Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 10

కొత్త రాతి పలకలు

10 “ఆసమయంలో యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘మొదటి పలకల్లాంటివే రెండు పలకలు రాతితో నీవు చెక్కాలి. అప్పుడు నీవు కొండ ఎక్కి నా దగ్గరకు రావాలి. అలాగే వీటి కోసం ఒక చెక్క పెట్టెకూడా చేయాలి. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే ఆ రాతి పలకలమీద నేను వ్రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను ఆ పెట్టెలో పెట్టాలి.’

“కనుక నేను తుమ్మ కర్రతో ఒక పెట్టె చేసాను. మొదటి రెండు పలకల్లాంటివే మరి రెండు పలకలు రాతినుండి నేను తొలిచాను. అప్పుడు నేను కొండ మీదికి వెళ్లాను. ఆ రెండు రాతి పలకలు నా చేతిలో ఉన్నాయి. అప్పుడు యెహోవా యింతకు ముందు ఆ పలకల మీద వ్రాసిన ఆ మాటలనే, అంటే ఆ కొండ దగ్గర మీరు సమావేశమైనప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పిన ఆ పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాడు. అప్పుడు యెహోవా ఆ రాతి పలకలను నాకు ఇచ్చాడు. నేను వెనక్కు తిరిగి, కొండ దిగి వచ్చేసాను. ఆ పలకలను నేను చేసిన పెట్టెలో ఉంచాను. వాటిని అందులో పెట్టుమని నాకు యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ఆ పలకలు ఆ పెట్టెలోనే ఉన్నాయి.”

(ఇశ్రాయేలు ప్రజలు యహకాను ప్రజల బావుల దగ్గరనుండి ప్రయాణం చేసి మోసేరుకు వచ్చారు. అక్కడ అహరోను చనిపోయి, పాతిపెట్టబడ్డాడు. అహరోను కుమారుడు ఎలీయాజరు అహరోను స్థానంలో యాజకుడయ్యాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోసేరునుండి గుద్గోదకు వెళ్లారు. మరియు వారు గుద్గోదనుండి నదులుగల యొత్బాతా దేశం వెళ్లారు. ఆ సమయంలోనే యెహోవా తన ప్రత్యేక పని నిమిత్తం, లేవీ వంశాన్ని యితర వంశాలనుండి వేరు చేసాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను[a] మోయాల్సిన పని వారిది. యెహోవా ఆలయంలో యాజకులుగా కూడా వారు సహాయం చేసారు. మరియు యెహోవా నామమున ప్రజలను ఆశీర్వాదించాల్సిన పనికూడా వారికి ఉంది. ఈ ప్రత్యేక పని వారు నేటికీ చేస్తున్నారు. అందువల్లనే యితర వంశాలవలె లేవీ వంశం దేశంలో భాగం పొందలేదు. యెహోవాయే లేవీయులకు భాగం. మీ దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసింది అదే.)

10 “మొదటిసారిలాగే, 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను ఆ కొండమీద ఉండిపోయాను. ఆ సమయంలో యెహోవా నా మాట కూడా విన్నాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేయకూడదని తీర్మానించాడు. 11 యెహోవా ‘వెళ్లి ప్రజలను వారి ప్రయాణంలో నడిపించు. వారు వెళ్లి, వారికి ఇస్తానని వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన దేశంలో నివసిస్తారు’” అని నాతో చెప్పాడు.

నిజంగా యెహోవా కోరేది

12 “ఇశ్రాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా కోరేది ఇదే: మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయన మీతో చెప్పినవన్నీ చేయండి. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, సేవించండి. 13 ఈ వేళ నేను మీకు చెబుతున్న యెహోవా చట్టాలను, ఆజ్ఞలను పాటించండి. ఈ చట్టాలు, ఆజ్ఞలు మీ మంచికోసమే.

14 “సర్వం మీ దేవుడైన యెహోవాకే చెందుతుంది. ఆకాశం, మహా ఎత్తయిన ఆకాశం సహా యెహోవాదే. భూమి, దానిమీద ఉన్న సమస్తం మీ దేవుడైన యెహోవాదే. 15 మీ పూర్వీకులను యెహోవా ఎంతో ప్రేమించాడు. వారి సంతతివారై మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఉండేందుకు ఏర్పరచుకొనే అంతగా ఆయన వారిని ప్రేమించాడు. మరి ఏ ఇతర ప్రజలు కాకుండ మిమ్మల్నే ఆయన ఎన్నుకొన్నాడు. మీరు నేటికీ ఆయన ఏర్పరచుకొన్న ప్రజలే.

16 “మీరు మీ మొండి వైఖరి విడిచిపెట్టి, మీ హృదయాలను. యెహోవాకు ఇవ్వాలి. 17 ఎందుకంటే యెహోవా మీ దేవుడు గనుక. ఆయన దేవుళ్లకు దేవుడు. ప్రభువులకు ప్రభువు. ఆయనే మహా దేవుడు. ఆయన అద్భుతమైన మహా శక్తిగల పరాక్రమశాలి. యెహోవాకు ప్రతి మనిషీ సమానమే. ఆయన లంచం తీసుకోడు. 18 తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన సహాయం చేస్తాడు. విధవలకు ఆయన సహాయం చేస్తాడు. మన దేశంలో ఉండే విధేశీయులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారికి భోజనం, బట్టలు యిస్తాడు. 19 అందుచేత ఆ విదేశీయులను మీరుకూడా ప్రేమించాలి. ఎందుకంటే మీ మట్టుకు మీరే ఈజిప్టు దేశంలో విదేశీయులు గనుక.

20 “మీరు మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఎన్నడూ ఆయనను విడువవద్దు. మీరు ప్రమాణాలు చేసేటప్పుడు మీరు ఆయన పేరు మాత్రమే ఉపయోగించాలి. 21 మీరు స్తుతించవలసినది యెహోవాను మాత్రమే. ఆయన మీ దేవుడు. ఆయన మీకోసం అద్భుతమైన గొప్ప కార్యాలు చేసాడు. మీరు ఈ కార్యాలను మీ కళ్లారా చూసారు. 22 మీ పూర్వికులు ఈజిప్టులోనికి వెళ్లినప్పుడు వారు 70 మంది మాత్రమే. ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మందిగా, ఆకాశ నక్షత్రాలు ఎన్నో అంతమందిగా మీ దేవుడైన యెహోవా చేసాడు.

కీర్తనలు. 94

94 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు.
    నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.
నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి.
    గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.
యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు?
    యెహోవా, ఇంకెన్నాళ్లు?
ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి
    ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?
యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు.
    నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
మా దేశంలో నివసించే విధవరాండ్రను, పరదేశస్థులను ఆ దుర్మార్గులు చంపుతారు.
    తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.
వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు.
    జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబుతారు.

దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు.
    మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు?
దుర్మార్గులారా, మీరు అవివేకులు
    మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.
దేవుడు మన చెవులను చేశాడు.
    కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు.
దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి.
    జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.
10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు.
    ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.
11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు.
    ప్రజలు గాలి వీచినట్లుగా ఉంటారని దేవునికి తెలుసు.

12 యెహోవా శిక్షించినవాడు సంతోషంగా ఉంటాడు.
    సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు.
    దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు.
    సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.
15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది.
    అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.

16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు.
    చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.
17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే
    నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు.
    కాని యెహోవా తన అనుచరుని బలపరిచాడు.
19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను.
    కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.

20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు.
    ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.
21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు.
    అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.
22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే.
    నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.
23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు.
    వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు.
    మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.

యెషయా 38

హిజ్కియా జబ్బు

38 ఆ కాలంలో హిజ్కియాకు జబ్బు చేసింది. అతనికి దాదాపు మరణ పరిస్థితి ఏర్పడింది. ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త అతన్ని చూడటానికి వెళ్లాడు. “నేను ఈ సంగతులు నీతో చెప్పాలని యెహోవా నాకు చెప్పాడు. ‘త్వరలోనే నీవు మరణిస్తావు. కనుక నీవు చనిపోయినప్పుడు నీ కుటుంబం వారు ఏం చేయాలో నీవు వారితో చెప్పాలి. నీవు మళ్లీ బాగుపడవు’ అని యెషయా రాజుతో చెప్పాడు.”

హిజ్కియా దేవాలయపు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు, “యెహోవా, నేను నీ యెదుట ఎల్లప్పుడూ నమ్మకమైన పవిత్ర హృదయంతో జీవించానని దయచేసి జ్ఞాపకం చేసికొనుము. నీవు మంచివి అనే పనులే నేను చేశాను.” తర్వాత హిజ్కియా గట్టిగా ఏడ్వటం మొదలు బెట్టాడు.

యెహోవా దగ్గర్నుండి యెషయా ఈ సందేశాన్ని స్వీకరించాడు; “హిజ్కియా దగ్గరకు వెళ్లి అతనితో చెప్పు, నీ పూర్వీకుడైన దావీదు దేవుడు, యెహోవా చెప్పే సంగతులు ఇవి, ‘నీ ప్రార్థనలు నేను విన్నాను, నీ దుఃఖపు కన్నీళ్లు నేను చూశాను. నేను నీ ఆయుష్షు పదిహేను సంవత్సరాలు ఎక్కువ చేస్తాను. అష్షూరు రాజు నుండి నిన్ను నేను కాపాడుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను.’”

యెహోవా చెప్పిన వాటిని చేస్తాడని నీకు చూపించేందుకు యిదే సంకేతం. “చూడు, ఆహాజు మెట్ల మీద ఉన్న ఎండ గడియారము నీడను పది అడుగులు వెనుకకు వెళ్లేటట్టు నేను చేస్తున్నాను. దిగిపోయిన సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు వెళ్తుంది.”

హిజ్కియా పాట

హిజ్కియా రోగమునుండి స్వస్థత పొందినప్పుడు వ్రాసిన గీతం:

10 నేను వృద్ధుడనయ్యేంత వరకు బ్రతుకుతానని నాలో నేను అనుకొన్నాను.
    కానీ నేను పాతాళ ద్వారాలగుండా వెళ్లాల్సిన సమయం అది. ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే గడపాలి.
11 కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభువైన యెహోవాను నేను మరల చూడను.
    భూమిమీద మనుష్యులు జీవించుట నేను మరల చూడను.
12 నా ఇల్లు, నా గొర్రెల కాపరి గుడారం లాగివేయబడి నానుండి తీసివేయబడుతుంది.
    మగ్గమునుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా పని అయిపోయింది.
    ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొనివచ్చావు.
13 రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను.
    అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు అణగ ద్రొక్కబడ్డాయి.
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు.
14 నేను గువ్వలా మూల్గాను.
    నేను పక్షిలా ఏడ్చాను.
నా కళ్లు క్షీణించాయి
    కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను.
నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి.
    నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.”
15 నేనేం చెప్పగలను?
    జరిగేదేమిటో నా ప్రభువు నాకు చెప్పాడు.
    నా యజమాని దానిని జరిగిస్తాడు.
నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి.
    కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను.
16 నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ కష్ట సమయాన్ని ఉపయోగించు
    నా ఆత్మ బలపడి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేయుము.
    నేను బాగుపడేందుకు సహాయం చేయి.
    మరల జీవించేందుకు నాకు సహాయం చేయుము.

17 చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి.
    ఇప్పుడు నాకు శాంతి ఉంది.
నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు.
    నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు.
నీవు నా పాపాలన్నీ క్షమించావు.
    నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.
18 చచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు.
    పాతాళంలోని ప్రజలు నిన్ను స్తుతించరు.
చచ్చినవాళ్లు సహాయం కోసం నిన్ను నమ్ముకోరు. వారు భూగర్భంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్లాడరు.
19 నేడు నాలాగే బ్రతికి ఉన్న మనుష్యులే
    నిన్ను స్తుతించేవారు.
    నీవు నమ్మదగిన వాడవని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పాలి.
20 కనుక నేను అంటాను: “యెహోవా నన్ను రక్షించాడు
    కనుక మా జీవిత కాలమంతా మేము యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయిద్యాలు వాయిస్తాం.”

21 అప్పుడు యెషయా, “నీవు అంజూరపు పండ్లను దంచి, నీ పుండ్ల మీద వేయాలి, అప్పుడు, నీవు స్వస్థపడతావు” అని హిజ్కియాతో చెప్పాడు.

22 కానీ హిజ్కియా, “నేను బాగవుతానని రుజువు చేసేందుకు యెహోవా దగ్గర్నుండి వచ్చే గురుతు ఏమిటి? నేను యెహోవా మందిరానికి వెళ్ల గలుగుతానని రుజువుచేసే సంకేతం ఏమిటి?” అని యెషయాను అడిగాడు.

ప్రకటన 8

ఏడవ ముద్ర

ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగంటదాకా నిశ్శబ్దంగా ఉండెను. దేవుని ముందు నిలబడి ఉన్న ఆ ఏడుగురు దేవదూతల్ని చూసాను. వాళ్ళకు ఏడు బూరలు యివ్వబడ్డాయి.

బంగారు ధూపార్తి పట్టుకొన్న మరొక దూత వచ్చి ధూప వేదిక ముందు నిలుచున్నాడు. సింహాసనం ముందున్న ధూప వేదికలో ధూపం వేయటానికి అతనికి ఎన్నో ధూపద్రవ్యాలు యివ్వబడ్డాయి. పవిత్రుల ప్రార్థనలతో ధూపం వేయబడింది. దూత వేసిన సుగంధ ధూపము, పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవునికి అందింది. దూత ధూపార్తిని తీసుకొని ధూప వేదికలో ఉన్న నిప్పు అందులో ఉంచి దాన్ని భూమ్మీదకు విసిరివేసాడు. దాంతో ఉరుములు, పెద్దగర్జనలు, మెరుపులు, భూకంపాలు కలిగాయి.

ఏడు బూరలు

ఏడు బూరలు పట్టుకొన్న ఆ ఏడుగురు దూతలు ఆ బూరలు ఊదటానికి సిద్ధపడ్డారు.

మొదటి దేవదూత బూర ఊదాడు. వెంటనే రక్తంతో, నిప్పుతో కూడిన వడగండ్లు భూమ్మీదికి విసిరివేయబడ్డాయి. భూమిపైనున్న మూడవ భాగం కాలిపోయింది. మూడవ భాగం చెట్లు కూడా కాలిపోయాయి. పచ్చగడ్డి పూర్తిగా కాలిపోయింది.

రెండవ దేవదూత బూర ఊదాడు. ఒక మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పారవేయ బడింది. సముద్రంలో మూడవ భాగం రక్తంగా మారిపోయింది. సముద్రంలో ఉన్న ప్రాణులలో మూడవ భాగం చనిపోయాయి. మూడవ భాగం ఓడలు నాశనమయ్యాయి.

10 మూడవ దేవదూత తన బూర ఊదాడు. ఒక పెద్ద నక్షత్రం దివిటీలా మండుతూ ఆకాశం నుండి వచ్చి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటల మీద పడింది. 11 ఆ నక్షత్రం పేరు మాచిపత్రి.[a] దానివల్ల మూడవ భాగం నీళ్ళు చేదుగా మారిపోయాయి. చేదుగా మారిన ఆ నీటివల్ల చాలామంది మరణించారు.

12 నాలుగవ దేవదూత బూర ఊదాడు. అప్పుడు సూర్యునిలో మూడవ భాగము, చంద్రునిలో మూడవ భాగము, నక్షత్రాలలో మూడవ భాగము నాశనమయ్యాయి. తద్వారా అవి చీకటిగా మారిపోయాయి. దాని మూలంగా దినంలో మూడవ భాగం, రాత్రిలో మూడవ భాగం చీకటితో నిండుకుపోయాయి.

13 నేను ఇంకా చూస్తూనే ఉన్నాను. ఇంతలో గాలిలో ఎగురుతున్న ఒక పెద్ద పక్షి గొప్ప స్వరంతో, “భూమ్మీద జనులకు శ్రమ! శ్రమ! శ్రమ! ఎందుకనగా ఇంకా ముగ్గురు దేవదూతలు ఊదబోతున్నారు” అని కేకలు వేయటం విన్నాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International