Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 23

బిలాము మొదటి సందేశం

23 బిలాము “ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టండి. నాకోసం ఏడు ఎద్దులు, ఏడు పొట్టేళ్లు సిద్ధంచేయండి” అని చెప్పాడు. బిలాము అడిగినట్టే బాలాకు అవన్ని చేసాడు. అప్పుడు బాలాకు, బిలాము ఒక్కో బలిపీఠం మీద ఒక్కో పొట్టేలును, ఒక్కో ఎద్దును వధించారు.

అప్పుడు బిలాము, “ఈ బలిపీఠం దగ్గరగా ఉండు. నేను ఇంకో చోటికి వెళ్తాను. అప్పుడు యెహోవా నా దగ్గరకు వచ్చి నేను చెప్పాల్సింది ఏమిటో నాకు చెబుతాడు” అని బాలాకుతో చెప్పాడు. అప్పుడు బిలాము మరో ఉన్నత స్థలానికి వెళ్లిపోయాడు.

అక్కడ దేవుడు బిలాము దగ్గరకు వచ్చాడు. “ఏడు బలిపీఠాలు నేను సిద్ధం చేసాను. ఒక్కో బలిపీఠంమీద ఒక్కో ఎద్దును ఒక్కోపొట్టేలును బలిగా నేను వధించాను” అన్నాడు బిలాము.

అప్పుడు బిలాము ఏమి చెప్పాల్సిందీ యెహోవా అతనికి చెప్పాడు. అప్పుడు, “తిరిగి వెళ్లి, చెప్పమని నేను నీకు చెప్పిన విషయాలు బాలాకుతో చెప్పు” అన్నాడు యెహోవా.

కనుక బిలాము తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులంతా వారితో నిలిచి ఉన్నారు. అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“తూర్పు కొండల్లో నుండి ఆరాము నుండి మోయాబు
    రాజైన బాలాకు నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు.
వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!
    ‘వచ్చి నా పక్షంగా యాకోబును శపించు,
    వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!’ అన్నాడు నాతో బాలాకు.
దేవుడు ఆ ప్రజలకు వ్యతిరేకంగా లేడు
    అందుచేత నేనుకూడ వారిని శపించలేను.
ఆ ప్రజల విషయమై యెహోవా చెడ్డ విషయాలను చెప్పలేదు
    అందుచేత నేను అలా చేయలేను.
కొండమీద నుండి నేను ఆ ప్రజలను చూస్తున్నాను.
    ఎత్తయిన కొండల నుండి నేను చూస్తున్నాను.
ఒంటరిగా బ్రతుకుతున్న ప్రజలను నేను చూస్తున్నాను,
    వాళ్లు మరో జనములో భాగంకారు యాకోబు ప్రజలను ఎవరు లెక్కించగలరు.
10 ఇసుక రేణువులకంటె ఎక్కువ ఉన్నారు యాకోబు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లో నాలుగోవంతు మనుష్యుల్ని కూడ ఎవరూ లెక్కించలేరు. ఒక మంచి మనిషిగా నన్ను చావనివ్వండి ఆ మనుష్యులు మరణించినంత సంతోషంగా నన్ను మరణించనివ్వండి!”

11 బాలాకు బిలాముతో, “ఏమిటి నీవు నాకు చేసింది? నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నీవు మాత్రం వాళ్లను ఆశీర్వదించావు” అన్నాడు.

12 కానీ బిలాము, “నేను చెప్పాల్సింది దేవుడు నాకు చెప్పిన విషయాలు మాత్రమే” అని జవాబిచ్చాడు.

13 అప్పుడు, “అలాగైతే, నాతో మరో చోటికి రా. అక్కడకూడ నీవు మనుష్యుల్ని చూడగలవు. అయితే అందర్నీ కాదుగాని కొందర్ని మాత్రం చూడగలవు. అక్కడనుండి నీవు నా కోసం వాళ్లను శపించవచ్చు” అని అతనితో చెప్పాడు బాలాకు. 14 కనుక బాలాకు యోఫీం పొలంలోకి బిలామును తీసుకుని వెళ్లాడు. ఇది పిస్గా కొండ శిఖరం మీద ఉంది. ఆ స్థలంలో బాలాకు ఏడు బలిపీఠాలు కట్టించాడు. అప్పుడు బాలాకు ఒక్కో బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బలిగా వధించాడు.

15 కనుక బిలాము, “ఈ బలిపీఠం దగ్గర ఉండు. నేను వెళ్లి అక్కడ దేవుడ్ని కలుసుకొంటాను” అని బాలాకుతో చెప్పాడు.

16 కనుక యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, అతడు ఏమి చెప్పాల్సిందీ అతనికి తెలియజేసాడు. అప్పుడు యెహోవా, బిలామును వెళ్లి ఆ సంగతులు బాలాకుతో చెప్పమన్నాడు. 17 కనుక బిలాము బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు వారితోబాటు ఉన్నారు. అతడు రావటం చూచి, “ఏమి చెప్పాడు యెహోవా?” అన్నాడు బాలాకు.

బిలాము రెండో సందేశం

18 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“బాలాకూ లేచి నా మాట విను.
    సిప్పోరు కుమారుడా, బాలాకూ, నా మాట విను.
19 దేవుడు మనిషికాడు,
    ఆయన అబద్ధం చెప్పడు.
దేవుడు మానవ కుమారుడు కాడు,
    ఆయన నిర్ణయాలు మారవు.
ఏదైనా చేస్తానని యెహోవా చెబితే
    ఆయన అలానే చేస్తాడు.
యెహోవా ఒక వాగ్దానం చేస్తే,
    ఆయన తన వాగ్దానం ప్రకారం చేస్తాడు.
20 ఆ ప్రజలను ఆశీర్వదించమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.
    యెహోవా వారిని ఆశీర్వదించాడు కనుక నేను దాన్ని మార్చలేను.
21 దేవునికి యాకోబు ప్రజల్లో తప్పేమీ కనబడలేదు.
    ఇశ్రాయేలు ప్రజల్లో ఏ పాపమూ దేవునికి కనబడలేదు.
యెహోవా వారి దేవుడు,
    ఆయన వారితో ఉన్నాడు.
మహారాజు వారితో ఉన్నాడు.
22 దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకొచ్చాడు.
    అడవి ఎద్దుల్లా వారు బలంగా ఉన్నారు.
23 యాకోబు ప్రజలను ఓడించగల శక్తి ఏదీ లేదు.
    ఇశ్రాయేలు ప్రజలకు ఎదురు వెళ్లగల మంత్రమూ ఏదీ లేదు.
‘దేవుడు చేసిన మహా కార్యాలను చూడండి’ అని యాకోబును గూర్చి,
    ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మనుష్యులు అంటారు.
24 ఆ ప్రజలు బలమైన సింహంలా ఉంటారు.
    సింహంలా వారు పోరాడతారు.
ఆ సింహం తన శత్రువును తినివేసేంత వరకు విశ్రాంతి తీసుకోదు.
    తనకు వ్యతిరేకంగా ఉండేవారి రక్తం తాగేంతవరకు ఆ సింహం ఊరుకోదు.”

25 అప్పుడు బాలాకు, “ఆ ప్రజలకు మేలు జరగాలని నీవు అడుగలేదు గాని కీడు జరగాలని కూడ నీవు అడుగలేదు” అన్నాడు బిలాముతో.

26 బిలాము, “యెహోవా నాకు చెప్పిన విషయాలు మాత్రమే చెబుతానని నేను నీకు ముందే చెప్పాను” అని జవాబిచ్చాడు.

27 అప్పుడు బాలాకు, “అలాగైతే నాతో మరో బలిపీఠం దగ్గరకు రా. ఒకవేళ అక్కడ దేవుడు సంతోషించి, అక్కడనుండి ఆ ప్రజలను శపించనిస్తాడేమో” అని బిలాముతో చెప్పాడు. 28 కనుక బాలాకు పీయోరు కొండకు బిలామును తీసుకుని వెళ్లాడు. ఈ కొండ నుండి అరణ్యాన్ని చూడవచ్చు.

29 “ఇక్కడ ఏడు బలిపీఠాలు నిర్మించు. తర్వాత బలికోసం ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్లను సిద్ధం చేయి” అన్నాడు బిలాము. 30 బిలాము అడిగినట్టు బాలాకు చేసాడు. ప్రతి బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బాలాకు బలిగా వధించాడు.

కీర్తనలు. 64-65

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

64 దేవా, నా ప్రార్థన ఆలకించుము.
    నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము.
    ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు.
    వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీపరుని మీద వేస్తారు.
    అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడతాడు.
అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు.
    వారు వారి ఉరులను పెడతారు. “వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని” వారనుకొంటారు.
మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు.
    మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతో కష్టం.
కాని దేవుడు తన “బాణాలను” వారిమీద వేయగలడు.
    అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు.
    కాని దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు.
ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు.
    అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు.
    వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు.
అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు.
    ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి.
    వారు ఆయన్ని నమ్ముకోవాలి.
మంచి మనుష్యుల్లారా, మీరంతా యెహోవాను స్తుతించండి.

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
    నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
    నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
    ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
    నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
    నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
    నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
    ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
    మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
    మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
    దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
    నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
    నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
    భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
    అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
    బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
    లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.

యెషయా 13

బబులోనుకు దేవుని సందేశం

13 బబులోను విషయంలో విచారకరమైన ఈ సందేశాన్ని ఆమోజు కుమారుడు యెషయాకు దేవుడు చూపించాడు.

దేవుడు చెప్పాడు: “పతాకాన్ని బోడి కొండమీద[a] ఎగుర వేయండి.
    మగ సిపాయిలను పిలువండి.
మీ చేతులు ఊపండి.
    ప్రముఖుల ద్వారాల్లోంచి ప్రవేశించమని వారితో చెప్పండి.”

దేవుడు చెప్పాడు: “వాళ్లను నేను ప్రజల్లో నుండి వేరు చేశాను.
    నేనే వాళ్లకు సారథ్యం వహిస్తాను.”
నేను కోపంగా ఉన్నాను. ప్రజలను శిక్షించటం కోసం నేను నా పరాక్రమవంతుల్ని సమావేశపర్చాను.
    ఆనంద భరితులైన ఈ మనుష్యులను గూర్చి నేను గర్విస్తున్నాను.

“కొండల్లో పెద్ద శబ్దం అవుతోంది. ఆ శబ్దం వినండి!
    అది విస్తారమైన ప్రజల శబ్దంలా ఉంది.
అనేక రాజ్యాల ప్రజలు కూడుకొంటున్నారు.
    సర్వశక్తిమంతుడైన యెహోవా తన సైన్యాలను ఒక్కటిగా చేరుస్తున్నాడు.
ఈ సైన్యం, యెహోవా, చాలా దూరదేశంనుండి వస్తున్నారు.
    ఆకాశపు అంచుల ఆవలినుండి వారు వస్తున్నారు.
యెహోవా తన కోపం ప్రదర్శించటానికి ఈ సైన్యాన్ని ఒక ఆయుధంలా వాడుకొంటాడు.
    ఈ సైన్యం దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంది.”

యెహోవా ప్రత్యేక దినం దగ్గర్లో ఉంది. అందు చేత ఏడ్చి, మీ కోసం దుఃఖపడండి. శత్రువు మీ ఐశ్వర్యాలు దొంగిలించే సమయం వస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు దానిని సంభవింపజేస్తాడు. ప్రజలు వారి ధైర్యం కోల్పోతారు. భయం ప్రజలను బలహీనులను చేస్తుంది. ప్రతి వ్యక్తీ భయపడుతూంటాడు. స్త్రీ ప్రసవవేదనలా, వారి భయం వారికి కడుపులో బాధ పుట్టిస్తుంది. వారి ముఖాలు అగ్నిలా ఎర్రగా మారుతాయి. ఈ భయంచూపులు వారి పొరుగువారందరి ముఖాలమీద కూడా కనబడతాయి గనుక ప్రజలు ఆశ్చర్య పడతారు.

బబులోనుకు విరుద్ధంగా దేవుని తీర్పు

చూడండి, యెహోవా ప్రత్యేక దినం వచ్చేస్తుంది. అది చాలా భయంకర దినం. దేవుడు మహా కోపంతో, దేశాన్ని నాశనం చేస్తాడు. పాపం చేసే వాళ్లందరినీ దేవుడు దేశంలోనుండి బలవంతంగా వెళ్లగొట్టేస్తాడు. 10 ఆకాశాలు చీకటి అవుతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశించవు.

11 దేవుడు చెబుతున్నాడు, “నేను ప్రపంచానికి కీడు జరిగిస్తాను. చెడ్డవాళ్ల పాపాన్ని బట్టి వాళ్లను నేను శిక్షిస్తాను. గర్విష్ఠుల గర్వం పోయేట్టు నేను చేస్తాను. ఇతరుల యెడల నీచంగా ప్రవర్తించే వారి అతిశయాన్ని నేను నిలిపివేస్తాను. 12 కొద్దిమంది ప్రజలు మాత్రమే మిగిలి ఉంటారు. బంగారం దొరకటం అరుదులాగే మనుష్యులు కూడ అరుదుగా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ మనుష్యులు స్వచ్చమైన బంగారం కంటె ఎక్కువ విలువగలిగి ఉంటారు. 13 నేను, నా కోపంతో ఆకాశాన్ని వణికిస్తాను. భూమి స్థానం తప్పుతుంది.”

సర్వశక్తిమంతుడైన యెహోవా తన కోపం ప్రదర్శించిన రోజున అది జరుగుతుంది. 14 అప్పుడు బబులోను ప్రజలు గాయపడిన జింకల్లా పారిపోతారు. కాపరి లేని గొర్రెల్లా వారు పారిపోతారు. యుద్ధానికి వచ్చే ప్రతి సైనికుడూ వెనుదిరిగి తన స్వదేశానికి, స్వజనుల దగ్గరకు పారిపోతాడు. 15 అయితే శత్రువు బబులోను ప్రజలను తరుముతాడు. మరియు శత్రువు ఒక మనిషిని పట్టుకొన్నప్పుడు, అతనిని శత్రువు ఖడ్గంతో చంపేస్తాడు. 16 వారి ఇండ్లలో సమస్తం దోచుకోబడుతుంది. వారి భార్యలు మానభంగం చేయబడతారు. ప్రజలు చూస్తూ ఉండగానే వారి పిల్లలను చచ్చేవరకు కొడతారు.

17 దేవుడు చెబుతున్నాడు: “చూడండి, మాదీయ సైన్యాలు బబులోను మీద దాడి చేసేట్టు నేను చేస్తాను.” మాదీయ సైన్యాలకు వెండి బంగారాలు చెల్లించినా సరే, వారు దాడి చేయటం ఆపు చేయరు. 18 సైనికులు దాడి చేసి బబులోను యువకులను చంపేస్తారు. పిల్లల మీద కూడ ఆ సైనికులు జాలి చూపించరు. బాలుర యెడల ఆ సైనికులు దయ చూపించరు. బబులోను నాశనం చేయబడుతుంది. అది సొదొమ గొమొర్రాల సర్వనాశనంలా ఉంటుంది. దేవుడు ఈ వినాశం కలుగచేస్తాడు, అక్కడ ఏమీ మిగిలి ఉండదు.

19 “రాజ్యాలన్నింటిలో బబులోను చాలా అందమయింది. బబులోను ప్రజలకు వారి పట్టణం గూర్చి చాలా అతిశయం. 20 కానీ బబులోను అందంగా ఇక ఉండదు. భవిష్యత్తులో ప్రజలు యికమీదట అక్కడ నివసించరు. అరబ్బులు అక్కడ వారి గుడారాలు వేయరు. గొర్రెలను అక్కడ మేపేందుకు కాపరులు వాటిని అక్కడికి తీసుకొనిరారు. 21 అక్కడ నివసించే జంతువులు అడవి మృగాలు మాత్రమే. ప్రజలు బబులోనులోని ఇండ్లలో నివసించరు. ఆ ఇండ్ల నిండా గుడ్లగూబలు, పెద్ద పక్షులు ఉంటాయి. అడవి మేక పోతులు ఆ ఇండ్లలో ఆడుతూంటాయి. 22 బబులోనులోని అందమైన గొప్ప భవనాలలో అడవి కుక్కలు, తోడేళ్లు మొరుగుతూ ఉంటాయి. బబులోను అంతం అయిపోతుంది. బబులోను అంతం దగ్గర్లో ఉంది. బబులోను నాశనాన్ని నిదానం కానివ్వను.”

1 పేతురు 1

చెదరిపోయి పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితూనియ ప్రాంతాలలో పరదేశీయులుగా నివసిస్తున్నవాళ్ళకు, యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు వ్రాయునదేమనగా, ప్రియులారా! మీరు దేవునిచే ఎన్నుకోబడ్డవాళ్ళు. మీకు ఆయన అనుగ్రహము, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను. మీరు యేసు క్రీస్తుకు విధేయులై ఉండాలని, ఆయన రక్తం చేత ప్రోక్షింపబడాలని, తండ్రి అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన దివ్యజ్ఞానంతో ఎన్నుకున్నాడు; పరిశుద్ధాత్మ మిమ్మల్మి పవిత్రం చేసాడు.

సజీవమైన ఆశాభావం

మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం. ఆయనకు మనపై అనుగ్రహం ఉండటం వల్ల యేసు క్రీస్తును బ్రతికించి మనకు క్రొత్త జీవితాన్ని యిచ్చాడు. అంతేకాక మనలో సజీవమైన ఆశాభావాన్ని కలిగించాడు. నాశనంకాని, మచ్చలేని, తరగని వారసత్వం పొందటానికి ఆశించండి. దేవుడు మీకోసం దాన్ని పరలోకంలో దాచి ఉంచాడు.

చివరి దశలో మనకు వ్యక్తం కావటానికి రక్షణ సిద్ధంగా ఉంది. మీలో విశ్వాసం ఉండటంవల్ల, అది లభించే వరకూ మీకు దైవశక్తి రక్షణ కలిగిస్తుంది. కొంతకాలం సంభవించిన అనేక రకాల కష్టాల్ని అనుభవించవలసి వచ్చినప్పుడు మీరు అనుభవించారు. దానికి ఆనందించండి. మీ విశ్వాసం యథార్థమైనదని రుజువగుటకు ఈ శ్రమలు మీకొచ్చాయి. బంగారం నిప్పుచేత కాల్చబడి శుద్ధి అయినా, చివరికది నాశనం కాక తప్పదు. మీ విశ్వాసం బంగారం కంటే విలువైనదిగా యుండి యేసు క్రీస్తు వచ్చినప్పుడు ప్రశంస, మహిమ, ఘనత పొంద తగినదిగా వుంటుంది.

మీరాయన్ని చూడలేదు. అయినా ప్రేమిస్తున్నారు. ప్రస్తుతం చూడటం లేదు. అయినా విశ్వసిస్తున్నారు. వ్యక్తం చేయలేని దివ్యమైన ఆనందం మీలో నిండిపోయింది. ఎందుకంటే ఏ ఉద్దేశ్యంతో మీరు విశ్వసిస్తున్నారో ఆ ఉద్దేశ్యం నెరవేరుతోంది. మీ ఆత్మలకు రక్షణ లభిస్తోంది.

10 ఈ రక్షణ విషయంలో, ప్రవక్తలు మీకోసం రాబోవు కృపను గురించి మాట్లాడుతూ అతిజాగ్రత్తతో తీవ్రంగా పరిశోధించారు. 11 వాళ్ళలో ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు బాధల్ని గురించి, ఆ తర్వాత ఆయన పొందనున్న మహిమను గురించి వాళ్ళకు ముందుగానే తెలియజేసాడు. ఆ ఆత్మ సూచించిన కాలాన్ని, పరిస్థితుల్ని తెలుసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేసారు.

12 తమ లాభం కోసం కాకుండా మీకు సేవ చేయాలని ఇలా చేసారు. ఈ విషయం దేవుడు వాళ్ళకు తెలియచేసాడు. పరలోకం నుండి దేవుడు పంపిన పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను బోధించిన వాళ్ళు మీకు వాటిని గురించి తెలిపారు. వాటిని గురించి తెలుసుకోవాలని దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నారు.

పవిత్రంగా జీవించండి

13 అందుచేత కార్యసిద్ధికోసం మీ మనసుల్ని సిద్ధం చేసికొంటూ మిమ్మల్ని అదుపులో పెట్టుకోండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కందివ్వబోయే అనుగ్రహంపై సంపూర్ణమైన ఆశాభావంతో ఉండండి. 14 మీరు అజ్ఞానంతో జీవించినప్పుడు దురాశలకు లోనై జీవించారు. ఇప్పుడావిధంగా జీవించకుండా చిన్న పిల్లలవలే విధేయతతో జీవించండి. 15 మిమ్మల్ని పిలిచినవాడు ఏ విధంగా పవిత్రుడో అదేవిధంగా మీరు కూడా పవిత్రమైన కార్యాలను చేస్తూ పవిత్రంగా జీవించండి. 16 ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “నేను పవిత్రుణ్ణి; కనుక మీరు కూడా పవిత్రంగా ఉండండి”(A) అని వ్రాయబడిఉంది.

17 పక్షపాతము చూపకుండా ఒక వ్యక్తి చేసిన కార్యాలను బట్టి తీర్పు చెప్పే దేవుణ్ణి మీరు “తండ్రి” అని పిలుస్తారు కనుక మీరు భయభక్తులతో పరదేశీయులుగా మీ జీవితాలను గడపండి. 18 ఎందుకంటే, మీ పూర్వికులు వంశపారంపర్యంగా మీ కందించిన వ్యర్థజీవితం నుండి మీకు విడుదల కలుగలేదు. నశించిపోయే వెండి, బంగారం వంటి వస్తువుల వల్లనూ కలుగలేదు. ఈ విషయం మీకు తెలుసు. 19 ఏ లోపమూ, మచ్చాలేని గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మీకు విముక్తి కలిగింది. 20 ఈ ప్రపంచానికి పునాది వేయకముందే దేవుడు క్రీస్తును ఎన్నుకున్నాడు. కాని మీకోసం ఈ చివరి రోజుల్లో ఆయన్ను వ్యక్తం చేసాడు. 21 ఆయన కారణంగా మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. ఆయన్ని బ్రతికించి మహిమ గలవానిగా చేసాడు. తద్వారా మీకు దేవుని పట్ల విశ్వాసము, ఆశ కలిగాయి.

22 సత్యాన్ని విధేయతతో ఆచరించటంవల్ల మీ జీవితాలు పవిత్రమయ్యాయి. తద్వారా మీ సోదరుల పట్ల మీకు నిజమైన ప్రేమ కలిగింది. పరస్పరం హృదయపూర్వకంగా[a] చిరకాలం ప్రేమించుకుంటూ ఉండండి. 23 నశించిపోయే సంతానంగా మీరు తిరిగి పుట్టలేదు, గాని నశించని సంతానంగా సజీవమైన దేవుని వాక్యం ద్వారా తిరిగి పుట్టారు. 24 ఎందుకంటే,

“మానవులు గడ్డిపోచల్లాంటి వాళ్ళు. వాళ్ళ కీర్తి
    గడ్డి పువ్వులాంటిది. గడ్డి ఎండిపోతుంది, పువ్వురాలిపోతుంది,
25 కాని, ప్రభువు సందేశం చిరకాలం నిలిచిపోతుంది.”(B)

మీకు ప్రకటింపబడిన సందేశం యిదే!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International