M’Cheyne Bible Reading Plan
ప్రపంచ ప్రారంభం
1 మొట్ట మొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. 2 భూమి మొత్తం శూన్యంగా ఉండెను. భూమిమీద ఏమీ ఉండలేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించి ఉండెను. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను.
మొదటి రోజు-వెలుగు
3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. 4 దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. 5 వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని దేవుడు పేరు పెట్టాడు.
అస్తమయము అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మొదటి రోజు.
రెండవ రోజు-ఆకాశం
6 అప్పుడు దేవుడు, “జలములను రెండు భాగములుగా చేయుటకు అంతరిక్షం[a] ఉండును గాక!” అన్నాడు. 7 కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి, నీళ్లను వేరుపర్చాడు. కొంత నీరు అంతరిక్షం పైగాను, కొంత నీరు అంతరిక్షం క్రిందను ఉంది. 8 దేవుడు ఆ అంతరిక్షానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది రెండవ రోజు.
మూడవ రోజు-పొడి నేల, మొక్కలు
9 అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం క్రింద ఉండే నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది. 10 ఆ పొడి నేలకు “భూమి” అని దేవుడు పేరు పెట్టాడు. మరియు ఒక్క చోట చేరిన నీటికి “సముద్రాలు” అని దేవుడు పేరు పెట్టాడు. ఆయనకు ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. 11 అప్పుడు దేవుడు, “భూమి గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను, ఫలవృక్షాలను మొలిపించును గాక, ఫలవృక్షాలు విత్తనాలుగల పండ్లను పండిస్తాయి. మరియూ ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కలు భూమిమీద పెరుగును గాక” అన్నాడు. అలాగే జరిగింది. 12 గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది. మరియు అది విత్తనాలుగల పండ్ల చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది.
13 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మూడవ రోజు.
నాలుగవ రోజు-సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు
14 అప్పుడు, “ఆకాశంలో జ్యోతులు ఉండును గాక. ఈ జ్యోతులు రాత్రి నుండి పగలును వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల[b] ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగించబడతాయి. మరియు రోజులను సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగించబడతాయి. 15 భూమి మీద వెలుగును ప్రకాశింప చేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి” అని దేవుడు అన్నాడు. అలాగే జరిగింది.
16 కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేశాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేశాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. 17 భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు. 18 పగటిని, రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేశాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది.
19 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది నాలుగవ రోజు.
అయిదవ రోజు-చేపలు, పక్షులు
20 అప్పుడు, “నీళ్లు అనేక ప్రాణులతో నిండి పోవును గాక. మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండును గాక!” అని దేవుడు అన్నాడు. 21 కనుక దేవుడు సముద్రపు పెద్ద జంతువులను చేశాడు. సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేశాడు. సముద్ర జంతువులు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు చేశాడు. ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షిని కూడ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది.
22 ఈ జంతువులను దేవుడు ఆశీర్వదించాడు. అవి అనేక పిల్లల్ని పెట్టి, సముద్రాలు నిండిపోవాలని దేవుడు వాటితో చెప్పాడు.
23 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఐదవ రోజు.
ఆరవ రోజు-భూజంతువులు, మనుష్యులు
24 అప్పుడు దేవుడు, “భూమి అనేక ప్రాణులను చేయును గాక. అనేక రకాల జంతువులు ఉండును గాక. పెద్ద జంతువులు, ప్రాకే అన్ని రకాల పురుగులు, చిన్న జంతువులు ఉండును గాక! మరియు ఈ జంతువులన్నీ యింకా వాటి రకపు జంతువుల్ని ఎక్కువగా వృద్ధి చేయునుగాక” అని దేవుడు అన్నాడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి.
25 కనుక దేవుడు ప్రతి రకపు జంతువును చేశాడు. క్రూర జంతువులను, సాధు జంతువులను, ప్రాకుచుండు చిన్న వాటన్నింటినీ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది.
26 అప్పుడు, “ఇప్పుడు మనం మనిషిని చేద్దాం. మనం మన పోలికతో మనుష్యుల్ని చేద్దాం. మనుష్యులు మనలా ఉంటారు. సముద్రంలోని చేపలన్నింటి మీద, గాలిలోని పక్షులన్నింటి మీద వారు ఏలుబడి చేస్తారు. భూమి మీద పెద్ద జంతువులన్నింటి మీదను, ప్రాకు చిన్న వాటన్నింటిమీదను వారు ఏలుబడి చేస్తారు” అని చెప్పాడు.
27 కనుక దేవుడు తన స్వంత రూపంలో మనుష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా చేశాడు. 28 దేవుడు, వారిని “ఇంకా అనేక మంది ప్రజలు ఉండునట్లు పిల్లలను కనండి. భూమిమీద నిండిపోయి, దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల మీద, గాలిలో పక్షుల మీద ఏలుబడి చేయండి. భూమి మీద సంచరించే ప్రతి ప్రాణిమీద ఏలుబడి చేయండి” అని ఆశీర్వదించాడు.
29 “ఆహార ధాన్యపు మొక్కలన్నింటిని, ఫలవృక్షాలు అన్నింటిని నేను మీకు ఇస్తున్నాను. ఆ చెట్లు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి. ఈ ఆహార ధాన్యం, పండ్లు మీ ఆహారం అవుతుంది. 30 మరియు పచ్చ మొక్కలు అన్నింటిని జంతువులకు నేను ఇస్తున్నాను. ఆ పచ్చ మొక్కలు వాటికి ఆహారం అవుతాయి. భూమిమీద ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, భూమిమీద ప్రాకుచుండు చిన్న ప్రాణులు అన్నీ ఆ ఆహారాన్ని తింటాయి” అని దేవుడు చెప్పాడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి.
31 దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది.
అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఆరవ రోజు.
యేసు వంశావళి
(లూకా 3:23-38)
1 యేసు క్రీస్తు వంశక్రమము: ఈయన దావీదు మరియు అబ్రాహాము వంశానికి చెందినవాడు.
2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు.
ఇస్సాకు కుమారుడు యాకోబు.
యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు.
3 యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. (పెరెసు, జెరహుల తల్లి తామారు.)
పెరెసు కుమారుడు ఎస్రోము.
ఎస్రోము కుమారుడు అరాము.
4 అరాము కుమారుడు అమ్మీనాదాబు.
అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.
నయస్సోను కుమారుడు శల్మా.
5 శల్మా కుమారుడు బోయజు. (బోయజు తల్లి రాహాబు.)
బోయజు కుమారుడు ఓబేదు. (ఓబేదు తల్లి రూతు.)
ఓబేదు కుమారుడు యెష్షయి.
6 యెష్షయి కుమారుడు రాజు దావీదు.
దావీదు కుమారుడు సొలొమోను. (సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య.)
7 సొలొమోను కుమారుడు రెహబాము.
రెహబాము కుమారుడు అబీయా.
అబీయా కుమారుడు ఆసా.
8 ఆసా కుమారుడు యెహోషాపాతు.
యెహోషాపాతు కుమారుడు యెహోరాము.
యెహోరాము కుమారుడు ఉజ్జియా.
9 ఉజ్జియా కుమారుడు యోతాము.
యోతాము కుమారుడు ఆహాజు.
ఆహాజు కుమారుడు హిజ్కియా.
10 హిజ్కియా కుమారుడు మనష్షే.
మనష్షే కుమారుడు ఆమోసు.
ఆమోసు కుమారుడు యోషీయా.
11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు.
12 బబులోను నగరానికి కొనిపోబడిన తరువాతి వంశ క్రమము:
యెకొన్యా కుమారుడు షయల్తీయేలు.
షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
13 జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు.
అబీహూదు కుమారుడు ఎల్యాకీము.
ఎల్యాకీము కుమారుడు అజోరు.
14 అజోరు కుమారుడు సాదోకు.
సాదోకు కుమారుడు ఆకీము.
ఆకీము కుమారుడు ఎలీహూదు.
15 ఎలీహూదు కుమారుడు ఎలియాజరు.
ఎలియాజరు కుమారుడు మత్తాను.
మత్తాను కుమారుడు యాకోబు.
16 యాకోబు కుమారుడు యోసేపు.
యోసేపు భార్య మరియ.
మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు.
17 అంటే అబ్రాహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం పదునాలుగు తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడిన కాలం వరకు పదునాలుగు తరాలు. అలా కొనిపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు పదునాలుగు తరాలు.
యేసు క్రీస్తు జననం
(లూకా 2:1-7)
18 యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు క్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది. 19 కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు.
20 అతడీవిధంగా అనుకొన్న తర్వాత, దేవదూత అతనికి కలలో కనిపించి, “యోసేపూ, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది. కనుక ఆమెను భార్యగా స్వీకరించటానికి భయపడకు. 21 ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాలనుండి రక్షిస్తాడు. కనుక ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు” అని అన్నాడు.
22-23 ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు”(A) ఇది నిజం కావటానికే ఇలా జరిగింది.
24 యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేసాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. 25 కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి “యేసు” అని నామకరణం చేసాడు.
యూదుల చెర విముక్తికి కోరెషు సహాయం
1 పారశీక రాజ్యానికి కోరెషు రాజైన మొదటి సంవత్సరం,[a] యెహోవా కోరెషును ఒక ప్రకటన చేయవలసిందిగా ప్రోత్సహించాడు. కోరెషు ఆ ప్రకటనను వ్రాయించి, తన రాజ్యపు అన్ని ప్రాంతాలలోనూ చదివి వినిపించే ఏర్పాటు చేశాడు. దేవుడు యిర్మీయా నోట పలికించిన యీ సందేశం[b] వాస్తవ రూపం ధరించేందుకు అనువుగా ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన యిలా సాగింది:
2 “పారశీక రాజు కోరెషు తెలియజేసేది ఏమంటే:
పరలోకాధిపతి అయిన యెహోవా దేవుడు భూలోకంలోని దేశాలన్నింటినీ నాకు అప్పగించాడు. యూదా దేశంలోని యెరూషలేములో తనకొక ఆలయాన్ని నిర్మించేందుకుగాను యెహోవా నన్ను ఎంచుకున్నాడు. 3 యెరూషలేములో వున్న ఇశ్రాయేలీయుల దేవుడే ప్రభువైన యెహోవా. మీ మధ్య దేవుని మనుష్యులు ఎవరైనా వున్నట్లయితే, వారిని ఆశీర్వదించ వలసిందిగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. యూదా దేశంలోని యెరూషలేముకు మీరు వాళ్లని పోనివ్వాలి. మీరు వాళ్లని దేవుని ఆలయాన్ని నిర్మించనివ్వాలి 4 ఇశ్రాయేలీయుల్లో మిగిలివున్నవాళ్లు[c] ఎక్కడైనా ఉన్నట్లయితే, వాళ్లకి అక్కడి ప్రజలు తోడ్పడాలి. ప్రజలు ఆ హతశేషులకు వెండిది బంగారాలు, ఆవులు, వగైరాలు ఇవ్వాలి. యెరూషలేములో దేవాలయ నిర్మాణం కోసం వాళ్లకి కానుకలు ఇవ్వాలి.”
5 యూదా, బెన్యామీను వంశాలకు చెందిన కుటుంబాల పెద్దలు యెరూషలేముకు పోయేందుకు సన్నద్ధ మయ్యారు. వాళ్లు యెరూషలోములో దేవాలయ నిర్మాణానికి పోసాగారు. వాళ్లే కాకుండా, దేవుడు ప్రేరేపించిన ప్రతి ఒక్క వ్యక్తి యెరూషలేముకు పోయేందుకు సంసిద్ధుడయ్యాడు. 6 వాళ్ల ఇరుగుపొరుగు వారు వాళ్లకి అనేక కానుకలు సమర్పించారు. వెండి బంగారాలు, ఆవులు, ఖరీదైన ఇతర వస్తువులు ఇచ్చారు. ఇరుగు పొరుగువారు వాళ్లకి ఈ కానుకలన్నీ స్వచ్ఛందంగా ఇచ్చారు. 7 పూర్వం నెబుకద్నెజరు యెరూషలేమునందున్న యెహోవా ఆలయానికి చెందిన కొన్ని వస్తువులు కొల్లగొట్టి, వాటిని తన అబద్ధపు దేవతల ఆలయంలో వుంచాడు. వాటిని ఇప్పుడు కోరెషు మహారాజు బయటికి తీయించాడు. 8 పారశీక రాజైన కోరెషు ఆ వస్తువులను బయటికి తీసుకురమ్మని తన ఖజానాదారుని ఆదేశించాడు. ఆ ఖజానాదారుని పేరు మిత్రిదాతు. మిత్రిదాతు ఆ వస్తువులను బయటికి తీయించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు[d] అప్పగించాడు.
9 మిత్రిదాతు బయటికి తెచ్చిన దేవాలయ వస్తువుల జాబితా యిది: బంగారు గిన్నెలు 30, వెండి గిన్నెలు 1,000, చాకులు, పెనాలు 29, 10 బంగారు పాత్రలు 30, బంగారు పాత్రల వంటివే వెండి పాత్రలు 410, ఇతర పాత్రలు 1,000.
11 వెండి బంగారాలతో చేసిన వస్తువులు కలసి మొత్తం 5,400 వున్నాయి. బబులోను చెరనుండి విడి పింపబడినవారు యెరూషలేముకు తిరిగి వెళ్లేటప్పుడు, షేష్బజ్జరు పై వస్తువులన్నింటినీ తనతో యెరూషలేముకు తీసుకువెళ్లాడు.
యెరూషలేములో సమావేశం
1 ప్రియమైన థెయొఫిలాకు,
నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది, బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడిన రోజు వరకు జరిగినదంతా వ్రాసాను. 2 ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకొన్న అపొస్తలులకు[a] వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు. 3 ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్ళకు నలభై రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. 4 ఆయన వారిని ఒకసారి కలిసికొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: “యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకిదివరకే చెప్పాను. 5 యోహాను నీళ్ళతో బాప్తిస్మమునిచ్చాడు. కాని కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో బాప్తిస్మము పొందుతారు.”
యేసు పరలోకానికి వెళ్ళటం
6 వాళ్ళంతా కలుసుకొన్నప్పుడు, “ప్రభూ! మీరు ఈ సమయాన ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారా?” అని యేసును అడిగారు.
7 ఆయన వాళ్ళతో, “తండ్రి తన అధికారంతో గడియలను, రోజులను నియమించాడు. కాని వాటిని తెలుసుకొనే అవసరం మీకు లేదు. 8 కాని పవిత్రాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోనూ, యూదయ, సమరయ ప్రాంతాలన్నిటిలోనూ, ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యమిస్తారు” అని అన్నాడు.
9 ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనపడకుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది. 10 ఆయన వెళ్తూ ఉంటే వాళ్ళు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నారు. అకస్మాత్తుగా తెల్లని దుస్తులు వేసుకొన్న యిద్దరు వ్యక్తులు వాళ్ళ ప్రక్కన నిలుచొని వాళ్ళతో, 11 “గలిలయ ప్రజలారా! ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిలుచున్నారు? మీనుండి పరలోకానికి తీసుకు వెళ్ళబడిన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు పరలోకానికి వెళ్ళినట్లే మళ్ళీ తిరిగి వస్తాడు” అని అన్నారు.
మత్తీయని ఎన్నుకోవటం
12 ఆ తర్వాత వాళ్ళు ఒలీవల కొండనుండి యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది.[b] 13 వాళ్ళు వచ్చి మేడ మీద తాము నివసిస్తున్న గదిలోకి వెళ్ళారు. అక్కడున్న అపొస్తలులు ఎవరనగా: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, “జెలోతే”[c] అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా.
14 వీళ్ళంతా సమావేశమై ఒకే మనస్సుతో ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, యేసు సోదరులు కూడా వీళ్ళతో ఉండేవాళ్ళు.
15 ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూట ఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు. 16 అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు. 17 యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.”
18 యూదా చేసిన ఈ కుట్రకు అతనికి డబ్బు దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ తర్వాత యూదా తలక్రిందుగా పడిపోయాడు. అతని దేహం చీలిపోయి ప్రేగులు బయటపడ్డాయి. 19 యెరూషలేములోని వాళ్ళంతా దీన్ని గురించి విన్నారు. అందువలన తమ భాషలో ఆ భూమిని అకెల్దమ అని పిలిచేవాళ్ళు. దీని అర్థం “రక్తపు భూమి.”
20 పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:
‘అతని భూమిని పాడు పడనిమ్ము
అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము.’(A)
‘అతని స్థానాన్ని యింకొకడు ఆక్రమించనిమ్ము!’(B)
21 “ఇప్పుడు యింకొకడు మనలో చేరాలి. అతడు వాళ్ళలో, అంటే యేసు మనతో కలిసి జీవించినంత కాలం మనతో కలిసి ఉన్నవాళ్ళలో ఒకడై ఉండాలి. 22 అతడు యేసు ప్రభువు చావునుండి బ్రతికి వచ్చాడన్న దానికి మనతో కలిసి సాక్ష్యం చెప్పాలి. యోహాను బాప్తిస్మము నివ్వటం మొదలు పెట్టినప్పటినుండి యేసును మననుండి పరలోకానికి తీసుకు వెళ్ళిన దినం దాకా మనతో కలిసి జీవించినవాడై ఉండాలి.”
23 వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబ్బా అని పిలువబడే యోసేపు పేరు, ఇతన్నే యూస్తు అని కూడా అంటారు, మత్తీయ పేరు. 24-25 అంతా కలిసి ఈ విధంగా ప్రార్థించారు: “ప్రభూ! నీకు ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను వెళ్ళతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో అపొస్తలత్వాన్ని, ఈ సేవా స్థానాన్ని ఆక్రమించటానికి నీవెన్నుకొన్నవాణ్ణి మాకు చూపించు.” 26 ఆ తర్వాత వాళ్ళు చీటీలు వేసారు. వాళ్ళు తీసిన చీటీలో మత్తీయ పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు.
© 1997 Bible League International