబ్రాహాము తన భార్యను పాతిపెట్టాడు (అది కనానులోని హెబ్రోను). 20 ఆ పొలాన్ని, దానిలోని గుహను హిత్తీ ప్రజల దగ్గర అబ్రాహాము కొన్నాడు. ఇది అతని ఆస్తి అయ్యింది, దాన్ని అతడు పాతిపెట్టే స్థలంగా ఉపయోగించాడు.
పెళ్ళి విందు ఉపమానం
(లూకా 14:15-24)
22 యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: 2 “దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు. 3 ఆ రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళను రమ్మని పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వానితులు రావటానికి నిరాకరించారు.
4 “ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ ఆహ్వానింపబడిన వాళ్ళతో ‘భోజనం సిద్దంగా ఉందని చెప్పండి. ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్ళని పెళ్ళికి రమ్మనండి’ అని అన్నాడు.
5 “కాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వెళ్ళిపొయ్యారు. 6 మిగతా వాళ్ళు ఆ సేవకుల్ని పట్టుకొని అవమానించి చంపేశారు. 7 ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు.
8 “ఆ తర్వాత తన సేవకులతో, ‘పెళ్ళి విందు సిద్దంగా ఉంది. కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు రావటానికి అర్హులుకారు. 9 వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి’ అని అన్నాడు. 10 ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వాళ్ళందర్ని అంటే మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, అందర్ని పిలుచుకు వచ్చారు. అతిథులతో పెళ్ళి యిల్లంతా నిండిపోయింది.
11 “రాజు అతిధుల్ని చూడాలని వచ్చాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకడు పెళ్ళి దుస్తులు వెసుకోలేదని గమనించాడు. 12 ‘మిత్రమా! పెళ్ళి దుస్తులు వేసుకోకుండా లోపలికి ఎట్లా వచ్చావు?’ అని రాజు అత న్ని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేక పొయ్యాడు. 13 వెంటనే ఆ రాజు తన సేవకులతో, ‘అతని కాళ్ళు, చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి. అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు’ అని అన్నాడు.
14 “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు.
యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం
(మార్కు 12:13-17; లూకా 20:20-26)
15 ఆ తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని ఆయన మాటల్తోనే పట్టి వేయాలని కుట్ర పన్ని తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్ళను యేసు దగ్గరకు పంపారు. 16 వాళ్ళు, “బోధకుడా! మీరు సత్యవంతులని, దైవ మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారని మాకు తెలుసు. ఇతర్ల అంతస్తులను లెక్క చెయ్యరు. కనుక పక్షపాతం చూపరని కూడా మాకు తెలుసు. 17 మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా? కాదా? మీరేమంటారు?” అని ఆయన్ని అడిగారు.
18 యేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసిపోయింది. వాళ్ళతో, “వేషధారులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు? 19 ఏ నాణెంతో పన్నులు కడుతున్నారో దాన్ని నాకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు ఒక దెనారా తెచ్చి ఆయనకు ఇచ్చారు. 20 ఆయన, “ఈ బొమ్మ ఎవరిది? ఆ నాణెంపై ఎవరి శాసనం ఉంది?” అని వాళ్ళనడిగాడు.
21 “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
అప్పుడాయన వాళ్ళతో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందిది దేవునికి యివ్వండి” అని అన్నాడు.
22 ఇది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.
కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం
(మార్కు 12:18-27; లూకా 20:27-40)
23 అదే రోజు పునరుత్ధానంలేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: 24 “బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు. 25 మాలో ఏడుగురు సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకొన్నాడు. 26 రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు. 27 చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. 28 ఆ ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి పునరుత్ధానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి భార్యగా ఉంటుంది?”
29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు. 30 పునరుత్థానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. 31 ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా? 32 ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(A) అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు.”
33 ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు.
అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?
(మార్కు 12:28-34; లూకా 10:25-28)
34 యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు. 35-36 వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు.
37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి.(B) 38 ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది. 39 రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’(C) 40 ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం.”
క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా?
(మార్కు 12:35-37; లూకా 20:41-44)
41 పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు వాళ్ళను 42 “మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని అడిగాడు.
“దావీదు కుమారుడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
43 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “మరి దావీదు దేవుని ఆత్మద్వారా మాట్లాడుతూ క్రీస్తును ‘ప్రభూ!’ అని ఎందుకు పిలిచాడు? దావీదు,
44 ‘ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసే దాకా,
నా కుడి వైపు కూర్చో’(D)
అని అనలేదా? 45 దావీదు క్రీస్తును ‘ప్రభూ’ అని అన్నాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లవుతాడు?”
46 ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేక పొయ్యారు. ఆ రోజు నుండి ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.
యాజకులు, లేవీయులు
12 యూదా దేశానికి తిరిగి వచ్చిన యాజకులు, లేవీయులు వీళ్లు: వీళ్లు షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతో, యేషూవతో కలిసి తిరిగి వచ్చిన వాళ్లు. వాళ్ల పేర్ల జాబితా ఇది:
శెరాయా, యిర్మియా, ఎజ్రా,
2 అమర్యా, మల్లూకు, హట్టూషు,
3 షెకన్యా, రెహూము, మెరేమోతు,
4 ఇద్దో, గిన్నెతోను, అబీయా,
5 మియామీను, మయెద్యా, బిల్గా,
6 షెమయా, యెయారీబు, యెదాయా,
7 సల్లూ, ఆమోకు, హిల్కియా, యెదాయా,
యేషూవ కాలంలో వీళ్లు యాజకుల నాయకులు, బంధువులు.
8 లేవీయులు వీళ్లు: యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, మత్తన్యా. మత్తన్యా బంధువులతోబాటు వీళ్లు దేవుని భజనల విషయంలో బాధ్యులు. 9 బక్బుక్యా, ఉన్నీలు ఆ లేవీయుల బంధువులు. వీళ్లిద్దరూ వాళ్లకి ఎదురుగా నిలిచి ఆరాధన సభలో పాల్గానేవారు. 10 యేషూవా యోయాకీము తండ్రి. యోయాకీము ఎలియాషీబు తండ్రి. ఎలియాషీబు యోయాదా తండ్రి. 11 యోయాదా యోనాతాను తండ్రి. యోనాతాను యెద్దూవ తండ్రి.
12 యోయాకీము కాలంలో యాజకుల కుటుంబాల నాయకులు వీళ్లే:
శెరాయా కుటుంబ నాయకుడు మెరాయా.
యిర్మీయా కుటుంబ నాయకుడు హనన్యా.
13 ఎజ్రా కుటుంబ నాయకుడు మెషుల్లాము.
అమర్యా కుటుంబ నాయకుడు యెహోహానాను.
14 మల్లూకు కుటుంబ నాయకుడు యోనాతాను.
షెకన్యా కుటుంబ నాయకుడు యోసేపు.
15 హారీము కుటుంబ నాయకుడు అద్నా.
మెరేమోతు కుటుంబ నాయకుడు హెల్కయి.
16 ఇద్దో కుటుంబ నాయకుడు జెకర్యా.
గిన్నేతోను కుటుంబ నాయకుడు మెషుల్లాము.
17 అబీయా కుటుంబ నాయకుడు జిఖ్రీ,
మిన్‌యామీను, మాదేయా కుటుంబాల నాయకుడు పిల్టయి.
18 బిల్గా కుటుంబ నాయకుడు షమ్మూయి.
షెమాయా కుటుంబ నాయకుడు యెహోనాతాను.
19 యోయారీబు కుటుంబ నాయకుడు మత్తెనయి.
యెదాయా కుటుంబ నాయకుడు ఉజ్జీ.
20 సల్లయి కుటుంబ నాయకుడు కల్లయి.
అమోకు కుటుంబ నాయకుడు ఏబెరు.
21 హిల్కియా కుటుంబ నాయకుడు హషబ్యా.
యెదాయా కుటుంబ నాయకుడు నెతనేలు.
22 పారసీక రాజు దర్యావేషు పాలనకాలంలో ఎల్యాషీబు, యోదాయా, యోహానాను, యద్దూవ కాలపు లేవీ కుటుంబాల పెద్దల, యాజకుల పేర్లు నమోదు చేయబడ్డాయి. 23 లేవీ కుటుంబ నాయకులు, ఎల్యాషిబు కొడుకైన యోహానాను పేర్లు చరిత్ర గ్రంథంలో లిఖించబడ్డాయి. 24 లేవీయుల నాయకులు వీళ్లు: షేరేబ్యా, కద్మీయేలు కొడుకు యేషూవా, వాళ్ల సోదరులు. వాళ్ల సోదరులు వీళ్లకి ఎదురుగా నిలబడి దైవ స్తోత్రాలు, భజన పాటలు పాడేవారు. ఒక బృందం మరో బృందానికి సమాధానంగా పాడుతుంది. దేవుని ప్రతినిధి అయిన దావీదు ఆదేశించిన రీతిలో ఈ స్తుతిపాటలు సాగుతాయి.
25 వెలుపలి ద్వారాల ప్రక్కన వున్న సామాన్ల గదులను కాసే ద్వారపాలకుల పేర్లు: మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు. 26 ఈ ద్వారపాలకులు యెయాకీము కాలంలో కొలువు చేశారు. యోయాకీము యేషూవా కొడుకు. యేషూవా యోయాదాకు కొడుకు. ఆ ద్వారపాలకులు నెహెమ్యా పాలనాధికారిగా వున్న కాలంలో, యాజకుడు, ఉపదేశకుడు అయిన ఎజ్రా కాలంలో కూడా కొలువుచేశారు.
యెరూషలేము ప్రాకార ప్రతిష్ట
27 ప్రజలు యెరూషలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించారు. వాళ్లు లేవీయులందర్నీ యెరూషలేముకి తీసుకువచ్చారు. ఆ లేవీయులు తాము నివసించే ఆయా పట్టణాలనుంచి వచ్చారు. వాళ్లు యెరూషలేముకి ప్రాకారం ప్రతిష్ఠించటం కోసం వచ్చారు. లేవీయులు దైవ స్తోత్రాలు పాడేందుకూ, కీర్తనలు పాడేందుకూ వచ్చారు. వాళ్లు స్వరమండల సితారలు, తాళాలు వాయించారు. తంబురలు మోగించారు.
28-29 గాయకులందరూ కూడా యెరుషలేముకి వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టూవున్న పట్టణాల నుంచి వచ్చారు. వాళ్లు నెటోపా పట్టణం నుంచి, బేత్‌గిల్గాలు, గెబ, అజ్‌మావెతుల నుంచి వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తమకోసం చిన్న చిన్న పట్టణాలు నిర్మించుకున్నారు.
30 యాజకులూ, లేవీయులూ తమని తాము పవిత్రం చేసుకున్నారు. తర్వాత వాళ్లు యెరూషలేము ప్రాకారాలన్నీ ఒక ఆచారములో పవిత్రీకరించారు.
31 అప్పుడు నేను (నెహెమ్యాను) యూదా నాయకులకి పైకెక్కి ప్రాకారం మీద నిలబడమని చెప్పాను. దైవ స్తుతి, కృతజ్ఞత గీతాలు పాడేందుకు రెండు పెద్ద గాయక బృందాలను కూడా ఎంపిక చేశాను. వాటిలో ఒక బృందం కుడివైపున పెంట గుమ్మం దిశగా పోయి ప్రాకారం పైకి ఎక్కాలి. 32 హోషెయా, యూదా నాయకుల్లో సగంమంది ఆ గాయకుల వెంట వెళ్లారు. 33 అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, 34 యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా, మొదలైనవారు కూడా వాళ్లతో వెళ్లారు. 35 యాజకుల్లో కొందరు కూడా బూరలు ఊదుతూ వాళ్లని ప్రాకారం దాకా అనుసరించారు, జెకర్యా కూడా వాళ్ల వెంట నడిచాడు (జెకర్యా యోనాతాను కొడుకు, యోనాతాను షెమయా కొడుకు, షెమయా మత్తనయా కొడుకు, మత్తనయా మీకాయా కొడుకు. మీకాయా జక్కూరు కొడుకు, జక్కూరు అసాఫు కొడుకు). 36 అంతేకాక ఆసాపు సోదరులు కూడా వున్నారు. వాళ్లు: షెమయా, అజరేలు, మిలయి, గిలలయి, మాయి, నెతనేలు, యూదా, హానానీ. వాళ్ల దగ్గర దైవ జనుడయిన దావీదు తయారు చేసిన సంగీత వాద్యాలు వున్నాయి. ఉపదేశకుడైన ఎజ్రా ప్రాకారానికి ప్రతిష్ఠ చేసే బృందానికి అగ్రభాగాన నడిచాడు. 37 వాళ్లు ఊట గుమ్మం దగ్గరికి వెళ్లారు. వాళ్లు మెట్లు ఎక్కి దావీదు నగరం[a] చేరుకున్నారు. వాళ్లు ప్రహరీగోడపైన నిలబడ్డారు. వాళ్లు దావీదు భవనం దాటి, ఊట గుమ్మం దిశగా గోడమీద నడిచి వెళ్లారు.
38 రెండవ గాయక బృందం రెండో దిశకి ఎడమ దిశకి బయల్దేరింది. వాళ్లు గోడపైకి వెళ్తున్నప్పుడు నేను వాళ్లని అనుసరించాను. జనంలో సగంమంది కూడా వాళ్లని అనుసరించారు. వాళ్లు అగ్ని గుండాల శిఖరాన్ని దాటి, వెడల్పు గోడను చేరుకున్నారు. 39 తర్వాత వాళ్లు ఈ క్రింది ద్వారాలు దాటారు: ఎఫ్రాయిము గుమ్మము, పురాతన గుమ్మము, మత్స్య గుమ్మము హనాన్యేలు శిఖరము, శతశిఖరము, గొర్రెల ద్వారం దాటి చివరకు కావలి ద్వారం దగ్గర ఆగారు. 40 అటు తర్వాత, ఆ గాయక బృందాలు రెండూ దేవుని ఆలయంలో తమ తమ స్థానాలకు చేరుకున్నాయి. నేను నా స్థానంలో నిలిచాను. అధికారుల్లో సగంమంది ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు. 41 తర్వాత ఈ క్రింది యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయ, ఎల్యోయెనై, జెకర్యా, హనన్యా బూరలు పట్టుకుని తమతమ స్థానాల్లో నిలిచారు. 42 తర్వాత, మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరు అనే యాజకులు ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు.
అప్పుడు రెండు గాయక బృందాలూ ఇజ్రహాయా నాయకత్వాన పాడనారంభించాయి. 43 ఈ విధంగా, ఆ ప్రత్యేక దినాన యాజకులు చాలా బలులు అర్పించారు. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా వున్నారు. దేవుడే వారందరినీ ఆనందపరవశుల్ని చేశాడు. చివరకు స్త్రీలు, పిల్లలు సైతం మహోత్సాహంతో, ఆనందంలో తేలియాడారు. దూర ప్రాంతాలవారు సైతం యెరూషలేము నుంచి వెలువడే ఆనంద కోలాహలాన్ని వినగలిగారు.
44 ఆ రోజున వస్తుపులను భద్రపరచు గదులలో భద్రపరచు కొందరిని నియమించారు. జనం తమ తొలికాపు ఫలాలను, పదోవంతు పంటలను తీసుకు వచ్చారు. వస్తువులను భద్రపరచువారు వాటిని వస్తువులను భద్రపరచు గదులలో పదిలపరిచారు. బాధ్యులుగా వున్న యాజకుల, లేవీయుల విషయంలో యూదా జనసామాన్యం చాలా తృప్తి చెందారు. అందుకని, వాళ్లు గిడ్డంగుల్లో పెట్టేందుకు చాలా వస్తువులు తెచ్చారు. 45 యాజకులూ, లేవీయులూ తమ దేవునిపట్ల భక్తిభావంతో ఈ పనులు చేశారు. వాళ్లు జనాన్ని పరిశుద్ధులను చేసే విధానాలు ఆచరించారు. గాయకులూ, ద్వారపాలకులూ తమ తమ విధులను నిర్వర్తించారు. దావీదూ, సొలొమోనూ ఆదేశించిన పనులన్నీ వాళ్లు చేశారు. 46 (ఎన్నడో పూర్వం, దావీదు కాలంలో, ఆసాపు ప్రధానుడుగా వున్నాడు. అతనికి చాలా స్తోత్రాలూ, దైవసంకీర్తనలూ తెలుసును.)
47 ఈ విధంగా, జెరుబ్బాబెలు, నెహెమ్యాల కాలంలో, ఇశ్రాయేలు ప్రజలందరూ గాయకుల, ద్వార పాలకుల సహాయార్థం ప్రతిరోజూ ఏదో ఒకటి ఇస్తూనే వుండేవారు. జనం కూడా తదితర లేవీయుల కోసం ఏదోఒకటి, ఎంతో కొంత కేటాయించేవారు. పోతే, లేవీయులు అహరోను వంశీకుల (యాజకుల) కోసం కొంత సొమ్ము కేటాయించేవారు.
పౌలు ప్రజలతో మాట్లాడటం
22 “పెద్దలారా! సోదరులారా! నా సమాధానం వినండి.”
2 అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం విని వాళ్ళు మరింత నిశ్శబ్దం వహించారు.
3 పౌలు ఈ విధంగా చెప్పుకొంటూ పొయ్యాడు: “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే పట్టణంలో జన్మించాను. ఈ పట్టణంలో పెరిగాను. మన పూర్వులు అప్పగించిన ధర్మశాస్త్రంలో గమలీయేలు వద్ద సంపూర్ణంగా శిక్షణ పొందాను. మీరు ఈనాడు దేవుని పట్ల ఏ పద్ధతిననుసరించి మీ భక్తిని ప్రదర్శిస్తున్నారో అదే పద్ధతిలో నేనూ ప్రదర్శిస్తూ ఉండేవాణ్ణి. 4 నేను యేసు మార్గాన్ని అనుసరించినవాళ్ళను ఎన్నో హింసలు పెట్టాను. తద్వారా కొందరికి మరణం కూడా సంభవించింది. ఆడా, మగా అనే భేదం లేకుండా అందర్ని బంధించి కారాగారంలో వేసేవాణ్ణి.
5 “ప్రధానయాజకుడు, మహాసభకు చెందిన పెద్దలు దీనికి సాక్ష్యం. వాళ్ళను, డెమాస్కసులోని వాళ్ళ సోదరులకు ఉత్తరాలు వ్రాసి ఇవ్వమని అడిగి తీసుకొన్నాను. అక్కడికి వెళ్ళి యేసు మార్గాన్ని అనుసరిస్తున్నవాళ్ళను బంధించి యెరూషలేమునకు పట్టుకు వచ్చి వాళ్ళకు శిక్ష ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యం.
పౌలు తన మార్పునుగూర్చి చెప్పటం
6 “నేను డెమాస్కసుకు వెళ్తూ, ఆ పట్టణపు పొలిమేరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశంనుండి తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. 7 నేను నేలకూలిపొయ్యాను. నాతో ఒక స్వరం, ‘సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు!’ అని అడిగింది.
8 “‘మీరెవరు ప్రభూ!’ అని నేనడిగాను. ‘నేను నజరేతుకు చెందిన యేసును. నీవు హింసిస్తున్నది నన్నే!’ అని ఆ స్వరం జవాబు చెప్పింది. 9 నాతో ఉన్నవాళ్ళు ఆ వెలుగును చూసారు. కాని ఆ స్వరం ఏం మాట్లాడుతోందో వాళ్ళకు అర్థం కాలేదు.
10 “‘నన్నేం చేయమంటారు ప్రభూ!’ అని నేనడిగాను. ‘లేచి డెమాస్కసుకు వెళ్ళు. అక్కడికి వెళ్ళాక నీవు చేయవలసిన పనులు చెప్పబడతాయి’ అని ప్రభువు అన్నాడు. 11 ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చెయ్యటం వల్ల నాతో ఉన్నవాళ్ళు నన్ను నా చేయి పట్టుకొని డెమాస్కసుకు నడిపించుకు వెళ్ళారు.
12 “అననీయ అనే పేరుగల వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో పాటించే విశ్వాసి. అక్కడ నివసిస్తున్న యూదులందరు అతణ్ణి గౌరవించేవాళ్ళు. అననీయ నా ప్రక్కన నిల్చొని 13 ‘సౌలా! నా సోదరా! నీకు దృష్టి కలుగుగాక!’ అని అన్నాడు. తక్షణం నేను చూడగలిగాను.
14 “ఆ తదుపరి అతడు, ‘మన పూర్వికులు పూజించిన దేవుడు, తాను చేయదలచిన విషయం తెలుపటానికి, నీతిమంతుడైనటువంటి తన సేవకుణ్ణి చూడటానికి, ఆయన నోటిమాటలు వినటానికి నిన్ను ఎన్నుకొన్నాడు. 15 నీవు చూసినవాటిని గురించి, విన్నవాటిని గురించి ఆయన పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు. 16 ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!’ అని అన్నాడు.
17 “నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం కలిగింది. 18 ఆ దర్శనంలో ప్రభువు, ‘త్వరగా లే! వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో! నా గురించి నీవు చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు’ అని అనటం విన్నాను.
19 “నేను, ‘ప్రభూ! నేను యూదుల ప్రతి సమాజమందిరంలోకి వెళ్ళి భక్తుల్ని బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు. 20 నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ, అతణ్ణి చంపుతున్నవాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను’ అని అన్నాను.
21 “అప్పుడు ప్రభువు నాతో, ‘వెళ్ళు! నిన్ను దూరంగా యూదులు కానివాళ్ళ దగ్గరకు పంపుతాను’ అని అన్నాడు.”
22 ప్రజలు పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు వేసారు. 23 వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ, దుమ్ము రేపుతూ కేకలు వేసారు. 24 సేనాధిపతి పౌలును కోట లోపలికి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతణ్ణి చూసి ఎందుకిలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. 25 అతణ్ణి కొట్టటానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతితో, “నేరస్తుడని నిర్ణయం కాకముందే రోమా పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు.
26 ఇది విన్నాక ఆ సేనాధిపతి, సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి పౌలు అన్నది చెబుతూ, “మీరేమి చేస్తున్నారో మీకు తెలుసా? అతడు రోమా పౌరుడట!” అని అన్నాడు.
27 ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరకు వెళ్ళి, “ఇప్పుడు చెప్పు! నీవు రోమా పౌరుడివా?” అని అడిగాడు.
“ఔను!” పౌలు సమాధానం చెప్పాడు.
28 సహస్రాధిపతి, “నేను రోమా పౌరుడవటానికి చాలా డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు.
పౌలు, “నేను పుట్టినప్పటినుండి రోమా పౌరుణ్ణి!” అని అన్నాడు.
29 అతణ్ణి ప్రశ్నలడగాలనుకొన్నవాళ్ళు తక్షణమే వెనుకంజ వేసారు. ఆ సహస్రాధిపతి కూడా తాను రోమా పౌరుణ్ణి బంధించిన విషయం గమనించి భయపడిపోయాడు.
పౌలు యూదుల నాయకులతో మాట్లాడటం
30 అతడు పౌలుపై యూదులు మోపిన నిందకు సరియైన కారణం తెలుసుకోవాలనుకొన్నాడు. కనుక మరుసటి రోజు ప్రధానయాజకుల్ని, మిగతా సభ్యుల్ని సమావేశం కమ్మని ఆజ్ఞాపించాడు. పౌలును విడుదల చేసి వాళ్ళ ఎదుటకు పిలుచుకు వెళ్ళాడు.
© 1997 Bible League International