M’Cheyne Bible Reading Plan
అపరాధ పరిహారార్థ బలులు
7 “అపరాధ పరిహారార్థ బలుల నియమాలు ఇవి. ఇది అతి పరిశుద్ధం. 2 దహనబలి అర్పణలు వారు ఎక్కడ వధిస్తారో అక్కడే అపరాధ పరిహారార్థ బలులను కూడా యాజకుడు వధించాలి. అంతట యాజకుడు అపరాధ పరిహారార్థ బలి రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
3 “అపరాధ పరిహారార్థ బలిలోని కొవ్వు అంతటినీ యాజకుడు అర్పించాలి. దాని కొవ్విన తోకను, దాని లోపలి భాగాలమీది కొవ్వును, 4 రెండు మూత్ర గ్రంథులను, వాటిమీది కొవ్వును, నడుందగ్గరి కొవ్వును, కార్జం యొక్క కొవ్విన భాగాన్ని అతడు అర్పించాలి. దానిని మూత్ర గ్రంథులతో బాటు అతడు తీసివేయాలి. 5 వీటన్నింటినీ బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అవి యెహోవాకు హోమంగా అర్పించబడ్డ అర్పణలు అవుతాయి. అది అపరాధ పరిహారార్థబలి.
6 “యాజకుని కుటుంబంలో ఏ పురుషుడైనాసరే అపరాధపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం గనుక దాన్ని ఒక పరిశుద్ధ స్థలంలోనే తినాలి. 7 అపరాధి పరిహారార్థ బలి కూడా పాపపరిహారార్థ బలిలాంటిదే. రెండు అర్పణలకు నియమాలు ఒక్కటే. బలులను చేసే యాజకుడు ఆహారంగా ఆ మాంసం తీసుకొంటాడు. 8 బలి అర్పణ చేసే యాజకుడు దహన బలిపశువు చర్మాన్ని కూడా తీసుకోవచ్చును. 9 ధాన్యార్పణ పెట్టే యాజకునికే ప్రతి ధాన్యార్పణ చెందుతుంది. పొయ్యిమీద వండిన ప్రతి ధాన్యార్పణ, పాత్రలోగాని, పెనంమీదగాని వండిన ప్రతి ధాన్యార్పణ ఆ యాజకునిదే అవుతుంది. 10 ధాన్యార్పణలన్నీ అహరోను కుమారులకే చెందుతాయి. అవి పొడివైనా, లేక నూనెతో కలుపబడినా భేదం ఏమీ లేదు. అహరోను కుమారులు (యాజకులు) అందరూ ఈ ఆహారాన్ని పంచుకోవాలి.
సహవాస బలులు
11 “ఒక వ్యక్తి యెహోవాకు అర్పించాల్సిన సమాధాన బలులను గూర్చిన విధి ఇది. 12 ఆ వ్యక్తి తన కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు సమాధాన బలులు తేవచ్చును. కృతజ్ఞతలు చెల్లించేందుకు అతడు తన బలిని తీసుకొని వచ్చినట్లయితే, నూనెతో కలుపబడిన పులియని రొట్టెలను, నూనె పూసిన పొంగని అప్పడాలు, నూనెకలిపి కాల్చబడిన గోధుమ పిండివంటలు అతడు అర్పించాలి. 13 సమాధాన బలితో బాటు, పులియని రొట్టెలనుగూడ అతడు అర్పణగా తీసుకొనిరావాలి. ఇది ఒకడు తన కృతజ్ఞతను దేవునికి తెలియజేసేందుకు తీసుకొని రావాల్సిన అర్పణను గూర్చిన విధి. 14 సమాధాన బలుల రక్తాన్ని చిలకరించే యాజకునికి ఆ రొట్టెలలో ఒకటి చెందుతుంది. 15 ఈ సమాధాన బలి అర్పించిన రోజునే దాని మాంసం తినివేయాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఒక పద్ధతిగా ఒకడు కానుక అర్పిస్తాడు. కాని దాని మాంసంలో ఏమీ మర్నాటి ఉదయం వరకు మిగిలి ఉండకూడదు.
16 “ఒక వ్యక్తి కేవలం దేవునికి ఒక కానుకగా మాత్రమే సమాధాన బలిని తేవచ్చును. లేక ఒక వ్యక్తి దేవునికి ఒక ప్రత్యేక వాగ్దానం చేసుకొని ఉండొచ్చు. అదే నిజమైతే ఆ బలిని అర్పించిన రోజునే దాన్ని తినివేయాలి. ఒకవేళ ఏమైనా మిగిలితే, మర్నాడు దాన్ని తినివేయాలి. 17 అయితే ఈ బలి పశువు మాంసం మూడోరోజుకు కూడా మిగిలి ఉంటే దానిని నిప్పుమీద కాల్చివేయాలి. 18 సమాధాన బలిలోని మాంసాన్ని ఎవరైనా మూడో రోజున తింటే. ఆ వ్యక్తి విషయంలో యెహోవా సంతోషించడు. ఆ బలిని అతని పక్షంగా యెహోవా లెక్కించడు. ఆ బలి ఆపవిత్రం అవుతుంది. ఆ మాంసంలో ఏదైనా తిన్నవాడు తన పాపానికి తానే బాధ్యుడవుతాడు.
19 “ఏదైనా అపవిత్రమైన దానికి తగిలిన మాంసాన్ని కూడా ప్రజలు తినకూడదు. అలాంటి మాంసాన్ని వారు అగ్నితో కాల్చివేయాలి. పరిశుద్ధమైన ప్రతివ్యక్తి మాంసం తినవచ్చును. 20 కాని అపవిత్రమైనవాడు ఒకడు, యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం తిన్నట్లయితే, అతణ్ణి తన ప్రజల్లోనుండి వేరు చేయాలి.
21 “ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అపవిత్రమైన దాన్ని ముట్టవచ్చు. అది మనుష్యులచేత అపవిత్రం చేయబడిందే కావచ్చు, లేక అపవిత్రమైన జంతువు కావచ్చు, లేక అసహ్యకరమైన అపవిత్రత కావచ్చును. అలాంటివాడు అపవిత్రుడు. యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం అతడు తిన్నట్లయితే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుండి వేరు చేయాలి.”
22 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 23 “ఇశ్రాయేలు ప్రజలతో పశువుల, గొర్రెల, మేకల కొవ్వును మీరు తినకూడదని చెప్పు. 24 వాటంతట అవే చచ్చినా, లేక యితర జంతువుల చేత చంపబడినా వాటి కొవ్వును మీరు వాడుకోవచ్చును. కాని దాన్ని మాత్రం ఎప్పుడూ తినకూడదు. 25 యెహోవాకు హోమంగా అర్పించబడిన జంతువు కొవ్వును ఒక వ్యక్తి తింటే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుంచి వేరు చేయాలి.
26 “మీరు ఎక్కడ నివసించినాసరే జంతువు రక్తంగాని, పక్షిరక్తంగాని ఎప్పుడూ మీరు తినకూడదు. 27 ఎవరైనా సరే ఈ రక్తాన్ని తింటే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుంచి వేరుచేయాలి.”
దైవార్పిత బలుల విధులు
28 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 29 “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ఒక వ్యక్తి సమాధాన బలిని యెహోవాకు తీసుకొని వస్తే ఆ కానుకలో కొంత భాగాన్ని యెహోవాకు ఆ వ్యక్తి ఇవ్వాలి. 30 కానుకలోని ఆ భాగాన్ని హోమంగా కాల్చాలి. ఆ కానుకను అతడు స్వయంగా తన చేతుల్తో తీసుకొని రావాలి. ఆ జంతువు బోరమీదనున్న కొవ్వును, బోరను యాజకుని దగ్గరకు అతడు తీసుకొని రావాలి. ఆ బోర యెహోవా ఎదుట పైకి ఎత్తబడుతుంది. ఇదే ఆ నైవేద్యము. 31 అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కొవ్వును దహించాలి. అయితే ఆ జంతువు బోర అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. 32 సమాధాన బలి పశువు కుడితొడ కూడా మీరు యాజకునికి ఇవ్వాలి. 33 సమాధాన బలి పశువు రక్తాన్ని మరియు కొవ్వును అర్పించే యాజకునికే సమాధాన అర్పణలోని కుడి తొడ చెందుతుంది. 34 నైవేద్యంలోని బోరను, సమాధాన అర్పణలోని కుడి తొడను ఇశ్రాయేలు ప్రజలనుండి నేను తీసుకొని, అహరోనుకు, మరియు అతని కుమారులకు నేను వాటినిస్తున్నాను. ఇది ఇశ్రాయేలు ప్రజలకు శాశ్వతమైన విధి.”
35 యెహోవాకు అగ్నిచేత అర్పించబడు అర్పణల్లో, ఆ భాగాలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతాయి. అహరోను, అతని కుమారులు యెహోవాకు యాజకులుగా పని చేసినప్పుడు బలి అర్పణల్లో వారికి కొంతభాగం లభిస్తుంది. 36 యెహోవా, యాజకులను అభిషేకించినప్పుడే ఈ విషయాన్ని చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు ఆ భాగాలను యాజకులకు ఇవ్వవలెను. వారి తరాలన్నింటిలో శాశ్వతంగా వారు ఆ భాగాలను యాజకులకు ఇవ్వాలి.
37 దహన బలి అర్పణ, నైవేద్యము, పాపపరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, యాజకుల నియామకం, సమాధాన బలి విధులు అవి. 38 సీనాయి పర్వతంమీద మోషేకు యెహోవా వాటిని ఇచ్చాడు. సీనాయి ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు వారి అర్పణలు తీసుకొని రావాలని ఆయన ఆజ్ఞాపించిన రోజునే ఈ విధులను యెహోవా ఇచ్చాడు.
యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన సౌలును గూర్చినది ఈ పాట.
7 యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను.
నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము.
2 నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను.
నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు.
3 యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు.
4 నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు.
నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు.
5 కాని నేను అలా చేసియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము.
నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద త్రొక్కనిమ్ము.
మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము.
6 యెహోవా, లెమ్ము. నీ కోపాన్ని చూపెట్టుము.
నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము.
లేచి న్యాయంకోసం వాదించుము.
7 జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి,
వారి మీద పైనుండి పరిపాలించుము.
8 ప్రజలకు తీర్పు తీర్చుము. యెహోవా, నాకు తీర్పు తీర్చుము.
నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము.
నేను నిర్దోషిని అని రుజువు చేయుము.
9 చెడ్డవాళ్లను శిక్షించి
మంచివాళ్లకు సహాయం చేయుము.
దేవా, నీవు మంచివాడవు,
మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు.
10 నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు.
కనుక దేవుడు నన్ను కాపాడుతాడు.
11 దేవుడు మంచి న్యాయమూర్తి,
మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు.
12 దేవుడు ఒక నిర్ణయం చేస్తే
ఆయన తన మనస్సు మార్చుకోడు.
13 ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది.
14 కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు.
అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు.
15 వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు.
అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు.
16 వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు.
ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు.
అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు.
17 యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను.
మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.
సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.
8 యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
2 పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
నీవు వానిని గమనించటం ఎందుకు?
5 అయితే మానవుడు నీకు ముఖ్యం.
వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
22 ఐశ్వర్యవంతునిగా ఉండుటకంటే గౌరవింపబడటం మేలు. బంగారం, వెండి కంటే మంచి పేరు ఎక్కువ ముఖ్యం.
2 ధనికులు, దరిద్రులు అంతా ఒక్కటే. వాళ్లందరినీ యెహోవాయే సృష్టించాడు.
3 జ్ఞానముగలవారు కష్టం రావటం చూచి దాని దారిలో నుండి తప్పుకొంటారు. కాని తెలివి తక్కువ వాళ్లు తిన్నగా కష్టంలోనికి వెళ్లి, దాని మూలంగా శ్రమపడతారు.
4 యెహోవాను గౌరవించి దీనుడవుగా ఉండు. అప్పుడు నీకు ఐశ్వర్యం, ఘనత నిత్యజీవం ఉంటాయి.
5 దుర్మార్గులు అనేక కష్టాలవల్ల పట్టుబడతారు. అయితే తన ఆత్మ విషయం జాగ్రత్త గలవాడు కష్టాలకు దూరంగా ఉంటాడు.
6 ఒక బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే, జీవిచుటకు సరైన మార్గం నేర్చించు. అప్పుడు ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు కూడ ఆ మార్గంలోనే జీవించటానికి కొనసాగిస్తాడు.
7 పేదవాళ్లు ధనికులకు సేవకులు. అప్పు పుచ్చుకొనేవాడు, అప్పు ఇచ్చేవానికి సేవకుడు.
8 కష్టాలను కలిగించే మనిషి కష్టాల పంటనే కోస్తాడు. ఆ మనిషి ఇతరులకు కలిగించిన కష్టాల మూలంగా చివరికి అతడు నాశనం చేయబడతాడు.
9 ధారాళంగా ఇచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. అతడు తన ఆహారం పేదవారితో పంచుకొంటాడు. గనుక ఆశీర్వదించబడుతాడు.
10 ఒక వ్యక్తి యితరులకంటె తానే మంచివాడిని అని తలిస్తే, వానిని బలవంతంగా వెళ్లగొట్టండి. అతడు వెళ్లి పోయినప్పుడు అతనితోబాటు ఆ కష్టం కూడా వెళ్లిపోతుంది. అంతటితో వివాదాలు అంతరిస్తాయి.
11 పవిత్ర హృదయం, దయగల మాటలను నీవు ప్రేమిస్తే రాజు నీ స్నేహితుడు అవుతాడు.
12 యెహోవాను ఎరిగిన మనుష్యులను ఆయన కాపాడుతూ, భద్రంగా ఉంచుతాడు. కాని ఆయనకు విరోధంగా ఉండే వారిని ఆయన నాశనం చేస్తాడు.
13 “నేను ఇప్పుడు పనికి వెళ్లలేను. బయట సింహం ఉంది. అది నన్ను చంపేస్తుందేమో” అంటాడు సోమరివాడు.
14 వ్యభిచార పాపం ఒక లోతైన గొయ్యిలాంటిది. ఆ గొయ్యిలో పడే మనిషి అంటే యెహోవాకు చాలా కోపం వస్తుంది.
15 పిల్లలు తెలివి తక్కువ పనులు చేస్తారు. కాని నీవు వారిని శిక్షిస్తే, వారు అలాంటి పనులు చేయకుండా ఉండటం నేర్చుకొంటారు.
16 నిన్ను నీవే ధనికుణ్ణి చేసుకొనేందుకుగాను, పేదవాళ్లను బాధించటం, ధనికులకు కానుకలు ఇవ్వటం ఇవి రెండూ నిన్ను దరిద్రునిగా చేస్తాయి.
ముప్పయి జ్ఞాన సూక్తులు
17 నేను చెప్పే మాటలు విను. జ్ఞానులు చెప్పిన మాటలు నేను నీకు నేర్పిస్తాను. ఈ ఉపదేశాల ద్వారా నేర్చుకో. 18 వీటిని నీవు జ్ఞాపకం ఉంచుకోవటం నీకు మంచిది. ఒకవేళ నీ పెదవులు ఒప్పుకొనేందుకు అలవాటు పడితే అది నీకు సహాయంగా ఉంటుంది.
19 ఈ విషయాలు ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. నీవు యెహోవాను సమ్ముకోవాలని నేను కోరుతున్నాను.
20 నీ కోసం నేను ముప్పయి సూక్తులు వ్రాశాను. ఇవి సలహాలు, జ్ఞానముగల మాటలూను. 21 ఈ మాటలు సత్యమైన ముఖ్య విషయాలను నీకు నేర్పిస్తాయి. అప్పుడు నిన్ను పంపినవానికి నీవు మంచి జవాబులు ఇవ్వగలవు.
—1—
22 పేదవారివద్ద నుండి దొంగిలించటం సులభం. కాని అలా చేయవద్దు. న్యాయస్థానంలో పేదవాణ్ణి అణగ తొక్కవద్దు. 23 యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. ఆయన వారిని బలపరుస్తాడు, వారివద్ద నుండి తీసికొన్నవి ఎవరినైనా సరే వారి వస్తువులను ఆయన తీసివేస్తాడు.
—2—
24 త్వరగా కోపపడే వానితో స్నేహంగా ఉండవద్దు. త్వరగా వెర్రి ఎక్కేవానికి దగ్గరగా పోవద్దు. 25 నీవు వెళ్తే, నీవు కూడ అతనిలా ఉండటం నేర్చుకొంటావేమో! అలా అయితే అతనికి ఉన్న చిక్కులే నీకూ ఉంటాయి.
—3—
26 మరో వ్యక్తి అప్పులకు నీదే బాధ్యత అని ప్రమాణం చేయవద్దు. 27 అతని అప్పు నీవు తీర్చలేక పోతే, అప్పుడు నీకు ఉన్నవన్నీ నీవు పోగొట్టుకొంటావు. నీవు పండుకొనే నీ పడకను నీవు ఎందుకు పోగొట్టుకోవాలి?
—4—
28 నీ పూర్వీకులు ఎప్పుడో గుర్తించిన ఆస్తి సరిహద్దు గీతను ఎప్పుడూ జరిపివేయవద్దు.
—5—
29 ఒక వ్యక్తి తన పనిలో నిపుణతగలవాడై ఉంటే. అతడు రాజుల సేవ చేయటానికి అర్హుడవుతాడు. ప్రముఖులుకానివారి వద్ద అతడు పని చేయాల్సిన అవసరం ఉండదు.
1 మన తండ్రియైన దేవునికి, యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటమేమనగా, మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక!
దేవునికి కృతజ్ఞతలు
2 మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉన్నాము. 3 విశ్వాసంవల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న దృఢవిశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రియైన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులము.
4 సోదరులారా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు. 5 ఎందుకంటే, మేము సువార్తను మీకు వట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. 6 మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు.
7 కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది. 8 దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణాలలోనే కాక, ప్రతి చోటా తెలిసింది. దాన్ని గురించి మేమేమీ చెప్పనవసరం లేదు. 9 మీరు మాకెలాంటి స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. 10 పరలోకము నుండి రానున్న దేవుని కుమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.
© 1997 Bible League International