M’Cheyne Bible Reading Plan
గిబియోనులు యెహోషువకు చేసిన మోసం
9 యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులందరూ ఈ సంగతులు విన్నారు. హిత్తీ, అమోరీ, కనానీ, పెరిజ్జీ, హివ్వీ, యెబూసీ ప్రజల రాజులు వీరు. వారు కొండ దేశాల్లోనూ, మైదాన దేశాల్లోనూ నివసించారు. మధ్యధరా సముద్ర తీరంలో లెబానోను వరకూ కూడ వారు నివసించారు. 2 ఈ రాజులంతా ఏకమయ్యారు. యెహోషువ మీద, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వారు పథకాలు వేసారు.
3 యెరికో, హాయి పట్టణాలను యెహోషువ జయించిన విధానాన్ని గూర్చి గిబియోను పట్టణ ప్రజలు విన్నారు. 4 కనుక వారు ఇశ్రాయేలు ప్రజలను మోసం చేయాలని నిర్ణయించారు. వారి పథకం ఇలా ఉంది: పగిలిపోయి, చినిగిపోయిన పాత ద్రాక్షారసం తిత్తులను వారు పోగుచేసారు. వారి జంతువుల వీపుల మీద ఈ పాత ద్రాక్షారసపు తిత్తులను[a] వారు వేసారు. వారు చాల దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడాలని ఆ పాత తిత్తులను అలా జంతువుల మీద వేసారు. 5 ఆ మనుష్యులు పాదాలకు పాత చెప్పులు తొడుక్కొన్నారు. వాళ్లు పాత బట్టలు వేసుకొన్నారు. ఎండిపోయి, విరిగిపోతున్న పాత రొట్టె కొంత వారు సంపాదించారు. అందుచేత ఆ మనుష్యులు చాలా దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడ్డారు. 6 అప్పుడు వాళ్లు ఇశ్రాయేలీయుల బసకు వెళ్లారు. ఈ బస గిల్గాలు దగ్గర ఉంది.
ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు వెళ్లి, “మేము చాల దూరదేశం నుండి ప్రయాణం చేసి వచ్చాము. మేము మీతో శాంతి ఒడంబడిక చేసుకోవాలని కోరుతున్నాం” అని అతనితో చెప్పారు.
7 ఇశ్రాయేలు మనుష్యులు “ఒకవేళ మీరు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారేమో. ఒకవేళ మీరు మాకు దగ్గర్లోనే నివసిస్తున్నారేమో. మీరు ఎక్కడ్నుంచి వచ్చిందీ మేము తెలుసుకొనేంతవరకు మేము మీతో శాంతి ఒడంబడిక కుదుర్చుకోలేం” అని ఈ హివ్వీయుల వారితో చెప్పారు.
8 హివ్వీ మనుష్యులు యెహోషువతో “మేము నీ దాసులం” అన్నారు.
అయితే యెహోషువ, “మీరెవరు? మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?” అని అడిగాడు.
9 అప్పుడు ఆ మనుష్యులు ఇలా జవాబిచ్చారు, “మేము నీ దాసులము. మేము చాలా దూరదేశం నుండి వచ్చాం. మీ యెహోవా దేవుని మహాశక్తిని గూర్చి మేము విన్నందుచేత మేము వచ్చాము. ఆయన చేసిన కార్యాలను గూర్చి మేము విన్నాము. ఈజిప్టులో ఆయన చేసిన వాటన్నింటిని గూర్చి మేము విన్నాం. 10 యొర్దాను నది తూర్పు దిశనున్న అమోరీ రాజులు ఇద్దర్ని ఆయన ఓడించినట్టు మేము విన్నాము. వాళ్లు అష్టారోతు దేశంలో హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు. 11 కనుక మా నాయకులు, ప్రజలు మాతో ఏమన్నారంటే, ‘మీ ప్రయాణానికి కావలనసినంత భోజనం మీతో తీసుకొని వెళ్లండి; వెళ్లి ఇశ్రాయేలు ప్రజల్ని కలువండి. మేము మీ సేవకులం, మాతో శాంతి ఒడంబడిక చేయండి అని వాళ్లతో చెప్పండి’ అన్నారు.
12 “మా రొట్టెలు చూడండి. మేము ఇల్లు విడిచినప్పుడు ఇది తాజాగా వేడిగా ఉండెను. అయితే ఇప్పుడు ఇవి ఎండిపోయి ఉన్నట్లు మీరు చూడగలరు. 13 మా ద్రాక్షారసం తిత్తులను చూడండి. మేము ఇల్లు విడిచినప్పుడు, అవి కొత్తవి, ద్రాక్షారసంతో నిండి ఉండినాయి. ఇప్పుడు అవి పాతబడిపోయి, పిగిలిపోతూ ఉండటం మీకు కనబడుతూనే ఉంది. మా బట్టలు, చెప్పులు చూడండి. మా దూర ప్రయాణంవల్ల మేము ధరించినవన్నీ దాదాపు పాడైపోవటం మీరు చూస్తూనే ఉన్నారు.”
14 ఈ మనుష్యులు చెప్పేది సత్యమో కాదో తెలుసుకోవాలి అనుకొన్నారు ఇశ్రాయేలు మనుష్యులు. కనుక వాళ్లు ఆ రొట్టెను రుచి చూసారు-కాని ఏమి చేయాలనే విషయం వారు యెహోవాను అడుగలేదు. 15 వాళ్లతో శాంతి ఒడంబడిక చేసుకొనేందుకు యెహోషువ ఒప్పుకున్నాడు. వాళ్లను బతక నిచ్చేందుకు అతడు అంగీకరించాడు. ఈ ఒడంబడికకు ఇశ్రాయేలు నాయకులు ఒప్పుకున్నారు.
16 మూడు రోజుల తర్వాత, ఆ మనుష్యులు వారి గుడారాలకు చాల దగ్గర్లో నివసిస్తున్నవారేనని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకొన్నారు. 17 కనుక వాళ్లు నివసిస్తున్న చోటుకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు. మూడవ నాడు ఆ ప్రజలు నివసిస్తున్న గిబియోను, కెఫిరా, బెయెరోతు, కిర్యత్యారీము పట్టణాలకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు. 18 కానీ ఇశ్రాయేలు సైన్యం ఆ పట్టణాలమీద యుద్ధం చేయోలని ప్రయత్నించలేదు. వారు ఆ ప్రజలతో శాంతి ఒడంబడిక కుదుర్చుకొన్నారు. వారు ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట ఆ ప్రజలకు ప్రమాణం చేసారు.
ఆ ప్రమాణం చేసిన నాయకులను ప్రజలంతా నిందించారు. 19 అయితే నాయకులు జవాబు చెప్పారు: “మేము మా వాగ్దానం చేసాము. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట మేము ప్రమాణం చేసాము. ఇప్పుడు మేము వాళ్లతో యుద్ధం చేయలేము. 20 మనము ఇలా చేయాలి. మనం వాళ్లను బతకనివ్వాలి. మనము వాళ్లకు హాని చేయకూడదు, లేదా మనం వారితో చేసిన ప్రమాణం ఉల్లంఘించిన కారణంగా యెహోవా కోపం మనమీద ఉంటుంది. 21 అందుచేత వాళ్లను బ్రతక నిద్దాం. అయితే వాళ్లు మనకు బానిసలుగా ఉంటారు. వాళ్లు మనకోసం కట్టెలు కొట్టి, మన ప్రజలందరి కోసం నీరు మోస్తారు.” అందుచేత ఆ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ నాయకులు ఉల్లంఘించలేదు.
22 యెహోషువ గిబియోను ప్రజలను పిలిచి, “మీరు ఎందుకు మాతో అబద్ధం చెప్పారు? మీ దేశం మా పాళెము పక్కనే ఉంది. కానీ మీరు చాలా దూర దేశంనుండి వచ్చినట్టు మాతో చెప్పారు. 23 ఇప్పుడు మీ ప్రజలకు చాల కష్టాలు ఎదురవుతాయి. మీ ప్రజలంతా బానిసలుగా ఉంటారు. దేవుని ఆలయం కోసం వాళ్లు కట్టెలు కొట్టాలి, నీరు మోయాలి” అని అతడు చెప్పాడు.
24 గిబియోనీ ప్రజలు ఇలా జవాబు చెప్పారు: “మీరు మమ్మల్ని చంపేస్తారని భయంతో మేము మీకు అబద్ధం చెప్పాము. ఈ దేశం అంతా మీకు ఇచ్చేస్తానని దేవుడు తన సేవకుడు మోషేతో చెప్పినట్టు మేము విన్నాము. ఈ దేశంలో నివసిస్తున్న మనుష్యులందరినీ చంపివేయమనికూడా దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. అందుకే మేము మీతో అబద్ధం చెప్పాము. 25 ఇప్పుడు మేము మీకు దాసులం మీకు సరియైనదిగా అనిపించిన ప్రకారం మీరు మాకు ఏమైనా చేయవచ్చు.”
26 కనుక గిబియోను ప్రజలు బానిసలు అయ్యారు. అయితే యెహోషువ వారి ప్రాణాలు రక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్లను చంపకుండా చేసాడు యెహోషువ. 27 యెహోషువ గిబియోను ప్రజలను ఇశ్రాయేలు ప్రజలకు బానిసలుగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజలకోసం, యెహోవా బలిపీఠం ఎక్కడ ఉండాలని యెహోవా కోరితే అక్కడ దానికోసం వారు కట్టెలు నరికి, నీరు మోసారు. ఆ ప్రజలు నేటికీ బానిసలే.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
140 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రుల నుండి నన్ను కాపాడుము.
2 ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
3 వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.
4 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
5 ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు.
నా దారిలో వారు ఉచ్చు పెడతారు.
6 యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
7 యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
8 యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
వారి పథకాలు నెగ్గనీయకు.
9 యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
నా శత్రువులను అగ్నిలో పడవేయుము.
వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము.
ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు.
నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.
దావీదు స్తుతి కీర్తన.
141 యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము.
త్వరపడి నాకు సహాయం చేయుము.
2 యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము.
నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.
3 యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము.
నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
4 నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు.
చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము.
చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను భాగస్థుడను కాకుండా చేయుము.
5 ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు.
అది నాకు మంచిదే.
వారి విమర్శను నేను అంగీకరిస్తాను.
నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.
6 ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు.
అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.
7 మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది.
అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడతాయి.
8 యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను.
నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.
9 ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము.
ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
10 నేను హాని లేకుండా తప్పించుకొనగా
ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.
3 “ఒక వ్యక్తి తన భార్యకు విడాకులిస్తే, ఆమె అతన్ని వదిలి వెళ్లి మరో వివాహం చేసికొంటే,
ఆ వ్యక్తి మళ్లీ ఆమెవద్దకు తిరిగి రాగలడా? లేదు. రాలేడు!
ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు[a] తిరిగి వెళితే ఆ రాజ్యం పూర్తిగా ‘మాలిన్య’ మైపోతుంది.
యూదా, నీవు అనేకమంది విటులతో (అబద్ధపు దేవుళ్లు) వట్టి వేశ్యవలె ప్రవర్తించావు.
మరల నీవిప్పుడు నా వద్దకు రావాలని కోరుతున్నావా?”
అని యెహోవా పలికాడు.
2 “యూదా, దిశగా ఉన్న కొండ శిఖరాలను చూడు.
నీవక్కడ తిరుగని చోటు ఉందా? నీవు బాట ప్రక్కన విటుల (అబద్ధపు దేవుళ్ల) కోసం వేచివున్నావు.
ఎడారిలో కూర్చున్న అరబీయునివలె
నీవక్కడ కూర్చున్నావు.
నీవు దేశాన్ని ‘అపవిత్రం’ చేశావు! ఏమైనంటావా?
నీవు చాలా దుష్కార్యాలు చేశావు.
నీవు నాకు విశ్వాసపాత్రంగా లేవు.
3 నీవు పాపం చేశావు. అందుచే వర్షాలు లేవు.
వసంత కాలపు వానలూ లేవు.
అయినా నీ ముఖ లక్షణాలు వేశ్యాలక్షణాల్లా ఉన్నాయి.
నీ అకృత్యాలకు సిగ్గుపడటంకూడా మానివేశావు.
4 కాని నీవు నన్నిప్పుడు పిలుస్తున్నావు.
‘నా తండ్రీ’ నా బాల్యంనుండి
‘నీవు నాకు ప్రియ మిత్రునిలా ఉన్నావు.’
5 ‘దేవుడు నా పట్ల ఎల్లప్పుడూ కోపంగా ఉండడు.
దేవుని కోపం అల్పమైనది.
అది శాశ్వతంగా ఉండదు’ అని అంటున్నావు.
“యూదా, నీవీ విషయాలు అంటూనే
నీవు ఎంత చెడు చేయగలవో అంతా చేస్తున్నావు.”
చెడ్డ తోబుట్టువులు: ఇశ్రాయేలు మరియు యూదా
6 రాజైన యోషీయా యూదా రాజ్యాన్ని పాలించే కాలంలో యెహోవా నాతో మాట్లాడినాడు. ఆయన ఇలా అన్నాడు: “యిర్మీయా, ఇశ్రాయేలు[b] చేసిన చెడ్డపనులు నీవు చూశావు. నా పట్ల ఆమె ఎలా విశ్వాసరహితంగా ఉన్నదో నీవు చూశావు! ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద విగ్రహాలతో వ్యభిచరించిన పాపానికి ఇశ్రాయేలు పాల్పడింది. 7 ‘ఈ చెడు కార్యాలన్నీ చేయటం పూర్తయిన పిమ్మట ఇశ్రాయేలు తప్పక నావద్దకు తిరిగి వస్తుంది’ అని నేననుకున్నాను. కాని ఆమె నా వద్దకు రాలేదు. విశ్వాస ఘాతకురాలైన ఇశ్రాయేలు సోదరియగు యూదా ఆమె ఏమి చేసిందో చూసింది. 8 ఇశ్రాయేలు విశ్వాసపాత్రంగా లేదు. ఆమెను నేనెందుకు పంపి వేశానో ఇశ్రాయేలుకు తెలుసు. ఆమె వ్యభిచార దోషానికి పాల్పడినందుకే నేనామెకు విడాకులిచ్చానని ఇశ్రాయేలుకు తెలుసు. కాని అది విశ్యాస ఘాతకురాలైన ఆమె సోదరిని భయపెట్టలేదు. యూదా భయపడలేదు. యూదా కూడా తెగించి వ్యభిచారిణిలా ప్రవర్తించింది. 9 తానొక మరుగులేని వ్యభిచారిణిలా ప్రవర్తిస్తున్నాననే చింతన చేయలేదు. అలా ఆమె తన దేశాన్ని ‘మలిన’ (అపవిత్ర) పర్చింది. రాతితోను, చెక్కలతోను చేసిన విగ్రహాలను ఆరాధించి, వ్యభిచార పాపానికి ఒడిగట్టుకుంది. 10 ఇశ్రాయేలు యొక్క విశ్వాస ఘాతకురాలైన సోదరి (యూదా) హృదయ పూర్వకంగా నావద్దకు తిరిగి రాలేదు. నావద్దకు తిరిగి వచ్చినట్లు ఆమె నటించింది.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
11 యెహోవా నాతో ఇలా చెప్పినాడు “ఇశ్రాయేలు నాకు విశ్వాసపాత్రంగా లేదు. విశ్వాసం లేని యూదా కంటె ఇశ్రాయేలుకు చెప్పుకొనేందుకు ఒక మంచి సాకువుంది. 12 యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఉత్తర దేశంలో చెప్పు:
“‘విశ్వాసంలేని ఇశ్రాయేలీయులారా తిరిగి రండి.’
ఇది యెహోవా వాక్కు.
‘నిన్ను చూచి ముఖం తిప్పుకోను.
నేను నిండు దయతో ఉన్నాను.’
ఈ వాక్కు యెహోవాది.
‘నీ పట్ల నేను శాశ్వతమైన కోపంతో ఉండను.
13 నీవు నీ పాపాన్ని గుర్తించాలి.
నీ యెహోవా దేవునికి నీవు వ్యతిరేకమయ్యావు
నీ పాపం అదే.
ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను నీవు ఆరాధించినావు
నీవు ప్రతి పచ్చని చెట్టు క్రిందా విగ్రహారాధన చేశావు
నీవు నా ఆజ్ఞను మన్నించలేదు.’”
ఇదే యోహోవా వాక్కు.
14 “విశ్వాసంలేని ప్రజలారా, నావద్దకు రండి” అని యెహోవా అంటున్నాడు “నేను మీ యజమానిని. ప్రతి నగరంనుంచీ ఒక్కొక్క వ్యక్తిని, ప్రతి కుటుంబంనుంచీ ఇద్దరు మనుష్యులను తీసుకొని మిమ్మల్ని సీయోనుకు తీసుకొని వస్తాను. 15 అప్పుడు మీకు నూతన కాపరులను (పాలకులు) ఇస్తాను. ఆ పాలకులు నాకు విశ్వాస పాత్రులై ఉంటారు. వారు జ్ఞానంతోను, అవగాహనతోను మిమ్మల్ని నడిపిస్తారు. 16 ఆ రోజుల్లో, రాజ్యంలో మీ సంతతి పెరిగి మీరనేకులై ఉంటారు.” ఈ వాక్కు యెహోవాది.
“ఆ సమయంలో ప్రజలు తాము దేవుని నిబంధన మందసాన్ని కలిగివున్న రోజులు గుర్తున్నట్లు చెప్పరు. ఆ యెహోవా ఒడంబడికను గూర్చి వారెంత మాత్రం తలంచరు. వారు దానిని గుర్తుంచుకోరు. పోగొట్టు కోరు. వారు మరో పవిత్ర ఒడంబడికను చేయరు. 17 ఆ సమయంలో యెరూషలేము నగరం ‘యెహోవా సింహాసనం’ అని పిలువబడుతుంది. దేశ దేశాల ప్రజలు యెరూషలేము నగరంలో కలిసి యెహోవాను స్మరించి ఆయన నామాన్ని గౌరవిస్తారు. ప్రజలు తమ మొండి హృదయాలను ఇక ఎంత మాత్రం అనుసరించరు. 18 ఆ రోజుల్లో యూదా వంశం ఇశ్రాయేలు వంశంతో కలుస్తుంది వారు ఉత్తర ప్రాంతంలో ఒకే చోటునుండి కలిసి వస్తారు. వారి పితరులకు నేనిచ్చిన రాజ్యంలోకి వారు వస్తారు.”
19 యెహోవానైన నేనిలా అనుకున్నాను,
“మిమ్మల్ని నా స్వంత బిడ్డలవలె చూసుకోవటం నాకు సంతోషదాయకం.
మీకో మంచి రాజ్యాన్నివ్వటం వాకు తృప్తినిస్తుంది.
ఆ రాజ్యం ఇతర రాజ్యాలకంటె సుందరంగా ఉంటుంది.
మీరు నన్ను ‘తండ్రీ’ అని పిలుస్తారనుకున్నాను.
మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను.
20 కాని తన భర్త పట్ల వంచనగా నడిచే స్త్రీవలె మీరు తయారయ్యారు.
ఇశ్రాయేలు వంశమా, నీవు నా పట్ల విశ్వాస పాత్రంగా మెలగ లేదు!
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
21 నగ్నంగా ఉన్న కొండలమీద రోదన నీవు వినవచ్చు.
ఇశ్రాయేలు ప్రజలు దయాభిక్ష కోరుకుంటూ ఏడుస్తూ ప్రార్ధన చేస్తున్నారు.
వారు బహు దుష్టులైనారు!
వారు తమ యెహోవా దేవున్ని మర్చిపోయారు.
22 “విశ్వాసఘాతకులగు ఇశ్రాయేలీయులారా నా వద్దకు తిరిగి రండి.
నన్నాశ్రయించి రండి.
నా పట్ల వంచనతో
మెలిగినందుకు క్షమిస్తాను.”
“అవును. మేము నీ వద్దకు వస్తాము.
నీవు మా యెహోవా దేవుడవు
23 కొండల మీద విగ్రహాలను పూజించుట అవివేకం.
కొండలమీద ఆడంబరంగా జరిగే పూజా కార్యక్రమమంతా మోసం.
నిజానికి, ఇశ్రాయేలుకు రక్షణ
యెహోవా దేవుని వద్దనుండే వస్తుంది.
24 ఆ భయంకరమైన బయలుదేవత
మన తండ్రుల ఆస్తిని మ్రింగివేసింది.
మనం పిల్లలం కావటంతో ఇదంతా జరిగింది.
ఆ భయంకరమైన దేవత[c]
మన తండ్రుల గొర్రెలను, పశువులను,
వారి కుమారులను, కుమార్తెలను చంపింది.
25 మనం సిగ్గుతో తలవంచుకుందాం.
మన అవమానం మనల్ని దుప్పటిలా కప్పివేయనీయండి.
మన యెహోవా దేవునిపట్ల మనం తీవ్రమైన పాపం చేశాం.
మనం, మన తండ్రులు కూడా పాపానికి ఒడిగట్టాము.
మన చిన్నతనం నుండి ఇప్పటివరకు
యెహోవా దేవుని ఆజ్ఞను మనం పాటించలేదు” అని చెప్పాలి.
యేసుని రూపాంతరం
(మార్కు 9:2-13; లూకా 9:28-36)
17 యేసు ఆరు రోజుల తర్వాత పేతురును, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును, ఒక ఎతైన కొండ మీదికి తన వెంట ప్రత్యేకంగా పిలుచుకు వెళ్ళాడు. 2 ఆయన అక్కడ వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన దుస్తులు వెలుతురువలే తెల్లగా మరాయి. 3 అదే క్షణంలో వాళ్ళ ముందు మోషే మరియు ఏలీయా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు.
4 పేతురు యేసుతో, “ప్రభూ! మనమిక్కడ ఉండటం మంచిది. మీరు కావాలంటే మూడు పర్ణశాలలు నిర్మిస్తాము—మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అని అన్నాడు.
5 అతడు ఇంకా మాట్లాడుతుండగా ఒక కాంతివంతమైన మేఘం ఆ ముగ్గుర్ని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన పట్ల నాకు ప్రేమ ఉంది. ఈయన నాకు చాలా నచ్చాడు. ఈయన మాట వినండి” అని వినిపించింది.
6 ఇది విని శిష్యులు భయంతో సాష్టాంగ పడ్డారు. 7 యేసు వచ్చి వాళ్ళను తాకుతూ, “లేవండి! భయపడకండి!” అని అన్నాడు. 8 వాళ్ళు తలెత్తి చూసారు. వాళ్ళకు యేసు తప్ప యింకెవరూ కనపడలేదు.
9 వాళ్ళు కొండ దిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్యకుమారుడు బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని గురించి ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.
10 “మరి మొదట ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు” అని శిష్యులు అడిగారు.
11 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఏలియా తప్పకుండా వస్తాడు. వచ్చి అన్నీ ముందున్నట్లు స్థాపిస్తాడు. 12 నేను చెప్పేదేమిటంటే, ఏలియా ఇదివరకే వచ్చాడు. కాని వాళ్ళతన్ని గుర్తించలేదు. పైగా అతని పట్ల తమ యిష్టానుసారంగా ప్రవర్తించారు. అదే విధంగా వాళ్ళు మనుష్య కుమారునికి కూడా బాధలు కలిగిస్తారు.” 13 యేసు బాప్తిస్మమునిచ్చే యోహానును గురించి మాట్లాడుతున్నట్లు శిష్యులకు అప్పుడు అర్థమయింది.
యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం
(మార్కు 9:14-29; లూకా 9:37-43)
14 వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి, 15 “ప్రభూ! నా కుమారునిపై దయ చూపండి. అతడు మూర్ఛ రోగంతో చాలా బాధపడ్తున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడ్తూ ఉంటాడు. 16 అతణ్ణి నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకు వచ్చాను. కాని వాళ్ళతనికి నయం చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.
17 అప్పుడు యేసు, “మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి. ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకు రండి” అని అన్నాడు. 18 యేసు ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది.
19 శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయాము?” అని అడిగారు.
20 యేసు, “మీలో దృఢవిశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేక పొయ్యారు. కాని ఇది సత్యం. 21 మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో ‘అక్కడికి వెళ్ళు’ అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
(మార్కు 9:30-32; లూకా 9:43-45)
22 వాళ్ళంతా గలిలయలో మళ్ళీ కలుసుకొన్నప్పుడు యేసు వాళ్ళతో, “మనుష్య కుమారుడు దుర్మార్గులకు అప్పగించబడుతాడు. 23 వాళ్ళాయన్ని చంపుతారు. కాని మూడవ రోజు ఆయన తిరిగి బ్రతికి వస్తాడు” అని అన్నాడు. ఇది విని శిష్యులు చాలా దుఃఖించారు.
పన్ను చెల్లించుట గురించి యేసు బోధించటం
24 యేసు, ఆయన శిష్యులు కపెర్నహూము చేరుకొన్నారు. అక్కడ అరషెకెలు పన్నులు సేకరించే అధికారులు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు గుడి పన్ను చెల్లించడా?” అని ప్రశ్నించారు.
25 “చెల్లిస్తాడు” అని పేతురు సమాధానం చెప్పి యింట్లోకి వెళ్ళాడు.
అతడేం మాట్లాడక ముందే యేసు, “సీమోనూ! నీవేమంటావు? రాజులు సుంకాలు, పన్నులు ఎవర్నుండి సేకరిస్తారు? తమ స్వంత కుమారుల నుండా? లేక యితర్లనుండా?” అని అడిగాడు.
26 “ఇతర్లనుండి” అని పేతురు సమాధానం చెప్పాడు.
యేసు, “అలాగయితే కుమారులు చెల్లించవలసిన అవసరం లేదన్న మాటేగా! 27 కాని వాళ్ళకాటంకం కలిగించటం నాకిష్టం లేదు. సరస్సు దగ్గరకు వెళ్ళి గాలం వెయ్యి! మొదట పట్టుకొన్న చేప నోటిని తెరిచి చూస్తే నీకు నాలుగు ద్రాక్మాల[a] నాణెం కనబడుతుంది. దాన్ని తీసుకువెళ్ళి నా పక్షాన, నీ పక్షాన వాళ్ళకు చెల్లించు!” అని అన్నాడు.
© 1997 Bible League International